Six characters in search of an author

పెద్దోళ్ళు ఏదో పెద్ద విషయం మాట్లాడుతుంటే మనకి పెద్దగా ఎక్కదులే అని అనుకుంటూ పక్కకు పోకుండా, ఓ చెవి వేసి ఉంచటం వల్ల కొన్ని లాభాలున్నాయి. నాకీ పుస్తకం అలాంటి చర్చల్లోనే తెల్సింది. Six characters in search of an author –  పేరులోనే వావ్ ఫాక్టరూ, “ఎక్స్” (existentialism) ఫాక్టరూ ఉండడంతో ఈ పుస్తకం వెంటనే చదవటం జరిగిపోయింది.

ఇది ఇటలీకి చెందిన పిరన్‍దెల్లో అనే రచయిత సృష్టి. ఇది ఒక (కామెడీ) నాటకం. నేను కొన్న పుస్తకంలో నాటకంతో పాటు రచయిత పరిచయ వ్యాసం, నాటకంలో కథ సారాంశాం, నాటకం మీద కాస్తంత విశ్లేషణా, నాటకాన్ని ప్రదర్శించినప్పటి విశేషాలూ కూడా పొందుపరిచారు.

ముందుగా ఈ నాటకం కథేంటో చూద్దాం:

sixనాటకం మొదలయ్యే సన్నివేశంలో, ఓ డ్రామా కంపెనీ వాళ్లు తాము త్వరలో ప్రదర్శించబోయే నాటకానికి రిహార్సిలు వేసుకోడానికి సిద్ధమవుతూ ఉంటారు. స్టేజి మానేజరు, అప్పుడప్పుడే అక్కడికి చేరుతున్న కీలక పాత్రధారులూ, డైరెక్టర్ హైరానా పడుతూండడం – అక్కడ వాతావరణమంతా హడావుడిగా ఉంటుంది. ఇహ రిహార్సిల్ ప్రారంభం అయిన కాసేపటికే  ఓ ఆరుగురు వ్యక్తులు – తండ్రి, తల్లి, సవతి కూతురు, కొడుకు, చిన్న పాప, చిన్న బాబు – అక్కడికి చేరుకుంటారు. “మేం పాత్రలం. ఒక రచయిత కోసం వచ్చాం.” అని తండ్రి చెప్పగానే అక్కడున్న వారందరూ వింతగా చూస్తారు. “మాకు పనుంది, మీరు దయచేయచ్చు” అని చెప్పి ఆ అరుగురినీ పంపించబోయిన డైరెక్టరుతో తండ్రి వాదనకు దిగుతాడు. మధ్యమధ్యన సవతి కూతురు కూడా మాట్లాడుతూ ఉంటుంది. వాదన పూర్తయ్యే సరికి, అక్కడున్నవారందరికీ ఈ ఆరుగురి కథ వినాలన్న ఆసక్తి పుడుతుంది.

ఈ ఆరుగురూ ఒక రచయిత సృష్టి. ఆ రచయిత వీరిని సంపూర్ణంగా సృష్టించకుండా వదిలేస్తాడు. కానీ వీరికి మాత్రం ఒక పరిపూర్ణ రచనలో పాత్రలుగా నిలిచి అజరామరం కావాలని ఆశ. ఆ ఆరుగురి కథనూ తండ్రి, తల్లి, సవతి కూతురు పరస్పర విరుద్దంగా చెప్పుకొస్తారు. కథలో అంశాలు: తండ్రి సామాన్యమైన తల్లిని పెళ్లి చేసుకుంటాడు. వారికో కొడుకు పుడతాడు. ఈ అతి సామాన్య యువతితో తను అంత సంతోషంగా లేడని తండ్రి గ్రహిస్తాడు. అదే సమయంలో తన వద్ద పనిచేస్తున్న సెక్రటరీతో తన భార్యది మంచి జోడీ అవుతుందని వారిని ప్రేరేపించి ఇద్దరినీ కల్సి బతకమని పంపించేస్తాడు. పంపించేశాక కూడా అదే ఊర్లో ఉంటున్న వారిద్దరినీ ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు. వారికి కలిగిన సంతానం – సవతి కూతురి పై పత్యేకమైన ఆసక్తి చూపిస్తుంటాడు. ఈ సంగతి తెల్సుకున్న ఆ కుటుంబం అతడి నుండి దూరంగా వెళ్లిపోతారు. కొన్నాళ్ళ పాటు వెతికి తండ్రి కూడా ఆశ వదిలేసుకుంటాడు.

