మనుగడను నిర్దేశించే మంచి పుస్తకాలు

రాసిన వారు: విద్యాభూషణ్‌

విద్యాభూషణ్ సీనియర్ పాత్రికేయులు. ఉదయం, వార్త, ఆంధ్రభూమి, టివి9 వంటి సంస్థలలో పనిచేశారు. ప్రపంచీకరణ మీద రాసిన వ్యాసాల సంకలనం వెలువడింది.

(ఈ వ్యాసం మొదట ’వీక్షణం’ పత్రిక జనవరి 2010 లో వెలువడింది. వ్యాసాన్ని తిరిగి ప్రచురించేందుకు అనుమతించిన ’వీక్షణం’ సంపాదకులకి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
**************************
పుస్తకాలు నాకు ప్రియమైన నేస్తాలు. మన మేధో వికాసానికి దోహాదపడేవి మంచి పుస్తకాలే. అంటే బతుకు పుస్తకాలు అన్న మాట. ఎందుకంటే, సాధారణంగా సమస్త సామాజిక అంశాలు ఒకరికి అనుభవంలోకి రావు కదా. ఇలా ఆచరణలోకి, అనుభవంలోకి రాని అంశాల పట్ల అవగాహానను కల్పించేవే మంచి పుస్తకాలు. సామాజిక అంశాల పట్ల అవగాహానను పెంచే పుస్తకాలు మనలో ఆత్మవిమర్శను తట్టిలేపి, మనల్ని మనం సరిచేసుకునేలా దోహాదపడతాయి. చిత్తశుద్ధి ఉంటే, ఒక్కో సందర్భంలో అయితే, ఈ మంచి పుస్తకాలే మన జీవిత లక్ష్యాలను సైతం దిశా నిర్దేశనం చేస్తాయన్నా కూడా అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. ఇది నా అనుభవం నుంచి తెలుసుకున్న వాస్తవం.

ఇదే తరహాలో దిశా, లక్ష్యం లేకుండా, గాలివాటంగా తయారయ్యేందుకూ, మరో తరహా పుస్తకాలు, సాహిత్యం దోహాద పడుతూనే ఉంటాయి. అందుకే సామాజిక పరిణామ క్రమంలో సంస్కృతీ – సాహిత్యాలకూ అంత ప్రాముఖ్యత ఉంటుంది. నక్సల్బరీ ఉద్యమాల వెలుగు శ్రీకాకుళ కొండల్లో ప్రభావితం అవుతున్న వేళ అది. ఇప్పుడనిపిస్తుంది ఆనాటి డిటెక్టివ్‌ సాహిత్య తీవ్రతను పనిగట్టుకునే ప్రచారం చేస్తున్న ప్రయత్నం కుట్రపూరిత ధోరణేనేమోనని. కొమ్మినేని విశ్వమోహాన్‌ లాంటి ప్రబుద్ధుల రచనలను వేుము వేలం వెర్రిగా చదివేస్తూ, గంటల తరబడి శుష్క చర్చలతో కాలం వెళ్లబుస్తున్న రోజులవి. సుమారుగా 70వ దశకం పూర్వార్ధం. సరిగ్గా అప్పుడు అందింది భూషణం మాస్టారి ‘కొండగాలి’ నవల. కళ్లు తెరిపించింది. గిరిజన జీవితాలను ప్రత్యక్షంగా చూసినప్పటికీ, వారి జీవితాల పట్ల నాటి వరకూ ఉన్న వక్ర భాష్యాన్ని సరిదిద్దింది. జీవితపు విలువలను విడమర్చి దోపిడీ మూలాలను సాక్షాత్కరింపజేసింది. జీవితం అంటే ఏమిటో ఆవిష్కరించింది.

