అనుభూతుల్ని అక్షరాలుగా వెదజల్లే కవిత్వం..!

రాసిన వారు: పెరుగు రామకృష్ణ

పెరుగు రామకృష్ణ గత పాతికేళ్ళుగా కవిగా ,వ్యాస రచయితగా సుపరిచితులు..ఆరు పుస్తకాల తర్వాత 2006 లో తన “ఫ్లెమింగో” వలస పక్షుల దీర్గ కవితతో సాహితీ లోకానికి దగ్గరై తెలుగు కవి, తెలుగుకే పరిమితం కాకూడదు-భారతీయ కవిగా మిగలాలని ఆశిస్తూ తన కవిత్వాన్ని ఆంగ్లంలో ఎప్పటికప్పుడు అనువదింపచేసి ఎన్నో వెబ్ జర్నల్స్ లో, వెబ్ సైట్స్ లో ప్రచురణ పొంది,కేంద్ర సాహిత్య అకాడెమీ చే రెండు సార్లు ఆహ్వానిత కవిగా పాల్గొని,వారి ఇండియన్ లిటేరేచుర్ లో ప్రచురణ అయి పలు పురస్కారాలు అనంతరం 2008 సర్వధారి ఉగాది నాడు నాటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి డా.వై.ఎస్స్.ఆర్.ద్వారా విశిష్ట కవి పురస్కారం అందుకుని ఉన్నారు..వృతి రీత్యా నెల్లూరు లో సహాయ వాణిజ్య పన్నుల అధికారి.

*******************************

“Like a piece of ice on a hot stove the poem must ride on its own melting. ” ~Robert Frost

nisabdamneedalloముకుంద రామారావు (1946 )లో పుట్టింది,ఖరగపూర్, పశ్చిమ బెంగాల్ లో అయినా ,వృతి రీత్యా చానాళ్లు హైదరాబాద్ , బెంగుళూర్ లలో వుండి పదవీ విరమణ అనంతరం తిరిగి హైదరాబాద్ లో స్థిరపడ్డారు.. నదిలా ఇన్ని ప్రాంతాలు ప్రవహించినా సముద్రం లాంటి కవిత్వంతో కరచాలనం వీడలేదు..”వలసపోయిన మందహాసం”(1995 ) తొలి కవితా సంపుటి తో తెలుగు సాహితీ వేదికపై అరంగేట్రం చేసిన ఈ కవి అనుభూతుల్ని అక్షరీకరించడం లో అందే వేసిన చేయి అనిపించుకున్నారు .. కవిత్వం అంటే ఈయన మాటల్లో

“తీరాన్ని తాకుతున్న అలలు
ఇసుక మేట మీద సుడిగాలి
గాలి ఆడిస్తున్న మేఘాలు
ఆకాశంలో పక్షుల గుంపులు.”….

ఇలా ప్రకృతితో మమేకమయ్యారు కాబట్టే సున్నితమైన అనుభూతుల్ని కవిత్వీకరించ గలుగుతున్నారు… 2000 లో “మరోమజిలీకి ముందు “ 2004 లో “ఎవరున్నా లేకున్నా” కవితా సంపుటిలు ప్రచురించి 2005 లో మొదటి రెండు గ్రంధాల కన్నడ అనువాదం “వలస హోద మంద హాస” వెలువరించారు…2008లో “నాకు తెలియని నేనెవరో” వచన కవిత్వం తో అందరి మెప్పు పొంది ఆ గ్రంధానికి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారం అందుకొన్నారు.. వీరి కవితలు హిందీ,ఉర్దూ,బెంగాలి,మరాఠి,కన్నడ భాషల్లోకి అనువదించబడి అక్కడి పాటకుల్నిఅలరించాయి.. పలు ప్రసిద్ద సంకలనాల్లో ,వార్షికల్లో, వెబ్ సైట్ లల్లో వీరి కవిత్వం నమోదైంది..ఇటీవల డిసెంబర్ 2009లో “నిశ్శబ్దం నీడల్లో “ కొత్త కవిత్వం మనుమలు శివెన్,నిస్చెయ్ .మనుమరాండ్రు నేహాకృతి,సుప్రియ,నిశిత ల చేత ఆవిష్కృతమైంది..

