పిల్లలు, పుస్తకాలు, నా అనుభవాలు

రాసిన వారు: భైరవభట్ల కామేశ్వరరావు.

**************************

నిజానికి పైనున్న ఆ “పిల్లలు” పదంలో “లు” సైలెంట్ 🙂 ఎందుకంటే పిల్లలతో నా అనుభవాలు మా ఒక్కగానొక్క పాపతోనే కాబట్టి! ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదో ఒక పుస్తకం గురించో, కొన్ని పుస్తకాల గురించో పరిచయమో విశ్లేషణో కాదు. ఇవి కేవలం నా స్వంత అనుభవాలు (ఉరఫ్ సొంత డబ్బా). ఇవి మరెవరికైనా ఉపయోగపడతాయా లేదా అన్నది నిర్ణయించాల్సిన బాధ్యత పుస్తకం సైటు వాళ్ళదే. కాబట్టి దీన్ని ఒకవేళ పుస్తకం వాళ్ళు ప్రచురించి, అది మీకు వట్ఠి దండుగమారి వ్యాసం అనిపిస్తే, మీరు నిరభ్యరంతరంగా మీ నిరసనని పుస్తకం వాళ్ళపై మీ కామెంట్ల కంకర్రాళ్ళతో తెలియజెయ్యవచ్చు! 🙂

ఇక అసలు విషయానికి వస్తే, అందరి పిల్లల్లాగానే మా అమ్మాయికి కూడా కథలంటే చాలా ఇష్టం. రాత్రి తనని బజ్జోపెట్టే ముందు ఒక కథ చెప్పడం ఇంచుమించు నిత్యకృత్యం. అది తొంభై శాతం తెలుగు కథే అవుతుంది. నా స్వంత కల్పనాచాతుర్యం ఉపయోగించాల్సిన అవసరం లేకుండా, ఏదో ఒక కథల పుస్తకం పట్టుకొని, అందులోని కథ చదివి వినిపిస్తూ ఉంటాను. ఇలా రోజూ కథ చెప్పడం నాకు కూడా మంచి అనుభూతినే మిగులుస్తుంది. పైగా, మా అమ్మాయి ఆలోచనలు ఎలా సాగుతున్నాయో తెలుసుకోడానికి ఇదొక మంచి సాధనం కూడాను! ఒకోసారి చాలా తమాషా సంగతులు తెలుస్తూ ఉంటాయి. మొన్నీ మధ్యనే ఒక కథ చెపుతూంటే జరిగిన అలాంటి కొన్ని సంగతులిప్పుడు చెప్తాను.

ప్రస్తుతం నడుస్తున్న పుస్తకం పేరు “మంచి కథలు”. అందులోంచి మొన్న చెప్పిన కథ “నిజమైన గెలుపు”. ఇందులో వీరసింహుడు అనే రైతుంటాడు. అతనో పొగరుబోతు. తగువులమారి. ప్రతివాళ్ళతోనూ గొడవలుపెట్టుకోవడం, దబాయిస్తూ ఉండడం అతనికి ఇష్టం. సహజంగానే ఊళ్ళోవాళ్ళెవ్వరూ అతనితో స్నేహం చెయ్యరు. అతనికి దూరంగా ఉంటూ ఉంటారు. ఇంతలో ఆ ఊరికి కొత్తగా దయాశంకరం అనే రైతు వస్తాడు.

ఇంత వరకూ చెప్పిన వెంటనే మా పాప, “ఈ రైతు మంచివాడన్న మాట” అంది! “అదేం ఎందుకలా అనుకుంటున్నావ్?”, అని నేను అడిగాను. బహుశా తనకీ కథలన్నీ బాగా మూసగా అయిపోయినట్టున్నాయి. ఒక చెడ్డ రైతుంటే మరొక మంచి రైతుండాలని ఊహించి ఉంటుంది అనుకున్నాను. అయితే తన సమాధానం నన్ను కొంచెం ఆశ్చర్యపరిచింది. “శంకరుడంటే శివుడు కదా, దేవుడు. అలాగే దయ అన్నా మంచిదే కదా. అందుకు” అని తన ఆలోచనని వివరించింది! ఆరేళ్ళపాప ఇంతలా ఆలోచించగలదా అని అబ్బురపడ్డాను. బహుశా ఈ కాలం పిల్లలందరూ (మా చిన్నప్పుడు మేమిలా ఆలోచించగలిగేవాళ్ళమో లేదో నాకు తెలియదు మరి) ఇలాగే ఉంటారు. సరే నేను ఊరుకోకుండా, “దయ” అంటే ఏంటి అని అడిగాను మళ్ళీ. పాపం ఒక నిమిషం ఆలోచించింది, చెప్పడానికి ప్రయత్నించింది కాని చెప్పలేకపోయింది. నాకు తెలుసు కాని ఎలా చెప్పాలో తెలియడం లేదు అంది. ఇలాంటి సన్నివేశంలో వాళ్ళు భలే ముద్దొస్తూంటారు! నేనేదో నాకు చేతనైన రీతిలో వివరించాను. కథ చదివేటప్పుడు, ముందు అందులోని వాక్యాలు యథాతథంగా చదివి వినిపిస్తాను. అర్థమయ్యిందో లేదో అడుగుతాను. అర్థం కాని పదాలకి అర్థం అడిగి చెప్పించుకుంటుంది మా పాప.

