పురాతన ఈజిప్ట్ – ఫెరోల సామ్రాజ్యం

రాసిన వారు: విష్ణుభొట్ల లక్ష్మన్న

*****************
AncientEgyptతెలుగులో ఈజిప్ట్ పై మంచి పుస్తకాలు, ఆ మాటకొస్తే అసలు ఏ పుస్తకాలు ఉన్నట్టు లేవు. మహా పురాతనమైన మానవ చరిత్రే కాకుండా ఒక మహోజ్వలమైన సంస్కృతికి బీజం నైలు నదీ తీరాల్లో ఐదు వేల సంవత్సరాలకు పూర్వం జరిగింది. ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాలకి పూర్వమే కట్టబడిన ఈ చారిత్రక కట్టడాలు ఈ నాటికీ మన్ని అబ్బురపరచి మన ఆలోచనలను పూర్తిగా ఆక్రమిస్తాయి. స్ఫింక్స్ (Sphinx), పిరమిడ్స్ (Pyramids), వాలీ ఆఫ్ కింగ్స్ (Valley of the kings) లోని సమాధులు, లుక్సర్ (Luxor) ఇంకా కార్నాక్ (Karnak) లో ఉన్న దేవాలయాలు, పురాతన ఈజిప్ట్ సంస్కృతి యొక్క సంక్లిష్టత, అప్పటి నాగరికతలోని ఉచ్ఛిష్టత, టూటన్‌కామూన్ (Tutankhamun) సమాధుల్లో దొరికిన అరుదైన సాంస్కృతిక సంపద – ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వింతలు, విశేషాలతో ఉన్న పురాతన ఈజిప్ట్, క్రీస్తు పూర్వం 3100 సంవత్సరాల్లో ఒక గొప్ప దేశమే కాక, ఫెరోల రాజ్యపాలనలో సాటి లేని ఆర్ధిక, సాంస్కృతిక చిహ్నంగా వెలిగింది.

ఇది ఇంగ్లీషులో రాయబడ్డ పుస్తకం. ఎక్కడ మొదలుపెట్టి ఈ పుస్తకాన్ని పరిచయం చెయ్యాలన్నా కష్టమే! ఎప్పటినుంచో ఈజిప్ట్ పర్యటించాలన్న నా కోరిక 2005 సంవత్సరంలో నా అమెరికన్ స్నేహితుని కుటుంబంతో సహా మా కుటుంబం కలిసి పర్యటించటంతో తీరింది. నా అమెరికన్ స్నేహితుని భార్య ఈజిప్షియన్ కావటంతో ఈ ప్రయాణంలో చాలా విషయాలు తెలుసుకున్నా! దానికి తోడు మొన్న కొత్త సంవత్సరంలో బహుమతిగా నాకు ఈ పుస్తకాన్ని ఇచ్చారు ఆ దంపతులు. అందుకే ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం ఇది.

తెలుగులో ఈజిప్ట్ పై ఏ పుస్తకాన్ని చదివిన గుర్తు లేదు నాకు. ఇప్పటికి ఐదువేల సంవత్సరాలకు పూర్వం ప్రారంభమైన ఈజిప్ట్ ఫెరోల (మన భాషలో చెప్పాలంటే చక్రవర్తి కన్నా గొప్పవాడు) సామ్రాజ్య స్థాపన, విస్తరణ, భాషా సంస్కృతుల పుట్టుక, వారి జీవిత విశేషాలు, మరణానంతరం జీవితం పై వారి నమ్మిక, అందుకు తోడుగా సమాధుల పేర్లతో పిరమిడ్‌ల నిర్మాణం .. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ చిత్రాతి చిత్రాలే!

