పుస్తకం.నెట్ మొదటి వార్షికోత్సవం

“పుస్తకాలపై తెలుగు వ్యాఖ్యానం అంతా ఒక చోట ఉంటే బాగుంటుంద”న్న ఆలోచన నుండి పుస్తకం.నెట్ మొదలయ్యి ఈ రోజుకి సంవత్సరం అయ్యింది. జనవరి ఒకటి, 2009 తేదీన అత్యంత నిరాడంబరంగా ప్రారంభమై, ఏడాది కాలం పాటు నిర్విరామంగా, నిరాటంకంగా పలువురు తమ సాహిత్యానుభవాలను పంచుకునే వేదికగా నిల్పిన అందరికీ కృతజ్ఞతాభివందనాలు!

సంవత్సర కాలంలో పుస్తకం.నెట్ – సింహావలోకనం

ఒక వత్సరంలో పుస్తక ప్రస్థానాన్ని అంకెల్లో చూడాలనుకుంటే:

ప్రచురితమైన వ్యాసాలు: రెండొందల యాభై ఐదు
వ్యాసకర్తలు: దాదాపు డబ్భై మంది (పుస్తకంలో అతి పుస్తకంలో అతిథి విభాగంలో రాసినవారి చిట్టా ఇక్కడ)
వ్యాఖ్యలు: పదిహేను వందలు పై మాటే
హిట్లు: లక్షా ఆరు వేలు

“నెలకి నువ్వో వ్యాసం నేనో వ్యాసం, మధ్యన ఎవరైనా రాస్తే వాళ్లవి కూడా! నెల మొత్తానికి ఒక నాలుగైదు వ్యాసాలు వెయ్యగలిగినా చాలు” అనుకుంటూ మొదలెట్టినా, పుస్తకం.నెట్ కి రాయమని అడిగిన వెంటనే స్పందించి శ్రమకోర్చి తమ వ్యాసాలు పంపిన  ప్రతీ ఒక్కరి వల్లా ఈ అంకెలు సాధ్యపడ్డాయి. కొందరిని అభ్యర్థించినా, మరికొందరిని బెదిరించినా, ఇంకొందరిని వేధించినా, సాహిత్యం పై ఉన్న మక్కువతో, మేము చేస్తున్న ఈ ఉడతా సేవకు ప్రోత్సాహం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో అందరూ కలిసి పుస్తకం.నెట్ ఒక గుర్తింపు పొందేలా చేశారు. వారిలో కొందరు ప్రఖ్యాతి చెందిన రచయితలూ, రచయిత్రులూ ఉండడం మా అదృష్టం! పుస్తక పరిచయాలకూ, సమీక్షలకూ పరిమితం కాక పుస్తక విక్రేతలతో, పుస్తక ప్రచురణకర్తలతో, గ్రంథాలయ నిర్వాహుకులతో జరిపిన ఇంటర్వ్యూలనూ, పుస్తక ప్రదర్శనల్లో తమ అనుభవాలనూ పంచుకున్నారు. ఇంటర్వ్యూలు చూడ్డం తప్ప చేయడం అనుభవం లేని వారూ తమకి తోచినంతలో ప్రయత్నాలు చేశారు. కొందరు ఈ-మెయిల్ ఇంటర్వ్యూల కోసం ప్రశ్నలు తయారు చేయడంలో సహాయపడ్డారు. పుస్తక రంగంలో ఏ విభాగానికి చెందినవారినైనా పరిచయం చేసే మా ప్రయత్నానికి తమ సంపూర్ణ సహాయసహకారాలు అందించి, వారు చేస్తున్న కృషిని తెల్సుకునే వీలుని కల్పించారు పుస్తక విక్రేతలూ, గ్రంథాలయ నిర్వాహకులు, ప్రచురణకర్తలు. మరగున పడుతున్న రచనలూ, రచయితలనూ పరిచయం చేసి ఆసక్తి పెంచిన వారు కొందరైతే, ప్రాచుర్యం పొందిన పుస్తకాల సంగతులు నెమరువేసుకున్నవారు మరికొందరు.

గజి”బిజీ” జీవితాల్లో నచ్చిన వ్యాపకాలకు సమయం కేటాయించటం తక్కువయ్యిపోయింది. ఒక కాఫీ సిప్ చేస్తూనో, ఒక బిస్కట్ తినే లోపో మీరు చదువుతున్న పుస్తకాల గురించి నాలుగు ముక్కలు అందరితో పంచుకునే వీలు కల్పిస్తూ “మీరేం చదువుతున్నారు?” అన్న పేజీని మొదలెట్టాము. దానికి స్పందన బాగుండటంతో ఇవ్వాల్టి నుండి “చెప్పాలని ఉందా?” అన్న కొత్త పేజీని మొదలెట్టాం. ఇందులో సాహిత్యం గురించిన లింకులు, లేటెస్ట్ న్యూస్‍లు, పుస్తకాల గురించి మీకున్న సందేహాలు పంచుకోవచ్చు.

