పండుగలు – పరమార్థములు

రాసిన వారు: మాగంటి వంశీ
************************
ప్రతిభాషలోనూ అలిఖితమైన సాహిత్యం బోల్డంత ఉంటుంది. అలాటి సాహిత్యాన్నంతా “జనపదాలు” అని పిలవచ్చునేమో! కాదనుకుంటే జానపదసాహిత్యం అని కూడా అనొచ్చు. ఈ కాలపు “సూపరు” పిల్లలకు జనపదం, అందునా పూర్వ మరియు సంప్రదాయ జనపదం గురించి ఎంత తెలుసు అని ప్రశ్నించుకుంటే, వచ్చే సమాధానానికి నోళ్ళు కొట్టుకోకుండా ఉండటం కష్టమేమో అనిపిస్తుంది. సంప్రదాయ జనపదం ఏమిటి అని అడిగారనుకోండి, ఇహ ఈ కింద రాసిందంతా చదవనఖ్ఖరలా మీరు. సంప్రదాయ జనపదం, వాటి ఆచారం, ఆచరణ కొద్దిగా తెలిసినవారికి – మనకున్న పండుగలు పబ్బాలకు, ఉత్సవాలు ఉత్తరేణిలకు ఆ జనపదాలతో ఎంత దగ్గరి సంబంధం ఉందో విడమర్చి చెప్పనఖ్ఖరలా. ఐతే అలాటి జనపదాన్ని మహానుభావులు కొందరు తమ కలం బలంతో కరిగించి లిపి అనే మూసలో పోసి, బంగారు కణికలుగా మార్చి, ఒరే ఇది బంగారం రా అని చెప్పి మరీ మనకిచ్చినా, అది బంగారం అనీ, దానికి అమూల్యమైన విలువుందనీ తెలిసీ కూడా పారేసుకుంటున్న మూర్ఖపు జనాభా మనలో బోలెడంతమంది. జనపదాలంటే – తప్పులు పట్టుకునేవారు మళ్ళీ విరుచుకుపడతారేమో – జనపదం అంటే జనాలు నివసించే స్థలం అనీ, నువ్వన్నది కాదనీ – ఎవ్వరేమని అన్నా నామటుకు అది “జనపదమే”

కొద్దిగా ఆవేశం, ఆవేదనా తీరింది – ఇహ అసలు సంగతిలోకి వచ్చేస్తూ –

ఆ పండుగలు, ఆచారాలు, పరమార్థాలూ, పండగల్లో చేసే దానాల ముచ్చట్లు, చేసే భజనలు, దేశాచారాలు, వాటితో పాటు ఆ పండగలకి సంబంధించిన పల్లెటూరి పాటలు, దీవన పదాలు చదవాలంటే, ఇతరులెంతమంది ఉన్నా ఒకే ఒక్క పెద్దాయన రాసిన మూడు పుస్తకాలు పట్టుకున్నారనుకోండి – పట్టుకుని ఊరికే కూర్చోకుండా అలా అలా వాటిని చదువుకుంటూ పోయారనుకోండి – ఒకేళ మీరు పెద్దోరైతే చక్కగా మీ మీ పల్లెల్లోకి వెళ్ళి మీ చిన్నప్పుడు పాడుకున్న పాటలు – బుఱ్ఱలో బొంగరాలు బొంగరాలుగా తిప్పుకోవచ్చు. ఒకేళ చిన్నోరైతే అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు లాగూలేసుకుని మేము, మాలాటోళ్ళు ఆ పాటలు ఎలా వినేవాళ్ళమో, కొండొకచో పాడుకునేవాళ్ళమో మీ మీ బుఱ్ఱల్లో ఊహించుకుని ఘాట్టిగా గంటంతోనో, గునపంతోనో, అది వీలుకాకపోతే దబ్బనంతోనో మార్కు చేస్కోండి.

అసలు ఆ పుస్తకం ఏమిటి ? రాసిన పెద్దాయన ఎవరు? ఎన్ని పండగలున్నాయి అందులో ? ఎన్ని పాటలున్నాయి అందులో ? ఎప్పుడు రాసిన పుస్తకం అది ? ఎన్ని పేజీలు ? పబ్లిషర్స్ ఎవరు ? ప్రింటర్సు ఎవరు ? ఎక్కడ దొరుకుతుంది ?
– ఆగు నాయనా..ఆగు..

