బేతవోలు రామబ్రహ్మం గారి “పద్య కవితా పరిచయం – నన్నయ నుంచి కంకంటి దాకా”

రాసిన వారు: విష్ణుభొట్ల లక్ష్మన్న
******************
పుస్తకం.నెట్ వారు ఈ నెలలో “తెలుగు పద్య సాహిత్యం” పై ప్రత్యేక దృష్టితో పుస్తక పరిచయాలూ, సమీక్షలూ, వ్యాసాలూ కావాలని కోరుతూ నన్ను కూడా నా వంతు కృషిగా ఏదైనా రాసి పంపమన్నారు. పద్య సాహిత్యం గురించి రాసే అర్హతలు నాకేమున్నాయి? జీవితంలో ఒక్క పద్యమైనా రాసినవాణ్ణి కాదు. అయినా ఈ వచ్చిన అవకాశాన్ని ఒక సవాలుగా తీసుకొని, నచ్చిన ఈ పుస్తకాన్ని ఈసారైనా వీలైనంత జాగ్రత్తగానూ, పూర్తిగానూ చదివి నా అభిప్రాయాలని, ఆలోచనలని మీతో పంచుకొనే సాహసమే ఈ ప్రయత్నం!

“మహా రచయితలందరూ మానవజాతి సంపద.”
ఇవి నా మాటలు కావు. గొప్ప తెలుగు కథా రచయిత రావిశాస్త్రి సమగ్ర సాహిత్యం పుస్తకంలో సంపాదకుల ముందు మాట. ఎంత నిజం. తెలుగు పద్య సాహిత్య కర్తలు తెలుగు జాతి సంపద. తెలుగు వచనమే చదవటం అరుదైన ఈ కాలంలో, పద్య సాహిత్యం ఎవడిక్కావాలి? ఈమాట కూడా మరీ నిజం. అలా అని పద్యం గురించి ఏమాత్రం తెలిసినా అది ఇతరులతో పంచుకోకపోటం మరీ మరీ అన్యాయం.

ఎవరికి….. ఎందుకు….

520 పేజీలు కల ఈ పుస్తకం వెనక అట్టపై ఉన్న ఈమాటలు మీకోసం.

“పద్య కవిత్వమంటే అభిమానం ఉండి, పద్యాలను చదివి అర్ధం చేసుకునే అభ్యాసమూ, శిక్షణా తగినంతగా లేని ఈనాటి సాహితీ ప్రియుల కోసం ఈ పుస్తకం. ప్రతిపదార్థ తాత్పర్యాల వ్యాఖ్యాన సంప్రదాయానికి భిన్నంగా సంభాషణా శైలిలో సరళ సుందరమైన వాడుక భాషలో రూపొందింది. పద్యంలో ఉండే అందచందాలనూ, కవితా మాధురులనూ, వాటిని ఆస్వాదించే పద్ధతులనూ – అన్నింటినీ ఆవిష్కరిస్తోంది ఇది.

వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న పద్యకవిత్వంలో నన్నయ నుంచి కంకంటి పాపరాజు దాకా ఇరవై మంది మహాకవుల కావ్యాల నుంచి ఒక్కొక్కటిగా రసవద్ఘట్టాలను మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారి మార్గదర్శకత్వంలో బేతవోలు రామబ్రహ్మంగారు ఎంపిక చేసుకొని సమగ్ర వివరణ సమకూర్చారు.

పీఠికలో చేకూరి రామారావుగారన్నట్టు ప్రాచీన కావ్యాలకు దూరమై నేటి సాహితీ యువతరం చాలా పోగొట్టుకుంది. కొందరిది బెరుకు. కొందరిది ఉలుకు. వాటిని తొలిగించే తొలిప్రయత్నం ఈ రచన.

ఇకపైని పద్యకవిత్వాన్ని ‘అసహాయశూరలమై’ ఆస్వాదించగలం – అనే విశ్వాసం పాఠకులకు కలిగించే గ్రంథమిది. వెలువడిన రెండేళ్ళకే పునర్ముద్రణకు వచ్చింది. అంతగా అందరి ఆదరణకు నోచుకుంది.”