పుస్తకం.నెట్ మొదలుపెట్టడంలో ముఖ్యోద్దేశ్యం: పుస్తకాల గురించి మాట్లాడుకునే ఒక వేదికను ఏర్పరచడం. పుస్తక పఠనాభిలాష గల వారందరూ తమ తమ అనుభవాలనూ, అనుభూతలనూ పంచుకునే వీలు కలిగించడం. ఒక పుస్తకం చదవటం ద్వారా కలిగిన తన్మయత్వాన్ని తక్కిన అందరితో పంచుకోవటం. ఆ ఉద్దేశ్యానికి కట్టుబడిన అనేకానేక వ్యాసాలు ఈ ఏడాది కాలంలో వచ్చాయి.  ఇవే కాక డి.టి.ఎల్.సి, ప్రజాశక్తి బుక్ హౌస్, తెలుగుపీపుల్.కామ్ వంటి వారు తమ దగ్గరున్న పాత సాహిత్య వ్యాసాలను మాతో పంచుకోవటం వల్ల కొన్ని అరుదైన వ్యాసాలూ, సమీక్షలూ మీముందుకి తీసుకురాగలిగాము. కేవలం తెలుగు పుస్తకాలకే పరిమితం కాకుండా, మంచి సాహిత్యాన్ని ఆదరించే అభిరుచిగలవారమంటూ ప్రపంచ సాహిత్యంలో అనేకమైన ఉత్తమోత్తమైన రచనలను తెలుగులోనూ / ఆంగ్లంలోనూ పరిచయం చేయటం జరిగింది. పుస్తకావిష్కరణ సభల గురించీ, కొత్త పుస్తకాల విడుదల ప్రకటనల గురించీ, రచయితల సన్మాన సభల గురించి కొందరు తెలియజేయటం వల్ల, ఆ సమాచారాన్ని పంచుకోగలిగాం.

పుస్తకాన్ని సగటున రోజుకి మూడొందల మంది చూస్తున్నట్టు స్టాట్స్ చూపిస్తాయి. ఇవి ఎక్కువా? తక్కువా? అన్న సంగతి పక్కకు పెడితే, వీటిని ఖచ్చితంగా పెంచే అవకాశం ఉంది. ఇప్పటిదాకా బ్లాగ్లోకం నుండే హిట్లు ఎక్కువ వచ్చాయి. బ్లాగేతరులకి కూడా ఈ ప్రయత్నాన్ని పరిచయం చేయాలన్న ఆలోచనతో హైద్రాబాద్ బుక్ ఫేర్ లో “వాక్ ఫర్ బుక్స్”లో కొంత ప్రచారం చేశాము. వీలైనంత మందికి, ముఖ్యంగా ప్రచురణ రంగంలో ఉన్న వారికీ పుస్తకం.నెట్ ను కరపత్రాల ద్వారా పరిచయం చేశాము! ఇలా చేద్దామన్న సలహా ఇచ్చి, అన్ని పనులూ దగ్గరుండి జరిపిన అరుణగారికి మా ధన్యవాదాలు.

ఇంకా చేయ్యాల్సినవి

పుస్తకం.నెట్ ప్రాథమిక లక్ష్యం: పుస్తకప్రియులకి ఒక వేదికగా మారడం అన్నది దాదాపుగా సాధించాం అనుకోవచ్చును. కాకపోతే చెయ్యాల్సినవి, మనం చేయీ, చేయీ కలిపితే చెయ్యగలిగినవీ చాలానే ఉన్నాయి.

పుస్తకం.నెట్ అంటే “కేవలం సమీక్షలే” అన్న అభిప్రాయం దూరం కావాలి. పుస్తకం.నెట్ – పుస్తకాలపై తెలుగు వికీపీడియా కానే కాదు. ఇక్కడ కేవలం సమాచారాన్ని మాత్రమే పంచుకోవటం లేదు. ఓ మనిషిలో పుస్తకం కలిగించిన భావప్రకంపనని అందరితో పంచుకునే అవకాశం. పుస్తక సమీక్షలతో పాటు, మీ అభిప్రాయాలూ, అనుభూతులూ, అనుభవాలకే ఇక్కడ పెద్ద పీట! ప్రతీ వ్యాసం ఏదో ఒక పుస్తకం గురించే కానవసరం లేదు. ఓ రచయిత గురించి, పుస్తక పఠనాభ్యాసం గురించి, పుస్తకాల లేమిని గురించి – ఇలా వేటిపైన అయినా రాయవచ్చు.

