పుస్తకం
All about booksపుస్తకలోకం

May 25, 2010

బ్రిటీషు ప్రభుత్వం నిషేధించిన శృంగారకావ్యాలు

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. – పుస్తకం.నెట్]

1911లో బ్రిటీషు ప్రభుత్వం శృంగారకావ్యాల ప్రచురణపై ఆంక్షలు విధించింది. అందువల్ల – ’చంద్రలేఖావిలాపం’, ’హంసవింశతి’, ’శశాంక విజయము’, ’ఎర్రన కొక్కోకము’ రాతప్రతులుగానే చేతులు మారుతుండేవి. ఉన్నట్లుండి బ్రిటీషు ప్రభుత్వం జిల్లావారైన వావిళ్ల వెంకటేశ్వరశాస్త్రిపై క్రిమినల్ కేసులు పెట్టింది. అశ్లీల సాహిత్యం అచ్చు వేయిస్తున్నారని అభియోగం మోపింది. అసలు శృంగార రసభరితమైన అరేబియన్ నైట్స్ కథలను ఆంగ్లం నుంచి మొదట పురాణం వెంకటకృష్ణశాస్త్రి తెలుగులోకి అనువదించి సరసమైన కథలకు శ్రీకారం చుట్టారు. శృంగారకథలు కాస్త వికటించాయి. శైలి కాస్త ప్రౌఢమైనందున పుష్టలర్ దొర దానిని సరళంగా తీర్చిదిద్దారు. దీనిని కంజీవరం రామశాస్త్రియవనయామినీవినోదం’ పేరుతో వెలువరించారు. అవి ఇప్పటికీ లండన్ ఇండియా కార్యాలయాల్లో ఉన్నాయని ఆరుద్ర కూడా తన గ్రంథాల్లో పేర్కొన్నారు. జిల్లాలోని నాయుడుపేట ప్రాంతానికి చెందిన వారే పురాణం వారు.

కానీ, ఆంధ్ర ప్రబంధాలు, ముఖ్యంగా శ్రీనాథుని పద్యాలు కొన్నింటిలో అసభ్య పదాలున్నాయని బ్రిటీషు ప్రభుత్వం కేసు పెట్టింది. వాత్సాయన కామసూత్రాలను తెలుగుచేసి ప్రచురించిన పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రికి కూడా ప్రాసిక్యూషన్ తప్పలేదు. 1947లో టంగుటూరి ప్రకాశం పదవిలోకి వచ్చినప్పుడు ఆంక్ష తొలగించారు. మళ్ళీ నిషేధించిన గ్రంథాలను పునర్ముద్రించి, గాన సరస్వతి బెంగళూరు నాగరత్నమ్మ పరిష్కరించిన ముద్దుపళని విరచిత రాధికాసాంత్వనము వెలుగుచూసింది. వాత్సాయన కామసూత్రాలను వడ్డాది వీరరాజు తెలుగుటీకతో ముద్రించారు. ఎర్రన కొక్కోకము మాత్రం వెలువడలేదు.About the Author(s)

పుస్తకం.నెట్14 Comments


 1. ఏల్చూరి మురళీధరరావు

  మిత్రులకు,

  1) ముద్దుపళని “రాధికా సాంత్వనము” నిషేధాజ్ఞకు గుఱైన పూర్వాపరచరిత్రంతా మొదట “త్రిలింగ” పత్త్రికలోనూ; ఆ తర్వాత వావిళ్ళ వారు అచ్చువేసిన “రాధికా సాంత్వనము” కావ్యపీఠికలోనూ వివరంగా ఉన్నది, చూడండి. దానిని గుఱించి ఎవరు వ్రాసినా ఆ పీఠికే ఇప్పుడందరికీ ఆధారం.

