చల్లగాలి, ఉప్పు నీరు – ఓ మహాసముద్రం

రాసినవారు: మురళీధర్ నామాల

పేరు: మహాసముద్రం
రచయిత: రమేశ్చంద్ర మహర్షి
పబ్లిషర్: ఎమెస్కో
మూల్యం: 80/-

సాధారణంగా నేను ప్రయాణంలో కాలక్షేపంకోసం ఒక నవలకొని చదివి ఎక్కడో పడేస్తా లేదా ఎవరికైనా ఇచ్చేస్తా. కాలక్షేపం కోసం కాబట్టి కాస్త పేరున్న రచయితల పుస్తకాలు కొనేవాడ్ని. పెట్టిన డబ్బులకి సరైన విలువ ఉండాలిగా మరి. ఒకసరెప్పుడో ఒక స్నేహితుడు “అధినేత” అనే నవలిచ్చి చదవమన్నాడు. తను చదవటమేకాక ఈ నవల కొన్ని కాపీలు కొని స్నేహితులకిచ్చాను అని చెప్పాడు. అధినేత చదివాక రచయిత మీద కాస్త గౌరవం కలిగింది. అందుకే ఒకరోజు ప్రయాణంలో రమేశ్చంద్ర మహర్షి వ్రాసిన రెండవ పుస్తకం ఈ మహాసముద్రం కొన్నాను. నవల చదవటం మొదలు పెట్టాను. కాసేపయ్యాక నా కోచ్‌లో ఉన్న మిగిలిన ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని లైట్స్ ఆపేసాను. పుస్తకం మాత్రం మూయాలనిపించలేదు. సెల్ లో ఉన్న టార్చ్‌లైట్ పెట్టుకుని పుస్తకం పూర్తిచేసాను. ఈ పుస్తకం లేదా ఎంచుకున్న ఇతివృత్తం అద్భుతం అని చెప్పలేను. కానీ అద్భుతమైన వాక్యాలతో నిండిన పుస్తకం. జీవితంలో మనం తరచి తరచి చూసుకునే పుస్తకాలు కొన్ని ఉంటాయి. నాకు ఈ పుస్తకం అలా మిగిలిపోయింది. మహాసముద్రం ఎప్పుడూ అందుబాటులో ఉండేవిధంగా నా పుస్తకాల రాక్‌లో ముందువరసలో పెట్టుకుంటా. ఎప్పుడు మూడ్ బాగుండకపోయినా అసంకల్పితంగా ఏదో ఒక పేజీ తెరుస్తా. ఆకట్టుకునే ఏదో ఒక వాక్యం నాకు కనిపిస్తుంది. హాయిగా అనిపిస్తుంది.

రచయిత ముందుమాటతోనే పుస్తకం మొదలవుతుంది. ఈ కధ వ్రాసేలా అతన్ని ప్రేరేపించిన సంఘటన అందులో వివరిస్తాడు. ఆర్ధర్ షోపెన్ హూవర్ అనే రచయితకి అతని తల్లికి మధ్య సంభాషణ అది. “అమ్మా నీ నవలలు చెత్తపోగులో కూడా మిగలని రోజున ప్రపంచం నా పుస్తకాన్ని నెత్తిమీద పెట్టుకుని గౌరవిస్తుంది” అంటాడు ఆర్ధర్ తల్లితో. ఆమె కోపంతో అతన్ని మెట్లమీద నుండి తోసేస్తుంది. “ప్రపంచం నీ పేరు ఎన్నడయినా తలిస్తే నా మూలంగానే” అంటూ వెళ్ళిపోతాడు. ఆ సంభాషణ రచయితలో కలిగించిన అలజడి మహాసముద్రం అయ్యింది.

“దృశ్యాలకొద్దీ జీవితాన్ని గడిపినా సత్యం తెలీదు! సాంద్రంగా పేరుకున్న గాయాలు మనసుకేంద్రం నుండి వేరు కావు. జీవితాన్ని కాలమే సంధిస్తుంది. హృదయాన్ని ప్రేమ భందిస్తుంది……”

“సముద్రమంత ఒంటరితనానికి లిపిలేని కన్నీటి చుక్కే సాక్షీభూతం”

“ఊపిరికి,ఉరికీ మధ్యన ఉలి పలికే కఠోరమైన గీతమై, విముక్తిలేని నా ఆత్మ క్షణానికీ క్షణానికీ మధ్య క్షణం కూడా విడవకుండా విలపిస్తుంది.”

“అందుకే ఈ రోజు నా కలం కన్నీటిలో ముంచాను.”

ఇవన్నీ కేవలం మొదటి పేజీలో మనల్ని పలకరించే వాక్యాలు. వెంటనే నేను పెన్సిల్ తీసుకుని నచ్చిన వాక్యాలను అండర్‌లైన్ చేయటాం మొదలుపెట్టా. కాసేపటికి విసుగు, ఆయాసం వచ్చి పెన్సిల్ పక్కన పడేసి పుస్తకంలో మునిగిపోయాను. ఇంకా ఇందులో రచయిత మనకి అందించిన మరో సర్ప్రైజ్ ప్యాకేజ్ కవితలు. అందమైన కవితలతో చంధస్సుని అలకరించుకున్న భావాలు మనల్ని అక్షరాల వెంట పరుగులు పెట్టిస్తాయి.

“గుండె కదలినప్పుడూ, మెదడు చిట్లినప్పుడూ, నిజం తెలిసినప్పుడూ కవితా ఓ కవితా నన్నావరించకమ్మా!”

“నా మనసొక మహా సహారా! నా అంతరాత్మ అసిధార!!”