పరిచయం చేయబడ్డ కవులు

కవిత్రయంతో మొదలయి – నన్నయ (కుమారాస్త్ర విద్యా సందర్శన), తిక్కన (కీచక వధ), ఎర్రన (సత్యా ద్రౌపదీ సంవాదము) – [కాల క్రమంలో నన్నయ తరవాత నన్నెచోడుడు (తీసుకున్న ఘట్టం కుమార సంభవం – పార్వతి తపస్సు)], మారన (మార్కండేయ పురాణము – వరూధినీ ప్రవర వృత్తాంతము), నాచన సోమన (ఉత్తర హరివంశము – జనార్దనుని రాయబారము), శ్రీనాథుడు (కాశీ ఖండము – గుణనిధి కథ), అనంతుడు (భోజరాజీయము – వసిష్ఠాగస్త్యోపాఖ్యానము), పోతన (ఆంధ్రమహా భాగవతము – నరకాసుర వధ), మొల్ల (మొల్ల రామాయణము), పెద్దన (మనుచరిత్ర – ప్రవర సిద్ధుల కథ), తిమ్మన (పారిజాతాపహరణము – ద్వితీయ), శ్రీకృష్ణదేవరాయలు (ఆముక్తమాల్యద – యామున రాజనీతి), ధూర్జటి (శ్రీ కాళహస్తి మహత్యము – పుండరీకోపాఖ్యానము), తెనాలి రామకృష్ణుడు (పాండురంగ మహత్యము – పుండరీకోపాఖ్యానము), పింగళి సూరన (రాఘవపాండవీయం – ప్రధమ), రామరాజ భూషణుడు (వసుచరిత్ర – గిరిక బాల్యం), పొన్నెగంటి తెలగన్న (యయాతి చరిత్ర – పురవర్ణన), చేమకూర వేంకటకవి (విజయ విలాసము – నాయికా వర్ణనలు)) తో పాటుగా చివరన కంకంటి పాపరాజు (ఉత్తర రామాయణము – సీతా పరిత్యాగము) పరిచయంతో పుస్తకం పూర్తి అవుతుంది.

ఆచార్య చేకూరి రామారావుగారి పీఠిక

ఈ పుస్తక పరిచయంలో ప్రాచీన సాహిత్యంలోని శోభ, కవిత్వ లక్షణాలు, కాలానుగతంగా మన సాహిత్యంలోని మార్పుల తీరుతెన్నులు ఎంత గొప్పగా ముచ్చటించబడ్డాయో, ఈ పుస్తకానికి పీఠిక రాసిన చేరాగారి మాటలు కూడా అంత గొప్పగా ఉన్నాయి. పాఠకులుగా మీకు నా ఉచిత సలహా. పుస్తకంలోని కవిత్వపు సొగసులు ఆస్వాదించే ముందు చేరాగారి పీఠిక చదవండి. ఒక్క సారి కాదు. రెండు, మూడు సార్లు చదవండి. ఎందుకంటే, ఈ పీఠిక మీలో ఈ పుస్తకం చదవాలనుకొనే ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. మీ కోసం ఈ పీఠికలోని కొన్ని వాక్యాలు ఇక్కడ ఇస్తున్నాను.

“ఏ జాతిలోనూ కనిపించని ప్రాచీన సంస్కృతి నిరాదరణ తెలుగు వాళ్ళలో కనిపిస్తుంది. వచన కవిత్వపు హోరుగాలిలో పద్య కవిత్వం బాగా చేవ ఉంటే తప్ప నిలదొక్కుకోలేక పోతున్నది. ఇటీవల వచన కవులను పలకరించి చూడండి. పద్యం, లయ, ప్రాస, అనుప్రాస వంటి భావనలు అర్థంకాని దశలో ఉన్నారు. గీత పద్యానికీ, కందపద్యానికీ తేడా చెప్ప లేని కవులూ, కవితా పాఠకులూ చాలా మంది ఉన్నారు. తెలియకపోటం దోషం కాదు. తెలుసుకో అక్కరలేదన్న అహంభావం విచారణీయం. ఆ అవసరాన్ని గుర్తు చేస్తే వాళ్ళ మీద విరుచుకు పడతారు. కొంతమంది తమ అజ్ఞానాన్ని సమర్ధించుకుంటూ వాదాలు చేస్తారు, వ్యాసాలు రాస్తారు. ఒక్కోసారి తిట్టు కవిత్వం రాస్తారు.