  2) కూచిమంచి జగ్గకవి “చంద్రరేఖా విలాపము” అచ్చయిన తర్వాత దానిని ఎందుకు నిషేధించాలో, దానిని ఎలా సంస్కరించాలో చెబుతూ 1913లో కాళ్ళకూరి గోపాలరావు గారు (“వరవిక్రయం” నాటకకర్త) తామొక “సుపరిష్కృత చంద్రరేఖా విలాపము”ను – అభ్యంతరకర పదాలున్నచోట్లలో “మంచి” పదాలతో తిరగవ్రాసి – ముద్రించారు. దీనికి గోపాలరావు గారు, గోటేటి కనకరాజు, ఎన్. సుబ్బారావు, పోలవరం జమీందారు కె. ఆర్. వి. కృష్ణారావు గారు, మానవల్లి రామకృష్ణకవి గారు అభిప్రాయాలూ వ్రాశారు. కొండ కోటయ్య పంతులు గారు “కవిజీవితము”ను, తంజానగరం దేవరాజసుధి గారు “కృతిప్రశంస”ను వ్రాశారు.

  “I welcome the emended edition by Mr. Gopaul Rao. He has eliminated the objectionable features from the book and had amended so cleverly that it is hardly possible to distinguish his language from that of the poet …”

  అని – ఆ ప్రయత్నాన్ని శ్రీ గురజాడ అప్పారావు గారు (Mr. G. V. Appa Row Pantulu, B.A., F.M.U) ప్రశంసించారు!

  3) “శృంగారకావ్య గ్రంథమండలి”ని స్థాపించినది మహావిద్వాంసులు శ్రీ గంటి సూర్యనారాయణశాస్త్రి గారు. వీరు పది-పన్నెండు దాకా కావ్యాలను చక్కటి పీఠికలతో సుసంస్కృతంగా, మల్లాది రామకృష్ణశాస్త్రి గారి “ముందుమాట” తో అందంగా ముద్రించారు. ఈ పుస్తకాలకు అనుబంధంగా మఱొక చిన్న “బోనస్” కావ్యం ఉండేది. ఆ తర్వాత దీనిని కె.జి.మూర్తి గారు స్వాధీనపఱచుకొని నిడుదవోలు వేంకటరావు గారి పీఠికలతో “శృంగార సత్యభామా సాంత్వనము” వంటి సత్కావ్యాలను ప్రకటించారు. ఈ ఉద్యమం 1943 దాకా సాగినట్లుంది.

  4) “పుదుచ్చేరిలో ప్రకటింపబడినది” శ్రేణి పుస్తకాలు ఒక నలభై వఱకు ఉంటాయి. వీటిలో “గణపతీయము”, “లంబోదర ప్రహసనము” అన్నవి ప్రహసనాలు. వీరు కూచిరాజు ఎఱ్ఱన “కొక్కోకము”తోపాటు ప్రౌఢదేవరాయల “రతిరత్నప్రదీపిక (సచిత్రం)”, కళ్యాణమల్లుని “అనంగరంగము”, హరిభట్టు “రతిరహస్యము” తెలుగు తాత్పర్యాలతో దేశంలోనే తొలిసారి ముద్రించిన ప్రచురణకర్తలు. వీరి యత్నాలను పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి గారు, మానవల్లి రామకృష్ణకవి గారు ప్రోత్సహించి, తామూ అటువంటి కృతులను ప్రకాశింపజేశారు.

  5) “బ్రహ్మానందము” లోని గోపీనాథం వేంకటకవి గారి “బ్రహ్మానంద శతకము” సంస్కృత “గీతగోవిందం” వంటి శృంగార-వేదాంత రచన. మాడభూషి వెంకటాచార్యులవారి “రామావధూటి తారావళి” అద్భుతమైన మధుర శృంగార రచన. ఇవి “vulgar” శ్రేణిరచనలు కావు.

  6) “శష్పవిజయము” కర్త శ్రీ శ్రీనివాస్ పరుచూరి గారన్నట్లు తెనాలి రామకృష్ణుడు కాదు; తెనాలి రామలింగకవి. విశ్వబ్రాహ్మణులు. ఇది రెండు పర్యాయాలు అచ్చయింది. వీరి మఱొక కావ్యం “ధీరజనమనోవిరాజితము”ను కపిలవాయి లింగమూర్తి గారు ముద్రించారు, చూడండి.

