రెబెకా హార్డింగ్ డేవిస్ చరిత్ర్యాత్మక రచన “లైఫ్ ఇన్ ది ఐరన్ మిల్స్”

ఈమాటలు డెబొరా వింటుంది. ఆమెకి అర్థమయినంతవరకూ ఆమిల్లుమీద వచ్చే ఆదాయంమీద తమకి హక్కు వుంది. ఒకరకమయిన అమాయకత్వంతోనే ఆనలుగురిలో ఒకరిజేబులో పర్సు దొంగిలించి, ఆడబ్బు నీది అంటూ హ్యూకి ఇస్తుంది. హ్యూ అనేకవిధాల మథనపడతాడు. ఒకవంక నీతి, మరొకవంక తనహక్కులగురించి విన్న ఉపన్యాసం. చివరకి పోలీసుస్టేషనుకి వెళ్లి ఆడబ్బు వాపసు ఇచ్చేస్తాడు. దొంగతనం చేసేడన్న నేరం మోపి, 19 సంవత్సరాలు జయిలు శిక్ష వేస్తారు. రెండుసార్లు పారిపోడానికి ప్రయత్నించి, పట్టుబడి, ఆత్మహత్య చేసుకోడంతో కథ ముగుస్తుంది.

అట్లాంటిక్ మంత్లీ ఏప్రిల్ 1861లో ఈకథ ప్రచురణతో రెబెకా హార్డింగ్‌ అశేషమయిన కీర్తి తెచ్చుకుంది. వెంటనే పీటర్సన్స్ మేగజీన్ అనే మరోపత్రికవారు కూడా తమకి కథలు పంపమని ఆమెని కోరేరు. ఆపత్రికలో ప్రచురించే కథలకీ రెబెకా హార్డింగ్ రాసే కథలకీ మౌలికమైన భేదాలున్నాయి. ఆవిషయమే ఎత్తి చూపుతూ “నేను మీకు రాయలేనేమో” అన్న సందేహం వెలిబుచ్చింది ఆమె. దానికి సమాధానంగా ఆపత్రికవారు “ఫరవాలేదు మీరు రాయండి, మేం వేసుకుంటాం,” అన్నారు.

అట్లాంటిక్ పత్రికలో ఆమెరచనలు చూసి, హాథార్న్ ఆమెకి ఉత్తరం రాసేడు మెచ్చుకుంటూ. వారిమధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఈ మెప్పుదల ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎంచేతంటే, ఈ హాథార్నే అంతకుముందు ఒక ప్రచురణకర్తకి రాసిన వుత్తరంలో ఆయనకి రచయిత్రులమీద ఎలాటి అభిప్రాయం వుందో స్పష్టం చేశాడు.

“America is now wholly given over to a d****d [damned] mob of scribbling women, and I should have no chance of success while the public taste is occupied with their trash–and should be ashamed of myself if I did succeed. What is the mystery of these innumerable editions of The Lamplighter and other books neither better nor worse? Worse they could not be, and better they need not be, when they sell by the hundred thousand.” – Hawthorne’s 1855 letter to his publisher William D. Ticknor, quoted in Pattee, Fred L. The Feminine Fifties. NY: Appleton-Century Co., 1940. p. 110.

రెబెకా హార్డింగ్‌కి జేమ్స్ టి. ఫీల్డ్స్ మరొక రచయిత లెమ్యుయెల్ క్లార్క్ డేవిస్‌ని పరిచయం చేశాడు. పరిచయం పరిణయానికి దారి తీసింది అచిరకాలంలోనే. మార్చి 1863లో వారి వివాహం జరిగింది. క్లార్క్ డేవిస్ భార్య రెబెకా హార్డింగ్‌తో అతని సోదరి కెరీ ఇంట కాపురం పెట్టేరు. అక్కడ క్లార్క్‌కీ, ఆతనితోబుట్టువుకీ, ఆవిడ పిల్లలకీ సేవలు చేస్తూ సంసారం చేసింది రెబెకా హార్డింగ్ డేవిస్.

“In marriage and childbearing women find their true calling” అని బాహాటంగా ప్రకటించిన రెబెకా హార్డింగ్‌ అంతరాంతరాల తీరని ఆత్మఘోష కూడా అనుభవించింది ఆరోజుల్లో -తాను చెయ్యవలసింది ఏదో వుంది, జీవితానికి పరమార్థం మరేదో వుంది, అది ఏమిటి? ఎలా సాధించుకోవడం? అన్న తపనతో. ఇవి హ్యూ వుల్ఫ్ పాత్రద్వారా అమెకథలో కనిపిస్తాయి, ఉదాహరణకి “want to know”, “A true life is one of full development of faculties” వంటి వాక్యాలు రెబెకా హార్డింగ్ డేవిస్‌కి వర్తిస్తాయి, ఆ ఊహలు ఆమెని తీవ్రమయిన మనోవేదనకి గురి చేశాయి అంటుంది ఓల్సన్.

