మధురాంతకం రాజారాం కథలు – సమీక్ష

వ్యాసం రాసిపంపినవారు: బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్

పుస్తకాల కోసం విశాలాంధ్ర బుక్ హౌస్ సందర్శించిన ప్రతిసారీ ఈ పుస్తకం చూసి కొనాలనుకోవడం,తర్వాత అనేక కారణాలతో దాన్ని వాయిదా వేసి పాపులర్ రచయితల నవలలు కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్ళడం నాకు పరిపాటి. పాపులర్ అన్న పదం వాడినందుకు సాహితీ అభిమానులు క్షమించాలి. ఇక్కడ నా ఉద్దేశ్యం మధురాంతకం రాజారాంగారి పేరుప్రఖ్యాతులని తక్కువచేసి చూపడం కాదు. రాజారాంగారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకొని వుండవచ్చు. గౌరవ డాక్టరేట్లు,మరెన్నో సత్కారలు పొందివుండవచ్చు. కానీ ఈతరం కుర్రకారుకి, వారపత్రికల పాఠకులకి ఒక యండమూరి వీరేంద్రనాథ్, ఒక మల్లాది వెంకటకృష్ణమూర్తి, ఒక యద్దనపూడి సులోచనారాణి తెలిసినంతగా ఆయన గురుంచి తెలియదన్నది నిర్వివాదాంశం. అలాంటి పాఠకులలో ఒకడినైన నేను, ఇలాక్కాదనిచెప్పి ఓ రోజు ఎలాగైతేనేం మొదటి భాగం కొనేశాను.కొన్నతర్వాత అందులోని కథలు చదువుకొని ఆశ్చర్యపోయాను.రుచికరమైన పదార్థం తిన్నాక దానికోసం మరింత అర్రులుచాచినట్లు మిగతా నాలుగు భాగాలు కూడా కొని గుక్కతిప్పుకోకుండా చదివేశాను.

రాజారాంగారి కథలు పంచదారగుళికల్లాంటివి. నోట్లో వేసుకోగానే కరిగిపోయినట్లు చదవగానే అందులోని సారమంతా అంతరాంతరాల్లో ఇంకిపోయి, మనసంతా ఒకరకమైన హాయిని చేకురిస్తాయి. చిన్నప్పుడు పండువెన్నెల్లో ఆరుబయట పక్కలు పరుచుకొని, బామ్మ కథలు చెబుతూంటే ఆ కథలలోని పాత్రలను ఊహించుకొంటూ, ‘ఊ’కొడుతూ ప్రశాంతంగా నిదరోయినట్లు రాజారంగారి కథలు చదువుతూ స్వాప్నిక లోకాలలో తేలిపోతాం. వారి శైలి విలక్షణమైనది. అది అందమైన తెలుగు నుడికారాలు, మనం మరిచిపోయిన ఉపమానాలు, సామెతలు ప్రోదిచేసి సునిశిత హాస్యం రంగరించి, చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా పాఠకుల హృదయల్లోకి బట్వాడా చేస్తుంది.

