నాకు నచ్చిన నవల స్కార్లెట్‌ లెటర్‌

రాసినవారు: ఎస్. జీవన్ కుమార్

జీవన్ కుమార్ మానవహక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు. ఇంగ్లిషు అధ్యాపకులుగా పనిచేసి రిటైరయ్యారు.

(ఈ వ్యాసం మొదటిసారి ’వీక్షణం’ పత్రిక జనవరి 2010 సంచికలో వచ్చింది. తిరిగి పుస్తకం.నెట్ లో ప్రచురించడానికి అనుమతించిన వీక్షణం సంపాదకవర్గానికి ధన్యవాదాలు.)
*****************************
scarlet letterనన్ను బాగా ప్రభావితం చేసిన నవల అమెరికన్‌ నవలాకారుడు నథానియెల్‌ హాథర్న్‌ రచించిన స్కార్‌లెట్‌ లెటర్‌’. నేను ఎం.ఎ.లో పాఠ్యాంశంగా చదివిన తర్వాత, ఈ నవలను డిగ్రీ విద్యార్థులకు సి.కె.ఎం. కాలేజీ (వరంగల్‌) లో బోధించే అవకాశం లభించింది. చాలా కథల్లో, నవలల్లో స్త్రీని ప్రేమమూర్తిగా, త్యాగశీలిగా దయామణిగా చిత్రించడం చూసాం. కాని నథానియెల్‌ హాథర్న్‌ ఈ నవలలో చిత్రించిన, సమాజంలో పతితగా ముద్ర పడ్డ స్త్రీ హోస్టర్‌ పెన్నిని చూస్తే మనకు అంతులేని గౌరవం, పూజ్యభావం కలుగుతాయి. ఆమె హిమాలయాల కన్న ఎత్తైన స్త్రీమూర్తిగా మనం భావిస్తాం.

అమెరికాలోని న్యూ ఇంగ్లండ్‌ (ఇప్పటి మసాచుసెట్స్‌) రాష్ట్రంలోని ఒక గ్రామం ఈ కథకు కేంద్రం. కథకాలం పదిహేడవ శతాబ్దం. అది అన్ని గ్రామాల్లాంటి ఒక గ్రామం. ఆరోజుల్లో క్రైస్తవ మతం పూర్తిగా సమాజాన్ని శాసిస్తుండేది. నేరము, నేరానికి శిక్ష, పాపము, పాప పరిహారం పూర్తిగా క్రైస్తవ డాక్ట్రిన్‌ ప్రకారవేు అమలు అవుతుండేది.