భూషణం మాస్టారి ‘కొండగాలి నవల నాలో ఓ కుదుపును కుదిపేసింది. శ్రీకాకుళ ఉద్యమ ప్రాంతంలోనే ఉంటున్నా ఉద్యమ లక్ష్యాలు అవగతం కాలే. కుటుంబ పెద్దల సూత్రీకరణలతో, అతి సమీపంగా పరిసర గిరిజనులను చూస్తున్నా, వారి దుర్భర జీవిత కారణాలు తెలియరాలే. కొండగాలి దోపిడీ మూలాల్ని ఆవిష్కరింప చేసింది. వారి ఆచార వ్యవహారాలను, కుల-మతాల పట్ల ఆ నిరక్షరాస్యుల్లో ఉన్న ఔన్నత్యాన్ని, మానవతను కళ్లకు కట్టినట్టు చిత్రీకరించింది. దాంతో ఆలోచనల్లో ఓ పెద్ద కల్లోలం. కుటుంబ స్నేహితుడైన మాస్టారితో చర్చించిన మీదటే ఉపశమనం. ఆ చర్చ నా పుస్తక పఠన గతినే మార్చేసింది.

సుమారు ఇందుకు కొనసాగింపుగా రంగనాయకమ్మ గారి ‘రామాయణ విషవృక్షం’ వచ్చింది. ఈ పుస్తక పీఠికే చాలు మొత్తం సామాజిక పరిణామక్రమాన్ని అవగతం చేసుకునేందుకు. ఫ్యూడల్‌ సాహిత్య లక్ష్యాలను పరిపూర్ణంగా బహిర్గతం చేస్తుంది. ఓ స్టడీ సర్కిల్‌గా సన్నిహిత మిత్రులతో కలిసి నిరంతరం ఓ చర్చగా ఈ తరహా పుస్తకాలను చదువుకోవడం అవగాహానా పునాదిని మరింత పటిష్టం చేస్తుందన్నది మరో అనుభవం. దీంతో అటు-ఇటుగా హేతువాద భావనలు తొలగిపోయి, పటిష్టమైన శాస్త్రీయ అవగాహాన కలిగేందుకు దోహాద పడిందీ పుస్తకం.

దీనికి వెనువెంటనే వచ్చిన జానకి విముక్తి నవల సామాజిక జీవనంలోని అనేకానేక పార్శ్వాలను చర్చిస్తుంది. నాస్తికవాదంతో మొదలుకొని, కుటుంబ సంబంధాలు, ప్రేమాపెళ్లి లాంటి అనేక విషయాలను విశదీకరించినందున ఓ కొత్త ఆలోచనకు బీజం వేస్తుంది. అవగాహాన-ఆచరణలకు ఉన్న ప్రాముఖ్యతను సూచనప్రాయంగా తెలియజేస్తుంది. విషయాన్ని తెలుసుకుంటే సరికాదు – ఆచరించినపుడే దాని ప్రభావం, ఫలితం ఉంటుందన్నది వివరిస్తుంది. ఈ సూత్రీకరణను ఓ సామాన్య స్త్రీ కమ్యూనిస్టుగా ఎదిగిన వైనాన్ని తనదైన శైలిలో చాలా ఆసక్తికరంగా రంగనాయకమ్మ గారు అందించారు. బోధనలు చేస్తున్నవారి ఆచరణను గమనించేలా వెన్నుతడుతుందీ పుస్తకం. ఒక్క మాటలో చెప్పేది – చేసి చూపించాలంటుంది.

