వనవాసి

వ్యాసం రాసిపంపినవారు: సుజాత(మనసులో మాట) – నా స్వపరిచయం ప్రత్యేకంగా ఏమీ లేదు. జర్నలిజం చదువుకుని కొద్ది రోజుల పాటు పని చేసాను. రంగనాయకమ్మ, కొడవటిగంటి కుటుంబరావు,నామిని గారి రచనలంటే బాగా ఇష్టపడతాను. జీవితాన్ని నిజాయితీగా ఆవిష్కరించే ఏ రచనైనా నా అభిమాన రచనే! ఇంకా చదవని, వెదుకుతున్న పుస్తకం క్రిస్టఫర్ రీవ్(హాలీవుడ్ సూపర్ మాన్) రాసిన still me! ఏ పనైనా చేస్తూ సరే పుస్తకాలు చదవగలను. వంట చేసేటపుడు కూడా పుస్తకం చేతిలో ఉండాల్సిందే! రాయడం అంటే బద్ధకం, చదవడం అంటే ఎక్కడ లేని ఉత్సాహం!

కొన్ని పుస్తకాలు చదువుతున్నపుడు అంత ఆసక్తిగా అనిపించకపోయినా పూర్తయ్యేసరికి ఒక గాఢమైన నిట్టూర్పు వెలువడక మానదు. కనీసం ఒక పదినిమిషాలన్నా అప్పటికప్పుడు ఆలోచనల్లో పడెయ్యక మానదు. ఆ తర్వాత పదే పదే గుర్తుకు రాకా మానదు.ఆ కోవలోదే “వనవాసి” నవల!

ఇది నవలా? సామాజిక ప్రయోజనం కోసం రాసిన డాక్యుమెంటరీ రచనా? ఒక ఏకాంత స్వాప్నికుడి జీవిత ప్రయాణంలో భాగమా? అని తలెత్తే ప్రశ్నలకు ఎవరికి వారు సమాధానం చెప్పుకోవలసిందే!

అప్పుడెప్పుడో పథేర్ పాంచాలి నవల చదువుతుంటే ముందు మాటలో భిభూతి భూషణ్ వంద్యోపాధ్యాయ గారి మరో నవల ‘అరణ్యక” గురించి చదివి దానికోసం ప్రయత్నిస్తే అది దుర్లభమని తేలింది.
vanavaasi1అనుకోకుండా ఆ మధ్య విజయవాడలో పాత పుస్తకాల షాపులో వనవాసి మొదటి ప్రచురణ కాపీ,(1961 లో సాహిత్య అకాడేమీ తరఫున అద్దేపల్లి అండ్ కో రాజమండ్రి వారు వేసింది) దొరికింది. చాలా జాగ్రత్తగా చదవాల్సి వచ్చింది. కొన్ని పేజీలు  పట్టుకుంటే పొడి అయిపోయేలా ఉన్నాయి.

ఇందులో కథంటూ పెద్దగా ఏమీ ఉండదు. ఉండేవల్లా ఆలోచనలే! రచయిత కథకుడిగా మారగా అతని మెదడులో ప్రాణం పోసుకుని హృదయం ద్వారా మనలోకి ప్రవహించి మనలో కూడా ఆలోచనల్ని రేకెత్తించే ఆలోచనలు!

విద్యావంతుడై ఉన్నత సంస్కారం కలిగిన ఒక బెంగాలీ యువకుడు సత్యచరణ్ బాబు!ఉద్యోగార్థియై తిరుగుతుండగా పాత స్నేహితుడు కనపడతాడు. మాటల మధ్యలో తమకు పూర్ణియా జిల్లాలో 30 వేల బిఘాల (బిఘా అంటే సుమారు 40 సెంట్ల నేల)ఎస్టేట్ అడవి ఉందనీ దాని బాగోగులు చూస్తూ అడవిని వ్యవసాయానికి  కౌలుకిస్తూ వసూళ్ళు చూసే మేనేజర్ అవసరం ఉందని చెప్తాడు. ఏ పనికైనా సిద్ధంగా ఉన్న సత్యచరణ్  తాను ఆ ఉద్యోగం చేస్తానని ఒప్పుకుని అడవికి ప్రయాణమవుతాడు. ఒకవైపు కలకత్తా నగరాన్ని “మిస్”అవుతానేమో అన్న బెంగతోనే, అయిష్టంగానే పొట్టకూటికోసం అడవికి వెళతాడు.

ఎటుచూసినా అడవి, నిశ్శబ్దమైన అడవి, జన సంచారం లేని అడవి,కొద్ది మంది జనం ఉన్నా.. గిరిజనులు! వారి భాష అర్థం కాదు! బంధుమిత్రులు, పాటకచేరి, లైబ్రరీ,సాహిత్యం లేని జీవితాన్ని ఎన్నడూ ఎరగని సత్యచరణ్ ఈ జీవితాన్ని చూసి కుంగిపోతాడు.

కానీ రోజులు గడిచేకొద్దీ,అరణ్య సౌందర్యం అతన్ని వ్యామోహంలా ఆవహిస్తుంది.ఎంతగా అంటే కొన్నాళ్ళకి తిరిగి కలకత్తా నగరానికి పోలేనేమో అని భయం వేస్తుందతనికి!