పురాతన మానవ సంఘజీవనాలు అన్నీ నదుల తీరాలనే వృద్ధిచెందటం సహజం. పురాతన ఈజిప్ట్ సంస్కృతి అందుకు భిన్నం ఏమీ కాదు. ప్రపంచంలో అతి పొడవైన నైల్ నది లేకపోతే ఈజిప్ట్ లేదు. క్రీస్తు పూర్వం 3300 సంవత్సరంతో ఈజిప్ట్ లో ఒక మహోజ్వలమైన సంస్కృతికి శ్రీకారం చుట్టబడిందని చరిత్రకారుల నిర్ధారణ. అది మొదలు క్రీస్తు శకం 641 సంవత్సరం దాకా పరిఢవిల్లిన పురాతన ఈజిప్ట్ సామ్రాజ్యం, మానవ సంఘపరిణామ దశలో అత్యున్నతమైనది, విశిష్టమైనది. మన వేదాలకు పూర్వమే ఈజిప్ట్ సంస్కృతి వర్ధిల్లిందని చరిత్రకారుల పరిశోధన వెల్లడించింది. 30 వివిధ రాజవంశాలు (dynasty) 4000 సంవత్సరాలకు పైగా ఈజిప్ట్ ని పరిపాలించాయి!

Sphinx

Sphinx

ఈజిప్ట్ లో క్రీస్తుపూర్వం రెండు లక్షల సంవత్సరాలకి పూర్వమే మానవ నివాసం ఉందనటానికి ఆధారాలున్నాయి. అయితే ఇవి జంతువులను వేటాడే ఆటవిక తెగలు. సుమారు క్రీస్తుపూర్వం పది వేల నాటికి కార్షిక జీవనం ఒక ఈజిప్ట్ లోనే కాక పలు ప్రాంతాల్లో మొదలయ్యింది. అప్పటికే ఈజిప్ట్ దేశంలో దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని ఎగువ ఈజిప్ట్ అని, ఉత్తర ప్రాంతాన్ని దిగువ ఈజిప్ట్ అని పిలవబడేవి (నైలు నది దక్షిణం నుండి ఉత్తరానికి ప్రవహిస్తూ మద్యధరా సముద్రంలో కలుస్తుందని గుర్తుంచుకోవాలి). దీన్నిబట్టే ఒక మహత్తరమైన నాగరికతలో నైలు నదికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్ధమవుతుంది. క్రీస్తుపూర్వం 3300 నుంచి 2686 వరకు జరిగిన కాలాన్ని మొట్టమొదటి రాజుల కాలంగా పరిగణిస్తారు. ఈ తొలి రాజవంశ కాలానికి సంబంధించి ఎక్కువ వివరాలు లభించకున్నా, తరవాత రాబోయే రాజవంశాలకు చెందిన ఆచార వ్యవహారాలకు పునాది జరిగింది ఇక్కడే! క్రీస్తు పూర్వం 2686 నుంచి 2181 వరకు పరిపాలించిన ఫెరోల కాలంలో మరణానంతర జీవితం పై ఖచ్చితమైన అభిప్రాయాలు, పిరమిడ్‌ల నిర్మాణం, మృతదేహాలని శాశ్వతంగా పదిలపరచే మమ్మిఫికేషన్ మొదలైనవి రూపుదిద్దుకున్నాయి. ఈ పరంపరలో మూడవ రాజవంశంతో మొదటి పిరమిడ్ నిర్మాణం రూపుదిద్దుకొంది. నాల్గవ రాజవంశంలో మమ్మిఫికేషన్ కళ ఉచ్ఛదశకు చేరుకుంది. ఈ కాలంలోనే ఇప్పటికీ ప్రపంచ వింతల్లో ఒకటిగా చెప్పుకొనే గ్రేట్ పిరమిడ్ల నిర్మాణం జరిగింది. ఇదే రాజవంశంలో మరొక అద్భుతం “స్ఫింక్స్” కట్టడం. ఈ స్ఫింక్స్ కి సూర్యదేవతకి సంబంధం కల సింహం శరీరం, తల భాగం మనిషిది. తరవాత వచ్చిన ఐదవ రాజవంశంతో “పాత రాజవంశం” పతనం ప్రారంభమైంది.