madhu1 madhu2madhu3madhu4

ఆయన రచనావ్యాసంగానికి వారి వృత్తి కూడా ఎంతో దోహదం చేసిందనే చెప్పాలి. అచ్చమైన గ్రామీణ వాతవరణంలో పుట్టిపెరిగి,స్కూలుటీచరుగా పల్లెటూళ్ళు, పేటలు తిరుగుతూ, పలురకాల మనుషుల్ని, భిన్న మనస్తత్వాలని తరచిచూసే అవకాశం ఆయనకు కలిగింది. ఆ అనుభవాలనే సాకల్యంగా కథల రూపంలో విడమరిచి చెప్పి గ్రామీణజీవితానికి, మధ్యతరగతి మానవుల మానసిక వికారాలకి, ప్రవృత్తులకి, సగటు మనిషి సమస్యల వైచిత్రికి నిలువుటద్దం పట్టి ‘మరేం పర్లేద’ని భరోసా ఇస్తారు. చాలా కథలలో రచయితే సూత్రధారై కథను నడిపిస్తాడు. ‘సర్కసుడేరా’ కథలో సర్కసు ఫీట్లకు విస్తుబోయిచూస్తుంటే నిజజీవితంలో కడుపు కోసం అనేకమంది అభాగ్యులు అంతకంటే ప్రమాదకరమైన ఫీట్లు చేస్తున్నారని చెప్పే నాగులు,’ ఎడారికోయిల’ లో, విదేశాలలో స్థిరపడి తండ్రి మరచిపోయిన తన గ్రామీణ మూలాలు వెదుక్కుంటూ వెళ్ళే రవిబాబు,’ గ్రూప్ ఫోటో ‘ లో మనుషులంటే గిట్టక ఊరికి దూరంగా బ్రతుకుతూ చివరికి ఆ ఊరివారివల్లే బ్రతికిబట్టకట్టి మారిపోయే కోదండం, ‘కామదహనం’ లో మారుపేరుతో బూతుసాహిత్యం వ్రాస్తూ పెళ్ళయ్యాక మారిపోయే చలపతి,’ పులిపైనస్వారీ ‘ లో సినిమా ప్రొడ్యూసరుకి జ్యోతిష్యునిలా నమ్మించి బురిడీ కొట్టించే పిచ్చి కిష్టయ్య,’ కొండారెడ్డి కుతురు ‘ లో భర్తను హతమార్చడానికి వచ్చిన కసాయివ్యక్తులకి తిండిపెట్టి,వాళ్ళను మార్చి క్షమించే నాగతులసి, ‘ఓటుకత’ లో ఓటరు లిస్టులో తన పేరు ఉండి కూడా ఒక్కసారి కూడా ఓటు వెయ్యలేకపోయిన పశువులు మేపుకొనే గంగన్న,’మిస్ ఎమెరాల్డా ఫ్రం ఫ్రాన్స్ ‘ లో తల్లితండ్రుల ప్రేమకు నోచుకోక అనాథలా పెరిగి భారతదేశంతో అనుబంధాలు పెంచుకొనే ఎమెరాల్డా, ‘స్వస్థానం ‘ లో అనవసర ఆడంబరాలకుపోయి అవమానాలపాలైన నీరజ, ’జగమేలే పరమాత్మ’ లో గొప్ప సంగీతవిద్వాంసుడై వుండి కూడా, తగినంత సొమ్ము ఇవ్వలేదని నిర్వాకులని సంస్కారహీనంగా చూసే దేవకోట అనంతనారయణ శాస్త్రి,ఆయనకు బుద్ధిచెప్పే నిర్వాహకుడు శ్రీనివాసమూర్తి,…ఒక్కటేమిటి ఇలా ఎన్నో ఎన్నెన్నో పాత్రలు,వాటి స్వాభావాలు,యోగవియోగాలు పాఠకులని కట్టిపడేస్తాయి.పెద్దబాలశిక్ష లా ప్రపంచ జ్ఞానాన్ని బోధిస్తూ,పంచతంత్రం లా చిన్న చిన్న కథలలో జీవితసారాన్ని వడ్డిస్తాయి. వ్యక్తుల్ని,సన్నివేశాల్ని,రాగద్వేషాల్ని,ఈతిబాధల్ని,జీవనదృక్పథాన్ని ఇంత అద్బుతంగా,ఇంత కూలంకషంగా విశదపరిచిన రచయితలు తెలుగులో బహుకొద్దిమంది మాత్రమే.వారిలో రాజారాం ప్రథమశ్రేణిలో వుంటారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.ప్రతి సహిత్యాభిలాషి ఇంట్లో,ముఖ్యంగా వర్థమాన రచయితల గ్రంథాలయాల్లో ఉండవలసిన పుస్తకాలు ఇవి. ఇది మన సంస్కృతి. ఇది మన నాగరికత.

ప్రతులకు విశాలాంధ్ర బుక్ హౌస్ ని సంప్రదించవచ్చు.

You Might Also Like

12 Comments

  1. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్

    సాయి బ్రహ్మానందం గారు,

    ఆమెరికా లో ఆంధ్రుల కథలు మూడు నాలుగు ఈ సంపుటాలలో వున్నాయి.వాటిలో ఎక్కడా ఆయన ఆమెరికాంధ్రుల జీవనశైలిని కాచివడబోసినట్టు,విమర్శిస్తూ వ్రాయలేదు.అది ఆయన శైలే కాదు.