  7) సెట్టి లక్ష్మీనరసింహకవి గారివి అన్నీ ఒక సంపుటంగా ఉన్నాయి. శ్రీనివాస్ గారు పేర్కొన్న శ్రీనాథునిదని చెప్పబడిన “రసికాభిలాషము” శృంగార కావ్యం నిజానికి సెట్టి లక్ష్మీనరసింహకవి గారిదే. అదే విధంగా ఆయన కృష్ణదేవరాయలు కూతురు “మోహనాంగి” పేరిట “మారీచీ పరిణయము” శృంగార కావ్యమును తానే వ్రాసి, ఆమె పేరిట ప్రకటించారు.

  8 ) మీరు కేవలం పద్యరచనలను మాత్రమే చూస్తున్నట్లున్నది. అవి మొత్తం వివిధ ప్రక్రియలలో ముద్రితాముద్రితాలు ఒక వందకు పైబడే ఉంటాయి. ఆ రోజుల్లో (1900కి పూర్వం) “సరస గ్రాంథికము”లో అచ్చయిన (అశ్లీల)గద్యకృతులు కనీసం రెండు వందల పైచిలుకు; పాటల పుస్తకాలు, శతకాలు (ఆధునిక అముద్రితాలు), చాటువులు కలిసి వందలకు పైమాటే అనుకొంటాను.

  ఇప్పటికే ఉత్తరం పెద్దదయింది!

  సర్వ శుభాకాంక్షలతో,
  ఏల్చూరి మురళీధరరావు


 2. Sreenivas Paruchuri

  మూర్తి గారు:
  1. ఒక పదేళ్ళ క్రితం ఇక్కడ కొన్ని పుస్తకాల పట్టీ ఇచ్చాను. చూడగలరు.
  http://dir.groups.yahoo.com/group/racchabanda/message/7528
  1A. పైన పట్టికలో ప్రస్తావించబడని మరియు *నిషేధింపడిన* మరికొన్ని పుస్తకాలు: బిల్హణీయం, వైజయంతీ విలాసము, చౌడప్ప శతకము, వేణుగోపాల శతకము. నిజానికి పుదుచ్చేరి (కామ గ్రంథమాల), మచిలీపట్నం (శృంగార గ్రంథమాల), రాజమండ్రిలనుండి వెలువడ్డ పుస్తకాల జాబితా చాలా పెద్దది.
  2. ఈ క్రింది రాతలో తెలుగులో పుస్తక నిషేధాలపైన మరికొంత సమాచారముంది.
  http://www.eemaata.com/em/issues/201103/1698.html
  3. జగ్గకవి రాసిన గ్రంధం పేరు చంద్రలేఖా విలాపమే ఈ గ్రంథం ఈమాట గ్రంథాలయంలో లభిస్తుంది.
  http://www.eemaata.com/em/category/library/candralekha-vilapamu/ ఈ గ్రంథంపై ఇంకా ప్రచురింపబడని ప్రాచీన వ్యాఖ్యానం కూడా వుంది. వెలిదండ నిత్యానందరావుగారి సిద్ధాంత గ్రంథం “తెలుగు సాహిత్యంలో పేరడీ”లో కొంత చర్చ చూదవచ్చు.
  4. భారతాన్ని రచించిన ఎఱ్ఱనకు కొక్కోకము (లేక కళాశాస్త్రము) రచయితగా చెప్పబడే ఎఱ్ఱనకు యెలాంటి సంబంధం లేదు.
  4A. “ప్రాచీన” కవులపేర్లతోనో, మారుపేర్లతోనో 19వ శతాబ్దం చివరిలో, 20 శతాబ్దం తొలి దశాబ్దాలలోను
  “శృంగార” సాహిత్యం చాలా రాయబడింది.

