అడవిబాపిరాజు గోనగన్నారెడ్డి – సమీక్ష

వ్యాసం రాసిపంపినవారు: బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్

నాకు మొదట్నుంచి కథలూ, కాకరకాయలంటే చాలా ఇష్టం. అందునా జానపద,చారిత్రాత్మక, పౌరాణిక గాథలంటే చెవికోసేసుకుంటాను. గోనగన్నారెడ్డి గురుంచి విన్న తొలిసారి అతనెవరో తెలుసుకుందామని గూగులమ్మలో వెతికితే తెలుగువన్.కాంలో అడవిబాపిరాజు గారి నవల ధారావాహిక రూపంలో కనిపించింది. ఒక పేజి చదివగానే,ఇదేదో సులభంగా చదివి అర్థం చేసుకొనే కథ కాదని అర్థమై ఆ ప్రయత్నానికి విరామం యిచ్చాను. ఇన్నాళ్ళకు ఆ కథ చదవాలన్న కోరిక మళ్ళీ పుట్టి, పుస్తకం కొని చదవడం జరిగింది.

మొదట కథలోకి వెళ్ళి,తర్వాత కథనంలోకి వెళ్దాం.

కథ:

గణపతిదేవుడు ఓరుగల్లు రాజధానిగా చేసుకొని కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజులవి.

కాకతీయ సామ్రాజ్యానికున్న అనేకానేక సామంతులలో బుద్ధపురం మహారాజు గోన బుద్ధారెడ్డి ఒకడు. అతని తమ్ముడు లకుమయారెడ్డి. బుద్ధారెడ్డి ప్రభుభక్తి
పరాయణుడు. యాభై యేళ్ళకు అతనికి సంతానం కలుగుతారు.వారు కుప్పాంబ, గన్నారెడ్డి, విఠలరెడ్డి. వయోభారం పెరిగి అవసానదశకి చేరిన ఆయన, తమ్ముడు లకుమయ్యని పిలిచి, తన పెద్ద కొడుకు గన్నారెడ్డి పేరుతో రాజ్యపాలన చెయ్యమని, అతను పెద్దయ్యాక రాజ్యం అతనికే అప్పగించి,వేరొక నగరం పరిపాలించుకొమ్మని చెప్పి కన్నుమూస్తాడు. లకుమయ్య పసివాడైన గన్నారెడ్డి పేరుతో రాజ్యం చేస్తూ, ఆ పిల్లల్ని విద్యాభ్యాసం కోసం ఓరుగల్లు పంపిస్తాడు.

గణపతిదేవునికి పుత్రసంతానం లేరు. ఇద్దరూ కుమార్తెలే .పెద్దామె రుద్రమ్మదేవి, చిన్నది గణపాంబ. తన తర్వాత, తన వంశీయులే రాజ్యపాలన చేయాలనే
సదాశయంతో, మహామంత్రైన శివదేవయ్య ఆదేశాలకనుగుణంగా, రుద్రమ్మదేవిని చిన్ననాటి నుంచి పురుషునిలాగే పెంచుతారు. ఆఖరికి చెల్లెలైన గణపాంబకు కూడా ఈ విషయం తెలియనంత రహస్యంగా ఉంచుతారు. గణపాంబను ఒక సామంతరాజుకిచ్చి వివాహం చేస్తారు. రుద్రమ్మదేవి రహస్యం కాకతీయ సర్వసేనానైన జయాపసేనానికి చెప్పి, అతని కుమార్తె ముమ్ముడమ్మను రుద్రమ్మకిచ్చి వివాహం చేస్తారు. రుద్రమ్మ స్త్రీ అని లోకానికి వెల్లడించిన రోజున, ముమ్ముడమ్మను ఒక ఉత్తమ వీరునికిచ్చి వివాహం చేస్తామని చెబుతారు. శోభనం రోజు రాత్రి రుద్రమ్మదేవి ముమ్ముడమ్మను పిలిచి, తానొక వ్రతం చేస్తున్నాని,అది అయిన వెంటనే ఆమె కోరిక తీరుతుందని చెబుతుంది.

