నామిని కతలు..

ఈ పదేళ్ళలో అన్నిసార్లు ద్వారా విన్నా కూడా నేనెందుకు దీన్ని చదవలేదా? – అని ఇప్పుడు చదవడం మొదలుపెట్టిన క్షణం నుండీ ప్రశ్నించుకుంటున్నాను. అర్రెర్రె! చదివుండాల్సింది కదా ముందే! అనిపిస్తోందిప్పుడు. ఇప్పుడు దొరికిందని సంతోషించక (దొరకట్లేదట మరి!) – ఈ ఏడుపేంటి? అంటారా? మీగ్గానీ దొరకలేదేటీ? 😉

నామిని – కతలు నేను స్కూల్లో ఉండేటప్పుడు ’ఆంధ్రజ్యోతి’లో అనుకుంటా – తరుచుగా వచ్చేవి. మా ఇంట్లో ఆ పత్రికొచ్చేది కనుక, పిల్లలం మేం కార్టూన్ బొమ్మలతో పాటు – దీన్ని కూడా తిరగేసేవాళ్ళం. అప్పట్లో నాకు పుస్తకాల తెలుగే రాతల్లో తెలుగంటే. మాండలికాల్లో రాసే తెలుగు – ఎందుకోగానీ చదవలేకపోయేదాన్ని. What puts me off అంటే – వాటిల్లో ఇదొకటన్నమాట. ఇవి పుస్తకంగా రాగానే, పుస్తకం మా ఇంట్లోకొచ్చి చేరింది. మా తమ్ముడు చదివేసి, ’భలే ఉన్నాయి’ అన్నా కూడా నేను చదవలేదు. మొన్నామధ్య హైదరాబాదెళ్లినప్పుడు ఇంట్లో కనబడితే, ఈమధ్య ఇది దొరకట్లేదు… చదివావా… ఇలా నన్ను ఎవరో అడిగిఉండటంతో, తెచ్చుకున్నాను.

ఎన్నాళ్ళైందో ఈ యాస విని ! 🙂 నాకేదో ఈ యాసంటే ప్రాణమని కాదు. కానీ, ఈ తిరుపతి పక్క భాష వింటే – మనసు చిన్నతనంలోకి పోతుంది. దానితో, నేనెప్పుడూ ఆ భాష వాడకపోయినా – సుపరిచితమైన భాషే కనుక – ఏదో సొంతూరెళ్ళిన భావన (కానీ నా సొంతూరేదీ? అంటే -ఇప్పుడు హైదరాబాదు! హీహీ). విషయానికొస్తే, ఈ కథల్లో జీవితం ఉందండీ. రా..రా..మా లైఫ్ స్టైల్ చూపిస్తా అని నామిని వెంటబెట్టుకుని వెళ్ళి మరీ ఆ సైడంతా తిప్పించారు నన్ను. వాళ్ళ స్కూల్లోకి, వాళ్ళ ఫ్రెండ్స్ సంభాషణల్లోకి, వాళ్ళింట్లోకి – ఆర్కే లక్ష్మణ్ కామన్ మేన్ లాగా తొంగిచూసినట్లనిపించింది.

పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోడమూ, వెనువెంటనే అర్థరాత్రిలో వీటినెవర్తో అన్నా పంచుకోవాలనిపించి – వాళ్ళ మానాన వాళ్ళని పడుకోనివ్వక – పింగ్ చేసి- కతల్లోని వాక్యాలు టైపు కొట్టి చాట్ చేయడమూ.. ఆ తర్వాత పది గంటల్లో మాట్లాడిన అందరికీ వీటి గురించి చెప్పడమూ – ’మా అమ్మ చెప్పిన కతలు’ ఇంట్లో ఉందా? బైట దొరుకుతుందా అని హైదరాబాదుకు ఎంక్వైరీ చేయడం… మధ్య మధ్య – వీళ్ళనుభవించిన కష్టాలను కూడా ఎంత నవ్వుతూ, నవ్విస్తూ చెబుతున్నాడే – అని ఆశ్చర్యపోడమూ, అక్కడక్కడా కొంత సీరియస్సైపోయి – ఆలోచనలో పడ్డమూ, ఒక్కోచోట – కన్నీరొచ్చినంత పనవ్వడమూ, అక్కడక్కడా షరా మామూలుగా -బాపు గారికి మరో వహ్వా అనుకోడమూ – ఇదండీ ఈ పుస్తక పఠన అనుభవం నాకు.

