డా. జెకెల్ అండ్ మిస్టర్ హైడ్

రాసినవారు: శ్రీనిక
**********
డా. జెకెల్ అండ్ మిస్టర్ హైడ్  (మనిషి  –  లోమనిషి)
రచయిత: రాబర్ట్ లూయీ స్టీవెన్ సన్
తెలుగు అనువాదం : డా. కె.బి. గోపాలం.

ఒకోసారి మనకి ఇష్టం లేక పోయినా కొన్ని పనులు చేయక తప్పదు. ఇవి ఎవరి కోసం చేస్తున్నాం. మనకి ఇష్టం ఉన్నాకొన్ని పనులు చేయలేం. ఎందుకని? మన చేతనావస్థని నియంత్రించే సంకేతాలు మనకెపుడూ అందుతూనే ఉంటాయి. ఇవి ఎక్కడనించి వస్తాయి. మనకోసం మనం ఏర్పరుచుకున్న కొన్ని నియమాలు, కట్టుబాట్లు మన స్వాతంత్ర్యాన్ని అదుపులో ఉంచుతూంటాయి. మన జీవితాల్లో ఇలాటి చట్రాలు మనకి కనిపించవు కాని వాటి ప్రభావం మన జీవన విధానం మీద ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంటే మనం కొన్ని కోరికలను తీర్చుకోలేక, కొన్ని పనులను చేయలేక నిత్యం మధన పడుతూ రా’ జీ ‘ వితాన్ని గడిపేస్తూంటాం. ఏదేదో చేయాలని…కాని జీవితం గురించి ఉండే నియమాలు అందులో ఉండే దైవికత కట్టిపడేస్తూంటుంది. ఇలా మనకి తెలియకుండానే మనం  కొన్ని ఫ్రేముల్లో జీవితాన్ని లాగించేస్తూంటాం.  ఈ చట్రమే సమాజం అనుకుంటే…

Society is a masked ball, where every one hides his real character, and reveals it by hiding – Ralph Waldo Emerson

ప్రతీ మనిషి లోను బయటకి కనిపించని మరో మనిషి దాగి ఉంటాడు. అంటే ప్రతి మనిషికి అంతర్ముఖం ఒకటి ఉంటుందనేది నిర్వివాదాంశం. మన ‘ లో ‘ మనిషికి  స్వేచ్చనిస్తే … ఆ ఊహ అద్భుతంగా లేదూ ! ఆ ఊహకి ప్రాణం పోసి  మన మనసు ‘లోమనసు’ ని  బయటకి లాగ గలిగితే మనిషి ద్వంద వైఖరి బయటపడుతుంది.  ఈ మరో పార్శ్వం పైకి కనిపించేంత సౌమ్యమైనది కాకపోతే…మనుషులమీద, సమాజమ్మీద ద్వేషం పేరుకు పోయినదైతే… పొంతన లేని రెండు వ్యక్తిత్వాలు ఒకదానికొకటి ఎప్పుడూ ఘర్షణ  పడుతూ ఒకే మనిషిలో బంధింపబడి ఉండటం మనిషి కెంత శాపం. మరి వాటిని విడదీయటం ఎలా?…ఇదే ఈ ఆలోచనే  Dr. Jekyll and Mr. Hyde కధకి మూలం.

ఇక రచయిత విషయానికి వస్తే :  చిన్న ప్పుడు మనం రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ రాసిన   “ట్రెజర్ ఐలెండ్”  కధని చదివేవుంటాం. సముద్రదొంగలు దాచిన నిధిని కనుగొనటం..ఆద్యంతం ఆశక్తిగా సాగుతుంది. ఆయన రాసిన కధలలో బాగా ప్రాచుర్యం పొంది విమర్శకుల మెప్పుని పొందిన మరో కధ. ఇంగ్లీషులో ఇక్కడ చదవండి. R.L. స్టీవెన్ సన్  (1850-1894) స్కాటిష్ కవి. తక్కువ కాలం లోనే ఎక్కువ రచించి ప్రపంచ సాహితీ చరిత్రలోనే ఒక మంచి స్థానాన్ని సంపాదించి ఆనాటి విమర్శకుల మన్ననలను కూడా పొందగలిగాడు.

