ద్రౌపది — ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

రాసిన వారు: జంపాల చౌదరి

చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.

*****************************************
draupadiనాలుగైదేళ్ళ క్రితం ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌గారి ద్రౌపది నవల ధారావాహికంగా వస్తుండేది. మొదట్లో నేను సరిగా పట్టించుకోలేదు గాని, ఒక మిత్రుడు బాగుంది, చదవమని సూచించటంతో పాత సంచికలు వెలికితీసి చదవటం మొదలుబెట్టాను. మొదటి ప్రకరణం ప్రారంభించిన తీరు నన్ను కొద్దిగా ఆశ్చర్యపరిచింది. ఉత్కంఠనూ కలిగించింది. మిగతా పుస్తకాన్ని ఆసక్తిగా చదివించింది. కొన్నాళ్ళకి ద్రౌపది పుస్తకంగా వచ్చింది; రెండో ముద్రణకూ నోచుకొంది. 2007 జూన్‌లో లక్ష్మీప్రసాద్‌గారు చికాగో వచ్చినప్పుడు ద్రౌపది గురించి కొద్దిగా చర్చ జరిగింది. ఈ మధ్యే ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు వచ్చిందని తెలిసి ఆనందించాను. అప్పటినుంచీ బ్లాగులతో సహా వివిధ మీడియారంగాలలో ఈ విషయం సమస్యాత్మక చర్చనీయాంశం అయింది. చర్చల్లో పాల్గోంటున్న చాలామంది మాట్లాడుతున్న విషయాలకు నేను చదివిన నవలకు పోలికలు తక్కువగా కనిపించాయి. చర్చల్లో పాల్గొంటున్న చాలామంది ఈ పుస్తకం చదవనేలేదని, పురాణ పాత్రలకు ఆధునిక భాష్యాలు చెప్పటంపై తమకు ఉన్న భావనల ఆధారంగానే మాట్లాడుతున్నారని నాకు అనిపించింది. అయినా అనుమాన నివృత్తికోసం ఈ పుస్తకాన్ని మళ్ళీ చదివాను.

ముందు పుస్తకాన్ని సంక్షిప్తంగా పరిచయం చేసి, ఆ తర్వాత ప్రస్తుతం నడుస్తున్న వివాదంలోని కొన్ని అంశాల గురించి మాట్లాడుతాను.

కురుక్షేత్ర యుద్ధం ఆఖరు దినాలలో ఒక ఉదయం ఈ కథ ప్రారంభమౌతుంది. యుద్ధం భీకర పర్యవసానాన్ని చూసి విచారపడుతున్న ద్రౌపది ఈ మారణహోమం జరగటంలో తన పాత్రను గురించి ఆత్మపరీక్ష చేసుకొంటూ ఉంటుంది. అంతకుముందురోజు ఉదయం ద్రౌపదిని నిద్రలేపిన నకులుడు ద్రౌపది కుమారులు ఐదుగురినీ రాత్రికి రాత్రే అశ్వత్థామ సంహరించిన విషయం చెపుతాడు. ఆ వార్త విన్న ద్రౌపది వివశురాలవుతుంది. యుద్ధభూమిలో సోదరుడి, పుత్రుల మృతశరీరాలను చూసిన ద్రౌపదికి దుఃఖంతో పాటు కోపంకూడా వచ్చింది. అశ్వత్థామను చంపి పగతీర్చుకొమ్మని తన భర్తలను నిలదీసింది. చంపటానికి వచ్చిన పాండుపుత్రుల చేతిలో ఓడిపోయిన అశ్వత్థామ క్షమాభిక్ష కోరి తన తలపై ఉన్న చూడామణిని కోసి ఇచ్చాడని తెలిశాక ఆమె కోపం చల్లారుతుంది.

ఆ తరువాత యుద్ధంలో చనిపోయిన బంధువులకు పాండవులు తిలోదకాలు సమర్పిస్తుండగా కర్ణుడికి కూడా తిలోదకాలివ్వమని కుంతి కోరుతుంది. కర్ణుడు తన జ్యేష్టకుమారుడన్న సత్యాన్ని బయటపెట్తుంది. ఈ విషయం విన్నవారంతా ఆశ్చర్యపోతారు. కర్ణుడు తన భర్తలకి అన్న అనే విషయం ద్రౌపదిని విస్మయపరిచింది. ఈ విషయం ముందే తెలిసిఉంటే తనకూ కర్ణుడికీ మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండేవన్న సందేహం ఆమెకు కల్గింది. ఆమె అంతకు ముందు కర్ణుని రెండుసార్లే చూసింది. ఆ రెండు సందర్భాలలోనూ ఆమెకు కర్ణుడిపట్లా తిరస్కారభావమో, అసహ్యమో కల్గాయి. తాను కర్ణుని రెండు సార్లే కలసినా తనజీవితమంతా కర్ణుని చుట్టే తిరిగినట్లుందని ఆమెకు తోచింది. ఆమె కర్ణుని మొదటిసారి చూసింది తన స్వయంవర సమయంలో. సూతపుత్రుడన్న కారణంతో కర్ణుని మత్స్యయంత్రం చేదించటానికి ప్రయత్నం చేయకుండా ఆమే ఆపించింది. ఆ తరువాత ఆమె కర్ణుని చూసింది కౌరవసభలో. ఆరోజున తనను అవమానించటంలో కర్ణుడు ప్రముఖ పాత్రే వహించాడు. కర్ణుని హీనునిగా తలపోస్తున్న ద్రౌపదికి, కుంతి, కృష్ణుడు చివరిరోజుల్లో పశ్చాతప్త హృదయుడైన కర్ణుడి ఉదాత్తప్రవర్తన గురించి ఆమెకు తెలిపారు. మరణించిన కర్ణుడు అదృష్టవంతుడు. అతడి మరణం అత్యంత విషాదాన్ని ఏర్పరిచింది. అతనికి అద్భుత, విశిష్ట వ్యక్తి అనే కీర్తి వచ్చింది. తమకూ, కర్ణుడికీ ఉన్న బాంధవ్యం తెలిసిన పాండవులు విషాదభరితులయ్యారు. ధర్మరాజుకు రాజ్యం మీద విరక్తి కల్గింది. అతన్ని పట్టాభిషేకానికి సుముఖుణ్ణి చేసే బాధ్యత ద్రౌపదే తీసుకోవలసి వచ్చింది.

