గుప్త పాశుపతము – విశ్వనాధ సత్యనారాయణ

నాటకము 1982 ప్రధమ ముద్రణ గావించబడినది.విశ్వనాధ వారు దీనిని మొదట తెలుగులో రాసినా, దీని సంస్కృత అనువాదమే (అనువదించినది విశ్వనాధవారే)తొలిగా 1973 లో, అమృత శర్మిష్టం అనే నాటకముతో కలిసి ప్రచురితమయ్యింది. హరిశ్చంద్ర పాత్రధారిగా ఆంధ్రదేశంలో పేర్గాంచిన, నాట్యాచార్య మల్లాది సూర్యనారాయణగారి అభ్యర్ధనపై కురుక్షేత్ర సంగ్రామం ఇతివృత్తముగా విశ్వనాధ దీనిని వ్రాయటము జరిగినది.

నాటకం చదువుతుంటే తిరుపతి వెంకటకవులు రాసిన ఉద్యోగ విజయాలు గుర్తురాక మానవు.అదే పంధాలో రాసినట్లు విశ్వనాధవారే చెప్పారు.అప్పట్లో స్త్రీ పాత్రధారులు లభించుట కష్టము కనుక ఒకే స్త్రీ పాత్రతో పలు నాటకములు ప్రదర్శించబడుతుండెడివి. అట్టి సౌలభ్యము కొరకు సుభద్ర పాత్రధారియే,జలాధిదేవతగా సుభద్ర రూపంలో దర్శనమిచ్చునీ నాటకములో.పలు యుద్ధ దృశ్యములు,కౌబేరి (దుర్యోధనుడి వార్తా ప్రచారకుడు),ఘటకుడు (దుర్యోధనుడి సేవకుడు,సైనికుడు), బాలాకి (అర్జునుడి మిత్రుడు,సేవకుడు)మొదలగు పాత్రలతో, యుద్ధభేరి,ఒక యోధుడు మరణించిన సమయంలో వాడే భేరీ ధ్వనులు వగైరా నేపధ్య ధ్వనులతో,రక రకముల నేపధ్యములతో తెర నుండునట్లుగా ప్రదర్శనకు వీలుగా నాటకము రాయబడినది.ఇది విజయవాడ ఆకాశవాణి కేంద్రము నుంచి, శ్రవ్య నాటకముగా ప్రసారమయినది గతంలో.

దుర్యోధనుడు భీష్మాచార్యులను సేనాధిపతిగా నియమించాడన్న వార్త పై పాండవుల చర్చతో కధ మొదలయి,దుర్యోధనుడి చావు పై అశ్వద్ధామ బ్రహ్మశిరో అనే అస్త్రాన్ని పాండవుల ఏకైక వారసుడైన ఉత్తర (అర్జునుడి కుమారుడు అభిమన్యుడి భార్య) గర్భస్త శిశువు(పరీక్షిత్మహారాజు జనమేయుడి తండ్రి)పై ప్రయోగించువరకు, పిమ్మట అశ్వద్ధామ కృష్ణుని శాపానికి, శివుని కోపానికి గురవటమూ, కృష్ణుడు, ఉత్తర గర్భాన, చనిపోయి జన్మించిన బిడ్డకు జీవము పోయుట వరకూ రసవత్తరంగా చెప్పబడింది. మహాభారతము లో వాడిన పెక్కు అస్త్రాల గురించిన వివరణ నాటకమునందున్నది.అర్జునుడు తనవద్ద శివకృప వలన లభించిన పాశుపతాశ్రమున్ననూ, అది ప్రళయాంతమున మాత్రమే వాడవలసినదిగా గుర్తించి, ఎంతో నిగ్రహముగా దానిని వాడకనే యుద్ధము ముగించుట శ్లాఘించ తగిన విషయముగా నాటకమున పేర్కొనబడినది. అదియే అర్జునుని గుప్త పాశుపతము.

నాటకము మహాభారత యుద్ధ తంత్రాలను, కుతంత్రాలను ఆసక్తికరంగా వెలుగులోకి తీసుకురాగలిగినది. నాటకం చదువుతుంటే తెరపై దృశ్యమెటులుండునో పాఠకుడు సులభముగా ఊహించుకొనగలడు. పెక్కు పద్యములు సామాన్య పాఠకుడికి మింగుడు పడనప్పటికీ, గద్యము ననుసరించుచూ,  ముందుకు పోవచ్చును.మహాభారత యుద్ధకాండ పఠించ ఆసక్తి ఉన్నవారినిది నిరాశపరచదు.
****************************************************************************************************

Gupta Pashupathamu (Viswanatha Satyanarayana)

ప్రచురణ కర్తలు: విశ్వనాధ పావని శాస్త్రి,V.S.N.Co,మారుతి నగర్, విజయవాడ – 520 004
ప్రధమ ముద్రణ: అక్టోబర్, 1982
ధర: ఆరు రూపాయలు మాత్రమే.
ముఖ చిత్రం: బాపు
తప్పొప్పుల పట్టిక రెండు పుటలతో కలిసి మొత్తం పుటలు: 142
లభ్యత: నమస్తే ప్లాజా, సన్నీ వేల్, సిలికాన్ వాలి, శాన్ హోజేపురం,కాలిఫోర్నియా  నందుకల BATA గ్రంధాలయంలో అద్దెకు కేవలము ఒక డాలరు.
************************************************************************************************

వ్యాసం రాసిపంపిన వారు: సి.బి. రావు

You Might Also Like

4 Comments

  1. pavan santhosh surampudi

    పుస్తకం.నెట్ సంపాదకులకు: ఇది ప్రస్తుతం ముద్రణలోనే వుంది. ముద్రణలో లేనివి అన్న టాగ్ అవసరమంటారా?

    1. Pustakam.net

      Updated the tag. Thanks.

  2. రవి

    మంచి పరిచయం. మరిన్ని రచనలు పరిచయం చేయాలి మీరు.

  3. aswinisri.wordpress.com

    good piece of information. thank you.

Leave a Reply