అపూర్వ రక్తారుణ రాగరంజిత మేఘమాలలు ధరించిన సంధ్యలూ,ఉన్మాదిని అయిన భైరవీ స్వరూపం ధరించిన ఉగ్ర మధ్యాహ్నాలు,హిమస్నిగ్ధ వనకుసుమపరిమళంతో జ్యోత్స్నాలంకారాలతో ఎన్నో గంభీర నిశీధులు అతన్ని కట్టి పడేస్తాయి.అడవి కాచిన వెన్నెలే సార్ధకం అని నిర్ధారిస్తాడు అతడు.ఏకాంతంలో దిగంతాల వరకూ వ్యాపించిన వెన్నెల్ని అనుభవించి అడవిలో వెన్నెల రాత్రిని చూడని వారి జీవితంలో ఈశ్వర సృష్టిలో ఒకానొక అద్భుత సౌందర్యానుభూతి నష్టపోయినట్లే అంటాడు.

ఒకపక్క అడవిని నరికించి కౌలుకిస్తూనే ఆ చుట్టుపక్క పల్లెల్లో పేద జీవితాల దరిద్రం వికృత స్వరూపాన్ని చూసి నిర్ఘాంతపోతాడు. ఆకలితీర్చుకోడానికి పచ్చి మినప్పిండి  తినేవారిని చూస్తాడు.పిల్లల ఆకలి తీర్చడానికి ఎంగిలాకుల కోసం ఆశపడుతూ, రేగుపళ్ళు దొంగతనం చేసి శిక్షకు సిద్ధమయ్యే అద్భుత సౌందర్యరాశిని చూస్తాడు. డబ్బుతో తనను కొనాలని చూసే భూస్వామిని చూస్తాడు. గొర్రెలు కాస్తూ ఒక ఆటవిక తెగకు రాజుగా పరిచయమయ్యే ముసలివాడిని కలుస్తాడు.

మొక్కలమీద ప్రేమతో ఎక్కడెక్కడినుంచో పూలతీగలు తెచ్చి సరస్వతీ మడుగు వద్ద నాటి అడవిని సప్తవర్ణ శోభితం చేయాలనుకునే బన్వారీని చూసి ముగ్ధుడవుతాడు.అతడితోపాటు మడుగు చుట్టూ అద్భుత పుష్ప వనాన్ని సృష్టిస్తాడు.పూలతో పందిరి వేస్తాడు.కోతల సమయంలో ఎక్కడెక్కడినుంచో వచ్చి పని చేసే కూలివాళ్లను, వాళ్ల కష్టాన్ని దోచుకునే చిల్లర వ్యాపారులనీ పరికించి నిశ్చేష్టుడవుతాడు.

కొన్నాళ్ళకి…మొత్తం అడవంతా నరికి కౌలుకివ్వడం పుర్తవుతుంది. ఇక సరస్వతి మడుగు ప్రాంతాన్ని ఇవ్వడానికి ఎంతో దుఃఖపడినా లాభం లేకపొతుంది.ఇక అతడికి అక్కడ పనేముంది?

భారమైన మనసుతో ఇరుకు వీధుల కలకత్తా నగరానికి తిరుగు ప్రయాణమవుతాడు.vanavaasi2

తిరిగి వచ్చాక కూడా అతన్ని అడవి జ్ఞాపకాలు వదిలిపెట్టవు. వేధిస్తాయి.

అడవుల మనుగడ, వాటిమీద ఆధారపడి బతికే ఆదిమజాతుల మనుగడ,కరువైపోతున్న ప్రాణవాయువు…పచ్చదనం, వీటన్నిటిగురించీ రచయిత ఏమీ మాట్లాడడు. ఉపన్యాసాలివ్వడు. గగ్గోలుపెట్టడు.ప్రశ్నించడు.

కానీ ఆ పని మనచేత చేయిస్తాడు!

ఒక కల్లోలాన్ని రేకెత్తిస్తాడు మెదడులో!
“అడవులంతరించిపోతే?” అని నెమ్మదిగా పాకే ఆందోళనని మనలో సృష్టిస్తాడు.
కుంత,బన్వారీ,భానుమతి,రాజూపాండే,థాతురియా,నక్ఛేదీ, కవి వెంకటేశ్వర ప్రసాద్…వీళ్ళందరినీ మనకు అంటగట్టి తను మాత్రం నిశ్చింతగా ఉంటాడు.

అడవిలోని ప్రతి చిన్న సౌందర్యానికీ ముగ్ధుడయ్యే భిభూతి ప్రసాద్ ని ఈ నవల్లో చూడొచ్చు. వెన్నెల రాత్రుల వర్ణన పుస్తకంలో చాలా చోట్ల ఉంటుంది.