పట్టమహిషైన ద్రౌపదికి తన జీవనపథమ్మీద, తన వివాహంపైన ఉన్న ధర్మశంకలను, కృష్ణద్వైపాయనుడు (వ్యాసుడు), కృష్ణుడు తీర్చారు. పూర్వ జన్మలలో ఆమె వేదవతి, ఆ తరువాత మౌద్గల్య ముని భార్య ఇంద్రసేన. ఆమె పాతివ్రత్యానికి మెచ్చిన మౌద్గల్యుడు ఆమెతో ఏకకాలంలో ఐదురూపాల్లో (త్రిమూర్తులు, ఇంద్రుడు, మన్మథుడు) రమించాడు. ఆ తరువాతి జన్మలో ఆమె కాశీరాజు కుమార్తె అనామికగా జన్మించింది. పతికోసం ఘోరమైన తపస్సు చేసింది. పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. పతి అన్న పదాన్ని ఐదుసార్లు పలికింది ఆమె. ఐదుగురు పతులను అనుగ్రహించాడు శివుడు. నీకు ఐదుగురు పతులున్నా అది ధర్మవిరుద్ధమని ఎవరూ భావించరు అని, ఆమె కోరుకొన్న విధంగా ఐదుగురితో సుఖించటానికి తగ్గ యవ్వనం, కామభోగేఛ్ఛ, వారిని సేవించేందుకు అవసరమైన శుశ్రూషాభావం, కన్యాత్వం, సౌభాగ్యం అనుగ్రహించాడు. మరుజన్మలో ఆమె యజ్ఞం చేస్తున్న ద్రుపదుడికి అగ్నిగుండంలో లభించింది. ఆమెను పార్థునికివ్వాలన్న తలపుతో ఉన్న ద్రుపదుడు, పాండవులు మరణించారన్న మాట విని, ఆమెకు స్వయంవరం ప్రకటించాడు.

ద్రౌపది స్వయంవరం అవగానే పెద్ద యుద్ధమే జరిగింది. ఆమెను స్వయంవరంలో గెలిచినవాడు, అతని సోదరులు యుద్ధంలో కూడా గెలిచి, తమ తల్లి దగ్గరకు తీసుకువెళ్ళారు. అక్కడ వారి తల్లి అనాలోచితంగానో, ఆలోచితంగానో అన్న మాటకు కట్టుబడి ఆమె ఆ అయిదుగురు సోదరులనూ పెళ్ళి చేసుకోవలసి వచ్చింది. ఆ తర్వాత వారు పాండుకుమారులని ఆమెకు తెలిసింది. ఐదుగురు పతులతోనూ ఆమె సుఖజీవనం ప్రారంభించింది. పాండవులు ప్రఛ్ఛన్నవేషాలు వీడి ఇంద్రప్రస్థంలో జీవించటం మొదలుబెట్టాక చాలా విశేషాలు జరిగాయి. ద్రౌపదితో ఏకాంతోల్లంఘన లేకుండా ఒక్కొక్కరూ ఒక సంవత్సరం గడపాలని అన్నదమ్ములు చేసుకొన్న ఒప్పందాన్ని ఉల్లంఘించిన అర్జునుడు ఏడాది పాటు తీర్థయాత్రలకు వెళ్ళి మూడు వివాహాలు చేసుకొని, శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రను ఏకంగా ఇంద్రప్రస్థానికే తెచ్చాడు. పాండవులు రాజసూయం చేశారు. వారి ఆధిపత్యాన్ని చూసి కన్నెర్ర జేసుకొన్న దుర్యోధనుడు, మాయాద్యూతంలో గెలిచి పాండవులనూ, ద్రౌపదినీ బానిసలుగా చేసుకొన్నాడు. అంతకుముందు ఏ మహారాణికీ జరగని అవమానాలు ద్రౌపదికి జరిగాయి. ఏకవస్త్ర ఐన ద్రౌపదిని నిండుసభకు జుట్టుపట్టుకుని ఈడ్చుకువచ్చాడు దుశ్శాసనుడు. దుర్యోధనుడు ఆమెను కూర్చోమని తన తొడను చూపించాడు. ఆమె పతులముందే ఆమెను వివస్త్రను చేయబూనాడు. ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత మరోసారి జూదమాడి పాండవులను అడవుల పాలు చేశాడు. ద్రౌపది పాండవులతో పాటు పన్నెండేళ్ళు వనవాసం చేయవల్సివచ్చింది. ఆ సమయంలోనే సైంధవుడు ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించాడు. వనవాసం ముగిశాక అజ్ఞాతవాసం కోసం విరాటపురం వెళ్ళినప్పుడు. ద్రౌపది విరాట రాణికి సైరంధ్రిగా ఉండవలసి వచ్చింది. కీచకుడు ఆమెను బలవంతంగా అనుభవించటానికి ప్రయత్నించి భీముని చేతిలో మరణించాడు.

