రెండు బాలల పుస్తకాల గురించి..

రాసిన వారు: అరిపిరాల సత్యప్రసాద్

*************************

బాల సాహిత్యం అనగానే నాకు గుర్తొచ్చేవి – చిన్నప్పుడు విన్న ఏడు చేపల కథలు, ఆ తరువాత చందమామలోనో బాలమిత్రలోనో చదివిన రాజు గారు మాంత్రికుడు లాంటి కాల్పనిక కథలు, పాఠ్యాంశాలుగా వచ్చిన పంచతంత్రం లాంటి నీతి కథలు, ఇంకా ఆంగ్ల ఉపవాచకాలుగా చదువుకున్న సిందబాదు/కాపర్ ఫీల్డ్/హకల్ బర్రీ ఫిన్ సాహసాలు. ఆ తరువాత అవకాశాన్ని బటి లైబ్రరీలో చదువుకున్న దేశభక్తి కథలు, మరికొన్ని సరదా కథలు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ మధ్య నేను చదివిన రెండు పుస్తకాల లాంటివి ఒక ఎత్తు. మారుతున్న సమాజం, మానవ సంబంధాల నేపధ్యంలో “ఆధునికత” అనే కాలగతిలో కొట్టుకుపోతున్న విలువలను, వాటి ఆవశ్యకతను కథలుగ పిల్లలకు హత్తుకునే విధంగా చెప్పిన ఈ రెండు పుస్తకాలను మీకు పరిచయం చేస్తాను.

అద్భుత గ్రహం గాథ: తాజిమా షిన్‌జి

ఐదు కథలున్న ఈ సంకలం చదువుతున్నతసేపు ఎక్కడో చురుక్కు మంటుంటుంది. దురాశతో మనం పెట్టే పరుగులో, ఎక్కడో దారిలో జారవిడుచుకున్న ప్రేమాభిమానాలు, సామాజిక బాధ్యత, వ్యక్తిత్వాలు, విలువలు ఒక్కక్కటిగా కనిపించి హేళన చేస్తున్నట్టుంటుంది. సరళమైన కథలలో ఎంతో విలువైన సందేశాన్ని చెప్పగలగడం రచయిత ప్రతిభకి నిదర్శనం. అందుకే ఈ పుస్తకం బాల సాహిత్యమని ప్రకటించుకున్నా ఎంతో మంది పెద్దల్ని ఆకట్టుకుంటుంది, ఆలోచనలలో ముంచేస్తుంది.

ఇందులో మొదటిగా కనిపించేది “కొంకిచీ కొండవీడు” అనే నక్క కథ. ఒక చలికాలం మంచులో కొంచికీ అనే నక్క మనుషుల జీవితాలు సుఖవంతమని భ్రమించి, తల్లి మాటని కాదని తనకి వచ్చిన “కెన్-పోన్-టాన్” అనే మంత్రంతో మనిషి రూపం పొందుతుంది. బాహ్యరూపం మాత్రమే కాకుండా క్రమంగా మనసుకూడా మనిషిలా మారే కొద్ది అత్యాశ, కౄరత్వం పెరుగుతూవచ్చి, చివరికి తన “ఆర్థిక” లాభాలకోసం తనవారినే చంపుకునేందుకు సిద్ధపడుతుందా నక్క. రచయిత మాటల్లో చెప్పకపోయినా ఈ కథ చదువుతుంటే డబ్బుకోసం సొంతవారినే అంతంచేసే ఎందరో మనుషులకి నిలువుటద్దంలా కనిపిస్తుంది కొంచికీ

“అదృశ్యవక్తి” కథలో పసుపు పూలు పూసే “టాన్ పోపో”, వెన్న ఆకుల “ఫుకి-నో-టో” అనే మొక్కలు భూమి పొరల్లో నిద్రపోతూ, భూమి పైన జరుగుతున్న వసంతాగమనాన్ని వూహిస్తాయి. బద్దకాన్ని వదిలి ఒకసారి బయట ప్రపంచం చూద్దామని తలలు బయట పెట్టిన రెండు మొక్కలు మొదట బాధపడినా “సూర్యుడి వైపు పెరగాలని నిర్ణయించుకుంటాయి”. బద్దకాన్ని విడనాడాలని, పదిమందికీ వుపయోగపడే త్యాగ భావం వుండాలనీ, అడుగు ముందుకు వేసిన తరువాత వెనకడుగు వెయ్యకూడదని అంతర్లీనంగా చెప్తాడు రచయిత.

