భ్రష్టయోగి

వ్యాసం రాసిపంపినవారు: భైరవభట్ల కామేశ్వరరావుగారు
=====

మన్మహాయోగ నిష్ఠా సమాధినుండి
విక్రియాపేత బ్రహ్మ భావించు వేళ
పట్టరాని సౌందర్య పిపాస తగిలి
భ్రష్టయోగిని కవిజన్మ బడసినాడ

ఈ కవి పూర్వ జన్మలో ఒక యోగి-ట. గొప్ప యోగదీక్షతో సమాధిలో నిర్వికారమైన పరబ్రహ్మం గురించి తపస్సు చేస్తున్న వేళ, ఒక పట్టరాని సౌందర్య పిపాస (అంటే సౌందర్యాన్ని తాగాలనే విపరీతమైన కాంక్ష) తగులుకొని ఆ యోగి తపస్సు భంగమైపోయింది. అప్పుడా భ్రష్టయోగి కవిగా జన్మించాడట. తపోదీక్షలో ఉన్న తన మనసు ఎలా ప్రాపంచిక విషయాలపై మోహం చెంది, యోగ భ్రష్టుడై. తాను కవిజన్మ పొందాడో మరొక మూడు పద్యాలలో వర్ణించే పద్యకవిత “భ్రష్టయోగి”. ఇది విశ్వనాథ సత్యనారాయణగారు 1926కి పూర్వం రాసింది, అంటే అతని తొలినాళ్ళ కవిత. కవిగా తనని తాను కనుగొంటున్న కొత్తలో రాసుకున్న కవితన్నమాట. ఒకవైపు గాఢమైన ఆధ్యాత్మికత, మరో వైపు తీవ్రమైన భావోద్రేకం – ఈ విచిత్రమైన అవస్థలోంచి తాను కవిగా అవతరించానని తెలుసుకున్నారతను. ఒక రకంగా ఇది సిసలైన ఏ కవికైనా  వర్తించే విషయమే. కవికి లోచూపు, వెలిచూపూ రెండూ ముఖ్యమైనవే కదా!

1916-1926 మధ్యలో విశ్వనాథ రాసిన కొన్ని పద్య కవితల సంపుటిని “భ్రష్టయోగి” అనే పేరు మీద పుస్తకంగా ప్రచురించారు. ప్రాచీన ఆధునిక కవిత్వాల మధ్య ఒక ముఖ్యమైన తేడా – పాఠకునికి కవితో నేరుగా ఏర్పడే పరిచయం, అనుబంధం. ప్రాచీన పద్య కావ్యాలలో ఆయా పాత్రలే మనకి కనిపిస్తాయి కాని నేరుగా కవి కనిపించడు. మనకి కవి వ్యక్తిత్వంతో పరిచయం ఉండదు. కావ్యాన్ని బట్టి కవి వ్యక్తిత్వాన్ని అంచనావెయ్యడమే. శతక పద్యాలలో మాత్రం అక్కడక్కడ కవితో పరిచయం కలిగే అవకాశం ఉంది. ఆధునిక కాలంలో కవి నేరుగా మనతో తన కవితల ద్వారా మాట్లాడ్డం తరచూ చూస్తాం. దీన్నే కొందరు “ఆత్మాశ్రయ కవిత్వం” అంటారు. అంటే కవి తనకి కలిగే అనుభూతులని, ఆలోచనలని, భావావేశాన్ని నేరుగా పాఠకునితో పంచుకుంటాడు. ఇలాంటి కవిత్వం వల్ల పాఠకుడికి కవితో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. ఎంత ఎక్కువగా ఆ కవి కవిత్వాన్ని చదివితే అంత ఎక్కువగా ఆ కవి వ్యక్తిత్వం మనకి దగ్గరవుతుంది. అంచేత విశ్వనాథ గురించి తెలుసుకోవాలంటే ఓ రామాయణకల్పవృక్షం చదివితే సరిపోదు. ఒక వ్యక్తిగా, కవిగా అతనిలో ఉన్న అనేక పార్శ్వాలు అతని కవిత్వం చదువుతున్న కొద్దీ తెలుస్తాయి. ఇది నాకు మరీ అనుభవానికి వచ్చింది ఈ భ్రష్టయోగి కవితాసంపుటితో. అతని తర్వాతి రచనలు చాలా చదివిన తర్వాత ఈ తొలినాళ్ళ కవితలు చదవడం తటస్థించింది. ఒక కొత్త విశ్వనాథని తెలుసుకున్న అనుభూతి కలిగింది.

