పుస్తకం.నెట్ ఫిబ్రవరి ఫోకస్ – శ్రీశ్రీ

“ఈ శతాబ్దం నాది” అని ప్రకటించి, అన్నమాటని నిలబెట్టుకున్న ‘మహాకవి’ శ్రీశ్రీ గురించి ప్రత్యేక పరిచయం అనవసరం అనిపిస్తుంది. సాహిత్యం చదివే అలవాటుందా లేదా అన్న విషయం పక్కన పెడితే “శ్రీశ్రీ”, “మహాప్రస్థానం” అన్న పేర్లని వినని తెలుగువారిని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఎక్కడో కానీ తగలరేమో. ఇప్పటికి మధ్య వయసులో ఉన్నవారిలో అయితే అసలు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదేమో. సినిమా ప్రియులకు కూడా శ్రీశ్రీ పరిచయమక్కర్లేని పేరు.

శ్రీశ్రీ 1910 జనవరి రెండవ తేదీన విశాఖపట్నం లో జన్మించారు. చిన్నవయసులోనే తల్లిని పోగొట్టుకున్న శ్రీశ్రీ తండ్రి వద్ద అతి గారాబంగా పెరిగారు. మదరాసు క్రిస్టియన్ కాలేజీలో B.A. (Zoology) చదివారు. తన ఆత్మకథ “అనంతం” లో శ్రీశ్రీ తన చిన్నప్పటి జీవితం గురించి మరింత వివరంగా రాసుకున్నారు. 1925 లో వెంకట రమణమ్మ ను వివాహమాడారు. 1956 లో ఉపద్రష్ట సరోజ ను వివాహమాడారు. ఆవిడ శ్రీశ్రీ రచనా జీవితంలో చేదోడు వాదోడుగా నిలిచారు. క్యాన్సర్ బారిన పడ్డ శ్రీశ్రీ 15 జూన్ 1983 నాడు ఈ లోకం నుండి నిష్క్రమించారు. ఇదీ శ్రీశ్రీ జీవితం గురించిన చిన్న పరిచయం.

శ్రీశ్రీ పాశ్చాత్య సాహిత్యాన్ని విరివిగా అధ్యయనం చేసారని ఆయన రచనల్ని చదివిన వారికెవరికన్నా అర్థమౌతుంది. ముఖ్యంగా ఆయన ఆత్మకథ ‘అనంతం’ ఆయన రాసిన కథలు మరియు ఇతర అనువాదాలనూ చదివిన వారికెవరికైనా ఈ విషయం గురించి ఎలాంటి అనుమానాలూ ఉండవు. వివిధ భావజాలాలను ఆయన చదివినప్పటికీ సర్రియలిజం (Surrealism) లేదా అధివాస్తవికత ప్రభావం ఆయన రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మొదట్లో భావకవిత్వం ప్రభావంలో ఉన్న శ్రీశ్రీ క్రమంగా అందులోంచి బయటపడి తనదైన శైలి సృష్టించాడు. మొదటి రచనలు గ్రాంథికంలో చేసినా కూడా తరువాత్తరువాత గురజాడ వారి ప్రభావంలో గ్రాంథికానికి స్వస్తి చెప్పారు. విశ్వనాథ సత్యనారాయణ శ్రీశ్రీ అభిమానించే రచయితల్లో ఒకరు. తన జీవితంలో ప్రభావితం చేసిన వ్యక్తులను గురించి ఆయన “అనంతం” లో సవివరంగా రాస్తారు. ఆయన రచనల్లో ‘మహాప్రస్థానం’ నాటి నుండీ కూడా మార్క్సిజం ప్రభావం కనిపిస్తుంది. అయితే, అప్పటికి దాన్నే మార్క్సిజం అంటారని తనకు తెలియదని శ్రీశ్రీనే స్వయంగా చెప్పుకున్నారు. శ్రీశ్రీ కమ్యూనిజం పక్షపాతి అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. తాను ‘realist-internationalist’ అనీ, ‘idealist-nationalist’ కాననీ శ్రీశ్రీ అన్నారని ఆయన కుమారుడు నిర్వహించే మహాకవిశ్రీశ్రీ.కాం వెబ్సైటులో రాసి ఉంది.

శ్రీశ్రీ అంటే కవితలే కాదు. మరెన్నో కూడా. తెలుగు సినిమాతో దాదాపు పాతికేళ్ళ అనుభవం ఉంది శ్రీశ్రీ కి. శ్రీశ్రీ అనగానే మనకు “మహాప్రస్థానం” లేదా “ఖడ్గసృష్టి” గుర్తు వస్తాయి. కానీ, శ్రీశ్రీ కథలు, అనువాదాలు, వ్యాసాలూ కూడా రాసారు. ఆయన ఆత్మకథ “అనంతం” డెబ్భైయ్యో దశకంలో మొదట “ప్రజాతంత్ర”లోనూ, తరువాత “స్వాతి” లోనూ సీరియల్గా వచ్చింది. శ్రీశ్రీ తన తొలి కవితా సంపుటి “ప్రభవ” ను తన పద్దెనిమిదవ ఏటే ప్రచురించాడు. ఆయన రచనల గురించిన పూర్తి వివరాలు ఆయన కుమారుడు శ్రీరంగం వెంకట రమణ నిర్వహించే వెబ్సైటు మహాకవిశ్రీశ్రీ.కాం లో చూడవచ్చు. శ్రీశ్రీ ‘విరసం’ తొలి అధ్యక్షుడిగా కుడా ఉన్నారు. ఆయన్ని గురించిన మరిన్ని వివరాల కోసం వెబ్సైటుని గానీ, మరెన్నో ఆన్లైన్ వేదికల్లో గానీ చూడవచ్చు.

ఈ పరిచయంతో అసలు విషయానికొస్తున్నాము: పుస్తకం.నెట్ లో ఈ నెలను శ్రీశ్రీ నెలగా ప్రకటిస్తున్నాము. పాఠకుల్లో శ్రీశ్రీ రచనల గురించి, ఆయన సినిమా రచనల గురించీ, ఆయన సాహితీ కార్యకలాపాల గురించీ ఇతర విషయాల గురించి రాసే ఆసక్తి ఉన్నవారు తమ తమ వ్యాసాలను editor@pustakam.net కు పంపగలరు. దీనికర్థం ఈ నెల్లో శ్రీశ్రీ వ్యాసాలు తప్ప వేసుకోమని కాదు. ఈ నెల ఫోకస్ శ్రీశ్రీ అని తెలియజెప్పడం మాత్రమే నని గమనించగలరు.

You Might Also Like

Leave a Reply