ఈ పుస్తకం పేరులో వున్న కథ మూడవదైన “అద్భుత గ్రహం గాథ”. ఈ కథ చదివితే “అవతార్” చిత్రానికి ఇదే స్పూర్తి అనిపిస్తుంది. ఎక్కడో అంతరిక్షంలో వుండే గ్రహవాసులు అక్కడినుంచి పచ్చగా కనిపించే భూమిని చూసి, భూ గ్రహవాసులంతా అంతే పచ్చటి హృదయం కలిగినవారని ఆశిస్తారు. భూమి మీద మనుషుల గొప్పదనాన్ని కీర్తిస్తుంటారు. అలాంటి భూమి నుంచి వచ్చిన “కానుక” తెరిచిన తరువాతకానీ వారికి మనుషుల కుటిలత్వం తెలిసిరాదు. ఈ కథ ముగిసేసరికి మనుగడకోసం ప్రపంచాన్ని, ప్రకృతిని నాశనం చేస్తున్న మన అసలు రూపం ఆవిష్కృతమై ఎవరో చెంపన చరిచినట్లుంటుంది.

నాలుగవదైన “ఎడారిలో రాక్షసబల్లి” అనే కథ చాలా భాగం మనకు పరిచయమై, మనచుట్టూ జరిగే కథే. విలువైన సుంగధ ద్రవ్యాలను అమ్మాకానికి తీసుకెళ్తున్న వర్తకుల గుంపులో, డబ్బు పంచుకునే విషయమై గొడవ మొదలౌతుంది. ఎప్పుడో ఆహారం కోసం రాక్షసి బల్లులు ఒకరినొకరు చంపుకుంటుంటే భూగర్భంలో దాక్కున్న ఒక రాక్షసిబల్లి, ఈ మనుషుల గొడవకి నిద్రలేచి రావటం కథాంశం. మనుషులు ఒకరికొకరు వైరం పెట్టుకోడానికి వున్న అన్నికారణాలను ప్రస్తావిస్తూనే, తమ జాతి వారితో వైరం పెట్టుకుంటే రాక్షసబల్లులే అంతరించాయంటూ మనుషులకి హెచ్చరిక చేసే కథ ఇది.

అయిదొవది, అద్భుతమైనది అయిన కథ “వసంతం ఎక్కడినుండి వస్తుంది?”. ఈ కథలో డంకిచీ అనే మర్కటనాయకుడు విపత్కర కరువు కాటకాలలో తన కోతుల గుంపును కాపాడుకొచ్చే వైనం వర్ణించాడు రచయిత. ఒక పక్క నిరాశ నిస్పృహలతో సగటు మనిషి “విషపు పుట్టగొడుగుల సూపు” చేసి తన కుటుంబాన్ని సాముహిక హత్య చేస్తుంటే, ఆశావహ దృక్పధంతో “వసంతం మన దగ్గరికి రాకపోతే మనమే వసంతం దగ్గరికి వెళ్ళాలని” సూచించే ఈ నాయకుడు చదివినవారి మనసుల్లో వున్నతంగా వుండిపోతాడు.

కథలన్నీ చిన్నవిగా, పొదుపైన మాటలతో, చక్కటి శైలిలో పిల్లలు చదువుకొని అర్థం చేసుకునేట్టుగా వున్నాయి. ముఖ్యంగా సదేశం ఇస్తున్నట్టు తెలియకుండానే ఆనందమయ జీవితాన్ని చేరుకోటానికిన్న అడ్డంకుల్ని, వాటిని తొలగించుకునే మార్గాలనీ సూచిస్తాడు రచయిత.

