శతకసాహిత్యపఠనం-నా అనుభవాలు

చిన్నప్పుడు స్కూల్లో తెలుగులో ఏనుగు లక్ష్మణకవి రాసిన సుభాషితాలు, బద్దెన సుమతీశతకం, వేమన శతకం ; సంస్కృతాన భర్తృహరి సుభాషితాలు – ఇలా ప్రతి నీతిశతకం నుండీ ఏదో ఒకటి, ఎంతో కొంత పాఠ్యాంశంగా చదువుకుని ఉండటంవల్ల, వీటి గురించిన కుతూహలం ఉండేది. అయితే, ఇంట్లో ఉన్న ’టీకాతాత్పర్య సహితాలు’ అయిన వివిధ శతకాలను ఓసారి ప్రయత్నించి చూడాలి అన్న సాహసం ఎప్పుడూ చేయలేకపోయాను. పద్యాలు నాకు అందని ద్రాక్షలు అన్న భావనలో ఉన్నా కనుక, అవి పుల్లగా ఉంటాయని ఫిక్సయాను. ఈమధ్య హైదరాబాదొచ్చినపుడు ఇంట్లో ఈశతకాల పుస్తకాలు కనబడితే ఇవి తిరగేస్తూ ఉంటే అర్థమైంది – అవి నిజంగా పిల్లలు చదూకోడానికి ఉద్దేశించి, తేలిగ్గా అర్థమయ్యేలా రాసారని. పోయిన ఫోకస్ కి రాసి ఉండాల్సిన వ్యాసమేమో, కానీ, ’పద్య సాహిత్యం’ అన్నారు కనుక, ఇప్పుడు కూడా రాసేయొచ్చని రాస్తున్నా.

గమనిక: నాకాట్టే గ్రాంథికం చదవడానికి అర్థంకాదు. కనుక, అర్థాలు తెలుసుకోవడంలో ఏమన్నా పొరపాట్లు దొర్లి ఉంటే క్షమించగలరు. అలాగే, ఇక్కడ వ్యాఖ్య రాసి సవరించగలరు. అలాగే, బండి ర బరహాలో ఎలా టైపాలో రాలేదు 🙁

కృష్ణశతకం

దాదాపు రెండేళ్ళ క్రితం చదివినట్లున్నా. నాకు అప్పట్లో తెగ నచ్చేసింది. ఇంత సులభంగా అర్థమయ్యే భాషలో రాసి ఉంటారని తెలిసుంటే అప్పుడే చదివిఉండేదాన్ని కదా అనిపించింది. దీని గురించి ఇదివరలో వివరంగా బ్లాగు రాసాను. (లంకె ఇక్కడ). అప్పట్లో ఇది నాకెంత నచ్చిందంటే, సరాసరి వికీసోర్సులో కృష్ణశతకం టైపింగ్ చేస్తున్న వారితో కలిసిపోయి డేటాఎంట్రీ కూడా చేసేసా. “దేవకిపుత్రా ననుఁ గావు నీకుఁ బుణ్యము కృష్ణా” – వంటి ప్రయోగాలు కొన్ని నచ్చాయిందులో.
[కృష్ణశతకం, నరసింహ కవి, టీకా: చెన్నుభట్ల వేంకట కృష్ణశర్మ,బాలసరస్వతీ బుక్ డిపో-వికీసోర్సు లో చదివేందుకు లభ్యం]

కుమార శతకం

ఇటీవలే కుమార శతకం చదివాను. ఇది పక్కి అప్పల నరసయ్య చే- 1860 ప్రాంతంలో రచించబడినది. “కుమారా….” అన్నది దీని మకుటం. ఇది పెద్ద గొప్పగా ఏమీ లేదు. కాకపోతే, భాష తేలిగ్గా అర్థమౌతుంది. కృష్ణశతకం కూడా చాలా తేలిగ్గా అర్థమౌతుంది. అందులో పెద్ద గొప్ప తత్వాలు, బుద్ధులూ కూడా లేవు. అయినప్పటికీ – కృష్ణశతకం పఠనానుభవం నాకు నచ్చింది. కుమార శతకం విషయానికొస్తే, ఇది ప్రధానంగా నీతిశతకం. అందులోనూ – చర్వితచరణంలా – కొన్ని నీతులు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. కొన్ని వేరేదో శతకాల్లో ఇదివరకే చదివి ఉంటాము.