అజ్ఞాతవాసం తరువాత రాయబారాలు, సంధి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ద్రౌపది వాటిని వ్యతిరేకించింది. యుద్ధం జరిగి, తనను అవమానించినవారిని తన భర్తలు నిర్జించి తన పగ తీర్చాలని ఆమె కోరుకొంది. ఆ కోరిక నెరవేరే క్రమంలో తన పుత్రులను కోల్పోయి పెద్ద మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది. ఆ తర్వాత ఆమె కొన్నేళ్ళు హస్తినాపుర పట్టమహిషిగా జీవించింది. కొన్నాళ్ళకు కృష్ణుడు మరణించాడు. పాండవులు మహాప్రస్థానం ప్రారంభించారు. ఆ యాత్రలో అందరికన్నా ముందు మరణించింది ద్రౌపది.

ఇదంతా మనకు తెలిసిన మహాభారత గాధే. ఈ ఘట్టాలన్నీ ఇంతకుముందు మనం కథలుగా విన్నవే. ఐతే ఈ పుస్తకం ప్రత్యేకత ఏమిటి?

ఈ పుస్తకం కేవలం పాండవ కౌరవుల కథ మాత్రమే కాదు. ఇది ప్రధానంగా ద్రౌపది దృక్పథం నుంచి చెప్పబడిన కథ. ద్రౌపది మనోభావాల కథ. ఆమెకెదురైన విపరీత పరిస్థితులకు ఆమె స్పందనల కథ. ఈ కథలో ద్రౌపది ఒక నిస్తేజమైన, నిస్సహాయమైన, అణిగిమణగి ఉన్న పాత్ర కాదు. రక్తమాంసాలూ, జవసత్వాలూ, నిండు మనసుతో సజీవమైన మహిళ. ఆమె అసాధారణ సౌందర్యరాశి — రూపేచ లక్ష్మి. సునిశితంగా ఆలోచించగల్గి, రాజనీతి తెలిసిన ఆమె ధర్మజునికి, ఇతర పాండవులకు కరణేషు మంత్రి. తన పతులపై విపరీతమైన అనురాగం కలిగిన ఆమె సోదరులైదుగురికీ శయనేషు రంభ. అనేక అవమానాలను, తన పతుల తప్పిదాలను సహించిన ఆమె క్షమయా ధరిత్రి.

ఈ పుస్తకంలో నాకు నచ్చిన అంశాలు.

తెలిసిన కథను మనకు మళ్ళీ చెప్పటానికి రచయిత ఎంచుకొన్న క్రమం – మనకు పరిచయమైన క్రమంలో నడవదు ఈ కథ. ఉపపాండవుల మరణశోకంతో ద్రౌపది దుఃఖిస్తుండటంతో ఈ కథను మొదలుబెట్టడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కల్గించింది.

తన ఐదుగురు భర్తల గురించి ద్రౌపది విశ్లేషణ – పాండవు లైదుగురి వ్యక్తిత్వాలను ద్రౌపదితో ప్రథమ సమాగమపు సమయంలో వారి ప్రవర్తనలద్వారా ఆవిష్కరిస్తాడు రచయిత. వారి మనస్తత్వాలను ఆకళింపు చేసుకొని వారి మనోభావాలను దెబ్బ తీయకుండా ద్రౌపది ప్రవర్తించే విధానాన్ని ఆసక్తికరంగా చిత్రీకరించారు.

కుంతికీ ద్రౌపదికీ ఉన్న సాన్నిహిత్యం – ఈ నవలలో ద్రౌపదికి ముఖ్యస్నేహితురాలు ఆమె అత్తగారే. ద్రౌపది వలే కుంతికూడా విలక్షణమైన పురుష సంబంధాలు కల్గినదే. ద్రౌపది మానసిక సంఘర్షణలను, సందిగ్ధాలనూ అర్థం చేసుకొని ద్రౌపదికి మానసిక సాంత్వనను కలిగించటానికి కుంతి ప్రయత్నిస్తుంటుంది.

ఈ నవలలో చాలా విలక్షణమైనది కృష్ణకూ, కృష్ణునికీ ఉన్న సంబంధం. ఇద్దరికీ ఒకరిపట్ల ఒకరిపై విపరీతమైన మమకారం. మానసికంగా వారిద్దరూ అతిసన్నిహితులు.

ఈ కథ చెప్పటంలో లక్ష్మీప్రసాద్‌గారి శైలి ప్రత్యేకించి మెచ్చుకోదగింది. చదువరిలో ఉత్కంఠను రేకెత్తించి పుస్తకాన్ని కడవరకూ చదివింపచేస్తుంది. ఆయన వాక్యాలూ, సన్నివేశాలూ ఉద్విగ్నంగా వడివడిగా పరిగెడతాయి.

ఈ పుస్తకానికి సాహిత్య ఆకాడెమి బహుమతి వచ్చాక వినిపిస్తున్న విమర్శలు.

అ) ఈ పుస్తకంలో శృంగారం మితిమించి ఉంది. ద్రౌపది శరీర వర్ణనలు, ఐదుగురి భర్తలతో ఆమె గడపిన మొదటిరాత్రుల వర్ణనలు ఉచితంగా లేవు. ఈ పుస్తకంలో ద్రౌపదిని ఉత్త కాముకిగా, స్వైరిణిగా చిత్ర్రెకరించారు:

241 పేజీలున్న ఈ పుస్తకంలో ద్రౌపది తన భర్తలతో కూడిన పంచరాత్రుల వర్ణనలు ఐదు ప్రకరణాలలో 13 పేజీలలో ఉంటాయి. ఆ శృంగార వర్ణన కానీ, ద్రౌపది సౌందర్య వర్ణన కానీ – నా అభిప్రాయంలో – సగటు ప్రబంధాల్లో ఉన్న వర్ణనలకన్నా గానీ, లేక ప్రస్తుతం వారపత్రికలలో కనిపించే శృంగారకథలకన్నా గానీ తక్కువగానే ఉన్నాయి. శృంగారాన్నీ, కామక్రీడల వర్ణనల్నే ప్రధానాంశం చేయాలని రచయిత భావించి ఉంటే, ఈ పుస్తకంలో దానికి చాలా అవకాశాలే ఉన్నాయి. ఈ పంచరాత్రులు కూడా పాండవులైదుగురి విభిన్న తత్వాలను ద్రౌపది అర్థం చేసుకోవటంకోసమే వినియోగించుకొన్నారు రచయిత. ఉదాహరణకు ద్రౌపదీ అర్జునుల మొదటిరాత్రి గురించిన మూడున్నర పేజీల ప్రకరణంలో, వారి శృంగార క్రీడ వర్ణన ఏడు లైన్ల పేరాగ్రాఫుకు మాత్రమే పరిమితమయ్యింది; మిగతా మూడుంబావు పేజీలు వారిద్దరి మనస్తత్వాలూ, మానసిక సన్నిహిత్యాల చిత్రణే. ఈ పుస్తకంలో ముద్దులూ, బిగికౌగలింతలూ, సుఖాలింగనాలూ వగైరా చాలాచోట్ల కనిపించినా, అవన్నీ కథాగమనంలో కలసిపోయినవే. పుస్తకంలో ఉన్న శృంగారం చాలావరకూ పరస్పర అనురాగరక్తులూ, యవ్వనవంతులూ ఐన భార్యాభర్తల మధ్య పెళ్ళయిన తర్వాత పడగ్గదిలో జరిగిందే. కామకార్యకలాపాల వర్ణనకోసమే ఈ పుస్తకం చదివితే నిరాశ తప్పదు; వేరే పుస్తకాలూ, పత్రికలూ చాలానే ఉన్నాయి వాటికోసమైతే.

ద్రౌపదిని శృంగారానురక్తగా చిత్రించటం, తన భర్తలతో భోగించటంపై ఆమెకు ఉన్న మక్కువను అనేక సందర్భాల్లో చెప్పిన మాట నిజమే. ఆమె పూర్వజన్మ వృత్తాంతాలను వర్ణించేటప్పుడు కూడా ఆమెకు ఉన్న కామేఛ్చ ప్రధానంగా కనబడిన మాట వాస్తవమే. ఐతే. ఇది తన కల్పన కాదనీ, ఆదిపర్వంలోని పంచేంద్రోపాఖ్యానంలోనే ఈ కథ ఉందనీ విపులంగా ముందుమాటలో చెప్పారు రచయిత.

ఈ పుస్తకంలో ద్రౌపది చాలా బలమైన ఉద్వేగాలు (strong passions) కల వ్యక్తి. ఇది ఒక్క శృంగార విషయంలోనే కాదు. ఆమె రాగవిరాగాలలోనూ, అగ్రాహానుగ్రహాలలోనూ కూడా అంతే. రచయిత ముందుమాట ప్రకారం ఈ నవలా రచనోద్దేశం: “ఈ జన్మలో ద్రౌపదిగా ఏ కోరికలు ఈడేర్చు కోవటానికి పరమశివుని వరప్రసాదంగా జన్మించిందో, ఆ కోరికలు తీరాయా లేదా అన్న విషయం చర్చిస్తూ, ద్రౌపది మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని, ప్రశంసనీయమైన ఆమె ఆత్మవిశ్వాసాన్ని, మహిళాలోకానికే మకుటాయమానంగా నిల్చిన ఆమె సౌశీల్యాన్ని, కుమార్తెగా, సోదరిగా, భార్యగా, తల్లిగా, శ్రీకృష్ణుని సఖిగా, మహారాజ్ఞిగా, రాజనీతిజ్ఞురాలిగా, విదుషీమణిగా, ఉత్తమ ఇల్లాలుగా, గృహిణిగా వివిధరూపాలలో పరిఢవిల్లిన ఆమె వ్యక్తిత్వ గరిమను వివరించటమే”. ఈ పుస్తకం ఆసాంతమూ చదివినవారెవరికైనా ద్రౌపది కామేచ్ఛ మాత్రమే కనిపిస్తే వారితో తన దృక్పథం పంచుకోవటంలో రచయిత విఫలమైనట్లే. ఐతే దీనికి కారణం పాఠకుడా, రచయితా అన్నది ఆలోచించవలసిన విషయం.

ఆ) కృష్ణుడికీ, ద్రౌపదికీ మధ్య రచయిత సూచించిన సంబంధం అనుచితంగా ఉంది. కృష్ణుణ్ణి ద్రౌపది సఖుడుగా భావించటం ఆమె కృష్ణుడితో శారీరక సంబంధం కోరటాన్ని సూచిస్తుంది.

ఈ పుస్తకంలో కృష్ణుడికీ, ద్రౌపదికీ మధ్య ఉన్న సంబంధం – మామూలుగా మనం చదివే- అన్నాచెల్లెళ్ళ సంబంధం కాదు. అర్జునుడికి కృష్ణుడితో ఉన్న అసాధారణ సంబంధం లాంటిదే ఇది. ఇందులో స్నేహమూ, సానిహిత్యమూ ఎక్కువ. ఎక్కడా ఈ సంబంధంలో శారీరక కామేచ్ఛ ఉన్నట్లు రచయిత చూపించలేదు. భగవంతుడిలో భక్తుడు (పురుషులు కూడా) అమితప్రేమతో ఏకమయ్యేట్టి వర్ణనల వల్లే ఉంటుంది ఈ పుస్తకంలో వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం. ద్రౌపదికి, సత్యభామకు జరిగిన సంభాషణలో ఇది మరింత విశదీకరించబడుతుంది. సఖుడు, ప్రేమ అన్న పదాలు శారీరక సంబంధాలకు మాత్రమే పరిమితం కావు.

ఇ) కుంతి పాత్ర చిత్రణ బాగాలేదు. ఆమెను పంచభర్తృకగా చూపటం; ఆమె ఆ భర్తలతో ఎక్కువకాలం సుఖించకపోవటం తలచుకొని బాధపడుతున్నట్టుగా చూపటం ఉచితంగా లేదు.