ఇటీవల కాలంలో చదివిన పుస్తకాల్లో ఆనాటి స్పందనా తీవ్రతను కలిగించిన పుస్తకం ఎన్‌. వేణుగోపాల్‌ రాసిన పరిచయాలు. సాధారణంగా ఏదైనా పుస్తకం ఓ నిర్దిష్ట అంశానికే పరిమితం కావడం పరిపాటి. కానీ ‘పరిచయాలు పుస్తకం మాత్రం పూర్తిగా భిన్నం. అనేకానేక మంది లబ్ధప్రతిష్టులైన వ్యక్తులు, భిన్న రంగాల్లో చేసిన కృషిని, విశిష్టతను విశదీకరించే కదంబం. ఆయా విశిష్ట వ్యక్తుల వ్యక్తిత్వాలను తెలుసుకునేలా చేస్తుంది. అందుకే ఇది విశిష్ట వ్యక్తిత్వ పరిమళాల కదంబం అని అనిపిస్తుంది. జీవిత స్వానుభవాలను సమీక్షించుకునేలా చేస్తుంది. ఇంతమంది వ్యక్తిత్వాల పరిశీలనా, అందునా సుమారు నలభై మంది విశిష్ట వ్యక్తుల వ్యక్తిత్వాల విశ్లేషణ ఈ పుస్తకం. ఇందులో కొద్దిమంది వ్యక్తులతో ఉన్న అరాకొరా పరిచయంతో ఏర్పర్చుకున్న అంచనాలను రచయిత విశ్లేషణతో సరిపోల్చుకోవడం లేదా బేరీజు వేసుకోవడం ఓ కొత్త అనుభవాన్నిస్తుంది. ఆయా వ్యక్తుల ఆచరణ పట్ల అభిప్రాయాన్ని బలపరుస్తుంది. ఇక పరిచయం లేని వ్యక్తుల విషయంలో అయితే, వారి సేవల విశిష్టతను తెలుసుకునేందుకు దోహాద పడుతుంది. వ్యక్తిగతంగా సన్నిహితంగా పరిచయం ఉన్న వ్యక్తుల విశ్లేషణను చదువుతున్నప్పుడైతే, ఆయా వ్యక్తులను మన కళ్లెదుటే నిల్పిన అనుభూతిని కల్పిస్తుంది. దీంతో చదువుతున్న పుస్తకాన్ని తక్షణం మూసేసి, వారితో మన అనుభవాలను మననం చేసుకునేలా చేస్తుంది. అందుకే రచయిత తన ముందుమాటలో చెప్పిన ‘మరణించిన మనుషులను స్మృతుల్లో బతికించుకోవడానికి చేసిన పరిచయాలివి’.

పరిచయాలు పుస్తకంలో వేణుగోపాల్‌ ప్రస్తావించిన వ్యక్తుల్లో పాలకుర్తి ఐలమ్మ ఒకరు. ఇంతవరకూ తెలంగాణ పోరాట ప్రస్తావనలో సందర్భోచితంగా ఐలమ్మ పేరు వినడమే జరిగేది. పరిచయాల్లోని ఆమె పరిచయం ద్వారా తెలంగాణ విమోచనోద్యమంలో ఐలమ్మ పోరాట పటిమ ఎంత స్ఫూర్తిదాయకంగా నిల్చిందో అన్న విషయం అవగతమైంది.

మనిషి నిస్సహాయతే నిష్క్రమణగా పరిణమిస్తుందనే వాస్తవాన్ని ఉటంకిస్తూ ఈశ్వరి గురించి రాసిన విశ్లేషణ మరో మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తుంది. తనకు తానుగా చేయని నేరానికి ఎలా బలైపోయిందీ వివరిస్తుంది. ఈ వివరణలో ప్రగతిశీల భావాల మాటున అమానవీయత ఎంతటి దుర్మార్గాన్ని ఎగజిమ్ముతుందీ చెప్తుంది. ఓ మిత్రుని ద్వారా ఆమె ఎదుర్కొన్న అసహాయ పరిస్థితులను విన్న ఉదంతం – ఈ విశ్లేషణతో మరోసారి పునరావలోకనం జరిగింది. నిస్సహాయ పరిస్థితిలో తీసుకున్న నిర్ణయం – చివరకు నిష్క్రమణే తన ప్రతీకారంగా భావించాల్సిన అనివార్య పరిస్థితులకు నెట్టేయబడింది. తాను స్త్రీ అయినందునే, చెప్పనలవి కాని అవమానాలకు, దౌర్జన్యానికి గురైందన్న విశ్లేషణ మనసును కలచివేయడవేు కాదు, వంచనా ప్రవృత్తులకు భాష్యం చెప్పినట్టయింది. ఇలా ఎందరో?