ఇందులో, చదువుతూ ఉండగా, సరిగ్గా యాభై నాలుగో పద్యానికి రాగానే – నొస్టాల్జియా తన్నుకొచ్చింది. కారణం – అది స్కూలు రోజుల్లో పాఠ్యాంశంగా ఉండటమే –
“సద్గోష్ఠి సిరియునొసఁగును
సద్గోష్ఠియె కీర్తిబెంచు సంతుష్ఠిని నా
సద్గోష్ఠియె యొనగూర్చును
సద్గోష్ఠియె పాపములను జంపు కుమారా”

– ఇదే ఆ పద్యం.

ఒకట్రెండు పద్యాలు నాకైతే అయోమయంగా అనిపించాయి –
“ప్రజ్ఞావంతుని చేతను
ప్రజ్ఞాహీనునకు గడమ వాటిల్లు నిలన్
బ్రాజ్ఞతగల్గి నటించిన
తజ్ఞులు నుతియింతు రదియె ధనము కుమారా”

-తెలివిగలవాడివల్ల తెలివిలేనివాడికి ఏం సమస్య వస్తుంది? ప్రాజ్ఞతతో ఉంటే – పెద్దలు మెచ్చుకుంటారు, అదే ధనము వంటిది – అన్న రెండో భాగం ఓకే కానీ, వీటి రెంటికీ సంబంధం ఏమిటో – ఇంతవయసొచ్చి నాకే అర్థం కాలేదంటే – పిల్లలకి అర్థమౌతుందా? అని నా సందేహం.

అయితే, ఇలాంటి great expectations పక్కన పెడితే, పిల్లలకి భాష నేర్పేసమయంలో కుమారశతకాన్ని చదివించడం మంచిదే అనుకుంటా. కానీ, చదవగానే గుర్తుండిపోయే పద్యాలు తక్కువ. మాటల్లో రిథం లేకపోవడం ఇందుకు కారణం కావొచ్చు. పిల్లల పదసంపద పెరిగేందుకు, తమని తాము పరీక్షించుకునేందుకు ’కుమార శతకం’ చదవొచ్చేమో.
[కుమార శతకం, పక్కి అప్పల నరసయ్య ప్రణీతము, టీకా: విద్వాన్ దండిపల్లి వేంకటసుబ్బాశాస్త్రి, బాలాసరస్వతీ బుక్ డిపో-వికీసోర్సు లో చదివేందుకు లభ్యం]

నారాయణ శతకం

దీనికి టీకా తాత్పర్యాలున్న పుస్తకం దొరకలేదు. అలాగే చదివేద్దామను సాహసించాను. ’పండితులచేఁ బరిష్కరింపఁ బడినది’ అని ఉందే తప్ప ఎవర్రాశారో ఈ పుస్తకంలో లేదు. పోతన రాసినదని గూగుల్ చెప్పింది! కానీ, మొదటి పది పద్యాలు చదివేసరికే – నిజంగా పోతన రాసినదా? అని సందేహం మొదలైంది. (విజ్ఞులు ఇక్కడ్నుంచి రెండు లైన్లు నా అజ్ఞానాన్ని మన్నించండి. – పోతన వచ్చి నేను పాపిని, క్రూరుణ్ణి – నన్ను క్షమించు నారాయణ… నేను దుష్టుణ్ణి, కామాంధుణ్ణి – ఇలా అంతా రాస్తూ ఉంటే… కొంచెం అవాక్కయ్యాను. అదేమిటి? ఆయన జెంటిల్మెన్ తరహానే కదా. ఎందుకిదంతా రాస్తున్నారు? అని). పైన చెప్పిన కృష్ణశతక కర్త పద్యాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తుంది కానీ – ఆయన ఎలాంటివాడు? అన్నదానిపై నాకు ఏమీ తెలీదు కనుక – ముందు అలా ’పాపి’గా ఉండి భక్తుడయ్యాడేమోలే అని సరిపెట్టుకున్నాను. కానీ, పోతన గారి సంగతి మరి? లేదంటే – దేవుడిపై రాసే శతకాల తీరే అంతా?