నాలాంటి విశ్వనాథ అభిమానులకే కాదు, కవిత్వం రుచించే ఏ పాఠకునికైనా హత్తుకునే కవిత్వం పుష్కలంగా ఈ పుస్తకంలో ఉందని నా అభిప్రాయం. ఇది పుస్తక పరిచయమే కాబట్టి, ఇందులో కొన్ని కవితలని మాత్రం ఇక్కడ పరిచయం చేసి మిమ్మల్ని ఊరించి వదిలేస్తాను. 🙂

“నా పాట” అని ఒక చిన్న కవిత. ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే మినీ కవిత అనుకోవచ్చు. రెండే తేటగీతి పద్యాలు.

చల్లనైయున్న నా హృదబ్జమ్మునుండి,
తలవనితలంపుగా నొక్క లలితగీతి
జాలువారి, ఈ మంజులోషస్సు వేళ
విరిసికొన్నది మంచుతుంపరలయందు

ఆ లలితగీతి పోయి దిగంతములకు,
నిశ్చలంబైన ప్రకృతిలో నిలువలేక,
అల్ల ఉపసంహృతమ్మైన యస్త్ర మట్లు
నేను పాడిన పాట నన్నే వరించె

దీనికి వివరణ ఇవ్వడం నాకిష్టం లేదు. ఇలాంటి కవితలకి వ్యాఖ్యానం వాటికి విషప్రాయం!

మానవ మనస్తత్వాన్ని గూర్చి వ్యంగ్యంగా చెప్పడానికి తానొక పసివానిగా మారతాడు కవి, “పసివాడు” అనే కవితలో. పెద్దగా ఏడుస్తూ తను మారాం చేస్తూంటే, తండ్రి ఏవేవో చాలా వస్తువులు ఇచ్చాడట. అవన్నీ పారేసి మళ్ళీ ఏడుపు మొదలుపెట్టాడు తను. పట్టపుటేనుగుని ఎక్కిస్తాను (ఆ తండ్రి రాజుగారు కాబోలు!) అని అన్నా ఏడుపు మానలేదు. ఆఖరికి బజారులో దొరికే ఒక బొమ్మ, పేడతో చేసి రంగుల ముచ్చికాగితం అంటించిన బొమ్మ, కొనిస్తే అప్పుడు మానాడట తన ఏడుపు! ఇలా ఒక సంఘటననో వస్తువునో ప్రతీకగా తీసుకొని, మానవస్వభావాన్ని చిత్రించిన కవితలు ఇందులో చాలా ఉన్నయి. మొన్నీ మధ్య నా బ్లాగులో పోస్టు చేసిన భవిష్యత్తు కవిత ఇందులోదే. సాగిపోయే కాలాన్ని మనిషి ఎలా చూస్తాడో అన్యాపదేశంగా చిత్రించే కవిత ఇది.

ప్రతీకాత్మకంగా కాక, పదచిత్రాలతో వర్ణనతో అచ్చమైన అనుభూతిని మిగిల్చే కవితలు కూడా ఉన్నాయి. అంధభిక్షువు కవిత దీనికి ఒక చక్కని ఉదాహరణ.

అతడు రైలులో, నే పోయినప్పుడెల్ల, ఎక్కడో ఒక్కచోట దా నెక్కు –
వాని నతని కూతురు నడిపించు చనుసరించు.
అతడు దాశరథీశత కాంతరస్థమైన ఆ పద్యమె పఠించు అనవరతము
అతని ఆ గొంతుకట్లనే – అతడు పూర్వ జన్మమందు
ఏ నూతిలోననో చచ్చిపోవు,
చెంత పిలిచిన వినువారలేని లేక.
ఆ పిలుపు ప్రాణకంఠ మధ్యములయందు
సన్నవడి సన్నవడి, నేటి జన్మ కతని కనుచు వెదకుచు,
వచ్చి చేరినది కాక
అతని కన్నులా బొత్తలే – ఆ సమయమునందు
తన్ను రక్షింప ఏరైన వత్తురేమొ అని చూచిచూచి
అట్లే నిలబడి
అతని ప్రాణాలు కనుగూళ్ళ యందు నిలచి
మరల కనెగాక నేటి జన్మమున అతని.
అతని కన్నులు చూచినయప్పుడెల్ల
నూతిలో మున్గు ఆతని తీతునంచు, వేగిరము పుట్టు నాదు హృద్వీధియందు
అంతలో పాట నాపి, తా నచటనచట
కాను లడిగి, కూతురు ముందుగా, వినిర్గమించు నాతడు –
నే నందు మిగిలిపోదు