కథ మళ్ళీ కొనసాగింది. మా అమ్మాయి ఊహించినట్టే, దయాశంకరం మంచివాడు. అందరితో స్నేహంగా ఉంటూ, తనకి చేతనైన సహాయం చేస్తూ మంచిగా ఉంటూంటాడు. ఒకసారి మిగతా రైతులు అతన్ని కలిసినప్పుడు వీరసింహుడి విషయం చెప్పి, అతనితో జాగ్రత్తగా ఉండు, ఏ గొడవా పెట్టుకోవద్దని హెచ్చరిస్తారు. దానికి దయాశంకరం నవ్వుతూ, అతను నాతో ఏమైనా గొడవ పెట్టుకుంటే అతన్ని నేను చంపకుండా వదలను అంటాడు. దానికి తక్కిన వాళ్ళు కూడా నవ్వేస్తారు. దయాశంకరం సంగతి అందరికీ తెలుసుకాబట్టి అతను ఊరికే సరదాగా అంటున్నాడనుకుంటారు. మా పాపకూడా అలాగే అయ్యుంటుందని నిర్ణయించేసుకుంది. అయితే దయాశంకరం ఇలా అనడం వీరసింహుడికి తెలుస్తుంది. అతను అగ్గిమీద గుగ్గిలం అయిపోతాడు. ఇదేదో అంతు తేల్చుకోవాలని నిశ్చయించుకుంటాడు. దయాశంకరానికి రకరకాలుగా నష్టం కలిగిస్తూ, అతను తనతో గొడవపెట్టుకొనేలాగ చెయ్యడానికి ప్రయత్నిస్తాడు. దయాశంకరం ఓర్పుతో అన్నిటినీ సహిస్తాడు.

ఒక రోజు వీరసింహుడికి ఏదో కష్టం వస్తుంది. అతనికి సాయం చెయ్యడానికి ఎవరూ ముందుకు రారు. దయాశంకరం మాత్రం అతనికి సహాయం చెయ్యడానికి బయలుదేరుతాడు, అందరూ వారిస్తున్నా. పైగా నేనీ రోజు వీరసింహుణ్ణి చంపికాని తిరిగి రానని శపథం చేస్తాడు. అప్పుడు మా అమ్మాయికి కాస్త అనుమానం వచ్చింది. అతను ఇదేదో సరదాకి అనడం లేదని. అదేంటి నాన్నా అతను మంచివాడు కదా, ఎందుకు చంపుతానంటున్నాడు అని అడిగింది. ఏమో నాకేం తెలుసు, కథ పూర్తిగా చదివితే తెలుస్తుందన్నాను. సరే దయాశంకరం వెళ్ళి సాయం చెయ్యబోతే, వీరసింహుడు పొగరుగా నీ సాయం నాకేమీ అక్కర లేదు పొమ్మంటాడు. నువ్వు నన్ను కొట్టినా తిట్టినా నీకు సహాయం చేసే తీరుతానని సాయం చేసి వెళతాడు దయాశంకరం. ఆ సంఘటనతో వీరసింహుడిలో పరివర్తన కలుగుతుంది. అప్పణ్ణించీ అందరితో మంచిగా ఉండడం మొదలుపెడతాడు. ఆ రోజు తనలోని పాత, పొగరుబోతు వీరసింహుణ్ణి నిజంగానే దయాశంకరం చంపేసాడని అందరితో చెప్తాడు. అది కథ!

