2009 లో నేను చదివిన హాస్య రచనలు

“Perhaps I know best why it is man alone who laughs; he alone suffers so deeply that he had to invent laughter. – Friedrich Nietzsche”

పోయిన ఏడాదిలో నేను చదవాలనుకొని చదవలేకపోయిన వారిలో  Nietzsche ఒకరు. లోపల్నుండి ఏడుపు తన్నుకొస్తున్నా, మొహం పై నవ్వు పులుముకొని, “చూడు.. నేనెంత ఉల్లాసంగా ఉన్నానో, ఉత్సాహంగా ఉన్నానో” అని ఫోజు కొట్టే వాళ్ళంటే నాకు భలే చిరాకు. అలాగే, గోరంత దాన్ని కొండంతగా చూసుకొని బెదిరిపోయి, వాళ్ళు ఏడ్చేదే కాక, పక్కనున్న వాళ్లు ఏడ్చితీరాలని మొండికేసే వాళ్లన్నా చిరాకే! కాకపోతే జీవితంలో కొన్నిసార్లు కొందరు మనుషులు తారసపడతారు, వీళ్ల పరిచయం గోడకేసి నెత్తి కొట్టుకొని బొప్పికట్టించుకోవటం లాంటిది. ఇంకొందరి పరిచయం ఎలా ఉంటుందంటే, వాళ్లల్లో నచ్చిందేదో మనకి తెలీకుండానే మనకి మనదన్నట్టుగా అలవాటుపడిపోతుంది. గత ఏడాది నెత్తి బొప్పికి బామ్‍గా, కొందరి పరిచయాల వల్ల లాభం చేతా నా ఖాతాలో హాస్య రచనల చిట్టా కాస్త పెరిగింది. చదివింది సంఖ్యాపరంగా కొన్నే అయినా, నన్ను చాలా ప్రభావితంగా చేశాయి. అలాంటి పుస్తకాల గురించి ఇలా కొన్ని పేరాల్లో అవ్వగొట్టేస్తున్నానని నాకే బాధగా ఉంది. ఇహ అవ్వెంత బాధపడతాయో మరి!

Hitchhiker’s Guide to Galaxy – Douglas Adams

ఒక మెదడుకీ మరో మెదడుకీ మధ్య వైర్లెస్ ట్రాన్సిమిషన్ ఉండి, మనం చెప్పాలనుకుంటున్నవన్నీ అవతలి వాళ్లకి అర్థమయ్యిపోవాలని మీకెప్పుడైనా అనిపించిందా? నా ఫ్రెండ్ కి మాత్రం ఖచ్చితంగా అనిపించుంటుంది, నాతో ఈ పుస్తకం చదివించేలా చెయ్యడానికి. “రీడ్. రీడ్..” అని ఆ మనిషీ, “రీడచ్చులే.. రీడుతా తర్వాత” అని నేను! “నేను పుస్తకం పంపించేస్తున్నా” అన్నప్పుడు అవతలి మనిషిలో ఆ పుస్తకాన్ని నా బుర్రలో డంప్ చేయలేని అసహనం స్పష్టంగా కనిపించింది. “వద్దు.. నేను.. నేను వెత్తుక్కుంటా కదా” అని ఇహ తప్పనిసరై పుస్తకాల షాపులో ఈ రచన చూశాను.

అసలు ఎవరైనా పుస్తకం గురించి చెప్పీచెప్పగానే, ఆ పుస్తకం గురించి అన్ని వివరాలూ గూగుల్ చేసుకుంటాను. చదవాలనుకోకపోయినా పుస్తకం గురించి కొన్ని రివ్యూలు చదువుతాను. మరి ఈ పుస్తకం విషయంలో ఇంత నిర్లిప్తతో ఎందుకున్నానంటే, “నాకు హాస్యం చదవటం రాదు” అని నా మీద నాకో పెద్ద నమ్మకం. మీరు సరిగ్గానే చదివారు, “నాకు హాస్యం చదవటం రాదు!”. మార్చి చెప్పాలంటే, చదివేటప్పుడు నాకు నవ్వు రాదు ఎక్కువ. అదే సీనుని ఓ మనిషి చెప్తున్నా, లేక ఓ తెరపై చూస్తున్నా నవ్వుకుంటా బాగా. అదేంటో, మాటలు చదువుకుంటూ నవ్వటం నాకు రాదని అనిపిస్తూ ఉండేది.

