Kafka – The Sons

“I have only one request.” Kafka wrote to his publisher Kurt Wolff in 1913, ‘The Stoker’, ‘The Metamorphosis’, and ‘The Judgment’ belong together, both inwardly and outwardly. There is an obvious connection among the three and, even more important, a secret one, for which reason I would be reluctant to forgo the chance of having them published together in a book, which might be called ‘The Sons'”

– ఇది చూసి ఈ పుస్తకం కొనే సాహసం చేశాను. నేనసలు ముందు కాఫ్కావి ఏవీ చదవకపోయినా కూడా. సాహసం చేస్తే గానీ ఇలాంటివి దొరకవని, చదివాక అర్థమైంది.
ఇది కాఫ్కా నాలుగు రచనల సంకలనం. పైన పేర్కొన్న మూడింటితో పాటు – ’Letter to his father’ నాలుగోది. ఇటీవలి బెంగలూరు స్ట్రాండ్ బుక్ ఫెస్టివల్ లో కొన్నాను.

kafkathesonsనేను ’మెటమార్ఫసిస్’ చదవడం మొదలుపెట్టింది – అఫీసుకి మరీ ముందెళ్ళిపోయి – అది తాళమేసి ఉంటే, రోడ్డుపై నిలబడి. పూర్తి చేసింది కూడా దాదాపు అదే స్థితిలో, రెండ్రోజుల తరువాత. ఈ రెండ్రోజుల్లో వీలు చిక్కినప్పుడల్లా దాన్ని పట్టుకోడం. వీలు చిక్కనప్పుడు – మెటమార్ఫసిస్ మెటమార్ఫసిస్ – అని కలవరించడం. మొత్తానికి అంతా అయ్యాక చూస్తే – దీనికి బాగా ఆపకుండా చదివించే గుణం ఉంది. ఇలా – కుదరకపోతే చదవడం మిస్సయ్యానే..అన్నట్లు ఫిక్షన్ గురించి నేను ఫీలై కొన్ని నెలలైంది.

ఒక ఫిక్షన్ నావెల్లా గా – i just loved it. enjoyed reading it thoroughly. అసలు నాకు అన్నింటికంటే నచ్చింది ఏంటి అంటే – కథ అంతా ఒక అసహజ సంఘటనతో మొదలైనా కూడా – చాలా స్మూత్ ఫ్లో లో సాగిపోవడం. ఫ్లో – అనకూడదేమో. నేను కథ మొదలుపెట్టినప్పుడు ఏమనుకున్నానంటే – ఇతన్ని చూసి అందరూ ఎలా స్పందిస్తారు? ఇతను తన ఆకారం గురించి ఏమనుకుంటాడు? ఇంట్లో వాళ్ళకి ఇతరులతో గల సంబంధాలు ఇతని పరిస్థితి వల్ల ఎలా ప్రభావితమౌతుంది – ఇలాంటి విషయాలుంటాయేమోనని (సహజంగా కథల్లో ఈ తరహాలోనే ఉంటాయి కదా…అని). అక్కడ దెబ్బ కొట్టాడు కాఫ్కా నన్ను 🙂 I just loved the way the story went. ఇలాంటి కథలు ఎందుకు రాయరో జనాలు – అనుకునేదాన్ని. రాస్తారు నేనే చదవను – అని ఇది చదివాక అర్థమైంది. అతని మనోభావాలు, వాళ్ళింట్లో వాళ్ళు ఇతన్ని తల్చుకుని ఏడవడమూ – అంతా రొటీన్ కథనం. అలా కాకుండా, ఇందులో, అతని మానాన అతను అక్కడ, వీళ్ళ మానాన వీళ్ళు వీళ్ళ జీవితంలో, అయినప్పటికీ అతని పరిస్థితి వీళ్ళనెలా ప్రభావితం చేస్తుంది – ఏమీ చెప్పకుండానే చాలా చెప్పారు.