ఓ రచన పుస్తక రూపేణా మనముందుకి రావాలంటే అందుకు ఎందరో అవిరళ కృషి కావాలి. వీరిలో పుస్తక ప్రచురణకర్తలకూ, విక్రేతలకూ, ప్రింటర్లకూ గుర్తింపు తక్కువ. పుస్తకాలని అందరకీ అందుబాటులో ఉంచే గ్రంథాలయాల ప్రస్తుత పరిస్థితి అందరకీ తెల్సిందే! వ్యాపారధోరణితో కాక, పుస్తకాలను అత్మీయులుగా భావించి లాభాలు రాకున్నా / లేకున్నా పుస్తక ప్రచురణ, విక్రయరంగాలకు కొసాగుతున్నవారు ఎందరో ఉన్నారు. అలాంటి వారి గురించి మనం తెల్సుకోవాలి. ఆ విశేషాలను అందరితో పంచుకోవాలి. పుస్తకానికి సంబంధించిన ఏ చిన్న విషయానికైనా పుస్తకం.నెట్ లో స్థానం ఉంది.

సాహిత్యం పై చర్చలు, ఇష్టాగోష్ఠులు మరిన్ని రావాలి. ఒకే పుస్తకం పై ఒకరు పాజిటవ్ గానూ, మరొకరు విమర్శనాత్మకంగా రాయొచ్చు. ఒకే రచనపై భిన్న అభిప్రాయాలను ఒకే చోట తెల్సుకోవచ్చును. (“పుస్తకం.నెట్ లో ఇదివరకే ఎవరైనా ఫలనా పుస్తకం గురించి రాస్తే, మళ్లీ మేం రాయొచ్చా?” అన్న సందేహం చాలాసార్లు వినిపిస్తూ ఉంటుంది. పుస్తకం ఒకటే అయినా, పాఠకుని బట్టి అనుభవం ప్రత్యేకం. మీ అనుభవాన్ని మీకు తోచిన రీతిలో రాసి పంపండి, దాని మీద ఇదివరకే ఎన్ని వ్యాఖ్యానాలు వచ్చి ఉన్నా! )

“మనం మరచిన రచయిత(త్రు)లూ” – ఈ అంశం మీద చాలా పని చేయాల్సి ఉంది. కాలగర్భంలో కలసిపోతున్న అనేక మంచి రచనలనూ, రచయిత్రులూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం మన బాధ్యత. ఇప్పుడు ముద్రణలో లేని రచనలూ, మనం దాదాపుగా మర్చిపోయిన రచయితలనూ మీరు వ్యాసాల ద్వారా పరిచయం చేయొచ్చు. వ్యాసం రాయడానికి సరిపడా సమాచారం మీ దగ్గర లేకపోతే, ఆ రచయితా / రచన గురించి సైటులో వ్యాఖ్య గానీ, లేక మాకు వేగు కానీ పంపితే ఆ సమాచారాన్ని వెతికే ప్రయత్నాలు మనం చేయవచ్చు.

మీ దగ్గర కాపీరైట్ల సమస్య లేని సాహిత్యానికి సంబంధించిన – పుస్తక సమీక్షలు, రచయితల పరిచయాలు, ముఖాముఖీలు, సాహిత్య ప్రక్రియలపై విశ్లేషణలూ – లాంటి ఏ సమాచారం ఉన్నా మాకు పంపండి. దాన్ని యునికోడీకరించి అందరకీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేద్దాం. ప్రస్తుతం వస్తున్న వ్యాసాలతో పాటు పాత తరం వారి వ్యాసాలనూ అందరికీ అందించాలని ప్రయత్నం.

అందరి చేయూతతో పుస్తకం.నెట్ దిగ్విజయంగా ఏడాది పాటు కొనసాగింది. ఇదే ఉత్సాహంతో మున్ముందు కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాం.

అందరకీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

పుస్తకం.నెట్ కి వ్యాసాలు పంపాలనుకుంటే ఈ ఈమెయిల్ కు పంపండి: editor@pustakam.net
పూర్తి నిడివి వ్యాసాలు పంపలేకపోతే, మీ పఠనానుభవాలని వ్యాఖ్యల రూపంలో ఇక్కడ పంచుకోండి.
పుస్తకాల గురించి గానీ, రచయిత గురించి గానీ విశేషాలనూ, వార్తలనూ ఇక్కడ చెప్పండి.
పుస్తకం.నెట్ పై మీ అభిప్రాయాలనూ, సూచనలూ, సలహాలనూ వ్యాఖ్యల రూపంలోనో, ఈ-మెయిల్ ద్వారానో తెలిజేయండి.