ఇక రెండవ దశలో, శక్తివంతమైన మొహోజ్వలమైన సంస్కృతికి నిలువుటద్దం ఈజిప్ట్ ఫెరోల రాజ్యపాలన జరిగింది క్రీస్తుపూర్వం 2181 నుంచి 1550 సంవత్సరాల కాలం వరకు. పాత రాజవంశ పతనానికి కొత్తరాజవంశ అవతరణకు మధ్య ఒక 130 సంవత్సరాలు ఈజిప్ట్ రాజవంశ చరిత్రలో అల్లకల్లోల కాలం. ఈ కాలంలో రాజధాని మార్పులు, పొంచి ఉన్న పొరుగు రాజ్యాధీశులైన శత్రురాజుల దురాక్రమణ ఈజిప్ట్ ఫెరోల ఆధిపత్యాన్ని సవాలు చేసాయి. ఎడు, ఎనిమిదవ రాజవంశస్థులు ఈ అరాచకాన్ని చవి చూశారు. తొమ్మిదవ రాజవంశ అధీనంతో మళ్ళీ పూర్వ వైభవం ఈజిప్ట్ ఫెరోల చేతికి సాధ్యం అయ్యింది. పురాతన ఈజిప్ట్ సాహిత్యానికి ఇది ఒక స్వర్ణయుగం. అప్పటి దాకా వ్యాపారాలకి, ఉత్తరప్రత్యురాలకి, పిరమిడ్‌లపై రాసే రాతలకి పరిమితమైన “పాత రాజసంస్థానం” కి భిన్నంగా సాహిత్యం వృద్ధిపొందింది.

“కొత్త రాజవంశం” కాలం క్రీస్తుపూర్వం 1550 నుంచి 1069 సంవత్సరం వరకు. 19 సంవత్సరాలకే అనుమాస్పద పరిస్థితుల్లో చనిపోయిన ఫెరో “టుటన్‌కామూన్” (Tutankhamun), 19వ రాజవంశానికి చెందిన అతి గొప్ప ఈజిప్ట్ ఫెరో రామెసెస్ II (Ramesses) ఈ రాజవంశస్థులే! రామెసెస్ II 100కి పైగా పిల్లలకి తండ్రిగా, 66 సంవత్సరాలు పరిపాలన సాగించిన ఒక గొప్ప ఫెరోగా పురాతన ఈజిప్ట్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించారు. ఈజిప్ట్ సంస్కృతి ప్రపంచానికి అందించిన ఒక పెద్ద కానుక ” హైరోగ్లిఫ్” (Hieroglyph) లిపి. క్రీస్తుశకం నాల్గవ శతాబ్దికి ఈజిప్ట్ క్రైస్తవ మతం స్వీకరణతో “హైరోగ్లిఫ్” లిపి మరుగున పడి గ్రీక్ అక్షరమాల, కోప్టిక్ రాతలు (Coptic Alphabet) ప్రచారంలోకి వచ్చాయి. ఇది జరిగిన 1400 సంవత్సరాల తరవాత, ఫ్రెంచ్ బాషావేత్త, బహుముఖ ప్రజ్ఞాశలి అయిన జాన్ ఫ్రాంస్వా చాంపోలియన్ (Jean-François Champollion) కృషి వల్ల హైరోగ్లిఫ్ లిపిని ప్రపంచం అర్ధం చేసుకుంది.