కథంతా అయ్యాక ఇందులో నీతేమిటి అని అడిగాను మా పాపని. ఠక్కుమని, ఎప్పుడూ అందరితోనీ మంచిగా ఉండాలి అంది. ఇది కూడా ఒక మూస స్టేట్మెంటే. ప్రతి నీతికథా ఇదే చెపుతుందని మా అమ్మాయి మెదడులో ముద్రపడిపోయిందని అర్థమయింది. బహుశా ఇంకొన్ని రోజుల్లో ఈ నీతికథలు తనకి బోరు కొట్టడం మొదలుపెడతాయని ఊహిస్తున్నాను. అలాకాదు ఇంకొంచెం ఆలోచించి ఇంకేమైనా ఉందేమో చెప్పన్నాను. కాసేపు ఆలోచించి, మనకి ఎవరైనా అపకారం చేసినా మనం వాళ్ళకి ఉపకారం చెయ్యాలి అంది. నేను సెభాషని, దీనికి సంబంధించిన పద్యం ఒకటి నీకు వచ్చు కదా ఏమిటో చెప్పన్నాను. “ఉపకారికి ఉపకారము…” పద్యం చెప్పింది. మరో సెభాషుతో తన తల నిమిరాను. సందర్భం వచ్చినప్పుడల్లా తనకి వచ్చిన పద్యాలనిలా గుర్తు చేస్తూ చెప్పిస్తూంటాను.

మా అమ్మాయికి తెలుగు నేర్పే సాధనలో ఇదొక భాగం. నేనుండేది ఆంధ్రాలో కాదు కాబట్టి మా అమ్మాయి స్కూల్లో తెలుగు నేర్చుకునే అవకాశం లేదు. అంచేత ఆ పనేదో ఇంట్లోనే చెయ్యాలి. తెలుగు నేర్పడం అంటే నా ఉద్దేశం చదవడం రాయడం కూడా. ఈ బాధ్యత ముఖ్యంగా నాదే! (ఇంగ్లీషు నేర్పే బాధ్యత మా ఆవిడది. పని విభజన 🙂  కాబట్టి దీనికి చిక్కే సమయం చాలా తక్కువ. బహుశా మా పాపకి నాలుగేళ్ళప్పటి నుంచీ అనుకుంటాను తెలుగు అక్షరాలు చదవించడం మొదలుపెట్టాం. ముందుగా అచ్చులు, ఆ తర్వాత హల్లులు. శనాదివారాల్లోనూ, వేసవి సెలవల్లో (వేసవి సెలవల్లో ఈ డ్యూటీ వాళ్ళ తాతగారిది!) మాత్రమే అయ్యేది. స్కూల్లో ఇంగ్లీషు అక్షరాలు దిద్దడం మొదలయ్యాక మెల్లిగా తెలుగు అక్షరాలు కూడా దిద్దించడం మొదలుపెట్టాను. ముందసలు తెలుగు చదవడం నేర్పించి, ఆ తర్వాత రాయడం మీద దృష్టిపెట్ట వచ్చుననుకున్నాను. కాని అక్షరాలు దిద్దిస్తూ ఉంటే, అవి మరింత త్వరగా వస్తున్నాయని అనిపించింది. అంచేత చదవడం, రాయడం కలిసే నేర్పించడం మొదలుపెట్టాను. అలా నేర్పిస్తూ ఈ రెండేళ్ళలో గుణింతాలయ్యాయి. ప్రస్తుతం తెలుగక్షరాలన్నీ గుణింతాలతో సహా చదవడమూ, రాయడమూ వచ్చింది. ధాటిగా కాకపోయినా, కాస్త కూడబలుక్కొని పదాలూ, వాక్యాలూ కూడా చదవగలుగుతోంది.

ప్రతి రోజూ కథ చెప్తానని చెప్పాను కదా. ముందు రోజు చెప్పిన కథ పేరు, ఆ రోజు చెప్పబోయే కథ పేరు తన చేతే చదివిస్తాను. వత్తులింకా నేర్పలేదు కాబట్టి వాటిని మాత్రం నేను చెప్తున్నాను. కొన్ని వత్తులు కూడా తనిప్పుడు చదవగలుగుతోంది. ఇలా తెలుగు మా పాప ఆసక్తితో నేర్చుకోడానికి ఒక కారణం పుస్తకాలు చదవాలనే ఉత్సాహమనే అనుకుంటున్నాను! ఎందుకంటే చిన్నప్పటి నుంచీ కూడా, నేనెప్పుడు పుస్తకం పట్టుకున్నా, తను కూడా ఒక పుస్తకం పట్టుకొని నా పక్కనే కూర్చోడం సరదా. పెద్దవాళ్ళు ఏం చేస్తే దాన్ని పిల్లలు అనుకరించడానికి ప్రయత్నించడం సహజమే కదా! అలా తనకి కూడా పుస్తకాలు చదవాలన్న ఆసక్తి పెరిగినట్టుంది. తను త్వరగా నాలా పుస్తకాలు చదవాలంటే, ముందు అక్షరాలు చకచకా నేర్చుకోవాలని చెప్పాను. బహుశా అది మంచి ప్రభావమే చూపించినట్టుంది. ఇప్పటికీ నేనేమైనా పుస్తకం చదువుతూ ఉంటే తనూ పక్కన కూర్చుని తనకి వచ్చినంత వరకూ అందులోని పదాలు చదవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.

