సిసలయిన సృజనకు వేదిక – “పాలపిట్ట” మాస పత్రిక

వ్యాసం రాసిపంపిన వారు: బొల్లోజు బాబా

గుడిపాటి వారి ఆధ్వర్యంలో చాన్నాళ్లుగా ఊరిస్తున్న “పాలపిట్ట” మాసపత్రిక మొదటి సంచిక ఫిబ్రవరి, 2010 న విడుదలైంది.   కొత్తగా అత్తవారింట అడుగుపెట్టే కొత్త కోడలులా నిండా ముస్తాబుచేసుకొని నును సిగ్గులు అభినయిస్తూ  మనముందుకొచ్చింది.

మంచి సాహితీవిలువలు ప్రదర్శించే తెలుగు పత్రికలు నడవటం కష్టం…. అంటూ వినిపించే సన్నాయినొక్కుల మధ్య, గుడిపాటి గారి ఈ సాహసాన్ని అభినందించక తప్పదు.  తెలుగువాళ్లు తమ భాష, సాహిత్యం, సంస్కృతుల పట్ల తమ అభిమానాన్ని చూపించాల్సిన తరుణం ఇదేననిపిస్తూంది.

సంపాదకీయంలో పత్రికయొక్క దశ దిశ ఇలా నిర్ణయించారు

1.  సృజనాత్మక వ్యక్తీకరణలకు  ఇదొక అనువైన వేదిక
2. సర్వకళలకీ చోటు కల్పించే విస్తృతీ, వైశాల్యం దీని ప్రత్యేకత
3. ప్రధాన స్రవంతి ధోరణికి భిన్నంగా సరికొత్త ఆలోచననీ, దృక్పధాన్నీ, అవగాహననీ అందించటమే ప్రాతిపదిక
4. తెలుగు రచనలకే కాదు అనువాదాలకు, డయాస్పోరా వ్యక్తీకరణలకు సమప్రాధాన్యం లభిస్తుంది.
5. రచనను ఎవరు రాసారన్నది కాదు,  దానిలోని అసలుసిసలుతనం ఎంతన్నదే ప్రమాణం.

6. సాహిత్య కళారంగాలలో ప్రజాస్వామిక చర్చలకు ఇదొక వేదిక.

విషయసూచిక చూస్తే – పన్నెండు వ్యాసాలు, మూడు కధలు, మూడు అనువాదకధలు, ఒక పాట, పదకొండు కవితలు, బాలసాహిత్యం శీర్షికన మూడు కధలు, ఆరు సమీక్షలు, ఒక ఇంటర్వ్యూ, జ్ఞాపకాలు శీర్షిక పేరుతో ఒక కాలమ్, సినిమా కేటగిరీలో “చే” పై ఒక వ్యాసం, చిత్రకళ పేరుతో ఒక వ్యాసం ……… ఇదీ పాలపిట్ట మొదటి సంచిక యొక్క దేహం.

సంపాదకీయంలో ఇచ్చిన హామీలు, మొదటి సంచికలో ఉన్న అంశాలను గమనిస్తే ఈ పత్రికకు మంచి భవిష్యత్తు ఉందని అనిపిస్తోంది.

ఇక పత్రికలోతుల్లోకి వెళితే……

ముకుందరామారావు పరిచయంచేసిన తొలి నోబెల్ కవి ’ఆర్మండ్ ప్రుధోమె’ కవితానువాదాలు అద్బుతంగా ఉన్నాయి.  మరీ ముఖ్యంగా “ఈ ప్రపంచంలో” అనే కవితలోని ఈ వాక్యాలు నాకు మరీ నచ్చేసాయి.

ఈ ప్రపంచంలో పెదవులు సున్నితంగా కలుసుకుంటాయి
తీయదనమేదీ అలా ఉండిపోదు
ఎప్పుడూ నేను గుర్తుండిపోయే ముద్దునే కలగంటాను

డా. గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి  “తెలంగాణా పత్రికలు సాహిత్య సృజన” అనే వ్యాసంలో తెలంగాణా నుంచి వెలువడిన తొలితరం పత్రికల వివరాలు ఆశక్తికరంగా ఉన్నాయి.  కోస్తావాడిగా నాకున్న  కొన్ని అనుమానాలనూ తొలగించిందీ వ్యాసం.

నారాయణ బాబు, గోపీ చంద్ లపై వ్రాసిన విశ్లేషణాత్మక వ్యాసాలు బాగున్నాయి.  కవితలు వేటికవే సాటిలేనివి గా ఉన్నాయి..  మరీ ముఖ్యంగా ఎమ్వీ రామిరెడ్డి వ్రాసిన “ఆమె, నేను, ఖడ్గమృగం” కవిత మొదటి రీడింగ్ లో కొంచెం కంగారు పెట్టినా, నాకు చాలా బాగా నచ్చింది.

