చివరకు మిగిలేది.

Regrettably, some people play the game too seriously; they are paid to read too much into things. All my life I have suffered the conflict between my love for literature and poetry and my profound allergy to most teachers of literature and “critics”. The French poet Paul Valéry was surprised to listen to a commentary of his poems that found meaning that had until then escaped him (of course, it was pointed out to him that these were intended by his subconscious).  — Fooled By Randomness, Nassim Taleb. (emphasis added)
తెలుగు సాహిత్యపు కిరీటంలో కలికితురాయి. తెలుగు సాహిత్యానికి “చివరకు మిగిలేది”. క్లాసిక్. తప్పక చదవాల్సిన నవల.”  – ఇవన్నీ నేనన్నవి కాదు. విన్నవి. పుస్తకం పేరుకు ముందూ వెనకా ఇన్నేసి విశేషణాలు చదివిన తర్వాత సహజంగానే చదవాలనిపిస్తుంది కదా. ఆలస్యం చేయకుండా పుస్తకాన్ని కొని చదివేసాను. చదివిన తర్వాత మన గోల ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి కదా, అందుకే ఈ రాత!  అయితే ఈ రాత తెలుగు సాహిత్యం అంతా  కరతలామలకం అయిన ఉద్ధండ పండితులకోసం కాదు (“పండితుల” -లో పన్ లేదు. ఒట్టు). సైకోఅనాలసిస్ లాంటి బరువైన సిద్ధాంతాలను అన్వయించి సాహిత్యానికి  నూతనార్థాలను ఆపాదించే భాష్యకారులకొరకూ కాదు. నా ప్రపంచం చాలా చిన్నది(ఇక్కడో చిరుమందహాసం)! ఈ రాత అక్షరాల్లో అందాన్నీ ఆనందాన్నీ ఆస్వాదించే సాధారణ పాఠకుల కోసం. “మా కాలంలో అలా ఉండేది..”  అనే నోస్టాల్జియా ఇంకా సోకని ఈ తరం పాఠకుల కోసం. సరే, ఎందుకు రాస్తున్నానో ఎవరికోసం రాస్తున్నానో స్పష్టం చేసాను గనుక ఇక అసలు విషయం లోకి వద్దాం. కథ!

కథ… ఈ సైటులో ఈ పేజీని మీరు చూస్తున్నారంటే  ఎక్కువమందికి ఈ పాటికి స్థూలంగా చివరకు మిగిలేదేంటో, దాని కథా కమామిషూ ఏంటో తెలిసే ఉండాలి. మొత్తం అంతా తిరిగి చెప్పడం చర్వితచర్వణమే అవుతుంది. బహుశా నేను తప్పించుకోజూస్తున్నానేమో. నిజం చెప్పాలంటే ఈ నవల లో కథ ఇదీ అని చెప్పడం కష్టం. ఆఁ! మీరనబోయేది నాకు వినిపించింది.కథ బహుశా నాకే అర్థం కాలేదనుకుంటాను. ఎప్పుడో యాభైల్లో రాసిన నవల. మనం మరో ముప్ఫైనాలుగేళ్లక్కానీ పుట్టలేదు. ఆ పరిస్థితులు తెలీదు, మనం మన జీవితాలకు అన్వయించుకోలేం, అందుకే అర్థం కాలేదేమో. కానీ ఏరోప్లేన్ లో ప్రయాణించటానికి ఏరోడైనమిక్స్ తెలియాల్నా అని మీమాంస. సరే, ఇది తెగేది కాదు. వదిలేద్దాం. మళ్ళీ కథలోకొస్తే- మన అవార్డు చిత్రాల్లాగ కథ ఇదీ అని చెప్పలేకపోవటం ఈ నవలకు కలిసొచ్చే అంశం అని నా ఉద్దేశం! విషయం ఇదీ అని సూటిగా చెప్పని విషయాన్ని మనం ఎలాక్కావాలంటే అలా అన్వయించుకోవచ్చు. ఈ వెసులుబాటూ మనుషులక్కల్పించే అవకాశాలు అనంతం. ఆయా వ్యక్తులు తమ తమ మానసిక స్థితిని బట్టి ఒక్కోలా అన్వయించుకుంటారు.

ఈ నవలలో నాయకుడు నిధి… దయానిధి. తనకు బాగా కావలసినవాళ్ళు ముద్దుగా నిధి అనిపిలుచుకుంటుంటారు (రచయిత తో సహా!). సార్థక నామధేయుడు. ఆడువారిపట్ల(conditions apply!) అనంతమైన కరుణ, దయా కలవాడు. సౌందర్యారాధకుడు. ఆదర్శప్రేమికుడు. కథ చివర్లో నిధిని దొరికించుకుంటాడు కూడాను. మన దయానిధి అంతర్ముఖుడు. Armchair Philosopher. తన జీవితం అతనికో ప్రయోగశాల. స్త్రీ పురుషుల సంబంధాలు, కుటుంబం, సంఘం, కట్టుబాట్లు, ప్రేమ…. జీవితానికి పరమార్థం లను గూర్చి తన అనుభవాల నేపథ్యంలో తత్త్వవివేచన(?) చేస్తాడు. తన జీవితంలో ప్రతి క్షణంలోనూ, చేసే ప్రతి పనిలోనూ, ఆలోచనలోనూ అర్థం కోసం, పరమార్థం కోసం పరితపించే మనిషి చివరకు, అర్థం లేదనీ జీవితం లో చివరకు మిగిలేది జీవిత అర్థం కాదనీ, అది తెలుసుకోవటానికి చేసిన ప్రయత్నాల జ్ఞాపకాలేననీ తెలుసుకుంటాడు. హ్మ్.. విధి బలీయం కదా! {దయానిధికి అలవాటైన పద్ధతిలో తర్కం ఉపయోగించి చెప్పాలంటే, Meaning of life is X (an assumption). Y = Memories of his quest for X. X doesn’t exist (he realizes it). Therefore, X=Y. Argumentum ad ignorantiam. Fallacy.}

పైన స్థూలంగా చెప్పిన కథను పుస్తకం చదవకముందు గమనిస్తే ఒక అద్భుతమైన పుస్తకానికి సరిగ్గా కావలసిన ఇతివృత్తం ఇది అని అనిపిస్తుంది. దురదృష్టవశాత్తూ బుచ్చిబాబు ఈ నవలను నడిపిన పద్ధతి ఇతివృత్తానికున్న అవకాశాలను పూర్తిగా నాశనం చేస్తుంది. కథాగమనం లో మన నాయకుడు నిధి చాలా విషయాలు “కనుక్కుంటాడు”. కొన్ని “ఆహా!” అనిపించేవి, కొన్ని ఆలోచింపజేసేవి అయితే చాలామటుకు విషయాలు మీలో మీరు “what the heck” అనుకునేట్టు చేస్తాయి. తప్పు దయానిధి ఆలోచనలది కాదు, ఆయా ఆలోచనల వైపు దయానిధిని పురిగొల్పడానికి దారితీసే పరిస్థితులు, ఆ వైనం. అర్థం అయీ కానట్టుగా ఉందా మీకు?  సరే, వివరిస్తాను.

ఈ తత్త్వాల గోల ఎలాగున్నా, మొదటగా ఒక సాధారణ పాఠకుడు ఏదైనా పుస్తకంలో చూసేది ఆ పుస్తకానికి చదివించే గుణం ఉందా లేదా అని. ఇది జెనరలైజేషన్ అంటారేమో, కావచ్చు. నేనైతే పుస్తకం లో చూసేది మొదటగా అదే.  తత్త్వమో, జీవిత పరమార్థమో తర్వాతి విషయం. ఈ నవలకు బొత్తిగా చదివించే గుణం లేదు. ముందుమాటను వదిలేసి నవల ప్రారంభమైన మొట్ట మొదటి పేజీలో ఇలాంటి పంక్తులు కొన్ని కనబడితే మీరేం చేస్తారు? చదివి చూడండి:

పడమటి ఆకాశంలో సూర్యుడు ఎర్రగా ఆవులించి మరో ప్రపంచంలో మూర్చిల్లిపోతే మిగిలినవి, పగటిని వదల లేక రాత్రిని వెతుక్కునే మత్తు మేఘాలు, నక్షత్రాలు భయంతో మెరుస్తున్నాయి. కాలవ తోకను త్రిప్పుకుంటున్న నల్లత్రాచులా వంకర తిరిగి దూరంగా అంతర్థానమైంది. (పేజి:1, విశాలాంధ్ర) (emphasis added)


తరువాయి పేజీలో:

“ఏదో పిట్ట కాలువ నీళ్లను కదిపింది. గడ్డిపోచలు కామంతో వొణికి పోతున్నాయి.” (పేజి:౩, విశాలాంధ్ర) (emphasis added)