తమంత తాము పుస్తకాలు చదువుకొనే వరకూ తల్లిదండ్రులే పిల్లలకి పుస్తకాలు చదివిపెట్టాలి కదా! ఈ స్టేజిలో అవి ఎంత మంచి పుస్తకాలు అన్నది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదని నాకనిపిస్తుంది. ఎలాంటి కథనైనా, తమ పిల్లల మనస్తత్వం బట్టి, వాళ్ళ గ్రహణశక్తి బట్టి, వాళ్ళకి ఆసక్తి కలిగేటట్టు తల్లిదండ్రులే చెప్పాలి. అందుకే ఇంతవరకూ నేను ఏ పిల్లల కథల పుస్తకం దొరికితే అది దొరకబుచ్చుకొని చదివి చెపుతున్నాను. పేర్లు చెప్పుకోవలసి వస్తే – అక్బర్ బీర్బల్ కథలు, బొమ్మల రామాయణం, బొమ్మల భారతం, బాల కృష్ణుడి కథలు, దశావతారాల కథలు, పంచతంత్రం కథలు, మర్యాదరామన్న కథలు ముఖ్యమైనవి. రామాయణం బాపూ గీత, ముళ్ళపూడి రాతతో ఉన్న పుస్తకం. నా చిన్నప్పటిది! అప్పటికే మా పాప రామాయణం టీవీలో చూసేసింది కాబట్టి, అది చెప్పడం సులువే అయింది. కథ అందులో చాలా టూకీగా ఉంటుందికూడా. బొమ్మలు పెద్దగా (చాలా అందంగా అని వేరే చెప్పకరలేదు కదా!) ఉంటాయి. భారతం చెప్పడం మాత్రం కాస్త ఇబ్బందే అయ్యింది! శ్రీనాథుడు తన అనువాద పద్ధతి గురించి చెప్పుకున్నట్టు, కొన్ని చోట్ల కుదించి, కొన్ని చోట్ల పెంచి, కొన్ని చోట్ల మార్చి, చెప్పాల్సి వచ్చింది. ఏడాది కిందట చందమామ కథలు కొన్ని ప్రయత్నం చేసాను కాని ఆ వయసుకి అవి కాస్త పెద్దవైనట్టు అనిపించాయి. ఇంగ్లీషులో చెప్పుకోవాలంటే, Walt Disney వాళ్ళ Classic Storybook ఒకటి. ఇది మంచి మంచి బొమ్మలతో బాగా ఆకట్టుకొనే పుస్తకం. ఏ కథ చెప్పినా సాధారణంగా ఆ కథని తను ఎలా అర్థం చేసుకుంటోంది, దాని గురించి ఏమిటి ఆలోచిస్తోంది అన్నది మాత్రం తెలుసుకొనే ప్రయత్నం చేస్తూ ఉంటాను.