పుస్తకం వెనుక బాపు గారు రాసిన లేఖ ఉంది: దాని పాఠం కొంత:

’నామిని గారికి నమస్కారాలు.
మీ మిట్టూరోడి కథలకి జోహారు..
………….
………..
రోజూ చూసే బ్రతుకులో మీకింతటి అందం, చమత్కారం కనబడుతోందంటే అది దేవుడిచ్చిన వరం. అది మీద్వారా మేం కూడా పంచుకోగలగడం మా అదృష్టం. …..
మీరు ఎంత సాధారణ విషయమైనా అసాధారణంగా రాస్తారని తెలుసు. దేవుడు అంతటా ఉంటాడని తెలిసినా అపుడపుడు తిరపతో, భద్రాద్రో అన్నారమో వెళ్ళి ప్రత్యక్షంగా ఓ దణ్ణం చెప్పుకుంటాం. మీకీ ఉత్తరం అలాంటిదే’

ఏమిటో, పుస్తకానికో ముందుమాటైనా లేదు 🙁
పదేళ్ళ తరువాత ఇప్పుడు నేను చదివితే – మరి నాబోంటోండ్లకు ఎట్టా తెలియాల దీని ఎనకుండేటి కత?

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు:

’అయ్యోరు గెంట కొట్టమంటాడు. ఆ గెంట కొట్టేదానికి నువ్వా నేనా అనేసి ఇరవై మందిమైనా పైకి లేస్తాం. పందొమ్మిది మంది అయ్యోరి సేతి దెబ్బలు తింటాం’

’’అమ్మా, అమ్మా! ఇస్కోల్లో రాముడు నాయెనకాన్నించి ఎంటికలు పెరికినాడు. నిజ్జింతో, పచ్చనాకు సత్తెంగా.. వోడు నా ఎంటికలు పెరికినాడమ్మా! అయ్యొరు నాకు పలకలో అఆలు రాసిస్తే కిస్టడు ఎంగిలూంచి నా అచ్చిరాల్ని తుడిపేసినాడమ్మా’ అని దిగులు దిగులుగా అరిచి సెప్తాను.
’ఆ నా బట్టల్ని కనిపించనియ్యి. ఎగిసి తంతాను; అని అమ్మ రాముణ్ణీ కిస్టడ్ని తిట్టి…..’

(ఆ నా బట్టల్ని…. అని చదవగానే – నవ్వాగలేదు..)

’’నాకు మూడ్డు బాగలేదురా గుడ్డోడా!’ అంటా క్లాసురూములోకి వచ్చినాడు మా లెక్కలయ్యోరు. దీంతో మా పిలకాయలందరికీ ఒక్కసారిగా మూడ్డొచ్చేసింది. ఆయనకు మూడు బాగుండి ఏస్కో బీస్కో అని ఆల్జిబ్రా మొదలుపెడితే మల్ల మన మైండు గాబ్రా గదా! బగమంతుడు మన పక్కన ఉండాడు కదా అని మేమంతా గుండా జెమ్మాచారంగా గాలి వొదిల్నాం.’

’మన మేనత్తకొడుక్కొక కూతురుంటే మనం గమ్మునుంటామా, కాళ్ళు జాపేసి? అంత చావునాకొడుకులు ఇక్కడెవ్వరూ లేరు.’

’ఒకరోజు ఇంక గెడ్డం అయ్యోరు క్లాసులోకి వస్తాడనంగా మా ఆరోతరగతి పిల్లకాయిలమంతా ఒక తాటిమీద నిలబడి ఒక మాట మిందికొచ్చినాం. ఆ మాట ప్రకారం గెడ్డాం అయ్యోరు వచ్చి, ’అమ్మ మీద వ్యాసం చెప్పండి’ అని అనంగానే మేమందరం ఒకే దఫాగా ’మేం మా అమ్మల మింద వ్యాసాలు చెప్పలేం సా. మేం ఆవల మింద, పత్తివర్తల మింద అయితే చెప్తాం సా’ అని అనెయ్యాల.