నేపాలీ మండూకం సాహసాలు: కణక్‌మణి దీక్షిత్

ఇక రెండొవ పుస్తకం గురించి. ఇది చిన్న పిల్లలకోసం వ్రాసిన ఒక నవల. ఖట్మండూ సమీపంలో ఇఛాంగూ గ్రామంలో “భక్తప్రసాద్ భ్యగుతో” అనే కప్ప బావిలో కప్పలా వుండటం ఇష్టంలేక తాత “బుద్ధి ప్రసాద్” అనుమతి ఆశీర్వాదం తీసుకోని నేపాల్ యాత్రకి సిద్ధమౌతాడు. మొదట ఖాట్మండూ చేరి అక్కడి నుంచి రేకు డబ్బాని పడవగా చేసుకోని, హమాలీ గంపలనెక్కి, కంచరగాడిదల మీద, జడల బర్రెలమీద స్వారీ చేస్తూ, నడుస్తూ, గెంతుతూ, అలుస్తూ దేశమంతా తిరుగుతాడు. చివరికి ఒక పైలెట్ జేబులో కూర్చోని ఆకాశ మార్గాన తిరిగి ఖాట్మండూ చేరుకుంటుంటాడు.

కథ ఏమంత లేకపోయినా ఒక పర్యాటకుడిగా ఈ కప్పకి ఎదురయ్యే అనేక సందర్భాలు, అతనికి ఎన్నో కొత్త విషయాలను నేర్పిస్తాయి. యుక్త వయసులో వున్న ఈ కప్పకి (చాలా మంది యుక్తవయసు పిల్లలాగానే) ఆసక్తి, ఉత్సుకత ఎక్కువ. అందుకే వెళ్ళిన ప్రతిచోట ఆ ప్రాంతాన్ని బాగా ఎరిగిన జంతువుతోనో, మనిషితోనో స్నేహం చేసి ఆ ప్రాంత విశేషాలు తెలుసుకుంటాడు.

ఇందులో భాగంగానే నేపాల్ నైసర్గిక రూపురేఖలు, పర్యాటక స్థలాలు, గిరులు, శిఖరాలు, లోయలు, మైదానాలు అన్నీ చూస్తాడు భ్యగుతో. అతనితోపాటు చదివేవారికి కూడా ఆ ప్రాంతాలన్ని స్వయంగా చూసిన అనుభూతి కలిగిస్తాడు. భౌగోళిక విషయాలే కాక అక్కడి ప్రాణుల వివరాలు (జీవ శాస్త్రం)కూడ తెలుసుకుంటాడు. గాలి వీస్తున్న వైపు ఎగిరితే ఎంత దూరం గెంతగలను, ఎదురుగాలికి ఎగిరితే ఎంత దూరం గెంతగలను అంటూ లెక్కలు వేస్తాడు. పట్టణాలలో వున్న కప్పజాతులు పార్టీ చేసుకుంటూ గోలగా పాడుకోవడం, పిచ్చిగా ఎగరటం చూసి సంస్కృతి ఏమైపోతోందో అని బాధ పడతాడు. “డోల్పో” గ్రామంలో లమోలామ గుడిలో కొంత వేదాంత చర్చ జరిపి “మండూకాత్మ సాక్షాత్కారం”తో తిరిగి ప్రయాణమవుతాడు. ఇదీ కథ.

రెండు పుస్తకాల గురించి

ఈ రెండు పుస్తకాలను ఒకే వ్యాసంలో పొందుపరచడం గురించి చిన్న మాట. ఈ రెండు పుస్తకాలు నేను వరసగా చదివాను. రెండింటిలోనూ విషయ వైరుధ్యం వుంది. మొదటి పుస్తకంలో చెప్పదల్చుకున్నవి సామాజిక బాధ్యత, విలువలు అయితే రెండో పుస్తకంలో చెప్పినవి భూగోళం, పర్యాటకం, సాహసం, జీవ శాస్త్రం మొదలైన విషయాలు. మొదటి పుస్తకంలో చెప్పినవి ఆనందకరమైన జీవితాన్ని సాధించడానికి వుపయోగపడే విషయాలైతే, రెండో పుస్తకంలో మన సామాన్య విజ్ఞానానికి వుపయోగపడే విషయాలు. అయితే రెండు పుస్తకాలలో వున్న సామీప్యత ఏమిటంటే – చెప్పదల్చుకున్న విషయాన్ని సరళంగా, అర్థమయ్యే రీతిలో చెప్పటం.. మరీ ముఖ్యంగా ఆకట్టుకునేలా చెప్పటం. అందుకే నేను చదివిన బాల సాహిత్యంలో ఈ రెండూ ప్రముఖమైనవిగా గుర్తించాను. అవకాశం వుంటే ప్రతి ఒక్కరూ (పిల్లలూ పెద్దలు కూడా) చదివి లైబ్రరీలో దాచుకోవాల్సిన పుస్తకాలు.