ఆ గ్రామంలో ఒకరోజు మధ్యాహ్నాం ప్రజలంతా ఊరి మధ్యలోని న్యాయాన్ని చెప్పే గద్దె దగ్గర సమావేశమవుతారు. ఊరి జైలు లోంచి చెడిపోయిన ఆడది, పతిత నేరం మోపబడ్డ హోస్టర్‌ పెన్ని అనే స్త్రీ తన చేతుల్లో అప్పుడే జన్మించిన ఒక ఆడశిశువును ఉంచుకొని బయటకు వస్తుంది. అక్రమంగా శిశువుకు జన్మనిచ్చినందుకు ఆరోజు ఆమెను విచారించి శిక్షవేయాలి. రెండు సంవత్సరాల క్రితం ఆమె యూరప్‌ నుండి ఈ ఊరు వచ్చింది. తర్వాత భర్త వస్తాడని చెప్పింది. కాని ఆయన రాలేదు, బహుశా సముద్రయానంలో మరణించి ఉండవచ్చని అందరూ అనుకున్నారు. భర్త లేకుండా శిశువును కన్న నేరానికి ఆమెను, దీనికి కారకుడైన పురుషుణ్ని విచారించి ఇద్దరికీ శిక్ష విధించవలసి ఉంది. అందుకే చాలా ఆసక్తితో అందరూ ఆ ఊరి మధ్యలో గుమిగూడుతారు. పూర్తి విచారణ జరగకముందే అక్కడి ఆచారం ప్రకారంగా ఆమె మెడలో ‘ఎ’ అన్న స్కార్లెట్‌ లెటర్‌ వేలాడదీసారు. ఇంగ్లిష్‌లో అడల్ట్రీ (పతిత) అన్న పదంలోని మొదటి అక్షరం ఆ గుర్తు. ఆ పాపని గుండెలకు హాత్తుకుంటూ తన మెడలో ఉన్న స్కార్లెట్‌ లెటర్‌ను చూసుకుంటూ, సిగ్గుతో తలవంచుకొని అందరి ముందు నిలబడుతుంది. ప్రజలందరి సమక్షంలో విచారణ చేస్తారు. ఆ గుంపులోంచి ఒక కొత్త వ్యక్తి హోస్టర్‌ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘అసలీమే ఏం నేరం చేసింది?’ అని పక్క వ్యక్తిని అడుగుతాడు. ‘ఈమె వివాహిత స్త్రీ, భర్త దగ్గర లేకున్నా తప్పుడు మార్గంలో శిశువును కన్నది. అందుకు ఆమెకు శిక్ష వేస్తారు’ అని ఆ పక్క వ్యక్తి అంటాడు. ‘అయితే అందుకు కారకుడైన పురుషుణ్ని ఏం చేయరా?’ అని అడుగుతాడు. ‘ఆమె ఆ వ్యక్తి ఎవరో చెప్తే ఆయనను కూడా శిక్షిస్తారు’ అని ఆ గ్రామస్తుడంటాడు. కాని హోస్టర్‌ తనను ఈ స్థితికి నెట్టిన పురుషుడి పేరు చెప్పదు. మతగురువు గద్దించి అడిగినా కూడా ససేమిరా చెప్పదు. హోస్టర్‌ అకస్మాత్తుగా ఆ గుంపులో ఉన్న కొత్త వ్యక్తిని చూసి చకితురాలౌతుంది. ఆ వ్యక్తి కూడా తన పెదాలపై వేలు పెట్టి వద్దనట్టు సంజ్ఞ చేసి మాయమవుతాడు. హోస్టర్‌కి శిక్ష ఖరారై జైలుకు వెళుతుంది. ఆ కొత్తగా వచ్చిన వ్యక్తి, తన పేరు రోజర్‌ అని, తాను వైద్యుడనని చెప్పుకొని గ్రామంలో వైద్యుడుగా చలామణి అవుతుంటాడు. ఒకరోజు జబ్బు పడ్డ హోస్టర్‌కు వైద్యం చేయాలనే నెపంతో డాక్టర్‌ రోజర్‌ జైలులోకి వెళ్లి హోస్టర్‌ను కలుస్తాడు. నిజానికి అతడు హోస్టర్‌ భర్త. భార్యను ముందు పడవలో ఎక్కించి, తను ఆలస్యంగా బయలుదేరతాడు. రెండేళ్లు దారితప్పి కష్టాలు పడి సముద్ర ప్రయాణం చేసి చివరకు హోస్టర్‌ చేసిన నేరాన్ని విచారించే రోజు గ్రామం చేరతాడు. తన భార్యను ఆ స్థితిలో చూసి హాృదయం ముక్కలవుతుంది. దీనికంతా తను ఆమెతో రాకుండా ఉండడవేు కారణమని బాధపడతాడు. జైలులో ఎంత ఒత్తిడి చేసినా ఆమెను ఈ పరిస్థితికి తెచ్చిన వ్యక్తి పేరు చెప్పడానికి హోస్టర్‌ ఒప్పుకోదు. వాళ్లిద్దరు భార్యా భర్తలన్న విషయం ఎట్టి పరిస్థితి లోనూ గ్రామంలో తెలియకూడదని ఆయన నుంచి మాట తీసుకుంటుంది. రోజర్‌ మాత్రం కోపంతో, పగతో రగిలిపోతుంటాడు. తన భార్యకు ఇంత అన్యాయం చేసి తన సంసారంలో నిప్పులు పోసిన ఆ వ్యక్తిని కనుక్కొని శిక్షించాలని నిర్ణయించుకుంటాడు.