You Might Also Like

18 Comments

  1. మద్దిరాల శ్రీనివాసులు, త్రిపురాంతకం

    అనేక మంది రచయితలకు, విధ్యార్ధులకు, విజ్ఞానార్జన చేసే వారికి అవసరమయ్యే వివిధ రకాల పుస్తక భాండాగారాన్ని నెట్ ద్వారా అందుబాటులోకి తెచ్చి సేవలనందించుచున్న ఈ బ్లాగు నిర్వాహకులు నిజంగా అభినందనీయులు. అందరూ సద్వినియోగపరచుకొనగలరని ఆశిస్తున్నాను.

  2. Tata Ramesh Babu

    melupoddulu
    pusthakaalu chadive vaarandari vedika……..oka,samvathsara kaalamgaa…..mappidaalu….vijayavantham chesina vaarandariki

  3. వైదేహి శశిధర్

    మొదటి వార్షికోత్సవం సందర్భంగా పుస్తకం కు శుభాకాంక్షలు.పుస్తకం సంపాదకక వర్గానికి అభినందనలు.

  4. bandla madhavarao

    iTuvanTi piTTina rOjulu ennO jarupukOvaalani aaSistU.

  5. మాలతి

    మీ సైటు ఈ డైరెక్టరీలో ప్రచురించవచ్చు.
    http://www.dmoz.org/help/submit.html

  6. ajay prasad

    శుభాకాంక్షలు. విజయవాడ పుస్తకమహోత్సవం (జనవరి 1 నుండి 11 వరకు జరుగుతున్న) గురించి ఎవరైనా రాస్తే చదవాలని ఉంది.

  7. అఫ్సర్

    పుస్తకం పుట్టి, ఏడాదేనా అయ్యింది! ఇది చాలా పాత స్నేహంలా వుంది. దిన చర్యలో భాగం అయ్యింది. సాధారణంగా అచ్చు సాహిత్య పుటల్లోనో, పత్రికల్లోనో పాఠక ప్రమేయం తక్కువ. పుస్తకం వొక మంచి పాఠక పీఠం గా మారింది. అతిధుల జాబితాలో ఎక్కువ మంది పేరు మోసిన రచయితలే వున్నా, పుస్తకం ప్రధాన విజయం మంచి పఠితలను ఒక చోటికి చేర్చి, ఆరోగ్యకరమయిన పఠన వాతావరణాన్ని కల్పించడం. ఈ కృషి పది కాలాలు నిలబడాలని కోరుకుంటున్నా.

  8. kalpana

    పుస్తకం.నెట్ మరింత ఎత్తులకు ఎదగాలని కోరుకుంటూ…

  9. perugu

    మా పుస్తకం .నెట్ కు శుభాకాంక్షలు

  10. మెహెర్

    పుస్తకం.నెట్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు 🙂

  11. Mahita

    Heartiest COngratulations!! 🙂

    After a splendid job in the last year, I wish the site all the very best for its step forward.

  12. ఎన్ వేణుగోపాల్

    పుస్తకం.నెట్ నిర్వాహక మిత్రులందరికీ,

    ఆత్మీయమైన, ప్రగాఢమైన అభినందనలు. తెలుగు సమాజానికీ, సాహిత్యానికీ అత్యవసరమైన కృషిని ప్రారంభించి ఏడాది పాటు విజయవంతంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు. ఈ కృషి నిరంతరం సాగాలనీ, మరింత విస్తృతం కావాలనీ ఆకాంక్షిస్తున్నాను. పుస్తకం.నెట్ కు నేను చేయగలిగిన ఏ సహాయమైనా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను.

  13. varudhini

    పుస్తకానికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు..మీ ఇద్దరికి శుభాభినందనలు. పుస్తకం ఇలానే మరింత పైకి పైపైకి ఓ మహాగ్రంధం లాగా ఎదగాలని కోరుకుంటున్నాను.

  14. Dr.Darla

    శుభాకాంక్షలు. మరింత కృషి చేసి తెలుగు పుస్తకాలను విశ్వవ్యాప్తం చేయాలని ఆకాంక్షిస్తూ…
    నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను
    దార్ల

  15. గరికపాటి పవన్ కుమార్

    పుస్తకం.నెట్ దిగ్విజయంగా సంవత్సరాన్ని దాటి దూసుకుపోతున్న సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు. ఇంకా ఇలాగే చాలా వసంతాలను నింపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. సమర్ధవంతంగా ఈ పత్రికను నడుపుతూ, ఈ కృషి వెనక ఉన్న వారికందరికీ నా అభినందనలు.

    ఇట్లు
    గరికపాటి పవన్ కుమార్

  16. మాలతి

    అద్భుతమయిన కృషి, ఫలితాలు అంతకంటే పరమాద్ఫుతంగా వున్నాయి. మీకృషి ఇంకా విజయవంతం కావాలన్న శుభాకాంక్షలతో, – మాలతి.

Leave a Reply to Mahita Cancel