2009లో నా పుస్తకాలూ! – 1

Mihaly Csikszentmihalyi’s Flow:

September 2008:

నేను: యమా అర్జెంటుగా నేను సీరియస్ నాన్‍ ఫిక్షన్ మొదలెట్టాలి. ఏవైనా సూచించగలరా?
ఫ్రెండ్: ఏ సబ్జెక్ట్?
నేను: ఏదైనా పర్లేదూ.. సైకాలజీ అయితే బాగుంటుందనుకుంటాను.
ఫ్రెండ్: అయితే మిహలి రాసిన “ఫ్లో” ఆండ్ “క్రియేటివిటీ” అనే పుస్తకాలు చదవటం మంచిది. అది మంచి ఆరంభమవుతుంది.

అప్పట్నుండీ ఈయన పుస్తకాల కోసం వెతికి వెతికి వేసారి పోయాను. ఎట్టేకేలకు ఒడిస్సీలోనో ఎక్కడో పుస్తకం దొరికింది 2009 మొదట్లో! చదవటం మొదలెట్టాను.. చదువుతూ ఆవలించాను, నిద్రపోబోయాను. అలా ఒక్కసారి కాదు, చాలా సార్లు. చదివిందే చదవటం, మళ్ళీ మళ్లీ ఆవలించటం సరిపోయింది. ఒకానొక దశలో నిద్ర రావటానికి ఈ పుస్తకం పట్టుకొని కూర్చునేదాన్ని. అలా, అలా పుస్తకం పూర్తి చేయకుండానే ఏడాది గడిచిపోతుందనుకున్నాను.

Flowపుస్తకాలు చదవటం వల్ల జీవితం పట్ల మన వైఖరి మారుతుందని అందరికీ అనుభవమే! పుస్తకం చదివేసి, అందులో సారాంశాన్ని జీర్ణించేసేసుకొని జీవితాన్ని ఆనందం గడిపేసిన తీరును గురించి అనేక కథనాలు వింటూనే ఉంటాం. నాకు రివర్స్ గేరులో తిక్క కుదిరింది. చదవనని మొండికేసి కూర్చున్న విద్యార్థిని చెవి మెలేసి, గోడ కూర్చీ వేసి పాఠం వల్లవేయ్యించేలాంటి టీచరు రూపంలో కాలం / విధి / జీవితం / దేవుడు / మరే విధంగా పిల్చుకునేదైనా నాక్కూడా బుద్ధి చెప్తున్న సమయంలో నేను ఈ పుస్తకాన్ని చదివాను. అప్పటి వరకూ లేత పసుపు తిరగబోతున్న పేజీల మీదున్న నల్లని అక్షరాలు కాస్తా, పౌరాణిక చిత్రాల చివర్లో ఎన్.టి.ఆర్ విశ్వరూపం ఇచ్చినట్టు కనిపించసాగాయి. ప్రతీ వాక్యంలోని అర్థం, అంతరార్థం ఉన్నట్టుండి సందేహాలకి తావులేనంత సుస్పష్టంగా తెల్సొచ్చాయి. మొదట్లో నిద్ర పుచ్చిన అక్షరాలే, ఇప్పుడు లోలోపల  నిద్రాణ్ణమై ఉన్నదాన్ని తట్టి లేపాయి.

ఇదేదో.. పర్సనాలిటీ డెవల్ప్ మెంట్ పుస్తకం కాదు. పొద్దున్నే లేవండి – పరిగెత్తండి, మీ బాస్ ని ఐస్ చేసుకోండిలా అంటూ ఊదరగొట్టే పుస్తకం కాదు. మనం చేసే ప్రతీ చిన్న పనిలో అత్యుత్తమమైన ఆనందాన్ని ఆస్వాదించగల కారణాలేంటో ఇందులో విశ్లేషిస్తారు. “మీరూ ఇలా చేయండి – మీకూ ఇలానే అనుభవం అయ్యిపోతుంది”* అని మచ్చుకు కూడా చెప్పరు. తాను చేసిన రీసెర్చ్.. అందులో పాల్గొన్న వారి అనుభవాలను మనతో పంచుకున్న తీరు మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది. నేను మొదట్లో అన్న నిద్ర పోవటం ఈ పుస్తకంలో ఉన్న కంటెంట్ గానీ, నరేషన్ గానీ కారణాలు కావు. ఒక పుస్తకానికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా, “నేనే మూడ్‍లో ఉన్నా నన్ను చదివించగలిగింఛే పుస్తకం మంచి రచన” అని విర్రవీగటం. ఆ తిక్కనూ కుదిర్చిందీ పుస్తకం.

