’నగర జ్యోతి’ ఇంద్రకంటి

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. – పుస్తకం.నెట్]

ఇంద్రకంటి సుబ్రమణ్యం అంటే పాతతరానికి సుప్రసిద్ధులు. కలం పట్టకపోయినా సీనియర్ పాత్రికేయులుగా ప్రసిద్ధులు. ఒక గోడ ద్వారానే నెల్లూరీయులకు వార్తలు చేరవేశారు. సామ్రాజ్యవాదుల నిరంకుశపాలనలో దేశం నలిగిపోతున్న రోజులలో, స్వాతంత్ర్యంకోసం ఉద్యమిస్తున్న రోజులలో నగరనడిబొడ్డున నగరజ్యోతి గోడపత్రికచే ప్రజలకు వార్తలు చేరవేసి, ఉద్యమ తీరుతెన్నులు చెబుతూ, సమరంవైపు కార్యోన్ముఖులను చేసిన గాంధేయవాది ఇంద్రకంటి.

1902లో జన్మించిన ఇంద్రకంటి తన 17వ ఏటనే చదువుకు స్వస్తి చెప్పి వెంకటగిరి వెళ్ళి, బ్రిటీషు వ్యతిరేక దేశభక్తి ప్రచారం ప్రారంభించడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేసి రాయవేలూరు సెంట్రల్ జైలుకు పంపారు. జైలునుంచి విడుదలై వచ్చిన నాటి నుంచి మరణించేవరకు ఖద్దరు గుడ్డలు తప్ప మరొక గుడ్డలు ధరించని ఖద్దరువాసి. ఖాదీప్రచారం, రాట్నం వడకడం ఆయనకు నిత్య పారాయణం. 1932 తూములూరి పద్మనాభయ్య స్థాపించిన గోడపత్రికను 1976 వరకు – నాలుగున్నర దశాబ్దాలపాటు తిప్పరాజువారి గోడలమీదుగా నగరజ్యోతిని నడిపారు. తెలుగు,ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం సంపాదించారు. కాస్తోకూస్తో ఉన్న పొలంలో పండే ధాన్యంతోనే ఇంద్రకంటి కుటుంబం భారంగా గడిచేది. పేపరు కొనేందుకు డబ్బు లేకపోయినా ఇబ్బందులు పడుతూనే నడిపేవారు. అర్థరాత్రి రైళ్ళలో వచ్చే పేపర్లు కొనుగోలుచేసి, తెల్లవారేసరికి చదివి తాజావార్తలు గోడపత్రిక ద్వారా ప్రజలకు అందించేవారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కూడా బొమ్మలతోసహా వేసేవారు. ఎలాంటి ఒత్తిళ్ళకు లొంగేవారు కాదు. తాను వాస్తవమని నమ్మిన వార్తలనే ఎక్కించేవారు. ఇంద్రకంటి రాస్తున్న వార్తలన్నీ పూర్తి వాస్తవాలేనన్న నమ్మకం ప్రజల్లో ఉండేది. చాక్పీసులకు డబ్బులు లేకపోయినా విశ్వాసం, దీక్ష, పట్టుదలలే ఆయనను నడిపించాయి. అలా వార్తలు రాస్తున్న సమయంలో బ్రిటీషు పోలీసులు ఇంద్రకంటిని అరెస్టు చేసి జైలుకు పంపారు.

వర్షాలు కురుస్తున్న సమయంలో తప్పించి, మిగిలిన ఏడాది పొడవునా గోడపత్రిక నడిపిన దీక్షాపరులు. 1976 సెప్టెంబర్ 19వ తేదీ మరణించేంత వరకు పత్రికను నడిపారు. నాలుగున్నర దశాబ్దాలపాటు పత్రికను నడపడమేకాక, గోడపత్రిక ద్వారా చరిత్రను సృష్టించి, సింహపురి ప్రజలలో భాగం చేయగలిగిన కార్యదీక్షాపరులు ఇంద్రకంటి లేరు. నగరజ్యోతి లేదు. వార్తాపిపాసిగా వారు అందించిన సేవలు నెల్లూరు చరిత్రపొరల్లో నిక్షిప్తమై ఉన్నాయి.

You Might Also Like

4 Comments

  1. హెచ్చార్కె

    ‘అర్థరాత్రి రైళ్ళలో వచ్చే పేపర్లు కొనుగోలుచేసి, తెల్లవారేసరికి చదివి తాజావార్తలు గోడపత్రిక ద్వారా ప్రజలకు అందించేవారు.’
    ఇంద్రకంటి సుబ్రమణ్యం గారికి మనస్సులో నమస్కరించకుండా ఉండలేం.
    చాల మంచి వ్యాసం. ఈతకోట సుబ్బారావు గారికి, ప్రాముఖ్యం గుర్తించి ప్రచురించిన ‘పుస్తకా’నికి మనసారా అభినందనలు.

  2. Vaidehi Sasidhar

    ఎంత స్ఫూర్తిదాయకమైన విషయం!
    నగర జ్యోతిని అన్ని ఇబ్బందుల మధ్య కూడా నడపటంలోని వారి నిబద్దత,అంకితభావం నిజంగా గౌరవనీయాలు.

  3. సౌమ్య

    Very Interesting!
    ఎంత ఓపికుండాలో అన్నాళ్ళు ఒక గోడపత్రిక నడిపేందుకు. మా స్కూల్లో కూడా చిన్నప్పుడు గోడపత్రికుండేది. మా డ్రాయింగ్ మాస్టారు అప్డేట్ చేసేవారు సాధారణంగా. అది గుర్తొచ్చింది ఎందుకో సడెన్గా.
    ’నగరజ్యోతి’ గురించి మరిన్ని వివరాలెక్కడా లేవా? ఈ ’పెన్నాతీరం’ పుస్తకంలో నాకు నచ్చనిది ఇదే – ఎక్కడా కాస్తంత వివరంగా కూడా రాయలేదు 🙁

  4. kcube

    ఇంద్రకంటి వంటి కార్యాదీక్షాపరులుండబట్టే మనకు ఈ మాత్రం స్వాతంత్ర్యమైనా సిద్ధించింది. వారిలాంటి పట్టుదలలో అర శాతమైనా నేటి మన జర్నలిస్టు, మీడియా సోదరులలో చూడగలమా? ఎవరో కొద్ది మంది తప్ప. ఇంద్రకంటి వారికి జేజేలు..

Leave a Reply