తెలుగు కథానికకు వందేళ్ళు!

రాసిన వారు: సి.బి.రావు

******************

మీరు కధలు చదువుతారా? వ్రాస్తారా? తెలుగు కాల్పనిక సాహిత్యం గురించి మీ అవగాహన ఎంత?

ఇవిగో ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు. వీక్షించండి.సమాధానమివ్వటానికి ప్రయత్నం చెయ్యండి.

a) ఇటీవలే రాజమహేంద్రవరం కోటిపల్లి బస్ స్టాండ్ లో ప్రతిష్టించిన సాహితీమూర్తి విగ్రహం ఎవరిది?

1) శ్రీపాద సుబ్రహ్మణ్యం 2) శ్రీపాద కృష్ణమూర్తి 3) శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 4) శ్రీపాద గోపాలకృష్ణమూర్తి

b) తెలుగులో మొదటి ఆధునిక కధ – కధానిక వ్రాసిన దెవరు?

1) రావిపాటి గురుమూర్తి శాస్త్రి 2) గోడె నారాయణ గజపతి రాయని 3) వేదం వెంకటరాయ శాస్త్రి 4) గురజాడ అప్పారావు

c) పద్మభూషణ్ పొందిన తెలుగు కధా రచయిత

1) ముళ్లపూడి వెంకట రమణ 2) వెన్నెలకంటి రాఘవయ్య 3) డి.వి.నరసరాజు 4) గొపీచంద్

d) ప్రపంచ కధల పోటీలో గాలివాన కధకు న్యూ యార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ బహుమతి పొందిన రచయిత

1) రావి శాస్త్రి 2) పాలగుమ్మి పద్మరాజు 3) కె.ఎన్.వై.పతంజలి 4) బుచ్చిబాబు

e) “పాపి కొండలు” నవలా రచయిత

1) రావూరి భరద్వాజ 2) హితశ్రీ 3) ధనికొండ హనుమంత రావు 4) జి.వి.కృష్ణారావు

f) “పులిరాజుకు ఐడ్స్ వస్తుందా?” కధా రచయిత్రి ఎవరు?

1) సి.సుజాత 2) డి.కామేశ్వరి 3) శ్రీవల్లీ రాధిక 4) పి.సత్యవతి

g) “బంగారు మురుగు” కధతో చిరవిఖ్యాతి పొందిన రచయిత ఎవరు?

1) వంశీ 2) సత్యం సంకరమంచి 3) శ్రీ రమణ 4) శారద

h) వాత్సాయన కామ సూత్రాలు, శ్లోకాలు ప్రాతిపదికగా తీసుకొని “నీలకంఠం కధలు” వ్రాసిన రచయిత

1) తల్లావఝుల శివశంకర శాస్త్రి 2) ధనికొండ హనుమంత రావు 3) ఒంగోలు ముని సుబ్రహ్మణ్యం 4) జొన్నలగడ్డ వీరాస్వామి

i) తన నవలకు National Human Rights Award పొందిన రచయిత

1) ఖదీర్ బాబు 2) సలీం 3) పెరుగు రామకృష్ణ 4) పతంజలి శాస్త్రి

j) అనేక భాషల్లో అనువాదమై, అనేక ముద్రణలుగా వెలువడిన నవల “అంటరాని వసంతం” రచయిత జి.కల్యాణరావు ఏ జిల్లాకు చెందిన వారు?