ఆ పండుగ పరంపరలోని పుస్తకాల్లో మొదటి భాగాన్ని పరిచయం చేసే ప్రయత్నం మాత్రమే ఇది…. మానాన్నగారు పంపించిన భోషాణంలో దాగున్న ఆ పుస్తకాన్ని తీసి మొత్తం ఒక్క ఊపులో చదివేసి, అలా మా ఊరు చల్లపల్లికెళ్ళొచ్చి, కొన్ని స్వంతంగా పాడుకున్న, గుర్తున్న, మరి కొన్ని విన్న పాటలు అలా అలా ఈలలేసుకుంటూ (ఊళలు కాదండీ!- ఈలలు – ఈలలు )పాడేసుకుని తీరిగ్గా తర్వాత ఆ పుస్తకాన్ని టెక్కే మీద పెట్టి, ముందు ఫోటోలు తీసుకుని, ఆ పైన వివరాలు రాసుకుంటే, ఈ విధంగా తేలాయి

పుస్తకం పేరు – “పండుగలు – పరమార్థములు”
రాసినవారు – శ్రీ నేదునూరి గంగాధరంగారు
ఎప్పుడు – 1956
పేజీలు – 78
ఎన్ని పండగలు – బోల్డు
ఎన్ని పాటలు – బోల్డు
ప్రింటర్స్ – లక్ష్మి ప్రెస్సు, రాజమహేంద్రవరం
ఎక్కడ దొరుకుతుంది – తెలియదు! ఆ ఒక్కటి అడగొద్దు!

– అబ్బా! 78 పేజీల్లో మీరు అన్నిటికన్నా పైన చెప్పినవన్నీ రాసారా! నమ్మశక్యం గాకుండా ఉందే! సరే పుస్తకం వివరాలు అన్నీ బాగున్నాయండి – పుస్తకం రాసిన పెద్దాయన సంగతులు, పుస్తకంలోని సంగతులు చెప్పండి బాబూ!

ఆ పెద్దాయన గురించి నేను చెప్పేకన్నా “నేదునూరి గంగాధరం” అని ఒక్కసారి గూగిల్లండి. టూకీగా చెప్పాలంటే జానపద సాహిత్యమంటే ప్రాణాలిచ్చేసే వ్యక్తి. మరుగున పడిపోయిన ఎన్నో ముత్యాలు – అవేనండీ – జనపదాలని అలా అలా ఆ అగాథంలోనుంచి బయటకు తీసుకొచ్చి మన దోసిట్లో పడేసిన మహానుభావుడు. ఈయనా, బి.రామరాజుగారు, చింతా దీక్షితులు, టేకుమళ్ళ వారు, శ్రీమతి చింతపల్లి వసుంధర, ఎల్లోరాగా పిలవబడే శ్రీ గొడవర్తి భాస్కర రావుగారు – ఇలా కొంతమందంటేనూ, వారి పుస్తకాలంటేనూ భవదీయుడికి బోల్డు అభిమానం. వద్దనున్న ఇతరుల పుస్తకాల గురించి మెల్లగా తర్వాత ఎప్పుడైనా…ఇహ పెద్దాయనను వదిలిపెట్టి, పుస్తకంలోని సంగతులకొస్తే –

పుస్తకం విషయసూచికకు కూడా రాకముందే అన్నా చెల్లల సంవాదన చేయించి పుస్తకం రాసిందెందుకో, పుస్తకంలో చెప్పబోతున్నదేమిటో తెలియచేస్తారు గంగాధరంగారు…మీలో ఎంతమందికి ఆ పుస్తకం దొరుకుతుందో నాకు తెలియదు కాబట్టి – ఆ సంవాదన కొంచెంగా ఇక్కడ :

చెల్లెలు:
పండుగలు; నోములు; వ్రతంబులు
ప్రతీ యేటను చేయుచుందురు
పరమ సూత్రమేమిటో?
తెలియఁజెప్పుము అన్నయా!

అన్న:
దేశ సంస్కృతి; దీప్తిఁజెందఁగ
దేశ కళలవి! తేజరిల్లఁగ
దేశ మందలి; ధీవిసాలుర
స్మరణ చిహ్నముల్, చెల్లెలా!