hitchhikers-guide-to-the-galaxyసరే, పుస్తకంలో రెండు పేజీలు చదివి పక్కకు పెట్టేద్దాం అనుకున్నా. “A Guide to the Guide” అన్న పరిచయ వ్యాసం టైటిల్ కి టాగ్‍లైన్ గా “Some unhelpful remarks from the Author.” అన్న వాక్యం చదివే పెదాలపై చిన్న చిర్నవ్వు వచ్చింది. ఆ వ్యాసం పూర్తయ్యే లోపే చాలా నవ్వుకున్నాను. మారు ఆలోచనలేకుండా పుస్తకం కొన్నాను.

ఇంటికెళ్లి చదివానా? అంటే ఊహు! పక్కకు పెట్టేశాను. మనుషులంటే బద్దశత్రువుల్లా చూసేట్టు ఉన్న మూడ్‍లో పుస్తకం తెరచి చదవటం మొదలెట్టాను. “తెగ నవ్విస్తారని పేరు కదా మీకు.. ఏదీ నన్ను నవ్వించండి!” అని ఆ రచయితను ఛాలెంజ్ చెయ్యడానికన్నట్టు మొదలెట్టాను. వరసుగా ఛాప్టర్లు అయిపోతున్నాయి.. నవ్విన సందర్భాలు మచ్చుకైనా లేవు. (మనకి మూడ్ బాలేనప్పుడు, మనుషుల్ని ఎలా అవాయిడ్ చేస్తామో, పుస్తకాల్ని చెయ్యాలి. అవి ఏమీ అనుకోవు కదా, తిరిగి మనల్ని ఏమీ అనవు కదా అన్న ధైర్యంతో వాటిపై శ్రద్ధ పెట్టకుండా, మనసు పెట్టకుండా చదవాలనుకోవడం, వాటిని అవమానించడమే!)

డగ్లస్ ఆడమ్స్ హాస్యభరిత సైన్స్ ఫిక్షన్‍కు పెట్టింది పేరు. నవ్వించగల అందరిలానే, ఈయన గురించి కూడా “హిల్లేరియస్” అన్న విశేషణమే ఎక్కువ వినిపిస్తుంది. ఆయన రచనల్లో కడుపుబ్బ నవ్వించగల సన్నివేశాలు లేకపోలేవు, కానీ అంతకు మించి ఆయన కథ చెప్పటంలో మాస్టర్! విపరీతమైన మూడ్ లో ఒక్కసారి కూడా నేను నవ్వకపోయినా, కొన్ని చాప్టర్లు చదువుతూ పోయానంటే, ఆయన కథను ఎంత వేగవంతా చెప్తూ పోయారో అర్థం కావటం లేదు! ఆ కథలోని విజ్ఞాన శాస్త్రం, ఆయన భాషలోనే చెప్పాలంటే mind bogglingly good. ఇక హాస్యం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, “అతిశయోక్తి”కే ఈయన ఎక్కువ ప్రధాన్యం ఇచ్చినట్టు అనిపించింది. పైగా కొత్త కొత్త మాటలు పుట్టించటంలో ఈయన సిద్ధహస్తులు. నేను మొదటి భాగం ఒక్కటే చదివాను. మిగితావి చదవాలి!

(ఒక ఉచిత సలహా: ఈ పుస్తకం ఇంకా కొనని వారు, కొనాలనుకునే వారు, ట్రైలాజీ మొత్తం ఒకే పుస్తకంగా వచ్చింది కొనకండి. ఏ భాగానికా భాగం విడివిడిగానే కొనండి. అప్పుడైతే ఈ పుస్తకం పూర్తి మజా వస్తుంది. టేబుల్ లాంప్ వెలుతురులో కూర్చుని ఐ.ఏ.ఎస్ కి చదువుతున్నట్టు చదవాల్సిన పుస్తకం కాదిది. ఓ సారి మొత్తంగా చదివేసుకున్నాక అప్పుడో కాస్త, అప్పుడో కాస్త రుచి చూస్తూ ఉండాల్సిన రచన. అందుకే మనం ఎటెళ్లినా ఈ పుస్తకం తోడుగా ఉండాలి కాబట్టి అందుకు అనువైనదే కొనండి.)