గణపతిదేవుడు వృద్ధుడవుతాడు. రుద్రమ్మదేవి కాకతీయ సింహాసనం అధిరోహిస్తుంది. రాజ్యంలో అల్లకల్లోలం బయలుదేరుతుంది. లకుమయ్య తన అన్న కుమారులకు ధనం పంపడం మానేస్తాడు. తనే రాజులా చెలామణి అవుతాడు. రుద్రమ్మ పీఠం ఎక్కాక, ‘ఒక ఆడదాని మోచేతినీళ్ళు తాగాలా’ అని హుంకరించి స్వాతంత్ర్యం ప్రకటించుకోవాలని నిర్ణయించుకుంటాడు. తనలాగే స్త్రీపాలనలో తలదాచుకోవడానికి ఇష్టపడని మిగతా సామంతరాజులతో, రుద్రమ్మదేవికి వరుసకు అన్నలైన హరిహరదేవులు, మురారిదేవులు, ఇతర శత్రురాజులతో చర్చలు జరుపుతూంటాడు.

గోనగన్నారెడ్డి తండ్రిలాగే కాకతీయవంశ వీరాభిమాని. పినతాండ్రి తనకు చేసిన అన్యాయం, దేశంలో జరుగుతున్న పరిణామాలు గమనించి కొంతమంది వీరులను తయారుచేసి, రుద్రమ్మదేవిని కలుస్తాడు. తామంతా గజదొంగలగా అవతారమెత్తి, రాజ్యంలో చెలరేగుతున్న అక్రమాలను పారద్రోలి, తిరుగుబాట్లను అణిచివేస్తామని, అందుకు అనుజ్ఞ ఇవ్వమని కోరుతాడు. రుద్రమ్మదేవి సరేనంటుంది. గన్నారెడ్డి నల్లమల అడవులలో ఒక పాడుబడిన దుర్గాన్ని బాగుచేయించి, తన సేనతో రహస్యంగా అక్కడ ఉంటూ అధర్మనిర్మూలనం చేస్తూంటాడు.

లకుమయ్య తన కుమారుడు వరదారెడ్డిని ఆదవోని రాకుమారి అన్నాంబికకిచ్చి వివాహం చెయ్యాలని తలపోస్తాడు. అన్నాంబికకు ఆ పెళ్ళి ఇష్టం ఉండదు. గన్నారెడ్డి మెరుపులా వచ్చి వరదారెడ్డిని అపహరించుకుపోయి, కొంతకాలానికి విడిచిపెడతాడు. లకుమయ్య మళ్ళీ వివాహ ప్రయత్నం చెయ్యబోగా, గన్నారెడ్డి ఈ సారి వధువైన అన్నాంబికను అపహరించి, అక్క కుప్పాంబను తోడునిచ్చి బావగారి రాజ్యానికి చేరవేస్తాడు. యుద్ధానికి వచ్చిన వీరాధివీరుల తలలెగరగొట్టి,బేడ చెలువనాయకుని మహాఢక్కను స్వాధీనం చేసుకొని, అతనికి క్షమాభిక్ష పెడతాడు. కుప్పాంబ అన్నాంబికను ఓరుగల్లులో రుద్రమ్మ దగ్గర చేర్చి తిరిగి వస్తుంది.

వేటకు వెళ్ళి, ఏమరుపాటుగానున్న రుద్రమ్మని, పెద్దపులి బారినుంచి చాళుక్య వీరభధ్రుడనే సామంతుడు రక్షిస్తాడు. ఆమె అతన్ని ప్రేమిస్తుంది. స్త్రీ సహజమైన భావావేశాలకులోనై, రాజ్యభారం వదిలేసి, సాధారణ స్త్రీలా బ్రతకాలనుకుంటుంది. తన భుజస్కంధాలపై ఉన్న బాధ్యతలు గుర్తొచ్చి, తన మనః స్థితిని కప్పిపుచ్చుకొని సామ్రాజ్ఞిలా మెలుగుతూంటుంది. తను స్త్రీ అన్న విషయం ముమ్ముడమ్మకు తెలియజేసి, ఆమెను ఓదార్చి, ఉత్తముడైన ఒక వీరునితో ఆమె వివాహం జరిపిస్తానని మాటిస్తుంది. అన్నాంబిక గన్నారెడ్డి ప్రేమలో పడుతుంది. అతను గజదొంగ ఎందుకయ్యాడని బాధపడుతుంది. అతన్ని క్షమించమని రుద్రమ్మను కోరుతుంది. రుద్రమ్మ ఆజ్ఞ మేరకే గన్నారెడ్డి అదంతా చేస్తున్నాడని, పైకి మాత్రం ఆమె అశ్చర్యం నటించి, కోపం ప్రకటిస్తోందని అన్నాంబికకు తెలియదు. రుద్రమ్మ, అన్నాంబిక, ముమ్ముడమ్మ మంచి స్నేహితురాళ్ళు అవుతారు.

