May I hebb your attention pliss – Arnab Ray

రాసిన వారు: Halley
************
ఈ పుస్తకం కవర్ చూడగానే అర్ఠం అయిపోతుంది మీకు ఇది సరదా పుస్తకం అని. తెలుగు పాఠకులకి అర్ఠం అయ్యేలాగా చెప్పాలంటే యెర్రంశెట్టిశాయి హ్యూమరాలజీ లాంటి పుస్తకం. రచయిత అర్నబ్ రే నవతరం సెలెబ్రిటీలలో ఒకరు . గ్రేట్ బోంగ్. నెట్ అన్న బ్లాగు ద్వారా లక్షలకొద్దీ అభిమానులని పొందిన వ్యక్తి.

1990లు- 2010లలో జరిగిన ఎన్నో విషయాల పైన రచయిత వ్యంగ్య బాణాల సంకలనమే ఈ పుస్తకం. మొదటి పేజీ నుంచి చివరిదాకా చదువరులని నవ్వించాలనే ప్రయత్నించారు రచయిత. పుర్తిగా కాకపోయినా అక్కడక్కడా అప్పుడప్పుడూ జోకులు బాగానే పేలాయి. పుస్తకం మొదలవటమే “మీకు బట్టతలా? అయితే మా తైలం వాడండి నిగనిగలాడే జుట్టు పొందండి” అని మనం రోజూ టీ.వీ లలో చూసే యాడ్స్ కు మల్లే మొదలు అవుతుంది ..”ఈ పుస్తకం చదవండి” అన్న మూడు ప్రకటనలతో.

మొదటి అధ్యాయంలోనే తీవ్రవాదం గురించి మన ప్రభుత్వాలు ప్రజల స్పందనలు ఎలా ఉంటాయో ఒక మూడు పేజీలలో తేల్చి చెప్పిన తీరు నవ్వు తెప్పించింది.రెండవ అధ్యాయంలో మోరల్ పోలీసుగాళ్ళ మీద వ్యంగ్యాస్త్రం. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అందమైన అమ్మాయిల కోసం వెతుక్కునే ఒక వ్యక్తి “పవిత్ర వాహిని” అనే మతతత్వ పార్తీ కార్యకర్తకు చిక్కిన వైనం గురించి ఉంటుంది ఇందులో. నో వేర్ రెసిడెంట్ ఇండియన్స్ అని NRIల గురించి ఒక ఛాప్టరు. ఇందులో “పిరమిడ్ స్కీము అంకుల్” అని రాసిన భాగం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ .. 1990ల చివరిలో 2000ల మొదటన ఇలాంటి వారు ప్రతీ కాలనీలోనూ కనపడేవారు. “దేశీ ఆంటీ” “కల్చరల్ ఆంటీ” “మా-ఆమ్మాయిని-పెళ్ళి-చేసుకుంటారా ఆంటీ” ..ఇలా రకరకాలుగా NRIల గురించి వారి తాలూకా బంధువుల గురించి రాశారు.

దీని తరువాతి రెండు అధ్యాయాలు (సొషియో కల్చరల్ స్టడీ ఆఫ్ సెక్సువల్ ఫ్రస్ట్రేషన్ ఇన్ ఇండియా) బహుశా ఈయన రాసినట్టుగా వేరే ఎవరూ రాయరేమో .. ఇండియన్ ఇంగ్లీషులో కుశ్వంత్ సింగ్ .. తెలుగులో కార్టునిస్టు మల్లిక్ .. అక్కడక్కడా యెర్రంశెట్టిశాయి వగైరా వారు ఇలాంటి వ్రాతలు రాయటం నేను ఎరుగుదును. ఈ రకం కామెడీ నచ్చేవాళ్ళకి నచ్చుతుంది. మిగిలిన వారు … మనం ఏంటి మన సంప్రదాయం ఎంటి .. హవ్వ ! హవ్వ ! అని అనుకుంటారో యేమో .. ఇటువంటివి పుస్తకం-డాట్-నెట్లో సెన్సారు చేస్తారేమో నాకు తెలియదు మరి.