ఏకాంతంలో తనకు మాత్రమే గోచరమయ్యే ఆ అద్భుత వన సౌందర్యానికి పరవశుడై కవితావేశంతో స్పందిస్తాడు.రాగరంజితమైన మేఘాలను,దిగంతాల వరకూ వ్యాపించి జ్యోత్స్నా ప్లావితమై నిర్జనమైన మైదాన  ప్రాంతాలనూ చూసి” ఈ  స్వరూపమే ప్రేమ!ఇదే రొమాన్స్! కవిత, సౌందర్యం,శిల్పం, భావుకత. ఈ దివ్యమంగళ రూపమే మనం ప్రాణాధికంగా ప్రేమించేది.ఇదే లలిత కళను సృష్టించేది. ప్రీతిపాత్రులైన వారికోసం తనను తాను పూర్తిగా సమర్పించుకుని నిశ్శేషంగా మిగిలిపోయేది. తిరిగి విశ్వ జ్ఞాన శక్తినీ, దృష్టినీ వినియోగించి గ్రహాలను, నక్షత్ర లోకాలనూ, నీహారికలనూ సృష్టించేది ఇదే..” అంటాడు.

విద్యావంతుడైన సత్యచరణ మూఢనమ్మకాలకు విలువనివ్వడు. అడవి దున్నలకు ప్రమాదం రాకుండా ఎప్పుడూ కాపాడే ఒక దేవుడి గురించి ఆదివాసీలు చెపితే కొట్టిపారేస్తాడు. కలకత్తా వచ్చాక ఒకసారి రోడ్డు పక్కన నడుస్తూ….బరువు ను లాగలేక ఇబ్బంది పడుతున్న ఒక దున్నపోతుని బండివాడు చెర్నాకోలాతో ఛెళ్ళున కొట్టడం చూసి చలించి “ఆ వనదేవత ఇక్కడుంటే ఎంత బావుండు”అని  అప్రయత్నంగా అనుకుంటాడు.

ఇలాంటి అద్భుత సన్నివేశాలు, అపూర్వమైన వనసౌందర్య వర్ణనలూ, ఆదివాసీల జీవితంలో దరిద్ర దేవత విశ్వరూపం,
ప్రతి పేజీలో కనపడతాయి.

ఈ పుస్తకం చదవాలంటే కేవలం పుస్తకం చదవాలన్న ఆసక్తి చాలదు. ఆ తర్వాత వెంటాడే యదార్థ జీవిత వ్యథార్త దృశ్యాలు,అడవుల మనుగడ పట్ల రేగే ఆలోచనలు, మనసంతా ఆక్రమించే ఆదివాసీ పాత్రలు, అన్నానికి, రొట్టేలకూ కూడా నోచుకోక గడ్డిగింజలూ, పచ్చి పిండీ తినే దృశ్యాలు, ఒక్క రొట్టె కోసం పన్నెండు మైళ్లు నడిచి వచ్చే   పేదలూ..వారిని దోచే భూస్వాములూ..వీటన్నింటినీ  భరించగలిగే శక్తి మనసుకు ఉండాలి. ఒక హాయిని, వేదనను ఒకేసారి కలిగించే  భావాన్ని  భరించగలగాలి. అప్పుడే ఈ పుస్తకం కొనాలి. ఇది కాఫీ టేబుల్ బుక్ కాదు. మస్ట్ రీడ్ బుక్!

vanavaasi_newఈ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ఇప్పుడు అందుబాటులోకి తెచ్చారు. ప్రకాశకులు చెప్పినట్లు ఈ పుస్తకం అవసరం రచనాకాలం కంటే ఇప్పుడే ఎక్కువ. మరీ ఎక్కువ.

స్వర్గీయ శ్రీ సూరంపూడి సీతారామ్ గారు అనువదించిన ఈ పుస్తకం ఇప్పుడు అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతోంది. వెల నూట ఇరవైరూపాయలు!

అడవిలోని ప్రతి చిన్న సౌందర్యానికీ ముగ్ధుడయ్యే భిభూతి ప్రసాద్ ని ఈ నవల్లో చూడొచ్చు. వెన్నెల రాత్రుల వర్ణన పుస్తకంలో చాలా చోట్ల ఉంటుంది.

You Might Also Like

29 Comments

  1. సత్యవతి కొండవీటి

    ఎప్పుడూ అడవులు,కొండలు పట్టుకు తిరిగే నేను “వనవాసి” నవల చదివిన పారవశ్యంలోంచి బయటకి రావడం ఇష్టంలేక…సత్యచరణ్ మళ్ళీ కలకత్తాకి రావడం భరించలేక ఈ నవల చివరి అధ్యాయం చదవడం మానేసా…ఎప్పటికీ చదవలేనేమో…

  2. భారతీయ నవల | పుస్తకం

    […] విభూతిభూషణ బందోపాధ్యాయ – వనవాసి ఈ పరిచయం చివర్లో ఒకటే మాట చెప్తారు వీరలక్ష్మి గారు “ఈ నవల చదవనివారికి ఈశ్వర సృష్టిలో ఒకానొక సౌందర్యానుభూతి నష్టపోయిందన్నమాటే”. ఈ మాట చదివాకా నవల కొని రేండేళ్ళు అవుతున్నా ఇంకా చదవనందుకు సిగ్గుపడ్డాను. (ఈ పుస్తకంపై పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసం ఇక్కడ.) […]