అలతి అలతి పదాలతో అద్భుతమైన కవిత్వ సృష్టి చేయడం ఈ కవి నైపుణ్యం…అలాంటి నలభై కవితలు ఈ సరికొత పుస్తకంలో మన ముందుకొచ్చాయి. కూతురు గురించి సంక్షిప్త కవితలో ఎంత సమగ్రంగా ఆవిష్కరించారో చూడండి…
(కూతురు)
ఉదయమెప్పుడూ
కూతురు లానే
అందంగా,ఆప్యాయంగా వస్తుంది

ఉన్నంతసేపూ ఉత్సాహమే
చీకటిలో కూరుకు పోకుండా
చంద్రుడ్ని వెలిగించి
లోనున్న నక్షత్రాల్ని బయటకులాగి
కనుమరుగుతున్న సూర్యుడిలా
తనింటికి అమ్మాయి


గుర్తు చేసే ఎన్నెన్నో
జాడల్ని వదిలి…

– అతి సామాన్యమైన పదాలతో ఆకర్షణీయమైన కవిత్వం చేసే సత్తా కలిగిన ఈయన మన తెలుగు కవి కావడం మన భాగ్యం..వచనాన్ని మాత్రమే రాసి గొప్ప కవిత్వంగా ఉప్పొంగి పోయే కవులమధ్య ఈయన కవిత్వం వెలుతురు మొలకలై ,పచ్చదనాన్ని పరుస్తుంది ఆహ్లాదపు తివాచీలా వుంటుంది ..
(వెలుతురు మొలకలు)
ఆకాశంలో నక్షత్రాల్లా
పాప జల్లిన అక్షరాలు
పెరట్లో పూలమోక్కల్లా
పాప పేరుస్తున్న పదాలు
మడుగుల్లో పైరు పంటల్లా
పాప వాక్యాల పేరాలు
వెలుతురు మొలకలు
నీడలు
ప్రతిబింబాలు

– మనసు లోతుల్లో నలిగి నలిగి కవిత్వంగా వెలువరించక తప్పనిసరైనపుడే పద్యం రాస్తాడీకవి.. సూక్ష్మమైన మానవ సంబంధాలని ఎంత లోతుగా తొంగి చూస్తారో చూడండి..
(మార్పు)
నిన్నో మొన్నో
ఎత్తుకు తిప్పినట్టున్న
పాపేనా ఈమె
అప్పుడే ఉదయించిన కళ్ళతో
సాయంత్రాన్ని చూస్తున్నట్టుంది

జీవితాన్ని గొప్ప తాత్విక కోణంలో తరచి చూచే కవిగా రామారావు మనకు దర్శనమిస్తారు ఎన్నో చోట్ల..

(దగ్గరయ్యాక)
వెళ్ళటం రావటం
రెండూ అయిపోయాయి
నిట్టూరుస్తూ అన్నాడతను
తిరిగొచ్చాక

లేదు
రావటం వెళ్ళటం
రెండూ అయిపోయాయి
దీనంగా అందామె అక్కడనుంచి
వెళ్ళినట్టూ లేదు
వచ్చినట్టూ లేదు
ఇద్దరికీ ఇప్పుడు

ఇలా ఎన్నో అనుభూతుల్ని లలిత లావణ్యంగా అందమైన కవిత్వంగా పూవులలోని తేనెను తూనిగలు త్రాగినంత సహజంగా చదువరులకు చేర్చే కవి మన తెలుగు జాతి సొంతం..ఇంకా జాలరి ,మరణించిన పక్కింటాయన, వెబ్ స్నేహం ,నాయకత్వం ,నదితో ఒక రోజు ,పదవీ విరమణ,బెలూన్తో ఆడే మనవడు అది పగిల్తే ఎలా వోదర్చాలి – లాంటి పలు వైవిధ్య భరితమైన వస్తువుల్ని కవిత్వరీకరించిన తీరు అమోఘం..ప్రతి పాఠకుడిని నిరంతరం వెంటాడే కవిత్వమిది..

