ప్యర్ అండ్ జీన్ – గీ డ మొపాస

రాసిన వారు: Halley
************
Pierre and Jean – Guy de Maupassant
పుస్తకం దొరుకు చోటు – ఇక్కడ.
ప్రచురణ : 1887
వికీ లంకె ఇక్కడ.

నేను “చివరకు మిగిలేది” చదివినపుడు ముందుమాటలో అనుకుంటా బుచ్చిబాబు గారు రాసారు ఈ నవల గురించి . ఆ పుస్తకంలో రాసారు కనుక ఇది కూడా చదవటం తటస్థించినది .గీ డ మొపాస కథలు ముందు అపుడపుడు చదివి ఉన్నాను కానీ ప్రధానంగా ఆయన పేరు నచ్చక నేను ఆయన పుస్తకాలు కొనను ! (నేను అదో టైఫు లెండి) . ఆయన పేరు అనే కాదు ఆ నవలలో కథలలో ఉండే పాత్రల పేర్లు కుడా నాకు ఆట్టే నోరు తిరగవు . ఇప్పుడు కూడా మొపాస (Maupassant) పేరు ప్యర్(Pierre) పేరు ఎలా పలకాలో ఏదో వెబ్సైటులో చూసి ఆడియో విని తెల్సుకోవలసి వచ్చింది.

ఇది మొపాస నవలలలో అతి చిన్నది అట. నిజమే, త్వరగానే చదివెయ్యచ్చు. ఇది చదివాక ఆవేశం వచ్చి ఏకబిగిన ఒక ఐధు ఆరు మొపాసా కథలు చదివేశాను నేను. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను.

ఈ నవల ప్రధానంగా రోలాండ్ దంపతులు వారి పిల్లలు ప్యర్ అండ్ జీన్ చుట్టూ తిరుగుతుంది . వీరిలో ప్యర్ కొంచెం నలుపు , వయస్సు ముప్పై , అప్పటికే యెన్నో ఉద్యోగాలు మారి చివరిగా డాక్టరు చదువు పూర్తి చేసి ప్రాక్టీసు ప్రారంభించటానికి తయారుగా ఉంటాడు. జీన్ చిన్నవాడు , అన్న ప్యర్ కంటే చాలా తెలుపు , లా చదువు పూర్తి చేసి ప్రాక్టీసుకి సిద్దంగా ఉంటాడు. అన్నదమ్ములు , అక్కచెల్లెళ్ళ మధ్యన ఈర్ష్య ఉండటం సహజం ఎందుకంటే పోలికలు కూడా అంతే సహజం కనుక. ప్రతీ దానిలోనూ జీన్ తో పోల్చటం ప్యర్ కి నచ్చదు . ఈ ఈర్ష్య ఈ నవలను ప్రధానంగా ముందుకి నడిపే సాధనాలలో ఒకటి. వీరు కాక రోలాండ్ వారి ఇంటి పక్కన ఉండే రోస్మిల్లి మరో పాత్ర. రోస్మిల్లి తనని ప్రేమించాలి అని ఇద్దరు అన్నదమ్ములకి ఉన్నా కూడా ఆ అమ్మాయికి జీన్ అంటేనే ఇష్టం. ఇది ప్యర్ లో ఈర్ష్య పెరగటానికి మరొక కారణం .

రోలాండ్ దంపతుల పాత మిత్రుడు చనిపోతూ తన ఆస్తి అంతా జీన్ పేరు మీద రాస్తాడు. దీనితో ప్యర్ లో మొదట ఈర్ష్య తర్వాత మరికొంత అంతర్మథనం మొదలు అవుతాయి . తర్వాత ఈ విషయం విన్న మరికొందరు ” మీ నాన్న మిత్రుడు అన్నప్పుడు ఇద్దరికీ సమానంగా ఆస్తి ఇవ్వలి కానీ .. మీ తమ్ముడికి మాత్రమే ఇవ్వటమేమిటి” అని అనటంతో అప్పటి దాకా లేని కొత్త అనుమానాలు బయలుదేరుతాయి ప్యర్ లో. ఈ అనుమాన స్రవంతిలో భాగంగా తన తల్లి గతం గురించి ఒక చీకటీ నిజాన్ని తెలుసుకుంటాడు . అది తెలుసుకున్నపటి నుంచి అతనిలో రగిలే రకరకాల ఆలోచనలు, ఆవేదనలు, ఈ విషయం గురించి ప్యర్-జీన్ ల మధ్యన వాద-ప్రతివాదాలు , ఈ నిజం తన కొడుకుకి తెలిసింది అన్న విషయం తెలియగానే ప్యర్-జీన్ల తల్లి పడే బాధ వాటి పర్యవసానాలు వగైరా కథను ముందుకు నడుపుతాయి . చివరకు ప్యర్ ఊరు వదిలి వెళ్ళాల్సి రావటం, జీన్ రోస్మిల్లిల వివాహ నిర్ణయంతో కథ ముగుస్తుంది. ఇది చిన్న నవల కనుక ఇంతకంటే కథను గురించి చెబితే మీరు ఎవరూ ఇంక ఈ నవలను చదవరు కాబట్టి కథ గురించి ఇక్కడితో ఆపేస్తాను.నవల చదివాక ఇంతకంటే ఇంకేముందని చెప్పటానికి అని అంటారో ఏమో ! . (కొద్దిగా Out of context – “Spoilers ahead”కి తెలుగు ఏమిటి ? ఇది చెబితే తర్వాతి సమీక్షలలో మొదటనే వ్రాసెదను ).