  3. పుస్తకం » Blog Archive » హైద్రాబాద్ పుస్తక ప్రదర్శన, 2010 – నేను కన్నవి, కొన్నవి

    […] ఆసక్తికరమైన పుస్తకాలు కనిపించాయి. వనవాసి, రైలు బడి, బెంగళూరు నాగరత్నమ్మ జీవిత […]

  4. హెచ్చార్కె

    @రాజశేఖర రాజు: చాల బాగా చెప్పారు. సుజాత గారు ఆ మాటల్ని తీసుకున్న పద్ధతి కూడా చాల బాగుంది. ఎక్కడో ఏదో మిస్సవుతున్నాం. పట్టుకోలేకపోతున్నాం. పేదలు, భూస్వాములు వైరుధ్యం సరే. అది ప్రజాపోరాటాల ద్వారా పరిష్కారం కావలసిందే. అడవుల్లోనే కాదు, మైదానాల్లో కూడా.
    ప్రకృతి రామణీకత, ప్రాకృతికతని జయించడం మీద ఆధారపడే అభివృద్ధి… ఈ రెండింటిలో దేన్ని వదులుకోడానికీ సిద్ధంగా లేము మనం. అదీ కావాలి ఇదీ కావాలి. రెండింటినీ కలిగి ఉండడం సాధ్యం కాదా? సంఘం మరింత సామరస్యపూర్వకంగా ఆర్గనైజ్ కాగలిగితే అది సాధ్యమే. రెండింటిలో ఏదో ఒక వైపుగా మనుషులను తోసే సాహిత్యం, సైన్సు, ఇతర ఆలోచనలు దానికి దోహదం చేయవు. కనీసం ఇలాంటి సందర్భాలలోనైనా… కాల్పనికత కన్న వాస్తవికతకు పెద్ద పీట వేయడం బుద్ధిజీవుల బాధ్యత.
    గిరిజన జీవితం లేదా అడివి… ‘నాగరికుల’ సౌందర్య పిపాస తీర్చే మ్యూజియం వస్తువు గా ఉండిపోకూడదు. లోకంలో మిగిలిన వాళ్లకు ఉన్న విద్యా వైద్యాది సౌకర్యాలన్నీ వారికి అందడం, వారి జీవితం వారికి ఉండడం… అసాధ్యమా? బహుశా, అభివృద్ధి అనేది ‘లాభం’ చుట్టూ తిరిగినంత కాలం అది అసాధ్యమే. లాభార్జన పరులకు ప్రకృతిని పాడు చేసి, గిరిజన జీవితాన్ని పెకలించి వేసి… త్వరత్వరగా లాభాలు దండుకుని వెళ్లిపోవాలని తప్ప వేరే యావ ఉండదు.
    చాల మంచి పుస్తక పరిచయం, చాల మంచి చర్చ.

  5. పుస్తకం » Blog Archive » టీవీ నైన్ లో వనవాసి పుస్తక పరిచయం.

    […] పుస్తక పరిచయం చేయబోతున్నది ఒక సామాన్య పాఠకుడు..ట! వనవాసి గురించి సుజాత గారు రాసిన సమీక్ష పుస్తకం.నెట్లో […]

  6. పుస్తకం » Blog Archive » 2009 – పుస్తక నామ సంవత్సరం

    […] ఊపేసిన పుస్తకం మాత్రం ‘వనవాసి‘. కొసమెరుపు: నా చదువూసంధ్యా చూసి […]

  7. సుజాత

    రాజు గారూ,
    నాణానికి రెండో వైపుని చక్కగా చిత్రీకరించారు.

    అందుకే అడవి అద్భుత సౌందర్యానుభూతి బయటి నుంచి వచ్చిన వారికి, భావుకులకు, రచయితలకు మాత్రమే తప్ప అక్కడ నివసించేవారికి పెద్దగా కలగదు. వారు అడవిని తమ కష్టసుఖాలకు కారణంగా మాత్రమే వారు చూస్తారు. వారి జీవిత సత్యం ఇదే మరి…నిజమే! ఎప్పుడూ చూడని దాని గురించి ఎవరో చెప్తే విని అనుభూతి చెందడం వేరు, వాస్తవ చిత్రణ చేయడం వేరు.

    మీ అనుభవాలు చాలా ఆసక్తి కరంగా ఉన్నాయి.మరో పక్క మలేరియా గురించి చదువుంటే హృదయం బరువెక్కనట్లయింది!

    చక్కని వివరణాత్మక, ఆలోచానాత్మక వ్యాఖ్యకు ధన్యవాదాలు!

  8. రాజశేఖర రాజు

    చాలా మంచి పరిచయం. చదవగానే 20 ఏళ్ల క్రితం నేను చదివిన కేశవరెడ్డి గారి మూగవాని పిల్లనగ్రోవి నవల గుర్తుకొచ్చింది. తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్ మాయాజాలంతో కట్టిపడేస్తున్న అవతార్ సినిమా కూడా గుర్తుకొచ్చింది. “చందమామ”లో కూడా ప్రస్తుతం అనునిర్వ అని ఓ సీరియల్ పర్యావరణ విధ్వంసం, జీవజాతులపై మానవుల ఆధిపత్యం విపరిణామాల గురించి వస్తోంది. అడవిని ధ్వంసం చేస్తే మనిషికి మిగిలేది ఏముంది? ఉన్న ఉద్యోగం కూడా పోయిన వైనం చెప్పకనే చెబుతోంది.