  అచ్చు యంత్రం వచ్చిన తొలినాళ్ళలో మంచి గ్రంథాలు, సాహిత్యం వెలువడేదని, జనులు చక్కటి సంప్రదాయ సాహిత్యం చదివేవారని చాలామందికి ఒక బలమయిన అభిప్రాయం వుంది. అప్పుడు (ఇప్పుడు కూడా ?) కూడా ఎక్కువ అమ్ముడు పోయీనది NVగోపాల్, బాలసరస్వతి, కొండపల్లి వీరవెంకయ్య లాంటి ప్రచురణకర్తలు ముద్రించిన గుజిలీ ప్రతులు, లేకుంటే అనామక ప్రచురణకర్తలు వేసిన”శృంగార” సాహిత్యం or pronographic pamphlets.

  Regards, — Sreenivas


  • Thanks Srinivas garu.

   1 . జగ్గకవి రాసిన గ్రంధం చంద్ర రేఖా విలాపము. “లేఖా” కాదు అనే అనుకుంటాను. మీరు పంపిన లింక్ లో కూడా అదే వుంది. I think its typo error in your comment also .

   2 . ఎర్రన విషయం లో clarifications కి కూడా thanks . అంతటి భారతము రాసిన ఎర్రన ఇది రాయలేదు అని తెలుసుకుని మనసు కొంచెం కుదుట పడింది. తర్వాత మళ్ళీ చూస్తే తెలిసింది. కొక్కోకము రాసిన ఎర్రన ” మాచన పుత్రుడను” అని గ్రంధాంతంలో రాసుకున్నాడు. భారతము రాసిన ఎర్రన ఇంటి పేరు తెలీదు కానీ, మాచన అని ఎక్కడా రాసుకోలేదు


 3. […] నిషేదానికి గురయింది (కొంచెం వివరం ఇక్కడ). ఈ పుస్తకాన్ని గురించి బెంగళూరు […]


 4. కొన్నింటి గురించి నేను చెప్పగలను కానీ, చెప్తానని హామీ ఇవ్వలేను.ప్రయత్నిస్తాను.


 5. Sreenivas Paruchuri

  Banned books in Telugu:
  http://dir.groups.yahoo.com/group/racchabanda/message/7528

  More as and when I find time :).

  Regards,
  Sreenivas


 6. kvrn

  ‘పెన్నా తీరం’- మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు


 7. సౌమ్య

  “రాతప్రతులుగానే చేతులు మారుతుండేవి. ” -:O!!
  ఈపేర్లన్నీ కొత్తకొత్తగా ఉన్నాయి వినడానికి.
  ఎవరన్నా విజ్ఞులు – ఈ పుస్తకాల, వ్యక్తులను పరిచయం చేయగలరా – ఇక్కడే?


  • “రాతప్రతులుగానే చేతులు మారుతుండేవి. ” అని పేర్కొన్నా, ఆ తర్వాత నిషేధం తీసేసేక మళ్ళీ ప్రచురించేరు అనుకుంటాను. కొన్ని సాఫ్ట్ కాపీలు ఇప్పటికీ దొరుకుతున్నాయి.

   ఇవన్నీ ఇలా వుండగా, తిరుపతి వెంకట కవులు తమ శ్రవణానందము (1938 ) ముందుమాటలో ఇలా రాసుకున్నారు -” సుమారు 25 సంవత్సరాల ముంది అంటే 1913 ప్రాంతంలో బ్రిటీష్ వారిచే శృంగార గ్రంధ నిషేధం, తీసుకురాబడింది. ఇతర భాషలలో ఇంకా విశేషమైన శృంగారము వున్నా కొందరు తెలుగు వారే ఈ నిషేదానికీ తెలుగులో చాలా పుస్తకాలు మరుగున పడి పోదానికీ కారణము అనీ, ఇన్నాళ్ళకి కాంగ్రెస్ వారి ధర్మమా అని ఈ పుస్తకము వెలుగు చూసిందనీ …..!”