కొన్ని సంవత్సరాల తర్వాత సెక్రటరీ మరణించటంతో తల్లి సంతానాన్ని (సవతి కూతురు, మరో పాప, ఒక బాబు) తీసుకొని తిరిగి ఇదే ఊరుకొచ్చేస్తుంది. ఒకావిడ దగ్గర పనికి కుదురుతుంది. అందరికీ “ఫాషన్ డ్రెస్సుల”షాపుగానే తెల్సినా, అది ఒక వ్యభిచార గృహం. ఆర్థిక పరిస్థితుల వల్ల, తల్లికి తెలీనివ్వకుండా సవతి కూతుర్ని ఈ మురికిలో దింపుతుంది షాపు యజమానురాలు. అలా ఒక రోజూ, తండ్రి – సవతి కూతురు ఎదురెదురు పడతారు, ఒకరికొకరు కస్టమర్-క్లైంట్ గానే తెల్సు. సమయానికి తల్లి వచ్చి వారిద్దరినీ ఆపి, అసలు విషయం చెప్తుంది. మొత్తానికి ఈ కుటుంబమంతా తండ్రి పంచకు చేరుకుంటారు. అక్కడున్న కొడుక్కీ, వీళ్ళకీ పడదు.

ఇదంతా వింటున్న డైరెక్టర్‍కీ ఈ కథ అమితంగా నచ్చేసి, పాత్రలు సన్నివేశాలను నటించడానికి అనుమతిచ్చి, ఆ సన్నివేశాలను రాసుకోడానికి స్టేజ్ వెనక్కి వెళ్ళతాడు. , తక్కిన పాత్రధారులకి చిన్న విరామం దొరికినట్టవుతుంది. తిరిగి నాటకం మొదలయ్యాక చాలా గందరగోళం మధ్య, ఆటంకాల మధ్య, తండ్రి సవతి కూతుర్ని కలిసే సన్నివేశం నటించి చూపుతారు. ఇదే సన్నివేశాన్ని అక్కడున్న పాత్రధారులు వేయడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం తండ్రి, సవతి కూతుర్లు మెచ్చరు. పైగా మేం ఎన్నటికీ వారు కాలేరు అని వాదిస్తారు. అందుకని వాళ్ళనే సన్నివేశం కొనసాగించమంటే, నాటక ప్రదర్శనలో కూడని అంశాలు కూడా ఉండాలని పట్టుబడతారు కాసేపు. మొత్తానికైతే తండ్రీ కూతుర్లు కల్సుకోవడం, ఇంతలో తల్లి వారిద్దరినీ వారించే సన్నివేశం పూర్తి చేస్తారు, ముగ్గురు పాత్రలు. డైరెక్టర్ అత్యుత్సాహంతో “ఇది కర్టెన్ లైన్” అని అరుస్తుంటే, నిజంగానే తెరదించేస్తారు.

మళ్ళీ తెర లేచాక, క్లైమాక్స్ సీను చెయ్యాలనుకుంటారు. ప్రీ క్లైమాక్స్ లో తల్లీ కొడుకుల మధ్య సన్నివేశం ఒకటి నటించాలి. అందుకు కొడుకు ఒప్పుకోడు. తనను అనాధను చేసి, తన దారి తను వెతుక్కున తల్లంటే అతడికి కోపం. నటించకుండా అక్కడి ఉండి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ వెళ్ళలేక ఉండిపోతాడు. క్లైమాక్స్ లో ఒక తోటలో చిన్న పాప ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ అక్కడున్న సరస్సులో పడి చనిపోతుంది. ఇది చూస్తున్న చిన్న బాబు ఆత్మహత్య చేసుకుంటాడు. ఇది కథలో భాగమేనా, లేక నిజంగా జరిగిందా అన్నది అక్కడున్నవారు తేల్చుకోలేకపోతారు. గందరగోళం మధ్య ఆనాటి రిహార్సల్ ని ముగిస్తున్నట్టు డైరెక్టర్ చెప్పడంతో నాటకం సమాప్తమవుతుంది.

