పరిశోధనా తృష్ణ – బంగోరె

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. – పుస్తకం.నెట్]

’ఇటీజ్ నాట్ మై షర్ట్ దట్ ఐ క్యాస్ట్ ఆఫ్ టుడే బట్ స్కిన్ విత్ మై ఓపెన్ హ్యాండ్స్’ – అన్న ఖలీల్ జిబ్రాన్ కవిత్వ చరణాలతో ఒక దౌర్భాగ్య పత్రికకు అద్భుతమైన సంపాదకత్వాన్ని నిర్వహించిన బంగోరె తన పాఠకులకు వీడ్కోలు చెప్పుకున్నాడు. బంగోరెగా కీర్తిశేషుడైన బండి గోపాలరెడ్డి (1937-82) నెల్లూరు జిల్లా వాసి అని మనము చెప్పుకుంటే సాహిత్య పరిశోధనరంగమే చిన్నబుచ్చుకుంది. ఎందుకంటే బంగోరె ’రైతులో కూనిరాగాలు’ శీర్షికలో – నెల్లూరు ప్రాంత స్థానికచరిత్ర, సుబ్రమణ్యభారతి చంద్రిక కథ, తెలుగులో జర్నలిజం, తొలకరిజల్లులు, బ్రౌన్ లేఖలు, బ్రౌన్ సేకరించిన తాతాచార్ల కథలు, కన్యాశుల్కం మొదటి ముద్రణ ప్రతి, మాలపల్లిపై నిషేధాలు, వేమన పద్యాల్లో ప్రక్షిప్తాలు, సి ఆర్ రెడ్డి రచనలు – ఎన్నింటినో ఆయన తవ్వి తీశారు. ఆ పత్రిక సంపాదకత్వం అస్థిరమైన తన నలభై ఐదేళ్ళ జీవితంలో బంగోరె చేసిన అసంఖ్యాకమైన ఉద్యోగాల్లో ఒకటి. ఎప్పుడూ కుదురుగా ఒకచోట ఉద్యోగం కూడా చేయని, విరామం లేని ఆయన జీవితంలో ఒక ఏకత్వం లేకుండా పోలేదు. అదే ఆయన పరిశోధనాతృష్ణ. తెలుగుదేశంలో పరిశోధన ప్రస్తుతం నిలిచిపోయింది. ఈ శతాబ్ది మొదటిభాగంలో ప్రతి విషయంలోనూ మౌలికమైన పరిశోధనను, మొదటితరం అగ్రగణ్యులను వదిలేస్తే సుమారు అన్నిరంగాల్లో ప్రస్తుత పరిశోధన ఈస్థితికి చేరువౌతుంది. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రెండు విశ్వవిద్యాలయాలు అయ్యాయి. అకాడమీలు, భాషాసమితులు ఏర్పడ్డాయి. భారతీయ,సామాజిక,శాస్త్ర పరిశోధనా మండలి, భారతీయ చరిత్ర పరిశోధనామండలి, కోర్టు ఫౌండేషన్, రీసర్చ్ గ్రాంట్లు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ పరిశోధనల ఆదరణ పెరిగి, పరిశోధన పేరుతో కోట్ల రూపాయలు నీళ్ళలా పరిగెడుతున్నాయి. ఈవ్యవహారాలు వ్యవహరించేందుకు పెద్ద పాలనా యంత్రాంగం రాక్షసిలా పెరిగి పరిశోధనలపై నిర్ణయాత్మక అధికారాన్ని చెలాయిస్తుంది. ఈ యంత్రాంగంలో ఉన్న అధికారులతో వ్యక్తిగత పరిచయాలు, పైరవీలు చేయగలశక్తి ఉండటమే ఈరోజు పరిశోధకుడికి ఉండవలసిన ప్రాథమిక అర్హత. బంగోరెకు ఈ పరిశోధనావృత్తి చట్రంలో ఇమడగల సమర్థత లేకుండానే మరోవైపు ఆ ప్రాజెక్టులలో పని చేస్తూ ఒక పాజెక్టు నుంచి మరో ప్రాజెక్టుకు మార్చబడుతూ వచ్చిన విరామం ఎరుగని పరిశోధకుడు. పరిశోధన ఒక తీరని దాహంగా ఆయన పడిన శ్రమే విద్యాలయాల్లో జరుగుతున్న పరిశోధనపై ఆయనకు అసహనాన్ని కలుగజేసింది. చరిత్రకారులకు పనికివచ్చే ముడిసరుకును ఆయన ఒక్కడే తవ్వితీసి అందరికీ పంచి ఇచ్చాడు. ఆ మహానుభావుడే -బంగోరె!

You Might Also Like

One Comment

  1. పుస్తకం » Blog Archive » సి.పి.బ్రౌన్ సంతరించిన తాతాచార్ల కథలు

    […] సంకలించి వ్యాఖ్యానం చేసిన బంగోరె (బండి గోపాల రెడ్డి)  ఆధునిక తెలుగు పరిశోధకులలో […]

Leave a Reply