చెల్లెలు:
దేశ సంస్కృతి; దీప్తి యేది?
దేశకళలకు, తేజమేది?
దేశ మందలి; ధీవిసాలుర
స్మరణలేమిటి? అన్నయా!


అన్న:

రామరాజ్యము ! ప్రజాసౌఖ్యము
సకల వృత్తుల ! చాకచక్యము
పుణ్యపురుషుల! బోధ వర్తన
లుండునమ్మా ! చెల్లెలా!

చెప్పాలనుకున్నవి సంవాదనలో చెప్పేసాక, విషయ సూచికకు వచ్చి అక్కడ కూడా చెప్పేసాక – ప్రథమ భాగం మొదలు అవుతుంది. ఈ భాగంలో పండుగల గురించి ఇలాగ వివరిస్తారు –

అ) “గ్రంథములు పోవచ్చును, మతములు మారవచ్చును, భాష మారవచ్చును, ప్రళయము రావచ్చును, కాని ప్రకృతిలో వ్రాసి పెట్టిన జీవనసాహిత్యము మాత్రము ప్రకాశించుచునే యుండును. ఈ జీవసారస్వతమే మన పర్వదినములు; ఆచారములు”

ఆ) ” పూర్వీకులు దేశియ, జాతీయ, విజ్ఞానములను చిరస్థాయిగా నుండుటకై, ప్రతీ సంవత్సరము నొక్కసారి జ్ఞాపకముండునట్లేర్పాటు చేసినారు. ఆ యేర్పాట్లే పండుగలు. ఒక సంవత్సరములో ఈ పండుగలు, వ్రతములు అన్నియును సుమారు యెనుబది కలవు”

ఇ) “ప్రాచీన భారతీయ గౌరవుమును నిల్పుచున్న ఈ పండుగలలో ఉత్సవములు జరుపుదురు. ఉత్సవములనగా కథలయొక్క రూపములే. ఉత్సవములు లేనిదే మానవజీవితము సార్ధకము కాజాలదు. నిండుతనముండదు.”

అలా పండుగల గురించి ఇంకా బొల్డు విశేషాలు చెప్పాక, ఆంధ్ర దేశానికొచ్చి – తెలుగువారి సంవత్సరాదితో మొదలుపెడతారు. ఈ పండగ రోజున చెయ్యాల్సిన ఆచారాలు వివరంగా వివరిస్తారు. ఆ ఆచారాలు ఏమిటా? ఆచారాల వివరాల్లోకి పూర్తిగా పోకుండా స్థూలంగా –

1. వేపపువ్వు పచ్చడి
2. పంచాంగ శ్రవణము
3.మిత్ర దర్శనము
4. ఆర్యపూజనము
5. గోపూజ
6. ఏరువాక

వేపపువ్వు పచ్చడికి ఇతర పేర్లు – “నింబకుసుమభక్షణం“, “ఉగాదిపులుసు” వగైరా వగైరా గా చెప్పి – ఆర్యులు చెప్పిన సూత్రం వివరిస్తారు

ఆర్యులు చెప్పిన సూత్రమిదిట –

అబ్దాదౌ నింబకుసుమం! శర్క రాంలఘృతైర్యుతం
భక్షితం పూర్యయామేతు! తద్వర్షం సౌఖ్యదాయకం!

– అంటే సంవత్సరారంభాన, మొట్టమొదటి ఝాములో వేపపువ్వు, పంచదార, చింతపండు, నెయ్యి, ఉప్పు, కారము వేసి లొట్టలేసుకుంటూ(లొట్టలు – నా పైత్యం-క్షమించాలి! నాకు భాఘా ఇష్టం వేపపువ్వు పచ్చడంటే) తింటే త్రిదోషాలు హరించి శరీరం బాగుండి, ఆరోగ్యం కలిగి తద్ద్వారా సంవత్సరమంతా సౌఖ్యంగా గడవటానికి మొదటిపాదం గా పనికొస్తుందని గంగాధరంగారు చెబుతారు.

నాకు ఈ ఉగాది ఎప్పుడొచ్చినా, అలా కళ్ళుమూసుకుని ఎంతో తన్మయత్వంతో పచ్చడి తింటూంటే గుర్తుకొచ్చే పెళ్ళి ఒకటుందండోయి – ఉగాది పచ్చడికి, పెళ్ళికి లంకె ఏమిటి బాబూ ? అసలా పెళ్ళి ఏమి ? కథా కమామీషు ఏమి?