గోనగన్నారెడ్డి ఈలోగా రుద్రమ్మదేవిని ధిక్కరించిన కేశనాయకుడిని ఓడించి, అతని ధనం, సైన్యం, స్వాధీనం చేసుకొని వదిలేస్తాడు. గన్నారెడ్డిని హతమార్చాలని లకుమయ్య లక్షలాది సైన్యంతో బయలుదేరి శ్రీశైలం చేరుకుంటాడు.గన్నారెడ్డి మనుషులు శివభక్తులుగా వేషాలు దాల్చి, ఉత్సవాలు చేస్తూ, ప్రసాదంలో మత్తుమందు కలిపి లకుమయ్యను బంధించి ఓరుగల్లు చేరవేస్తారు. రుద్రమ్మదేవి లకుమయ్యను బుద్ధిగా తన దగ్గరే ఉండమని హెచ్చరిస్తుంది.

గోనగన్నారెడ్డి విజృంభిస్తాడు. తిరగబడిన కాచయనాయకున్ని పరాజితున్ని చేసి, మెడకు ఉచ్చి బిగించి అతని కళేబరాన్ని గుఱ్ఱంతో లాక్కుపోతాడు. ఇంతలో రుద్రమ్మదేవి బావగారిపై దాడిచేసి అతన్ని బంధిస్తారు పేర్మాడిరాయుడు, కాటయ్యలు. రాజ్యంలో తిరుగుబాట్లు అణిచివేయడనికి, శివదేవయ్య మంత్రి ఆదేశానుసారం రుద్రమ్మదేవి విజయయాత్రకు సంకల్పించి సైన్యంతో బయలుదేరుతుంది. అన్నాంబిక పురుషవేషం ధరించి అంగరక్షకురాలిగా ఆమె వెంట కదులుతుంది. గన్నారెడ్డి ఈలోగా పేర్మాడిరాయున్ని, కాటయ్యను తన కాలుమీద పడేసుకొని వదిలేస్తాడు. రుద్రమ్మ సైన్యం గుంటూరు నాగమహారాజుని సంహరించి కంచి వరకు నడిచిపోయి తిరిగి ఓరుగల్లు చేరుకుంటుంది.

వృద్ధుడైన గణపతిదేవుడు మరణిస్తాడు. రుద్రమ్మదేవి జరగబోయే పరిణామాలూహించి ఓరుగల్లును కట్టుదిట్టం చేస్తుంది.గణపతిదేవుడు చనిపోగానే అప్పటివరకూ వినయవిధేయతలతో ఉన్న రాజులు తిరుగుబాటు వ్యూహం రచిస్తారు. కాళ్యాణి చోడోదయుడు ఇతర ప్రాంతాలు ఆక్రమించుకుంటూ ఒకప్పుడు గన్నారెడ్డి తండ్రి పాలించిన వర్ధమానపురం మీద దాడి చేస్తాడు. గన్నారెడ్డి పులిలా అతనిమీదపడి అతన్ని బంధించి బుద్ధిచెబుతాడు. రాజేంద్రచోడున్ని, ఏరువ భీమున్ని, కొప్పరుజింగని తరిమికొడతాడు. వారి దగ్గర్నుంచి ధన,ధాన్యరాసుల్ని, సైన్యాన్ని కానుకగా రుద్రమ్మకు పంపిస్తాడు. గన్నారెడ్డి మీద ప్రేమతో అన్నాంబిక పురుషవేషంలో కొంతకాలం అతని రక్షణలో ఉండి అతనితో పాటూ యుద్ధాలలోపాల్గొని మళ్ళీ రుద్రమ్మను చేరుకుంటుంది..