’మనం ఈ ఇస్కూల్లో అంటే బూలోకరంబ, జమున, పుస్పావతుల దగ్గర అధవై పొయ్నాం. ఇంగ అయిస్కూల్లో ఆడ పిలకాయల దగ్గిరన్నా మనం మతింపుగా బతకాల, అని నేను కనిన కలలన్నీ అయిస్కూలు మెట్టెక్కంగానే గుల్లేరిపొయ్నాయ్.
………………………………………
………………………………….
ఒకరకంతో నేను కోరిని కొండమింద వాన కురిసినట్లే అయింది. ఒకవేళ బూలోకా, జమునా వాళ్ళు టిపిన్ కేరేర్లు ఎత్తుకుని అయిస్కూలుకి ఎలబారుంటే, వాళ్ళు నన్నా అయిస్కూల్లో కూడా ’ఒరె,ఒరె గుడ్డోడా’ అని పిలిసుంటారా, నా మానాన్ని నిలువునా తీసేసుంటారు.’


పుస్తకం వివరాలు:

పచ్చనాకు సాక్షిగా. సినబ్బ కతలు. మిట్టూరోడి కతలు (బాపు బొమ్మలతో)
(Pacchanaku sakshiga, sinabba kathalu, mittoorodi kathalu)
నామిని సుబ్రమణ్యం నాయుడు (Namini Subramanyam Naidu)
తొలి ముద్రణ: జులై 1999 (ఇదే నేను చదివిన ముద్రణ)
వెల : వంద రూపాయలు (పదేళ్ళనాడు ఓ తెలుగు పుస్తకం వంద రూపాయలంటే – నాకు కళ్ళు తిరుగుతున్నాయి)
కాపీలు: విశాలాంధ్ర లో దొరుకుతాయని ఇక్కడ రాసుంది. కానీ, విశ్వసనీయ వర్గాలు దొరకట్లేదంటున్నాయి….

ఈమధ్యే నామిని గారి ఇంటర్వ్యూ లాంటిది ఆంధ్రజ్యోతిలో చదివా. వాళ్ళేమన్నా ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరేమో!

You Might Also Like

27 Comments

  1. siddu.penchaldass

    మా అయ్యోరు మూలింటామే కథ లో పందోసంత పాత్రని నేటి సామాజిక పరిస్థితికి ప్రతిరూపంగా భలే చిత్రిన్చినారు.ఆర్ధిక పురోబివ్రుద్ది లేని నా లాంటి నిరూద్యొగ యువతకు గొప్ప స్పూర్తిదాయకం.. ఇక కచితంగా కాలం తోటే పరుగులు తీస్తాం …మా కుటుంబాన్ని అబివృద్ది చేసుకుంటాం .. ఆ రహస్యాన్ని మాకు బోధించినందుకు..మీకు దన్యవాదములు ..కాలంతో పరుగుతీయలేని జాతి త్వరగా అంతరిచిపోతుందని ప్రాఇద్ అన్నారు కదా..

    1. siddu.penchaldass

      నాకు ప్రేరణ

  2. Tadepalli subrahmanyam

    ఒరే నామినోడా! నీ అమ్మ కడుపు చల్లగుండా! ఏమి భాష రాసినావురా!నీ కతలు చదువుతోంటే ఒక కంట్లో నీరు ,ఒక కంట్లో నవ్వు తెప్పిస్తావు గదరా!ఇంతకీ అది నీ గాచారం
    గాదులే! నీ అమ్మ,నాయినా నిన్ను కన్నా వేళా విశేషం.ఇన్నాళ్ళు తిరపతి అంటే వెంకటేస్పర సామే అనుకున్నాం గాని తిరపతి అంటే నామినోడు కూడా అని అరదమై పోయిందిరా.ఒరె
    తొందరపడి సావకుండా ఇంకా కతలు రాయాలిరోయ్.tondarapadi సచ్చవా నేనే arigentugaa
    మిట్టూరు వచ్చి నిన్ను సంపేయగలను.సల్లని తల్లి పెబావతమ్మకి కోటి దండాలు. ఒరే
    గుడ్డి నా బట్టా ! ఆరోగ్హెం జాగ్రత్త! ఏదో రోజు నీకు తప్పకుండా నోబెల్ బహుమతి వస్తుంది తప్పక అది తీసు కోగుండా బోయేవు. Mittayodu బాద పడి పోతాడు.indi ayyoru తిపిన్
    కెరీర్ ఎవడు కాళీ చెయ్యల?

    1. varaprasad.

      Nice reply.