“ఈ నల్లవారిన రేయి తెల్లవారదు నాకు ఆమె ఘనదీర్ఘ కురులు ఉరులు నాకు! మిత్రమా నువ్వెళ్ళిపోతావ్… నా కన్రెప్పలకింద ఇంకిపోని మహాసముద్రాన్ని వదిలేసి!”

“నీ పెదవుల తీరాల వెంట డావిన్సీ మొనాలిసా చిర్నవ్వులు ఆరబెట్టి డెకలామ్ చెక్కిళ్ళమీద గుల్ మొహరం పూలు పెట్టి..”

ఇలా భావుకత సాగిపోతూ ఉంటుంది. ఎప్పుడూ మనకి పరిచయంలేని ఒక పూలతోటలో అడుగుపెట్టినప్పుడు, ఎక్కడినుండో సన్నని తుషారబిందువుల తెర మనల్ని ఆవరించినప్పుడు కలిగే అనుభూతి కలిగిస్తూ ఉంటుంది. ఇక కధ విషయానికి వస్తే ఇతివృత్తం గానీ, పాత్రల చిత్రీకరణ గానీ మరీ అంత సృజనాత్మకమేమీ కాదు. మనకు బాగా పరిచయమైనవే. అందరూ ఉన్న అనాధ పాత్ర కధనాయకుడు అనిరుద్ధ. అనితర సాధ్యమైన ప్రతిభ ఉన్న పండితుడు. అక్రమ సంతానం కావటం చేత అతణ్ణి అసహ్యించుకుని పుట్టిన వెంటనే బయట పడేసిన తల్లి ఇంద్రాణి. కూతుర్ని ఎదిరించలేక, అధ్బుత ఘడియల్లో పుట్టిన మహత్జాతకుడైన మనవడ్ని వదులుకోలేక సతమతమయ్యే అమ్మమ్మ, జ్యోతిష ప్రపంచ సామ్రాఙ్ఞి, కవయిత్రి వైదేహీ నారయణన్. మహాపండితుడైన కధానాయకుడు సహితం బేలగా మారి ఒడిలో చేరి ఏడిస్తే అతడ్ని విజయతీరాలకు నడిపించే పరిణతి కలిగిన అతిలోక సౌందర్యరాశి కధనాయిక అవని. అంతులేని ఆవేదన, ఏడిపించే గతం నుండి జీవితంలో ఎదిగి “ఛీ!” అన్న తల్లి చేతే “సెహబాష్” అనిపించుకోవటమే ఇతివృత్తం.

కధలో వచ్చే సన్నివేశాలు, పాత్ర తీరుతెన్నులు కొన్నిచోట్ల ఆకట్టుకుంటాయి. నాకు తెలిసి నవలా సాహిత్యం కేవలం మధ్యతరగతి వాడి సాహిత్యంగా చెప్పుకోవచ్చేమో. ఎందుకంటే పైతరగతివాడికి చదివే సమయం ఉండదు. క్రింది తరగతివాడికి ఆ అవకాశం తక్కువ. అసలు కాలక్షేపం, ఉబుసుపోకపోవటం అనేది మధ్యతరగతి వాడి సాంస్కృతిక సంపదేమో మరి. అందుకే నవలా సాహిత్యం మధ్యతరగతి వాసనలని ఎప్పుడూ వదిలిబయటకి రాలేదు. కావాలంటే మన చేతన్ భగత్‌ని అడిగి చూడండి. ఇకపోతే మధ్యతరగతి పాఠకుడిని అలరించే ఐడియలిస్టిక్ సన్నివేశాలు, సంభాషణాలతో కధని నడిపించాడు రచయిత. నిజజీవితంలో తనకి సాధ్యం కానివి కధానాయకుడు సాధిస్తుంటే, ఆ పాత్రలో మనల్ని మనం ఇరికించుకుని ఇగోని సంతృప్తి పరుచుకుంటాం. అందుకునేమో ఈ నవల మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మొదట్లో ఆకట్టుకున్న రచయిత పుస్తకం చివరికి వచ్చేసరికి మాత్రం కాస్త విసుగు తెప్పిస్తాడు. సీరియల్‌గా వార పత్రికలో వచ్చినది కావటం చేత కొన్నివారాలు పొడిగించాలన్న ఆలోచన ఈ విసుగుపెట్టించే సన్నివేశాలకు కారణం అయ్యుండొచ్చు. అయినా నవలల్ని చివరి వరకు గ్రిప్పింగా నడిపించటం ఎంతయినా కష్టసాధ్యం. అయినా మూసకధలతో వచ్చి విజయవంతమైన ఎన్నో నవలల మధ్యలో కాస్త గుర్తింపుకు నోచుకోవాల్సిన నవల మహాసముద్రం. రమేశ్చంద్ర మహర్షి కేవలం రెండే నవలలు వ్రాసరంట. నవలాసాహిత్యాన్ని కొనసాగించి ఉంటే ఈ బాలారిష్టాలు దాటి ఆయన తెలుగు నవలా సాహిత్యంలో యండమూరికి మంచి పోటి ఇచ్చేవారని నా ప్రఘాడ విశ్వాసం. అద్భుతమైన వాక్యాలతో, కవితలతో నిండిన సాదారణ నవల మహాసముద్రం.కానీ నాకు మాత్రం వైజాగ్ బీచ్ ఎంత నచ్చిందో ఈ పుస్తకం కూడా అంతే.

You Might Also Like

4 Comments

  1. కొత్తపాళీ

    చాలా ఆసక్తి రేకిత్తించారు.
    ఇప్పుడూ పుస్తకం చేతికొచ్చేదాక చేతులు దురద ..

  2. bollojubaba

    పరిచయం చాలా చాలా బాగుంది

Leave a Reply