మీకేం అనిపిస్తుందో తెలీదు కానీ, నా బుర్రలో అదేదో జంధ్యాల సినెమాలో ఒక పాత్ర “నేను కవిని కాదన్న వాడ్ణి కత్తితో పొడుస్తా” అంటుంది చూడండి, అది మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చింది. ఇలాంటి వర్ణనలు కోకొల్లలు. ఎవరైనా ఆసక్తితో పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నా మొదటి ఇరవై పేజీలకే తలనొప్పి తెచ్చి పెట్టడం లో బుచ్చిబాబు విజయం సాధిస్తాడు. ముందు రాబోయే గంభీరమైన విషయాల్ని అర్థం చేసుకోడానికి పాఠకుడికి ఈ మాత్రం స్టామినా అవసరం అని బుచ్చిబాబు అనుకున్నాడో ఏమో!  నాకంత స్టామినా లేకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగించాల్సి వచ్చింది. జాలమేధావులు వెలిగే కళ్ళతో దీన్ని వర్ణించి ఉండటం వల్ల కాబోలు. మానవుడు ఆశాజీవి! కథానాయకుడు దయానిధి పరమార్థం కోసం ప్రాకులాడినట్టు నేనూ ఈ పుస్తకాన్ని లెజెండరీ స్థాయికి నిలబెట్టిన “అది” ఏదో తెలుసుకుందామని తలనొప్పితోనే కొనసాగించాను. పేజీలు మారాయి, అధ్యాయాలు ముగిసాయి.. కానీ నేను వేచి చూసిన వసంతం రాలేదు. చివరికి దయానిధికి ఏం మిగిలిందో పుస్తక పఠనంలో నాకూ అదే మిగిలింది. (ఇక్కడో లిప్తకాలం పాటు దీనవదనం).

పుస్తకం ముగించి కింద పెట్టిన తర్వాత వద్దన్నా గుర్తుకొచ్చేది ఆడవారితో మన నిధి tryst. పేజీ తర్వాత పేజీలు ఒక్కొక్క పాత్రా రంగప్రవేశం చేస్తుంది. కోమలి, సుశీల, అమృతం, నాగమణి, ఇందిర, కాత్యాయని, రోస్… ఈ పాత్రలన్నింటికీ ఒక సారూప్యం ఉంది. రచయిత సృష్టించిన ప్రపంచపు standards ప్రకారమే అయినా, ఎందుకో ఈ అమ్మాయిలందరూ తమ తమ పాత్ర పరిధులు దాటి మన దయానిధిని ఇష్టపడేట్టుగానో , ప్రేమించేట్టుగానో, ఆరాధించేట్టుగానో, భరించేట్టుగానో చేస్తాడు బుచ్చిబాబు. అదీ పర్లేదు, నవలే కదా! కానీ చిక్కేమిటంటే ఈ పాత్రలు, వాటి స్వభావాలూ నిధి తాత్త్విక చింతనకు చాలా కీలకం. ఆయన ఆలోచనల ముడి సరుకు, తాను ఏర్పరుచుకునే అభిప్రాయాల వెనుక ఉన్నది ఇవే. తాను చెప్పదలచుకున్న విషయానికి అవసరమైన పాత్రలనూ, నేపథ్యాన్ని సృష్టించి కథ నడిపే క్రమంలో బుచ్చిబాబు తన నాయకుడి పాత్రతో మమేకం అవుతాడు. రచయిత తన గొంతుతో కథ చెబుతున్నట్టనిపించినా కొన్ని కొన్ని సార్లు దయానిధి గొంతుకూ, బుచ్చిబాబు కూ ఆట్టే తేడా కనిపించదు. కథానాయకుడి పాత్రమీద బుచ్చిబాబుకున్న ప్రేమ, నిధి ద్వారా వ్యక్తపరచాలనుకున్న విషయాలు వీటి గొడవలో పడి నవలా రచయితలు ఎప్పటికీ చేయకూడని పని బుచ్చిబాబు చేస్తాడు. మిగిలిన పాత్రలన్నిటినీ బలహీనపరచటం, రాజీపడేట్టు చేయటం, కొంచెం కఠినంగా చెప్పాలంటే – Intellectual Prostitution. సరిగ్గా ఇదే పాఠకుడిని కష్టపెట్టేది. పాఠకుడు అడుగుతాడు – “తమరికున్న భావాలూ, ఆశయాలూ, ఆదర్శాలు, తత్త్వం అన్నీ గొప్పవే! మీ దీర్ఘమైన ఆలోచనల సారాన్ని అంతగా ఆకట్టుకుకోని భాషలో, శైలితో మీరు చెబుతున్నా భరిస్తున్నాం, కానీ దానికి ప్రతిగా మీరు మాకేమిస్తున్నారు? కృతకమైన పాత్రలు, కథానాయకుడు విచ్చలవిడిగా తార్కిక conclusions కి వచ్చేందుకు వీలుగా అడుగడుగునా రాజీపడే పాత్రలు.”

మంచి రచయితలు, వీలైనంత తక్కువ సంభాషణలతో తాము చెప్పదలచుకున్న విషయాన్ని చెబుతారని ఎక్కడో విన్నాను (సోమర్సెట్ మామ్?). బుచ్చిబాబు నవల్లో అవసరానికి మించి సంభాషణలు వాడినట్టు అనిపించింది నాకు. అయితే అలా చేసినందుకు ఆయన్ని తప్పు పట్టట్లేదు. సమస్య తాత్త్విక అంశాలను గూర్చి సీరియస్ గా చర్చించే నవల్లోని సంభాషణల్లో కొంచెం గంభీరమైన అంశాలగురించి మాట్లాడేప్పుడు లైనుకు కనీసం రెండు చొప్పున logical fallacies ఉండటం. తన స్నేహితుడు రాజభూషణం, స్వామీజీల మధ్య సంభాషణలో ఈ విషయాన్ని గమనించవచ్చు. తర్కానికున్న పరిమితులేమిటో సత్యశోధకులకు అందరికీ తెలిసి ఉంటుంది. Herbert Spencer మరియు John Stuart Mill ఇద్దరూ ఒకసారి వాదానికి దిగారట. స్పెన్సర్ తన తర్క వాదనా పటిమతో తన position నిజమని నిరూపించాడు, వెంటనే opposite position తీసుకుని, అదే స్టూవర్ట్ మిల్ తో వాదించి, దాన్నీ గెలిచాడు. అదీ తర్కం పరిమితి. తర్కాన్ని సరిగ్గా ఉపయోగిస్తేనే ఇలా ఉంటే, మరి logical fallacies ఉంటేనో? మన నిధి స్నేహితుడైన రాజా, స్వామీజీ, మధ్య మధ్యలో హాస్యం పుట్టించాలని అర్థం లేని వాగుడు వాగే సైడ్ కిక్- నాథ్.. జగన్నాథ్, వారి మాటలను గమనిస్తే – రచయిత వారి చేత దయానిధి అప్పటికే ఏర్పరచుకున్న అభిప్రాయాలను మరింత విశదీకరించేందుకు వీలుగా మాట్లాడిస్తాడు. అనాగరికంగా చెప్పాలంటే pimping.  ఆయా పాత్రలు వారు ప్రాతినిథ్యం వహిస్తున్న భావాలకు ఏమాత్రం న్యాయం చేయవు.