ఆయన మాటల్లో ఇంకా కవిత్వమంటే…
(కవిత్వమంటే)
అశరీర ఆత్మ నిశ్శబ్ద నాట్యం
ఇదీ అదని ఎన్ని చెప్పినా
జీవితాన్ని మరణాన్ని
పూర్తిగా విప్పిచేప్పలేనట్టు
కవిత్వం

సంక్షిప్త పదాల్లో సంపూర్ణ జీవితానుభావాల్ని,అనుభూతుల్ని రంగరించి రమణీయంగా మనసుకు ఉత్సాహం,ఉల్లాసం కలిగించే ముకుంద రామారావు కు మనఃపూర్వక అభినందనలు..!

పుస్తక వివరాలు
నిశ్శబ్దం నీడల్లో -పేజీలు -64 -వెల -రు 50 /-
ప్రతులకు: విశాలాంద్ర,నవోదయ,ప్రజాశక్తి దిస పుస్తక కేంద్రాలు,హైదరాబాద్

You Might Also Like

7 Comments

  1. పుస్తకం » Blog Archive » మరో మజిలీకి ముందు

    […] పై ఇక్కడ, మరియు 'నిశబ్దం నీడల్లో' పై ఇక్కడ. – పుస్తకం.నెట్] (No Ratings Yet)  Loading […]

  2. perugu

    సమీక్ష మెచ్చిన అందరికీ ధన్యవాదాలు..!

  3. కొత్తపాళీ

    చాలా బావుందండీ

  4. sailajamithra

    తెలుగు సాహిత్యంలో ముకుంద రామారావు పోయట్రికి ఒక ప్రత్యేకత ఉంది. సున్నితమైన పదాలతో కవిత్వాన్ని పలికించగల శక్తి ఆయనలోనే ఉందనడంలో అతిశయోక్తి లేదు…అలంటి కవులు అందరికి తెలియాలి. అర్థంకాని అక్షరాలతో, ప్రాసే కవిత్వమనుకునే కవులకు ముకుందరామారావు కవిత్వం ఒక మచ్చు తునకలు. అలాంటి గొప్పవారిని పరిచయం చేసిన పెరుగు రామకృష్ణ గారికి అబినందనలు.

  5. అఫ్సర్

    కవిత్వంలో సంక్షిప్తతా, సారళ్యం మనం అందుకోవాల్సిన లక్ష్యాలు. ఆ దారిన హాయిగా నడుచుకుంటూ వెళ్లిపోతున్న పథికుడు ముకుంద రామారావు గారు. ఆయన కవిత్వంలోని సరళమయిన ఆ లోతుని లోనారసి చూసిన సమీక్ష రామకృష్ణ గారిది. మంచి సమీక్ష రాసినందుకు రామకృష్ణ గారికీ, అచ్చు పత్రికలకి కూడా సాధ్యం కాని మంచి ప్రమాణాలతో ఇలాంటి సమీక్షల్ని వెలుగులోకి తెస్తున్న ‘పుస్తకం.నెట్’ కీ అభినందనలు.

  6. perugu

    బాబా గారు ..మీ అభిమానానికి ధన్యవాదాలు..!

  7. బొల్లోజు బాబా

    wonderful review

    ఈ పుస్తకంలో ఒక కవి తాను చూసిన, అనుభవించిన, దైనందిక విషయాలను ఇంత రమ్యంగా, లోతుగా ఎలా చెప్పగలిగారబ్బా అని చాలాచోట్ల ఆశ్చర్యపోతూ నిలిచిపోవాల్సి వచ్చింది. అద్బుతమైన కవిత్వమిది. తేటతేట మాటల్లో లోతైన భావాల్ని పలికించటం సామాన్యమైన విషయం కాదు. ఒక ఇస్మాయిల్ గారు సాధించగలిగారు అలా. ఇదిగో మరలా అలాంటి కవిత్వం ఈ రూపంలో మనముందుంది.

    ఈ పుస్తకాన్ని పరిచయం చేయాలని అనుకుంటూ, కొన్ని పనులవత్తిడిలో చేయలేకపోయాను.

    ఇప్పుడు ఈ సమీక్షను చూసాకా ఇంత అందంగా చేయలేనేమోననిపిస్తుంది. రామక్రిష్న గారికి అభినందనలు.

    భవదీయుడు
    బొల్లోజు బాబా

Leave a Reply to perugu Cancel