ఇప్పుడింక ప్రతి శనాదివారాల్లోను కొంతసేపు ఒక పుస్తకం (ప్రస్తుతం ఇంగ్లీషు, వత్తులు వచ్చేసాక తెలుగు కూడా) తనచేత చదివించే ప్రయత్నం మొదలుపెట్టాలని అనుకున్నాం. ఇంకా అది పూర్తిగా అమలు కాలేదు. పిల్లలు తమంత తాము పూర్తిగా చదువుకోవడం మొదలుపెట్టాక మాత్రం పుస్తకాల ఎంపిక బహుశా కాస్త చూసి చెయ్యాల్సిన అవసరం ఉంటుంది. చందమామ కథలు బాగానే ఉండవచ్చు. అప్పుడు కూడా వాళ్ళు పుస్తకంలో చదివిన కథలు తిరిగి మనకి చెప్పే అలవాటు చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు కూడా మా పాప స్కూల్లో చదివిన కథలు కాని, వాళ్ళ తాతగారో, నాన్నమ్మో చెప్పిన కథలు కాని అప్పుడప్పుడు నేను అడిగి చెప్పించుకుంటూ ఉంటాను. అదికూడా పిల్లలకి ఒక సరదాయే! ఇప్పటివరకూ చెప్పిన కథల్లో పురాణాలు, నీతికథలు, తెలివితేటలకి సంబంధించిన కథలు, జానపద కథలు ఎక్కువగా ఉన్నాయి. బహుశా స్వంతంగా చదువుకోవడం మొదలుపెట్టాక చిన్న చిన్న సైన్సు కథలు కూడా చదివిస్తే బాగుంటుందని ఆలోచన. మా చిన్నప్పటి పిల్లల పత్రిక బాలజ్యోతిలో ఇలాంటివి వచ్చేవి. ఇప్పటి పత్రికల్లో ఉన్నాయేమో చూడాలి. మా చిన్నప్పుడు మేం చదువుకున్న పుస్తకాలు కూడా కొన్ని భద్రంగా ఇంట్లో ఉన్నాయి. ఇంగ్లీషులో Walt Disney వాళ్ళ కామిక్స్ (మిక్కీ మౌస్, డొనాల్డ్ డక్ మొదలైనవి) చాలానే ఉన్నాయి. అలాగే కొన్ని Tintin, Astrix పుస్తకాలు. తెలుగులో టింకిల్ పుస్తకాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవలసినవి కొన్ని రష్యన్ కథలకి తెలుగు అనువాదాలు. ఇవి పెద్ద కథలు. ఒకోటి ఒకో పుస్తకంగా ఉంటాయి, పెద్ద పెద్ద బొమ్మలతో. “ప్రగతి ప్రచురణాలయం, మాస్కో” వాళ్ళ ప్రచురణ. ఇందులో కొన్ని ప్రముఖ విమర్శకుడు రాచమల్లు రామచంద్రా రెడ్డి(రారా)గారు చేసిన అనువాదాలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకాలు మా అమ్మాయికి ఎంతవరకూ ఆసక్తి కలిగిస్తాయో చూడాలి! ఇంకా పుస్తకాలు వెతకాలి. ఆ సమయం వచ్చినప్పుడు అప్పటికి కావలసిన పుస్తకాలు దొరుకుతాయన్న నమ్మకం నాకుంది. అయిదారు క్లాసులకి వచ్చేసాక ఇంక వాళ్ళే మనకి సొంతంగా కథలు చెప్పే స్థాయికి ఎదిగిపోతారు!

You Might Also Like

8 Comments

  1. Anand

    chala baga chepparu……books chadive time evariki untundi ani chala mandi antunte chala badapaddanu…nenu books ekkuvagane chaduvutanu….na menalludu ma daggare chaduvukuntunnadu…..vadu english medium…vadiki telugu assalu radu……ila prayatniste vadu telugulo chadavada raayadam nerchukovachu anukunta…manchi samacharam icharu…..

  2. పుస్తకం » Blog Archive » “మంచి పుస్తకం”తో కాసేపు..

    […] గారు రాసిన స్వీయానునుభవాల పోస్టు తరహాలో రాస్తే బాగుంటుందని నా […]

  3. శివరామప్రసాదు కప్పగంతు

    బాగున్నది మీ వ్యాసం. నాకు మా పిల్లల చిన్నతనం గుర్తుకు వచ్చింది. ఇద్దరూ చెరో పక్కన పడుకునేవారు. వాళ్ళకి చందమామ పత్రికలోని శిధిలాలయం (మొత్తం ధారావాహిక బైండు చేయించాను) ఒక్కొక భాగం ఒక్కో రోజు చెప్పేవాడిని. వాళ్ళకు వచ్చే అనుమానాలు, తెలుసుకోవాలన్న ఉత్సుకత చాలా బాగుండేది. దాదాపు 15 సంవత్సరాల తరువాత కూడ అప్పుడప్పుడూ అప్పటి రోజులను నాకు గుర్తు చేస్తుంటారు వాళ్ళు. మరొక మంచి అనుభవం. అప్పట్లో పాత సినిమాల ఆడియో కాసెట్లు దొరికేవి. అందులో ముఖ్యంగా అప్పుచేసి పప్పుకూడు సినిమా డైలాగులు ఎన్ని సార్లు విన్నామో తెలియదు. ముఖ్యంగా సి ఎస్ ఆర్ కంఠస్వరం, ఆయన డైలాగులు చెప్పే పధ్ధతి వాళ్ళను ఎంతగానో ఆకట్టుకున్నది. ఇప్పుడు ఆపాత మధురాలను తప్పకుండా చూసి ఆస్వాదిస్తూ ఉంటారు.

  4. Telugu4kids

    మీ అనుభవాలు ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    చాలా చక్కగా రాశారు.