From_King_Tut_ThronePhoto from King Tut’s Throne

ఈ పుస్తకంలోని వివరాలన్నీ పాఠకులను మరో ప్రపంచంలోకి తీసుకుపోతాయి. మీకు ఈ పుస్తకం చదవక ముందు ఈజిప్ట్ గురించి కొంతైనా తెలిసి ఉన్నా, లేక ఈజిప్ట్ పర్యటించినా ఈ పుస్తకం చదూవుతూ ఉన్నపుడు కళ్లకు కనపడ్డట్టు ఉండే ఈజిప్ట్ ఊహాలోకం లోంచి బయట పడటం కష్టం. ఇప్పటికీ నైల్ నది ఒడ్డున పూరాతన సంస్కృతికి సంబంధించిన రహస్యాలు బైల్పడుతూ ఉండటం వల్ల, ఆ గొప్ప నాగరికత గురించి మన జ్ఞానం పెరుగుతూ వస్తున్నది. ఈ పుస్తకం పురాతన ఈజిప్ట్ పై ప్రస్తుతం మానవ పరిశోధనల వల్ల తెలిసిన వీలైనన్ని వివరాలతో అందంగా అచ్చేసిన ఫొటోలతో ఉన్న ముచ్చటైన పుస్తకం. ఇరవై సంవత్సరాలకు పైగా ఈ విషయాల్లో ఎంతో పరిశోధన చేసిన Robert Hamilton 2004 సంవత్సరంలో రాసిన ఈ పుస్తకం పేరు “Ancient Egypt – Kingdom Of The Pharaohs”. వృత్తి రీత్యా ఆచార్య పదవిలో ఉన్న ఈ రచయిత ఆ పదవి వదులుకొని తన దృష్టంతా చారిత్రక వివరాలను లిఖిత పూర్వంగా పొందుపరచే ప్రయత్నంలో ప్రస్తుతం ఉన్నారు. నివాసం ఇంగ్లెండ్. ముద్రించిన వారు Parragon Publishing. వెల తెలియదు. కానీ అమెజాన్ వారి సైట్లో 49 సెంట్ల నుండి ఐదు డాలర్ల వరకు ఉన్న వెలతో ఈ పుస్తకం లభ్యం.

పాఠకునిగా నా మాటలు
:

ఈజిప్ట్ పై నా అవగాహన, ఈ మధ్యే చేసిన ఈజిప్ట్ పర్యటన, చదువుతున్న పుస్తకాల వల్ల సహజంగానే మన భారత దేశపు సంస్కృతికి మూలాలు బహుశా ఈజిప్ట్ లో ఉన్నాయేమో అనిపిస్తుంది నాకు. ఇప్పటి ఈజిప్ట్ దేశంలో ఉత్తరాన ఉన్న కైరో నుంచి, దక్షిణాన ఉన్న అస్వాన్ వరకు గల పురాతన దేవాలయాలు, రాతి కట్టడాలు, సమాధులు, కొన్ని ఆచార వ్యవహారాలు గమనిస్తే ఎందుకో నాకు మన సంస్కృతి గుర్తుకు వచ్చేది. ఈజిప్ట్ పర్యటన కాస్త డబ్బుతో కూడిన వ్యవహారమైనా, ఇది ఒక ముఖ్యమైన సందర్శక స్థలం. ఈ పుస్తకం ఎంత మందికి చదవటానికి అందుబాటులో ఉంటుందో తెలియదు కానీ, నాకు తెలిసిన విషయాలు అందరితో పంచుకోవాలన్న ఉబలాటం ఆపుకోలేక రాసిన సమీక్ష ఇది.

పుస్తకం ఫ్లిప్కార్ట్ లంకె ఇక్కడ.

You Might Also Like

11 Comments

  1. Anjaneya goud

    పిరమిడ్ శక్తులగురించి తెలుసుకోవాలనుంది , అందుకు మంచి తెలుగు పుస్ తకాలు ఉంటె తెలుపగలరు.అలాగె మనము పిరమిడ్ నిర్మించుకోవటానికి అందులొ డ్రాయుంగ్ ఉంటె బాగుంటుంది.

  2. prabhakar rao j

    egipt gurinci manchi viseshalu teliparu anduku thanks

  3. ramamohan ch

    పురాతన ఈజిప్ట్ – ఫెరోల సామ్రాజ్యం useful

  4. విష్ణుభొట్ల లక్ష్మన్న

    మా అబ్బాయి పదవ తరగతి చరిత్ర పుస్తకం “ప్రపంచ నాగరికతలు” లో ఇచ్చిన పురాతన నాగరికత కాలాల బట్టి, ఈజిప్ట్ నాగరికత క్రీస్తు పూర్వం 3100 సంవత్సరంలోనూ, హరప్పా నాగరికత క్రీస్తు పూర్వం 2500 సంవత్సరంలోనూ, రామాయణ – భారత ఇతిహాసాల పుట్టుక క్రీస్తు పూర్వం 1200 నుంచి 1000 సంవత్సరాల్లోనూ మొదలైందని ఉంది. ఇదే నిజమైతే ఈజిప్ట్ నాగరికత మన సంస్కృతిపై ఉండే అవకాశాలు ఎక్కువ!