   ఇందులో ఏమీ పచ్చి శృంగారము లేదు ఇదొక సందేశ గ్రంధం అని వారి భావన. కాదు, కాదు ఇది పెడదారి పట్టించేలా ఉందనీ, వ్యాకరణం మాత్రమే కాక ఇంకా అనేకానేక తప్పులున్నాయని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు దీన్కి + పాణిగ్రహీత గ్రంధాలకి కలిపి “శృంఖాలా ” అనే విమర్శా వ్రాయడం, ఆ పైని తి. వేం. కవులు మళ్ళీ “శృంఖాలా త్రుణీకరణము ” రాయడము ప్రసిద్ధాలే.

   కొక్కోకము అలాగే ఇతర పేర్కొన్న గ్రంథాలు చాలా వరకు “కామగ్రంధమాల” అన్న సిరీస్ లో వచ్చేయి. వివరాలు ఇలా వున్నాయి

   1 .చంద్రలేఖా విలాపము కాదు. “చంద్రు రేఖా విలాపము” అనుకుంటాను. తిమ్మకవి తమ్ముడు జగ్గకవి రాసిన గ్రంధం ఇది. విద్యాబుద్ధులు లేక తిరుగుతున్నా జగ్గడు వివానంతరం జరిగిన ఒక పరాభవంతో మేల్కొని కవియై విజ్రుంభించి విద్య నేర్చుకుని అనేక గ్రంధాలు రాసేడు. నీతి బోధకమైన ఈ హాస్య రస గ్రంధంలో శృతి మించిన మాటల ప్రయోగం కారణంగా నిషేధింపబడింది .

   2 . అయ్యలరాజు నారాయణామాత్యుడు రాసిన హంస వింశతి ఒక పద్య కావ్యము. తన భర్త దేసాన్తరమునకు పోయినప్పుడు ఇందులో కధానాయిక హేమావతి దారి చెడకుండా ఉండేలా ఆమె ఇంటనున్న హంస రోజుకో కదా చెబుతూ ఆమె బుద్ధి మరల్చి మంచిగా వుంచడం అనేది దీని కధాంశం. హంస ఇరవై (వింశతి ) రోజులు చెప్పడం వల్ల గ్రంధ నామం వచ్చేయి. ఇది ఈయన ప్రధమ గ్రంధం గా చెప్తారు.

   3 . కొక్కోకము-కళా శాస్త్రము అని పేర్కొనబడ్డ” రతి రహస్యము” అనే మూడు ఆశ్వాసాలున్న గ్రంధాన్ని కొక్కోకుడు , ఎఱ్ఱన రాసేరు. ఇందులో వాత్సాయన కామసూత్రాలు మరియు ఇతర గ్రంధాలు ఇంకా మునీశ్వరుల వాక్యముల నుండి రాయబడినట్లు వారే చెప్పుకున్నారు. మనం తరచూ వినే పద్మినీ, చిత్రిణీ మొదలగు అష్టవిధ స్త్రీ జాతుల గురించీ, వారి కళా స్థానాల గురించీ, వృషభాది పురుష జాతుల గురించీ మొదలైన + చెప్పటానికి కష్టమైన విషయాలన్నీ ఇందులో వుంటాయి.

   అయితే నాకు ఎప్పటినుంచో ఒక సందేహము – భారతాన్ని రచించిన కవిత్రయం లోని ఎర్రన , ఈ ఎర్రన ఒకరేనా ? అని !

   4 .శేషము వేంకటపతి రాసిన “శశాంక విజయము” – ఒక రాజు తన పేర శశాంక విజయమని రాయమని కోరగా రాసిన ఇది శృంగార భరితముగా చెప్పబడిన చంద్రుడు – తారల కధ.

   విజ్ఞులు మరిన్ని వివరాలు ఇవ్వగలరు.


 8. ఎన్ వేణుగోపాల్

  మిత్రులకు,

  ఇది ఈ వ్యాసభాగం గురించి కాదు. పెన్నాతీరం మన సాంఘిక చరిత్రకు చాల అవసరమయిన, నాకు నచ్చిన పుస్తకం.