ఒకనాడు రుద్రమ్మదేవి, అన్నాంబిక కొంతమంది వీరులతో కలిసి మొగిలిచెర్ల వెళ్ళి కాకతమ్మకు పూజలు చేస్తారు. తిరిగివస్తూండగా రుద్రమ్మదేవికి వరుసకు అన్నలైన హరిహర మురారిదేవులు సైన్యంతో విరుచుకపడతారు. చాళుక్య వీరభధ్రుడు సుడిగాలిలా ఊడిపడి వారిని తుదముట్టించి ఆమెను రక్షిస్తాడు. దేవగిరి యాదవ మహాదేవరాజు ఎనిమిది లక్షల మాహాసైన్యం పోగుచేసుకోని ఓరుగల్లు మీద దండయాత్రకు వస్తాడు. గన్నారెడ్డి అతని సైన్యంపై పడి అపారమైన ప్రాణనష్టం కలిగిస్తాడు. రుద్రమ్మదేవి మంత్ర దండనాయకులతో సమావేశం ఏర్పాటుచేసి పక్కా ప్రణాళికతో, హోరాహోరీగా యుద్ధం చేసి అతన్ని తరిమికొడుతుంది. పారిపోతున్న అతని సైన్యాలని కొండలమాటున దాగి గన్నారెడ్డి సర్వనాశనం చేస్తాడు. దిక్కుతోచని స్థితిలో మహదేవరాజు రుద్రమ్మదేవి శరణుకోరి బ్రతికి బయటపడతాడు.

ఓరుగల్లులో సంబరాలు మిన్నంటుతాయి. నిండుసభలో గన్నారెడ్డి గజదొంగ కాదని స్పష్టం చేస్తాడు శివదేవయ్య మంత్రి. లకుమయ్యను, ఇతర స్వామిద్రోహులను క్షమించి విడిచిపెడతారు. రుద్రమ్మదేవి మారుపెళ్ళికి గణపతిదేవుడు విధించిన షరతులు మూడు. రుద్రమ్మను పెళ్ళాడిన పురుషుడు ఎంతగొప్పవాడైనా చక్రవర్తి కారాదు. రుద్రమ్మదేవియే రాజ్యాన్ని పాలించాలి. ఆమె కుమారుడు రాజ్యం వహించబోయే ముందు కాకతి వంశానికి దత్తత రావాలి. ఆ షరతులకన్నీ ఒప్పుకొని చాళుక్య వీరభధ్రుడు ఆమెను పెళ్ళిచేసుకుంటాడు. అతని సోదరునితో ముమ్ముడమ్మకు వివాహం చేస్తారు. అన్నాంబిక తనరాజ్యం చేరుకుంటుంది. రుద్రమ్మదేవి, భర్తతో సహా ఆదవోని వచ్చి, అన్నాంబికకు గన్నారెడ్డికి వివాహం జరిపిస్తుంది. గోనగన్నారెడ్డి వర్ధమానపురం(నేటి వడ్డిమాని) రాజుగా పట్టాభిషక్తుడవుతాడు.

కథనం:

అడవిబాపిరాజుగారు విశ్వనాథ సత్యనారాయణ,దేవులపల్లి కృష్ణశాస్త్రుల సమకాలికుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహిత్యంలోనే కాక సంగీత, చిత్రలేఖనాల్లోనూ వారికి ప్రవేశం ఉంది. వారికి చిరకీర్తి సంపాదించిపెట్టిన నవలల్లో గోనగన్నారెడ్డి ఒకటి.’ గోనగన్నారెడ్డి ‘నవల చదవడానికి చాలా ఓపిక, ఏకాగ్రత కావాలి. రచన గ్రాంథిక భాషలో సాగటం యిందుకు కారణం కాకపోయినా, వాక్యనిర్మాణం, రాజవంశీయుల చరిత్రలు, వారి పేర్లు(ఒకే పేరు ఇద్దరు ముగ్గరికి వుండటం), బిరుదులు కొన్నిసార్లు తికమకపెడతాయి. కథలో ప్రధాన పాత్రలకే కాకుండా, ఇతర పాత్రలకు కూడా స్తోత్రపాఠాలు వ్రాశారు బాపిరాజు గారు. సగం పేజీ ఆక్రమించే ఆ బిరుదపాఠాలు చాలా చోట్ల అనవసరమనిపిస్తాయి. సాధారణ పాఠకుడికి తెలుగు నిఘంటువు అవసరం చాలాసార్లు కలుగవచ్చు. ఈ లోటుపాట్లను తట్టుకొని ఆసాంతం చదవగలిగితే గోనగన్నారెడ్డి మంచినవల అనిపిస్తుంది.
చారిత్రాత్మక కథ వ్రాయటం చాలా కష్టంతో కూడుకున్నపని. ఎన్నో వంశాల చరితల్ని, వారి సమకాలికుల్ని, ఆ నాటి సంఘటనలని, శాసనాలని, ఇతర ఆధారాలని క్షుణ్ణంగా పరీశీలించి నేర్పుగా వ్రాయాల్సి ఉంటుంది. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా నవ్వులపాలు కాకతప్పదు. ఈ విషయంలో బాపిరాజుగారు పడ్డ కష్టం నవలలో ప్రతిఫలిస్తుంది. కాకతీయుల కాలంనాటి జీవనశైలిని, ఆహరపుటలవాట్లను, యుద్ధరీతుల్ని, కోటలను కళ్ళకు కట్టినట్లు వర్ణించడంలో బాపిరాజు కృతకృత్యులయ్యారు. ఆనాటి కాకతి ఉత్సవాలే నేటి బ్రతుకమ్మ పండుగలని చెబుతారు ఒక చోట. అలాగే ప్రధానపాత్రల చిత్రణ కూడా బావుంది. ముఖ్యంగా అటు రాజ్యక్షేమం కోసం పురుషుడిగా చెలామణి అవుతూ, ఇటు స్త్రీగా ప్రేమించినవాడి కోసం పరితపించే రుద్రమ్మదేవి మనస్తత్వాన్ని,ధీరమూర్తియైన గన్నారెడ్డి వ్యక్తిత్వాన్ని, అన్నాంబిక ప్రేమతత్వాన్ని చక్కగా ఆవిష్కరించారు. గన్నారెడ్డి చిత్రవిచిత్ర యుద్ధవిన్యాసాలు, మహదేవరాజు, రుద్రమ్మ సైన్యం తలపడినప్పుడు జరిగే సంఘటనలు రోమాంచకంగా తీర్చిదిద్దారు. అడవిబాపిరాజు గారి సాహితీయాత్రలో ‘ గోనగన్నారెడ్డి ‘ ఒక మేలుమజిలీ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ప్రతులకి విశాలాంధ్ర బుక్ హౌస్ ని సంప్రదించండి.

పుస్తకం వెల: 125
ప్రచురణకర్తలు:

ప్రతుల కోసం సంప్రదించాల్సిన చిరునామా:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
4-1-435,విజ్ఞాన భవన్,అబిడ్స్,
హైదరాబాద్-001
ఫోన్:24744580/24735905
ప్రచురణ చేసిన ఏడాది. : డిసెంబర్ 2009

You Might Also Like

18 Comments

  1. Venkateshh vemla

    రియల్ స్టోరీ కాకతీయ సామ్రాజ్య రుద్రమదేవి కథ మరియు గోన గన్నారెడ్డి గార్ల కథను అందించినందుకు ధన్యవాదాలు …

  2. నోరి నరసింహశాస్త్రిగారి రుద్రమదేవి | తెలుగు తూలిక

    […] పుస్తకం.నెట్‌లో ప్రచురించిన బెల్లంకొండ శ్రీకాంత్‌గారి వ్యాసం తోడ్పడింది. వారికి […]

  3. కృష్ణ

    గోన గన్నారెడ్డి, ఈ పుస్తకం చదువుతున్నప్ఫుడు ఎంత ఉద్వేగం, సంతోషం, ఇంకా వ్యక్తపరచలేని ఒక విదయమయిన బావంతో నా మది నిండిపోయింది. ఒక్కసారి కాదు, 5 సార్లు చదివాను, నా దగ్గరే పదిలంగా దాచుకున్నాను. ప్రతి వ్యాక్యం అమృత తుల్యం.

  4. రవి

    రాజు గారు తెలుగు (ఆంద్రుల చరిత్ర అనడానికన్నా) చరిత్ర లోని ఒక ఘట్టం కాకతీయుల కాలం నాటి స్థితిగతులు, రాజకీయ పరిణామాలు ఎలా ఉండేవి, ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవడం జరిగింది, వారి జీవన విదానము గురించి చాా చక్కగా వివరించిన నవల. శ్రీకాంత్ గారు కథనంలొ కొంత వివరించారు. ఇక్కడ నా విశ్లేషణ కొంత జోడిస్తాను.