    “బరువును లాగలేక ఇబ్బంది పడుతున్న ఒక దున్నపోతుని బండివాడు చెర్నాకోలాతో ఛెళ్ళున కొట్టడం చూసి చలించి “ఆ వనదేవత ఇక్కడుంటే ఎంత బావుండు”అని అప్రయత్నంగా అనుకుంటాడు.”

    వ్యవసాయాన్ని ఈ నాటికీ పశువులతోటే నిర్వహిస్తున్న మన సమాజంలో వ్యవసాయ అవసరాలకోసం పశువును అదిలించక, హింసించక తప్పని అనివార్యతకు లోనవుతున్న వ్యవసాయదారులు దాని పాపఫలితాలను ఈ జీవితంలోనే అనుభవిస్తామని చెప్పి మధనపడటం బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. స్వయంగా మా తాత 30 ఏళ్ల క్రితం పొలం దున్నుతున్న్పపుడు ఇదేవిషయాన్ని హృద్యంగా చెప్పాడు. “నిద్రలేచినప్పటినుంచీ పశువును కొట్టి హింసిస్తున్నాంరా, అందుకే మనందరికీ చచ్చేటప్పుడు కుక్కచావు తప్పుదు..” సుఖంగా ఏ బాధ లేకుండా చనిపోవడం గురించి వ్యవసాయక సమాజాలు ఆదినుంచి ఎన్ని కలలు కంటూ వచ్చాయో.. గ్రామీణ ప్రాంతాల్లో సగటు ప్రజలకు ఇది ఎప్పటికీ అందని ఎండమావి మాత్రమే. తాము రోజూ చేస్తున్న పాపాలకు ప్రతిఫలం జీవితం చివరలో అనుభవించక తప్పదన్న స్పృహను వ్యవసాయదారులు మర్చిపోలేదు. వ్యవసాయం పూర్తిగా యాంత్రికీకరణకు గురయితే తప్ప గ్రామాల్లో పశుహింస తప్పదు. ఇది కొత్త సమాజానికి సంబంధించిన విషయం. దీంట్లో కూడా సవాలక్ష వాదనలు తలెత్తక తప్పదు.

    “ఏకాంతంలో దిగంతాల వరకూ వ్యాపించిన వెన్నెల్ని అనుభవించి అడవిలో వెన్నెల రాత్రిని చూడని వారి జీవితంలో ఈశ్వర సృష్టిలో ఒకానొక అద్భుత సౌందర్యానుభూతి నష్టపోయినట్లే.”

    నేనూ సంవత్సరాలపాటు వ్యక్తిగా, ఉద్యమగతంగా కూడా అడవిని చూశాను. కానీ అడవిగురించి ఈ భావుకత నాకు కలగలేదు. కాలుష్యం లేని అడవి గాలి, మెల్లగా శరీరాన్ని తాకుతూ పులకరింపజేసే చల్లటి గాలి, రాతి మడుగుల్లోంచి, ఊటల్లోంచి అమృతంలాగా జాలువారుతూ ప్రాణానికి హాయి కలిగించే కమ్మటి నీళ్లు.. ఈ పులకరింతలు పక్కనబెట్టి అడవిలో దోమల ద్వారా ఎదురయ్యే వ్యాదులు, భారీకాయాలను కూడా శుష్కింపజేసే వ్యాధులను అనుభవించి ఉంటే స్వయానా వనవాసి రచయిత కూడా అటవీ సౌందర్యాన్ని ఇంత భావుకతతో వర్ణించే సాహసం చేసి ఉండడని నా అభిప్రాయం.

    చిత్తూరు జిల్లా తలకోన అడవుల్లో మలేరియాను వరస పిశాచి అంటారు. ప్రపంచంలో మలేరియా వ్యాధి నిత్యం సంక్రమించే కొన్ని ప్రాంతాల్లో తలకోన ఒకటి. మలేరియా వదలినట్లే వదిలి మళ్లీ మళ్లీ శరీరంపై ప్రభావం చూపుతూ ఉంటుంది కాబట్టి దాని దాడికి వరుస పిశాచి అని పేరుపడిందక్కడ. పిశాచి అంటేనే పట్టుకుంటే వదలదని గ్రామీణుల అర్థం. అలాంటిది వరుస పిశాచి అయితే.. మలేరియా సంవత్సరానికి రెండు సార్లు వస్తుందని అటవీప్రాంతాల ప్రజల నమ్మకం. ఒకసారి వస్తే ఆరునెలల వరకు అది పోదు. ముఖ్యంగా పల్లెల్లో..

    అందుకే అడవి అద్భుత సౌందర్యానుభూతి బయటి నుంచి వచ్చిన వారికి, భావుకులకు, రచయితలకు మాత్రమే తప్ప అక్కడ నివసించేవారికి పెద్దగా కలగదు. వారు అడవిని తమ కష్టసుఖాలకు కారణంగా మాత్రమే వారు చూస్తారు. వారి జీవిత సత్యం ఇదే మరి.