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  5. rAm

    లక్ష్మన్నగారు –
    మీ వ్యాసం బావుంది. మీ foundation ప్రచురించిన తిరుమల రామ చంద్ర గారి “హంపీ నుంచి హరప్ప దాక”లో 59 వ అధ్యాయం “మెహెంజోదడో-హరప్ప” లో ఆయన అనుభవాలు చెప్పిన తీరు అమోఘం.

  6. విష్ణుభొట్ల లక్ష్మన్న

    పై నా వ్యాఖ్యలో ఒక అప్పుతచ్చు ఉంది. “హంపీ, హరప్పా” కాదు. ఎందుకో తిరుమల రామచంద్ర గారి పుస్తకం ‘హంపీ నుంచి హరప్పా దాకా’ బుర్రలో తిరుగుతోంది.

    “మొహంజదారో, హరప్పా” గా చదువుకోమని నా ప్రార్ధన.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  7. విష్ణుభొట్ల లక్ష్మన్న

    @వంశీ గారూ:

    నిజమే! నా అత్యుత్సాహం వ్యాసంలో తేలికగానే గుర్తుపట్టచ్చు. అందుకే “ఈమాట” కోసం ఈజిప్ట్‌పై రెండు వ్యాసాలు రాసా! వాటిని ఇక్కడ చవచ్చు.

    http://www.eemaata.com/em/issues/200711/1162.html

    http://www.eemaata.com/em/issues/200607/544.html

    అయితే, మరణానంతర జీవితంపై లోతైన ఆలోచనలు చేసిన పురాతన నాగరికతలలో ఈజిప్ట్, భారత సంస్కృతులు నాకు తేలికగా కనపడ్డాయి. ఈజిప్ట్ సంస్కృతిలో చనిపోయిన దేహంలోకే తిరిగి ఆత్మ ప్రవేశిస్తుందన్న నమ్మకం వల్ల మమ్మిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. మన సంస్కృతిలో చనిపోయిన వ్యక్తి ఆత్మ తిరిగి మరో దేహంలో ప్రవేశిస్తుందన్న నమ్మకం వల్ల దేహాన్ని (దహింపబడేది) నిలవ చెయ్యము. అంతే కాక ఒక వ్యక్తి జీవిత కాలంలో ఎక్కువ భాగం మరణానంతర జీవితంపై ఆలోచనలు చెయ్యటం ఈ రెండు పురాతన సంస్కృల్లోనూ ఉన్న నిజం. మన పూజా విధానాల్లో ఉన్న ఆచారవ్యవహారాలు, నేను ఈజిప్ట్‌లో చూసిన పురాతన దేవాలయాల్లో ఉండేవి అని విని ఆశ్చర్యపోయాను.

    నాకు పురాతన సంస్కృతులు, అప్పటి నాగరికతలు తెలుసుకోవాలన్న కోరిక ఎక్కువ. ఇందులో ఏ ఒక్క దాన్నీ తక్కువగా చూడరాదు అన్నది నా అభిప్రాయం.

    ఎవరైనా హంపీ, హరప్పాలలో పరిఢవిల్లిన సింధు నాగరికత గురించి వివరంగా రాస్తే (తెలుగులో) చదవటం ఇష్టం.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  8. జంపాల చౌదరి

    ధనికొండ హనుమంతరావు గారు వ్రాసిన క్లియోపాత్ర అనే పుస్తకంలో ఈజిప్టు రాజవంశాల గురించిన సమాచారం కొంత ఉంటుంది. ఈజిప్టు గురించి తెలుగులో ఇతర పుస్తకాలేమన్నా ఉన్నాయేమో తెలీదు. స్వాతంత్ర్యానికి పూర్వం వచ్చిన ప్రపంచ మహాచరిత్ర వంటి ఎన్సైక్లోపీడియాలలో వివరంగా ఈజిప్టుచరిత్ర ఉండిఉండవచ్చు.