ఇహ నా రొద:

పైన నా మాటల్లో చెప్పిన కథను మీరింకెక్కడైనా కూడా చదువుకోవచ్చును. ఇంకా సంక్షిప్తంగానో, లేక మరి కాస్త విస్తృతంగానో “సిక్స్ కారెక్టర్స్..” నాటకం కథను ఎంచుమించు అందరూ అలానే చెప్తారు. అందులో ఉన్నది అదే కాబట్టి!

కొన్ని రచనలు బయట వాన పడుతుంటే లోపల తింటున్న వేడిపకోడీల్లా ఉంటాయి. కొన్ని రచనలు కీ చేణ్ లాంటివి. వేలుకి తొడుక్కొని బోర్ కొట్టేంత వరకూ ఆడుకోవచ్చు. కొన్ని రచనలు ఓ మనిషి కూర్చొని మనతో సుధీర్ఘంగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. కొన్ని అందమైన యువతి చిత్రపటంలా ఉంటాయి. మనతో ఉందేమో అన్నంత భ్రమ కల్పిస్తుంది, కానీ ఉండదు. కొన్ని మనల్ని ప్రతిబింబిస్తాయి. కొన్ని మనల్ని వింతగా, వికృతంగా చూపించే అద్దాల మేళలా ఉంటాయి. కొన్ని రచనలు “మీకేం కనిపిస్తుంది?” అన్న శీర్షికల్లో బొమ్మల్లా ఉంటాయి. బయటకి ఒకలా అనిపిస్తాయి, లోలోపల మరెన్నో ఉంటాయి. నేరుగా చూడకుండా, తలను అటూ-ఇటూ తిప్పి చూస్తే ఒక్కో వైపు నుండి ఒక్కోలా కనిపిస్తుంటాయి. కొన్ని మనకి తెలీని పజిల్ కి సమాధానంలా ఉంటాయి, పజిల్ ఏంటో కనుక్కోడానికి మనం పాట్లు పడాలి.

ఈ రచన అలాంటి ఏ కోవలోకి వస్తుందో నేను చెప్పలేను. ఈ పుస్తకం చదవటానికి రెండు గంటలు పడితే, ఈ నాటకం గురించి అంతర్జాలంలో ఉన్న సమాచారాన్ని చదవడానికి నాలుగైదు గంటలు పట్టాయి. ఆ సమయం నేను వృధా చేశాననే అనిపిస్తుంది.

అన్ని రచనలూ అందరికీ కావు అన్నదాన్ని ఒప్పుకుంటూనే, ఆసక్తితోనో, కుతూహలంతోనో ఏదో ఒక విధంగా ఒక పాఠకుడు ఓ పుస్తకాన్ని ఎన్నుకొని చదవటం ప్రారంభించాక ఆ పుస్తకంలోని అక్షరాలకీ, అతడికీ మధ్యన వేరెవ్వరూ ఉండకూడదని నాకనిపిస్తుంది. ఆ పుస్తకం పూర్తి చేసో, చెయ్యకుండానో పాఠకుడు ఒక అభిప్రాయానికి వస్తే అది అతని స్వంత అభిప్రాయం. కాలానుగుణంగా ఇది మారనూ వచ్చు. కానీ ఫలానా పుస్తకంపై ఫలానా అభిప్రాయాలు మాత్రమే ఉండాలని లేదు. రచయిత ఏ ఉద్దేశ్యం, ఏ లక్ష్యంతో రాసినా, ఆ రచనని చదివాక పాఠకుడు ఏం గ్రహిస్తాడో, అదే పాఠకునిగా అతడికి ముఖ్యం. ఏ ఒక్క పాఠకుడి అభిప్రాయం వల్లనో రచనకి కానీ, రచయితకి కానీ పెద్దగా వచ్చేదీ / పోయేదీ ఉండదు. But a reader should be entitled to have a personal opinion about the work, despite all his limitations.