“మన వాళ్లేం చదువుతున్నారు” అన్న శీర్షికన ప్రముఖ తెలుగు రచయితలు ప్రస్తుతం తాము చదువుతున్న పుస్తకాల గురించి వివరించడం జరిగింది.  (ఇలాంటి ప్రక్రియను పుస్తకం.నెట్ వారు ఏనాటినుంచో నడుపుతున్నారు).

రూప్ కుమార్ డబ్బీకార్ వ్రాసిన “వేదంలో హైకూ మూలం” చదివాకా  ’అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష ’   అనే డైలాగు గుర్తుకొచ్చినా వ్యాసకర్త సమర్ధన, సమర్ధనీయంగానే అనిపించింది.

“మౌనంగానే భరించాలి కొన్ని దు:ఖాల్ని” అనే కధను ప్రచురణకు తీసుకొనే ముందు మరోసారి ఆలోచించి ఉండాల్సింది సంపాదకులు.

పెన్నా శివరామకృష్ణ వ్రాసిన ’ఉర్దూ కవితా ప్రక్రియ – గజల్” అనే వ్యాసం మంచి విషయపరిజ్ఞానంతో ఉండి, రమ్యమైన ఉదాహరణలతో ఆహ్లాదపరచింది.

అయిల సైదాచారి రచించిన “నీలం మాయ” కవితాసంకలనంపై అఫ్సర్  సమీక్ష బాగుంది.  (అఫ్సర్ గారివద్ద వాక్యనిర్మాణ రహస్యాలను నేర్చుకోవాలి ఎప్పటికైనా……)

ఇవే కాక ఇంకా వంశీకృష్ణ చేసిన రాజిరెడ్డి ’మధుపం’ రివ్యూ,  కస్తూరి మురళీ కృష్ణ ’తీవ్రవాదం’ పుస్తకంపై  కుమార్ సమీక్ష, మునెమ్మ నవలా సమీక్షలు కూడా ఈ సంచికలో చోటుచేసుకొన్నాయి.

మొత్తంమీద మొదటి సంచిక షడ్రసోపేత భోజనంలానే అనిపించింది.  గుడిపాటి వారు ఇదే రాశిని, వాసిని, భిన్నత్వాన్ని ముందు ముందు కూడా కొనసాగిస్తారని విశ్వసిస్తున్నాను.

ఉన్నతమైన ఆశయాలు, ప్రమాణాలతో ఆరంభించిన “పాలపిట్ట” పత్రిక త్వరలోనే అందరి మన్ననలను, ప్రోత్సాహాన్ని పొందగలదని ఆశిస్తున్నాను.

పత్రిక వెల: 30 రూపాయిలు  –  పేజీలు 84.  సంవత్సర చందా వివరాలు పొందుపరచలేదు.  ఈ పత్రిక పాలపిట్ట ప్రచురణల వారిది.

ఎడ్రసు:
శ్రీ గుడిపాటి వెంకటేశ్వరులు
ఎడిటర్, పాలపిట్ట
16-11-20/6/1, 403
విజయసాయి రెసిడెన్సీ
సలీమ్ నగర్, మలక్ పేట
హైదరాబాద్  –  500036
mail:  palapittabooks@gmail.com

You Might Also Like

5 Comments

  1. munnamshashi

    నమస్తే సర్.
    నేను ఉస్మానియా విశ్వ విద్యాలయంలో phd చేస్తున్నాను సర్.నేను మీకు ఒక పరిశోధన వ్యాసం పంపాలనుకుంటే ఈ మెయిల్ ఐడీ కి పంపాలా సర్.
    దయచేసి తెలుపగలరు.
    శశి కుమార్ మున్నం
    9959811435
    పరిశోధనా అంశం: నిజామాబాద్ జిల్లా గేయ వచన కవిత్వం(2002-12)-oka పరిశీలన.
    munnamshashi1981@gmail.com

  2. హెచ్చార్కె

    పాలపిట్ట మొదటి సంచిక పరిచయం చాల బాగుంది. ఒక మంచి ప్రయత్నానికి పూర్తిగా అర్హమైన కితాబు. అందరం పాలపిట్టకు దీర్ఘాయుష్షు కోరుకుందాం.

  3. జాన్ హైడ్

    3rd issue aslo released within couple of days
    you can subscribe also at Rs. 300/- per year

  4. శ్రీనిక

    మీ వర్ణన బట్టి చూస్తే చదవాల్సిందే అనిపిస్తుంది.
    మా విశాఖకి రావడానికి కొంత కాలం పట్టవచ్చేమో.
    అయినా ధర మాత్రం కొంచెం ఎక్కువే నని పిస్తుంది.

  5. మందాకిని

    ఇంకా కొనటం వీలు కాలేదు. చక్కగా వివరాలు తెలిపినందుకు చాలా సంతోషం.

Leave a Reply