తప్పక చదవాల్సిన ‘మంచి ముత్యం’

– రాసిన వారు: అరుణ పప్పు

manchimutyam‘పట్టణం ఒక సామాజిక జంతువు! దానికి నాడీమండలం, తల, భుజాలు, పాదాలు అన్నీ ఉంటాయి. అందుకే ఏ రెండు పట్టణాలూ ఒక్కలాగా ఉండవు. పట్టణానికుండే ఉద్రేకం, ఉద్వేగం గొప్పవి. అక్కడ వార్తలెలా ప్రవహిస్తాయో ఎవరికీ తెలియదు..’ అరవయ్యేళ్లకు పూర్వమే ఈ వాక్యాలు రాయగలిగాడు కనుకే సుప్రసిద్ధ అమెరికన్‌ నవలా రచయిత జాన్‌ ఎర్నెస్ట్‌ స్టెయిన్‌బెక్‌ నోబెల్‌ విజేత కాగలిగాడు. అది సత్యమనిపిస్తుంది ‘మంచి ముత్యం’ (Manchi Mutyam) నవల చదివితే. ఇది అతని ‘The Pearl’ నవలకు అనువాదం. మూలం 1947లోనే ప్రచురితమయింది. ఇప్పుడు దేవరాజు మహారాజు అనువాదంగా మనముందుకొచ్చింది.

కథ విషయానికొస్తే – తాతముత్తాతల మాదిరిగానే, కీనో ముత్యాల అన్వేషకుడు. వారిలాగానే చాలా సామాన్యమైన జీవనం, బలమైన వర్గాల కనుసన్నల్లో నడవాల్సిన పరిస్థితి. తాతతండ్రులకూ, కీనోకూ తరాల తేడానే తప్ప, అభివృద్ధిలో ఒక్కటంటే ఒక్క ముందడుగు కూడా పడదు. సముద్రగర్భంలోనికి ఈదుకుంటూ ప్రవేశించి ముత్యపు చిప్పలను సేకరించడం, మన జాలర్లు చేపలమ్మినట్టుగా వాటిని ఏరోజుకారోజు అమ్ముకుని బతకడం. అదే అతని జీవనోపాధి. తరతరాల అనుభవాలు, అనుభూతులను పదాలుగా పేర్చుకుని, పాటలుగా కట్టుకుని ఆనందించడం. భార్య జుఆనా, నెలల పసికందు కొయొటిటో.. తాముంటున్న కుగ్రామం – అంతే కీనో ప్రపంచం.
ఒకరోజు ఉయ్యాల్లో పడుకోబెట్టిన పసివాడిని తేలు కుడుతుంది. భయపడి, వైద్యం కోసమని పక్కనున్న పట్టణానికి వెళ్లినప్పుడు ఆ కుటుంబానికి ప్రపంచ పోకడలు కొద్దికొద్దిగా అర్థమవడం ప్రారంభిస్తాయి. డాక్టర్‌కు ఫీజుగా చె ల్లించడానిక్కూడా ఏమీలేని వారికి ఎదురైన అనుభవాలు ఆలోచింపజేస్తాయి. ఇంటికొచ్చాక, తల్లి చేసిన వైద్యానికి కొద్దిగా కోలుకుంటాడు కొయొటిటో. వాడి వైద్యం కోసం మరిన్ని ముత్యాల్ని సంపాదించాలని కీనో సముద్రం మీద వేటకు బయల్దేరతాడు. ఏదో అద్భుతం జరిగినట్టు ఆరోజే కీనోకు చందమామలాంటి ముత్యం లభిస్తుంది. దాని రంగు, బరువు, ఆకారం, పరిమాణం.. అన్నీ అదెంతో అద్భుతమైనదని, చాలా ఖరీదు పలుకుతుందని చెప్పకనే చెబుతుంటాయి. దాని రాకతో కీనో దంపతులకు భవిష్యత్తు మీద ఆశలు చిగురిస్తాయి. వంశంలో ఎన్నడూ లేనిది, తమ కుమారుడు విద్యనభ్యసిస్తాడని, పుస్తకం పట్టుకుని చదువుతాడని, గొప్పవాడవుతాడని కలల్లో తేలిపోతారు. అయితే, అదే ముత్యపు రాకతో ఆ కుటుంబం చుట్టుపక్కల జనాల మనసులో దురుద్దేశాలు మొదలవుతాయి.

