I Will Survive – Comeback stories of a corporate warrior

రాసిన వారు: Halley
************
“ఐ విల్ సర్వైవ్ – కంబ్యాక్ స్టోరీస్ ఆఫ్ ఎ కార్పరేట్ వారియర్” – సునీల్ రాబర్ట్
పుస్తకం దొరుకు చోటు – Crossword bookstores
వెల : 200/-

ఈ పుస్తకం గురించి మొదట రీడిఫ్ డాట్ కామ్ లో అనుకుంటా చదివింది . ఇది వ్యక్తిత్వ వికాసం పుస్తకం ఏమో అని నాకు ముందు భయం వేసింది , ఆ తరహా పుస్తకాలు ఎందుకనో నాకు ఎప్పుడూ నచ్చింది లేదు . ఆయినా కూడా ఎందుకనో ఆ కవర్ పేజీలో ఆ మనిషి నవ్వులో ఒక నిజాయితీ కనపడింది . ఇది తక్కిన పుస్తకాలలా కాదు అని అనిపించింది. పుస్తకం చదివాక ఒక మంచి పుస్తకం చదివాను అన్న ఆనందం కలిగింది.

మనకి ఎన్నో జీవిత చరిత్రలు కనపడుతూ ఉంటాయి , ఐతే అందరూ ఏదో టాటాలో నారాయణమూర్తులో .. లేదా గాంధీ నెహ్రూ వంటివారు ఉంటారు. ఈ పుస్తకం అటువంటిది కాదు. ఇది ఎన్నో కష్టాలను అధిగమించి కార్పొరేట్ రంగంలో నిలదొక్కుకున్న ఒక వ్యక్తి గురించి. ఇతని విజయం .. అతను సాధించిన ఆ ఉద్యోగంలో లేదు .. ఆ ఉద్యోగానికి చేరుకోటంలో అతనికి యెదురైన సవాళ్ళు . వాటిని అతను ఎదుర్కొన్న తీరులో ఉంది. ఇది ఒక సామాన్యుని విజయగాథ. అంటే నారాయణమూర్తి సామాన్యుడు కాడా అంటారేమో … నాకు తెలిసినంత వరకు ఆయన పుస్తకాలు రాయటం మొదలు పెట్టింది తన కంపెనీ తారా స్థాయికి చేరుకున్నాకే . అందుకు భిన్నంగా ఈ పుస్తక రచయిత సునీల్ రాబర్ట్ కార్ఫోరేట్లో ఉన్నత స్థాయికి చేరుకున్న ఎందరో ఉద్యోగుల్లో ఒకరు అంతే. కాని ఇతని నేపథ్యం భిన్నం , ఈ పుస్తకం రక్తి కట్టటానికి అదే ప్రధాన కారణం.

రచయిత హైదరాబాదులోని రామనగర్ ప్రాంతంలోని దిగువ మధ్య తరగతి కుటుంబంలో గడిపిన తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ప్రారంభిస్తారు ఈ పుస్తకాన్ని. ఇందులో వీధిలో తిరిగే రౌడీ మూకలు , స్కూలు టీచర్ల ఫిర్యాదులు , బెట్ మ్యాచ్ లు , రేడియో క్రికెట్ కామెంటరీలు , గల్లీ క్ర్రికెట్టు సరదాలతో సహా అన్నీ గుర్తుతెచ్చుకోటం నాకు నచ్చింది.

తన తండ్రి ఉద్యోగం పోవటంతో రచయిత జీవితంలో కష్టాలు ప్రారంభం అవుతాయి. అప్పటిదాకా తమ కాలనీలో ఓ మోస్తరు ఉన్నవాళ్ళుగా బ్రతికిన వాళ్ళు , ఇప్పుడు స్కూలు ఫీజులు కట్టటానికి కూడా కష్టాలు పడాల్సి వస్తుంది . దీనికి తోడు తండ్రి తన ఉద్యోగం పోయిన అవమానభారం వల్లనో మరేమో తెలియదుకానీ వేరే ఏ ఉద్యోగానికి ప్రయత్నించకుండా భాధ్యతారహిత్యంగా తయారవటంతో కుటుంబ భారం రచయిత తల్లి పైన పడుతుంది. ఇంటి అద్దె కట్టక పోవటంతో యజమాని తలుపులు తాళం వేసి వీధులపాలు చేసేదాక వెళ్తాయి పరిస్ఠితులు. కొన్నిసార్లు డబ్బు కోసం రచయిత తెల్సిన వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎదురయ్యిన ఛీత్కారాలు అవమానాల గురించి కూడా వర్ణిస్తారు రచయిత. ఈ కష్టాలన్నిటి మధ్యన రచయిత ఏడవ తరగతి పరీక్షలూ , పదవ తరగతి పరీక్షలూ రాసిన తీరు చదివితే ఆయన పట్టుదలకి సలామ్ కొట్టాలి అనిపిస్తుంది. బట్టలు చినిగిపోతే పేదరికం వలన కొత్తవి కొనుక్కోలేక ఆ చినుగుపైన గుడ్డముక్కలతో ఆల్టరేషన్ చేయించుకోనేవాడని రచయితని క్లాసులో కుర్రవాళ్ళు “ఆల్టర్” అని పేరు పేట్టి గేలి చేయటం గురించి ఆయన చెప్పినప్పుడు బాధవేయకమానదు. ఇదంతా జరుగుతూ ఉండగా తన తండ్రి ఉద్యోగం చేయని కారణంగా క్రమంగా ఆయన మీద పెంచుకున్న ద్వేషం గురించి కూడా ప్రస్తావిస్తారు రచయిత. ఇదిలా ఉండగానే పోకిరీ మూకలతో తన సావాసాలు ఎలామొదలైనదో చెప్తూ వారు చేసిన చిన్న చిన్న దొంగతనాలు , ఆకతాయి పనులు వగైరా కూడా కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు.