ఇంతా చేసిన దయానిధి భావాల్లోనూ, చేతల్లోనూ consistency ఉంటుందా? లేదు. సరే, సరే….  consistency అవసరం లేదనీ, “A foolish consistency is the hobgoblin of little minds” అని ఎమర్సన్ ని కోట్ చేయవచ్చు. కానీ ముందే చెప్పాను కదా, నా ప్రపంచం చిన్నది 😉 (btw, I personally feel that Emerson is a jerk.) – దయానిధి అమృతం తో అంటాడు – “తప్పుకాదు, కానీ నీతి కాదు. అందరూ ఎట్టాచేస్తే అట్ళా చేయడం నీతికాదు. ఇతరుల మెప్పు పొందటం కోసం కాకుండా, నీకు నిజమని, మంచిదని, మనస్ఫూర్తిగా తోచిన విషయాలని ఆచరణలో పెట్టడం నీతి.” (పేజి: 139). తప్పొప్పులు కాదు, నీతిని చూడమన్న దయానిధి కొన్ని పేజీల తర్వాత మనసు మార్చేస్కుంటాడు! “ఒక రకం ప్రవర్తన నీతా, దుర్నీతా అని అడగకూడదు. అది అనుచరణీయమా, పరిపూర్ణ జీవనానికి తోడ్పడుతుందా, మొత్తం మీద చాలామందికి సంతోషాన్ని ఆరోగ్యాన్నీ ఇస్తుందా అని ప్రశ్నించాలి” (పేజి:162). అదీ సంగతి. పరిపూర్ణ జీవనానికి తోడ్పడుతుందా అని ప్రశ్నించే దయానిధి, తన వైఫల్యాలను సంఘం మీద తోసేటప్పుడూ, కట్టుబాట్లను ప్రశ్నించేప్పుడూ “అరె, ఇది పరిపూర్ణజీవితానికి తోడ్పడుతుందా” అని పరిశీలించడు. మనుషులు జీవితాన్ని ఒక జాడ్యం, ఒక పీడకలగా జీవిస్తున్నారని విస్తుపోయే దయానిధి – తన జీవితాన్ని మొత్తం ఒక జాడ్యం లాగా, పీడకలగానే జీవిస్తాడు! తన మామగారి హిపోక్రసీని ఎండగట్టే పెద్దమనిషి, తన మావగారి స్వభావానికీ, తను కట్టుకున్న భార్య అయిన ఇందిర బాధ్యురాలు కాదని తెలుసుకోడు. తన దగ్గరికి వచ్చిన ఒక రోగి మానసిక సమస్యలను తెలుసుకుని, ఆమె సౌందర్యరాహిత్యం అనే జబ్బుతో బాధపడుతుందని గ్రహించి, వ్యయప్రయాసలకోర్చి నయంచేయబూనిన కరుణామూర్త్గి, తన భార్య నిస్సారమైన జీవితాన్నీ, దానికి కారణం అయిన తననూ అస్సలు పట్టించుకోడు. ఏ “పురుష స్వామ్య సమాజ” భావజాలాలను ఎదిరిస్తాడో, అదే సమాజపు ప్రతినిధి అవుతాడు మన దయానిధి. ఇక కోమలితో ఆయన “నిస్వార్థ” ప్రేమ, తనని తాను దారుణంగా బాధించుకోవల్సినప్పుడల్లా తెచ్చిపెట్టుకునే “తల్లి ప్రవర్తన” అనే excuse, జీవితం చాలించాలన్నంత నిర్వేదంలో ఉన్నప్పుడు దొరికే నిధి, వజ్రాలు.. ఆ తర్వాత కథా ఇవ్వేమీ చెప్పుకోదగ్గవి కాదు!!

Existentialism ని తెలుగు వారికి పరిచయం చేసిన original thinker అని విమర్శకులు పరిచయం చేసినా నాకు మాత్రం ఇది ప్రముఖ existential philosopher అయిన Jean Paul Sartre రాసిన ప్రసిద్ధ నవల Nausea కి పేలవమైన అనుకరణ అనిపిస్తుంది. అంటే మక్కీ కి మక్కీ కాపీ అని కాదు, మన జాతి గర్వించదగ్గ సంగీత దర్శకుడు చక్రి అప్పుడప్పుడూ “ప్రేరణ” పొంది బాణీలు కడతాడు చూడండి, అలాగన్నమాట!

చివరిగా విమర్శకుల గూర్చి ఒక చిన్న మాట. పైన నే చెప్పిందంతా నేను ఈ పుస్తకం చదవగా నాక్కలిగిన ఆలోచనలు. అవును, నాకీ పుస్తకం చివరికి 267 పేజీల తలనొప్పిని మిగిల్చింది. ఇది బుచ్చిబాబు తప్పూ కాదు, పాఠకుడి గా నాదీ కాదు. ప్రతి పాఠకుడికీ నచ్చేట్టుగా రాయాలని ఏ రచయితా ప్రయత్నించడు, అలా ప్రయత్నించకూడదు కూడాను! అలా చేస్తే రచయిత తనని తాను మోసం చేసుకున్నట్టే. పుస్తకాన్ని చదివిన పాఠకుడెవరైనా దాని గురించి మాట్లాడేప్పుడు తన అనుభవాలను, తన భాషలో చెబుతాడు. ఇంకొందరు, కొంచెం ముందుకెళ్ళి విశ్లేషిస్తారు, మానవ సహజమైన చాంచల్యంతో – ఫలానా లాగా రాసి ఉంటే నాకు ఇంకా బాగనిపించేది అని చెబుతారు. ఇదంతా పర్లేదు. కానీ ఫలానా పుస్తకాన్ని ఫలానా గా “నువ్వు” చదవకూడదు అనో, ఫలానా పుస్తకాన్ని “ఇందుకే” చదవాలి అనో మీతో ఎవరైనా చెబితే – వారు మీ మేధస్సును అవహేళన చేస్తున్నారని గుర్తుంచుకోండి. అది మీకు సమ్మతమేనా, కాదా అన్నది మరో సంగతి!! నేను ఈ వ్యాసం మొదట్లో ఉంచిన కోట్ ఎందుకో ఇప్పుడు మళ్ళీ చదవండి!!

Note to commenters: Criticism will be celebrated. Advise will be met with appreciation. Sarcasm with enthusiasm and Idiocy with ruthlessness.

You Might Also Like

24 Comments

  1. పవనకుమార్

    @Chandrasekhar: ప్రమాణాల్ని సమీక్షించుకోడం చాల పెద్ద మాట. అది జరగాలి. ఇప్పుడు జరుగుతున్న దానికి ఆ మాట అతిశయోక్తి అవుతుంది. ఎవరి అభిరుచుల్ల్ని వారు నిర్భయంగా చెప్పుకోడం జరుగుతోంది. పాత ప్రమాణాల్ల భారం కింద మౌనంగా నలిగిపోకుండా, నిర్భభయంగా ఎవరి అభిరుచిని వారు చెప్పడం, మీరన్నట్లు, ఆహ్వానిందగినది. ప్రోత్సహించ దగినది. ఇది ప్రమాణాల్ని తిరుగదోడడానికీ, ‘మనుషుల తలల మీద దెయ్యపు భారంగా వుండిపోయిన పాత ప్రమాణాల్ని వదిలించికోడాని’కి దారి తీస్తుందని ఆశిద్దాం. ‘రాజకీయం’… ఆ మాటను మీరుపయోగించిన అర్థంలో… ఎప్పుడూ వుంటుంది. ఇక్కడ కూడా మంచి రాజకీయం కోసం ప్రయత్నించడమే మనం చేయగల్గింది. దానికి మీరు… చాల మెత్తని మాటలు ఉపయోగిస్తూనే… సూచించిన ఉపమానం సరిపోదు. ‘చివరకి మిగిలేది’ ని విమర్శించే వాళ్లను రాఘవేంద్ర రావును అభిమానులతో, ఆ పుస్తకాన్ని పదే పదే చదివే మిమ్మల్ని కురుపోవా అబిమానులతో పోల్చడంలో ‘రాజకీయం’ ఉంది. అలా కాదు. దానికి బదులు ఇతర్లు ‘చివరికి మిగిలేది’ లో ఏమి మిస్సయ్యారో, మిమ్మల్ని చదివించిన పుస్తక విశేషాలు లేక గుణాలు ఏమిటో వివరంగా రాయండి.

  2. మెహెర్

    @sarangadhara:

    అక్షరాపేక్ష: http://loveforletters.blogspot.com/

  3. sarangadhara

    మెహర్ గారూ మీ బ్లాగు పేరు చెప్పరూ…

  4. Chandrasekhar

    ఈ మధ్య చివరికి మిగిలేది పై జరుగుతున్న చర్చ సాహిత్యవిమర్శకు సంబంధించి కొన్ని మౌలిక ప్రశ్నలు లేవనెత్తినట్టు కనిపిస్తోంది. ఏ సాహిత్యంలోనైనా ఇవి ఉత్తమ గ్రంథాలు (ఇంగ్లీష్ లో కేనన్ అంటారు) అని విమర్శకులు ఉత్తమాభిరుచిని నిర్ణయించడం వెనుక ‘రాజకీయ ‘ కారణాలుంటాయి. తెలుగు లో కేనన్ ని సమీక్షించే పని ఇలాంటి చర్చల్లో ఇప్పుడు జరుగుతోందనుకుంటాను. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. ఈ చర్చ ఒకో సారి వస్తుపరంగా సాగితే, ఒకోసారి శిల్పపరంగా సాగుతోంది, అయితే ఇలాంటి చర్చలు తీసుకొచ్చే చిక్కులు కూడా వున్నాయి. ఒక నవల నచ్చినవాళ్ళకి, అసలే నచ్చనివాళ్ళకీ మధ్య జరిగే ఎడతెగని సంవాదం వల్ల వారిద్దరి మధ్యా ఉమ్మడి ప్రమాణాలు లేవని అర్ధమవుతుంది తప్ప, చదివే పాఠకులకు ఏమీ ప్రయోజనం కనిపించట్లేదు. మహా అయితే పదుగురాడు మాట పాటియై ధరజెల్లు అన్నట్టు మంది బలంతో ఒక అభిప్రాయానికి ప్రాచుర్యం కలుగుతుందేమో. కళారంగాన్ని మార్చి చూస్తే కె.రాఘవేంద్ర రావు సినిమాలు నచ్చే వ్యక్తి కురుసోవా సినిమాలు ఎబ్బెట్టుగా వున్నయని తన అభిప్రాయం వెల్లడించవచ్చు, కానీ ఆ అభిప్రాయానికి ఏవిధమైన ప్రయోజనం ఉంటుంది? అలాగే శాస్త్రీయ సంగీతం నచ్చేవాళ్ళకి, అది నచ్చని వాళ్ళకి మధ్య సంభాషణ సాధ్యమా? చివరికి మిగిలేది నవలను పదే పదే చదువుకుని ఆనందించే నాబోటివాళ్ళకు వచ్చే సందేహాలివి.