ఈ పుస్తకంలో కుంతి పాత్ర చిత్రణ కొద్దిగా అస్పష్టంగానే ఉంది. ద్రౌపదికీ ఆమెకు మధ్య చాలా సాన్నిహిత్యం ఉన్నట్టు చూపించారు రచయిత. ఐతే ఆమె తన ప్రవర్తనను గూర్చి ఏమనుకొంటుందో చెప్పటంలో ఏకసూత్రత లేనట్లుగా అనిపించింది.

ఈ) వ్యాసుడి పాత్ర చిత్రణ అనుచితంగా ఉంది.

విదురుని తల్లితో సమాగమ సందర్భంలో వ్యాసుడు ఆమెతో జరిపిన సంభాషణ అసందర్భంగానూ, అనుచితంగానూ ఉంది. ఈ కథాగమనానికి అంత ఉపయుక్తం కాని ఈ సంఘటన, సంభాషణ రెండూ వర్జ్యనీయమే.

ఉ) ద్రౌపదికి కర్ణుడిపట్ల కామవాంఛలున్నట్లు వ్రాయటం ద్రౌపది వ్యక్తిత్వాన్ని కించపరచడమే.

ఈ నవలలో ఎక్కడా కూడా ద్రౌపదికి కర్ణుడిపై వాంఛ ఉన్నట్టు వ్రాయలేదు. ఆమెకు మొదట కర్ణుడంటే సూతపుత్రుడన్న తిరస్కార భావం; ఆ తర్వాత కురుసభలో అతని ప్రవర్తన చూశాక అతడంటే కోపం, అసహ్యం. భారత యుద్ధానికి ముఖ్యకారణం కర్ణుడి ప్రతీకార వాంఛే అని ఆమె నమ్మకం. కర్ణుడు కుంతీపుత్రుడని తెలిసినప్పుడు కూడా, “తనతో వివాహమాడేందుకు అలాంటి నీచుడికి అర్హత ఉన్నదా…” అనుకొంటుంది ఈ పుస్తకంలో ద్రౌపది. కర్ణుడి మరణానంతరం కుంతి, కృష్ణుడు కర్ణుడితో తమ సంభాషణలు వివరించాక అతని పట్ల జాలి, గౌరవం కలిగినట్లు చూపిస్తారు రచయిత.

ఊ) పుస్తకం ముఖచిత్రం ఉదాత్తంగా లేదు.

నా దగ్గర ఉన్న పుస్తకం, రెండో ప్రచురణ (జనవరి 2008); రెండు ముద్రణలకూ ఒకటే ముఖచిత్రం వాడారో లేదో నాకు తెలియదు. నా దగ్గర ఉన్న పుస్తకం ముఖచిత్రం: సాంప్రదాయ పద్ధతిలో ఆభరణాలు అలంకరించుకొన్న ఒక హిందూ యువతి (రవివర్మ సంప్రదాయంలో చిత్రీకరించబడింది అనిపించింది) ముఖం, మెడ వరకూ కనిపిస్తూ ఉంటుంది; కొంత వెనుకగా, అదే ముఖం కొద్దిగా తక్కువ పరిమాణంలో, లేతగా కనిపిస్తుంటుంది. చిత్రకారుడు (పేరు కనిపించలేదు) వాడిన రంగులు పాతరోజుల్లో శివకాశినుంచి వచ్చే పౌరాణిక కేలెండర్ బొమ్మలను గుర్తుకు తెచ్చాయి.

ఈ ముఖచిత్రం ఆకర్షణీయంగా ఉంది. నాకైతే ఎలాంటి అనౌచిత్యమూ కనిపించలేదు.

ఎ) ఇంతకన్నా మంచి పుస్తకాలు చాలా ఉండగా ఈ పుస్తకానికే ఇవ్వాలా? (ఈ అభ్యంతరంలోనే, ఇతర పర్యాయ ప్రశ్నలు: ఈ అవార్డును దళిత రచయితకో తెలంగాణా రచయితకో ఇవ్వచ్చుగా?)

అవార్డులు, అవి ఇచ్చే సంస్థ నిర్ణయించుకొన్న పరిమితుల, నిబంధనల పైనా, న్యాయనిర్ణేతల అభిరుచులపైనా ఆధారపడి ఉంటాయి.

సాహిత్య అకాడెమి పరిమితుల, నిబంధనల గురించి నాకు స్పష్టమైన అవగాహన లేదు.

అభిరుచుల వరకూ మాత్రం లోకో భిన్న రుచిః. న్యాయ నిర్ణేతలు మారితే ఏ అవార్డు ఎంపికైనా మారే అవకాశం ఎక్కువగానే ఉంటుంది.

ఈ సంవత్సరం బహుమతికోసం ఏ పుస్తకాలు పరిగణించబడ్డాయో నాకు తెలీదు. ఇలాంటి బహుమతుల్లో కూడా ఒక కోటా పద్ధతి ఉండాలని వాదించేవారితో నేను ఏకీభవించను.

ఏ అవార్డుకైనా ఎంత గౌరవం ఇవ్వాలి అన్నది కూడా వ్యక్తిగత అభిరుచులపైనే ఆధారపడి ఉంటుంది. ఒక సంస్థ కొన్ని సంవత్సరాల క్రమంలో చేసిన అవార్డు ఎంపికలు మన అభిరుచులకి సరిపోతే మనం ఆ సంస్థ ఇచ్చే అవార్డులకు గౌరవం ఇస్తాము. లేకపొతే వాటిని పట్టించుకోవటం మానేస్తాం.