వివాహ స్థలం – మా అమ్మమ్మగారి ఊరు, వరుడు – రావి చెట్టు, ఆవిడ – వేపచెట్టు. ప్రతి సంవత్సరం డాక్టర్ తాతయ్య గారింటెనకాల పక్కపక్కనే పెంచిన రావిచెట్టుకి, వేపచెట్టుకి పెళ్ళి, ప్రతి ఉగాది రోజు పదకొండింటికి జరిగేది..బోల్డు సంబరంగా ఉండేది….ఆ వేపచెట్టు కింద ఒక రచ్చబండలాగా ఉండేది, సాయంత్రంపూట ఆ చెట్టు కింద చేరి, పండిపోయి కిందపడిన వేపపళ్ళు తింటే (గింజలు కాదు నాయనా, గుజ్జు మాత్రమే ) కడుపులో పుఱుగులు పోతాయని మా అమ్మమ్మ చెప్పిన వేదమంత్రాన్ని అక్షరాలా పాటించేవాళ్ళం…ప్చ్చ్…ఇప్పుడో? ఆ రావిచెట్టూ లేదు, వేపచెట్టూ లేదు..

మళ్ళీ పుస్తకంలోకి వచ్చేస్తే – వసంత ఋతువుకు, వేసవి కాలానికి ప్రారంభపు రోజనీ, కాబట్టి ఈ సంవత్సరాది నుండి తొమ్మిది దినాలు “వసంతనవరాత్రులు”వసంత మాధవ పూజలు” “వసంతోత్సవాలు” జరుపుతారు. తెల్లవారితే సంవత్సరాది వస్తుందనగా “దొంగ ఏరువాక” సాగిస్తారని – గంగాధరంగారు చెబుతారు.

దొంగఏరువాక అనగానే అమ్మమ్మగారింటి పక్కనే ఉండే “పిచ్చమ్మ” గారు గుర్తుకొచ్చారు. వారికి బోల్డు పాడి ఉండేది. పొలాలూ ఉండేవి. అసలు ఏరువాక అంటే మీలో ఎంతమందికి తెలుసో ఒక్కసారి కామెంటండి. కామెంటలేరా – ఐతే సరే వినుకోండి – అందరినీ పిల్చుకుని దుక్కి దున్నటానికి ఎడ్లను తయారు చేసి, నూనేసిన పులగం వాటికి బెట్టి, నాగలికి ఆ ఎడ్లను కట్టి, పసుపు కుంకాలు రాసి, దండలేసి ధూపదీపాలు, హారతులు ఇచ్చి తొలిదుక్కి దున్నించటం ఏరువాక. అంటే ముచ్చిముమ్మాటు మూడు చాళ్ళు తోలిస్తారు అన్నమాట.

మరి దొంగఏరువాకేమిటి ? – ఎవరికీ చెప్పకుండా, నాగలిని, ఎద్దుల్ని పూజించి దుక్కి దున్నటమే. ఆ పని పిచ్చమ్మ గారి పతీశ్వరులు ఎంతో సమర్థవంతంగా చేసేవారు. ఎందుకో, కారణమేమిటో తెలియదు కానీ, మా అమ్మమ్మ “దిష్టి” కొడుతుందనిరా అనేది. ఇహ పిచ్చమ్మగారి సంగతి పక్కనబెట్టి – ఆ ఉగాది రోజున పాటించాల్సిన మిగతా ఆచారాల గురించి కూడా చక్కగా వివరించారు ఈ పుస్తకంలో. అన్నీ రాసుకుంటూ పోతూ ఉంటే పుస్తకం వారి స్థలం సరిపోదేమో అని అనిపించి కొద్దిగా వెనక్కు తగ్గవలసి వస్తోంది.