ఈ నవల కొంచెం చదివాక ప్రధాన ఇతివృత్తం అర్థం కాగానే “చివరకు మిగిలేది”కి ఈ నవలకి ఉన్న లంకె ఏంటో నాకు అర్థం అయింది . ఐతే ఈ నవలలో తల్లి గతం దాని వలన ప్యర్ కుటుంబం పడే బాధ ప్రధాన ఇతివృత్తం అయితే బుచ్చిబాబు గారి నవలలో అది అంతర్లీనంగా నడిచే ఒక అంశం . ఈర్ష్య అసూయ ఒక మనిషిని ఎలా ప్రభావితం చేస్తాయి , తల్లి గతం వలన పిల్లల మీద పడే ప్రభావం చిత్రీకరించిన తీరు నన్ను ఆకట్టుకుంది . ఒకే సమస్యకి ప్యర్ , జీన్ , మిసెస్ రోలాండ్ ఇలా మూడు దృక్కోణాల నుంచి చూపిన తీరు నన్ను ఆకట్టుకుంది . ఒకటే సమస్యకు ప్యర్ మరియు జీన్ పరస్పర విరుద్దంగా ప్రతిస్పందించిన తీరు కూడా చాలా ఆలోచింపజేసే విధంగా ఉంది. ఇది కాక 1880 నాటి ఫ్రెంచి సమాజం ఆలోచన తీరు ( ప్యర్ లో అనుమాన బీజం సమాజమే కదా నాటింది మరి !) మన సమాజం తీరు ఒకటిలాగానే అనిపించాయి. సమాజం ఎక్కడన్నా సమాజమే కదా మరి అయితే ఈ నవల ముగింపు నాకు నచ్చలేదు ఎందుకనో పాపం ప్యర్ కు అన్యాయం జరిగినట్టుగా అనిపిస్తుంది. బహుశా ఆ సమస్యకి అంతకు మించిన సోల్యుషన్ లేదో ఏమో !. నవల చదివి మీకెవరికన్నా ఇంతకు మించిన సొల్యుషన్ దొరుకుతుంది ఏమో చూడండి మరి .

You Might Also Like

4 Comments

  1. ఆరి సీతారామయ్య

    పరిచయం బాగుంది.
    రచయిత పేరు గీ ద మొపసా.
    Pierre ను “ర” ను పలికీ పలకనట్లుగా పియేర్ అంటారు.

  2. కొత్తపాళీ

    కూడల్లో ఈ టపా శీర్షిక చూసి ఎవర్నో తిడుతున్నారేమో ననుకున్నా 🙂

  3. శ్రీనిక

    మంచి కధను పరిచయం చేసినందుకు ధన్యవాదములు
    రచయిత పేరు గ్వేదె మొపాస అనుకుంటాను. ప్రపంచ సాహితీ చరిత్రలో ఎన్నదగిన ఉత్తమ కధారచయితల జాబితాలో మొదటి పది మందిలో ఈయన పేరు తప్పక ఉంటుంది. కధా గమనం లోనూ, వస్తువులోనూ ఎవరూ చేయని ఎన్నో ప్రయోగాలు చేసేవాడు. ఆధునిక కధా పితామహుడు అని కూడ అంటారు. ఇతని కధలు ముగింపు విశేషం గా ఉంటుంది.
    రచయితని గుర్తుచేసినందుకు మరీ మరీ ధన్యవాదములు.

  4. pavan

    Oka chinna savarana..
    French lo da/ta sound undadhu..
    dha/tha utundhi..naaku thelisinanthavaraku

Leave a Reply