ఆ ఊరి మత గురువు ఆర్థర్‌ డిమ్స్‌డౌన్‌ గ్రామంలో బాగా మర్యాద పొందే వ్యక్తి. ఆయన చర్చ్‌లో చేసే మత బోధనలు, ఇచ్చే ఉపన్యాసాలు ప్రజలు చాలా భక్తి భావంతో వింటూ, ఆయనను దాదాపు దైవ సమానుడుగా గౌరవిస్తుంటారు. ఆయన ఆరోగ్యం ఏదో తెలియని కారణంచే క్షీణిస్తూ ఉంటుంది. డాక్టర్‌ రోజర్‌ను ఆయనకు ప్రత్యేక వైద్యుడుగా గ్రామస్తులు నియమిస్తారు. మత గురువు ఆర్థర్‌, డాక్టర్‌ రోజర్‌ దగ్గరి స్నేహితులవుతారు. ఆర్థర్‌ దేహా పరిస్థితి కక్షుణ్నంగా ప్రతిరోజూ పరిక్షీంచే రోజర్‌కు ఆయనకు భౌతిక రుగ్మతలు లేవని, ఏదో తీవ్రమైన మానసిక వ్యథతో కృశించి పోతున్నాడని అర్థం అవుతుంది. మూడేళ్ల శిక్ష తర్వాత హోస్టర్‌, తన పాప పెరల్‌తో బయటకు వచ్చి ఊరికి దూరంగా చిన్న గుడిసె నిర్మించుకుని జీవనం మొదలు పెడుతుంది. ఆమె బట్టలపై స్కార్లెట్‌ లెటర్‌ మాత్రం అట్లాగే ఉంటుంది. ఊరి వాళ్లకు బట్టలు కుట్టిచ్చి పొట్ట పోసుకుంటుంది. గ్రామంలో రోగులకు సేవచేయడం, ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకోవడం, వృద్ధులను, పిల్లలను అక్కున చేర్చుకొని సపర్యలు చేయడం ఆమె పనిగా పెట్టుకుంటుంది. ఏ రాత్రైనా, పగలైనా, భయంకరమైన వాతావరణ పరిస్థితుల్లో ఉంటూ అందరికి తలలో నాలుకగా మెసులుతుంటుంది. ఆమె సేవాతత్పరత చూసి ప్రజలు ఆమె మెడలో ఉన్న స్కార్లెట్‌ లెటర్‌ను మర్చిపోతారు. పెరుగుతున్న పాప పెరల్‌ కూడా శిశువుగా ఉన్నప్పటి నుంచి చూస్తున్న ఆ గుర్తు తన తల్లి శరీరంలో భాగం అనుకుంటుంది. భర్త ఉండి కూడా తన పాపకు ఆయన గురించి చెప్పకుండా, తాను కూడా అతనితో అపరిచిత వ్యక్తిగా మసులుకుంటూ ఉంటుంది.

దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత డాక్టర్‌ రోజర్‌ మత గురువు ఆర్థర్‌ తన భార్యను మోసం చేసిన వ్యక్తి అని గ్రహిస్తాడు. ఈ విషయం హోస్టర్‌కు చెప్పి ఆర్థర్‌పై ప్రతీకారం తీసుకుంటానంటాడు. కాని హోస్టర్‌ మాత్రం ఎట్టి పరిస్థితిలో మతగురువుపై కసి, ప్రతీకారం గురించి ఆలోచించకూడదని వేడుకొంటుంది. రోజర్‌ మాత్రం తన వైద్య పద్ధతుల ద్వారా రకరకాల మార్గంలో మతగురువును క్షోభకు గురిచేస్తూ ఉంటాడు. ఊర్లో ప్రజలు హోస్టర్‌ సేవను ఆదరించినా ఆమె కళంకిత కాబట్టి కూతురు పెరల్‌ను తల్లి సాంగత్యంలో ఉంచకుండా తల్లికి దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. కాని మతగురువు ఆర్థర్‌ మటుకు తల్లి బిడ్డలను విడదీయకుండా సకల ప్రయత్నాలు చేస్తుంటాడు. కాలం గడిచిన కొద్దీ, ఆర్థర్‌ ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తుంది. మానసిక వ్యథతో అఖాతంలోకి కృంగిపోతుంటాడు. రోజర్‌ తన మాటలతో, చేష్టలతో ఆర్థర్‌ను హింసిస్తుంటాడు. ఒకనాడు అకస్మాత్తుగా గ్రామ కూడలిలో ఆర్థర్‌, హోస్టర్‌ను కలుస్తాడు. తనవల్ల జన్మించిన కూతురును దగ్గరకు తీసుకుంటాడు. తాను చేసిన పాపాల్ని అదే కూడలిలో నిల్చొని ప్రజల మధ్య ప్రకటిస్తానంటాడు. కాని హోస్టర్‌ ఒప్పుకోదు. ఈ వెలి నుంచి, ఈ మనుష్యుల నుంచి దూరంగా పారిపోదామంటుంది. నాలుగు రోజుల తర్వాత బయలుదేరే ఓడలో గ్రామం విడిచి పారిపోదామను కుంటారు. మతగురువు సరే అంటాడు. రోజర్‌ పగ తీవ్రత హోస్టర్‌కు బాగా తెలుసు. తన భర్త ఎట్లైనా ఆర్థర్‌ను చంపుతాడు. తన పతనానికి కారణమైన వ్యక్తిని చంపడం హోస్టర్‌కు ఇష్టం ఉండదు. అందుకే గ్రామం నుంచి పారిపోవడానికి ఆర్థర్‌ను ఒప్పిస్తుంది. కాని ఆర్థర్‌ మాత్రం తాను చేసిన పాపంతో దహించుకపోతుంటాడు. రోజు రోజుకు కృంగిపోయి జీవచ్ఛవంలా తయారవుతాడు. ఒకసారి గ్రామంలో జరిగే ఎన్నికల రోజు గ్రామపెద్దలు, ప్రజలు అంతా కూడలిలో కలుస్తారు. అక్కడ చేరిన గుంపులో హోస్టర్‌, ఆమె కూతురు కూడా ఉంటుంది. గద్దె మీద నిల్చుని ఉపన్యసిస్తున్న ఆర్థర్‌ కిందికి దిగి వాళ్లిద్దర్నీ పైకి తీసుకొచ్చి, జనం ఆశ్చర్యంగా చూస్తుండగా, హోస్టర్‌కు వేసిన శిక్షకు కారకుడు తనే అని ప్రకటిస్తాడు. ఏడేళ్ల క్రితం ఇదే స్త్రీ పక్కన నిలబడి నేరస్తుడిగా ఉండవలసిన తను, ఈ గొప్ప స్త్రీ వల్ల తప్పించుకుని తిరుగుతున్నాను అంటాడు. తాను చేసిన పాపాన్ని దేవుడు క్షమిస్తే హాయిగా మరణిస్తానంటాడు. తాను ప్రజల్ని మభ్యపెట్టి, ఈ స్త్రీ వల్ల గౌరవమైన వ్యక్తిగా బతుకుతున్నా దేవుడు తనను కనిపెడ్తూనే ఉన్నాడంటూ, కోపంతో తన కోటును చింపి కిందకూలిపోతాడు. ఆయన ఛాతి చర్మంపై స్కార్లెట్‌ లెటర్‌ చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. జీవితంలో పగ తీర్చుకోవడవేు తన లక్ష్యంగా పెట్టుకున్న డాక్టర్‌ రోజర్‌, మతగురువు మరణించడంతో, తన లక్ష్యం చేజారిపోయిందని, తన జీవితం అర్థరహితమైపోయిందని మానసికంగా కృంగి కొద్దిరోజుల తర్వాత మరణిస్తాడు.