ఇంత ఎందుకు చెప్పుకు రావాల్సి వచ్చిందంటే ఇప్పుడీ పజిల్ లాంటి రచనని చదివాక నాకేమనిపిస్తుందో చెప్పేముందు అవసరమనిపించింది. నెట్ లో చదువుతున్నప్పుడు ఒక్కో చోట ఒక్కో విశ్లేషణ ఇచ్చారు. ఒక చోట అయితే Confessions of Pirandello about Six characters.. అనే వ్యాసమూ కనిపించింది. “Know the historian before you read history” అన్నది నాకు మొన్నే పరిచయమయ్యింది. దాన్ని ఫిక్షన్ కు కూడా వర్తింపజేయాలా వద్దా అన్నది నేనింకా ఒక నిర్ణయానికి రాలేదు. కాకపోతే ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు మాత్రం ఆ రచయితే స్వయంగా వచ్చి ఈ నాటకాన్ని ఎందుకు రాశారో విసిదీకరించినా, నేను మాత్రం ఆ పుస్తకం చదువుతున్న క్షణాల్లో నాకు కలిగిన భావాల్ని అలానే దాచుకుంటాను. ఉదా: ఇందులో తండ్రి కూతుర్ల మధ్య సంబంధం రచయిత నిజజీవితం నుండి ప్రేరణ పొందింది అని చదివాను. “అవును, అది నిజం” అని రచయిత గొంతు చించుకొని బలపరచినా, వారి సంబంధాన్ని నేను చూసే తీరు మారదు.

ఒక రకంగా చూస్తే నాటకరంగంలో ఉన్న లొసుగులనూ, పనిచేసే తీరునూ ఈ నాటకం ప్రదర్శిస్తుంది అనుకోవచ్చు. రిహార్సల్ జరిగేటప్పుడు డైరెక్టర్ రచయితల మీద చేసే విమర్శలు, నాటక ప్రదర్శనకు వీలుగా ఉండేట్టు కథ జరిగే నేపధ్యాలను మార్చటం, ఇరువురు గుసగుసలాడుతున్న సన్నివేశాన్ని నటించేటప్పుడు, ఆ గుసగుసలన్నీ ప్ర్రేక్షకులు వినిపించేంత గట్టిగా ఉండాలనడం – ఇవ్వనీ నాటక ప్రక్రియపై చేసిన హేళనలానే ఉంటాయి.

నాకు మాత్రం “పాత్రలు” అన్నవి మనుషులే అనిపించాయి. తమకో ఉనికి ఉంటుంది కానీ దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలీదు. ఏం చేస్తే ఎప్పటికీ నిల్చిపోతామో తెలీదు. తనను సృష్టించిన వాడిని వెతికి పట్టుకొని నిలదీయక, ఏ రచయితైనా సరిపోతాయి అనుకుంటాయి ఈ పాత్రలు. నాటక రిహార్సల్ లో ఏ రచయితా లేకపోయేసరికి కథ మేమే చెప్పగలం, మీరు కేవలం రాసుకుపోండి (transcribe) అని సూచిస్తాయి. అంటే ఒకరి చేతుల్లో మలచబడ్డం కన్నా, మనల్ని మనం మల్చుకోవాలన్న అంతర్లీన ఆరాటం. జరుగుతున్నవి నచ్చకపోయి, నాటకం వదిలిపోదామనుకున్నా వదలకపోవటం లాంటివన్నీ నా ఆలోచనలు మరో దిశగా తీసుకెళ్ళాయి.

ఒక చోట తండ్రి నాటకం గురించి మాట్లాడుతూ, “a perfect illusion of reality” అంటాడు. పాత్రల గురించి చెప్తూ, “well, we’ve no reality outside that illusion!” అనీ అంటాడు. జీవితం నాటకం అయితే, మనుషులు పాత్రలమనుకుంటే ఈ రెండూ బాగా సరిపోతాయి.

“Once a character’s born, he immediately assumes so much independence, even from his own creator, that he can be imagined in all kind of different situations, which would never have crossed the author’s mind, and sometimes he even takes on a significance the author would never have dreamed of giving him!”

అనుమతిస్తే, దీన్ని దేవుని స్వగతంగా ఊహించుకోవాలని నా చిరు కోరిక. 🙂

“.. the fact that each think of ourselves as one person, but it is not true. We’re all so many different people, sir, as many as we’ve the potential to be. We’re one thing with one person, and something quite different with another! Meanwhile we labour under the illusion that we’re the same with everybody, and that we are the same in everything we do. Well, that’s not so – it’s simply not true. And we’re made painfully aware of this when by sheer misfortune in the course of some act or other, we’re suddenly pulled up short and left dangling in mid air. What I mean is that we’re aware of not being totally involved in that act, so its terribly unfair to judge us by that alone – to keep us dangling there, pilloried, as it were, for the rest of our lives, summed up by that one single event!”

