Day is night

“డే ఈజ్ నైట్” – జె.ఆర్.జ్యోతి గారి హాస్య కథల సంకలనం. ఇవి న్యూస్ టైం, శంకర్స్ వీక్లీ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్‍ప్రెస్, డెక్కన్ హెరాల్డ్, డెక్కన్ క్రానికల్, సిటిజన్స్ ఈవెనింగ్ మరియు కరవాన్/అలైవ్ – పత్రికల్లో వివిధ సందర్భాల్లో ప్రచురితమయ్యాయట. నాకీ పుస్తకం గురించి గానీ, దీని రచయిత గురించి గానీ ఆట్టే తెలీదు….ఎక్కువ మాట్లాడితే అసలేం తెలీదు. ‘A collection of 62 short humorous stories’ అన్న కాప్షన్ చూసి చదవడం మొదలుపెట్టానంతే. నో రిగ్రెట్స్!

పేరులోనే ఉన్నట్లు, హాస్యం పాలు కొంచెం ఎక్కువే. అయితే, కథలు అనలేము. కాలమ్స్ అనొచ్చేమో. అలాగే, హాస్యం కంటే కూడా ఇది ఒక రకం వ్యంగ్యం – వ్యంగ్య హాస్యం, హాస్య వ్యంగ్యం, వ్యస్యం, హాగ్యం… – మీరెలా పిలిస్తే అది. రాజకీయాల నుండి, రౌడీయిజం దాకా (రామరామ – నేనేం వాటిని పోల్చట్లేదు!!) జ్యోతిష్యం,వాస్తుల నుండి ఒలింపిక్స్ దాకా, దోచేస్కునే దొంగల నుండి నదుల అనుసంధానం దాకా – ఇన్ని రకరకాల విషయాలు తీస్కుని వ్యంగ్యాస్త్రాలు సంధించిన పుస్తకం చదివి చాన్నాళ్ళైంది.

జ్ఞానదంతం పీకించుకోడానికి డాక్టర్ దగ్గరికెళ్ళి, అయ్యాక ఇలా అంటారు రచయిత:
“one should have the wisdom to know when to have the wisdom tooth extracted. A sweet tooth would leave bitter memories. Wisdom is an asset only when firm in mind, wisdom teeth useful only if firm in gums”
’క్యాప్’ వేయించుకోడం గురించి: “I was mistaken in that it would be a simple affair, like a leader putting one on, as the last item of dressing, and adjusting it for effect or for iftar”

“Population Clock”, “The Kings corner”, “The police are confused”, “Honking, Hyderabadi style”, “India – a sleeping sports gaint” – ఇలాంటివాటిలో ఉన్న వ్యంగ్యం నాకు బాగా నచ్చింది.

ఇదేదో అరవీర భయంకర హాస్య-వ్యంగ్య పుస్తకం. చదివి తీరాల్సిందే. లేకుంటే జన్మ వృధా అని కాదు కానీ – హాయిగా ఓ ఆదివారం సాయంత్రం బాల్కనీ లో కూర్చుని చదువుకోడానికో, మీ ఇంట్లో జనాలతో తగువులాడి మనశ్శాంతి కోల్పోయినప్పుడు కొంచెం రిలీఫ్ కోసమో, ఒక బోరింగ్ ట్రైన్ ప్రయాణం జాలీగా మార్చడానికో – ఈ పుస్తకం తప్పక చదువుకోవచ్చు.

పుస్తకం వివరాలు:
Day is Night – A collection of 62 short humorous stories
J.R.Jyothi
ప్రచురణ : జైకో బుక్స్
ప్రథమ ముద్రణ: 2007
వెల: 175/-

You Might Also Like

One Comment

  1. Raana

    ఈ పరిచయము చదువుతుంటే పతంజలి గారి ‘పతంజలి భాష్యం ‘ గుర్తుకు వస్తుంది.
    తెలుగులో ఇంకా ఎవరైనా జర్నలిస్ట్స్ / రచయితలు ఇలాంటి వ్యంగ రచనలు చేసారా?
    ( on contemporary socity /curent events /politics)
    Vaguely remember some books by Narla,Ko.Ku etc.)

Leave a Reply