ఎలాగూ ఏరువాక గురించి చెప్పారు కాబట్టి అక్కడే ఒక ఏరువాక పూజాపదం కూడా ఇచ్చారు గంగాధరంగారు

మంగళమమ్మా, మాపూజలు గైకొమ్మా
మంగళమమ్మా, మా నాగలీ నీకు || మం ||
కష్టమనక భూమి దున్ని
కరువుమాపి, కడుపు నింపి
సకలజీవ రాశిని, నీ
చాలున పోషింతువమ్మా || మం ||

కర్షకులను; కరుణతోడ
కాపాడుచు, నెల్లప్పుడు
కామితార్థములు నొసంగు
కల్పవల్లి వమ్మ నీకు || మం ||

ఇప్పుడు అసలు సిసలు నాగళ్ళెక్కడున్నాయి? కోడెద్దులు, కాడెద్దులు ఎక్కడున్నై అంతా ట్రాక్టర్లూ, మనుషులేగా అంటారా? అలా అన్నా అసలు సంప్రదాయం పాటించాలనుకుంటే, ఈ పై పాట పాడుకోవాలని నిజంగానే ఉద్దేశముంటే నాగలి బదులు “ట్రాక్టరూ” అని పాడుకోవచ్చు. అందులో తప్పేమీ లేదని భవదీయుడి అభిప్రాయం. హాస్యానికి అనట్లేదు. కాలం మార్పుతో పాటూ ఈ పాటల సాహిత్యం కూడా మార్చుకోవచ్చు. సంప్రదాయం పాటించటం ముఖ్యం కానీ, మాటలదేముంది అన్నీ మనచేతిలో పనేగా! పండితులెవరన్నా పూనుకుని ఈ కాలానికి తగ్గట్టు ఆ పదాల పడికట్టూ, ప్రాసకు తగ్గట్టూ మారిస్తే, భేషుగ్గా సిగ్గుపడకుండా పాడుకోవచ్చు.

అలానే ఏరువాక పౌర్ణమికి, ఏరువాక పండగకి పాడుకునే – ఏరువాక ఆరాధన జానపద గేయం ఒకటి:

ఏరువాకమ్మకూ ఏమి కావాలి
ఎఱ్ఱ ఎఱ్ఱని పూలమాల కావాలి
ఎరుపు తెలుపుల మబ్బుటెండ కావాలి
ఏరువాకమ్మకూ ఏమి కావాలి
పొలము గట్టున నిలిచి వేడుకోవాలి
టెంకాయ వడపప్పు తెచ్చిపెట్టాలి
ఏరువాకమ్మకూ ఏమి కావాలి
ముత్తైదులందరూ పాట పాడాలి
పున్నిస్త్రీలందరూ పూజ చేయాలి
ఏరువాకమ్మకూ ఏమి కావాలి
పాట పాడుతు తల్లి
పాదాలు మ్రొక్కాలి
ఏరువాకమ్మను ఏమి కోరాలి
ఎడ తెగని సిరులివ్వ వేడుకోవాలి
పాడి పంటలు కోరి పరవశించాలి