    ఇంతమంది ఇక్కడ వ్యాఖ్యానించిన వారి అనుభవాలూ చదువుతుంటే బాగా అనిపిస్తోంది.

    పుస్తకాలను పరిచయం చెయ్యడం, మనం పిల్లలు చూస్తూ ఉండగా చదవడం అనే ప్రయత్నం తల్లిదండ్రులుగా మనం చెయ్యాలి. ఐతే అందరు పిల్లలూ ఒకేలా చదవరు. అంత మాత్రాన చదవరు అని ముద్ర కూడా వేసుకోకూడదు.
    వారి అభిరుచిని బట్టి పుస్తకాలు ఎంచుకుంటారు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. చాలా చిన్న వయసులోనే, అంటే పుస్తకాలను బొమ్మలతో సమానంగా చూసే రోజుల్లోనే పిల్లల అభిరుచి మనకు అర్థమైపోతుంది. ఆ వయసులోనే fiction లేదా non-fiction వైపు స్పష్టంగా మొగ్గు చూపించే వారుంటారు. నాకైతే మా ఇద్దరు పిల్లలూ రెండు రకాలు. పెద్దవాడు విపరీతంగా చదివేస్తాడు. చిన్న వాడు చిన్నప్పట్నుంచీ కార్ల గురించీ, human body గురించీ చదవడం వైపు మొగ్గు చూపిస్తాడు. మా వారు వాడి అభిరుచిని బట్టి కార్ల పేర్లతో అక్షరాలు నేర్పించారు వాడికి. ఆ అభిరుచి వారితో పాటు పెరగచ్చూ, మారచ్చు కూడా. మా పెద్దబ్బాయికి జంతువులంటే ఇష్టమైన కారణంగా Noah’s Ark నచ్చితే, అదే ఆసక్తిని తీసుకుని ఆంజనేయుడి పాత్రతో పరిచయం చేసి రామాయణం చెప్పాను. అలా కథలు కుదురుగా వినడం మొదలు పెట్టాడు. అంతకుముందు కథ చెప్తుంటే అందుకుని తనే చెప్పేసే వాడు.ఇక ఆ ఆసక్తి అలా పెరిగి పెద్దదై నాకు తెలియని పురాణాలూ, mythologyలూ నేర్చేసుకున్నాడు. నాకు నేర్పిస్తున్నాడు.
    మా చిన్నబ్బాయి ఇటువంటి ఆసక్తులు పెంచుకోనట్టే అనిపించాడు.అమర చిత్రకథ పుస్తకాలలో మార్కండేయుడి కథ చదవడం తటస్థించినప్పుడు వాడికి అది నచ్చింది. వేరే ఆసక్తుల వల్ల కొన్ని బైబిల్ కథలు చదువుతున్నాడు ఈ మధ్య.
    “తమంత తాము పుస్తకాలు చదువుకొనే వరకూ తల్లిదండ్రులే పిల్లలకి పుస్తకాలు చదివిపెట్టాలి కదా! ఈ స్టేజిలో అవి ఎంత మంచి పుస్తకాలు అన్నది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదని నాకనిపిస్తుంది. ఎలాంటి కథనైనా, తమ పిల్లల మనస్తత్వం బట్టి, వాళ్ళ గ్రహణశక్తి బట్టి, వాళ్ళకి ఆసక్తి కలిగేటట్టు తల్లిదండ్రులే చెప్పాలి.” ఇది నేను ఆంగ్లంలో పాటించి తెలుగుకి వచ్చేసరికి కష్టపడుతున్న సమస్య. అప్పటికే వాళ్ళకి రక రకాల మాధ్యమాల ద్వారా ఆంగ్లం బాగా అలవాటైపోవడం అని నాకు నేను నచ్చచెప్పుకుంటున్నాను. ఐనా మళ్ళీ మీరే చెప్పారు కదా, “చందమామ కథలు కొన్ని ప్రయత్నం చేసాను కాని ఆ వయసుకి అవి కాస్త పెద్దవైనట్టు అనిపించాయి”. అలాగే నా సమస్య నాకు ప్రత్యేకమైనది అయ్యుండొచ్చు. ఐనా నా ఈ సమస్య వల్ల నాకు తెలుగు4కిడ్స్ అనే ఒక మంచి వ్యాపకం దొరికింది.
    దాని కోసం మా పిల్లల సాయం తీసుకుంటాను. జంట పదాలు చేస్తున్నప్పుడు అవి మా చిన్న వాడిని బాగా ఆకర్షించాయి. దాంతో కొన్ని అక్షరాలు వాడికి బాగా అలవాటైపోయాయి. ఇక ఇష్టమైన పదాలు ఏర్పడడం వల్ల కొన్ని గుణింతాలూ, త్వరగా ముద్ర వేసుకున్నాయి.