  3. g b sastry

    ‘ములింటామె’ లో నామిని గారు మనుషులు, మనసులు, మమతలు, మానవత్వాల తత్వాలను యధాతధం గా కవిసమయాలు కవులు చేయ చూసే కవి న్యాయాలు చేయకుండా రంగులద్దకుండా హంగులంటించకుండా మరొక్క సారి తనఒక్కడికే సాధ్యమైన బాణిలో తళుక్కుమని మెరిసారు ఉన్నది ఉన్నట్లు చదివించే విధం గా రాయగలగడం ఆయన కే చెల్లిన విద్య. అందులో ఆడవారు సీతాలు,సావిత్రులు, అనసూయలు కారు,కాని వారు నిజం మనుషులు నిక్కమైన మనుషులు వారెవరూ ఆదర్శ మూర్తులుకారు కాని వారందరినీ అర్ధం చేసుకోలేకపోతే మనందరం నేల విడచి సాము చేసే వారమే అవుతాము . గిడుగు రామమూర్తి గారు మొదలగు వారు వ్యావహారిక భాషలో కి సాహిత్యాన్ని తెచ్చి ఎంత గొప్ప పని చేసారో అంతకుమించిన పని వ్యర్ధాలు అపార్ధాలు లేని జీవితాలని మనముందు వారి భాషలో యాసలో నీకు నచ్చినా నచ్చకున్నా వారలవుంటారు వరలాఉండకోడదంటే కళ్ళు మోసుకోవడమొకటే నువ్వు చెయ్యగలిగిందని చెప్పారు.

  4. Lokanath Kancham

    I felt re-lived my childhood life again after reading Namini’s book. One thing we all have to learn it , whether you are rich or poor, enjoy the life as it come.

  5. ప్రసాద్

    ’మన మేనత్తకొడుక్కొక కూతురుంటే మనం గమ్మునుంటామా, కాళ్ళు జాపేసి? అంత చావునాకొడుకులు ఇక్కడెవ్వరూ లేరు.’

    ఇప్పుడు, ఏ కధల పుస్తకమో, ఏ పేజీనో, ఎన్నో లైనో చెప్ప లేను గానీ, నాకు గుర్తున్న వరకూ నామిని ఇలా రాశాడు: ఏడెనిమిదేళ్ళ తన కూతురితో వరసైన మగవాళ్ళు సరసాలు ఆడొచ్చనీ, తాను కూడా వేరే వాళ్ళ కూతుళ్ళతో సరసాలు ఆడొచ్చనీ రాస్తాడు. ఎంత అసహ్యకరమైన విషయమో. పై లైను ఆ సందర్భంగా రాసిందేనని గుర్తు. అవసరమైతే, ఆ పుస్తకాలు తిరగేసి, మొత్తం వివరాలు సంపాదించొచ్చు.

    పల్లెటూళ్ళలో మగ వాళ్ళు ఇలాంటి చెత్త సరసాలు ఆడటం వాస్తవం అయితే అవొచ్చు. వాస్తవం అంతా వాంఛనీయం కాదు. అటువంటి వాస్తవ విషయాలు చెప్పేటప్పుడు, ఒక విమర్శతో చెప్పాలి. అయిష్టంతో చెప్పాలి. సరైన జ్ఞానం లేని రోజుల్లో మనుషులు అలా చేసేవారూ, రాను రాను అది తగ్గి పోతూ వుందీ, ఆడపిల్లలు అటువంటి మోటు సరసానికి ఇష్ట పడ్డం లేదూ అన్నట్టు చెప్పాలి. పైపెచు నేను కూడా అంతే అన్నట్టు రాస్తే, అది చాలా అసహ్యించుకోదగ్గ విషయంగా వుంటుంది.

    ఇంకో కధలో గొర్రెలు కాచుకునే ఒక అమ్మాయి వయసుకి వస్తుంది. వూళ్ళోని ప్రతీ మొగవాడూ ఆ అమ్మాయి మీద చెయ్యి వెయ్యడం, ఆ అమ్మాయి బాగా బాధ పడ్డం, ఈ నామిని ఆ అమ్మాయిని కాపాడాలని ప్రయత్నించడం అన్నీ వస్తాయి ఆ కధలో. ఇక్కడ విషయం చక్కగా అర్థం అయిన నామినికి, చిన్న ఆడ పిల్లలతో మగవాళ్ళు చేసే చెత్త మోటు సరసాలలోని బండతనం అర్థం కాకపోవడం ఆశ్చర్యమే.