  9. మాగంటి వంశీ

    @లక్ష్మన్న – వ్యాసంలోని కొన్ని వివరాలు బాగున్నాయి. బహుశా చూసి వచ్చిన జ్ఞాపకాలు ఇంకా కదుల్తూ వుండటం మూలానేమో కొద్దిగా అత్యుత్సాహం కూడా కనపడింది.

    ఇహ “డైగ్రెస్స్” అనగా పక్కదారిలోకి వెళితే, మనలో – అనగా భారతీయుల్లో వున్న గొప్పసుగుణం ఏమిటంటే ఇతరుల్ని, ఆ అస్మదీయుల అమానత్తుని నెత్తినెట్టుకుని ఊరేగించటం. అతిథిదేవో భవ అయినా కాకపోయినా. ఉదాహరణలు కోకొల్లలు. చెప్పకుండానే, చుట్టూ విప్పారిన కళ్ళతోనో, కొండొకచో అర్ధనిమీలితంగానో చూసి తెలుసుకోవచ్చు. ఇహ అసలు దారిలోకి వస్తే మనవారెవరన్నా ఉదహరించిన పుస్తకము వ్రాస్తేనో, ఆయా సంగతులు వ్రాస్తేనో వచ్చే అభినందనలెన్ని, తిరస్కారాలెన్ని, వాటి గురించిన ఆకతాయి కబుర్లెన్ని. ఉదాహరణకు పిరమిడ్లు చూసి, ఒహరు వ్రాసిన వ్రాతలు చూసి నిజమని నమ్మినవారున్నారనుకోండి – మనవారెవరన్నా సముద్రంలో మునిగిన ద్వారకని చూపించో, రాములవారి వారధిని చూపించో ఇది మన సంపదరా, ఒకప్పుడు నిజంగా వున్నవేరా, వీటికి బోలెడు చరిత్ర వున్నదిరా అంటూ తత్సంబంధిత విశేషాలతో, ఋజువులతో కలం విదిల్చారనుకోండి, తస్మదీయ ప్రవృత్తి రుద్రగణ రూపంలోనూ, ఢమరుకాలతోనూ తయారు. ఈజిప్టువారి రాజవంశాలు రాజవంశాలు, వారు రాజులు. వారు కట్టించినవి, వారి శవాలు ప్రపంచ సంపద. ఇహపోతే రుద్రగణాలకు మనవారు బూజులు. భోజులు, భోగులు కూడా అందరికీ అసలు సిసలు భోజ్యాలు, భక్ష్యాలు. ఇహ మనవారు కట్టించినవి పూజ్యాలు. మిగిలినవి సమిధలు, ఇంట్లో పొయ్యికి చితుకులు. వున్నవి రక్షించుకోటానికి, పరిరక్షించుకోటానికి అడ్డు రాకాసిమూకల రక్కసి లీలలు. ఏమి చెప్పినా వారిలోని సంతులన ఈజిప్టువైపే మొగ్గుతుంది తప్ప, త్రాసుని ఇటేపు లాక్కోటానికి తూనికరాళ్ళు తక్కువవుతవి.

    ఇలా బోలెడంత వ్రాసుకుంటూ పోవచ్చు. కాకుంటే టైపినందుకు చేతులు నొప్పులు, తర్వాత వచ్చే సమాధానాలకు, తత్పరిణామాలతో కూడిన శిరోవేదనలకు బలిపశువు కాకూడదని ఇంతటితో స్వస్తి వాక్యం పలకటం జరుగుతోంది.

    అయ్యా, అదీ సంగతి. ఇందులో మీకు ఎగతాళి కనపడితే క్షంతవ్యుణ్ణి.