    కాకతీయ సామ్రాజ్యం లో రుద్రమదేవి పరిపాలన స్వర్ణ యుగం అని చెప్పిన అతిశయోక్తి కాదు కాకతీయ కీర్తి పతాక స్థాయికి చేరిన కాలం కూడా . మరి రాజు గారు నవలకి గోనగన్నా రెడ్డి పేరు ఎందుకు పెట్టేరు? రుద్రమదేవిని కథనాయకిగా ఎందుకు చిత్రించ లేదు?

    పుత్రులు లేని రాజుల రాజ్యాలు దాయాదులకో లేక అన్యాక్రాంతం కావలిసి వచ్చేది. ఆలాంటి కాలంలో అప్పటికే 300సం గా వస్తున్న కాకతీయ రాజ్యం అంతం కాకుండ గణపతిదేవ రాజు ముందుచూపుతో రుద్రమను మగ వానిగనె పెంచుతారు. ఇది అంతయు ఒకరి వలన జరిగినది కాదు, మంత్రి గారి కుశలబుద్ది, చెదరని అత్మవిశ్వాసం పట్టుదలగల రుద్రమ గొనగన్నయ్య (నాకు అలా సంబొదించాలని ఇష్టం) రహస్య సాయం తో ఇంకా ఎందరో సాయం తో కాకతీయ సామ్రాజ్యన్ని ముక్కలు కాకుండ అందరిని ఒక్క తాటిపై నడిపిస్తుంది.

    గొనగన్నయ్య కాకతీయ రాజుల మీద ఉన్న భక్తి తొ తన జీవితాన్ని కాకతీయ సామ్రాజ్య సమైక్యత కోసం అంకుటిత దీక్షతొ, అంకితం చేసాడు. గొనగన్నయ్య గుణగణాలను రాజుగారు చాల వివరంగా ఆవిష్కరించారు. దైర్యసాహసాలకు, కుశలబుద్ది, నిగ్రహం సమయస్పూర్తి శత్రువు గుండెల్లొ నిద్రపొయె ముసుగు దొంగగా ప్రజలను ఆకట్టుకొగల చక్కటి విగ్రహము కలపొసిన ఉత్తమ వ్యక్తిత్వం.

    గొనగన్నయ్య లక్ష్యం ఒక్కటె కాకతీయ సామ్రాజ్యం. లక్ష్య సాథ కొసం ఎలా అడ్డంకులను అథికమించాడొ చాల ఆసక్తిగా ఉంటుంది. యుద్దవుహ్యం, దొమ్మి ప్రతి ఉహ్యం వంటి వివరణలు రాజుగారు చాలా చక్కగా ఉన్నవి.

    రాజు గారికి దేశభక్తి ఎక్కువ, స్వతంత్ర పొరాటంలొ పాలుపంచుకొని కారాగార శిక్ష అనుభవించాడు. ఆ కాలంలొ ప్రత్యక్షంగ కాని పరొక్షంగ కాని స్వతంత్ర కొసం తమ సాహిత్యాన్ని ఉపయొగించె వారు. అదె స్పూర్తి తొ ఈ నవల వ్రాసి ఉందవచ్చుని నా అభిప్రాయము, అలాగె కథా నాయకునిగా రాజు గారు గొనగన్నయను ఎంచుకొనడం జరిగు ఉందవచ్చు.
    ఈరొజు తెలుగు నాట నెలకొన్న రాజకీయ పరినామాలు నాకు గొనగన్నయను గుర్తుకు తెస్తున్నవి. మరల మనకి ఆంద్రకెసరి లాంటి నిస్వార్ద నాయకులు కావాలని ఆసిస్తున్నను.