కాస్త సులువుగా అర్థమవ్వడం కోసం అక్కడక్కడ సంధులు విడగొట్టి, పద్య పాదాలుగా కాకుండా వాక్యాలుగా ఇక్కడ రాసాను. ఈ కవిత కూడా వ్యాఖ్యా నిరపేక్షమే. ఎవరికి వారు ఆ గుడ్డి బిచ్చగాని రూపాన్ని తమ తమ హృదయాల్లో చిత్రించుకొని కవి పొందిన అనుభూతిని తాము పొందవలసిందే. ఆ బిచ్చగాడు దాశరథీ శతకంలోని పద్యం పాడుతున్నాడట. ఇప్పుడలాంటి వాళ్ళు కనబడరనుకోండి. ఇంతకీ, “ఏదో పద్యం” అనకుండా “ఆ పద్యం” అని చెప్పి, ఆ పద్యమేమిటో చెప్పకుండా వదిలెయ్యడంలో ఉంది గొప్పదనం. ఈ కవిత గురించి మరెంతో వివరించాలని తహతహగా ఉన్నా, ఆ పని చేసి మీ అనుభూతిని చెడగొట్టడం ఇష్టం లేక అతి కష్టమ్మీద నా నోరు కట్టేసుకుంటున్నాను!

“అస్రుత బాష్పము” అనే మరో కవితలో ఒక ఏకాకి బిచ్చగత్తె దయనీయ స్థితిని గుండెలు కలిచివేసేలా వర్ణిస్తారు విశ్వనాథ. వీధివీధీ బిచ్చమెత్తుకొని, వచ్చిన ఒక గుప్పెడు బియ్యాన్ని ఊరిబయట చెట్టుకింద కష్టపడి పుల్లలేరుకొని మంట రాజేసి ఉడికిస్తూ ఉంటుంది. తన ఒంటరితనాన్ని గురించి, మశూచికం వచ్చి చచ్చిపోయిన మొగుడూబిడ్డలని గురించి తలచుకుంటూనో ఏమో పరధ్యానంలోకి వెళుతుంది. ఇంతలో ఒక పాము వచ్చి ఆమెని కాటేసిపోతుంది. ఆమె నురగలు కక్కుకుంటూ చచ్చిపోతుంది. ఆమె అవస్థకి ప్రకృతికూడా దుఃఖిస్తుంది!

కోళ్ళఱచె, దిక్కుగమి తెలతెల్లవోయె,
లోకబంధుండు మొగిలను కోకచెఱగు
నడ్డముం బెట్టుకొనియె ముఖాబ్జమునకు,
మంచుబిందుల కన్నీరు నించె తరులు

కాని మనుషులు మాత్రం ఆమెని ఏమాత్రం పట్టించుకోకుండా పోతారు. “అస్రుత బాష్పము” అంటే కారని కన్నీటి చుక్క!

“మనుష్యుడు – దయ – నిర్దయ” అనే కవితకూడా మనిషి నిర్దయని చిత్రించే కవితే. అయితే ఇది మరికొంత వ్యంగ్యంగా ఉంటుంది.

కరుణ, దయ మాత్రమే కాదు, భావకవిత్వంలో కనిపించే ప్రకృతి సౌందర్యారాధన, స్వేచ్ఛా గానము, ప్రణయము – ఇలా ఎన్నెన్నో కనిపిస్తాయీ కవితల్లో. అన్నింటిలోనూ విశ్వనాథ ప్రత్యేకత మాత్రం కనిపిస్తూనే ఉంటుంది. తర్వాత స్వతంత్ర కావ్యాలుగా మారిన “కిన్నెరసాని పాటలు”, “విశ్వేశ్వరశతకం” వంటి వాటిలో కొన్ని గేయాలూ, పద్యాలూ కూడా ఇందులో ఉన్నాయి. అంటే అతని కవితా కల్పవృక్షపు విత్తనాలు ఇందులో చూడవచ్చన్నమాట! విశ్వనాథవారికి సహజంగా ఉండే ప్రౌఢత్వంతో పాటు ఒకలాంటి పచ్చిదనపు వాసన కూడా ఈ కవితల్లో మనకి తగులుతుంది.