  5. venkat

    ఎవరైనా చండీదాస్ గారి అనుక్షణికం ని సమీక్షిస్తారేమో నని ఎదురు చూస్తున్నాను,,

  6. Achilles

    “ఈ గమనికల సాంప్రదాయం కొనసాగటం మంచిది కాదేమోనని నా అభిప్రాయం”

    సరే ఇకపై నేనేమైనా రాస్తే అందులో గమనికలుండవు. ఒకే? 🙂

  7. రమణ

    “మంచిది. నవల ఉత్తమమని నేను వినిఉండటం మూలాన, ముందుమాట చదివి తర్వాత చదవడం వలన, ఎవ్వరిదగ్గరో దీని గురించి వినడం వలన చివరికి చదివేసరికి నాకు అనుకున్నంత స్థాయిలో నచ్చలేదు అని మీరు అన్యాపదేశంగా చెప్పదలచుకున్నారా?”

    నా ఉద్దేశం అది కాదు. ఈ తరం వాళ్ళకు కూడా నవల నచ్చుతుందని. ఎవరో బాగుందని చెప్పారని వారిని అనుసరించకుండానే నచ్చుతుందని.

    “ఇక గమనికల గురించి. తెలుగు బ్లాగు ప్రపంచంతోనూ ఇక్కడి మనుషులతోనూ కొంత అనుభవం ఉండటం మూలాన ఆ గమనికలు వ్యాసంలో వచ్చి చేరాయి. అంతే. మీలా చర్చించదలచుకున్నవారికి అవి వర్తించవు.”

    ఏ విధంగా నేను మిగతా వాళ్ళ కంటే చర్చించదలచుకున్న వాడినో నాకు అర్ధం కాలేదు. ఇక్కడ ప్రతి ఒక్కరికీ తమకు తెలిసింది చెప్పాలనే ఉంటుంది. నిజానికి హేలీ రాసిన వ్యాసం బాగోలేదని నేను కూడా విమర్శించాను. ఈ గమనికల సాంప్రదాయం కొనసాగటం మంచిది కాదేమోనని నా అభిప్రాయం.

  8. Achilles

    @రమణ:

    “ఈ వ్యాసంలో మీరు ఉటంకించిన వాక్యాలు నాకు దోషంగా కనపడటం లేదు”

    దోషం ఉందని నేనలేదు. నాకు వికటించిన కవిత్వంగా అనిపించిన కొన్ని పంక్తులను ఉదహరించాను. ఈ తరహా వచనం మీకు నచ్చిందంటున్నారు. సరిగ్గా అదే రీతిన *నాకు* నచ్చలేదు అంటున్నాను. వ్యక్తుల అభిరుచులను సరళీకరించి, త్రాసుల్లో తూచి లెక్కలు కట్టి ఒక విశ్వవ్యాప్త బెంచ్‍మార్క్ తయారు చేసే ప్రక్రియ ఇప్పటికింకా అందుబాటులోకి రాలేదు. there is no tangible way of measuring ones’s likes and dislikes, tastes etc., అలాంటి ప్రక్రియ ఒకటి అందుబాటులోకొచ్చినప్పుడు మీకు నచ్చడం, నాకు నచ్చకపోటం లో ఏది సరైనదో మనం నిర్ణయించుకోవచ్చు. అందాకా మీకు నచ్చినందుకూ, నవలను మీరు ఆస్వాదించినందుకూ నేను సంతోషిస్తున్నాను. మీ నుంచి కూడా ఇదే ఆశిస్తాను. 🙂

    “మీరు ఇప్పటి తరం వాళ్ళకు నచ్చదు అన్నారు”

    ఇది కూడా మీరే అంటున్నారు! ఇప్పటి తరానికి నచ్చదు అనేవారు “ఏరోప్లేన్ లో ప్రయాణించటానికి ఏరోడైనమిక్స్ తెలియాల్నా అని మీమాంస” ఎందుకు పడతారు? 🙂

    “ఈ పుస్తకం చదివే వరకు నాకు తెలిసిన రచయితలు 80,90 దశకాలలో ప్రముఖ రచయితలుగా పేరున్న వారు మాత్రమే. వారిని తక్కువ చేయటం నా ఉద్దేశం కాదు. ఇది ఉత్తమ నవల అని నాకు అంతకుముందు తెలియదు. ఎవరి దగ్గరా వినలేదు. ఎక్కడా చదవలేదు.నవల చదివేముందు రచయిత ముందుమాట చదవలేదు.నేను కూడా ఇప్పటి కాలం వాడినే.మీకు-నాకు మహా అయితే రెండు మూడేళ్ళు తేడా ఉంటుంది.”

    మంచిది. నవల ఉత్తమమని నేను వినిఉండటం మూలాన, ముందుమాట చదివి తర్వాత చదవడం వలన, ఎవ్వరిదగ్గరో దీని గురించి వినడం వలన చివరికి చదివేసరికి నాకు అనుకున్నంత స్థాయిలో నచ్చలేదు అని మీరు అన్యాపదేశంగా చెప్పదలచుకున్నారా? *అది నిజమయితే* వినండి. ఇవ్వేవీ జరక్కుండా, మీలాంటి పరిస్థితుల్లో ఈ నవలను చదివినా నేను ఇలాగే స్పందించి ఉండేవాడిని (అలా ఎలా అవుతావు అని అడగుతారేమో, అదృష్టవశాత్తూ నాగురించి నాకూ కుంచెం తెలుసు). తేడా ఏదైనా ఉంటే ఇక్కడ వ్యాసం మొదలుపెట్టిన పద్ధతిలో ఉండేది. అంతే.

    “మీకు, మరికొంత మందికి నచ్చకపోవచ్చు.పర్వాలేదు. వారి అభిప్రాయాలను గౌరవిస్తాను.”

    మీకు, ఇంకా చాలామందికి నచ్చిఉండవచ్చు. పర్వాలేదు. నేనూ మీ అభిప్రాయాలను గౌరవిస్తున్నాను. గౌరవించటం కంటే, I am indifferent to whether you like it loath it. Whether you call it a classic, or thrash it with a million intelligible arguments. Because I don’t give a damn to whether X likes a book I like or vice versa.

    ఇక గమనికల గురించి. తెలుగు బ్లాగు ప్రపంచంతోనూ ఇక్కడి మనుషులతోనూ కొంత అనుభవం ఉండటం మూలాన ఆ గమనికలు వ్యాసంలో వచ్చి చేరాయి. అంతే. మీలా చర్చించదలచుకున్నవారికి అవి వర్తించవు. 🙂

  9. Achilles

    @మెహెర్: మీ వ్యాఖ్యను నేను బాగా ఆస్వాదించాను. Thanks a lot!! 🙂

  10. మెహెర్

    @బొల్లోజు బాబా:

    బాబా గారూ,

    మనం ఏ విషయం గురించైనా మాట్లాడేటప్పుడు పదాల్ని నూటికి ఎన్నిపాళ్ళు ఆత్మాశ్రయంగా అన్వయించి వాడతామూ, ఎన్నిపాళ్ళు వస్త్వాశ్రయంగా అన్వయించి వాడతామూ అని లెక్కలు కట్టి మీకిప్పుడు చెప్పలేను గానీ, అవును, నా వరకూ బుచ్చిబాబు ఆ వర్ణనల్లో పప్పులో కాలేసినట్టే. ఎందుకో అప్పుడు తెలిసేది కాదు, ఎందుకూ అన్నదానికి ఇప్పుడు పేరు మాత్రం తెలిసింది, ఎందుకో కారణం కూడా తెలుస్తుంది. అప్పుడు మీకింకా సమర్థవంతంగా సమాధానం చెప్పగలను.

