Men of steel

జీవితాన్ని గెలిచిన వ్యక్తుల కథలు ఎప్పుడూ స్పూర్తిదాయకంగానే ఉంటాయి. అవి చదువుతూ ఉంటే మనమేదో మహా గొప్పవారైపోతామని కాదు కానీ జీవితంలో వారు ఎదుర్కున్న కష్టాలు, వాటిని వారు అధిగమించిన విధానం, సమస్యల్ని వారు చూసే దృక్పథం – ఇవన్నీ చూసే కోణంలో చూస్తే ఎవరికన్నా పనికొచ్చే పాఠాలే. సరిగ్గా అలాంటి పరిస్థితే మనకు ఎదురవ్వాలనేమీ లేకపోయినా కూడా,  ఏదన్నా సమస్య వస్తే మన attitude అన్నది ఎలా ఉండాలో అర్థం చేసుకోవచ్చు.

ఇందులో భారతదేశంలోని వ్యాపారవేత్తల profiling చేయబడ్డది. ఈ ఇంటర్వ్యూ/చర్చలు చేసినది హిందుస్థాన్ టైమ్స్ కు చెందిన Vir Sanghvi. ఇందులో భాగం పంచుకున్న వ్యాపారవేత్తలు – రతన్ టాటా, నందన్ నిలేకాని, కుమారమంగళం బిర్లా, సునీల్ మిట్టల్, రాజీవ్ చంద్రశేఖర్, అజీం ప్రేంజీ, సుభాష్ చంద్ర, ఉదయ్ కోటక్, బిక్కీ ఓబెరాయ్, నస్లీ వాడియా మరియు విజయ్ మాల్యా. వీరి జీవితాల్లో ప్రధాన ఘట్టాలు మొదలుకుని వారి వారి వ్యాపారాల్లో వారు ఎదుర్కున్న ఒడిదుడుకులు, వారి నిర్ణయాల వల్ల వారు ఎదుర్కున్న సవాళ్ళూ – స్థూలంగా ఇదీ ఈ వ్యాసాలలోని ప్రతి వ్యాసంలో ఉండే విషయం.

ఇందులో రాజీవ్ చంద్రశేఖర్, సుభాష్ చంద్ర, బిక్కీ ఓబెరాయ్ – వీరి ముగ్గురి కథలూ నాకు అసలు తెలీదు. కనుక ఆ కోణంలో ఇందులో చాలా విషయాలు తెలిసాయి. మిగితా వారిలో ఉదయ్ కోటక్, కు.మం.బిర్లా వంటి యువ వ్యాపారవేత్తలు సంప్రదాయ వ్యాపార కుటుంబాలనుండి వచ్చి కూడా యువతరం ముద్ర తమ తమ రంగాల్లో ఎలా వేశారో, సునీల్ మిట్టల్-రాజీవ్ చంద్రశేఖర్ (బీపీఎల్) కథలు చదివాక భారద్దేశం లో మొబైల్ ఫోన్ల ఎదుగుదల కథనూ, సుభాష్ చంద్ర కథలో టీవీ ఛానెళ్ళ చైన్లలో తొలినాటి విజయాలు సాధించిన జీటెలీఫిల్మ్స్ ప్రస్థానాన్నీ – ఇలా ఎన్నో విషయాల గురించిన కథలు తెలిసాయి.

పట్టినదల్లా బంగారమయ్యే విజయ్ మాల్యా అదృష్టం గురించీ, తమ చేతుల మీదుగా సాఫ్ట్ వేర్ జెయింట్లను నిర్మించిన – ప్రేంజీ, నిలేకాని ల వ్యక్తిత్వాల గురించీ, ఏది చేసినా తన ముద్ర ఉండేలా చేయగల సునీల్ మిట్టల్ గురించీ, యువతలో కుమార మంగళం బిర్లాకు ఉన్న ఫాలోయింగ్ గురించీ, వాడియా గ్రూపు చైర్మన్ నస్లీవాడియా విజయ గాథా – ఇలా ఎన్నెన్నో కథలు ఈ వ్యాసాల్లో. ఇవి పూర్తిగా జీవిత చిత్రాలు అనలేము కానీ, జీవితంలోని ప్రధాన ఘట్టాలకు సంబంధించి ఆయా వ్యాపారవేత్తలతో వీర్ సంఘ్వీ జరిపిన ఇంటర్వ్యూలు. ముందే చెప్పినట్లు ఇందులో ఆయా వ్యాపారవేత్తల attitude తెలుస్తుంది. చదివాక మనం కూడా వారందరినీ “Men of steel” అనక మానము. అందుకే ఈ పుస్తకానికి అ పేరు కూడా అతికినట్లు సరిపోతుంది.

పుస్తకం వివరాలు:
Men of steel: India’s business leaders in candid conversation with Vir Sanghvi
Lotus Collection: Roli Books
Cost: Rs 95/- (ఇదే అన్నింటికంటే బెస్ట్ పార్ట్! ఇంత మంచి పుస్తకం వందరూపాయలలోపే!)
ఈ పుస్తకం మరాఠీ, తమిళ్, హిందీ, గుజరాతీ, కన్నడ భాషలలో కూడా దొరుకుతుంది.

Flipkart లో ఇక్కడ దొరుకుతుంది కానీ, వెల 295/- అని ఉంది. నాకు 95 కి దొరికిన వర్షన్ ఆన్లైన్ షాపింగ్ లో దొరకట్లేదు మరి… 🙁

You Might Also Like

Leave a Reply