మన గతంలో ఉన్నవీ, జరిగినవీ గ్రహించటానికి ప్రాచీన సాహిత్యం చదవాలి. గతమంతా చెత్త కాదు. మంచి గతమున కొంచమైనా ఉంది. మానవ సంబంధాలూ, ప్రేమలూ, అనురాగాలూ, ఆప్యాయతలూ, ఈ కథల్లో కనిపిస్తాయి. వాటిని గ్రహించటంలో తప్పు లేదు. ఈ కథల్లో పాత్రలపై ఈ శతాబ్ది పూర్వార్ధంలో చాలా చర్చలు జరిగాయి. ఈ చర్చలు ఇంతగా జరగటానికి ఇవి జాతి సంస్కృతిలో భాగం కావటమే. అంతే కాదు, ఈ కథల్నుంచి గ్రహించిన ప్రతీకలను సాహిత్య స్రష్టలు రకరకాలుగా వాడుకున్నారు. పద్యాల్లో, పాటల్లో, కథల్లో ఇవి కనిపిస్తూనే ఉన్నాయి. అత్యాధునిక కవిత్వంలో కూడా ఈ ప్రతీకలు కనిపిస్తాయి. ఆ సాహిత్యమూ, ఆ చర్చలూ, ఈ ప్రతీకలూ అన్నీ మన సంస్కృతిలో విడదీయరాని భాగాలు. అందుకు ప్రాచీన సాహిత్యాన్ని పునఃపఠించాలి.

ప్రాచీన కావ్యాలు ఒక పట్టాన అర్ధంకావన్న మాట నిజమే. అర్ధం చేయించగల పండితులు ఇంకా ఉన్నారు. వాళ్ళల్లో కొందరు వ్యాఖ్యానాలు లేని కావ్యాలకు వ్యాఖ్యానాలు రాస్తున్నారు. తెలుగు సంస్కృతి పరిరక్షణకేర్పడ్డ తెలుగు విశ్వవిద్యాలయం వంటి సంస్థలు మందకొడిగా కాక చురుగ్గా చేయ్యాల్సిన పనులు ఇవి.”

అసలు విషయం

చిన్నప్పుడు 7, 8 ఏళ్ళ వయస్సులో స్కూల్లో చదువుకున్న ప్రార్థనా పద్యాలు, “తల్లీ నిన్ను తలంచి పుస్తకము చేతన్ బూనితిన్ …”, “ఎవ్వనిచే జనించు జగమెవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వరు మూలకారణంబెవ్వడు …” వంటి పద్యాల అర్ధాలు అప్పటికి తెలియకపోయినా తరవాత నేర్చుకున్న తెలుగు పాఠాల వల్ల ఈ పద్యాల అర్ధాలు కొంచెం కష్టపడితే తెలుసుకోవచ్చు. పోతన భాగవతం పద్యాలు అమెరికాలో మా ఊరిలో నా మిత్రునికి ఉన్న పద్య ప్రావీణ్యం వల్ల బాగానే అర్థమయ్యాయి. ఇప్పుడు మా ఊరిలో లేని ఆ మిత్రుని సహాయం లేకుండా పద్యాన్ని అర్ధం చేసుకోవటం ఎంత కష్టమో ఈ మధ్య నన్నయ భారతం చదువుదామని చేసిన ప్రయత్నంలో తేలిపోయింది.