    ప్రసాద్

    1. శివప్రసాద్

      అయ్యా,
      నామిని బూతు రాశాడని మీరన్నారే అంతకు పదింతలు బూతు మన సినిమాల్లో ఉంది. సరసం వేరు బూతు వేరు. రెంటికీ కాస్త తేడా ఉంది. చిన్నప్పుడు బావ మరదళ్ళు ఆడే సరసాలకి బూతు జోడించకండి. ఇప్పటికే మన జీవితాల్లో సరసాలకి కాకుండా సెక్స్ కి చోటిచ్చాం. నిర్భయ ఉదంతం మీరు చూసే ఉంటారు, అది జరిగింది పల్లెటూర్లో జ్ఞానంలేని రోజుల్లో కాదండి, దేశరాజధాని నగరంలో అందరూ చదువుకున్న వాళ్ళు తిరిగే ప్రాంతంలోనే.

  6. varaprasad

    naminigari anni pustakalu netlo kanipinchela cheyandi sowmyagaru,konchem jampala chowdary garni,poornimagarni kooda sayam cheyyamanandi.

  7. Leela Krishna

    నేను చిన్నపటి నుంచి నామిని గారు తెలుసు. ఆయన మా పక్కింట్లో ఉండే వారు. నేను పదవ తరగతి చదివే తప్పుడు మాకు లెక్కలు చెప్పే వారు. లెక్క తప్పు చేసి ఆయన చేతి లో ఎన్ని దెబ్బలు తిన్నానో..
    ఇప్పుడు తలుచు కుంటే నవ్వొస్తుంది. ఆయన్ని కలిసి చాలా రోజులు అయ్యింది. ఈ సారి ఊరు వెళ్తే తప్పక కలవాలి. మిస్ యు సార్..
    నామిని గారు “చదువులా.. చావులా..” అని ఇంకొక పుస్తకం కూడా రాసారు.

  8. varaprasad

    namini is my favouret writer in 90’s,but i am not know his latest devolopments,any how pl cooperate him,he is also a man,,so take it positively,we all r like his storys,it is common,keep it up.

  9. Anil Kumar Nellore

    ఈమద్యనే చదవడం మొదలుబెట్టా….నామిని అచ్చిరాలు తంతే మా ఊరి కొత్తకాలవలో పడ్డా…..

  10. Y RAMESH NAIDU

    Since I don’t know how to write in telugu type, i am writing it in english. Namini will definitely hate me. But unfortunately, he is not penning any stories in the resent past. If any body can approach him, please request him to start writing so that people, who are a lot, like me can spread his message and the smell of soil to the new generation

  11. DHARANIPATHY P

    I dont know how to use telugu lipi i.e how to type in Telugu so I am writing this is English hope you will excuse me for this. I had the fortune of reading Namini right from 1990 and I had read them in Andhra Jyoti weekly.Since I hail from Madras (now Chennai) the Tirupati slang is nearer to ours hence I could enjoy the Chottor slang very much. I had read Pachha nake sachiga, sinabba kathalu, Munikannadi Sedyam and Mottorodi Kathalu when they were serialised in Andhra Jyoti weekly. And I consider myself fortunate enough to possess those books when they were published. In fact I had introduced these stories to my brother also who also was very much impressed by those storeis. I had read Pala podugu in one story collection book which I presume was published by the name Manchi Kathalu. I think I have not read Sundaramma koduku kathalu which I hope will be able to read in the latest edition of Namini which my brother recently purchased at Madras Book fair (thank god now in Madras book fair two stalls of Telugu books were opened. I must here mention that I was fortunate enough to receive a reply from Namini when I sent him a New year greeting to him in 1989 or 1990 I supoose. But unfortunately When I replied to his letter I did not any reply from him. I am unfortunate to lose the letter wrtten by him. Its rather sad now he is not writing any more. I think he writes only what he could write from his heart and I feel that he got no more to write. Any how we are lucky to have read him. Kindly anybody who know how to use the tool to write in Telugu may let me know by writing to my email id. Mohammed kadir Babu who acknowledged Namini as his guru in his first book Dargamitta Kathalu is also a good writer in his own way. Kindly let me know any of you have read his books Dargamitta kathalu and Poleramma Banda Kathalu. Please comment on them and I will share my feeling about his book later.