మానవతకు ప్రతిరూపంగా నిల్చిన కాళోజీ విశ్లేషణ మరోకోణం. తరతమ భేదం లేకుండా బాధాతప్త ప్రజలను అక్కున చేర్చుకుని అండగా నిల్చిన మానవీయుడు కాళోజీ. అందుకే సమస్య ఉన్న ప్రతీచోటా కాళోజీ ఉంటూ ప్రజలను మించిన ఆత్మబంధువుల్లేరని తన కలాన్ని, గళాన్ని వినియోగించాడు. నిర్దిష్ట విశ్లేషణకు కొరుకుడు పడని కాళోజీ ఆచరణకు స్పష్టమైన విశ్లేషణ పరిచయాలులో ఉంది. అయినా కవిగా, అనువాదకుడుగా ఆయన శక్తి గురించీ, ఆయన తన జీవితపర్యంతమూ అనుసరించిన ఆదర్శం గురించి అంచనా కట్టవలసింది ఇంకా ఎంతో ఉందని, ఆ పనిచేయడమే ఆయనకు తగిన నివాళి అని ముగింపు నివ్వడం మరింత ఆలోచింపజేసేదిగా ఉంది.

కాళోజీ గురించి ప్రస్తావించిన వెనువెంటనే నిర్దిష్ట లక్ష్యంతో ఆశయ సాధనకై నిబద్ధతతో పనిచేసిన స్నేహాశీలి జనార్దన్‌ సార్‌ గురించి చదువుతున్నప్పుడు, గుండె గొంతులోకి వచ్చిన అనుభూతి. బహుశా ఇందుకు కారణం ఆయనతో ఉన్న కొద్దిపాటి పరిచయవేు కావచ్చు. ఆయనకు ఎంత జ్ఞాపకం అంటే, వార్త దినపత్రిక వెలువడిన తొలినాళ్లలో శంకర్‌గుహా నియోగి వర్ధంతి సందర్భంగా నేను రాసిన నియోగి చిరంజీవి వ్యాసాన్ని గుర్తుపెట్టుకుని, ఆ తరువాత కాలంలో ఎప్పుడు ఎదురైనా, నియోగీ చిరంజీవి అనే పలుకరించే వారు. ఆదివాసుల సమస్యలపై కృషి చేయడవేు తన కార్యాచరణగా నిర్దేశించుకున్న నిబద్ధత ఆయనది. అందుకే కృషి సంఘీభావ కమిటీ పేరున ఆదివాసీ తెగలకు పెద్ద దిక్కూ అయ్యారు. ఈ కథనంలో జేబులో చెయ్యి పెట్టుకుని నిష్కల్మషంగా మనసారా నవ్వుతూ పలకరించే జనార్దన్‌ కళ్లెదుట సాక్షాత్కరిస్తారంటే అతిశయోక్తి కాదు.