పద్యాన్ని ఎలా చదివి అర్దం చేసుకోవాలి? అన్న ప్రశ్నకు సమాధానం ఈ పుస్తకం. ఎప్పుడో చిన్నతనంలో హైస్కూల్ చదువులో తెలుగు మాష్టారు చెప్పిన ప్రతిపదార్ధ తాత్పర్యాలు తప్ప మరెక్కువగా పద్యం గురించి తెలియని నాకు ఈ పుస్తకం, సొంతంగా పద్యం చదివి అర్ధం చేసుకొనే ఒక వీలుని కలగ చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇద్దరు, ముగ్గురు కవుల పద్యాలను ఈ పుస్తకంలో ఎలా అర్ధం చేసుకోవచ్చో ఇచ్చిన వివరణ మీ ముందుంచుతూ ఈ సమీక్షను పూర్తి చేస్తాను.

నన్నయ

“ఇప్పుడు నా ప్రియశిష్యుడు అర్జునుడు తన ధనుర్విద్యా కౌశల్యం ప్రదర్శిస్తాడు తిలకించండి” అని ద్రోణుడు ప్రకటించాడు. అర్జునుడు రంగంమధ్యంలోకి వచ్చాడు.

హరివిచిత్రహేమ కవచావృతు డున్నతచాపచారు దీ
ర్ఘోరుభుజుండు, భాస్వదసితోత్పల వర్ణుడు, సెంద్రచాప శం
సారుచి మేఘమో యనగ బాండవ మధ్యముడొప్పి బద్ధ తూ
ణీరుడు రంగమధ్యమున నిల్చె జనంబులు దన్నె చూడగన్.
6-17

అందమైన విచిత్రమైన బంగారపు కవచం ధరించాడు. ఆజానుబాహుడు. ఒక చేతిలో ఉన్నతమైన ధనస్సు ఉంది. మనిషి నల్లకలువల రంగులో తలతళలాడుతున్నాడు. పైరెండింటితో (విచిత్రహేమ కవచం, ఉన్నత చాపం) కలిసిన మొత్తం రూపం – హరివిల్లుతో, మెరపుతీగతో కలిసి ఉన్న నీలమేఘంలా ఉంది. వీపు మీద అటూ ఇటూ అంబులపొదులున్నాయి. పాండవ మధ్యముడైన అర్జునుడు ఇలా వచ్చి రంగమధ్యమంలో నిలబడితే ప్రజల చూపులన్నీ అతడి మీదే నిలబడ్డాయి.

అర్జునుడి రూపంలో ఉన్న ఉదాత్తతనీ, వీరోచిత దర్పాన్నీ, ఉన్నతినీ ఈ పద్యం సూచిస్తోంది. సమాస నిర్మాణంలో ప్రయోజనం నెరవేరింది. నడకలో ఠీవి స్ఫురిస్తోంది. వేటిని స్పురింప చెయ్యాలన్నా కవి చేతిలో ఉన్న సాధనాలు శబ్దార్థాలు మాత్రమే కదా! వాటిని సద్వినియోగం చేసుకొని వాచ్యార్థం కన్నా లోతైన అంశాలు స్పురింపజేయగలిగిన వాడే మహాకవి.

అర్జునుడు నల్లగా ఉంటాడని ఈ పద్యంలో తెలుస్తోంది. “కఱ్ఱి విక్రమంబు కాల్పనే” అని ద్రౌపది ఉద్యోగపర్వంలో అంటుంది. కఱ్ఱి అంటే నల్లనివాడు అని అర్ధం. ద్రౌపది కూడా నలుపే. ‘కృష్ణ ‘ అని ఆవిడకి పర్యాయపదం. శ్రీకృష్ణుడు సరేసరి నీలమేఘశ్యాముడు. ఇలా పాండవ పక్షంలో ముఖ్యులు ముగ్గురు నల్లనివారు.

ఇంద్రధనుస్సుతో మెరుపుతీగతో కలిసిఉన్న మేఘంలా ఉన్నాడు అర్జునుడు. వర్షఋతువులో కనపడవచ్చు ఇటువంటి దృశ్యం. ఇక్కడ మరొక విశేషం ఉంది. ఇంద్రచాపంతో కలిసిఉన్న మేఘంగా ఉత్ప్రేక్షించడం వల్ల అర్జునుడు ఇంద్రుని కుమారుడు అనే విషయం కూడా స్ఫురణకు వస్తుంది.