నేర్చుకోటానికి ఈ పుస్తకంలో చాలా విషయాలు కనిపించాయి నాకు. ఆనందం కోసం పడిగాపులు కాసే బదులు, మనదైన తీరులో దాన్ని ఎలా మెరుగుపర్చుకోవచ్చో తెల్సింది. బోరింగ్ మీటింగ్లూ, వంటిరి నడకలూ అప్పుడు మన మెదడుకి ఆసక్తికరమైన పనేదో అప్పజెప్తే ఎంత శ్రేయస్కరమో చర్చిస్తారు. ఇందులో పగటి కలల (మితిమీరక హద్దుల్లో ఉండే కలలు) వల్ల ప్రయోజనాలు చెప్తారు. తప్పకుండా ఓ సారి చదవాల్సిన పుస్తకం. ఏదో విధంగా ప్రతీ ఒక్కరికీ పనికొస్తుందనే నమ్మకం. నేనీ పుస్తకం పరిచయం ఇక్కడ సరిగ్గా చెయ్యలేదని ఒప్పుకుంటాను. చదవాలనుకునేవారు మాత్రం తప్పక ప్రయత్నించి చూడండి. అంతర్జాలంలో కూడా దీనిపై చాలానే సమాచారం ఉంది.

ఇది చదవటం పూర్తయ్యాక, క్రియేటివిటీ పుస్తకం కనిపించినా కొనలేదు. ప్లోలో ఫుల్‍గా మునిగి తేలేక అప్పుడు చూద్దాం అని!

*******************************************************************************************

మరో విడతలో మరిన్ని కొన్ని పుస్తక విశేషాలు పంచుకునే ప్రయత్నం చేస్తాను. (Conditions Applied :P)

You Might Also Like

6 Comments

  1. Purnima

    Wow! Rushdie speaking on Calvino’s Cosmicomics.. can’t get better..

    http://www.npr.org/templates/story/story.php?storyId=93376041

    I quote:

    “If you have never read Cosmicomics, you have before you 12 of the most joyful reading experiences of your life.”

  2. పుస్తకం » Blog Archive » నన్ను చదివే పుస్తకం..

    […] వీళ్ళెవ్వరూ కాకపోతే కొత్త మోజైన మిలన్ కుందేరా? కర్ట్ వాన్‍గట్? ఓహ్ నో.. కాల్వినో! […]

  3. రామ

    చాలా బాగుంది. మీరు చదివిన పుస్తకాల మాటేమో కాని, మీ సమీక్షలు చాలా తొందరగా చదివించాయి. తరవాతి పేజి నెంబర్ మీద నొక్కి, “ఇంకా లోడ్ అవదు ఏమిటిరా బాబూ” అనుకున్నా రెండు సార్లు :). విపులం గా వ్రాసినందుకు ధన్యవాదాలు. భవిష్యత్తులో నాకు రెఫెరెన్సు గా తప్పక పనికి వస్తుంది ఈ లిస్టు (మొన్న చదివిన జంపాల గారి లిస్టు కూడా – ఇవన్నీ చూస్తూ ఒక మనిషి ఒక సంవత్సరం లో ఎన్ని చెయ్యచ్చో తెలుస్తోంది – కొండొకచో కిందటి ఏడాది నేను ఏమి చేసి ఉండల్సిందో కూడా).

  4. Rao S Vummethala

    Nice article. The author successfully takes along with her. Good work.
    Keep it up Poornima garu!

  5. సౌమ్య

    Good article!!

Leave a Reply