    “ఒక వేళ రచయిత పప్పులో కాలేసినట్లు మీకు స్పురించినట్లయితే ……. ??????”

    అన్ని ప్రశ్నార్థకాలెందుకటా?

    బుచ్చిబాబు రాతల్లో కవిత్వ పోకడ వుంటుందన్న విషయంలో నాకే సందేహాలూ లేవు. కానీ ఆ వర్ణించడంలో అతను అనుసరించే పద్ధతి నాకు నచ్చదు. మీరు కవిత్వం వుంటుందంటూ మూకుమ్మడిగా బుచ్చిబాబు, చలం, రావిశాస్త్రి, స్మైల్, యండమూరి అని అందర్నీ ఒకే గాటన కట్టేయమాకండి. కవిత్వం రాసేవాళ్ళంతా కవిత్వం చదివేవాళ్ళందరికీ నచ్చాలని లేదు కదా? వారందరి దగ్గరా కవిత్వం వుండొచ్చు. దాన్ని సమర్థవంతంగా వాడుకునేది — లేదంటే నాకు నచ్చేటట్టు వాడుకునేది — వారిలో కొందరే. బుచ్చిబాబు ఈ విషయంలో నన్ను ఆకట్టుకోలేకపోయాడు.

    “ఎల్లోరాలో ఏకాంతసేవ”లోనో ఎందులోనో సూర్యోదయ సూర్యాస్తమయాల వర్ణన వుంటుంది. పేరాలకు పేరాలు పదాలు గుప్పించాడు గానీ, అతని మనసులో (బహుశా) వున్న మనోజ్ఞ దృశ్యాన్ని నా దాకా తీసుకురాలేకపోయాడు. దానికి కారణం నేను పైన చెప్పిన లోపం వల్లనే. “అది మీకందలేదేమో” అని మీరనొచ్చు. అలా అందేలా చెప్పగలిగే రచయితలు కోకొల్లలు నాకున్నారు. ఇప్పుడు ఒక్క బుచ్చిబాబు నాకందలేదే అని నేను కుంచించుకుపోవాల్సిన పన్లేదు. కాదంటారా?

  11. రమణ

    // అతను బయటి వాళ్ళకి “నాకు ఫలానా రచయిత నచ్చాడు, నాకు ఫలానా రచయిత నచ్చలేదూ” అని మాత్రమే చెప్పగలుగుతాడు తప్ప, చదివేటప్పుడు తన మనసులో సాగుతున్న ఈ అమూర్త తతంగాన్నంతా విశదంగా మాటల్లో పెట్టగలిగే శక్తియుక్తులు అతనికి నూటికి తొంభై సందర్భాల్లో వుండవు //
    బాగా చెప్పారు మెహర్. నాకు బుచ్చిబాబు అనే రచయిత నచ్చాడు. బహుశా తర్వాత రోజుల్లో విశదంగా చెప్పగలనేమో ప్రయత్నిస్తాను.

  12. పవనకుమార్

    వ్యాసం చాల బాగుంది. నిష్కర్ష అంటున్నారు, ఇదీ నిష్కర్ష అంటే. చెప్పద‍చుకున్న ప్రతిదానికీ రచయిత వీరాభిమానులు సైతం కాదనలేని నిరూపణలు చూపించారు, అదీ సరదాగా సాగిపోయే అందమైన భాషలో. ఏవో పగటి కారణాలతో డిస్టర్బ్ అయి, కాస్త సాంత్వన దొరకుతుందేమో చూద్దామని ‘పుస్తకం’ తెరిచి, ‘చివరికి మిగిలేది’ మీద మరో వ్యాసమా, చూద్దాం అనుకుంటూ మొదలెట్టాను. వ్యాసం మొదటి నుంచి చివరి వరకు హాయిగా, ప్రేమగా చదివించింది. చివరికి ఏదో చాలానే మిగిలింది. థాంక్సండీ.

  13. రమణ

    రచనా శైలి వలనే ఈ పుస్తకం నన్ను అమితంగా ఆకట్టుకుంది. ఈ వ్యాసంలో మీరు ఉటంకించిన వాక్యాలు నాకు దోషంగా కనపడటం లేదు.మీరు ఇప్పటి తరం వాళ్ళకు నచ్చదు అన్నారు.ఈ పుస్తకం చదివే వరకు నాకు తెలిసిన రచయితలు 80,90 దశకాలలో ప్రముఖ రచయితలుగా పేరున్న వారు మాత్రమే.వారిని తక్కువ చేయటం నా ఉద్దేశం కాదు. ఇది ఉత్తమ నవల అని నాకు అంతకుముందు తెలియదు. ఎవరి దగ్గరా వినలేదు. ఎక్కడా చదవలేదు.నవల చదివేముందు రచయిత ముందుమాట చదవలేదు.నేను కూడా ఇప్పటి కాలం వాడినే.మీకు-నాకు మహా అయితే రెండు మూడేళ్ళు తేడా ఉంటుంది. ఇంకో విధంగా చెప్పాలంటే ఇటువంటి వచన కవిత్వంతో నిండిన రచనాశైలి, పాఠకుల ఆలోచనకు పదును పెట్టే కొంత మార్మికత, తాత్వికత ఇవన్నీ నాకు బాగా నచ్చిన అంశాలు. నిజానికి “ఇందిర చేసిన దోషం ఏమిటా?” అని ప్రశ్నించుకొనే వాడిని.ఆమె దోషం ఏమీ లేదనిపించింది. ఇది దయానిధి లోని లోపమే.ఈ కారణం వలన నవల నచ్చలేదని అనుకోలేను. ఆలోచిస్తే, ఇందిర కూడా ఒకసారి దయానిధి అమ్మను గురించి “ఇలాగ అంట కదా!” అని ప్రశ్నిస్తుంది. అప్పటినుంచి ఆమెకి దూరంగా జరుగుతాడు. ఒక్క ఇందిరనే కాదు. వాళ్ళ అమ్మ గురించి ఎవరు చెడుగా మాట్లాడినా వారిని విపరీతంగా ద్వేషిస్తాడు.. అంటే అమ్మ అంటే అతనికి వల్లమాలిన ప్రేమ. కాబట్టి దారుణంగా బాధ పడటానికి ఇదొక కారణం అనుకోలేము. ఉదాహరణ కి ఒకరిని ప్రాంతాన్ని బట్టో, భాషను బట్టో, ఇంకా మతం కులాన్ని బట్టి అవహేళన చేశారనుకుందాం; అతనికి అవహేళన చేసిన వారి పట్ల సహృదయత కలుగుతుందా? ఖచ్చితంగా కలగదు. సంఘాన్ని ద్వేషిస్తూ ఉండటమే అతని పని అయిపోతుంది. ఇక అమృతం, కోమలి, నాగమణి, కాత్యాయని… వీళ్లంతా ప్రేమను చూపటానికి కారణం దయానిధి బాగా చదువుకున్న వాడు అని ఉన్న పేరు మరియు అతను వాళ్లందరినీ విశ్లేషిస్తాడు కానీ వారితో సన్నిహితంగా ఉండడు.దూరంగా ఉన్న వాటి పట్ల ఆసక్తి కలగటం సహజం.
    ఈ నవల ప్రధానంగా ఒక యువకుడి అంతరంగాన్ని చిత్రిస్తుంది. కాబట్టి ప్రధాన పాత్రతో పోలిస్తే మిగతా పాత్రలకు ఆ స్థాయిలో గుర్తింపు ఉండదు. అలాగని మిగతావి పనికి రానివి కాదు. కోమలి,అమృతం,జగన్నాధం, నారయ్య, రాజా … వీరి వలనే దయానిధి గొప్ప. వారు తక్కువైతే దయానిధి గొప్పవాడు కాదు.
    రచయిత ఒక నవల, కధ రాసినపుడు అతని అనుభవం, మేధస్సు నుంచే సృష్టించాలి. కొన్ని కొన్ని అభిప్రాయాలు రచయితవి ఏ రచలోనైనా కనబడతాయి.
    స్థల కాలాల విషయానికి వస్తే ఈ కాలానికైనా ఇది ఉత్తమ నవలే అంటాను. మీకు, మరికొంత మందికి నచ్చకపోవచ్చు.పర్వాలేదు. వారి అభిప్రాయాలను గౌరవిస్తాను.
    కాకపోతే సమీక్షలు రాసేటప్పుడు ఈ గమనికలు ఉండకూడదని కోరుకుంటాను.

  14. Malakpet Rowdy

    Achilles, you rock! Guess I should read that book now.