    P.DHARANIPATHY
    COIMBATORE

  12. పుస్తకం » Blog Archive » 2010లో చదివిన తెలుగు పుస్తకాలు

    […] నామిని కథలు: నామిని నామ జపం వినీ, వినీ ఏడాది ప్రధమార్థంలో ఈయన పుస్తకాలు అందుబాటులో లేక, అరువిప్పించుకొని చదివిన పుస్తకం. చదివిన అంటే నిజానికి చాలా దూరమవుతుంది. నలుగురం కలిసి వంతులు వారీగా ఒక్కో కథా చదువుకొని, హాయిగా నవ్వుకోవటం ఓ మధురానుభూతి. యాస, కథ, కథనం అన్నీ నచ్చాయి. […]

  13. పుస్తకం » Blog Archive » హైద్రాబాద్ పుస్తక ప్రదర్శన, 2010 – నేను కన్నవి, కొన్నవి

    […] బెంగళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర, మిట్టూరోడి పుస్తకం […]

  14. tatimatta

    నేను బడి చివర్లోనో, కాలేజి లోనో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతిలో చదివా. ఖమ్మం జిల్లా వాడినైనా బాగానే అర్ధం అయ్యింది. అప్పటికి ఒక పూట వ్యవసాయానికి వెళుతున్నందున మిట్టూరోడి కథల్లో నన్ను నేను ఐడెంటి ఫై చేసుకున్న. అప్పటినుంచి అతని మొరటు హాస్యం నాకు ఇష్టం. ఆయన భాష కొత్తగా ఉన్నా పల్లె నేపద్యం ఉన్న వాళ్లకు ఏ ప్రాంతమైనా తేలిగ్గా బుర్రకు ఎక్కుతుంది. అప్పట్లో పులికంటి కృష్ణ రెడ్డి, ఇప్పట్లో కరుణాకర్ కూడా ఆ జిల్లా సాహిత్యపు ముద్దు బిడ్డలు.

  15. బొల్లోజు బాబా

    ఈ కధలను నేను చదవటానికి ప్రయత్నించాను. వర్కవుట్ కాలేదు.

    ఎందుకో మాండలీకంలో వ్రాసిన కధలలో ఒక్క వంశీవి (పసలపూడి కధలు) తప్ప మరేవి నాకు కొరుకుడు పడలేదు ఇంతవరకూ. బహుసా నేటివ్ ఫీలింగేమో! లేదా మాండలీకాలకు ఉండే పరిమితేమో అది.

    బొల్లోజు బాబా

  16. bondalapati

    “రోజూ చూసే బ్రతుకులో మీకింతటి అందం, చమత్కారం కనబడుతోందంటే అది దేవుడిచ్చిన వరం”…

    ఈ కనబడటం నామిని వంటి వాళ్ళకు దేవుడిచ్చిన వరమైతే ఆ అందం చమత్కారం మనకు కూడా కనపడేటట్లు చేయటం మాత్రం నామిని కే తెలిసిన ఒక గొప్ప విద్య.

  17. రవి

    ఈ పుస్తకం కొత్త ముద్రణ వచ్చింది. టామ్ సాయర్ పబ్లిషర్స్, తిరుపతి (0877)2242102. విశాలాంధ్రలో హాట్ కేక్ గా వెళ్ళిపోతోంది. నేనూ ఈ మధ్యే కొన్నాను. డిసెంబరు 2009. వెల 220. ఇప్పుడే పరిగెట్టండి. మీరీ పుస్తకం చదవకపోతే, ఖచ్చితంగా ఏదో కోల్పోయినట్లే.

  18. చౌదరి జంపాల

    http://thisisanwar.blogspot.com/2009/12/blog-post_3683.html లో నామినితో ఆర్. ఉమామహేశ్వరరావు ఇంటార్వ్యూ, http://thisisanwar.blogspot.com/2010/01/blog-post_25.htmlలో తనకి ఈమధ్యనే జరిగిన అభినందన సభలో నామిని చెప్పిన మాటలూ ఇంతకు ముందు పుస్తకంలో ముందుమాట కొరతను తీరుస్తాయేమో చూడండి.

  19. చౌదరి జంపాల

    ఈ మూడు కతల పుస్తకాలకు ఇంకో రెండుకతలూ (పాలపొదుగు, సుందరమ్మ కొడుకులు), మునికన్నడిసేద్యం నవలా కలిపి ఒకటే పుస్తకంగా నామినిగారు ఈమధ్యే ప్రచురించారట. రెండువందల రూపాయల ధర అని విన్నాను. పుస్తకాల షాపుల్లో దొరికినా, దొరకకపోయినా నామినిగారి దగ్గర తప్పకుండా దొరుకుతుంది.
    అన్వర్ గారి బ్లాగులో కొత్త పుస్తకం ముఖచిత్రం చూడవచ్చు http://thisisanwar.blogspot.com/2010/01/blog-post.html. విశాలాంధ్రలో కొత్త పుస్తకం, నామిని అభినందన సంచికా దొరుకుతున్నాయని అన్వర్ చెప్తున్నారు.