    మీరు ఏ కథ గురుంచి చెబుతున్నారు?

  2. Sai Brahmanandam

    1995 తరువాతననుకుంటా, రాజారాం గారు అమెరికా వచ్చారు. ఆ సందర్భంలో అమెరికా జీవితం గురించి ఓ నాలుగయిదు కథలు 1998 లో రాసారు. అవన్నీ అర్థం పర్థం లేని కథలు. కేవలం ఒక్క సందర్శనతొనే అమెరికా జీవితమంతా వడకాచినట్లు రాసిపడేసారు. అమెరికాని తిడుతూ, అమెరికాలో నివసించే తెలుగువారి జీవితాలు డొల్లంటూ రాస్తే తెలుగు నాట భలే మెచ్చుకుంటారనుకున్నారో ఏమో, ఒక్క కథ కూడా బాగా లేదు. కేవలం ఒకటీ రెండు విజిట్లతోనే ఎదుటి వారి జీవన విధానాన్ని ఎంతో లోతుగా చదివేసానన్నట్లు రాయడం రుచించలేదు నాకు. అభిప్రాయాలు వేరూ, వాస్తవాలు వేరూ. మొదటి దాన్ని వాస్తవంగా చిత్రీకరించడంలోనే ఆ కథలు తేలిపోయాయి.

    -బ్రహ్మానందం

  3. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్

    మోహన్ రాంప్రసాద్ గారు కృతజ్ఞతలు,

    రాజన్న గారు

    నిజం చెప్పారు.ఏ ఇజాలు జోలికీపోకుండా కేవలం మానవ జీవితంలోని భిన్న పార్శ్వాలే అజెండా గా కథలు వ్రాశారు రాజారాం గారు.

  4. rajanna

    శ్రీకాంత్ గారూ,
    నేను ఒక సంపుటం చదివాను. నేను కుర్రాడిగా ఉన్నప్పుడు కొడవటిగంటి గారి రచనలు బాగా నచ్చేవి. మధురాంతకం గారి కథలు చదివిన తరువాత కొడవటిగంటి గారికంటే రాజారాం గారి రచనలు నచ్చుతున్నాయి. ఆయన జీవితాన్ని చిత్రించే విధానం లో సైధ్ధాంతిక జంఝాటం ఉండదు. సహజం గా నాలో కుర్రాడి గా ఉన్నప్పుడు ఉండే ఆదర్శ తత్వం వయసు పెరిగే కొద్దీ తగ్గుతోంది అనటానికి ఇదొక సూచన అనుకొంటా..

  5. mohan ram prasad

    mee review bavundi..”MADHURA” kadhalu malle chadavaalanivundi.

  6. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్

    రవిగారు,మెహెర్ గారు,చంద్రార్క గారు,జనార్ధన్ రెడ్డి గారు,సుభద్ర గారు.. అందరికీ నెనెర్లు.

    మెహెర్ గారు,

    మీరు చెబుతూంటే నాకూ ఇప్పుడు లీలగా గుర్తుకువస్తోంది.మధురాంతకం రాజారాం గారితో పరిచయం నాకు అలాగే జరిగింది.కానీ కాలప్రవాహంలో ఆ కథ కొట్టుకుపోయి మరుగునపడిపోయిన ముత్యంలా ఉండిపోయింది.ఈ కథ ఈ ఐదు సంపుటాలలో ఒక దాన్లో వుంది.మళ్ళీ దాన్ని చదివినప్పుడు కూడా నాకు ఈ విషయం తట్టలేదు.మీ పుణ్యమాని ఆ జ్ఞపకాలను ఇప్పుడు తవ్వితీసి యేరుకొన్నాను.కృతజ్ఞతలు

    సుభధ్ర గారు,

    మీరన్నది ముమ్మాటికీ నిజం.ఒక రచయిత ప్రయోజకత్వం అతని రచన,అందులోని పాత్రలు పదికాలాలపాటూ పాఠకులకు గుర్తుండిపోయినప్పుడే బయటపడుతుంది.ఆ విధంగా చూసుకుంటే రాజారాం గారు చిరస్మరణీయులు.