1) ప్రకాశం 2) గుంటూరు3) నెల్లూరు 4) కడప

k) కాళీపట్నం రామారావు కధ “యజ్ఞం” ముగింపును పోలిన కధ “అడుసు” కధా రచయిత

1) చిలుకూరి దేవపుత్ర 2) సింగమనేని నారాయణ 3) హిదయతుల్లా 4) జి.ఆర్.మహర్షి

l) తెలుగులో కధలు వ్రాసే మంత్రివర్యులు

1) గల్లా అరుణకుమారి 2) నన్నపనేని రాజకుమారి 3) లక్ష్మీ పార్వతి 4) కొండా సురేఖ

ఈ ప్రశ్నలకు మీ వద్ద సమాధానం లేకపోతే బహుశా గూగులమ్మ (Google) కూడా వీటికి బదులివ్వలేదు. అయితే వీటికి సమాధానాలే కాకుండా, మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల రచయితల జీవిత, కధా రచన విశేషాలు డా.వేదగిరి రాంబాబు సంకలనం “తెలుగు కధానికకు వందేళ్లు ” పుస్తకంలో లభిస్తాయి. ఈ సంకలనం లో జిల్లాకో వ్యాసం చొప్పున, ఆ జిల్లాలలోని ప్రముఖ, పేరు తెచ్చుకొంటున్న యువ రచయితల కధల విశ్లేషణతో ఈ వ్యాసాలు ఉన్నాయి. వీటిలో పైన పేర్కొన్న ప్రశ్నలలోని విశేషాలే కాకుండా మచ్చుకు మరికొన్ని విశేషాలు. కధలెందుకు వ్రాయాలి అనే విషయమై సదానంద్ శారద అంటారు “మన సమాజంలో ఎన్నో సమస్యలున్నాయి.మన సంఘంలో ఎన్నో దురాచారాలున్నాయి.మన దేశంలో ఎంతో పేదరికం ఉంది. వీటిని పరిష్కరించగలిగేవాళ్లం మనమే. అది గుర్తు చేయటానికే సాహిత్యం అని నమ్మేవాళ్లలో నేను ఒకడ్ని.”

తెలుగులో మొదటి ఆధునిక కధ 1910 లో ఆంధ్ర భారతి లో ప్రచురితమైన ” దిద్దుబాటు” ను వ్యవహారిక భాషలో వ్రాశారు.కధానికలో అనువైన మాండలిక భాష నుపయోగించి పాఠకునికి ఆయా పాత్రలు ఎదుట వున్న భావన కలిగించారు. వేశ్యాలోలుడైన భర్తని దిద్దుబాటు చేసుకొన్న కమలిని కధ దిద్దుబాటు కధానిక. ఓరుగల్లు కు చెందిన చంద్ర (1946) డెబ్బదికి పైగా కధలు వ్రాశారు. చిత్రకారుడిగా ప్రసిద్ధిగాంచిన చంద్ర మంచి కధకుడు, కధా విమర్శకుడు అన్న విషయం చాలా మందికి తెలియదు. తెలంగాణా కధా సంకలనం లో వీరి “తలుపు” కధ ప్రచురించారు. గతంలో కధలన్నీ కంచికివెళ్లేవి. ప్రస్తుతం చిరునామా మారి కధలన్నీ కారా (కాళీపట్నం రామారావు) మాస్టారు స్థాపించిన శ్రీకాకుళంలోని కధానిలయానికి వెళ్తున్నాయి. శ్రీకాకుళంలో జన్మించిన ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య కవి,కధా రచయిత కూడా.ఆయన రచించిన నాగ,కుబ్జ,దివంగత రేఖ,అమృతలక్ష్మి, త్రికళ వంటి కధలలో చిత్రకారుడు అంతర్లీనంగా కనిపిస్తాడు. ఈ పుస్తకంలోని అన్ని విశేషాలను ఈ చిన్న వ్యాసంలో ఉటంకించటం సాధ్యం కాదు. ఆసక్తిగల పాఠకులు ఈ పుస్తక స్వీయ పఠనంలో స్వయంగా వాటిని ఆస్వాదించవచ్చు.

ఈ సంకలనంలో కొన్ని జిల్లాల రచయితల/కధల గూర్చిన సమీక్ష సమగ్రంగా వుంటే కొన్ని జిల్లాల గురించి సంక్షిప్తంగా వుండి జిల్లాల వారీ సమీక్షలో సమతుల్యం లోపించింది. అన్ని జిల్లాల వారు కృష్ణా జిల్లా తెలుగును ప్రామాణికంగా తీసుకుంటారు. ఎందరో రచయితలుద్భవంచిన ఈ గడ్డ సమీక్ష మరీ క్లుప్తంగా ఉండి కొంత నిరాశకు గురి చేస్తుంది. దీనిని విస్తరించవలసిన అవసరమున్నది. కొన్ని జిల్లాల సమీక్షలు ఈ సంకలనం లో అసలు లేవు. రచయితలను జిల్లాల వారీగా విభజించటంలో సమన్వయం లోపించింది. కొందరు రచయితలు రెండు జిల్లాల సమీక్షలలో కనిపిస్తారు. సంకలనకర్త, రచయితలను జిల్లాల వారీగా విభజించి, సమీక్షకులకు ఆ యా జిల్లాల రచయితల జాబితా ఇచ్చి వుంటే ఈ అయోమయం ఉండి ఉండెడిది కాదు.