    అమ్మో, వ్యాఖ్యగా మొదలు పెట్టి టపా రాసేస్తున్నట్లున్నాను.
    నేను చెప్పదల్చుకున్న ముఖ్య విషయం ఇదీ:
    మీ వంటి వారు ప్రవాసంలోనూ నేర్పుగా, ఓర్పుగా, ఇష్టంగా పిల్లలతో కలిసి తెలుగు / పుస్తకాలు చదవడం, ఆ నుభవాలు ఇక్కడ పంచుకోవడం చాలా బావుంది. వ్యక్తిగత్మగా, నేను తెలుగు దృష్ట్యా ఇలా చెయ్యలేదు అని నాకు guilty feeling చాలా ఉంది. పిల్లల అభిరుచులు రక రకాలు. అలాగే తల్లి దండ్రుల ఓపికలూ, తీరులూ కూడా. అందువల్ల బోలెడన్ని పుస్తకాలు ఉంటే ఎంచుకునే అవకాశాలే కాదు, పిల్లలకి exposure కూదా ఉండి వారి ఇష్టాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది అని నా అభిప్రాయం. ఈ దిశలో మనం చాలా గట్టిగా కృషి చెయ్య వలసిఉంది.
    మా పిల్లలు ఇక్కడ కథలు వింటున్నారీ మధ్య.
    http://storynory.com/
    ఇలా తెలుగులో చెయ్యగలనేమో అని ఒక ఆశ. public domain లో ఉన్న కథల కోసం చూస్తున్నాను.
    వాటిని కొంచెం చెప్పేందుకు అనువుగా చేసుకుని చదువుదామని. చూద్దాం.
    మీలో ఎవరైనా కూడా చెయ్యొచ్చు.

    ఇంకో విషయం, చందమామ కథల గురించి నా అభిప్రాయమూ అలానే ఉండేది.
    కాని ఈ మధ్య 1947 August చందమామలో “చీమ-చిలుక-పాయసం” అన్న కథ చదవడం తటస్థించింది.
    పాత చందమామల్లో భాష గురుంచి నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. అవి పక్కన పెట్టెస్టే , ఆ కథ ఎంత బావుందో పిల్లలకోసం. అందులో “జల జల”, “గబ గబ”, “చుర్రుమనడం”, “కుర్రో మొర్రో” అనడం వంటివి పిల్లలకి నచ్చుతాయి. అలా ఒక దానికి ఒకటి పెంచుకుంటూ పోయే కథలు కూడా ఇష్టంగా వింటారు పిల్లలు. ఆ reptetion భాష బలపడేందుకు కూడా ఉపయోగపడ్తుంది.
    ఇక ఓపికగా చందమామ కథలు మళ్ళీ జల్లెద ఫత్తాలి మాకు కావల్సినటువంటి కథల కోసం. There’s not just volume but also variety in the Chandamama stories.

    Yes, we can smile about Telugu children’s literature:-)

  5. సూర్య ప్రకాషు

    బావుంది. నాకు చదివి వినిపించడం అంటే కష్టం. చెప్పడం వరకూ అయితే ఒక కథ నెల రోజులైనా (t.v. ధారావాహికలలా కాదు) పొడిగించగలను. మా అబ్బాయికి పదకొండేళ్ళయినా ఇప్పటికీ రోజూ రాత్రి కథ చెప్పమనే అడుగుతాడు. రామాయణ భారత భాగవతాలు, కాశీమజిలీ కథలు, మర్యాద రామన్న, తెనాలి రామక్రిష్ణుడు, స్వకపోల కల్పితాలు (చిన్నప్పుడు చదివిన షాడో, భగవాన్ వాటికి మార్పులతో సహా) అన్నీ అయిపోయాయి.
    మళ్ళీ పాత కథ చెప్దామంటే, కొత్తది చెప్పు ఇది విన్నదే అంటాడు. ఆందుకని ఇప్పుడు పాత కథలనే science fiction గా మార్చి చెప్పవలసి వస్తోంది. ఆ విధంగా ఇప్పుడు నడుస్తున్న కథ కచ దేవయాని. రెండు గ్రహాలు, ముఖ్య శాస్త్రవేత్తలు వారి పరిశోధనలు, మధ్య మధ్యలో యుద్ధాలు, కచుడు శుక్రాచార్యులవారి వద్దకు వెళ్ళడం వరకూ వచ్చాము. ఇదేదో తెలిసిన కథలాగానే వుందే అని నిన్న రాత్రే అన్నాడు. ఇవాళ రాత్రి కొంచెం కష్టమే. ఈమధ్యనే కొత్త rule పెట్టాను. నువ్వు చదువుతున్న ఇంగ్లీషు నవలలు, కథలు నాకు ఒక రోజు చెప్పు, రెండో రోజు నేను తెలుగువి(లో) చెప్తాను. కాని వాడు చెప్పవలసిన రోజు ఏదో వంక పెట్టి నాచేతే చెప్పిస్తుంటాడు.
    మా అమ్మాయికి మూడేళ్ళే కాని కథ నేను మొదలు పెడితే చాలు తర్వాత నన్ను చెప్పనివ్వదు తనే అలా కదా ఇలా చెప్పు అని పూర్తి చేస్తుంది (కాబోయే ఏంకరేమో అని భయం నాకు. మాకు తెలుగు టివి రాదు కాబట్టి బతికిపోతున్నాం). ఇక ముందేమి జరుగునో…