  20. Gireesh K.

    డిసెంబరు, 2009 లో ‘మిట్టూరోడి పుస్తకం’ పేరుతో నామిని రాసిన ఆరు పుస్తకాలూ (పచ్చ నాకు సాక్షిగా, సినబ్బ కతలు, మిట్టూరోడి కతలు, మునికన్నడి సేద్యం, పాల పొదుగు,సుందరమ్మ కొడుకులు) కలిపిన సంపుటం విడుదలయ్యింది. అన్ని విశాలాంధ్ర బ్రాంచీల్లో దొరుకుతున్నాయి.

    ఈ మధ్యనే ఈ పుస్తకం చదవడం పూర్తి చేసాను.కానీ ఇంకా ఆ మత్తులోనే జొగాడుతున్నాను. నా బాల్యం అంతా చిత్తూరు జిల్లాలోనే జరగడం వలన, ఈ యాసతో పరిచయమున్నా, చదువంతా హైదరాబాదులో సాగటం వలన యాస వంటబట్టలేదు. అయితేనేమి, ఈ పుస్తకంలో ప్రతీ పాత్ర ఎన్నాళ్ళగానో పరిచయమున్నట్లు ఆత్మీయంగా పలకరిస్తుంది.

    “ఒకరికి ముగ్గురు బిడ్డల్ని కని నేనేం వారుకున్నాను? ఈ పిలకాయల్ని నా కడుపులో ఎందుకు పుట్టించినావురా నా బట్టా దేవుడా…” అంటూ యాష్టకి బోయే సినక్కల్ని ఎంతమందిని చూళ్ళేదు చిన్నప్పుడు.

    “మ అమ్మ బలేటిది రా. వూదిపోయినప్పుడుకూడా చద్దిపెట్టింది. ఇడ్నీలు పెట్టమని చెప్పితే యినిందా? అందుగ్గదా నా వూపిరి పోయింది..” ఈ వూదోడి మాటలు గుండెల్ని తాకి, మెలిపెట్టికానీ వదలవు.

    రంగంపేటనుంచి మిట్టూరికి పొట్టచేతపట్టుకొని వచ్చి, అద్దాలమె భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేయడానికి మునికన్నడు పడే తపన, ఈ పుస్తకం చదువుతున్నంత సేపు వాడి చెరుకు తోటకి ఏమౌతుందోననే టెన్షనూ, షిడ్నీ షెల్డను సస్పెన్సు నవలకేమీ తీసిపోదు.

    వెంకటేశ్వరుడిని తమ పంచలోనే నిలుపుకున్నా, ఆయన దేవేరి లక్ష్మీదేవి కటాక్షానికి మాత్రం నోచుకోలేని చిత్తూరు జిల్లా పల్లెలను, అక్కడి జీవితాన్నీ, మన చేయి పట్టుకు లాక్కెళ్ళి పరిచయం చేస్తాడు నామిని. తప్పకుండా చదవ వలసిన పుస్తకం.

    ఈ పుస్తకం గురినిచి రాద్దామని అనుకుంటుండగానే, మీరు రాసేసారు. చాలా చక్కటి పరిచయం. ధన్యవాదాలు.

    1. murali mohan reddy

      ఎప్పుడో మరచిపోయిన..మా ఊర్లో నడుస్తూ..అమ్మలక్కలతో పరాచికాలాడుతూ..వాళ్ళ కష్టం సుఖం పంచుకుంటూ..ఊరంతా తెగ తిరిగేసి..ఆకలేస్తే..నాలుగు సంగటి ముద్దలు తినేసి..వెన్నెల్లో..అరుగు మీద చాపేసుకుని పడుకున్నట్టు..భలే కుశాలగా ఉందిలే…

      —- నామిని గారు..(అయన పద్దతిలోనే..”బో నాబట్ట రా నాయినా”.)..మిమ్మల్నీ మీ కథల్నీ వదలిపెట్టడం చానా కష్టం సామీ..

Leave a Reply to Y RAMESH NAIDU Cancel