Kaifi & I పుస్తకావిష్కరణ

వ్యాసం రాసిపంపినవారు: సి.బి.రావు

kaifi_&_i_booklaunch_2

ముంబాయి లో  ఆంగ్ల పుస్తకం “కైఫీ మరియు నేను”  పుస్తకావిష్కరణ  చిత్రం: స్టార్ బాక్స్ ఆఫీస్ సౌజన్యంతో

ప్రఖ్యాత కవి కైఫీ అజ్మి భార్య షౌకత్ కైఫి  వ్రాసిన  ”Kaifi & I” పుస్తకాన్ని ఫిబ్రవరి  9 న ముంబాయి పట్టణంలో ప్రముఖ నటి తబు, రచయిత్రి కూతురు షబనా అజ్మి, అల్లుడు రచయిత, కవి ఐన జావెద్ అఖ్తర్, మనమడు ఫర్హాన్, నటులు షర్మాన్ జోషి,దియా మిర్జా, కవి ప్రసూన్ జోషీల సమక్షంలో  ఆవిష్కరించారు. ” యాద్ కి రెహ్‌గుజార్ (Memory Lane)” పేరుతో ఉర్దూ లో వ్రాసిన ఈ పుస్తకాన్ని నస్రీన్ రెహ్మాన్ ఆంగ్లంలోకి అనువదించారు. పుస్తక  రచయిత్రి  షౌకత్ కైఫి మాట్లాడుతూ తనకు కైఫీ అజ్మి కి మధ్య ఉన్న ప్రేమ, తాము  బీదరికంలో కూడా జీవితాన్ని ఎలా సంతోషంగా గడిపారో, ఇవన్నీ ఒక చలన చిత్రం గా తీస్తే బాగుంటుందంటూ తమ పాత్రలను అభిషేక్ బచ్చన్, సోనం కపూర్లు పోషిస్తే బాగుండగలదన్న అభిప్రాయం వెలిబుచ్చారు. “Kaifi and I”  పుస్తకంలో  తన జీవితంలో జరిగిన సంఘటలను, ఎలాంటి చిలవలు పలవులు కలుపకుండా  ఉన్నది ఉన్నట్లుగా వ్రాశానని,  ఎలాంటి కల్పితాలు లేవని  తెలిపారు. బహుశా ఈ పుస్తకంలోని సరళత, నిష్కపటం వలనే పాఠకులు దీనిని ఇష్టపడి ఉండవచ్చని  చెప్పారు. ఈ పుస్తకం  జపనీస్,మరాఠి, హింది మరియు ఆంగ్ల భాషలలోకి అనువాదం అయింది. ఈ పుస్తకం వ్రాయటానికి కారణాలు వివరిస్తూ షౌకత్ ” నా జీవితంలో ఎన్నో కష్టాలు చవిచూశాను.బీదరికం అంటే ఏమిటో నాకు బాగా తెలుసును. భారత అభ్యున్నతికై పనిచేయాలని  కోరుకొనేదానను  నేను కమ్యునిస్ట్ పార్టీ కార్యకర్తను. ప్రజల స్థితిగతులు బాగు పరిచేందుకు, భారత స్వాతంత్ర్యానికి కమ్యునిస్ట్ పార్టీ కృషి చేసింది. ఆ విషయం కూడా నా పుస్తకం లో చెప్పాలనుకున్నాను” అన్నారు. ఈ సందర్భంలో షౌకత్ అజ్మి, తాబు,షబనా అజ్మి,జావెద్ అఖ్తర్,నందితా దాస్, దియా మిర్జా ప్రభృతులు ఈ పుస్తకం పై, కైఫీ అజ్మీ  పై వెలిబుచ్చిన అభిప్రాయాలు ఈ కింది చలన చిత్రంలో చూడండి.

http://timesofindia.indiatimes.com/videos/celebs/Tabu-launches-book-Kaifi-I-by-Shaukat-Kaifi/videoshow/5557120.cms

హైదరాబాదు లో ఆంగ్ల పుస్తకం  “కైఫీ మరియు నేను”  పుస్తకావిష్కరణ

kaif2

kaifi3పుస్తకం లోని ఒక అధ్యాయం చదువుతూ షబనా అజ్మి , వేదిక పై   రాష్ట్ర గవర్నర్  హీజ్ ఎక్స్‌లెన్సీ  ఈ ఎస్ ఎల్ నరసింహన్