ఇది మనుషుల స్వగతమే, తండ్రి పాత్రలను ఉద్దేశించి మాట్లాడినవి అయినా.

ఒక్కో ఎత్తులో ఒక్కో వ్యూ ఇస్తుంది ఈ నాటకం, నాటకంలోని నాటకం. వెర్రితనం (క్రేజీనెస్), వితండవాదం, కామెడీ, నాటకీయత, భారీ ఫిలాసఫీ – అన్నీ ఉన్నాయ్ ఇందులో. అందుకే నాకు చాలా నచ్చింది. బహుశా , నాకు నచ్చిన మొదటి ఐదు పుస్తకాల్లో ఈ పుస్తకానికి స్థానం ఉండొచ్చు. అది ఖచ్చితంగా చెప్పటానికి మాత్రం ఈ పుస్తకంతో కల్సి ఇంకా సమయం గడపాలి. ఇద్దరు ఆప్త మిత్రులు తమ తొలి పరిచయం గురించి నెమరువేసుకునేటప్పుడు, “నీ గురించి మొదట్లో ఏం అనుకున్నానో తెల్సా” అని చెప్పటం లాంటిదవుతుంది ఈ వ్యాసం అప్పుడు. 🙂

ఈ పుస్తకం పై మీకు ఆసక్తి కలిగి ఉంటే ఈ కింది లంకెలు మీకు ఉపయోగపడతాయి.

ఫ్లిప్‍కార్ట్ లో ఈ పుస్తక కొనుగోలు వివరాలు. NHB’s publication. English Translation by Stephen Mulrine.

Google Book Preview

Notes on the Play

Wiki on this Play

The complete play Online  (English Translation by Edward Storer)

You Might Also Like

4 Comments

  1. varaprasaad.k

    ఏమి లేదంటూనే అన్ని చెప్పేసారు,మొత్తం మీద పాత్రలను ఒక తాటి మీదకు తెచ్చే ప్రయత్నం రచయిత ఎంత బాగా చేసాడో మీరు అంతకంటే బాగా చేసారు,రచన శిల్పం బావుంది,రాస్తూండండి మేము చదువుతుంటాం.

  2. పుస్తకం » Blog Archive » 2010లో చదివిన ఇంగ్లీషు పుస్తకాలు

    […] గారు పరిచయం చేసిన పిరన్‍దల్లో. Six characters in search of an author అన్న పుస్తకం చదివాక, “బహుశా, ఇది నా […]

  3. Purnima

    @కామేశ్వర రావు: ఆన్‍లైన్ చర్చలాంటి ఐడియా బాగుంది. ఈ పుస్తకం పై ఆసక్తిగల వారు ఇక్కడ కమ్మెంటితే సరిపోతుంది. ఎంత మంది అన్నది నిర్ధారణ అయితే, తక్కినవి ఆలోచించచ్చు!

  4. కామేశ్వర రావు

    మొత్తానికి మీరే రాసేశారన్న మాట దీని గురించి. మంచిపని చేసారు!

    “ఇద్దరు ఆప్త మిత్రులు తమ తొలి పరిచయం గురించి నెమరువేసుకునేటప్పుడు, “నీ గురించి మొదట్లో ఏం అనుకున్నానో తెల్సా” అని చెప్పటం లాంటిదవుతుంది ఈ వ్యాసం అప్పుడు.” – You are absolutely right! 🙂

    పుస్తకం.నేట్లో పుస్తకంపై పిచ్చాపాటీ (ఒక పుస్తకం గురించి దానిమీద ఆసక్తి ఉన్న కొద్దిమందితో online discussion) లాంటిది మొదలుపెడితే బాగుంటుందన్న ఊహ ఒకటి ఆ మధ్యనెప్పుడో వచ్చింది. ఈ పుస్తకంతో అది ప్రారంభిస్తే భలే బాగుంటుందనిపిస్తోంది!

Leave a Reply to పుస్తకం » Blog Archive » 2010లో చదివిన ఇంగ్లీషు పుస్తకాలు Cancel