కాసేపు ఇలా అయ్యాక – ఇక పద్యాంశాలు వేదాంతం వైపుకి మళ్ళాయి. అది మామూలుగా ఒక వేదాంతి ’నానాటి బ్రతుకూ నాటకమూ’ అని అనుకుంటూ, దేవుణ్ణి తలుచుకునే తరహావి. నీతి పద్యాలు కూడా ఉన్నాయి – సద్గుణవంతుని లక్షణాలు, దైవభీతీ బోధించేవి. ఇక్కడ కూడా భాష చాలావరకు సులభంగా ఉంది. నాబోటి మామూలు తెలుగు మాత్రమే తెలిసినవారికి టీక ఉండి ఉంటే, ఇంకా బాగుండేది ఏమో. కొన్ని కవితలు సీక్వెన్స్ లో చదివితే చాలా ఆకర్షణీయంగా అనిపిస్తాయి.

ఆ బ్రహ్మమందె పుట్టు -విశ్వంబు నాబ్రహ్మమందె యుండు
నా బ్రహ్మమందె యణఁగు -నదె చూడు మని చూపు నారాయణా || [86]

అది సచ్చిదానందము -అది శుద్ధ మది బద్ధ మది యుక్తము
అది సత్య మది నిత్యము -అది విమలమని తెలుపు నారాయణా || [87]

– ఈ భాగంలో వచ్చే నాలుగైదు పద్యాలయితే, ఒక విధమైన లయతో, ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇలా బ్లాక్స్ లో ఆకట్టుకునే పద్యాలు ఇందులో ఎక్కువున్నాయి, పై రెండు శతకాలకంటే.

[నారాయణ శతకం, పోతన, బాలసరస్వతీ బుక్ డిపో-టాగూరు పబ్లిషింగ్ హౌస్ – వికీసోర్సు లో చదివేందుకు లభ్యం]

సుమతీ శతకం

నీతి, భక్తి వగైరా శతకాలన్నింటిలోకీ స్కూలు రోజుల్లో నాకు బాగా పరిచయమున్న శతకాలు – సుమతీ శతకం, వేమన శతకం. అయితే, ఒక కలెక్షన్ గా దీనిని చదవడం ఇదే ప్రథమం.
“శ్రీరాముని దయచేతను
నారూఢిగా సకల జనుల నౌరా యనఁగా
ధారాళమైన నీతులు
నోరూరఁగ జవులు పుట్ట నుడినెద సుమతీ”

– 🙂 ఇదీ ఈ శతకం మొదటి పద్యం. కంద పద్యమట. ఇక చూస్కోండి – ముంబై ఎక్స్‍ప్రెస్ గా, రయ్యిన దూసుకెళ్ళడమే.
పైనున్న అన్నింటికంటే – ఇందులో ఉన్న పద్యాలు చదువుకోడానికి బాగున్నాయి. తేలిగ్గా గుర్తించుకునేలా ఉన్నాయి కూడా. మన ఎరుకలో ఉన్న పద్యాలు – ’ఉపకారికి నుపకారము’, ’కనకపు సింహాసనమున’, ’అక్కరకు రాని చుట్టము…’ : ఇలా ఎన్నో పద్యాల్లోంచి కొన్ని లైన్లు సామెతల్లా జనం నోళ్ళలో ఇప్పటికీ నానుతున్నాయంటే, సుమతీ శతకం మన జీవితాల్లోకి ఎంతగా చొచ్చుకుపోయిందో వేరే చెప్పాలా? అలాగే, ఇందులోని పద్యాలు చాలా మటుకు తేలిగ్గా గుర్తుపెట్టుకోడానికి అనువైనవి. అందుకే జనాల నోళ్ళలో నానాయి కాబోలు. ఈ సందర్భంలోనే – అప్పిచ్చువాడు వైద్యుడా?, వైద్యుడు అప్పిస్తాడా? – అన్న నా చిరకాల సందేహం తీరింది –
“అప్పిచ్చువాఁడు వైద్యుఁడు
నెప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడున్
చొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ”
(ఏడో పద్యం.)
– అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడూ ప్రవహించే నది, ద్విజుడు – ఉన్న ఊరిలో ఉండు. ఇవి/వీళ్ళు లేని ఊరిలో నివసించకు అని అర్థం అనమాట. కామా – ఎందుకవసరమో ఇప్పుడు తెల్సింది!! 🙂
[సుమతీ శతకం, బద్దెన, టికా తాత్పర్యం: చెన్నుభట్ల వేంకట కృష్ణశర్మ, బాలసరస్వతీ బుక్ డిపో, వికీసోర్సులో చదివేందుకు లభ్యం]