Surely You’re joking, Mr. Feynman!

ఈ పుస్తకం పేరు విని, ఎవరిదీ పుస్తకం అని గూగుల్‍ని ఆరా తీస్తే, “ఫిసిక్స్ లో నోబెల్ ప్రైజ్ వచ్చిన ఆయనది” అని చెప్పింది. “ఓహో.. చదవాల్సిందే, ఓ నాలుగైదేళ్ళ లోపు” అని చదవాల్సిన జాబితాలో పెట్టి మర్చిపోయాను.

ఓ రోజెందుకో విపరీతమైన పని మధ్యలో “జోకింగ్” అనే అంశం మీద గూగిల్లాను, కారణాలేం లేకుండా. అప్పుడీ పుస్తకం మొత్తంగా ఆన్‍లైన్ లో కనిపించింది. “సరే.. చదివి చూద్దాం” అనుకొని మొదలుపెట్టాను. ఒక నాలుగు పేరాలు చదివేసరికే వత్తిడంతా మాయం! బుక్‍మార్క్ చేసుకొని, ఇంకో ఇద్దరి ఫ్రెండ్స్ కి “చదువుతారా, చస్తారా?!” టైపు మేల్ పెట్టి నేను నవ్వుతూ నవ్విస్తూ పనిచేసుకున్నాను.

“That one person could have so many wonderfully crazy things happen to him in one life is sometimes hard FeynmanJokingto believe. That one person could invent so much innocent mischief in one life is surely an inspiration!” అని ఉంటుంది ప్రీఫేస్ లో!

నిజమే! ఈ పుస్తకం గురించి నేనిప్పుడు మాట్లాడ్డం మొదలెడితే, “That’s a nice fictional character that you’re talking about!” అని మీరూ అన్నా అనవచ్చు, ఫీన్‍మెన్ గురించి ఇంతక మునుపే మీకు తెలీకపోతే! అసలు పుస్తకం చదవటం మొదలెట్టినప్పుడు నేనూ అనుమానపు బుద్ధితోనే చదివాను. “ఓ మనిషి, మరీ ఇంత అమందానందంతోనా, ఎప్పుడూ! ఎల్లప్పుడూ! లేదు, ఇందులో ఏదో మోసం, కుట్రా, దగా!” ఉంటాయనిపించింది. “నేను చాలా సంతోషపరుణ్ణి” అని ఈయనకి ఈయనే బా ఫోజు కొట్టగల మనిషైనా అయ్యుండచ్చు, లేదా జీవితం అనేది ఈయన మీద unusually kind ఏమో అన్నా అయ్యుండచ్చు. పుస్తకం మొదట్లోనే ఆయన కష్టాలు ఏకరవు పెట్టేసరికి, “హమ్మ్.. జీవితం ఈయన్నీ వదలేదన్న మాట!” అనుకుంటూ చదవసాగాను.

ఈ రచన్ని ఫీన్‍మెన్ ఆటోబయోగ్రఫీ అనచ్చో లేదో కానీ, ఇందులో అన్నీ ఆయన చెప్తున్నట్టే ఉంటాయి. అనుభవాలన్నీ (ఆయన చిన్నప్పటి నుండీ.. పుస్తకం రాసే వరకూ) ఆయన చెప్తూ పోతుంటే వేరొకరు రాశారట. (ఆ రాసిన మనిషికి చెయ్యెత్తి దణ్ణం పెట్టచ్చు.) ఉదృత్తంగా పొంగిపొర్లుతున్న నీటి దగ్గర నుంచున్నట్టు ఉంటుందీ పుస్తకం చదువుతుంటే. ఎడతెగని మాటలు, ఎన్నెన్నో అనుభవాలు, ఆ ఝరిలో మనమూ కొట్టుకుపోవాల్సిందే! ఒక ఫిసిసిస్ట్ అనుభవాలన్నప్పుడు, ఫిసిక్స్ ప్రస్తావన రాకుండా ఉండదు. అందుకని ఇదో ఫిసిక్స్ కి సంబంధించిన పుస్తకం అనుకోడానికి లేదు. ఇదో అపురూపమైన వ్యక్తిత్వానికి అద్దం పట్టే రచన. ఒక జీనియస్‍ని సృష్టించటంలో దేవుడు కనబరచిన వైవిధ్యం. నన్ను అడిగితే, ఈ పుస్తకం చదవకపోతే ఓ పుస్తకాన్నే కాదు, ఇంకా చాలా మిస్స్ అవుతారు.