  కాని ఈ శీర్షిక చూసిన తర్వాత పరాయి భాషా పదాలను వాడడంలో మనం సాధారణంగా చేసే తప్పుల గురించి మిత్రులతో ఒకటి రెండు విషయాలు పంచుకోవాలనిపించింది.

  చిన్నప్పటినుంచీ నేను కూడ మీ అందరిలాగే పాఠ్యపుస్తకాలలోనూ, సాధారణ పుస్తకాలలోనూ “బ్రిటీషు” “ఇంగ్లీషు” అని చదువుకున్నవాణ్నే. కాని కొన్ని సంవత్సరాల కింద మధ్య అక్షరం దీర్ఘంగా ఉచ్చరించాలా, హ్రస్వంగా ఉచ్చరించాలా అని అనుమానం వచ్చి ఎన్ని నిఘంటువులు చూసినా (ఫొనెటిక్స్ లో) అది హ్రస్వ ఉచ్చారణే ఉంది తప్ప దీర్ఘ ఉచ్చారణ లేదు. చివరికి ఇప్పుడు అంతర్జాల నిఘంటువుల సహాయంతో ఉచ్చారణ విన్నా అది హ్రస్వమే తప్ప దీర్ఘం కాదు. సరే, వాళ్లు పాటించే ఉదాత్త, అనుదాత్త (? క్షమించాలి, నొక్కి పలికే, నొక్కులేని అనడానికి ఇలా అనవచ్చునా?)ఉచ్చారణ సంప్రదాయం మన స్వరపేటికకు సరిపోతుందో లేదో కూడ నాకు తెలియదు. కాని హ్రస్వం, దీర్ఘం అయితే ఉమ్మడిగా ఉన్నవే.

  మరి ఈ దీర్ఘ ఉచ్చారణ సంప్రదాయం ఎప్పుడు మొదలయినట్టు? ఎందుకు మొదలయినట్టు? ఎవరయినా కాస్త వెలుగు ప్రసరించగలరా?

  మీ
  ఎన్ వేణుగోపాల్


 9. శృంగారానికి, అసభ్యానికి తేడా ఉంది. ఇవి ఏ రకంగా అసభ్యమో తెలియదు.నిషేధింపబడని క్రీడాభిరామంలో కూడా శృంగారం పాలు తక్కువగా ఏం లేదు.


  • Sreenivas Paruchuri

   > నిషేధింపబడని క్రీడాభిరామంలో కూడా శృంగారం పాలు తక్కువగా ఏం లేదు.

   రవి: ఈ పుస్తకం కూడా నిషేధింపబడింది. క్రీడాభిరామానికున్న మరొక పేరు: వీధినాటకం. నిషేధింపబడిన పుస్తకాల జాబితాలలో ఈ పేరుకింద కనిపిస్తుంది. చూడండి.


 10. శశాంక విజయము,రాధికా స్వాంతనము ఎంతో మంచి గ్రంథాలు.వాటిని నిషేధించటం తెలివితక్కువ పని అని నాకనిపిస్తుంది.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

తెలుగు మణిహారం – ఆముద్రిత గ్రంథ చింతామణి

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తక...
by పుస్తకం.నెట్
7

 
 

27తరాల వెంకటగిరి రాజుల చరిత్ర

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తక...
by పుస్తకం.నెట్
0

 
 
booklover-badge

నడిచే విజ్ఞానసర్వస్వం ఎన్నెస్కే

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తక...
by పుస్తకం.నెట్
0

 

 

దువ్వూరు శతకాన్ని నిషేధించిన ఆంగ్లేయులు

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తక...
by పుస్తకం.నెట్
0

 
 

పెన్నాతీరం – ఈతకోట సుబ్బారావు

ఈపుస్తకం కొన్నాళ్ళ క్రితం ’ఆంధ్రజ్యోతి’ లో వారంవారం ఇదేపేరుతో వచ్చిన వ్యాసాల సంకల...
by సౌమ్య
3

 
 

నూరేళ్ళుగా ఉత్సవాలు – కవిత్రయ జయంతులు

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తక...
by పుస్తకం.నెట్
1