భాస్కర శతకం

భాస్కర శతకం నుండి కూడా ఒకట్రెండు పద్యాలు స్కూల్లో చదువుకున్న గుర్తు. ఈ పద్యాలన్నీ వరుసగా అక్షరక్రమంలో రాయబడ్డం దీని ప్రత్యేకత. ఇప్పటిదాకా చదివిన మిగితా శతకాలతో పోలిస్తే, దీన్లోని భాషతో కొంచెం కష్టపడ్డాను. భాష అర్థం కాదని కాదు – కొంచెం సమయం దానిపై వెచ్చించాలంతే. దీనికి కూడా చాలామటుకు టిక అనవసరమే ఏమో. అక్కడక్కడా కొన్ని పదాలు అర్థం కాలేదు. అంతే. ఇది నాబోటి వారి భాషకు, మంచి పరీక్ష అనమాట. నాకొచ్చిన అరకొర తెలుగుతో పదాలను అర్థం చేసుకోవడం, ఆపై టీకా చూసి దాన్ని వెరిఫై చేస్కోడం – బాగా సరదాగా ఉండింది. దీని రచయిత ఎవరు అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలీదట!! మారయగారి వెంకయ్య ఈ శతకకర్త అని ఒక కథ ప్రచారంలో ఉంది.

ఆ కథ: ఒక బ్రహ్మణుడికి ఇద్దరు కొడుకులుండేవారట. అన్న పండితుడు, తమ్ముడు తుంటరి. ఒకానొక సమయంలో తమ్ముణ్ణి ఇంట్లో అన్నో/వదినో/ఎవరో తిడితే, ఇతను ఇంట్లోంచి వెళ్ళిపోయి, దేశసంచారం చేసి పండితుడై తిరిగొచ్చాడట. అన్న ఇతను పండితుడైన విషయం నమ్మలేక, ఒక పోటీ పెట్టాడట – తాను పద్యంలో మొదటి రెండు పాదాలు చెబుతాననీ, తమ్ముడు తన లోకజ్ఞానం సాయంతో మిగితా రెండు పాదాలు పూరించాలట. ఇలా భాస్కర శతకం పుట్టింది అని ఆ కథ చెబుతుంది. ఇది నిజమో కాదో, నాకు తెలీదు కానీ, ఈ పద్యాలు అలాగే ఉంటాయి – ఒక నీతి – దానికి నిజజీవితాల్లోని ఉదాహరణ .. ఈ చందాన.

అన్నట్లు, ఈ శతకంలో నన్నాకర్షించిన పద్యం ఒకటుంది:
“తనకు ఫలంబు లేదని యెదం దలఁపోయడు కీర్తి గోరు నా
ఘనగుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మే
లనుకుని పూను; శేషుఁడు సహస్రముఖంబుల గాలిగ్రోలి తా
ననిశము మోవఁడే మరి మహాభరమైన ధరిత్రి భాస్కరా”
(నలభై ఎనిమిదో పద్యం).
-ఆదిశేషుడు భూమిని మోస్తే, మరి విష్ణువు స్వర్గంలో ఉండడా? ఆయన భూమి కింద ఉంటాడా? [నాకు ఆట్టే పురాణ కథల గురించి అవగాహన లేదు లెండి].
[భాస్కర శతకం, టీకాతాత్పర్యం: చెన్నుభట్ల వేంకట కృష్ణశర్మ, బాలసరస్వతీ బుక్ డిపో, వికీసోర్సులో లభ్యం]