ముందు దగ్గరున్న పట్టణంలో జాబిల్లి వంటి తన ముత్యాన్ని అమ్మజూపినప్పుడు వ్యాపారుల మాటతీరు కీనో దంపతులను నిర్ఘాంతపరుస్తుంది. మధ్యవర్తుల గడుసుదనం కనిపెట్టిన కీనో ముత్యానికి , తన కష్టానికి తగిన ప్రతిఫలం సాధించడానికి రాజధానికి బయల్దేరాలనుకుంటాడు. అతని ఉద్దేశాన్ని కనిపెట్టిన వైద్యుడు, మతాధికారి, ఇతరులు అతన్ని నిరుత్సాహపరచడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. చివరకు పసివాడికి ప్రమాదమని అనుమానబీజాలు నాటడానిక్కూడా సిద్ధపడతారు. ఇరుగుపొరుగువారితో సహా ముత్యం కోసం ఆశపడిన అందరూ కలిసికట్టుగా కీనోకు వ్యతిరేకమయిపోతారు. వారి ఈర్ష్యాకీలల్లో అతని గుడిసె కాలిపోతుంది, పరిసరాలు ధ్వంసమవుతాయి, చీకట్లో దాడి జరుగుతుంది, ఆత్మరక్షణార్థం కీనో పోరాడుతున్నప్పుడు ఏకంగా పసివాడి ప్రాణాలే పోతాయి! బంగారు భవిష్యత్తును అందిస్తుందనుకున్న ముత్యం మృత్యువునూ, అంతులేని వేదననూ, ఎప్పటికీ పూడ్చలేని ఖాళీనీ మిగిల్చిందని అప్పటిక్కానీ అర్థం కాదు కీనోకు. ఓటమిని ఒప్పుకొన్న అతను అవమానంతో ముత్యాన్ని సముద్రంలోకి విసిరేసి భార్యతో మళ్లీ తన గ్రామానికి నిర్వేదంగా తిరిగొస్తాడు. ‘మానవ పీడనను, సంఘర్షణనూ అత్యున్నత స్థాయిలో అనుభవించినవాళ్లు కనుక, మానవానుభూతులకు అతీతులయ్యారు..’ అని వర్ణిస్తాడు రచయిత – నిర్వికారంగా నడిచొస్తున్న ఆ జంటను.

చదువుతున్నప్పుడు చాలా సరళంగా కనిపించే ఈ నవల పూర్తయ్యేసరికి మానవ జీవితంమీద, ప్రవృత్తిమీద లోతైన ఆలోచనకు వెళ్లేలా పాఠకులను ప్రేరేపిస్తుంది. అది స్టెయిన్‌బెక్‌ రచనాప్రతిభకు నిదర్శనం. ‘మంచి ముత్యం’ నవలలో మెక్సికన్‌ పల్లెపదాల జీవితం కళ్లకు కడుతుంది. సంపద తెచ్చే అనర్థాల గురించి హెచ్చరిస్తుంది. ముత్యం దొరక్కముందు, దొరికిన తర్వాత, మనుషుల ప్రవర్తనను బేరీజు వేసి చూపిస్తున్నప్పుడు… సమాజంలో వివిధ స్థాయుల్లో జరిగే దోపిడిని పాఠకుల ముందు నిలబెడతుందీ రచన. మానవ స్వభావం, అందులోని చీకటి కోణాలు, వ్యవస్థనెదిరించి ప్రగతి సాధించాలనుకుంటే ఎదురయ్యే అడ్డంకులు.. వీటిని హత్తుకుపోయేలా చిత్రించిన ఈ అద్భుతమైన చిన్న నవలను సాహిత్యాభిమానులు ఎర్నెస్ట్‌ హెమింగ్వే రాసిన ‘ద ఓల్డ్‌ మాన్‌ అండ్‌ ద సీ’తో పోలుస్తారు.

ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు దూసుకుపొమ్మని ప్రబోధిస్తున్న వ్యక్తిత్వ వికాస పుస్తకాలు పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్న ఈ రోజుల్లో, ఈ పుస్తకం ఆ పరుగులో కోల్పోయేదేమిటో ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించింది. అయితే ఒక ప్రశ్న తలెత్తింది. అవకాశాల్ని అన్వేషించడం, జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించడంలో ఎదురయ్యే అనుభవాల్ని ‘మంచి ముత్యం’ ప్రతికూల ధోరణిలో చిత్రించిందా.. అని!