    చివరిగా మనము బ్రౌన్ దొరకు చాలా ఋణపడిఉన్నాము, తెలుగు సాహిత్యాన్ని చాల ఉద్దరించాడు.
    ఒక దసాబ్థం క్రితం దూరదర్శ్నం తెలుగు లొ గొనగన్నరెడ్డి దారవహిక వచ్చి మద్యలొ ఆగింది.
    ఇప్పుడు గుణశెకర్ చలన చిత్రంగా తీస్తున్నట్టు విన్నాను, నాకు దీని మీద అంత ఆస పెట్టుకొలెదు, ఎప్పుడొ పెకెటి గారు (రాజుగారి మెనల్లుడు)అన్నారు ఈ నవలను చలన చిత్రంగా తీయలని, వారి ఆబిప్రాం కొసం ఎదురు చూస్తున్నాను.
    లెఖిని తొ ఇది నా మొదటి ప్రయొగం, ఎదయిన తప్పులు ఉంటె క్షెమించండి.
    -రవి

  5. Ravi

    @బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్: thank you for the tip. I will do it, it will be a small project for me.

  6. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్

    రవి గారు,
    lekhini.org వెబ్ సైట్ వెళ్ళి ఇంగ్లీష్ లో టైప్ చెయ్యండి.మీ సందేశం తెలుగులో వస్తుంది.

  7. Ravi

    Hi, I am visiting this site first time, how to write the replies in telugu? If I post any thing in English on Gonaganna Reddy, I feel its an insult to Raju and I would not be able to express what I am going thingking.

    Thanks.
    Ravi.

  8. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్

    @జంపాలచౌదరి గారు,

    నెనర్లు.నాక్కూడా బాపిరాజుగారి మొదటి నవల ఇది.నాకు బాగా నచ్చిన సన్నివేశాలు యుద్ధరంగానికి సంబంధించినవి.యుద్ధానికి ఎలా సిద్ధం అయ్యేవాళ్ళో,ఎలాంటి వ్యూహాలు పన్నేవారో చదువుతూంటే తెలియని ఉద్రేకం వస్తుంది.మరో సమీక్ష వ్రాసినప్పుడు spoiler alert పెడుతాలెండి.

    @హెచ్చార్కె గారు, థాంక్యూ

    @cbrao గారు,

    గోనగన్నారెడ్డిని సినిమాగా తియ్యాలని చాలాకాలంగా దర్శకుడు గుణశేఖర్ ప్రయత్నిస్తున్నారు.మొదట్లో,ఎన్.టి.యార్,తర్వాత నాగార్జున అనుకున్నారు.మొన్నామధ్య ఆ సినిమాని గుణశేఖర్ దర్శకత్వంలో తనే చెయ్యబోతున్నాడని బాలకృష్ణ ప్రకటించారు.నాకెందుకో ఇది రూపుదాల్చేలా అనిపించటం లేదు.నవలలో చెప్పినట్లు తియ్యాలంటే హీనపక్షం నలభై కోట్లైన ఖర్చుపెట్టగల నిర్మాత దొరకాలి.అశ్వనీదత్,శ్యాంప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు పూనుకుంటే తప్ప ఇది జరిగేపని కాదు.

    దీనికి సంబంధించిన పోస్ట్ నా బ్లాగ్ లో…

    http://bhava-nikshipta.blogspot.com/2010/02/blog-post_21.html

  9. cbrao

    కధ,కధనం ఆసక్తికరంగా చెప్పారు. ఈ నవలలో కొన్ని సంఘటనలు చాల Cinematic గా ఉన్నాయి. కధ చదువుతుంటే దృశ్యాలు ఎదురుగా ఉన్నట్లే గోచరమయినాయి.మగధీర విజయం తర్వాత, సినిమాకు కావల్సిన అన్ని మసాల దినుసులు ఉన్న ఈ నవలను చిత్రంగా తీయవచ్చు. ఏ పాత్రకు ఎవరైతే బాగుంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను.

  10. హెచ్చార్కె

    @కొత్తపాళీ: మీ లాగే నేనూ చాలా సంవత్సరాల కిందట చదివిన అడవి బాపిరాజు పుస్తకం ‘హిమబిందు’. ఇన్నాళ్ల తరువాత చెప్పడం కష్టం గాని, ‘హిమబిందు’ను మీరు కూడా ఇష్టపడతారనుకుంటున్నా.