    Ruth, order a copy for me too :))

  15. బొల్లోజు బాబా

    @mehar మిత్రమా

    ఇది మినహా ఇందులో నన్ను చదివించిందేమన్నా వుందంటే, ఇందులో వర్ణనలే (అంటే శైలే). అయితే వాటిలో కూడా ఏదో పప్పులో కాలేస్తున్న ధోరణి అప్పట్లో స్ఫురించేది. …… దానిక్కారణం నాకీ మధ్యనే తెలిసిన “Pathetic fallacy” అయి వుండొచ్చనిపిస్తోంది:

    పై వాక్యంలో పప్పులో కాలేసింది ఎవరు మీరా లేక రచయితా? మీరయితే “అయితే ఓ ఖే”

    ఒక వేళ రచయిత పప్పులో కాలేసినట్లు మీకు స్పురించినట్లయితే ……. ??????

    తెలుగు సాహిత్యంలో బుచ్చిబాబు, చలం లకు అంత గొప్ప పేరు రావటానికి, ఇప్పటికీ నిలచిపోవటానికీ ప్రధాన కారణం వారి వచనంలో కనిపించే కవిత్వమేనని నా అభిప్రాయం. ఇదే కోవకు వచ్చే మరికొంతమంది రచయితలు, రావిశాస్త్రి, స్మైల్, కొన్ని నవలలలో యండమూరి.

    బొల్లోజు బాబా

  16. మెహెర్

    @బొల్లోజు బాబా:

    బాబాగారూ,

    నాకు నన్ను ఒక్కణ్ణి మోసుకోవటానికే తడిసిమోపెడవుతుంది, ఇక ద్విపాత్రాభినయాలూ త్రిపాత్రాభినయాలూ కూడానా? అకిలీస్ నేనూ ఒకరు కాదు.

    ఇక ఫాథెటిక్ ఫల్లాసీ కవిత్వంలో ఒక దోషమని నేనెక్కడా చెప్పలేదే? దాని ఆధారంగా బుచ్చిబాబు శైలిపై ఏ తీర్మానాలూ చేయటం లేదు కూడా. అక్కడ నా వ్యక్తిగత అభిరుచిని చెప్తున్నానంతే. ఆ పద్ధతి నాకు నచ్చదు. ఎందుకు నచ్చదో కూడా అక్కడే చూచాయగా చెప్పాను. ఇక్కడ కవిత్వ చర్చ ప్రారంభించే ఉద్దేశ్యమూ నాకు లేదు. అకిలీస్ గారు ఊటంకించిన వర్ణనలు చూసాకా నాలో కలిగిన ప్రతిస్పందనని అక్కడ పంచుకున్నానంతే.

    “కవిత్వంలో తర్కం కూడదు” అన్నది కూడా మీ సొంత అభిప్రాయమే. నా వరకూ వస్తే, నా బోడి గుండు మెదడునీ, నా బొప్పాయి మనసునీ అనుసంధానించి ఒప్పించగలిగితేనే ఏదైనా అందంగా తోస్తుంది. నా తత్త్వం, ఏం చేయమంటారు. 🙂

    సమయాభావం వల్ల మీరు క్రింద ఇచ్చిన లింకుని ఇప్పుడు చూడలేకున్నాను. చూసి, స్పందించాల్సిందేమన్నా వుంటే రేపు రాస్తాను.

    ~ నాకున్న ఒక్కగానొక్క మెహెర్ 🙂

  17. బొల్లోజు బాబా

    మునుపటి హేలీ గారి వ్యాసంలో లేని సాధికారికత ఈ వ్యాసంలో కనిపిస్తుంది. మెహర్ గారి కామెంటు అల్టిమేట్ గా అనిపిస్తోంది. ఈ వ్యాసం అసలు మెహర్ గారే రాసారేమోనని అనుమానం. అచిలీస్ గారు మీరు వేరే వ్యక్తయితే సారీ :+)

    @mehar గారికి
    The pathetic fallacy or anthropomorphic fallacy is the treatment of inanimate objects as if they had human feelings, thought, or sensations.”

    ఈ పాథెటిక్ ఫాలసీ అనేది కవిత్వంలో దోషమేమీ కాదే. పెర్సనిఫికేషను, ఆంత్రోపోమార్ఫిక్ వర్ణనలు కవిత్వంలో ఒక ప్రక్రియే. వాటిని తప్పుగా పరిగణించవలసివస్తే , చాలా కవిత్వాన్ని పక్కనపెట్టాలి. విషయాన్ని చెప్పటానికి కవితీసుకొనే ప్రతీకలు కూడా కావొచ్చవి.

    బుచ్చిబాబు వచనంలో కవిత్వం గురించి ఎవరూ మాట్లాడటం లేదు. అచిలీస్ గారు ప్రత్యేకించి కోట్ చసిన పారగ్రాఫులలో ( ఎంఫసిస్ ఇచ్చిమరీ చేసానన్నారు) నాకైతే కవిత్వమే తప్ప అనౌచి్చ్యం కనిపించటం లేదు.

    కవిత్వంలో తర్కం కూడదు. ఉపమానాలను ఉపమానాలుగానే స్వీకరించాలి ఆనందించాలి. వాటికి సైంసుకో తర్కానికో వాడేటటువంటి పాథటిక్ ఫాలసీ వంటి వాటితో లంకె వేయటం, బోడిగుండుకు బొప్పాయికాయకు ముడివేయటం వంటిదే.

    బుచ్చిబాబు వచనంలోని కవిత్వం పై ఈ క్రింది లింకులో అలోక్ గారు చేసిన కామెంటును గమనించండి వీలైతే

    http://aavakaaya.com/articleComments.aspx?articleId=1271

    బొల్లోజు బాబా

  18. Achilles

    @రమణ: చర్చించదలచిన వారికి కోసం కాదండి గమనికలు. మీరేమైనా చెప్పదలచుకుంటే నిరభ్యంతరంగా చెప్పండి.

  19. రమణ

    వ్యాసానికంటే ముందు గమనికలు ఎక్కువుగా ఉన్నాయి. చర్చించటానికి అవే అన్నింటికంటే పెద్ద అడ్డంకి. మీకు ఎందుకు నచ్చలేదో వివరించారు. బాగానే ఉంది. మళ్ళీ ఎందుకు ఈ గమనికలు? మీరు నచ్చనివి చెప్పినట్లే, ఎందుకు నచ్చిందో మిగతా వారు చెబుతారు.

  20. mandaakini

    ఎప్పటికప్పుడు మారే సమాజంలో ఒక మలుపులో, ఒక మార్పు కొంతమంది లేక చాలా మందికి నచ్చిన ప్రతి పుస్తకాన్ని క్లాసిక్ అనడం పొరపాటు. మధ్యకాలంలో అణచివేతకు గురి అయిన దశలో అమల్లోకి వచ్చిన కొన్ని కట్టుబాట్లను, మూఢనమ్మకాల్ని ఎదిరించే తొలి రోజుల్లో ఈ నవల కొందరికి బాగా నచ్చి ఉండవచ్చు. అంత మాత్రాన ఖచ్చితంగా క్లాసిక్ అవదు. చలం గారి గురించి కూడా చాలా విని ఉండటం వల్ల స్త్రీ అనే నవల కష్టపడి చివరిదాకా (ఏమో నేను రచయిత స్థాయికి ఇంకా ఎదగలేదేమో అని ఓ మూల సందేహంతో) చదివితే “లేదు, ఖచ్చితంగా నన్ను నేను దిగజార్చుకోలేను” అనిపించింది, ఆఖరికి.

  21. మెహెర్

    చాలా బాగా రాసారు. మీరు ఇంకాస్త ఎక్కువగా, తరచూ రాయాలి. నేను రెండేళ్ళ క్రితం నా బ్లాగులో ఒక వ్యాసంలో “చివరికి మిగిలేది”ని ప్రస్తావిస్తూ క్రింది వాక్యం రాసాను:

    “ఒక పాతికేళ్ళ భవిష్యత్తులో, ఇంకా ‘చివరకు మిగిలేది’ ప్రచురణలో ఉండి, ఇంకా దాన్ని చదివే నూతన తరం పాఠకులు ఉన్నారన్న హైపోథెటికల్ సందర్భాన్ని మనం ఊహించ గలిగితే, వారు దయానిధి వేదననంతా చూసి ‘What the hell is the matter with this guy’ అని చికాకు పడి తీరతారన్న విషయం తట్టడానికి మనం బృహస్పతులం కానవసరం లేదు.”

    అప్పుడు ఒకరు “అలా ఎవరైనా ఎప్పటికైనా ఇక్కడ అంటారా” అని సందేహ పడ్డారు (అహ! నిజానికి మీదకొచ్చి పడ్డారు). మీరిప్పుడు, “what the heck” అంటుంటే అది గుర్తొచ్చి నవ్వొచ్చింది.