నేను అభిమానించే రచయితలకూ, పుస్తకాలకు పూర్వం చాలాసార్లు కేంద్ర సాహిత్య అకాడెమి బహుమతులు వచ్చాయి; అంచేత నాకు ఈ సంస్థ అవార్డులంటే ఇప్పటికీ మంచి అభిప్రాయమే ఉంది.

ఈ పుస్తకంలో కొన్ని విషయాలపట్ల నాకు అభ్యంతరాలు ఉన్నప్పటికీ, మొత్తమ్మీద పుస్తకాభిమానులందరూ చదవవలసిన పుస్తకమేనని నా అభిప్రాయం. ఎంతగానో పరిశ్రమించి, పరిశోధించి, చక్కటి పుస్తకం వ్రాసినందుకు శ్రీ లక్ష్మీప్రసాద్‌కు నా అభినందనలు.

ఈ పుస్తకాన్ని విమర్శించదలచుకొన్న వారు పుస్తకం ఒకసారి కూలంకషంగా చదివాక విమర్శిస్తే అర్థవంతంగా చర్చించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. విమర్శించటానికి పుస్తకాన్ని చదవాలా అనేవారికి నమస్కారం.
******************
ఈ పుస్తకం ఇప్పుడు కినిగె.కాం లో ఈ-పుస్తకంగా లభ్యం. లంకె ఇక్కడ.

ద్రౌపది
ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

You Might Also Like

59 Comments

  1. జంపాల చౌదరి

  2. చౌదరి జంపాల

    @ప్రవీణ్ గార్లపాటి: #

    ప్రవీణ్ గారూ: పుస్తకం వారి నిబంధనలను నేను పాటించాను. ఈ విషయంపై నా అభిప్రాయం ఆంధ్రజ్యోతి సంపాదకులకు తెలియజేశాను కూడా.

  3. ప్రవీణ్ గార్లపాటి

    @జంపాల చౌదరి గారు:
    ఆంధ్రజ్యోతిలో మీ వ్యాస ప్రచురణ పైన పుస్తకం సంపాదక వర్గం వారి ఆలోచన ఏమిటో నాకు తెలీదు కానీ వారి వెబ్‌సైటులో స్పష్టంగా ఉంది.

    # ‘పుస్తకం’లో ప్రచురితమైన తమ రచనలను (అవి మొదటిసారిగా పుస్తకంలోనే ప్రచురితమైన పక్షంలో) రచయితలు తమ బ్లాగుల్లో కాక, అంతర్జాలంలో ఇతర చోట్ల మళ్ళీ ప్రచురించదలిస్తే, రచననంతటినీ కాకుండా, అందులో కొన్ని భాగాలను మాత్రమే ఉటంకిస్తూ, ‘పుస్తకం’లోని పూర్తి రచనకి లింకు ఇవ్వాలి.
    # ‘పుస్తకం’లో ప్రచురించబడిన తమ రచనలను అచ్చు పత్రికలకు పంపదలచుకొంటే, ఆ రచన ‘పుస్తకం’లో ముందుగా ప్రచురించబడిందని ఆయా ‌పత్రికల సంపాదకులకు రచయితలే తెలియజేయాలి. వేరే పత్రికకి ‘పుస్తకం’లో ప్రచురించబడిన రచనలని పంపేముందు – ఆయా పత్రికల ప్రచురణ విధానాలను తెలుసుకోవలసిన బాధ్యత పూర్తిగా రచయితలదే. ‘పుస్తకం’లో తమ రచన ప్రచురించబడిన సంగతి వేరే పత్రికలకు తెలియజేయకపోయినట్లైతే – తదనంతర పరిణామాలన్నిటికీ ఆ రచయితే బాధ్యత వహించాలి. ‘పుస్తకం’ వారు తాము పంపిన, తమకు అందిన ఆన్ని ఈమెయిళ్లనీ, రచయితలతో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలనీ భద్రపరిచి ఉంచుతారు.

    మీ వైపు నుంచి పుస్తకం ప్రచురణకి లంకె పంపినా ఆంధ్రజ్యోతి వారు దానిని ఉటంకించకపోవడం చాలా దురదృష్టకరం. అయితే మీరు వారిని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. It just sets a wrong precedent.

  4. srinivas

    అపార్థం కలిగితే క్షమించండి. నాకు ఆయన పట్ల, ఆయన సాహిత్య కౌశలం పట్ల ఎలాంటి గురు భావం లేదు. చక్కటి మానిప్యులేటర్ అని మాత్రమే చెప్పదలచుకున్నా.

  5. జంపాల చౌదరి

    @srinivas: Thanks.
    యార్లగడ్డ గారికి హిందీ సాహిత్యంలో ఎంత పేరుంది? ఆయన చేసినవన్నీ అనువాదాలే కదా (ద్రౌపది తక్క; వాటికి పాఠకులెవరు?

  6. srinivas

    balakavi bairagi, orissa hindi poet, ex rajya sabha member, helped yarlagadda to get respect in hindi literature.

  7. జంపాల చౌదరి

    @srinivas: ఆవిష్కరించిన ‘బైరాగి’ ఎవరు?

  8. Srinivas Nagulapalli

    అనుకోకుండా అతికిందో, లేక అలా సాలోచనతోనే రాసారో తెలియదు కాని, “బైరాగి” చేతుల మీదుగా ఆవిష్కరించింది బాగా “వేడెక్కించింది” అని చెప్పడం చాలా చమత్కారంగా ఉంది.
    =======
    విధేయుడు
    -Srinivas

  9. srinivas

    చదివి వేడెక్కదానికి బాగానే ఉంది. మూడేళ్ళ క్రితం డిల్లీలో బైరాగి చేతుల మీదుగా ఆవిష్కరించినప్పుడు చదివా. మరచిపోయా. నల్లటి రూపా గంగులిని గుర్తుకు తెచ్చుకొని కాసేపు ఉద్రేకం పొందిన విషయం మాత్రమే గుర్తు ఉంది.