డా. జెకెల్ ఒక సాదాసీదా వైద్యుడు. పుట్టుకతోనే ధనవంతుడైన జెకెల్ కి సమాజం లో మంచి గౌరవం కూడా ఉండేది.తన ప్రాక్టీసు అయిపోయాకా మిత్రులతో క్లబ్బులకు వెళ్ళి సరదాగా గడుపుతూ ఉండేవాడు.  అయితే ఇతనిలో కొన్ని లోపాలు లేక పోలేదు. తన భావాలను దాచుకుని ముభావంగా ఉండేవాడు.  ఏదేదో సాధించాలని గొప్ప లక్ష్యాలు..ఏమీ సాధించలేనితనం..దీనవలన కలిగిన అవమాన భారం కన్నాసాధించదలచిన లక్ష్యాలే ముందు కనిపించసాగాయి. తన ద్వైదీభావం అనుకోకుండా తన వైజ్ఞానిక పరిశోధనలు, మిధ్యావాదాల వైపు మొగ్గుతాయి. తనలో ఇద్దరు మనుషులున్నారని తేలిపోతుంది. మిగతా వాళ్ళు కూడా బహుసా ఇంతకంటే అన్యాయంగా బ్రతుకుతుంటారనిపించింది.  తన ఆలోచనలని తన పరిశోధనలవైపు మళ్ళిస్తాడు. శరీరం లోని కొన్ని ఏజెంట్లు ఈ వ్యక్తిత్వాలను కదిలిస్తాయని గ్రహిస్తాడు. వీటిని నియత్రించే రసాయనాన్ని కనిపెడతాడు. అంతే..ఆ రసాయనాన్ని సేవించి …లోపలి మనిషి గా మారతాడు..ఆ వ్యక్తిత్వానికి తగ్గట్టు రూపం కూడా మారి పోతుంది. అపుడర్ధమవుతుంది. తనలో తనకు తెలియ కుండానే ఒక దుర్మార్గుడున్నాడని. అతని పేరే మిస్టర్ హైడ్…ఇతని చేయని చెడ్డ పని ఉండదు. మళ్ళీ ఆ రసాయనాన్ని సేవిస్తే డా.జెకెల్ గా మారి పోతాడు. రాను రాను ఈ రూపాంతరం ఒక మత్తు లాగా, భావ స్వాతంత్ర్యం తన కొక సరదా అయిపోతుంది. ఇదొక వ్యసనంగా మారి  చివరికి అతని  జీవితం ఏమయి పోతుంది…నవల చదవాల్సిందే…

ఇందులో ఇతర ముఖ్య పాత్రలు..లాయర్ అట్టర్సన్ జెకెల్ సన్నిహితుడు. మిస్టర్ హైడ్ చేసిన నేరాల పరిశోధన చేస్తాడు.   డా. లాన్యన్ జెకెల్ సహోద్యోగి. ప్రతి మనిషిలోను మంచి, చెడు కలిసుంటాయని రచయిత చెప్పిన తీరు కధాగమనం లోని పట్టు, చిక్కదనం 12 దశాబ్దాలు గడిచినా, నేటికీ బలంగా పాఠకులను  పట్టుకుంటుందనడం లో సందేహం లేదు.చాలా రసవత్తరమైన ఘట్టాలతోనూ, సస్పెంసు తోను ఇమిడి ఉన్న ఈ నవలకు  చాలాకాలం ఒక డిటెక్టివ్ నవలకున్న ప్రాధాన్యత మాత్రమే దక్కింది. ప్రముఖ రచయితల ప్రశంసలు , మానశిక విశ్లేషకుల సమీక్షలు ఈ నవలను ప్రపంచ సాహిత్యంలో అత్యుత్తమ నవలల సరసన నిలబెట్టాయి.