    “పేదలూ..వారిని దోచే భూస్వాములూ..వీటన్నింటినీ భరించగలిగే శక్తి మనసుకు ఉండాలి. ఒక హాయిని, వేదనను ఒకేసారి కలిగించే భావాన్ని భరించగలగాలి. అప్పుడే ఈ పుస్తకం కొనాలి.”

    హాయి వేదన రెండూ ఒకేసారి కలుగుతున్నప్పుడు వేదన పార్ట్‌ గురించి సీరియస్‌గా ఆలోచించడం జాతికే మంచిదేమో..

    మంచి పరిచయం చేసినందుకు మీకూ, పుస్తకం.నెట్ వారికీ ధన్యవాదాలు
    రాజు
    చందమామ

  9. భావన

    చాలా బాగుంది పుస్తక పరిచయం. పరిచయం తోనే చదివించగల ఆసక్తి వుత్తమాభిరుచి వున్న మీరు రాయటానికి బద్దకించటం తప్పనిసరి గా ఖండించవలసిన విషయం. “రచనా కాలం కంటే ఇప్పుడే అవసరమున్న పుస్తకం” అనే మాట ఎంతో కదిలించింది. ఇంకా అడవు లు వున్నాయా? ఎక్కడ? నాగరికత వెర్రి తలలేసిన మనుష్యుల మధ్య ఆ అడవులలో ఒకప్పుడు మెదిలిన కౄర మృగాల జంతు సంభందిత ప్రవృత్తి తప్ప అడవులెక్కడూన్నాయి సుజాత.

  10. నాగరాజు రవీందర్

    మీ “వనవాసి” పుస్తక పరిచయం చాలా బావుంది. నేను ఆ పుస్తకాన్ని “నేను చదువ వలసిన పుస్తకాల” జాబితాలో చేర్చాను.

  11. పుస్తకం.నెట్

    Reply from HBT:

    `Dear Sir,
    Vanavasi is in complete unabridged form.
    Thank you,


    Gita Ramaswamy, Hyderabad Book Trust
    Plot No. 85, Balajinagar, Gudimalkapur,
    Hyderabad 500 067
    Ph 2352 1849

  12. వేణూ శ్రీకాంత్

    పుస్తక పరిచయం చాలా బాగుంది. రచయిత దృక్కోణాన్ని స్పష్టంగా అర్ధం చేసుకోవడం కాక గమనించవలసిన విషయాలను సూటిగా చెప్పారు. ఒక్క మాటలో ఈ పుస్తకాన్ని ఎలా చదవాలో చెప్పారు అనవచ్చేమో. త్వరలో చదవాలనే ఆసక్తిని కూడా రేకెత్తించారు.

    ఒకోసారి పుస్తకంలో పరిచయాలు చూస్తుంటే నాకు పుస్తకాలు చదవడం రాదేమో అన్న సందేహం కలుగుతుంటుంది అంత మంచి సమీక్షలు పరిచయాలు పుస్తకం.నెట్ లొ ప్రచురిస్తున్నందుకు ధన్యవాదాలు / అభినందనలు.

  13. సుజాత

    శ్రీనివాస్ గారూ,
    మీరే కరక్టు! “అరణ్యక.. గురించి చదివి దాని తెలుగు అనువాదం “వనవాసి” కోసం ప్రయత్నిస్తే అది దుర్లభమని తేలింది….”అని రాసి ఉండవలసింది.

    you name it..you get it..! నేను కావాలనుకున్న్న పుస్తకాలన్నీ (విశ్వనాథ పావని శాస్త్రి “పులిముగ్గు” తో సహా) వంశీ బుక్ స్టోర్స్ లోనే దొరికాయి! ఆ ధైర్యంతోనే అలా రాశాను.

    లక్ష్మన్న గారూ,
    పరిచయం నచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ పుస్తకం మీకు ఇప్పుడు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ లో దొరుకుతుంది(కొత్త ప్రచురణ). వారి వెబ్ సైట్ లో చూడండి ఒకసారి!

  14. cbrao

    సమీక్ష వెన్నెలంత చల్లగా ఆసక్తికరంగా సాగింది. మరిన్ని సమీక్షలు చేయకోరుతాను. సమీక్ష చేయటమా లేక ఆ సమయంలో మరో ఆసక్తికరమైన పుస్తకం చదవటమా అన్న మీమాంస ఎప్పుడూ ఉండక తప్పదులెండి.

  15. విష్ణుభొట్ల లక్ష్మన్న

    సుజాత గారూ:

    మంచి పరిచయం. ఈ పుస్తకం మా ఊరిలో ఉన్న UT Austin గ్రంధాలయంలో దొరుకుతుందేమోనని వెతికాను. దొరకలా! ఈ పుస్తకం ఒక కాపీ అమెరికాలో ఉన్న నాకు కావాలంటే ఎలా సంపాదించుకోగలను?