    ఎలాంటి పుస్తకమో మీరే అంచనా వేయాలి.

  10. Srinivas Nagulapalli

    నిజమే – “ఆంధ్ర జ్యోతి” – “వివిధ”లో కొన్ని కొత్త విషయాలు అందించారు జంపాల గారు. వ్యక్తిగత దూషణలకు దగ్గరగా వస్తున్న విమర్శల మధ్య ఇది పత్రికాముఖంగా రావడం చాలా వాంఛనీయం.

    నేనూ అభిమానించే కా.రా గారు, బే.రా గార్లు నిర్ణేతలుగా ఉన్న నియామక బోర్డు, దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వాలని ఎంపిక చేయడం సరికొత్త ఆశ్చర్యం కలిగించింది. వారి నిర్ణయమెంతో, రాజకీయ ప్రభావం ఎంతో పెరుమాళ్ళకెరుక. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం. ఈ పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వకపోతే, దీనిని విమర్శించడం కాని, ఇదసలు ఉందన్న స్పృహైనా ఇంతగా ఉండేదా అని అనిపిస్తుంది. అన్ని పుస్తకాలూ నేర్పిస్తాయి. కొన్ని ఎలా రాయాలో. కొన్ని ఎలా రాయగూడదో.
    ======
    విధేయుడు
    -Srinivas

  11. జంపాల చౌదరి

    @కొత్తపాళీ: To clarify: what appeared in Andhra Jyothi – Vividha is not a reprint, but an updated version of the article that appeared here. There are some significant changes: several additions and a few deletions from what appeared in pustakam.net.

  12. పుస్తకం.నెట్

    We’ve received an email from Dr. Jampala notifying that he has sent the updated version of the article to AJ and requested the editor of AJ to acknowledge that it was published in pustakam.net

  13. కొత్తపాళీ

    I came here to mention exactly the same thing mentioned above by Achilles. The omission by AJ team is glaring. Though Dr. Jampala might have given them permission to reprint (which I don’t know if he did), AJ still shd have acknlowledged first publication in pustakam.
    All pustakam users should protest this.

  14. pustakam.net

    @Achilles: Pustakam.net was not informed of the article’s publication in Andhrajyothi – by them.

  15. Achilles

    Andhra Jyothi daily published this article as is on today’s issue (1st Feb 2010). I don’t know whether they took permission from either the writer or pustakam.net, but it is a shame that they chose not to mention pustakam.net.

    …and they talk about changing the society!

  16. పుస్తకం » Blog Archive » Our Draupadi

    […] I quote these passages is this. Recently I have been reading the blog discussions, both on this site and on Kalpana Rentala’s blog, on the Central Sahitya Academy Award winning book on Draupadi […]

  17. jai

    chowdhary done very good job.

    this article is inspiring me to buy that book.

  18. కత్తి మహేష్ కుమార్

    నిన్ననే నవల చదివాను. యాజ్ఞసేని,యుగాంతం మరీ ముఖ్యంగా పర్వ చదివాక ఈ పుస్తకం చాలా “లైట్”గా అనిపించింది. సాహిత్య అకాడమీకి అర్హమాకాదా అన్న సందేహం వచ్చినా, ఇమర్శలు మాత్రం అర్థరహితాలని తెలిసొచ్చింది.

  19. Srinivas Nagulapalli

    ఎంతో ఓపికతో శ్రమతో నవలను పరిచయం చేసిన జంపాల గారికి చాలా
    కృత్జ్ఞతలు. ఎంతో రచ్చ, దుమారం రేపుతున్న సమయంలో ఇది చదవడం
    హాయిగా ఉంది.

    నాది ఒక్క మాట.

    > ఈ) వ్యాసుడి పాత్ర చిత్రణ అనుచితంగా ఉంది.
    >
    > విదురుని తల్లితో సమాగమ సందర్భంలో వ్యాసుడు ఆమెతో జరిపిన
    > సంభాషణ అసందర్భంగానూ, అనుచితంగానూ ఉంది. ఈ
    > కథాగమనానికి అంత ఉపయుక్తం కాని ఈ సంఘటన, సంభాషణ
    > రెండూ వర్జ్యనీయమే

    షడ్రసోపేతంగా వడ్డించిన విస్తరిలో అతి సన్నని, చాలా చిన్నని
    వెంట్రుక మాత్రమే ఉంది, ఫరవాలేదు తినండి అన్నట్టుంది కేంద్ర సాహిత్య
    అకాడమీ వారి ఎంపిక.

    రుచిలేని వంటలు, రచనలు స్వీకరించ వచ్చేమో కాని, వర్జనీయమైనది
    ఎంత తక్కువున్నా మింగడం కష్టం. అంటే మిగితాది బాలేదు అని కాదు.

    బాగాలేనిది పక్కకు బెట్టి, బాగున్నదాన్నే మెచ్చుకొని ప్రోత్సహించడం
    చిన్న పిల్లల రాతల విషయాలలో వారి తలిదండ్రులు, టీచర్లు రోజూ
    చెసేదే. అయితే tax payersడబ్బుతో సత్కరించే కేంద్ర సాహిత్య అకాడమీ
    అవార్డుకు ఇంతకు మించిన స్థాయి గల రచనలు, అంటే, మెచ్చుకోదగ్గవి
    కాకపోయినా సరే,కనీసం వర్జనీయం లేనివి అన్నా, ఒక్కటంటే ఒక్కటైనా
    దొరకలేదా అని ఆశ్చర్యం, ఆవేదన. అట్లాంటివి లేవంటే అవార్డులెందుకు
    ఇవ్వడం? ఏ రకంగానూ వర్జనీయాంశాలు లేని బోలెడు “ఈమాట” రచనలు,
    “రచ్చబండ” పోస్టులుంటే, పుస్తకాలెందుకు దొరకవు, వెతికితే!