మహారచయిత రాబర్ట్ లూయీ స్టీవెన్ సన్ అనారోగ్యంతో మంచం పట్టి, మనసు కూడా బలహీనంగా ఉన్న తరుణంలో కలలో ఈ కధను ఊహిస్తాడు.  తను రాసిన కధను చదివి తనకే జుగుప్సాకరంగా అనిపించి  ఆ కాగితాలని తగలపెట్టేస్తాడు. భార్య ప్రోద్భలం తో తిరిగి రాస్తాడు. భావ ధారుఢ్యాన్ని  ఎక్కడా బలహీన పరచ కుండా కవి, విమర్శకుడు, అనువాదకుడు అయిన డా. కె.బి. గోపాలం గారు కధని తెలుగులోకి చాలా చక్కగా అనువదించారు. కాని  క్లిష్టమయిన సన్నివేశాలని చాలా అలవోకగా అనువదించగలిగిన డా. కె.బి. గోపాలం గారు కొన్ని  చోట్ల చిన్న చిన్న వాక్యాలను అనువదించడం లో కృతకృత్యులు కాలేక పోయారనిపించింది.

ఉదా:  1.  ఈ దరిద్ర వ్యవహారం తప్పదంటే మాత్రం, భగవంతుడి పేరున, (in the name of god) ఇక్కడి నుంచి వెళ్ళిపొండి ! నే భరించలేను. (page: 30)
2.  నా కృతజ్ఞతలకి పాత్రుడివవుతావు. (page : 44)
మీరు ఇదివరకే పుస్తకం చదివి ఈ మాటలు చదువుతున్నారా ? కాదంటే ముందు పుస్తకం చదవండి ! అవుననడం గ్యారంటీ !

ప్రతులకు :  పీకాక్ క్లాసిక్స్, హైదరాబాదు.
వెల        : ఇరవై అయిదు రూపాయలు.

You Might Also Like

3 Comments

  1. జాన్ హైడ్

    నా పేరులో హైడ్ అని వుండటంవల్ల నాకు ఈ పుస్తకం నా ఏడవతరగతిలోనే ఓ డాక్టరు గారిద్వారా(1972) పరిచయం అయ్యింది.
    అప్పుడు చదివినా దాని అంతరార్థం నాకు బోదపడలేదు. మళ్ళీ 1977లో ఇంటర్మీడియట్ చదువుచున్నప్పుడు మా ప్రిన్సిపాల్ గారి ప్రేరణతో మళ్ళీ చదివా, అయినా అంతరార్థం మోధపడలేదు.
    తరువాతికాలంలో పుస్తకాల ప్రియత్వం పెరిగిన తర్వాత చదివాను. చాలా సరళంగా వుండే ఆంగ్లము.
    గుర్తుచేసారు కాబట్టి నా పుస్తకాల అరలో ఈ పుస్తకం వుందో, లేదో చూడాలి.
    తెలుగు అనువాదాన్ని కూడా చదవాలి

  2. నరసింహారావు మల్లిన

    చిన్నప్పుడెప్పుడో మా స్వగ్రామంలోని లైబ్రరీ నుండి ఇంటికి తెచ్చుకుని చదివి ఆనందించిన పుస్తకాల గుఱించి ఇప్పుడు పుస్తకం.నెట్ లో చదవటం చాలా ఆనందాన్ని కలగజేస్తోంది. ఆ రోజుల్లో చదివిన టామ్ సాయర్, హకల్ బెరీఫిన్,డాక్టర్ జెకిల్ & మిష్టర్ హైడ్, ట్రెజర్ ఐలెండ్ లాంటి పుస్తకాలను గుర్తు చెచ్చుకోవటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.పై పుస్తకాలని గుర్తుకు తెచ్చిన పుస్తకం.నెట్ వారికి నా ప్రత్యేక అభినందనలు.
    పూర్ణిమ గారికి:
    పుస్తకం.నెట్ కు నా అనుభవాలను పంపించమని మీరు పంపిన ఆహ్వానానికి నా కృతజ్ఞతలు. వీలు వెంబడి ప్రయత్నించగలను.

  3. bollojubaba

    రసాయినాన్ని తాగితే లోపలి మనిషి బయటకు రావటం అన్న ఆలోచనే భలే ఉంది.
    ఇలాంటి సదుపాయం ఉంటే ఇక కోర్టుల అవసరమే ఉండదు కదూ.

    ఆ వూహే అద్బుతంగా అనిపిస్తుంది. చదవాలి తప్పని సరిగా.

    బొల్లోజు బాబా

Leave a Reply