You Might Also Like

4 Comments

  1. హెచ్చార్కె

    “ఏరువాకమ్మకూ ఏమి కావాలి
    పొలము గట్టున నిలిచి వేడుకోవాలి
    టెంకాయ వడపప్పు తెచ్చిపెట్టాలి”
    చాల మంచి పుస్తకాన్ని గొప్పగా పరిచయం చేశారు. వంశీ గారూ, అభినందనలు.
    “ …ఆ వేపచెట్టు కింద ఒక రచ్చబండలాగా ఉండేది, సాయంత్రంపూట ఆ చెట్టు కింద చేరి, పండిపోయి కిందపడిన వేపపళ్ళు తింటే (గింజలు కాదు నాయనా, గుజ్జు మాత్రమే ) కడుపులో పుఱుగులు పోతాయని మా అమ్మమ్మ చెప్పిన వేదమంత్రాన్ని అక్షరాలా పాటించేవాళ్ళం…ప్చ్చ్…ఇప్పుడో? ఆ రావిచెట్టూ లేదు, వేపచెట్టూ లేదు..” ఏడుపొచ్చింది సార్, చినరి వాక్యం చదువుతుంటే. అమ్మమ్మ చెప్పింది నిజంగా వేద మంత్రమే.
    ఇప్పుడు ఆ చెట్లు అసల్లేవని కాదు. ఇంకా ‘లాభం’ దాహం జడలు విప్పని చోట్ల కనిపిస్తాయి. కాని వాటికి పూజల్లేవు. ఉన్నా ఎందుకు పూజిస్తామో చెప్పే వాళ్లు లేరు. వేప్పళ్లు తింటే కడుపులో పురుగులు పోతాయని, ఇంటి ముందు ఆవు పేడతో అలికితే పురుగులు రావని, అశుభ సమయాల్లో ఇల్లంతా ఆవు పంచికం చల్లుకోడం క్రిములు పురుగులను దూరం పెట్టడానికేనని… చెప్పే అమ్మమ్మలు లేరు, తాతయ్యలు లేరు.
    పూజలయితే ఉన్నాయి, మతాలున్నాయి; జనం పరస్పరం గొంతులు కోసుకోడానికి. పల్లె (రైతు) విజ్ఙానాన్ని తరం నుంచి తరానికి అందించడానికి అవి ఉపయోగపడడం లేదు. బహుశా బతుకుతో, సంబంధం లేని నైరూప్య దేవుళ్ల ప్రవేశం తోనే… మనిషి ప్రకృతి నుంచి విడవడి బతికే పతనం మొదలయ్యింది. చెట్టును, పుట్టను నీటిని, పంటను, మనిషిని (పెద్దలను), జంతువులను పూజించే మన అద్భుత సంస్కృతి ఇప్పడు లేదు. పునరుద్ధరించగలమా దాన్ని? ఇస్మాయిల్ వంటి వారు తమ కవిత్వ, చింతనలతో, మసనోబు ఫుకయోకా వంటి శాస్త్రజ్ఞులు తమ విజ్ఙానం, జీవిత కార్యాచరణలతో చెప్పడానికి ప్రయత్నిందింది ఈ విషయమే అనుకుంటాను. ఆ చింతనను, అ ప్రేమను కాసంతయినా అందుకోగలమా?
    ‘ఇప్పుడు అసలు సిసలు నాగళ్ళెక్కడున్నాయి? కోడెద్దులు, కాడెద్దులు ఎక్కడున్నై అంతా ట్రాక్టర్లూ, మనుషులేగా అంటారా? అలా అన్నా అసలు సంప్రదాయం పాటించాలనుకుంటే, ఈ పై పాట పాడుకోవాలని నిజంగానే ఉద్దేశముంటే నాగలి బదులు “ట్రాక్టరూ” అని పాడుకోవచ్చు.’ అన్నారు మీరు. ఈ తరణోపాయంగా బాగుంది గాని, అలా పాడుకుంటే ఒక మంచి వస్తువు స్మృతిగానైనా మిగలకుండా పోతుంది. ‘ట్రాక్టరు’ దున్నకం వల్ల నేల గట్టి పడి నీటిని చొరనీయదని, రైతు మిత్ర క్రిమి కీటకాదులు చచ్చిపోతాయనే సంగతులు ఆలా ఉంచుదాం. యంత్ర ప్రవేశంతో (ఆర్థికంగా) అమెరికాలో ఏం జరిగిందో జాన్ స్టీన్ బెక్ “గ్రేప్స్ అఫ్ ర్యాత్’ చదివితే బాగా తెలుస్తుంది. ఆ నవలలో చెప్పిన ‘అబివృద్ధి’ క్రమం మన పల్లెల్లో ఇప్పుడిప్పుడే మొదలయింది. ముందు ముందు ఎలాంటి పరిణామాలు చూడబోతున్నామో తల్చుకుంటే వణుకు పుడుతుంది.
    ఈ పరిణామాల్ని ఆపలేము గాని, ఇవి ఏమంత మంచి పరిణామాలు కావని గుర్తుంచుకుంటే… ‘సైన్సు-పూజ’ కాస్త తగ్గించుకుని, రానున్న దుష్ఫలితాల్ని మినిమైజ్‍ చేయగలమేమో. అభివృద్ధికి ప్రత్యామ్నాయాలు వెదకగలమేమోనని ఆశ.

  2. మాగంటి వంశీ

    ఇక్కడేదో వందపైన “వ్యూస్” చూసి బోల్డు ఆశ్చర్యపోయా. పాతికశాతం కాకుంటే పదిశాతం మంది పూర్తిగా పట్టి పట్టి చదివారే అనుకున్నా, అందులో ఒక్కరో ఇద్దరో – ఇక్కడ ఇరికించిన తప్పు పట్టుంటే ఆనందోబ్రహ్మ అయ్యేది ….. 🙂 just kidding

    పుస్తకంవారూ

    “ఎప్పుడు” అన్నది – 1956 అని ఉండాలి

    కకాకబకట్టి కతకప్పు కసకరికదికద్దంకడి

    @రవి – “వేపూరట” కలిగినందుకు సంతోషం
    @ఉష – మీరు కూడా “తీరం” దాటినందుకు సంతోషం

  3. ఉష

    మంచి గ్రంధం గురించి రాసారండి. సంప్రదాయాలు, ఆచారాలు మన పూర్వ చరిత్రకి ముడిపడినవే. కొన్నిటి పట్ల నిరాసక్తత తప్పా చాలా వరకు మేము పాటిస్తూ పెరిగినవే ఇవన్నీ.