    కానీ నా వరకూ నేనెప్పుడూ గతంలో తప్ప ప్రస్తుతకాలంలో బతకనని నా చుట్టూ ఉండే పరిమిత జనబాహుళ్యపు మూకుమ్మడి ఫిర్యాదు. 🙂 మళ్ళా గతం అంటే “నా గతం”లో బతుకుతానని కాదు. “వీడిప్పుడు పుట్టాల్సినవాడు కాదు” తరహా ప్రతిస్పందనలు తరచూ వినిపిస్తుంటాయన్నమాట. కాబట్టి ఏడేనిమిదేళ్ళ క్రితం “చివరకు మిగిలేది” చదివినపుడు అందులో సంఘం-వ్యక్తుల సంఘర్షణ అనే కాన్సెప్టుని సానుభూతితో అర్థం చేసుకోగలిగాను. ఇది మినహా ఇందులో నన్ను చదివించిందేమన్నా వుందంటే, ఇందులో వర్ణనలే (అంటే శైలే). అయితే వాటిలో కూడా ఏదో పప్పులో కాలేస్తున్న ధోరణి అప్పట్లో స్ఫురించేది. కానీ ఏవిటో అవగతమయ్యేది కాదు. ఇప్పుడు మీరు ఉదహరించిన కొన్ని వాక్యాలు చూస్తే దానిక్కారణం నాకీ మధ్యనే తెలిసిన “Pathetic fallacy” అయి వుండొచ్చనిపిస్తోంది:

    “The pathetic fallacy or anthropomorphic fallacy is the treatment of inanimate objects as if they had human feelings, thought, or sensations.” — అని వికీ వాడి నిర్వచనం.

    మనిషికి చెందిన స్థితిగతుల్ని జడ పదార్థాలకి ఆపాదించడం: సూర్యుడు “ఆవులించడం”, “మూర్ఛపోవడం”; మేఘాల్లో “మత్తు”; నక్షత్రాల్లో “భయం”; గడ్డిపోచల్లో “కామం”… వగైరా అన్నమాట. ఇవి ఉపమానాలైతే ఫర్లేదు; అంటే, గడ్డిపోచలు సంధ్య వేళ అభిసారికల్లా కామంతో వణికిపోతున్నాయి, అంటే భరించేయొచ్చు. కానీ పై తరహా వర్ణనలు ఎందుకో ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. “గడ్డిపోచలు నీళ్ళ కదలికకు కంపిస్తున్నాయి” అని సూటిగా చెప్పివుంటే అందులో నిజం వుంది, అందం వుంది. కానీ సాక్షాత్తూ అవే కామంతో వణికిపోతున్నాయి అని చెప్పడంలో, రచయిత ఒక అబద్ధాన్ని పునాదిగా చేసుకుని కృతకమైన అందాన్ని సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే కనిపిస్తుంది.

    బహుశా పై వివరణని బట్టి నేను ఈ పుస్తకాన్ని ఏ తీరున చదివుంటానో, అసలు ఏ పుస్తకాన్నైనా ఏ తీరున చదువుతానో బట్టబయలైపోయి వుంటుంది. “చివరకు మిగిలేది” నుంచి ఈ తరపు పాఠకులెవరైనా పఠనానందాన్ని పొందదల్చుకుంటే, ఇది మాత్రమే మిగిలిన ఏకైక మార్గమనిపిస్తుంది. అలాకాదుపొమ్మంటూ సింబల్సూ, సైకో అనాలసిస్సూ, అస్తిత్వవాదం ఇలా కాలం చెల్లిన కాన్సెప్టులన్నీ ఈ పుస్తకానికి ఆపాదించి బెదరగొట్టజూసే పండిత విశ్లేషకులెవరైనా వుంటే, ఈ తరం పాఠకులు ఇలాగే సవినయంగా మిడిల్ ఫింగర్లు ఎక్కుపెడతారని నా అంచనా.

    నేనిప్పుడు బుచ్చిబాబు కథలు చదువుతున్నాను. అవి ఈ నవలతో పోలిస్తే కాస్త పరిణతి చెందినవే అనిపిస్తుంది. అయినా సరే, బుచ్చిబాబు నా తరహా రచయిత కాదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పటికీ కాదు, ఎప్పటికీ కాలేడు (అంటే ఇంకా ఎన్ని చదివినా). ఎందుకో వివరించడానికి ప్రయత్నిస్తాను.

    ఎప్పుడో ఎక్కడో చదివాను. పాఠకుడు కేవలం తను చదివిన కథలోని విషయం ఆధారంగా మాత్రమే ఒక పర్టిక్యులర్ రచయిత పట్ల అభిమానాన్ని పెంచుకోడు. ఆ కథల నేపథ్యంలో, ఎంత అస్పష్టంగానైనా సరే, తోచే రచయిత తాత్త్విక భూమిక ఆధారంగా మాత్రమే ఆ రచయితపైన అభిమానాన్ని పెంచుకుంటాడు. ఒక పుస్తకాన్ని మనం చదివి మాత్రమే వూరుకోం. చదివేటప్పుడు మన ప్రపంచంతో రచయిత ప్రపంచాన్ని ఎదుర్కొటాం. We confront his world with ours. అంతేకాదు, ఆ రచయిత తన ఏ వనరుల్ని కూడదీసుకుని తన చుట్టూ ప్రపంచాన్ని ఎదుర్కొంటున్నాడన్నది కూడా చూస్తాం. (For an artist, it’s always a confrontation with the world, never a friendly meet.) ఈ ఎదుర్కోవటం ఇలా కొనసాగుతూ, దాని పర్యవసానాలు అక్షరరూపంలో రచనలుగా వెలువడుతున్నప్పుడు, అతనా యుద్దం నుంచి ఏ తీరున బయటపడ్డాడన్నది కూడా వాటిల్లో మనం చూస్తాం. (క్షతగాత్రుడిగానా? స్నేహపూర్వకమైన సంధి కుదుర్చుకున్నవాడిగానా? బెంబేలెత్తి మోకరిల్లినవాడిగానా? పలాయనం చిత్తగించినవాడిగానా? లేక, ఇవన్నీగాక, విజేతగానా? — ఈ చివరిది తాత్కాలిక భ్రాంతి; ముగిసిన తర్వాత మళ్ళీ యుద్దం తథ్యం.) వీటి ఆధారంగానే అతనిపై మనకు అభిమానమో అయిష్టతో ఏర్పడుతుంది. అఫ్‌‍కోర్స్, ఇదంతా స్వయంగా పాఠకునికే తెలియదు. అతని ప్రమేయం లేకుండానే పఠనానుభవంలో ఇది జరిగిపోతూ ఉంటుంది. అతను బయటి వాళ్ళకి “నాకు ఫలానా రచయిత నచ్చాడు, నాకు ఫలానా రచయిత నచ్చలేదూ” అని మాత్రమే చెప్పగలుగుతాడు తప్ప, చదివేటప్పుడు తన మనసులో సాగుతున్న ఈ అమూర్త తతంగాన్నంతా విశదంగా మాటల్లో పెట్టగలిగే శక్తియుక్తులు అతనికి నూటికి తొంభై సందర్భాల్లో వుండవు. నాకు బుచ్చిబాబు రచనల పట్ల ఎప్పుడూ ఇలాంటి ఇబ్బందే కలుగుతుంది. బుచ్చిబాబు రాసిన తీరు అప్పుడపుడూ చాలా బాగా నచ్చుతుంది. అతని శైలి తెలుగులో అరుదుగా కనిపిస్తుంది. “నన్ను గురించి కథ రాయవూ” తరహా కథలు అతను మాత్రమే రాయగలిగేవి అనిపిస్తుంది. కానీ అతను రచయితగా ప్రపంచాన్ని ఎదుర్కొనే తీరులో మాత్రం ఏదో నాకు ససేమిరా నచ్చదు. అందుకే బుచ్చిబాబు నా తరహా రచయిత కాదు.