మరొక్క కవిత ఉదహరించి ఈ పరిచయం ముగిస్తాను. ఇది “నీ రథము” అనే కవిత.

ఓ ప్రభూ నీ రథమ్ము దీక్షాప్రణీత
విధురవేగమ్ము పరువులు వెట్టుచుండె
నా శరీరము దాని క్రిందబడి నలిగి
నలిగిపోయినయది రక్తనదము లింకి

దివ్యతేజోవిరాజత్త్వదీయ రథము
ఈ గతుకు డేమి యనియైన నాగలేదు
నా విరోధించిన హఠాన్నినాదమునకు
వెనుదిరిగియైన మఱి చూచుకొనగలేదు

నాదు రక్తము నీ రథచోదకుండు
కడిగివేయును రేపు చక్రములనుండి
అచటి బహుజన రక్తచిహ్నముల యందు
నాది యిదని గుర్తేమి కన్పడును, స్వామి!

ఓ ప్రభూ! పనిమీద నీ రథం వేగంగా పరువులుపెట్టి పోతూ ఉంటే, నా శరీరం దాని క్రిందబడి నలిగి నలిగి పోయింది. రక్తం నదులుగా పారి ఇంకిపోయింది. మధ్యలో గతుకేమిటని కూడా ఆగకుండా నీ రథం వెళ్ళిపోయిందే! నా అరుపుకి నీవు వెనుదిరిగైనా చూడలేదు. రేపు నీ రథసారథి చక్రాలనుండి నా రక్తాన్ని కడిగేస్తాడు. ఎంతోమంది రక్తపు గురుతులు ఆ చక్రాలని అంటుకొని ఉంటాయి. ఆ అన్నిట్లోనూ ఇది నా రక్తమని గుర్తెలాపడతావు స్వామీ!

ఇంతకుముందెప్పుడూ మీరు కనీవినీ ఎఱుగని విశ్వనాథ ఇతను! అవునంటారా కాదంటారా?

నా దగ్గరున్న పుస్తకం ప్రతి వివరాలు:

ప్రచురించిన వారు – వి. యస్. యన్. & కో, మారుతీ నగర్, విజయవాడ (ఇది విశ్వనాథ సత్యనారాయణగారి పేరు మీద వారి కుమారులు స్థాపించిన సంస్థ అనుకుంటాను)

ఎప్పుడు ప్రచురణ అయిందో లేదు. బహుశా ఈ మధ్య కాలంలో ఇది ప్రచురించబడినట్టు లేదు.

పుస్తకం (మీ అదృష్టాన్నిబట్టి) దొరికే చోట్లు: విజయవాడ లెనిన్ సెంటర్, హైదరాబాదులో పాతపుస్తకాల దుకాణాలు.

You Might Also Like

9 Comments

  1. rajeswari

    hi,

    oka koththa viswanath varini parichayam chesinanduku thanks.

  2. Srinivas Nagulapalli

    ‘యోగం’, ‘బ్రష్టయోగం, ‘ కవిత్వం’ గురించి చదువుతుంటే ఇంకొక్క మాట గుర్తొచ్చింది.

    రాకెట్ లాంచి నుంచి రాసే ప్రక్రియదాకా, వంట గదినుండి సైన్సు లాబ్ దాకా, పొలంలోనైనా గళంతోనైనా, వెబ్సైటైనా వాక్సిన్‌కైనా- తెలుగువాళ్ళు, భారతీయులు, తెలుసో, తెలియకో, సగమే తెలిసో, కొత్తగా చేసేదేనికైనా బాగా వాడే మాట ఒకటి-ప్ర”యోగం”. “ప్రకర్షేన(విశిష్టమైన) యోగం”. ఆలోచించినప్పుడల్లా విస్మయపరచే పదాలలో అదొకటి నాకు. అందరూ ఉప”యోగిం”చే మాటే, ఎప్పుడూనూ.
    =====
    విధేయుడు
    శ్రీనివాస్