ఈ నవల ఆధారంగా 1947లోనే “లా పెర్లా” అనే స్పానిష్ సినిమా కూడా వచ్చింది. అనువాదం సరళంగా, స్వీయరచనేమో అన్నంత హృద్యంగా చేసినందుకు దేవరాజు మహారాజు అభినందనీయులు. మూల రచయితే చెప్పినట్టు – అన్ని కథల్లో ఉన్నట్టుగానే ఇందులో కూడా మంచీచెడు, తెలుపు నలుపు మానవత్వం దానవత్వం చాలా స్పష్టంగా నిక్కచ్చిగా, వేర్వేరుగా ఉన్నాయి. వాటి మధ్యన – అంటూ ఏదీ లేదు. ఇదీ ఒక నీతి కథే అయితే, ప్రతివాళ్లూ, వాళ్లకు తోచినట్లు అన్వయించుకుని వాళ్ల జీవితాల్నే ఇందులో చూసుకుంటారు.

You Might Also Like

5 Comments

  1. varaprasaad.k

    కదా వస్తువు ఏదయినా కధనం నడిపించే తీరు లోనే రచయిత ప్రజ్ఞ వెల్లడయేది,ఎంతో మంది నాటి మేటి రచయితలు రాసిన ఇలాంటి నాణ్యమైన కధల్ని పాఠకులకు అందించటం అభినంద నీయం. అరుణ గారి రచనా శైలి వెంటనే పుస్తకం చదవాలనిపించేదిగా ఉంది.కథను టూకీగా చెప్పారు,మరింత విపులంగా చెపితే మరీ బావుణ్ణు.మరిన్ని మేలి రచనలు మీ నుండి ఆశిస్తూ అభినందనలతో…..వరప్రసాద్.

  2. శ్రీరామారావు

    పుస్తక సమీక్షలు కథలొని మాధుర్యాన్ని రుచి చూపిస్తు ఎప్పుదు చదువుదామ అనె ఆరాటం మొదలవుతుంది. అందులొ దీవరాజు మహారాజు గారి పుస్తకాలు సామాన్యుడి జీవితాల చుట్టూ తిరుగుతు , భూమి మీద ఉండె ఎగుడు,దిగుడుల పట్ల మనల్ని ఆలొచింప చెస్తాయి . దెవరాజు గారి పాలు ఎర్రభడ్డాయి అనె కతల సంపుటి లొ శవయాత్ర అనె కతలొ ఒక కలాకారుడి జీవితంలొ ఒక్క అవకాశం రాక చివరికి శవం ముందు నాట్యం చెస్తు తన ప్రథిభను ప్రదర్శించె తీరు ఓడి పొతున్న జీవితంలొ తన కొరికను తీర్చుకున్న తీరు మన కంట తడి పెట్టిస్తాయి. మనకు తెలిసిన పుస్తకాలను, అందులోని కథనాన్ని తెలియజేసేందుకు చక్కటి వేదికను నిర్వహిస్తున్న మీకు ధన్యవాదములు.

  3. pappu

    నిజమే మరి..ఎప్పుడూ లోకం పోకడ కూడా అదే కదా.పక్క వాడు పచ్చగా ఉంటే చూడలేరు.అందువల్ల ఇంకొ పక్కవాడితో కలసి వీడి కొంపకి ఎసరు పెడతారు.ఆ మంటల్లో అసలు వాళ్ళెలాగూ చస్తారు.ఖర్మ కాలితే(ఎలాగూ కాలుతుంది ఎందుకంటే పక్కవాడి గోతులు తవ్వాడు కదా)ఆ మంటలు అంటించిన వాడి కొంపకూ అంటుకుని వీడూ చస్తాడు.అలాగన్నమాట.
    ఏదేమయినా “ఈజీ మనీ” అనేది ఒక కేన్సర్ రోగంలా పెరిగిపోవడంవల్ల అది వికృత రూపంలో విజృంభిస్తూ ఒకర్ని ఒకరు దోచుకుంటూ,నరుక్కుంటూ రాక్షస ప్రవృత్తిని తలపిస్తున్నాయి.బహుశా ఇది మొదలేనేమో?
    మరి అంతా అయిపోయాక మిగిలేది నిర్వేదమే కదా….

  4. దుప్పల రవికుమార్

    చక్కటి పరిచయం, అరుణగారూ!

  5. పూర్ణిమ

    Interesting!

    మీరు చెప్పిన కథ వింటూనే అనుకున్నా ఇదేదో “ఓల్డ్ మాన్ ఆండ్ ది సీ”లా ఉందే అని. “ఓల్డ్ మాన్….” రచనను కూడా ఎవరైనా విపులంగా విశ్లేషిస్తే బాగుణ్ణు.

    ఇదేదో చదవాల్సిన పుస్తకంలానే ఉంది. నేను ఒరిజినల్ ప్రయత్నిస్తా! పరిచయానికి నెనర్లు!

Leave a Reply to varaprasaad.k Cancel