అలాగే, గ్రెగర్ (మన హీరో – పురుగైపోయిన పురుషుడు) పాత్ర చిత్రణ నాకు చాలా నచ్చింది – క్రమంగా పురుగుగా మారుతూ, కొంత మనిషి – కొంత పురుగులా ఉండటం – జనాలతో మాట్లాడ్డానికి ఇతనికా కొంత ఇది. వాళ్ళకా అతనంటే అదోరకం భయమో, అసహ్యమో. నాకైతే, ఈ పాత్ర చిత్రణ – ఒక్కొక్క దశలోనూ దాని ప్రవర్తన, మనోభావాలు -అద్భుతమైన ఇమాజినేషన్. ఆ ప్రవర్తన, ఆ భావాలూ – కాల్పనికం అని నేనట్లేదు. ఆ సినేరియో లో -మనిషి పురుగవ్వడం అన్న పరిస్థితిలో ఉండే పరిస్థితుల చిత్రణ మాత్రం మంచి ఊహాశక్తి ఉంటే గానీ, ఇంత అద్భుతంగా రాదు అంటున్నా. అసహజ పరిస్థితులను చిత్రిస్తూ కూడా సహజ భావోద్వేగాలు మనచేత అనుభవించజేస్తే – అది రచయితలోని నైపుణ్యమే అనాలి.

అయితే – నా సమస్య ఏమిటీ అంటే – నేను ఊహించినంత ఊపేయలేదు ఇది నన్ను. అంటే – చరిత్రలో ఇలాంటిది మరోటి లేదు, రాదు – అనిపించలేదు. ఈ మధ్య కాలంలో ఇలా వినీ వినీ చదివిన ప్రతీదీ కొంత నిరాశకు గురిచేస్తోంది 🙁 నేను మరీ హై హోప్స్ పెట్టేస్తున్నందుకో ఏమిటో మరి. ఇంతకీ, నాకొచ్చిన ఓ వెధవాలోచన: మనవాళ్ళు దీన్ని సినిమాగా తీస్తే – దాని పేరు “పురుగుడు” అని పెడతారేమో!!

’The Judgment’ – కథ నేను చదివిన మొదటి కాఫ్కా కథ. కథనం నాకు చాలా నచ్చింది. ముగింపు మాత్రం కొంత వింతగా అనిపించింది. అయితే, మెటామార్ఫసిస్ చదివాకా, కొంతదాకా – కాఫ్కా తన తండ్రికి రాసిన ఉత్తరం కొంత భాగం చదివాకా – జడ్జ్మెంట్ కథను కాస్త అప్రీషియేట్ చేయగలిగాను. ఆ కథ మాత్రం – ఈసరికి రెండు మూడు సార్లు చదివాను. ఏం జరుగుతుందో తెలిసినా కూడా, నాకేం బోరు కొట్టలేదు. ఒక్కో వాక్యమూ రాసిన విధానం – మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా ఉంది మరి!!

The Stoker‘ – కార్ల్ అన్నే కుర్రవాడు చేసిన పని వల్ల ఇంట్లో వాళ్ళు బలవంతంగా అతన్ని అమెరికా పంపడానికి ఓడ ఎక్కిస్తారు. కథ ఒక స్టీమర్లో కార్ల్ అనే కుర్రవాడికి, అక్కడ స్టోకర్ గా పని చేసే అతనికి మధ్య ఏర్పడ్డ అనుబంధం, ఆ తరువాత ఆ స్టోకర్ కోసం ఈ అబ్బాయి స్టీమర్ కెప్టెన్ తో వాదించడం – ఈ పరిస్థితుల్లో అనుకోకుండా ఆ కుర్రవాడి బంధువు అదే గదిలో ఉండి, ఇతన్ని గుర్తించడం – చివర్న స్టోకర్ కి ఏమీ చేయలేక కళ్ళనీళ్ళు పెట్టుకుని ఈ అబ్బాయి తన బంధువు తో కలిసి వెళ్ళిపోవడం – ఇది కథ.(మొత్తం చెప్పేశానని తిట్టుకోకండి. మొత్తం ఈ నాల్గింటిలో సాదాసీదాగా ఉన్నది ఇదొక్కటి. దీన్ని ప్రత్యేకంగా ఏం చదువుతార్లే అని.. హీహీ). నాకు ఎందుకో ఈ కథ చదువుతూ ఉంటే, కథ చదివిన భావన రాలేదు. తర్వాత ఓ సీక్వెల్ ఏదో ఉండాలేమో అనిపించింది. తరువాత వికీలో కాఫ్కా ఒక అసంపూర్ణ నవల – ’అమెరికా’ కి దీన్ని మొదటి ఛాప్టర్ గా వాడుకోవాలనుకున్నాడని చదివాక, నా అనుమానానికి కారణం ఏమిటో అర్థమైంది.