Without Feathers – Woody Allen

నేను హాలీవుడ్ సినిమాలుwoody చూడను. అందుకని వుడీ అలెన్ గురించి నాకు నేనుగా వెళ్లి పుస్తకాలు వెత్తుక్కోవటం జరిగిందంటే, ఇందులో ఎవరిదో కుట్ర ఉండి ఉండాలని అనిపించచ్చు. కానీ, నేనే మళ్లీ ఊసుపోక ఏవో కోట్స్ వెతకటం, అందులో ఒక కోట్ నచ్చి, ఎవరిదా? అని చూడ్డం, వుడీ అలెన్ అనగానే ఆయన కోట్స్ అన్నీ వెతికి చదవటం, ఒక స్థాయిలో ఆయన మాటలు నచ్చేసి, అదే సాయంత్రం ఒడిస్సీకి చెక్కేసి ఆయన పుస్తకం ఒకటి పట్టుకున్నాను. ఒక్క ముక్క ఎక్కితే ఒట్టు. పైగా అందులో మన వీరప్పన్ గురించి వ్యాసం ఉంది. అదన్నా అర్థమవుతుందీ అనుకున్నాను. ఊహు! అసలు నేను ఒక ఇంగ్లీషు బుక్ కాక, మరేదో భాష చదువుతున్నా అని భావన కలిపించింది. దాన్ని అక్కడే వదిలేసి వచ్చేశాను.

ఆ తర్వాత కొన్ని రోజులకి “Without Feathers” చదివాను. వెనుకట్ట మీదే “దీన్ని ప్రయాణాల్లో గట్రా చదవకండి, మీరు విరగబడి నవ్వుతుంటే జనాలు వింతగా చూస్తారు మీకేసి” అన్న హెచ్చరికను పక్కకు పెట్టి మరీ రోజూ ఆఫీసుకు వెళ్లే దారిలో చదివేదాన్ని. విపరీతంగా నవ్వేదాన్ని. ఆయన సినిమాల్లో కామెడీ గురించి తెలీదు కానీ, రచనల్లో మాత్రం హాస్యం బా పండిస్తారు. ఈయన రచనల్లో ఎక్కువగా చోటు చేసుకునే అంశాలు: దేవుడు, మృత్యువు, మనుషుల మధ్య ప్రేమ. ఈ పుస్తకంలో వ్యాసాల కన్నా, నాకు నాటికలు బా నచ్చాయి. హాస్యం ఎటూ ఉంటుంది, కానీ కథనం కూడా వినూత్నంగా ఉంటుంది. ఆద్యంతాలు లేకుండా కథ చెప్పాలని ప్రయత్నిస్తారు ఓ నాటకంలో. మొదలైన చోటే కథ ముగిసేలా! బహుశా, జీవితాన్ని కూడా దేవుడు అలాగే రాసుంటాడు, అనిపించింది.

కాకపోతే వుడీ అందరి కోసం కాదు. ఆయన జోకులు / మాటలు / రచనలూ అందరినీ నవ్వించకపోగా కోపం తెప్పించొచ్చు. పైగా ఆయన చాలా మాటలు బుర్ర మీద నుండి వెళ్లిపోవచ్చు. అందుకని ఆవకాయను ఒక్కసారిగా నోట్లో పెట్టేసుకొని గెంతులేసే కన్నా, వుడీ అలవాటయ్యే వరకూ ఆర ఆరగా రుచి చూడమని నా సలహా! ఈ పుస్తకంలో కొన్ని కోట్స్ ఇక్కడ.