    భవదీయుడు
    మాగంటి వంశీ

  10. విష్ణుభొట్ల లక్ష్మన్న

    సుగాత్రి గారు:

    వ్యాసం నచ్చినందుకు సంతోషం! నాకు ఈజిప్ట్ గురించి కొంత తెలుసు. సింధు నాగరికత కూడా పురాతన నాగరికతే అని తెలిసినా ఆ నాగరికత కాల విశేషాలు గాని, ఆ ప్రభావం మన సంస్కృతిపై ఎంత బలంగా ఉన్నదీ, ఎందువల్ల ఉన్నదీ వంటి వివరాలు నాకు తెలియవు. మీవంటి వారు ఏవరన్నా ఒక పుస్తక పరిచయం ద్వారా తెలిపితే బాగుంటుంది.

    పిరమిడ్ల నిర్మాణాలు, దేవాలయల్లో భద్రపరచిన విశేషాలవల్ల వాటికి తోడుగా హైరో్‌గ్లిఫ్ రాతల వల్ల కూడా ఈజిప్ట్ గురించి ఎన్నో విశేషాలు ప్రచారంలోకి వచ్చాయి. మరి సింధు నాగరికతకు అంత ప్రచారం ఎందుకు రాలేదో?

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  11. సుగాత్రి

    లక్ష్మన్న గారికి,

    నమస్కారం. పురాతన ఈజిప్ట్ – ఫెరోల సామ్రాజ్యం గురించి చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు.

    >> మహా పురాతనమైన మానవ చరిత్రే కాకుండా ఒక మహోజ్వలమైన సంస్కృతికి బీజం నైలు నదీ తీరాల్లో ఐదు వేల సంవత్సరాలకు పూర్వం జరిగింది.

    “మహా పురాతనమైన మానవ చరిత్ర” అని మీరు చెప్తున్న ఐదు వేల సంవత్సరాలకు పూర్వం ఇక్కడ హరప్పా నాగరికత కూడా రెండు దశలను దాటి మూడో దశలో అడుగుపెట్టింది. “మహోజ్వలమైన సంస్కృతికి బీజం” ఇక్కడా పడింది.

    >> సుమారు క్రీస్తుపూర్వం పది వేల నాటికి కార్షిక జీవనం ఒక ఈజిప్ట్ లోనే కాక పలు ప్రాంతాల్లో మొదలయ్యింది.

    కార్షిక జీవనమటే ఏమిటి? కొత్తరాతియుగం ఈజిప్టులో క్రీ.పూ. 6000 నాటికి గానీ మొదలవలేదని (http://en.wikipedia.org/wiki/Egypt#Pre-historic_Egypt), అదే సింధు నాగరికత పట్టణమైన మెహర్గడ్ (Mehrgarh) లో క్రీ.పూ. 8000 నాటికే మొదలైందని ఆధారాలు దొరికాయి కదా?

    >> ఫెరోల (మన భాషలో చెప్పాలంటే చక్రవర్తి కన్నా గొప్పవాడు)

    ఎలా గొప్పవాడో వివరిస్తే బాగుండేది.

    >> మన వేదాలకు పూర్వమే ఈజిప్ట్ సంస్కృతి వర్ధిల్లిందని

    అసలు అన్ని విధాలా ఈజిప్టు నాగరికతతో పోల్చదగిన సింధు నాగరికతను నామమాత్రంగానైనా ప్రస్తావించకుండా ఈజిప్టు నాగరికతా కాలాన్ని వేదకాలంతో పోల్చాలని మీకు ఎందుకనిపించిందో నాకు అర్థం కావడం లేదు.

    >> మన భారత దేశపు సంస్కృతికి మూలాలు బహుశా ఈజిప్ట్ లో ఉన్నాయేమో అనిపిస్తుంది నాకు.

    వేదకాలం కంటే ముందు మనదేశంలో పరిఢవిల్లిన సింధు నాగరికత పూర్తిగా ఇక్కడే దశలవారీగా అభివృద్ధి చెందిందని చరిత్రకారులు తేల్చిన తర్వాత కూడా మనదేశపు సంస్కృతీమూలాలు ఇంకెక్కడో ఉన్నాయని భావిస్తున్నారా? ఆమెన్!

Leave a Reply