ఎస్.ఎస్.సి తర్వాత పాలిటేక్నిక్ కాలేజీలో చేరి విద్యార్థి రాజకీయాలు, ఆ గొడవల్లో తలదూర్చిన వైనం వగైరాలతో రచయిత కథ ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగానే రచయితకు పాతబస్తీ రౌడీషీటర్లతో తిరిగే యువకులు వగైరాలతో పరిచయం ఏర్పడి ఒక 7-8 మందితో ఒక గ్యాంగు ఏర్పాటు చేసుకొనే దాకా వెళ్తుంది. అమ్మాయిలని ఆట పట్టించటం ఆ కారణాన పోలీసుస్టేషనుకు పోవటం వంటి సంఘటనలతో రచయిత తన పాలిటెక్నిక్ కాలేజీ గడిపిన రోజులు గుర్తుచేసుకుంటారు. ఇలాంటి సంఘటనల మధ్యన తను Youth for christ(YFC) అను సంస్థతో మరియు YMCA తో అనుబంధం పెంచుకోటం , వాటి పరిచయం వలన మెల్లగా తన జీవితం గాడిలో పడటం గురించి చెప్తారు రచయిత. ఇవికాక ఈ క్రమంలో తన చెల్లెలికి హైదరాబాదు సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో సీటు దక్కించుకోవటానికి పడ్డ తంటాలు వంటి సంఘటనలు మనల్ని ఈ పుస్తకానికి అట్టే కట్టిపడేస్తాయి.

అలా YFC అనుబంధంతో రచయిత సికంద్రాబాదు వెస్లీ కళాశాలలో ఏదో పోటిలో మాట్లాడటం దాని ద్వారా కలకత్తా యూత్ ఫెస్టివల్ కు వెళ్ళటం జరుతుతుంది. ఇలా పరిచయాలు పెంచుకుంటూ Young Orator’s Club వంటి వారితో కలుస్తూ రచయిత మెల్లగా తన కెరీరు నిర్మించుకున్న విధానంచూస్తే ఔరా అనిపించక మానదు. తర్వాత తన ఉద్యోగ జీవితం ప్రారంభమైన వైనం చెప్తూ యురేకా ఫోర్బ్స్ లో ఆక్వాగార్డ్ అమ్మటం, దాని తర్వాత మరొక కంపెనీలో సేల్స్ విభాగంలో చేరి ఆ పని చేస్తూనే బీ.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో బీ.ఏ పూర్తి చేసుకొనటం గురించి చెప్తారు రచయిత. ఉద్యోగం చేస్తూనే ఉస్మానియా లో ఎం.బీ.ఎ చేసి .. అది కాక రేడియో జాకీగా అజారుద్దీన్ , జాంటి రోడ్స్, వినోద్ కాంబ్లీ వంటి ప్రముఖ క్రికెటర్లతోనే కాక ఆర్కే లక్ష్మణ్ వంటి హేమాహేమీలతో ఇంటర్వ్యూలు చేసిన తన అనుభవాలు పంచుకుంటారు రచయిత. ఆటు తర్వాత వివిధ యాడ్ ఏజెన్సీ లలో పని చేయటం , రోటరీ ఇంటర్నేషనల్ పుణ్యమా అని ఇటలీ దేశ యాత్ర , జర్నలిజం చదువు అందులో గోల్డ్ మెడల్ పొందిన వైనం .. హిందూ , ఎకనామిక్ టైమ్స్ , దక్కన్ క్రానికల్ వంటి పత్రికలలో వ్యాసాలు , ఎన్సైక్లోపీడియా బ్రిట్టనికాలో రాసే స్థాయికి ఎదిగిన కథా చెప్తారు . ఇంతే కాక “సహాయ” అనే ఎన్జీఓతో తన అనుబంధం , 1991లో హైదరాబాదులో రాక్ కాన్సెర్ట్ నిర్వహించిన వైనం , చివరి అధ్యాయాలలో Acer , i-flex , SQL star ,TCS వంటి కంపెనీలతో NASSCOM వంటి సంస్థలతో తన అనుబంధం గురించి వివరించారు రచయిత.

ఎన్నో కష్టాలని అధిగమించి ఆల్రౌండర్ అని అనిపించుకున్న సునీల్ రాబర్ట్ రచించిన ఈ పుస్తకం తప్పక చదవాల్సిందే.

You Might Also Like

Leave a Reply