నరశింహ శతకం

ఈకవి పేరు శేషప్ప కవి, ఇతను 1800కి పూర్వం వాడట. దీని వ్యాఖ్యాత పి.సి.వెంకటరాములు – “నాకు భాషాజ్ఞానం లేదు, కవిత్వం అర్థం కాదు…” అంటూ ముందుమాట మొదలుపెట్టారు. ఆయన చిన్నతనంలో రోజూ వాళ్ళమ్మ ఇది చెప్పించేవారట. అందువల్ల ఆయనకి ’నరశింహ శతకం’ ఒంటబట్టిందట. శతకం లోని భాష చాలా సులభంగా ఉంది. ఈయన రాసిన వ్యాఖ్యానాలు నేను చదవలేదు. ఒక్కో పద్యానికీ రెండు పేజీల వ్యాఖ్యానం ఉండి, అందులో – భగవద్గీత, ముకుందమాల, రామాయణం, పోతన భాగవతం – ఇలాంటి వాటి నుండి ఉదాహరణలు తీసుకోవడంతో భయపడ్డాను. అయితే, ఇందులోని పద్యాలు చాలావరకు వాటిలోని పద్యాల భావాలను పోలి ఉన్నాయి. ముఖ్యంగా, ఇందులో ఉదహరించిన భాగవతం పద్యాలు చూశాక – లాంగ్ టర్మ్ ప్లాన్స్ లో పోతన భాగవత పఠనం ని చేర్చక తప్పలేదు. ఇక ఈ శతక పద్యాలు సీసపద్యాలు, ఫాలోడ్ బై తేటగీతి. (ఇలాంటి రచనల్ని ఏమంటారో నాకు తెలీదు). “భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!” అన్న మకుటంతో ముగుస్తాయి పద్యాలన్నీనూ.

ఇందులో కొన్ని ఆసక్తికరమైన ఆలోచనలున్నాయి. నవ్వొచ్చింది చదువుతూ ఉంటే. భక్తి, నీతి, దేవుణ్ణి బెదిరించడం (నిజం.. :)), దేవుణ్ణి టీజ్ చేయడం -ఇవన్నీ భక్తి పద్యాల్లో కనిపిస్తూనే ఉంటాయి కదా… అలాగే ఇదీనూ.
[నరశింహ శతకము, శేషప్ప కవి, వ్యాఖ్యానం: పి.సి.వెంకటరాములు, వెంకటేశ్వర ప్రింటింగ్ ప్రెస్-కర్నూలు –వికీసోర్సులో ఉంది]

ఈదఫాకి చివరిది – దాశరథీశతకం

దీని గురించి కూడా స్కూలు రోజుల్లో చూసినట్లే గుర్తు. ’దాశరథీ, కరుణాపయోనిధీ..’ అన్న మకుటం గుర్తుంది కానీ, శతకం ఇప్పుడు చదువుతూంటే మాత్రం ఒక్క పద్యం కూడా చదివినట్లు అనిపించలేదు. భక్తి శతకం. కానీ, భాష మిగితా శతకాలంత సులభంగా లేదు. ’భాస్కర శతకం’ తరహాలో ఉంది 🙂 ఒకచోట వరుసగా – దశావతారాల్లో కొన్నింటి వర్ణన చేస్తారు – ఆ భాగం నాకు చాలా నచ్చింది. పిల్లలకి ఈపద్యాలకి వీడియో జోడించి చూపిస్తే, వారికి మంచి అవగాహన కలుగుతుందేమో… (వీడియో – బాపు గారి సీతాకల్యాణంలా, రామాయణంలా, సాఫీగా ఉంటేనే సుమా!)

అయినా, అది అటు పెడితే, దీనికి రాసిన ప్రతిపదార్థాలు రాసినంత బద్ధకంతో రాయడం ఎప్పుడూ చూడలేదు. దాశ…నిధీ : అనేసి, దీనికి అర్థం రాస్తారు. అది మకుటం కదా, అనకండి. అలా phrases గా, వాక్యాలుగా – కలిపేసి, దానికి అర్థం చెప్పడమే ప్రతిపదార్థం, ఈ పుస్తక వ్యాఖ్యాతకి! మళ్ళీ తాత్పర్యం అని వేరే పెట్టి – ఈ strings concatenate చేసారు. ఇలా చేస్తే, ఇది – ఆ శతక పఠనానికి ఒక గైడ్ కాగలదా అసలు?? బాగా భాషపై పట్టు ఉన్న వారు మాత్రమే చదివేందుకు అనువుగా ఉంది ఆ ప్రతిపదార్థం రాసిన తీరు – బాగా భాష ఎరిగిన వారికి ఎలాగో అది అనవసరం. బ్రౌన్ నిఘంటువు తోడు పెట్టుకుని, నా తిప్పలేవో పడుతూ, ఈ వ్యాఖ్యానంతో పాటు, ’ప్రతి పద’ అర్థాన్ని కూడా తెలుసుకుంటూ చదువుకున్నాను. అలాగే, శతకాల వ్యాఖ్యానం, సులభంగా చదువుకోడానికి రాస్తున్నవారు – ఈ విషయంతో పాటు, అసలు శతకకర్త గురించి, శతకం గురించీ – కొంత నేపథ్యం కూడా చెప్పి ఉంటే బాగుండేది. (రాబోవు కాలంలో ఈశతకాలను ముద్రించేవారు ఈ విషయం దృష్టిలో ఉంచుకుంటారని ఆశ…)
(దాశరథీ శతకం, బాలసరస్వతీ బుక్ డిపో, వ్యాఖ్యానం: దండిపల్లి వెంకట సుబ్బాశాస్త్రి, వికీసోర్సులో చదివండిక్కడ)