శ్రీనాథుడు

2002 సంవత్సరంలో డాలాస్‌లో ఇద్దరు స్నేహితులతో కలిసి వేసిన “చాటుపద్య రూపకం” ప్రదర్శనలో ఈ పుస్తకంలో ఉన్న శ్రీనాథుడి ఈ క్రింది పద్యం వాడుకున్నాం.

హరచూడా హరిణాంక వక్రతయు, కాలాంతః స్ఫురచ్చండికా
పరుషోద్గాఢ పయోధరస్ఫుట తటీ పర్యంత కాఠిన్యమున్‌,
సరసత్వంబును, సంభవించెననగా సత్కావ్యముల్‌ దిక్కులన్‌
చిరకాలంబు నటించుచుండు, కవిరాజీగేహ రంగంబులన్‌!
(భీమ 1-11)

(ఆహా! ఎంత అద్భుతమైన కల్పన! ఒక వంక హరచూడా హరిణాంకుడి వక్రత, మరో వంక ప్రళయకాల భీభత్సపు మహోత్సాహంతో బిగువెక్కిన చండికా పయోధరాల కాఠిన్యం ఎలా కలిపాడండీ ఈ రెండిటినీ!)

వక్రత కాఠిన్యం సరసత అనేవి తన కవితా గుణాలుగా శ్రీనాథుడు పేర్కొన్నాడు.

వక్రత గురించి అలంకారికులు రకరకాల అభిప్రాయాలను ప్రకటించారు. కట్టకడపటికి ఇది సౌందర్య పర్యాయం అయ్యింది. శబ్ద వక్రత – అర్ధ వక్రత అని ఇవి ప్రధానంగా రెండు విధాలు. శబ్ద సౌందర్యం అర్ధ సౌందర్యం ఉంటాయని. పైగా ఇది హరిణాంక వక్రత, చంద్రుని తాలూకు వక్రత. ఆ చంద్రుడు కూడా ఆకాశంలో ఉన్న చంద్రుడు కాదు. శివునికి శిరోభూషణంగా అలంకారంగా ఉన్న చంద్రుడు. అంటే శ్రీనాథుని కావ్యాలు శివపారమ్య స్థాపకాలనీ, ఆహ్లాదకరత్వం ప్రధాన లక్షణమనీ, అలంకార ప్రాధాన్యం వ్యంగ్యం.

కాఠిన్యం కూడా దారుశిలా కాఠిన్యం కాదు. స్తన కాఠిన్యం. అదీ చండికా స్తన కాఠిన్యం. అంటే భక్తిలోకి పర్యవసించే రక్తి అనుకోవాలి. స్తన కాఠిన్యం కనక అభాస మాత్రమే. శబ్ద యోజనలో ప్రౌఢి. అంతే కానీ అన్వయ కాఠిన్యం కాదు. అనేక శాస్త్రవిషయాలు ప్రస్తావనకు వచ్చినందువల్ల ఏర్పడే కాఠిన్యం కూడా! హృదయ విస్తార కారకం వక్రత అయితే బుద్ధి విస్తార కారకం ఈ కఠినత. పాఠకుణ్ణి వ్యుత్పన్నుణ్ణి చెయ్యడమనేది కూడా కావ్య ప్రయోజనాల్లో ఒకటి.

సరసత్వం అన్నింటికీ పైది పతాక రససహితత్వం, “రసప్రసిద్ధ ధారాధుని” అని శ్రీనాథుని ప్రసిద్ధి. ఏది చెప్పినా రసమహితంగా చెపుతాడు. రసోచితమైన కాఠిన్యం, రసోచితమైన వక్రత ఉంటాయని.

శ్రీనాథుడు ఆకాంక్షించినట్టుగానే అతడివి సత్కావ్యాలై కవుల ఇళ్ళల్లో, హృదయాల్లో చిరకాలంగా నటిస్తున్నాయి. నటిస్తాయి.

చివరిగా, బేతవోలుగారి మాటల్లో – “ప్రియ పాఠకులారా! ముందు పద్యం చదవండి. తరవాత వివరణ చదవండి. మళ్ళీ మరొక్కసారి అదే పద్యం చదవండి. అటుపైని – తరవాత పద్యంలోకి వెళ్ళండి. ఇది సూచన. ఇది అభ్యర్థన.”