ఈ సంకలనం సమగ్రం కాదు. పలు జిల్లాలలోని ప్రముఖ, యువ కధకులను విస్మరించటం జరిగింది. ఉదాహరణకు కృష్ణా జిల్లావాసులై, అకాశవాణీ ద్వారా చిర పరిచితులైన రచయిత, వ్యాఖ్యాతలైన డి.వెంకట రామయ్య, రతన్ ప్రసాద్, ప్రముఖ అనువాదకులు, కధా రచయిత ఐన డి.మహీధర్ మరియు శ్రీకాకుళం రచయిత్రి పప్పు అరుణ (ఆంధ్ర జ్యోతి) ప్రస్తావన ఎక్కడా కనపడదు. నిజానికి తెలుగు కధానికా పరిధి విస్తృతమైనది. అది ఆంధ్ర రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి విశ్వజనీనమైంది. ఇతర రాష్ట్రాలలో ఉండి తెలుగు కధా రచన చేస్తున్న వారిని ఈ సంకలనం లో విస్మరించటం జరిగింది. ఉదాహరణకు “ప్రళయ కావేరి కథలు” మరియు “సజీవ సంప్రదాయంగా వేమన ” రచించిన సామల వెంకట రమేష్ తమిళ నాడు లోని హోసూర్ వారు. అమెరికా, కెనడా, యూరప్, ఆస్ట్రేలియా మొదలగు దేశాల ప్రవాసాంధ్రులు ఎన్నో కధలు వ్రాశారు. వ్రాస్తున్నారు. వారి ప్రస్తావన లేశమాత్రంగా నైనా కనిపించదు. ఆధునిక తెలుగు కధలో వీరి పాత్రను విస్మరించలేము. పరిశోధన, పరిశీలన తో కూడిన జిల్లలవారీ సమీక్షలు పాఠకులను ఆకట్టు కుంటాయి. ఉదాహరణకు కడప జిల్లా గురించి వ్రాసిన వి.ప్రతిమ, గుంటూరు జిల్లా గురించి వ్రాసిన విహారి, విశాఖ జిల్లా గురించి వ్రాసిన మేడా మస్తాన్ రెడ్డి సమీక్షలు ఆసక్తికరంగా వుండి ఏకబిగిన చదివిస్తాయి. ఆయా జిల్లాలలోని రచయితల రచనలపై పాఠకులకు ఆసక్తిని కలిగిస్తాయి. జిల్లావారీ సమీక్షలు నెరిపిన పలువురు సమీక్షకులు, 100 ఏళ్ల కధానికా చరిత్రను పుస్తకరూపంలో తెచ్చిన సంకలన కర్త డా. వేదగిరి రాంబాబు అభినందనీయులు.

జైలు నిర్బంధంలో వుంటూ “పరిష్కారం” అనే కధల సంపుటి లోని 9 కధలు వ్రాసిన ప్రొద్దటూరు శాసన సభ్యులు ఎం.వి రమణారెడ్డి ఉదంతం, తెనాలిలో హోటల్లో సర్వర్ గా పనిచేస్తూ, శారద పేరుతో తెలుగులో కధలు వ్రాసి ప్రఖ్యాతి గాంచిన తమిళుడైన నటరాజన్ ఉదంతం, కధలు వ్రాసే అంధులైన సత్యవాడ సోదరీమణుల ఉదంతాలు మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి; కధాజగత్ లోని వైచిత్రాలను మన ముందుంచుతాయి. పుస్తకం చివరలో రచయితల, కధా సంపుటాల విషయాను క్రమణిక (సూచిక -index) లేక పోవటం పెద్ద వెలితిగా కనిపిస్తుంది. ఏమైనా రాష్ట్ర స్థాయి పరిధిలోని అనేక మంది రచయితల జీవన/కధల విశ్లేషణ ఒక బృహత్కార్యం. తెలుగు కధ గురించి తెలుసుకొనగోరే జిజ్ఞ్నాసులకు ఈ సంకలనం కరదీపిక కాగలదు.

**********************

పుస్తకం వివరాలు:

తెలుగు కథానికకు వందేళ్ళు ( Telugu Kathanika ku vandellu)

వేదగిరి రాంబాబు (Vedagiri Rambabu)

ముఖ చిత్రం: బాలి

ప్రధమ ప్రచురణ: January 31st, 2010

174 పేజీలు

పేపర్ బాక్: డెమి

ధర: రూ.100/-

ప్రచురణ: శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్, హైదరాబాదు.

ప్రాప్తి స్థానాలు: నవోదయ బుక్ హౌస్,హైదరాబాదు, విశాలాంధ్ర అన్ని శాఖలు.

You Might Also Like

One Comment

  1. Madhurasree

    poorvam kathalanni kanchikivelathayi anna nanudi mari kathalanni Kalipatnam Ramarao gari kathanilayaniki velathayi anna nanudi 21 va sathabdam lo katha parinathiki nidharsanam. kadapa zilla gurinchi prastavana teesukuvachinna prathima gariki Gunturu zilla gurinchiprastavana teesukuvachinna Viharigariki namaskaram

Leave a Reply