    సూర్య ప్రకాషు

  6. మెహెర్

    చాలా బాగుంది. “హతవిధీ! నాకూ ఓ పాప వుండుంటే ఇలాంటి ఒక వ్యాసం రాసే అవకాశం వుండేది కదా” అనిపించింది. 😛

    పిల్లల చేత కథలు చెప్పించుకోవటం చాలా బాగుంటుంది. నట్టుతూ నట్టుతూ అప్పటికప్పుడు అల్లిబిల్లిగా పేనుతున్న వాళ్ళ ఊహల త్రోవలు వాళ్ళ కళ్ళల్లోనే స్పష్టంగా కన్పించిపోతుంటాయి; వాళ్ళ ప్రపంచం చిన్నది కాబట్టి ఆ ఊహల వెనక నిజ జీవిత మూలాలేవై వుండచ్చో కూడా మనకి దొరికిపోతుంటాయి. వాళ్ళకి సిగ్గూ ఎగ్గూ వుండదు కాబట్టి పట్టించుకోరనుకోండి. 🙂 ఆ కథలకన్నా (of course!), ఆ బుల్లి imaginations at work, చూడ్డానికి భలే వుంటుంది.

    పాత రష్యన్ అనువాదాలు వదలకండి. ఆ ప్రపంచం పసితనానికి బాగా అమరుతుందని నా అభిప్రాయం.

  7. mandaakini

    దాదాపుగా నాకూ మా బాబు తో ఇవే అనుభవాలు. మేమూ ఆంధ్రాలో లేము. నేనూ ఇలాగే కష్టపడి, ఇష్టపడి తెలుగునేర్పించాను. ఇప్పుడు పెద్దవాడయ్యాడు. కాని స్వతహాగా తెలుగు చదివే ఆసక్తి ఎలా కలిగించాలో! దానికి సమాజం, మిత్రుల అవసరం ఎంతైనా ఉంది అనిపిస్తుంది. ఎందుకు ఎప్పుడూ అలా ఏదో ఒకటి చదువుతూనే ఉంటావ్? అని అడుగుతాడు. మా ఇంట్లో నేను మాత్రమే చూపించే పఠనాసక్తి వాడికీ రావాలని ప్రయత్నిసున్నాను.

  8. స్వాతి కుమారి

    బావుంది. మనం చదువుతూ ఉండగా చూడ్దం, దానిలో ఉన్న కథలు మనం చెప్పడం వల్ల ఆ పుస్తకాల్లో ఎంతో వినోదం ఉందనే అభిప్రాయం వాళ్ళకి కలిగి ఎంత త్వరగా చదవడం నేర్చుకుని సొంతగా చదివెయ్యాలా అనే ఉత్సుకత కలుగుతుంది. మా అబ్బాయికి ఇదొక ఆటలా ఉంటుంది, నే చదువుతున్న పుస్తకం లో random గా ఒక పేజీ తిప్పి అక్షరాల మీద వేళ్ళుంచి ’ఇక్కడ ఏమని రాసి ఉంది?’ అంటాడు. అక్కడ ఉన్నది చదివి చెప్పగానే కాసేపు ఆ లైన్ల వైపు చూస్తాడు తనక ఏమైనా అర్ధమౌతుందేమో అని:) ఇవన్నీ నువ్వు చదవచ్చు అని చెబితేనే బడికి ఇష్టం తో వెళ్ళడం మొదలెట్టాడు.

Leave a Reply to పుస్తకం » Blog Archive » “మంచి పుస్తకం”తో కాసేపు.. Cancel