    అయినా, ఎన్నో విషయాలను ఆసక్తికరంగా ఆవిష్కరించిన పుస్తకాన్ని
    తెలుగు సాహితీప్రియులంతా తప్పక ప్రోత్సహించాలి. Taxpayers’ కాదు,
    సొంత డబ్బులతో మాత్రమే.
    ===========================
    విధేయుడు
    -శ్రీనివాస్

  20. perugu

    అపోహలను తొలగించే సమగ్రమైన విశ్లేషణ ..
    విశదంగా రాసిన చౌదరి గారికి ,పుస్తకం కు
    అబినందనలు.!

  21. శ్రీ

    బాగా రాసారు రివ్యూ.

  22. ప్రవీణ్ గార్లపాటి

    పుస్తకం సమీక్ష చాలా బాగుంది.
    విశదంగా అన్ని కోణాల నుంచి అవిష్కరించినందుకు ధన్యవాదాలు.

    అందరూ ఇలా పుస్తకం చదివి వాదిస్తే చర్చలు ఇంకా అర్థవంతంగా ఉంటాయి.

  23. V Chowdary Jampala

    @Independent:

    ఈ వ్యాసంతో పాటు ఉన్నముఖచిత్రం మీద బొమ్మ రూపా గంగూలీదే అని నేనూ అనుకొంటున్నాను.

    నా దగ్గర ఉన్న రెండో ముద్రణ ముఖచిత్రం (నా వ్యాసంలో ప్రస్తావించినది) వేరు. ఈవారం ఆంధ్రజ్యోతి వివిధలో (http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2010/jan/18vividha2 – వివిధ అర్కైవ్స్‌లో జనవరి 18, 2010 పిడిఎఫ్ ఎడిషన్ దొరుకుతుంది) ప్రచురించిన హిందీ అనువాదం ముఖచిత్రమే తెలుగులో రెండో ముద్రణ ముఖచిత్రం కూడా. ఈ పుస్తకం మూడో ముద్రణ కూడా వచ్చిందని విన్నాను. కనీసం రెండు ముద్రణల ముఖచిత్రాలు అభ్యంతరం చెప్పాల్సిన రీతిలో లేవు; మూడోదానిగురించి నాకింకా తెలీదు.

  24. Sudesh Pillutla

    Thanks Chowdary garu. Your article vindicates my position that I am arguing in other groups that we discuss these topics.

    Regards
    Sudesh

  25. a gandhi

    i liked the way mr.chowdary garu dealt with the subject. he was successful to the extent now that i want to read the book.
    yours truly,
    gandhi

  26. రాజశేఖరుని విజయ్ శర్మ

    సరైన సమయంలో సరైన వ్యాసం. పుస్తకం వారికి, చౌదరి గారికి అభినందనలు. చౌదరి గారి అభిప్రాయాలు నిజాయితీగా ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి. ఇక పుస్తకం చదివిన తరువాత ఎలా అనిపిస్తుందో చూడాలి.

  27. budugoy

    సమగ్రమైన, సముచితమైన విశ్లేషణ. పుస్తకం వారికి అభినందనలు.

  28. సుజాత

    అవును, చక్కని అవగాహనతో సమతౌల్యంతో రాసిన సమీక్ష! ఒక నవల గురించి వ్యతిరేక భావాలు వెల్లువెత్తే తరుణంలో ఆ నవల చదివితే అవే భావాలు మనల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో కూడా స్థిరాభిప్రాయంతో రాసిన చౌదరి గారికి ప్రత్యేకాభినందనలు!

    విమర్శించటానికి పుస్తకాన్ని చదవాలా అనేవారికి నమస్కారం. …చక్కగా చెప్పారు!

  29. Praveen Sarma

    చిన్నప్పుడు నేను మహాభారతం చదివాను. అప్పట్లో కూడా నేను మత గ్రంథాలని కేవలం కాల్పనిక గ్రంథాలుగా భావించేవాడిని. ఇప్పుడు ద్రౌపది నవల చదివాను. అప్పుడు గానీ, ఇప్పుడు గానీ నాకు ద్రౌపది పాత్రలో పెద్ద వైరుధ్యాలు కనిపించలేదు.

  30. Praveen Sarma

    ఈ నవలలో కొన్ని పేజిలు చదివినా అర్థం అవుతుంది, ఇది అశ్లీల నవల కాదని. నవల విమర్శకులు ఒక్క పేజి అయినా చదివారా అనేది డౌట్. ఈ నవలలో రచయిత ద్రౌపదిని ఒక ఉత్తమురాలిగానే చూపించారు. ధర్మరాజు, ఇతర పాత్రలలోనే వైరుధ్యాలు చూపించారు.

  31. sujata

    కల్పన రెంటాల గారితో ఏకీభవిస్తున్నాను. విశదమయిన వ్యాసం. చాలా బాగా రాశారు. పుస్తకం కు కొత్త శోభ ను తీసుకొచ్చారు.

  32. Independent

    Wow.
    Great Job guys. Thanks a lot for Pustakam.Net admin.
    Needless to say thanks for Mr Chowdary as well. Convinced me to buy the book.

    Nitpicking..isn’t that Rupa Ganguly’s picture?!!

  33. kalpana

    ఇన్నాళ్ళకు ద్రౌపదీ పుస్తకం చదివిన వ్యక్తిగా , నిష్కర్ష గా, పుస్తకంలో వున్న విషయాల పట్ల సరైన అవగాహనతో రాసిన వ్యాసం చదివాను. ఇప్పుడున్న వివాదాస్పద పరిస్థితుల్లో మళ్ళీ రెండో సారి కూడా చదివి ఒక స్థిర అభిప్రాయంతో మంచి సమీక్ష రాసినందుకు జంపాల చౌదరి గారికి అభినందనలు.

Leave a Reply