పుస్తక వివరాలు
నా వద్ద ఉన్నది రెండవ ముద్రణ. ప్రచురణ కర్తలు అప్పాజోస్యుల – విష్ణుభొట్ల – కందాళం ఫౌండేషన్ (అమెరికా). వెల 100 రూ. అన్ని విశాలాంధ్ర బ్రాంచీలలో దొరుకును.
(ఇప్పటికీ ఈ పుస్తకం అమ్మకానికి దొరుకుతోందో లేదో నాకు తెలియదు).

గ్రంథకర్త వివరాలు (పుస్తకంలో ఇచ్చినట్లుగా) :
B. Ramabrahmam, School of Literature
Potti Sriramulu University
Rajahmundry Campus, Bommuru – 533 124
Phone: 0883 – 77372

You Might Also Like

8 Comments

  1. విష్ణుభొట్ల లక్ష్మన్న

    పదేళ్ళ క్రితం అమెరికాలో ఒక సాహితీ సభలో ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందర రామమూర్తి గారు తాను ప్రస్తుతం భారతం చదువుతున్నానని, అందులో తిక్కన్న గారి కవిత్వపు రీతులు గురించి ముచ్చటించారు. ఆ ముచ్చట్లలో తిక్కన్న గారి కవిత్వపు లోతులను మాతో పంచుకున్నారన్న జ్ఞాపకమే గాని ఆ వివరాలు ఇప్పుడు గుర్తుకు లేవు. గేయ రచయితకి భారతంతో పనేమిటా అనిపించింది అప్పుడు. సాంప్రదాయ సాహిత్యంతో మంచి పరిచయమున్నగేయ రచయితకి అద్బుతమైన సాహిత్య సృష్టి చెయ్యగల అవకాశం వస్తుందేమో!

    ఏది ఏమైనా కవిత్రయం భారతాన్ని స్వయంగా చదివి ఆనందించగల అవకాశం, అదృష్టం ఈ జన్మకొస్తే అంతే చాలు!

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  2. తాడేపల్లి హరికృష్ణ

    ఏ సాహిత్యంలో నైనా రాత కన్నా పాట ముందుగా పుట్టిందని ఎక్కడో చదివినట్లు గుర్తు. అలాగే వచన వాజ్మయానికి తల్లి పద్యవాజ్మయం. పుస్తకాలసలు చదివే అలవాటే మృగ్యమైపోతున్న కాలంలో, పద్యం స్థితేమిటా అని బాధ పడక తప్పదు. పద్య సాహిత్యాన్ని కాదనే వారందరూ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. రాత కోతలు, రాత సాధనాలు అంత విరివిగా అందరికీ అందుబాటులో లేని కాలంలో సాహిత్యాన్ని పారంపరికంగా ఈనాటికి నిలబెట్టినవి పద్యాలు. ఓక పద్యాన్ని కాగితం మీద ఎంత చదివినా మరో రోజుకి గుర్తుండదు. ఆదే రాగ యుక్తంగా, భావయుక్తంగా ఎవరన్నా పాడితేనో, అది ఆజన్మాతం మరిచిపోలేము. పూర్వపు కవులు ఆశువుగా పద్యాలు చెప్పడంలో గల మర్మమిదేననుకుంటాను. భావుకత, అభివ్యక్తి ఉన్న కవికి యతి, ప్రాస, లయలు కూర్చి పద్యాలు పాడటం సులువుగా అమరుతుందని నా అనుమానం. శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, సినిమా సంగీతం పాడే వారు అనేకులున్నారు ఈరోజుల్లో. కానీ పద్యాలు పాడగలిగిన వారు ప్రస్తుత తరంలో (అంటే 1940 కి ఇటీవల పుట్టిన వాళ్ళలో) ఆట్టే కానరారు.