  3. rAm

    1954-55 మధ్యకాలంలో ఆకాశవాణి నుంచి విశ్వనాధ గారి “భ్రష్టయోగి” ప్రసంగం నుంచి నా చూచిరాత-

    “యివి యెప్పుడో వ్రాసిన పద్యాలు.వీటిలోని ఉద్దేశం ఏమిటంటే యోగభ్రష్టుడు అవుతాడని.భగవద్గీత లో యోగభ్రష్టుడు శ్రీమంతుల ఇళ్ళలో పుట్టుతాడని ఉంది.అనగా రాజులు మొదలైనవారి ఇళ్ళల్లో.భగవద్గీత ప్రకారం ఇదివరకు కవిగాకపోయినా,ఇక రాజులుండరు కాబట్టి యింకనైనా యోగభ్రష్టుడు కవుల ఇళ్ళలోనైనా పుట్టవచ్చు.అల్లా కాకపోయినా”కవితా యద్యస్తి రాజ్యేన కిం?” అని అన్నాడు.కనుక కవులు రాజ్యం లేని రాజులు.కనుక యోగభ్రష్టుడు కవిగా పుట్టవచ్చు.

    ఇందులో పరమ ప్రధానమైన విషయం కవిత్వమంటే ఒక తపస్సని,ఒక యోగమని.ధ్యాన ధారణ నిది ధ్యాసాదులతో కూడినదని.అవి లేకుండా కవిత్వం చెప్పటం కస్టమని.అందరు కవులు యోగులవంటి వారా యేమిటి ?అంటారేమో !
    కవితావిద్య నిస్సందేహంగా అదొక యోగం.యోగులలో తారతమ్యాలుంటవి.వశిష్ఠాదులూ యోగులే.బైరాగుల్లోనూ యోగులుంటారు కొందరు.యీ తరతమ భేదం తరతమమందూ వుంతుంది.పద్యం వ్రాయమనేటప్పటికి తక్కినవి యేమి లేకపోయినా కొంచెం వ్యాకరణం,గణము,యతిప్రాసలు కావాలిగదా.అది ఒక ప్రయత్నం చేస్తేనే కాని కుదరదుగదా ! అది యోగమే.యోగమనన్న సబ్దం “యుజ్” ధాతువు మీద వచ్చింది.
    “కూడుకొని యుండుటా అని అర్ధం. యీ లెక్కన యేది యోగం కాదు?అంటారేమో !అన్నీ యోగాలే.తరతమ భేదం వుంది.

    “బ్రహ్మబదులుగ వాక్స్వ రూపమ్ము నెంచి,బ్రహ్మకును వాక్కున కభిన్న భావమెంచి భ్రష్ట యోగిని కవిజన్మ పడసినాడ”వట్టి సౌదర్యంతో సంబోధనలతో అంటే చంత్కారములైన శబ్ద నిక్షేపములతో,కొన్ని చమత్కారములైన భావాలతో కవితాస్వరూపం సంపుర్ణం కాదని భావం.దాని సంపుర్ణ స్వరూపం రసం.ఆ రసం ఆకాశంలో నుంచి ఊడిపడదు.దానికి లక్ష ప్రయత్నాలు చేయాలి.అది ఒక పెద్ద సాధన. ఆ సాధన యొక్క స్వరూపమే బ్రహ్మకును వాక్కునకు అభిన్నభావమైంది.యీ భావన అలంకార శాస్త్రం క్రిందకు దిగుతుంది.ఒక్కొక్క చోట ఒక్కక్క మార్పు కావాలి.”

    “విశ్వనాథ గురించి తెలుసుకోవాలంటే ఓ రామాయణకల్పవృక్షం చదివితే సరిపోదు. ఒక వ్యక్తిగా, కవిగా అతనిలో ఉన్న అనేక పార్శ్వాలు అతని కవిత్వం చదువుతున్న కొద్దీ తెలుస్తాయి. ”

    :)చక్కని పరిచయాన్ని అందించిన కామేశ్వరావుగారికి కృతజ్ఞతలు.మరిన్ని ఆశిస్తూ .