భారతదేశంలోని పలునగరాలలో పుస్తకం ఆవిష్కరించే కార్యక్రమంలో భాగంగా, హైదరాబాదులో  ఫిబ్రవరి 12 న  తాజ్ బంజారా హోటల్ లో రాష్ట్ర గవర్నర్  హీజ్ ఎక్స్‌లెన్సీ  ఈ ఎస్ ఎల్ నరసింహన్  ”Kaifi & I” ను ఆవిష్కరించారు. గవర్నర్ మాట్లాడుతూ షౌకత్ ఈ పుస్తకం ద్వారా తన జీవితంలోని కష్ట సుఖాలను మనతో పంచుకోవటం అభినందనీయమన్నారు. ఈ సందర్భంలో  కైఫీ అజ్మి జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించారు. పుస్తక ప్రచురణకర్తలు జుబాన్ వారు మాట్లాడుతూ ”  హైదరాబాదుకు చెందిన రచయిత్రి కమ్యూనిస్ట్ పార్టీతో, ఇండియన్ థీయేటర్, కైఫీ తో గల తమ అనుబంధాన్ని ఈ పుస్తకంలో వివరించారు.  ఈ పుస్తకం మొదటి పేజీనుంచి చివరిదాకా  ఆసక్తిగా చదివిస్తుంది.” అన్నారు. తరువాత కైఫీ అజ్మీ పుత్రిక  షబనా అజ్మి మాట్లాడుతూ ” ఈ సమావేశం నిర్వహిస్తున్న ఖదీర్ ఆలి బేగ్  ఫౌండేషన్ వారికి నా కృతజ్ఞతలు. చాలా మందికి తెలియదు నేను ఈ ఊళ్లోనే పుట్టానని. నస్రీన్ రెహ్మాన్ ఈ పుస్తక అనువాదాన్ని చక్కగా చేశారు. తన తల్లి షౌకత్ కైఫి రచయిత్రి కాదనీ, అయినా అప్పటి జ్ఞాపకాలను మనకు చెప్పేందుకు వ్రాశారు. ఎలాంటి డైరీ రాసే అలవాటులేని తను ఎప్పటి సంఘటలనో కేవలం జ్ఞాపకం మీద ఇంత వివరంగా రాయటం ఒక విచిత్రంగా అనిపిస్తుంది.” అన్నారు. తరువాత షబనా అజ్మి  పుస్తకం లోని కొన్ని అధ్యాయాలను, శ్రోతల కోరికపై ఉర్దూలో చదివారు. ఈ పుస్తక పఠనంలో తను, మొహమ్మద్ ఆలి బేగ్ ఉర్దూ నుంచి ఆంగ్లంలోకి, ఆంగ్లం లోంచి ఉర్దూలోకి మార్చి మార్చి చదువుతూ కొన్ని అధ్యాయాలను చదివి వినిపించారు. షబనా అజ్మి సంతకానికై పుస్తక ప్రేమికులు  ”Kaifi & I” పుస్తకాన్ని చేతబట్టి పెద్ద క్యూ లో నించోవటం కొస మెరుపని చెప్పవచ్చు.

kaifi4రాష్ట్ర గవర్నర్  హీజ్ ఎక్స్‌లెన్సీ  ఈ ఎస్ ఎల్ నరసింహన్  ”Kaifi & I” ను ఆవిష్కరించారు.

ఈ పుస్తక రచయిత్రి గురించి రెండు ముక్కలు: 1944 – 1988 మధ్య కాలంలో రచయిత్రి పలు నాటకాలు, హీర్ – రాంఝా, ఉమ్రావ్ జాన్, బజార్, గర్మ్ హవా, మరియు సలాం బాబే  వగైరా హిందీ చిత్రాలలో నటించారు.1947 లో కవి,సాహితీకారుడైన కైఫీ అజ్మీ ను, భారత స్వాతంత్ర్య సమర సమయంలో ప్రేమించి వివాహమాడారు.
అనువాదకురాలైన నస్రీన్ రెహ్మాన్ చిత్రానువాదానికై బహుమతి పొందారు. వారు వ్రాసిన “నూర్జెహాన్, మెలొడీ క్వీన్” పుస్తకం త్వరలో రానుంది.

kaifi5షబనా అజ్మి ఆటోగ్రాఫ్ కై  క్యూలో నిలబడ్డ  పుస్తక ప్రియులు

ఈ పుస్తక కధా సారాంశం ఏమిటి?