ఈ క్రమంలోనే కవి, చిత్రకారుడు, ఫొటోగ్రాఫర్‌ అయిన అలిశెట్టి ప్రభాకర్‌ గురించి రాసిన వ్యాఖ్యానం. సమకాలీన రాజకీయాలపై ఆయన కవితాభివ్యక్తి సాటిలేదు. నగరంలో రోడ్ల పరిస్థితులపై సిటీలైఫ్‌లో రెండు మాటల్లో ఆయన చెప్పిన వైనం, ఎవరి కాళ్లకు వాళ్లే బాధ్యులం – నగరంలో రోడ్ల గుంతలు. ఎంత సూటిగా, సూక్ష్మంగా ఉంది. అకాల అనారోగ్యం, భరోసాలేని జీవన వైనంతో కలగలిసినా ఆయన్నెప్పుడూ కుంగదీయలేదు. ఎప్పుడు కలిసినా నవ్వుతూ, నిండు కుండలానే మాట్లాడే వారు. బతుకు భారమైన నేపథయం నుంచి వచ్చినందునేనేమో ఆయన గీతల్లో, అక్షరాల్లో కోట్లాది మంది అభాగ్యుల పట్ల తపనే కన్పిస్తూ, వినిపిస్తూండేది. పరిపూర్ణ స్త్రీ పక్షపాతిగా అనిపిస్తాడు ప్రభాకర్‌. ఆయన రాసిన వేశ్య చిన్న కవితలోనూ, విషాద సాక్షాత్కారం అన్న కవితలోనూ, చివరికి ‘మరణం నా చివరి చరణం కాదు’ అని తన మరణానికి ముందు రాసిన కవితలో తన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించి స్ఫూర్తిదాతగా నిలిచాడు. ఇన్ని విధాలుగా అలిశెట్టి వివరాలను పరిచయాలు పుస్తకం అందిస్తుంది.

కార్మిక సంఘాలూ – కార్మిక సంఘ నాయకులూ కేవలం వేతన బేరసారాలకే పరిమితం అవుతున్న తొలినాళ్లలో అసలు కార్మిక సంఘ నాయకుల బాధ్యత ఎంటన్నది గుర్తెరిగేలా చేసింది శంకర్‌గుహా నియోగి. వ్యక్తిగా వ్యవస్థ మార్పుకై ఆయన చేసిన కృషి, ఆయన్నో ‘శక్తిగా నిరూపించింది. ఇప్పటికీ సుమారు 33 ఏళ్ల క్రితమే ఛత్తీస్‌ఘడ్‌ ఇనుప ఖనిజ గని కార్మికుల పని – వేతన పరిస్థితుల మెరుగుదలకై కాకుండా కాంట్రాక్ట్‌ లీడర్‌ పద్ధతికై ఉద్యమించి సాధించిన విజయం ఈనాటికీ మార్గదర్శకం. చిత్తశుద్ధే సమస్య పరిష్కారానికి క్రియాశీలకం అవుతుందనీ తన ఆచరణ ద్వారా నిరూపించాడు నియోగి. కార్మికుల మెరుగైన జీవితం కోసం సారాయి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించి మహిళలను భాగస్వాములుగా చేస్తూ, మహిళా ముక్తి మోర్చా ఏర్పాటు, కార్మికుల్లో అక్షరాస్యతను పెంచేందుకై విద్యాకార్యక్రమాల నిర్వహాణకై పాఠశాలల ఏర్పాటు, ఇలా బహుముఖంగా విస్తరించిన నియోగి నేటికీ చిరంజీవి. నియోగి ధాటికి తట్టుకోలేని పెట్టుబడిదారీ వర్గం ఆ ప్రాంతం నుంచి ఆయన్ని బహిష్కరించే యత్నం చేసింది. అయినా ఈ ప్రజల మనిషిని ఏమీ చేయలేకపోయింది. నిశిరాత్రి నిద్రపోబోతున్న నియోగిని కుట్రపూరితంగా ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ కాల్చి చంపింది. అయినా నియోగి వ్యక్తిత్వ పరిమళాలు అక్కడికే పరిమితం కాకుండా విస్తరిస్తూనే ఉన్నాయి. నియోగి వ్యక్తిత్వ ఆవిష్కరణ ముందుతరాలను మరింత ప్రభావితం చేస్తుందనడం అతిశయోక్తి కాదు.