  7. subhadra

    మధురమైన కధలు రాజారాం గారివి. నేను విశాలాంధ్ర లోనే 1,3,4 భాగాలు కొన్నాను. రెండోది కొనాలి. జనజీవితాలలోంచి పుట్టే కధలు వారివి. అనవసరపు భేషజాలు, అతిశయోక్తులూ లేని చల్లని నారికేళపాకంలా ఉంటాయి. నేను చదివిన ఈ మూడు సంపుటాలలోనూ నాకు నచ్చిన కధలెన్నో.. చదివినంతసేపూ పాత్రలు కళ్ళముందు సజీవంగా కదిలి మరిపిస్తాయి. చాలా మంచి కధలు.

  8. BGnanaPrakash

    peru lone madhuranni puniki puchchukunna goppa rachayatha Rajaram garu…

    Atuvanti goppa vyakhi rachanla gurinchi yuvathaki avagahana kalpimchalani na uddesham

  9. జనార్ధన రెడ్డి

    మీరూ బాగా రాసారు..నేను చదవాలి
    — జనార్ధన రెడ్డి

  10. చంద్రార్క

    ఈ సమీక్ష చదివిన తర్వాత నాకు కూడా మధురాంతకం గారి కథలు చదవాలని ఉత్సుకత కలిగింది..త్వరలోనే ఆ భాగ్యం లభిస్తుందని ఆశిస్తున్నాను..
    మంచి సమీక్ష వ్రాసినందుకు ధన్యవాదాలు..

  11. మెహెర్

    >>> రాజారాంగారి కథలు పంచదారగుళికల్లాంటివి. నోట్లో వేసుకోగానే కరిగిపోయినట్లు చదవగానే అందులోని సారమంతా అంతరాంతరాల్లో ఇంకిపోయి, మనసంతా ఒకరకమైన హాయిని చేకురిస్తాయి.

    >>> వారి శైలి విలక్షణమైనది. అది అందమైన తెలుగు నుడికారాలు, మనం మరిచిపోయిన ఉపమానాలు, సామెతలు ప్రోదిచేసి సునిశిత హాస్యం రంగరించి, చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా పాఠకుల హృదయల్లోకి బట్వాడా చేస్తుంది.

    బాగా రాసారు. ఆయన కథల్లో “కమ్మతెమ్మెర”, “ఎడారి కోయిల”, “సర్కసు డేరా”… నాకు బాగా గుర్తుండిపోయాయి. ఇంకో కథ వుంటుంది; ఇతివృత్తం గుర్తుండిపోయింది గానీ, దాని పేరేంటో గుర్తు రావటం లేదు. అందుకే ఇప్పుడీ నాలుగు సంపుటాలూ నా దగ్గరున్నా ఇంకా వెతికి పట్టుకుని చదవలేకపోయాను. ఆ కథతోనే మధురాంతకంతో తొలి పరిచయం. మా తొమ్మిదో తరగతి తెలుగు వాచకంలో వుండేది. ఒక రచయిత తన పుస్తకాన్ని అంకితం తీసుకొమ్మని అడగడానికి ఒక డబ్బున్నావిడ ఇంటికొస్తాడు. కానీ ఆవిడకు ఏదో ఒకటి అంకితం పుచ్చుకోవాలన్న ధ్యాసే తప్ప, తన రాతల పట్ల ఏ లక్ష్యమూ లేదని తెలుసుకుని, చివరికి ఇంటి దగ్గర పెంపుడు కుక్కకి అంకితమివ్వాలన్న నిశ్చయానికొస్తాడు. అది కూడా నచ్చిన కథే.

    >>> నిలువుటద్దం పట్టి ‘మరేం పర్లేద’ని భరోసా ఇస్తారు.

    నిజం! 🙂

  12. రవి

    మీ లాంటి జీవినే నేనూనూ. ఆయన కథల పుస్తకం రోజూ చూస్తున్నాను. కొని చదవాలి.

Leave a Reply to BGnanaPrakash Cancel