  4. Srinivas Nagulapalli

    చక్కని కవితలు, పరిచయాన్ని అందించిన కామేశ్వరావుగారికి కృతజ్ఞతలు.

    “నీ రథము” చదివితే (తులసీ?) రామాయణంలో నన్ను బాగా తాకిన కథ ఒకటి గుర్తొచ్చింది. లంకాయానానికి ముందు సాగరతీరంలో సంధ్యావందనం కోసం రాముడు కోదండాన్ని ఇసుకులో నిలిపి, ఆ తరువాత తీసుకున్నప్పుడు దాని అడుగున రక్తపు మరకలు, దాని కింద బాగా గాయపడ్డ కప్పను చూస్తాడు. ఎప్పుడూ బకబక మని అరిచే దానవు, విల్లు గుచ్చుకుంటే ఎందుకు అరవలేదు అని కప్పను అడుగుతాడు రాముడు. “ఎప్పుడు నొప్పి కలిగినా నేను పిలిచే నా రాముడే, ఇప్పుడు నొప్పి కలిగిస్తుంటే ఇంక పిలవడం ఎందుకని ఊరుకున్నాను” అంటుంది కప్ప.
    =====
    విధేయుడు
    శ్రీనివాస్

  5. కొత్తపాళీ

    చాలా చాలా బావుంది.
    విశ్వనాథ సాహిత్య మూర్తిమత్వాన్ని తల్చుకుంటే .. That first poem makes absolute sense.
    పరిచయానికి ధన్యవాదాలు

  6. కౌటిల్య

    భైరవభట్ల వారూ,
    గురువు గారి చాలా మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు….గురువు గారి రెండు ఖండకావ్యాల్లో నేను చదివింది ఇదే..(కేదారగౌళ చదవలేదు,ఎక్కడా దొరకట్లేదు)ఎప్పుడో చిన్నప్పుడు చదివా..నాన్నగారి దగ్గర ఉండేది…అప్పుడంతగా అర్థం కాకపోయినా ఏదో చదివేవాణ్ణి…ఆ కవితల్ని అనుకరిస్తూ బులిబుల్లి కవితలల్లుకునేవాణ్ణి…..ఇప్పుడు చదుదామంటే నాన్నగారు ఇవ్వట్లేదుః-)….ఇది కూడా విజయవాడలో దొరకట్లేదు…హైదరాబాదులో ప్రయత్నించాలి…..వీటిలో “అంధభిక్షువు”,”అస్రుతబాష్పము” నాకు చాలా ఇష్టమైన ఖండికలు… మళ్ళా ఆ కవితల్ని నేను చదువుకునేలా చేసినందుకు ధన్యవాదాలు….

  7. Vaidehi Sasidhar

    చక్కటి పరిచయం.
    “పట్టరాని సౌందర్య పిపాస” అనటం లోని చిక్కదనం ఆ పద్యానికి ప్రాణం అనిపిస్తుంది.
    “అంధభిక్షువు”, “నీ రధం” హైస్కూల్ రోజులలో “వైతాళికులు” లో చదివాను.
    ఒక తెలియని మెలంకలీని ,ఆర్ద్రతను చిప్పిల్లే కవితలు

    అభినందనలు

  8. రవి

    అంధభిక్షువు కవిత నాకు ఒకప్పటి తరగతి పాఠంలో వచ్చినట్టు గుర్తు. ఏ తరగతో గుర్తు లేదు. ఇలాంటిదే ఒక టి హిందీ కవి ఒకాయన వ్రాశారు. భిక్షుక్ అని. హిందీ కవిత ఎలా మొదలవుతుందో గుర్తుంది.

    “వహ్ ఆతా, టూట్ కలేజే కో లేకర్,
    పఛ్ తాతా, పథ్ పర్ ఆతా…”

  9. సౌమ్య

    “ఇంతకుముందెప్పుడూ మీరు కనీవినీ ఎఱుగని విశ్వనాథ ఇతను! అవునంటారా కాదంటారా?”
    -Yes! Yes!
    పుస్తక పరిచయానికి ధన్యవాదాలు. నేను ఎప్పుడూ ఈ పుస్తకం గురించి వినలేదు…థాంక్స్!

Leave a Reply to కౌటిల్య Cancel