Zeno’s Conscience – Italo Svevo

వుడీ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి వుడీని తలదన్నే వాడుంటే, వాడింక ఎంత మాటకారో, హాస్యగాడో! “Too many gloomy Germans? This is a gloomy book zenos_conscience.largetoo but is also hysterically funny. More intellectual version of Woody Allen perhaps.” అన్న వాక్యంతో జినో పరిచయం జరిగింది.

వ్యాసంలో మొదట్లో అన్నానే “నాకు హాస్యం చదవటం రాదు” అని. ఆ అనుమానాన్ని పూర్తిగా తుడిపివేసిన రచన ఇది. ఈ రచన గురించి ఎక్కువ చెప్పను, కేవలం ఒక సన్నివేశాన్ని వివరిస్తాను.

“మన హీరో నాన్నగారికి ఓ అర్థరాత్రి పూట ఆరోగ్యం చెడుతుంది. పక్కగదిలో పడుకున్న మనవాడిని ఆ ఇంటి నౌకరు ఆదరాబదరాగా లేపుతుంది. లేచి, ఆ గదిలోకి వెళ్లి వాళ్ల నాన్న పక్కనే మంచం మీద కూర్చుంటాడు. వాళ్ల నాన్నకి ఊపిరాడ్డమే కష్టంగా ఉంటుందా సమయంలో. ఆయన ఉన్నట్టుండి ఎక్కువగా శ్వాస పీల్చుకోవటం ఆయాసపడుతూ, రొప్పుతూ! అది గమనించిన ఈ జీవి కూడా ఆయనంత వేగంగా ఊపిరి తీసుకుంటే ఎలా ఉంటుందో అని ప్రయత్నిస్తాడు. కానీ అంత వేగంగా ఊపిరి తీసుకోలేడు. “ఓహో.. ఇది వంట్లో బాలేని వాళ్లే చెయ్యగలరు. నేను కాదు” అని అనుకొని ఆ ప్రయత్నం విరమిస్తాడు.”

ఈ సన్నివేశంలో హీరో తన తండ్రిని మిమిక్ చేయటం ఎలా రాయబడిందంటే, నాకు నవ్వాగలేదు. అసలు ఇలాంటివి చదువుతున్నప్పుడు నాకా మనిషి మీద కోపమో, లేదా జాలో కలుగుతాయి సాధారణంగా. ఇది చదివేటప్పుడు మాత్రం నవ్వే ముందొచ్చింది. తీరిగ్గా ఆలోచిస్తే మిగితా వన్నీ పుట్టుకొచ్చాయి.

ఈ రచనపై ఓ వ్యాసం ఇక్కడ చదవండి.

తెలుగులో ముళ్ళపూడి గారి రెండు కోతికొమ్మచ్చులూ, కాంతం కథలు, శ్రీ రమణ గారి గుత్తొంకాయ కూర – మానవసంబంధాలు లాంటివేవో బాగానే చదివాను. కాకపోతే, తెలుగు పుస్తకాల లిస్ట్ ఉండదు కాబట్టి (ఇంగ్లీషు పుస్తకాలకైతే షెల్ఫారీ లాంటి ఆన్‍లైన్‍వి ఉంటాయి!) ఇప్పుడు గుర్తు చేసుకోవటం కష్టంగా ఉంది. 🙂

You Might Also Like

2 Comments

  1. chitralekha45

    థాంక్స్ మంచి పుస్తాకాలని పరిచయం చేసారు
    నేను వూడి అల్లెన్ పుస్తకం చదివాను.
    ఫెయ్న్మన్ పుస్తకం ఎలాగైనా చదవాలి

  2. rAsEgA

    ఈ లిస్ట్ లో చివరిది తప్ప మిగతావన్నీ నేను చదివేశానోచ్…
    జీనో పని కూడా పట్టాలి వీలు చూసుకుని.

    అయినా మీరు హిచ్‍హైకర్స్ గైడ్ గురించి రాస్తూ, మార్విన్ పేరు కూడా ఎత్తకపోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. Marvin fans మనోభావాలు దెబ్బతిన్నాయ్. We’re depressed 😛

Leave a Reply