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  16. Srenivas Paruchuri

    > నవల ‘అరణ్యక” గురించి చదివి దానికోసం ప్రయత్నిస్తే అది దుర్లభమని తేలింది.
    > అనుకోకుండా ఆ మధ్య విజయవాడలో పాత పుస్తకాల షాపులో వనవాసి …

    బెంగాలీ “ఆరణ్యక” అనువాదమే కదా ఈ “వనవాసి”? పై రెండు వాక్యాల మధ్య మరో వాక్యం ఎగిరిపోయిందా?

    re: విజయవాడ కాలవగట్టుమీద పాత పుస్తకాల కొట్లు …,
    “వంశీ” షాపు ఓనర్ని మీరు పైన చెప్పిన పేరుతో ఎవ్వరూ పిలవరు :). “you name it..you will get it!!” అని చెప్పుకునే రోజులు, నా దృష్టిలో, విజయవాడలో కూడా పోయాయి కానీ, తెలుగుదేశంలో మిగిలిన వూర్లకంటే విజయవాడ కాస్త మెరుగు. మూడు వారాల క్రితమే 14 పుస్తకాలు దొరికాయి కాబట్టి 🙂 ఆ మాట కూడా.

    — శ్రీనివాస్

  17. సుజాత

    బుడుగు గారు,
    నాకు తెలిసి పాత తెలుగుపుస్తకాలమ్మే షాపులు హైదరాబాదులో ఏమీ లేవండీ. నల్లకుంట శంకర మఠం ఎదురుగా ఎప్పుడైనా వీకెండ్స్ (మన అదృష్టం కుళ్ళితే)ఫుట్ పాత్ మీద దొరకొచ్చు!

    విజయవాడ లెనిన్ సెంటర్లో దొరికినన్ని పాత తెలుగు పుస్తకాలు ఇంకెక్కడా దొరకవు మీకు! you name it..you will get it! అక్కడి..వంశీ బుక్ స్టోర్స్ (దీని పాత పేరు వంశీ ప్రాచీనాంధ్ర గ్రంథ మాల)యజమాని జగన్మోహన రావు గారు మంచి సాహిత్యాభిరుచి ఉన్న వ్యక్తి! ఏ పుస్తకం అడిగినా దాని చరిత్ర అంతా చెప్పగలరు. ఎప్పుడైనా విజయవాడ ప్రయాణం పెట్టుకోవాలి మీరు.

    1. surampudi pavan santhosh

      ఆయనకి పాతపుస్తకాల “విలువ” తెలుసు. అదే సమస్య. ఓ పక్క అరుదైనవి, మరోపక్క ముట్టుకుంటే చిరిగేవీ. ఇలాంటి స్థితిలో కొంచెం తక్కువధరకి కొందామనుకుంటే, ఆయనకు అవి అరుదని తెలుసు. తక్కువకివ్వరు.

  18. అరి సీతారామయ్య

    పరిచయం చాలా బాగుంది.

  19. neelaanchala

    “అడవుల మనుగడ, వాటిమీద ఆధారపడి బతికే ఆదిమజాతుల మనుగడ,కరువైపోతున్న ప్రాణవాయువు…పచ్చదనం, వీటన్నిటిగురించీ రచయిత ఏమీ మాట్లాడడు. ఉపన్యాసాలివ్వడు. గగ్గోలుపెట్టడు.ప్రశ్నించడు.

    కానీ ఆ పని మనచేత చేయిస్తాడు!

    ఒక కల్లోలాన్ని రేకెత్తిస్తాడు మెదడులో!
    “అడవులంతరించిపోతే?” అని నెమ్మదిగా పాకే ఆందోళనని మనలో సృష్టిస్తాడు.
    కుంత,బన్వారీ,భానుమతి,రాజూపాండే,థాతురియా,నక్ఛేదీ, కవి వెంకటేశ్వర ప్రసాద్…వీళ్ళందరినీ మనకు అంటగట్టి తను మాత్రం నిశ్చింతగా ఉంటాడు.”

    చదువుతుంటేనే మనసు కరిగి కన్నీళ్ళొచ్చేలా ఉంది. ఎంత బాగా ఫీల్ అయి రాశారో కదూ! తప్పక చదవాల్సిందే!

    ఆఫీసులో ఎంత తీరిక లేకున్నా సరే..చదివి తీరతాను.

  20. పుస్తకం.నెట్

    Mailed HBT to clarify the doubt regarding their publication. Hopefully, we’ll hear from them.

  21. చంద్ర మోహన్

    పుస్తక పరిచయం ఇంత హృద్యంగా కూడా వ్రాయవచ్చన్న మాట! చక్కని పుస్తకంతో ప్రారంభించారు, ఆపకండి. మరిన్ని పరిచయాలు వ్రాయాల్సిందే మీరు.

    అభినందనలు!

  22. సుజాత

    శ్రీనివాస్ గారూ,
    ఈ సంక్షిప్త ప్రచురణల సంగతి నాకు తెలీదు. HBTవారి కొత్త వనవాసి నేను చూడలేదు. మీ ప్రశ్నకు ఈ పుస్తకం కొత్తగా కొన్న వారు, లేదా ప్రచురణ కర్తలు జవాబు చెప్పాలి!

  23. budugoy

    సుజాత గారు, మంచి పరిచయం. పుస్తకం చదవాలనిపించేలా ఉంది.