హోస్టర్‌ మాత్రం ఇవన్నీ జరిగినా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుంది. కూతురు పెరల్‌కు ఇదంతా ఏమీ అర్థం కాదు. తన తల్లి మెడలో ఉన్న స్కార్లెట్‌ లెటర్‌ ఆమె శరీరంలో భాగంగానే భావిస్తుంది. కష్టాల్లో ఉన్న ప్రజలు, రోగులు మాలిన్యానికి చిహ్నామయిన ఆ స్కార్లెట్‌ లెటర్‌ తమ పాలిట ఆత్మబంధువుగా భావిస్తుంటారు. ప్రజలు ఆమె పాపాన్ని మరిచిపోయి ఆమెను ప్రేమమూర్తిగానే చూస్తుంటారు. స్కార్లెట్‌ లెటర్‌ మాత్రం ఆమె మరణించే వరకు ఆమెను అంటి పెట్టుకునే ఉంటుంది. తల్లి మరణం తర్వాత పెరల్‌ అదే గ్రామంలో నివసిస్తూ ఉంటుంది.

ఈ నవలలో హోస్టర్‌ పాత్ర పాఠకుల్ని కలచివేస్తుంది. కోపం, కసితో రగిలిపోవలసిన ఆమె మంచితనం, ఉదారత్వం మనలాంటి మామూలు మనుషులు అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. ఈ నవల చదివిన తర్వాత స్త్రీ పట్ల ఉండే గౌరవం నాకు వంద రెట్లు రెట్టింపు అయింది. బాలగోపాల్‌ జీవిత త్యాగం గురించి మాట్లాడుతూ ‘రాజకీయ విశ్వాసాల కోసం, సామాజిక గమ్యం వైపు పయనించే థిలో నిబద్ధతతో ప్రాణత్యాగాలు చేసే వారుంటారు. కాని సమాజంలో ఒక స్త్రీ మాత్రమే ఏ ఐడియాలజీ కోసం కాకుండా, ఏమీ స్వార్థం లేకుండా తన జీవితమంతా త్యాగం చేస్తుంది’ అంటాడు.

అన్యాయానికి గురై సమాజంలో వెలివేయబడ్డ స్త్రీ మూర్తి హోస్టర్‌ పెన్నిలో కూడా ఇదే కనబడుతుంది.

గూగుల్ బుక్స్ లో ఇక్కడ చదవండి.

You Might Also Like

One Comment

  1. శ్రీనిక

    జీవన్ కుమార్ గారూ,
    చాలా కాలం తర్వాత ఈ నవల గురించి చదవడం చాలా ఆనందంగా ఉంది. నిజానికి ప్రతి మహిళ చదివితీరాల్సిన నవల. చాలా చక్కగా వర్ణించారు. ధన్యవాదాలు.

Leave a Reply