ఇలాగే ‘చిరస్మరణ నవలతో చిరపరిచితుడుగా మెదులుతున్న ‘నిరంజన’పై వ్యాఖ్యానం ఎన్నో తెలియని విషయాలను తెలుసుకునేలా చేస్తుంది. నిరంజన అన్నది ఆయన కలం పేరు. ఆయన పేరు కళకుండ శివరావు అని, పాత్రికేయునిగా జీవితం ప్రారంభించి, జనవిముక్తికై చేసిన కృషి అసాధారణం అనిపిస్తాయి. ఒంటరిగానే విజ్ఞాన సర్వస్వం పేరిట ఏడు సంపుటాలను వెలువర్చడం, నాలుగు వందల దేశాల కథలను సేకరించి అనువాదం చేయించి, ఇరవై ఐదు సంకలనాలుగా వెలువర్చడం అపూర్వం. తీవ్ర అనారోగ్యంలో ఇంతటి సాహాసాన్ని చేసిన ఈ కన్నడ రచయిత ప్రజల పక్షాన నిల్చి కన్నడ సాహిత్య ప్రగతిశీలతకు ఆద్యుడు అయ్యారు. ఇంతటి ‘చిరస్మరణీయులు మన నేల మీదనే హైదరాబాద్‌లోనే మరణించారన్న విషయం ఊపిరి సలపనివ్వదు.

ఈ విధంగా అనేక రంగాల్లో నిర్దిష్ట లక్ష్యంతో తమ జీవితాలనే అంకితం చేసిన పలువురు విశిష్ట వ్యక్తుల కృషినీ, ఆచరణనూ పాఠకులకు అందించిన సరికొత్త ప్రయోగం నిజంగా విశిష్టమైందే. ఆయా వ్యక్తుల అనుభవాలను చదువుతున్నప్పుడు పొందిన ‘స్ఫూర్తి మనల్ని మనం ఆత్మ విమర్శ చేసుకునేందుకు దోహాదపడుతుంది. ఇంత వరకూ ఏం చేశాం? మున్ముందు ఏం చేయాలి? ఎలా చెయ్యాలి? అన్న ఆలోచనకూ గురిచేస్తుంది. ఫలితంగా మనల్ని మనం సరిచేసుకోవడంతోనే సరిపెట్టకుండా, వివిధ ధోరణులతో నీరుగారుతున్న మన స్థైర్యాన్ని, వెన్నుతట్టి కార్యోన్ముఖులుగా చేస్తుందనడంలో అనుమానం లేదు. అదీ మనకి మనం ‘చిత్తశుద్ధితో పరిశీలించుకున్నప్పుడే. అదే లేకుంటే ఈ కథే లేదు.

పుస్తకాలు – పుస్తక పఠనం మనిషి జీవితానికి, మనుగడకు ప్రేరణను కలిగించేవే కాదు, ఓ సమున్నత థిగా నడిపించే మార్గ దర్శకాలు కూడా. జీవితవేు సమస్యలమయం అయినప్పుడు, దైనందిన మనుగడకు ఆశను కల్పించి మున్ముందుకు నడిపించేవి ఈ పుస్తకాలే. అలసిన మనసుకు ఊరటనిచ్చేవీ ఈ పుస్తకాలే. అనవసర కాలయాపన కోసం వెచ్చించే సమయాన్ని మరిన్ని మంచి పుస్తకాల అధ్యయనం కోసం వెచ్చిద్దాం. మరోసారి ఇలానే కలబోసుకుందాం.

You Might Also Like

2 Comments

  1. కొత్తపాళీ

    వీక్షణం అదే సంచికలో ఎన్. వేణుగోపాల్ గారి వ్యాసం కూడ ఆసక్తి కరంగా ఉంది. దాన్ని కూడా ఇక్కడ ప్రచురించే వీలుందేమో చూడండి.

  2. ఆనంద్

    పుస్తక సమీక్షతో పాటూ పబ్లిషర్ వివరాలు, ఎప్పుడు ప్రచురించారు, పుస్తకం ఎక్కడ దొరుకుతుంది కూడా తెలియజేస్తే బావుంటుంది.

Leave a Reply