    హైదరాబాద్లో ఇలాంటి పాత/సెకండ్ హాండ్ పుస్తకాల షాప్ ఏదైనా ఉందా? (ఆబిడ్స్ ఫుట్‌పాత్‌లు కాకుండా.) నాకు కొన్ని పుస్తకాలు గాంధీ జ్ఞానమందిర్ పక్కన విశాలాంధ్ర వాళ్ళు పెట్టే టెంపరరీ షాపులో దొరికాయి. కాని చాలా తక్కువ.

  24. Sreenivas Paruchuri

    మంచి పుస్తకం పరిచయం చేసినందుకు సంతోషం.
    ఒక చిన్న ప్రశ్న: HBT వాళ్ళు 1961 నాటి పుస్తకాన్ని *పూర్తిగా* అచ్చు వేశారా? naa daggara 1961 నాటిదే వుంది. ఎందుకు అడుగుతున్నానంటే, ఈమధ్య చాలా పునర్ముద్రణలు, ముఖ్యంగా విశాలాంధ్ర వారివి, (ఉదా: మహోదయం, ఆళ్వార్ స్వామి నవలలు, …)”సంక్షిప్తీకరించి” ముద్రించబడుతున్నాయి.

    పోతే, పుస్తకాలు *కొని* చదవని వారికి 🙂 “వనవాసి” మొదటి ప్రచురణ DLIలో వుం(డే)ది.

    — శ్రీనివాస్

  25. తృష్ణ.

    “రచయిత ఏమీ మాట్లాడడు. ఉపన్యాసాలివ్వడు. గగ్గోలుపెట్టడు. ప్రశ్నించడు. కానీ ఆ పని మనచేత చేయిస్తాడు!”

    “ఒక హాయిని, వేదనను ఒకేసారి కలిగించే భావాన్ని భరించగలగాలి.”

    బావుందండి పరిచయం.తప్పక కొని చదవాలన్నమాట..!
    నాక్కూడా బధ్ధకం వదిలించుకుని మరిన్ని మంచి పుస్తకలను గురించి రాయాలనే ఉత్సాహాన్ని కలిగించింది మీ పరిచయం..:)

  26. ajay prasad

    ఎంత అదృష్టవంతులు మీరు. ఈ పుస్తకం కోసం నేను వెతకని షాపు లేదు. ఇటీవల కొత్తగా వచ్చిన ప్రింట్ కొన్నాను. ఈ నవల గురించి ఎంత రాసినా తక్కువే అవుతుంది. ప్రబోధ్ కుమార్ సన్యాల్ “ప్రియబాంధవి” కూడా చదివి తరించమని ప్రార్థన.

    ఈ పుస్తకాలు దొరకడం అరుదు. ఎక్కడో పాతపుస్తకాల షాపుల్లో అదృష్టం ఉంటే దొరుకుతాయి. కవిగా చలం, ఇలాంటి అరుదైన పాత పుస్తకాల ప్రదర్శన (వనవాసి, ప్రియబాంధవి, యాత్రికుడు, మామారోమా, మానవసమాజం) క్రితంసారి విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ లో పెట్టారు. ఈసారి ఉందో లేదో తెలీదు.

  27. వేణు

    మీ పుస్తక పరిచయం చదివాక ‘వనవాసి’ని తప్పకుండా చదవాలనిపిస్తోంది. అంత హృద్యంగా రాశారు!

    మూఢ నమ్మకాలకు విలువనివ్వని పాత్ర … మూగజీవి బాధకు చలించిపోయి “ఆ వనదేవత ఇక్కడుంటే ఎంత బావుండు” అని అప్రయత్నంగా అనుకోవటంలో ఎంత సహజత్వం, మానవీయత ఉన్నాయో కదా?

    పుస్తక సారం వివరిస్తూ మీరు రాసిన ‘మెరుపు వాక్యాలు’చాలా బావున్నాయి.

    > రచయిత ఏమీ మాట్లాడడు. ఉపన్యాసాలివ్వడు. గగ్గోలుపెట్టడు. ప్రశ్నించడు. కానీ ఆ పని మనచేత చేయిస్తాడు! … కుంత,బన్వారీ,భానుమతి,రాజూపాండే,థాతురియా,నక్ఛేదీ, కవి వెంకటేశ్వర ప్రసాద్… వీళ్ళందరినీ మనకు అంటగట్టి తను మాత్రం నిశ్చింతగా ఉంటాడు.

    > ఒక హాయిని, వేదనను ఒకేసారి కలిగించే భావాన్ని భరించగలగాలి. అప్పుడే ఈ పుస్తకం కొనాలి. ఇది కాఫీ టేబుల్ బుక్ కాదు. మస్ట్ రీడ్ బుక్!

    ఈ పుస్తకం కొత్త ముఖచిత్రం బాగానే ఉంది కానీ, పాతది ఇంకా బావుంది 🙂

  28. కె.మహేష్ కుమార్

    ఈ పుస్తకం గురించి మీ ద్వారానే విన్నాను.
    మొత్తానికి చాలా పెద్దలిస్టే ఉంది చదవాల్సింది!

Leave a Reply