ఆతరువాత కుతూహలం కొద్దీ గూగుల్లో వెదుకుతూ ఉంటే – ’హైదరాబాదు బిర్లామందిర్ వెంకటేశ్వర స్వామి శతకం’ తోసహా, రకరకాల పేర్లు కనబడ్డాయి. ’లలిత శతకం’ అన్న పుస్తకం ఒకటి ఇంట్లో కనబడ్డది కానీ, ఆసరికే శతకపఠనంలో రెండ్రోజులు విరామం వచ్చేసరికి – లైట్ తీస్కున్నాను. వేమన పద్యాలు కూడా మొదలుపెట్టి – రెండు మూడు వ్యాఖ్యానాలు కనబడ్డంతో (ఆరుద్ర, ఎన్.గోపి, మరొకరిది) తర్వాత చూద్దాం లెమ్మని ఆపాను. కనుక ఒక వేళ మరిన్ని శతకాలు (శంకర శతకం, కవి చౌడప్ప శతకం, కొన్ని అధిక్షేప శతకాలు – వంటివి దొరికినా చదవలేక చేతులెత్తేశా ప్రస్తుతానికి) చదివితే, మరోసారి ఇలాంటి వ్యాసంతో మీ ముందుకొస్తా..

ఓ..బైదివే: ఆ మధ్య వాళ్ళెవరో వీటి గురించి బ్లాగులో రాస్తూ ఉంటే – ’అబ్బ చా! నువ్వంత మేధావివా? ఒకసారి చదివితే నీకు అంతా కరతలామలకం ఐపోతుందా?’ అని వ్యాఖ్య రాసారు (అబ్యూస్ ఆక్ట్ కింద స్పాం చేశా లెండి) . కరతలామలకం కాలేదు. జనరల్ గా చదివానని చెప్తున్నా అంతే. ఈలెక్కన, జన్మకి నేనొక్క పుస్తకం మాత్రమే చదవగలను – అలా మొత్తానికి మొత్తం అక్షరమక్షరం కరతలామలకం కావాలంటే. ఏదో అర్భకప్రాణిని. ఇలా బ్రతకనివ్వండి.

You Might Also Like

7 Comments

  1. samputi Admin

    మరికొన్ని శతకముల కొరకు ఈ క్రింది లింకుని చూడండి.
    http://www.samputi.com/launch.php?m=home&l=te