1. అద్భుతగ్రహం గాథ మరికొన్ని కథలు (జపనీసు కథలు) – (The Legend of Planer surprise and other stories)
రచయిత: తాజిమా షిన్‌జి
ఇంగ్లీషు అనువాదం: టి.ఎం. హోఫ్‌మాన్
తెలుగు అనువాదం (ఇంగ్లీషునుండి): జె. భాగ్యలక్ష్మి
సాహిత్య అకాడెమీ ప్రచురణలు (2007)
ప్రతులు: అన్ని సాహిత్య అకాడెమీ ఆఫీసులు
వెల: రూ. 85

2. నేపాలీ మండూకం సాహసాలు –(Adventures of a Nepali Frog)
రచయిత:కనక్‌మణి దీక్షిత్
తెలుగు అనువాదం: దాసరి అమరేంద్ర
నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా (నెహ్రూ బాల పుస్తకాలయం)
వెల: రూ. 30

(తరువాత చదువుదామని పక్కన పెట్టిన పుస్తకాన్ని “శ్రోతల కోరిక పై” అంటూ చదివించిన సీ.బీ.రావు గారికి నెనర్లు)

You Might Also Like

4 Comments

  1. Amarendra Dasari

    Thanks for the intro… Hope Bhaktaprasad will hopefully into few . more houses

  2. Srinivas Vuruputuri

    ‘Adventures of a Nepalese frog’ is available for download on http://www.arvindguptatoys.com. So is Toto Chan that was introduced a few days ago in these pages.

  3. Telugu4kids

    మరో రెండు విభిన్న తరహా పుస్తకాలు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
    చిన్నప్పుడు పిల్లలలకు దొరికే ఆంగ్ల పుస్తకాలు ఎంత ఉత్సాహంతో పరిచయం చేశానో, పెరిగే కొద్దీ పుస్తకాలు కొత్తవి పరిచయం చేసుకోవల్సిన అవసరం నాకు అంతే ఉంది. ఇక్కడ నాకు విరివిగా కనిపించే వాటికంటే వైవిధ్యం కోసం పుస్తకంలో పరిచయం చేస్తున్న పరిచయాలు ఉపయోగపడుతున్నాయి.

  4. cbrao

    ఫిబ్రవరి లో కేంద్రీకృత విషయమైన బాలల సాహిత్యానికి సంబంధించి రెండు పుస్తకాలు పరిచయం చేయటం ముదావహం. మీ పరిచయం చూసాక వాటిని చదవాలనే ఆసక్తి కలుగుతుంది. జపాన్ పుస్తకాలకు బొమ్మలు ప్రాణం. మీరు పరిచయం చేసిన అద్భుత గ్రహం గాథ: తాజిమా షిన్‌జి లో బొమ్మలు ఉన్నయో లేవో తెలియదు. ఈ పుస్తకాల ముఖచిత్రాలన్నా ప్రచురించి వుంటే పాఠకులకు వాటిని చూసిన అనుభూతి కలిగి వుండెడిది. మీలా మిగతా మిత్రులు కూడా పాఠకులు కోరిన పుస్తకాల పరిచయం చేస్తే బాగుండును. ఉదాహరణకు పాఠకులు చదువుతున్న “మీరేం చదువుతున్నారు?, చెప్పాలని ఉందా? ” లో ఉదహరించిన పుస్తకాలను మిత్రులు పరిచయం చేయవచ్చు. పాఠకుడి కోరిక మన్నించి చక్కటి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

Leave a Reply