    దీపావళికి గోగునార కాడలకి ప్రత్తి వత్తులు కట్టి వెలిగించి “దిబ్బు దిబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే నాగులచవితి..” తూర్పు ముఖంగా నిలబడి, గుండ్రంగా తిప్పుతూ పాడటం గుర్తుకు వచ్చింది.

    సంక్రాంతి అయ్యక బలిని సాగనంపాక పేడలో ఆనపవిత్తనాలు కప్పివుంచుతారు. అదీ గుర్తుకు వచ్చింది. జన్మాష్టమికి పేలాలపిండి తిరగలి మీద విసరటం. దసరాకి జమ్మి పత్రి తేవటం. శివరాత్రి జాగారాలు, కార్తీక స్నానాలు, అట్లతద్ది, గోరింటాకు కోసం పోట్లాటలు..

    ఇలా మరెన్నో ఆలాపనలు.

    ఇది అమెరికా జీవినవిధానానికి అన్వయిస్తూ- నేను ఉగాదికి మరో పాట రాసి పాడించాను నా బడి పిల్లలతో. వాళ్ళకి మీరు పైన చెప్పిన పాట స్థాయి అర్థం చేసుకునే ముందు మరొక తేలికపాటి పాట అవసరమనిపించింది. వాళ్ళకి ప్రతి పండుగ ఎందుకు చేస్తాము అన్నది తెలుస్తుంది నెమ్మదిగా. కానీ, ఆ పండుగ వాతావరణం మనం అనుభవించిన రీతిగా ఇక్కడ తీసుకురావటం కష్టం. ఆ సందడి, కోలాహలం లేనిదే పూర్తి అనుభూతి రాదు. వినాయక చవితి అయ్యాకనో, బతుకమ్మ ఆడాకనో కార్లో నది/సరస్సుల దాపులకి వెళ్ళటం అంత ఆనందాన్ని ఇవ్వదు. ఇలా చిన్న సర్దుబాట్లతో అయినా చేస్తూనేవున్నాము.

    ఇక, ఈనాటి మహిళ, పురుషుల్లోని “మహిళ” ఎంతవరకు పాటిమ్చగలరూ అన్నది సాధ్యాసాధ్యాలను బట్టి కూడా కదా? వ్యావహారిక భాష, వేషం, ఆహారం, అలవాట్లు ఇన్ని మారిపోతున్న నేపథ్యంలో అందరి సమిష్టికృషి కావాలి. నేను నా వంతు మానలేదు. నాకు తెలిసీ చాలామందే పాటిస్తున్నారు. నేను ఈ మధ్య ఇక్కడా, ఇండియాలోను గమనించింది ఈ పండుగల కన్నా భజనలు, విష్ణుసహస్రనామాలు చదవటం చూస్తున్నాను. కనుక కొన్ని సాంగత్య ప్రభావాన మారే ఆచారాలు కాబోలు.

    ఏదేమైనా ఉదయాన్నే ఓ సారి ఈ తీరాలు దాటి ఎక్కడికో వెళ్ళివచ్చాను. కృతజ్ఞతలు.

  4. రవి

    ఉగాది పచ్చడి మీద నాకో భయంకరమైన డవుటు ఉండేది. దీని కథా కమామీషు ఏమిటని. (నా మీద కోపంతో మా ఆవిడ పచ్చడిలో వేప్పూత ఎక్కువేసిందేమో అన్న ఉక్రోషం కూడా ఒకందుకు కారణం). ఇప్పుడు కాస్త ఫ్రీగా ఫీలవుతున్నాను.

    అయితే ఈ పుస్తకం దొరక్కుండా చేసి,మాకు అన్యాయం చేశారు.

Leave a Reply