  2. నరసింహారావు మల్లిన

    ఇంకా కొన్ని శతకాల పేర్లు ( ఓ శతక పుస్తకం లోని పీఠిక నుంచి గ్రహింపబడినవి )
    1.రంగశాయి శతకం (మంచెళ్ళ వాసుదేవ కవి)
    2.బళిర కరివేల్పు శతకం
    3.సింహాచల నారసింహ శతకం ( శ్రీమదజ్జాడాదిభట్ల నారాయణ దాసు గారు )
    4.రామలింగేశ్వర శతకం ( ఆడిదము సూరకవి )
    5.కుక్కుటేశ్వర శతకం (కూచిమంచి తిమ్మకవి )
    6.చంద్రశేఖర శతకం
    7.దత్తయోగీంద్ర శతకం (బండ్లపాటి కొండయకవి )
    8.జానకీరామ శతకం ( కొటికలపూడి కోదండరామకవి 300 పద్యాలు )
    9.అంబికా శతకం ( రావిపాటి తిప్పన్న )
    10.వేంకటేశ్వర శతకం ( తాళ్ళపాక అన్నమయ్య )
    11.కలువాయి శతకము
    12.గోరంట్ల మాధవ శతకము
    13.లావణ్య శతకము (పోలిపెద్ది వెంకటరాయ కవి )
    14.భోగినీ శతకము (కాళహస్తి సుబ్బరాయ కవి )
    15.కుమారీ శతకము
    16.మానినీ శతకము
    17.సదానందయోగి శతకము ( సదానంద యోగి )
    18.శివముకుంద శతకము ( పరమానంద యోగీంద్రుడు )
    19.సంపంగిమన్న శతకము ( పరమానంద యోగీంద్రుడు )
    20.పొగచుట్ట శతకము
    21.పకోడీ శతకము
    22.చీపురుపుల్ల శతకము
    23.విసనకర్ర శతకము
    24.పిల్లి శతకము
    25.ఆంధ్ర నాయక శతకం ( కాసుల పురుషోత్తమ కవి )
    26.సింహాద్రి నారసింహ శతకము ( గోగులపాటి కూర్మనాథ కవి )
    27.భద్రగిరి శతకము ( భల్లా పేరయ్య కవి )
    28.విశ్వేశ్వర శతకము (వేల్పూరి విస్సన్న )
    29.కృష్ణమూర్తి శతకము ( నరహరి రాజామణి సెట్టి )
    30.హరిహరేశ్వర శతకము ( శ్రీ మండపాక పార్వతీశ్వరశాస్త్రి )
    31.బిల్పేశ్వర శతకము ( కొక్కొండ వేంకటరత్నం పంతులు )
    32.కామేశ్వరీశతకము ( దివాకర్ల వేంకటశాస్త్రి )
    33.ముకుంద రాఘవ శతకము ( జూలూరి లక్ష్మణ కవి 200 పద్యాలు )
    34.ప్రసన్న రాఘవ శతకము ( వంగూరి ముద్దు నరస కవి 200 పద్యాలు )
    35.లవకుమార శతకము ( వద్ది తాతయ్య కవి )
    36.కుమార శతకము ( శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి )
    37.కుమారీ శతకము ( శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి )
    38.భర్గ శతకము ( కూచిమంచి తిమ్మకవి )
    39.భక్తమందార శతకము ( కూచిమంచి జగ్గకవి )
    40.కవి చౌడప్ప శతకము ( కవి చౌడప్ప )
    41.వేణుగోపాల శతకము ( పోలిపెద్ది వేంకటరాట కవి )
    42.మదన గోపాల శతకము ( కోలంక వేంకట కవి )
    43.గువ్వలచెన్న శతకము
    44.సర్వేశ్వర శతకము ( యథావాక్కుల అన్నమయ్య )
    45.వృషాధిప శతకము ( పాల్కురికి సోమన )

    1. Sri rama harish

      వాటి పిడిఎఫ్ లు ఉంట లింక్స్ పోస్ట్ చేయండి సార్

  3. మెహెర్

    బాగా రాసారు.

    “భాష” “నాబోటి” “భాష” “నాబోటి”… మీ భాషకేం వచ్చింది, బానే వుంది. 🙂

    వేమన పద్యాల మీద ఆరుద్ర వ్యాఖ్యానం ఉందన్నారు పుస్తక రూపంలోనా? సాప్ట్‌కాపీనా?

    (btw, బరహాలో rx అని కొడితే “ఱ” వస్తుంది.)