Letter to my father‘ – ఈ మిగితా మూడు కథల్లోనూ అంతర్లీనంగా కనబడేదేదో మరింత వివరంగా ఈ ఉత్తరంలో చదువుతున్నట్లు అనిపించింది. నాకు ఈ ఉత్తరం చదువుతూ ఉంటే – కాఫ్కా ని ఏమనాలో అర్థం కాలేదు – పెద్ద కాఫ్కానీ, చిన్న కాఫ్కానీ, ఇద్దర్నీనూ! ఇలాగ తండ్రికి భయపడే క్యారెక్టర్లను చూసి ఉన్నా కనుక, కొంత భరించగలిగా కానీ, లేకుంటే – వీళ్ళిద్దరి బంధం ఏమిటో! తండ్రి అంటే – ఏదో బంధిఖానా యజమాని, డిక్టేటర్ – అన్న భావన కలిగిస్తోంది నాకు ఈ ఉత్తరం. తండ్రులంతా అలా ఉండకపోవచ్చు. కానీ, అలా ఉన్న తండ్రుల పిల్లలందరూ కూడా కాఫ్కా లా ఫీలవకపోవచ్చనుకోండి, అది వేరే కథ. ఈ ఉత్తరం ద్వారా కొంతవరకూ కాఫ్కా ది హ్యూమన్ గురించి అవగాహన కలిగింది. ఇతని కథలు మరిన్ని చదివేటప్పుడు బహుశా, ఆ కథల నేపథ్యాన్ని అర్థం చేస్కునేందుకు ఇది ఉపయోగపడొచ్చేమో. ఈ సంకలనానికి సన్స్ అని పేరెందుకు పెట్టారో – ఈ ఉత్తరం చూసి, ఓసారి మిగితా మూడు కథల్నీ తల్చుకున్నాక అర్థమైంది. అన్నింటిలోనూ తండ్రి-కొడుకుల సంబంధం అంత గొప్పగా ఏమీ ఉండదు. ’స్టోకర్’ లో ఈ కోణం పెద్దగా చర్చించలేదు కానీ, ప్రతి చోటా కొడుక్కి తండ్రంటే భయం. ఈనేపథ్యంలో ఈ ఉత్తరం చదవడం ఆ కథల్ని అర్థం చేస్కోడంలో ఉపయోగపడింది అనిపించింది.

రచనలకీ-రచయితకీ ఉన్న సంబంధం తెలుసుకోడం పాఠకుడికి ఎంతవరకూ అవసరం? అన్న సందేహం మళ్ళీ కలిగింది. ఈ విషయంలో త్వరలో పుస్తకంలోనే చర్చిస్తారని ఆశిస్తున్నాను.

మొత్తానికి చదివింది నాలుగు కథలే అయినా (అదే – మూడు కథలు, ఓ లేఖ) కూడా, కాఫ్కా గురించి, అతని రచనల గురించీ, ఇవి నాకు కావాల్సినంత కుతూహలం కలిగించాయి. మరిన్ని కాఫ్కా కథలు చదవాలని అనుకుంటూన్నాను.

పుస్తకం వివరాలు:
The Sons : Franz Kafka
Schocken Books, New York

నేను చదివిన పుస్తకం ముఖచిత్రం మరోలా ఉంది. కానీ, పుస్తకం మాత్రం ఇదే. స్ట్రాండ్ బుక్ స్టాల్, బెంగళూరులో దొరుకుతుంది.

You Might Also Like

One Comment

  1. SEKHAR

    కాఫ్కా is not a content but a contest.

    Kafka never wrote to tell. he had his signature left.

    Kafka ఒక ప్రయాణం.

    Sekhar

Leave a Reply