    70 ల దశకంలో హైస్కూలుకి (అందునా ప్రభుత్వ తెలుగు మీడియం హైస్కూళ్ళకి) వెళ్ళడం వల్ల, పద్యాలు అద్భుతంగా పాడి వినిపించ గల తెలుగు ఉపాధ్యాయుల క్లాసుల్లో కూర్చోగలిగాను. సినిమల్లో సకృత్తుగా ఘంటసాల, మాధవపెద్ది, నాగయ్య, సుశీల గార్ల వంటి వాళ్ళు పాడిన పద్యాలు అమృతప్రాయాలు.

    – తాడేపల్లి హరికృష్ణ

  3. కొత్తపాళీ

    పద్య కవిత్వమంటే ఆసక్తి ఉండి, స్వయంగా పద్యాలు చదువుకోడానికి భయపడే (నాలాంటి) వాళ్ళకి ఈ పుస్తకం ఒక గొప్ప వరం.
    మొదటి కారణం .. ఒక్కటే కావ్యం కాక పలువురు కవుల పలు కావ్యాలు పరిచయం చేశారు.
    రెండోది – రాసిన శైలి .. టీకా తాత్పర్యంలాగా కాకుండా, అక్కడ కావ్య కథని సరళ వచనంలో చెప్పుకొస్తూ, మధ్య మధ్య పద్యాలు ఉదహరించి, ఒక్కో పద్యంలో భాషకి సంబంధించి, వాడుకలో, అలంకారాల్లో ఏమేమి చమత్కారాలు, విశేషాలున్నయ్యో చక్కగా కథలాగా చెప్పుకొస్తారు.
    ఒక్క మాటలో చెప్పాలంటే హైస్కూలు తెలుగు క్లాసు ఇలా జరిగి ఉండాలి అనిపిస్తుంది.

    అన్నిటికంటే ముఖ్య కారణం. పుస్తకం అంతా ఒక్కసారి చదివెయ్య నక్కరలేదు. మెల్లమెల్లగా ఆస్వాదించి జీవితమంతా చదూకోవచ్చు.

  4. mohanramprasad

    మంచి పుస్తకానికి మంచి పరిచయం.నెనరులు.

  5. నరసింహారావు మల్లిన

    చాలా మంచి పుస్తకం. చాన్నాళ్ళ క్రితమే కొన్నాను. కొంతవరకూ చదివాను కాని పూర్తి చెయ్యలేదు. సమయం దొరకబుచ్చుకుని పూర్తి చెయ్యాలనిపించింది మీ అందమైన పరిచయం. ధన్యవాదాలు.

  6. విష్ణుభొట్ల లక్ష్మన్న

    రవి గారూ:

    మీ అభ్యంతరాలతో ఏకీభవిస్తున్నా! అయినా ఇది ఒక గొప్ప పుస్తకం అన్న విషయంతో కూడా ఏకీభవిస్తున్నా!

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  7. chitra

    “పుస్తకంలోని కవిత్వపు సొగసులు ఆస్వాదించే ముందు చేరాగారి పీఠిక చదవండి. ఒక్క సారి కాదు. రెండు, మూడు సార్లు చదవండి. ఎందుకంటే, ఈ పీఠిక మీలో ఈ పుస్తకం చదవాలనుకొనే ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది’.

    మీరు పుస్తకాన్ని యెంతొ చక్కగా పైన మీరు చెప్పిని విధముగా ఆసక్తి పెరిగేలా పరిచయము చేసారు. ధన్యవాదాలు

  8. రవి

    ఈ పుస్తకం విశాలాంధ్రలో దొరుకుతుందండీ.నేను కొన్నాను. రెండవభాగం కూడా రాబోతోందని వ్రాశారు, పుస్తకంలో.

    ఈ పుస్తకం గురించి ఒకట్రెండు చిన్న ఫిర్యాదులు. పుస్తకంలో వాడిన ఫాంట్ కాస్త ఇబ్బందికరంగా ఉంది. అలాగే మధ్యలో ఒకచోట పేజీలు తారుమారయ్యాయి.

    ఆ చిన్న మచ్చలు వదిలేస్తే, ఇదొక అద్భుతమైన పుస్తకం. ఎక్కడ అయిపోతుందో అని దాచుకుని, కాస్త కాస్త చదువుతున్నాను నేను.

Leave a Reply