  11. జంపాల చౌదరి

    లోకేష్ శ్రీకాంత్ గారూ:

    spoiler alert పెట్టకుండా సస్పెన్సు విప్పేస్తే ఎట్లా? 🙂

    గోనగన్నారెడ్డిని ఎప్పుడు తల్చుకొన్నా ఆ పుస్తకం మొదటిసారి చదివినప్పుడు నేను అనుభవించిన ఉద్వేగం, ఆనందం గుర్తుకు వస్తాయి. మా పెద్దమ్మ, అమ్మ అడవిబాపిరాజు నవలల గురించి చెప్తుండేవారు. హైస్కూల్లో చదివే రోజుల్లో మొదటిసారి చాటపర్రు లైబ్రరీలో గోన గన్నారెడ్డి పుస్తకం దొరికింది. అబ్బో, ఆ కథన వేగానికి, ఉత్కంఠకి, వస్తు విస్తృతికి, వర్ణనలకి మతిపోయింది. వెంటనే ఆయన మిగతా పుస్తకాలన్నీ వెదుక్కుని చదివేశాను. బాపిరాజుగారి భావుకత, కళాప్రియత్వం, తెలుగు సంస్కృతి మూలాల గురించి ఆయనకు ఉన్న అపేక్ష ఈ పుస్తకాలన్నింట్లోనూ కనిపిస్తుంది. ఆ వయస్సులో ఆయన నవలల్లో నాయకుల, నాయికల వ్యక్తిత్వాలు చాలా ఆకర్షణీయంగా ఉండేవి.

    ఇప్పటికీ ఆయన పుస్తకాలన్నింట్లోకి నాకు గన్నారెడ్డి అంటే ప్రత్యేకమైన అభిమానం. soc.culture.indian.telugu newsgroup ఉధృతంగా సాగుతున్న రోజుల్లో బాపిరాజు మీద ఒకసారి చర్చ జరిగినట్లూ, పాల్గొన్నవార్లో చాలామంది తాము చదివిన మొదటి బాపిరాజు పుస్తకమంటే ప్రత్యేక అభిమానం అని చెప్పినట్లూ గుర్తు.

  12. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్

    నాని గారు కృతజ్ఞతలు,

    కొత్తపాళీ గారు,నెనర్లు .గోనగన్నారెడ్డి లో కూడా అంతే,రుద్రమ్మదేవి తాత రుద్రమహారాజు.అడవిబాపిరాజు గారు రుద్రమ్మని రుద్రమహారాజు అని,గణపతిదేవున్ని గణపతిదేవ రుద్రమహారాజు అని సంభోధిస్తారు చాలా చోట్ల.ఇలాంటివే బోలేడున్నాయి.

  13. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్

    ప్రవీణ్ శర్మ గారు,రాజేశ్వరి గారు నెనర్లు

    1. నాగరాజు, రావులపాలెం

      లోకేష్ శ్రీ కాంత్ గారు చాల బాగా చెప్పారు

  14. కొత్తపాళీ

    నవల కథని క్లుప్తంగా మళ్ళీ చెప్పడంలో చక్కటి ప్రతిభ కనబరిచారు. అభినందనలు.
    గోనగన్నా రెడ్డి చదివి చాలా రోజులైంది అందుకని బాగా గుర్తు లేదు. ఈయన రచనల్లో గ్రాంధికం, శిష్టవ్యావహారికం, అచ్చ తెలుగు నుడికారాలు అన్నీ అలా అలవోకగా పెనవేసుకు పోతుంటాయి. పాత్రల పేర్లల్లో అయోమయం అడవి శాంతిశ్రీలో మరీ ఎక్కువ. అందులో కనీసం ఒక నలుగురు శాంతిశ్రీలుంటారు 🙂

  15. nani

    గోనగన్నరెడ్డి పుస్తకం ఎప్పుడో నేనుడిగ్రీ చదివేటప్పుడు కాలేజ్ లైబ్రెరీలో చదివాను. బాగుంటుంది.

  16. rajeswari

    nenu gonagannareddy chla sarlu chadivanu, ade kaka adivibapiraju garivi narayanarao,himabindu,adavi shanti sri kuda chadivanu. naku ayana katha chitrikarana chala istam. ante kaka ayana kathalalao hero ,heroin kuda chala fine arts lo pravinyam kalavarai vuntaru.adi ku da naku baga nachchutundi.

  17. Praveen Sarma

    అడవి బాపిరాజు నవలలలో నారాయణరావు నవల చదివాను. 1930ల నాటి భారతీయ సామాజిక పరిస్థితుల గురించి అందులో వ్రాసి ఉంది. గోన గన్నారెడ్డి నవల కూడా చదువుతాను.

Leave a Reply to rajeswari Cancel