దీని తర్వాత “A short story on terror” నన్ను అన్నింటి కంటే ఆకట్టుకున్న ఛాప్టరు. ఇందులో “కసాయి” అన్న తీవ్రవాది ఒక హోటల్ మీద దాడి చేసినప్పటి అనుభవాలు ఉంటాయి. ఆయితే మన 26/11 వలే కాకుండా మరొక లాగా ఉంటుంది సంఘటనా క్రమం. కసాయి ఒక పోలీసు స్టేషను కి ఫోను చేస్తాడట “నేను తీవ్రవాదిని. ఇలా ఒక హోటల్ పై దాడి చేశాం” అని .. అ స్టేషను కానిష్టేబులు .. “ఆ హోటలు మా స్టేషను ఏరియా కాదు. వేరే స్టేషనుకు చేసుకోపో” అని పెట్టేస్తాడట. ఆ స్టేషను కానిష్టేబులు ” నువు జిహాదీవో .. ఆజాదీవో నాకు అనవసరం .. ఈ రోజు స్ట్రైకు . నువ్వే స్టేషనుకు వచ్చి FIR నమోదు చెయ్యి” అని అంటాడట. ఒక రాజకీయ నాయకుడేమో “నువ్వెవరయ్యా జనజీవనాన్ని అతలాకుతలం చేయటానికి .. ఆ రంగంలో నాదే గుత్తాధిపత్యం!” అని అంటే చిన్నబోవటం మన తీవ్రవాది కసాయి వంతవుతుంది. ఇలా ఆద్యంతం నవ్వులతో సాగిపోతుంది ఈ ఛాప్టరు.

ఇవికాక .. మన రాజకీయనాయకుల మీద ఒక ఛాప్టరు . ముసలీ ముతకా జనాలు .. మరియు లంచగొండ్లు రాజకీయాల్లోకి వస్తే తప్పేమీ లేదు అంటూనే అటువంటివారికి చురక అంటిస్తారు. “మేనజిమెంట్ కాలేజీలు స్ఠాపించుట ఎలా” అని ఒక ఛాప్టరు . పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళ గురించి , డైలీ సీరియళ్ళ గురించి రియాలిటీ షోల గురించి , బాలీవుడ్ సినిమాల గురించి , 1-900 హాట్ లైన్ నంబరుల వెంట పడి డబ్బు తగలేసుకొనే వారి గురించి ఇలా వరుసగా ఎక్కసెక్కాలాడారు.

ఇలా సరదా సరదాగా సాగిపోయిన పుస్తకం . అయితే రచయిత బ్లాగుకి ( 2006 , 2008 లో బ్లాగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు పొందింది) ఎందరో వీరాభిమానులు ! . వాళ్ళ అంచనాలని అందుకునే స్ఠాయిలో లేదనిపించింది ఈ పుస్తకం. కొన్ని చోట్ల నవ్వు తెప్పించినా కూడా . అక్కడక్కడ బోరు కొట్టించింది. హిందీ సినిమాల గురించి .. ఉత్తరాది వ్యవహారాల గురించికి మోతాదుకి మించి చేసిన ప్రస్తావనలు అందరికి నచ్చుతాయో లేదో మరి. ఏది ఏమయినా ఖాళీ సమయంలో చదువుకోటానికి కాసేపు నవ్వుకోటానికి చదవచ్చు. కాక పోతే ఇది మన సినిమా భాషలో చేప్పాలీ అంటే .. పెద్దలకు మాత్రమే తరహా పుస్తకమేమో మరి .. కుటుంబ కథా చిత్రం లాంటి పుస్తకం ఐతే తప్పకుండా కాదు! పాఠకులు విచక్షణతో వ్యవహరించ వలెను . మళ్ళీ నన్ను అనకండి !

You Might Also Like

Leave a Reply