  4. మందాకిని

    ౧. బరహాలో ప్రతి అక్షరం ఎలా రాయాలో సందేహాలన్నీ హెల్ప్ లోకెళ్తే తీరతాయి కదండీ! ఈ విషయం మీకు తెలీదనుకోను.
    ౨. ఇకపోతే ప్రఙ్ఞావంతుని చేతను……. పద్యంలో సందేహం గురించి..
    పిల్లలు గానీ, కొందరు పెద్దలు గానీ తమకు తెలిసిందే ఙ్ఞానమని, ఇంక మెరుగు పరచుకునే పని లేదనో, లేదా ఆ అవసరం లేదనో అనుకుంటూ ఇక ప్రయత్నమే చేయరనుకుందాం. అలా ఉండి పోకూడదనిన్నీ, తమ తమ రంగాల్లో నిరంతర అభ్యాసం, కృషి చేయాలనిన్నీ, లేనిపక్షంలో ప్రఙ్ఞావంతులు కూడి ఉన్న సభలో, ( ఇలాంటి పుస్తకం. నెట్ లాంటి చోట్ల) ప్రఙ్ఞాహీనులకు తమకు తెలియదే అన్న కొరత మనసులో ఏర్పడుతుందని అర్థం. సమస్య కాదు కొరత.
    ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ అనుకోండి. అందువలన ధనసంపాదనకే కాక ప్ర్రాఙ్ఞత పెంచుకోటానికి కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. అదే ధనం వంటిది అని అర్థం.
    ౩. ఇక పాపాలు అంటే సినిమాల్లో విలన్ చేసేవి అని కాదు. తన కోసమే, తన కుటుంబం కోసమే, తనకు కావలసిన వారి కోసమే పాటు పడుతూ, అందుకు వ్యతిరేకంగానో, ఆటంకం గానో పరిణమించిన ప్రతి ఒక్క విషయాన్నీ, ప్రవర్తించిన వ్యక్తుల్నీ, మార్చాలనుకోవడం కూడా పాపమే. సృష్టిలోని ప్రతి ఒక్కరిబాధనీ తనబాధతో సమానంగా చూడగలిగే యోగులు (భగవాన్ రమణులు, షిరిడీ సాయిబాబా, శ్రీ రాఘవేంద్రులు) తప్ప తెలిసో, తెలియకో మనందరం పాపాలు చేస్తున్నట్టే. తెలిసో, తెలియకో తన స్వార్థానికి ప్రకృతిని నష్టపరచడం దగ్గర్నుంచీ చెప్పుకుంటే పోతే ఎన్నో. ఈ విషయాన్ని ఇలా పైకి తెలుసుకోవడం కాకుండా అనుభూతి పొందగలిగి, ఆచరించ గలిగినపుడు ఙ్ఞానులవుతారు. అది తెలీకుండా ఉన్నంత వరకు తనని తాను అంతా గొప్పవాళ్ళనే అనుకుంటారు.
    * గమనిక _ ఇవన్నీ అందరికీ తెలిసినవే. కాకపోతే ఒక పునశ్చరణ అంతే.

  5. మాలతి

    @సౌమ్య, మంచి టపా. నేను కూడా ఇలాగే అక్కడక్కడ, అప్పుడప్పుడు చదువుతుండేదాన్ని. ఇప్పుడు లేదు. కామేశ్వరరావుగారు ఉదహరించిన ధర సింహాసనమై చూడగానే ఉలిక్కిపడ్డాను. చిన్నప్పుడు కంఠతా పట్టిన పద్యం. నువ్వు ఉదహరించిన వాటిలో సుమతీశతకంలోనివి మాత్రమే తెలుసు. చాలా బాగుంది. అభినందనలు.
    చదివి తెలుసుకోడానికీ, ఇదుగో ఇదిక్కడ ఉంది అని మరొకరితో పంచుకోడానికీ కరతలామలకం కానక్కర్లేదని కొందరు గ్రహించలేరు. ప్చ్. స్పాం! హా!

  6. కామేశ్వర రావు

    సౌమ్యగారూ,

    మీరు చెప్పిన నారాయణశతకం నేనిప్పుడే చూస్తున్నాను! నేను చిన్నప్పుడు చదివిన నారాయణశతకం (పోతనదిగా చెప్పేది) వేరు. అది ధారాళంగా సాగే వృత్త పద్యాలతో ఉంటుంది. కొన్ని పద్యాలు బాగా ప్రసిద్ధి చెందాయి. ఉదాహరణ:

    ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై
    పరమామ్నాయము లెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై
    సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై
    వరుసన్నీ ఘన రాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణా

    ఈ శతకం ఆంధ్రభారతి సైటులో చదవవచ్చు: http://www.andhrabharati.com/shatakamulu/nArAyaNa/index.html

    ఈ పద్యాలు పోతనవని చెపితే నమ్మేటట్టే ఉన్నాయి.

    మీరన్నట్టు, మీరు చదివిన (వికీలో ఉన్న) శతకం పోతన రాసేడంటే నమ్మబుద్ధి కావడం లేదు 🙂 ఆ పద్యాలు ఏ ఛందస్సులో ఉన్నాయో కుడా తెలియడం లేదు. దీని గురించి వివరాలు తెలుసున్న వారెవరైనా చెప్పగలరు.

Leave a Reply