    అతని కథానాయకుల ఆధ్యాత్మిక గగ్గోలేమిటో నాకు చాలా సందర్భాల్లో అర్థం కాదు. (ఇపుడెవరైనా నాకు అర్థమయ్యేట్టు చెప్పాలని ప్రయత్నిస్తే, వాళ్ళకి వాళ్ళ వాదనతోనే తలక్రిందులుగా ఉరేయగలిగే తెలివి మాత్రం నాకుంది.) “ఎల్లోరాలో ఏకాంత సేవ” కథలోలాంటి అతని కథానాయకులు చిర్రెత్తిస్తారు. దయానిధి కూడా అంతే. కోమలి చుట్టూ అతను ఏం పేర్చుకుని తల్లక్రిందులైపోతున్నాడో నాకు అర్థం కాదు. ఆమెలోని సాదాసీదా లేకితనాన్నీ, రోదసిలో తమ పాటికి తాము వెలుగులు చిమ్ముకుంటున్న నక్షత్రాల మార్మికతనీ కలిపి అతను అల్లుకునే చిత్రమైన ముడులు నాకు నవ్వుతెప్పిస్తాయి. ఈ సజ్జు కథానాయకులే బుచ్చిబాబుకు ఏకలవ్య శిష్యుడైన వడ్డెర చండీదాస్ హయాంలో మరీ ముదిరి పాకాన పడ్డారు. అసలు చలం ముదిరి బుచ్చిబాబూ, బుచ్చిబాబు ముదిరి చండీదాసూ అయ్యారని నా థీసిసు. కానీ తాత్త్వికదృష్టి ప్రకారంగా చూస్తే చలం చలమే, మిగతా ఇద్దరూ ఆయనకి పేలవమైన నకళ్ళు మాత్రమే అనిపిస్తుంది. ప్రపంచం పట్ల ఆయన రొమాంటిక్ నిరసనలో వుండే దుందుడుకు అందం మిగతా ఇద్దరి దగ్గరా ఏ మాత్రం వుండదు. అయితే అది కూడా చలంలో ఒక్క “మ్యూజింగ్స్”లోనే ప్రభావవంతంగా బయటపడుతుంది.

    ఇప్పుడు ఎవరైనా పాత్రకీ రచయితకీ వుండే (వుండాల్సిన) బేధాన్ని దయానిధికీ బుచ్చిబాబుకీ అన్వయించటానికి ప్రయత్నించవచ్చు; ప్రయత్నించి, నా ఏవగింపు బుచ్చిబాబు పాత్రల పట్లే వుండాలిగానీ బుచ్చిబాబు పట్ల వుండకూడదూ అని పాఠం చెప్పొచ్చు. కానీ నాకు తెలుసు, దయానిధికీ బుచ్చిబాబుకీ పెద్ద వ్యత్యాసమేమీ లేదు. నేనో ఎనిమిదేళ్ళ క్రితం బుచ్చిబాబు స్వీయ చరిత్ర (పేరు గుర్తు లేదు) చదివాను. ఆ కథనమంతా దయానిధే ఫస్ట్‌పెర్సన్ నేరేషన్‌లో చెప్తున్నట్టనిపిస్తుంది చాలా చోట్ల.

    ఇక మీరన్న రచయిత pimping గురించి. రచయితల్లో చాలామందికి ఓ జాడ్యం వుంటుంది: extreme self-centeredness. పైగా ఇక్కడ బుచ్చిబాబే కథానాయకుడాయె! కాబట్టి మిగతా పాత్రలన్నింటినీ, దయానిధి అనే కాగితం కటౌటు వ్యక్తిత్వాన్ని మన ముందు కొట్టొచ్చినట్టుగా నిలబెట్టడం కోసం, దాని వెనకమాటున ఊతంగా నిలబెట్టిన గెడకర్రల్లా ఉపయోగించుకుంటాడు. గొప్ప రచయితలు మాత్రమే వ్యక్తులుగా తమకుండే self-centerednes ని అధిగమించి రచనలు చేయగలుగుతారు. బుచ్చిబాబు “చివరకు మిగిలేది”కి సంబంధించి ఈ విషయంలో విఫలమయ్యాడనిపిస్తుంది.

    >>>>> తన దగ్గరికి వచ్చిన ఒక రోగి మానసిక సమస్యలను తెలుసుకుని, ఆమె సౌందర్యరాహిత్యం అనే జబ్బుతో బాధపడుతుందని గ్రహించి, వ్యయప్రయాసలకోర్చి నయంచేయబూనిన కరుణామూర్త్గి, తన భార్య నిస్సారమైన జీవితాన్నీ, దానికి కారణం అయిన తననూ అస్సలు పట్టించుకోడు. ఏ “పురుష స్వామ్య సమాజ” భావజాలాలను ఎదిరిస్తాడో, అదే సమాజపు ప్రతినిధి అవుతాడు మన దయానిధి.

    అవును. ఈ విషయంలోనూ దయానిధి నాకు చిరాకే (మళ్ళీ ఒక “పాత్ర” పట్ల చిరాకు అని ఎవరైనా నన్ను సరిదిద్దొచ్చు. ముందే చెప్పినట్టు, దయానిధికి బుచ్చిబాబు ప్రాపకం చాలా వుంది.) అసలు ఆ “సౌందర్య రాహిత్యం” అనే అధ్యాయమే నాకో ప్రహసనంలా కన్పిస్తుంది. బహుశా ఫ్రాయిడ్ పుణ్యమా అని అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చెలామణిలో వున్న సైకోఅనాలసిస్‌ని మనకీ దిగుమతి చేసే సదుద్దేశంతో ఈ అధ్యాయాన్ని అక్కడ ఇరికించాడేమో బుచ్చిబాబు. మనుషుల్లో సౌందర్యరాహిత్యాన్నే చెప్పదల్చుకుంటే, ఇంకో మంచి దారి వెతుక్కుని వుండాల్సిందనిపిస్తుంది. అలాగే జగన్నాథం పాత్ర నాకు మరో ఎలర్జీ. జగన్నాథాన్ని బుచ్చిబాబు హాస్యానికుద్దేశించాడేమో నాకు తెలీదు. నాకు మాత్రం హాస్యాస్పదంగా మారేడు. అసలు పైన నేను చెప్పిన “ముదరడ”మనే కాన్సెప్టునే ఇక్కడ అన్వయించుకుంటే, నవల ముగింపు తర్వాత, అంటే అప్పటిదాకా నవల సాగిన దిశను బట్టి ఓ ఊహాత్మక భవిష్యత్తులోకి మనం తొంగి చూడగల్గితే, దయానిధి బాగా ముదిరి జగన్నాథ్‌గా మారబోతాడని నాకెందుకో అనుమానం.

    ఈ మొత్తం నిస్సారమైన పాత్రల పరంపరలో నాకు అమితంగా నచ్చే ఒక్కగానొక్క పాత్ర అమృతం. జీవితాన్ని ఉన్నదున్నట్టు ఫేస్‌వాల్యూతో తీసేసుకుంటుంది. ఆ పునాదిగా ఏ మీమాంసా లేకుండా అనుకున్నది అనుకున్నట్టు చేసేస్తుంది. దయానిధిని “బాబూ నీ ముక్కు ఎక్కడుందీ?” అని అడిగితే గంభీరమైన తాత్త్విక మీమాంస అనంతరం తల చుట్టూ చేయి తిప్పి ఎక్కడ వేలు పెడ్తాడో, అదే చోటుని ఆమె చాలా సూటిగా తేలికగా చూపించేస్తుంది. ముచ్చటేస్తుంది. అసలు నేనే దయానిధినైతే—అంతమంది అమ్మాయిల్ని అలా నా చుట్టూ కోలాటమాడనివ్వమంటే నా పగటికలలు కూడా మొరాయిస్తాయని వినమ్రంగా ఒప్పుకుంటూనే—అసలు నేనే గనుక దయానిధినైతే, మిగతా అందర్నీ పక్కనపెట్టి, అమృతాన్ని ఏదోలా మాయచేసి ముగ్గులోకి దించి, ఆమె చేత మొగుణ్ణి వదిలిపించేసి, లేపుకొచ్చేసేవాణ్ణి. (అంత మంచి అమ్మాయి పట్ల నా ఈ అమంగళం ప్రతిహతమగుగాక! 😛 )

    ఇక పోతే, మీ వ్యాసంలో విషయంతో పోలిస్తే డిస్‌క్లెయిమర్లు ఎక్కువభాగాన్ని ఆక్రమించాయి. అలా రాయాల్సిన బాధ “పుస్తకం.నెట్‌”లో ఇకముందు రాకూడదని కోరుకుంటున్నాను.

  22. Ruth

    హ్మ్మ్….. మొత్తానికి నా చేత ఈ పుస్తకాన్ని చదివించడానికి కంకణం కట్టుకున్నట్టున్నారు అందరూ !!!

  23. స్నేహ

    చాలా బాగా చెప్పారండి. ఇంతకుముందు ఇదే పుస్తకం మీద వచ్చిన వ్యాసానికి వచ్చిన కామెంట్లు చదివి ఏమిటి ఇది ఒక పుస్తకాన్నీ ఎలా చదవాలో కూడా నిర్ణయిస్తున్నారు అనిపించింది.

Leave a Reply to బొల్లోజు బాబా Cancel