ప్రతి మనిషీ ఒక పుస్తకమైతే అతని భార్యే ఆ పుస్తకాన్ని సరిగా చదవగల వ్యక్తి. షౌకత్ ఈపుస్తకం లో కైఫీ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తారు. షౌకత్ మరియు కైఫీ 1947 లో ఒక కవి సమ్మెళనంలో మొదటిసారి కలిసారు. తొలిచూపులోనే  ప్రేమలో పడ్డారు. కవి,కమ్యునిస్ట్, కవిత్వం ద్వార చెప్పుకోదగ్గ ఆదాయం లేని కైఫీ తో పెళ్లికి తల్లివ్యతిరేకించినా తండ్రి ఆశీస్సులతో కైఫీని వివాహమాడారు షౌకత్. ఇద్దరూ కమ్యూనిస్ట్ పార్టీ జండా మోసేవారు. ఎప్పుడూ చాలినంత సంపాదన చేతిలో ఉండేదికాదు. అయినా ఉన్నంతలో తృప్తిపడి ఒద్దికగా సంసారాన్ని నడిపేవారు.  ఒక సద్భావనతో  కైఫీ కవిత్వం రాసేవాడని నమ్ముతూ, అతని కవిత్వంలో మైమరచిపోయేవారు షౌకత్. కైఫీ అజ్మీ విముక్తురాలైన స్త్రీని శ్లాఘిస్తూ వ్రాసిన ఔరత్ కవిత తనను ఉద్దేశించి  రాసినదేనని షౌకత్  చెప్తారు. ఈ పుస్తకం కైఫీ, షౌకత్  కధే కాకుండా, ఇప్పుడు కనిపించని, అప్పటి హైదరాబాదు, బాంబె  నగరాల జీవన స్థితిగతులు, ఆచార వ్యవహారాలకు, చరిత్రకు అద్దం పట్టింది. బాంబెలో తోటి కమ్యూనిస్ట్ లతో కలిసి ఒకే చావిడిలో సహవాసం, ఇండియన్ ప్యూపిల్ థీయేటర్ అస్సొసియేషన్, పృథ్వి థియేటర్, అభ్యుదయ రచయితల సంఘం, తన కూతురు ప్రఖ్యాత నటి షబనా అజ్మి, కొడుకైన సినిమా ఛాయాగ్రహకుడు బాబా  ప్రభృతుల తో అనుభవాలు ఈ పుస్తకంలో చోటుచేసుకున్నాయి. చలనచిత్రంగా రాబోతున్న ఈ ప్రేమ కధతో జావెద్ అఖ్తర్ మలిచిన నాటకం  కైఫీ ఔర్ మై  – Saga of a poet, ఇండియన్ ప్యూపిల్ థీయేటర్ అస్సొసియేషన్  వారి ఆధ్యర్యంలో, షౌకత్, కైఫీ పాత్రలు షబనా, జావేద్ పోషించి భారత దేశం లోని పలు నగరాలలొను, విదేశాలలోను ప్రదర్శించటం జరిగింది.  ఇంకా ప్రదర్శిస్తున్నారు. మన హైదరాబాదులో ఈ నాటక ప్రదర్శన 2006 లో జరిగింది.

Photos & Text: cbrao

You Might Also Like

One Comment

  1. చౌదరి జంపాల

    సమావేశ వివరాలు చక్కగా వివరించారు. ధన్యవాదాలు.

    కైఫీ, షౌకత్‌ల కుమారుడు బాబా అజ్మీ బాపు గారి తెలుగు సినిమాల ద్వారానే చలనచిత్రాల్లో ఛాయాగ్రహకుడిగా రంగప్రవేశం చేశారు.

Leave a Reply