ముఖ్యంగా ఆడబడుచు కెరీ ఇంట్లో గలగల్లాడుతూ ఇంటినిండా పిల్లలూ, సదా attention కోరే భర్తా, ఆపైన తన ముగ్గురు పిల్లలూ–ఇంతమంది మధ్య తనకీ, క్లార్క్ డేవిస్‌కీ విడిగానూ, జంటగానూ కూడా ఏకాంతం అన్నది లేకుండా పోయింది. (మనఇళ్లలో ఉమ్మడికుటుంబాల్లో పెద్దకోడలి పరిస్థితి గుర్తొచ్చింది నాకు ఈభాగం చదువుతుంటే). రెబెకా హార్డింగ్ తనమేధకి తగినస్థాయిలో తనమనసుకి తృప్తినివ్వగల కథ మళ్లీ రాయలేకపోతున్నందుకు బాధ పడుతూనే పీటర్సన్స్ మేగజైను ఇచ్చే డబ్బు కాదనలేక కాలక్షేపంకథలు లేక (మనదేశంలో రైల్వేసాహిత్యం) (పాట్‌బాయిలర్) అనిపించుకునే కథలు రాసింది 1861నించీ 1893 వరకూ. ఇల్లూ, పిల్లలే స్త్రీకి పరమధర్మం అని ధృఢంగా నమ్మిన రెబెకా డేవిస్ సాహిత్యవిలువలు లేని చవకబారు (potboiler) కథలతో ధనార్జన చేస్తూ సంసారాన్ని ఈదడం ఆమెజీవితంలో ఒక పెద్ద కాంట్రడిక్షన్, నిజానికి ఆమె మొట్టమొదట రాసిన “లైఫ్ ఇన్ ద ఐరన్ మిల్స్”లాటి కథ మళ్లీ ఆమె జీవితంలో రాయలేకపోయింది. ఆమె ప్రతిభ ఆమె జీవితకాలంలోనే కుంటువడిపోయింది.

1910లో ఆమె పెద్దకొడుకు, రిచర్డ్ హార్డింగ్‌ డేవిస్ ఇంట చనిపోతే, ఆమె మరణవార్త New York Times, సెప్టెంబరు 30, 1910 తేదీన ఇలా ప్రచురించారు “రచయిత, పాత్రికేయుడు, నాటకకర్త అయిన రిచర్డ్ హార్డింగ్ తల్లి, స్వయంగా నవలాకర్త్రీ, స్ఫూర్తిదాయకమైన సంపాదకీయాలు రచించిన రచయిత్రీ, ఈరాత్రి క్రాస్‌రోడ్స్ ఫార్మ్‌లో కుమారుని ఇంట హృద్రోగంతో మరణించింది” అని. ఈ మరణవార్తలో రెబెకా హార్డింగ్ డేవిస్ పేరు లేకపోవడం గమనార్హం.

టిల్లీ ఓల్సన్ రెబెకా హార్డింగ్ డేవిస్‌ని కనుక్కోవడం యాదృచ్ఛికంగా జరిగింది. ఆమెకి పదిహేనేళ్ల వయసప్పుడు ఒమాహాలో ఒక పాత పుస్తకాలషాపులో నీటిచారికలతో, జీర్ణావస్థలో వున్న మూడు అట్లాంటిక్ సంచికలు కొని తెచ్చుకుంది. ఏప్రిల్ 1861 సంచికలో లైఫ్ ఇన్ ద ఐరన్ మిల్స్ కథ కనిపించింది. అప్పట్లో పత్రికలు రచయితలపేర్లు ప్రకటించేవారు కాదు కనక ఎవరు రాసేరో తెలీలేదు.

కొంతకాలం అయేక 1958లో శాన్ ఫ్రాన్సిస్కో పబ్లిక్ లైబ్రరీలో ఎమిలీ డికెన్సన్ ఉత్తరాలు చూస్తుంటే, ఫుట్‌నోట్‌లో ఆ కథారచయిత్రి రెబెకా హార్డింగ్ అని తెలిసింది. తిరిగి 1962లో రాడ్‌క్లిఫ్ ఇన్స్‌టిట్యూట్‌లో చేరిన తరవాత, ఇంతటి మేధ, శక్తి, సౌందర్యం, అవగాహన గలరచయిత్రి నామరూపాలు లేకుండా అంతరించిపోవడం ఎలా జరిగిందన్న జిజ్ఞాసతో, అదొక ప్రోజెక్టుగా స్వీకరించి, పందొమ్మిదవ శతాబ్దం ఉత్తరార్థంలో అమెరికాలో సాంఘిక, రాజకీయ, పారిశ్రామిక నేపథ్యంలో రెబెకా హార్ఢింగ్ డేవిస్ రచనలతోపాటు ఆమె జీవితచరిత్రని నిశితంగా పరిశీలించి విస్తృతమయిన వాఖ్యానాలతో 1972 ప్రచురించింది. ప్రచురించినవారు అప్పట్లో చిన్న సంస్థ అయిన ఫెమినిస్ట్ ప్రెస్. ఈపుస్తకంలో అసలు కథ 56 పేజీలయితే, టిల్లీ ఓల్సన్ autobiographical interpretation 87 పేజీలు. మరో ఇరవై పేజీలు నోట్స్.

నిజానికి ఆకథ తనకి గొప్ప స్ఫూర్తిదాయకమయింది అంటుంది ఓల్సన్. “హీనాతిహీనమయిన జీవితాలనుండీ సాహిత్యం సృష్టించవచ్చు” అనీ, “నువ్వు కూడా తప్పకుండా రాయాలి” అని తనకి తానే చెప్పుకుని, కొంతకాలం అయేక కథలు రాయడం మొదలు పెట్టిందిట ఆమె.
ఓల్సన రాసిన ఈ జీవితకథమూలంగా కథలో స్పష్టం కాని ఎన్నో విషయాలు మనకి తెలుస్తాయి. ఒక చిన్నఉదాహరణ – రెబెకా హార్డింగ్ డేవిస్ కథలో హ్యూకి 19 సంవత్సరాలు శిక్ష, “అంటే జీవితంలో అర్థభాగం” అని కథలో రచయిత్రి వ్యాఖ్య. ఒకమనిషి జీవితంలో 19 ఏళ్లు అర్థభాగం ఎలా అయింది అంటే 1850 గణనాంకాలప్రకారం మిల్లుకూలీల సగటు జీవితం 37 ఏళ్లు. అందులో సగం 19 అని ఓల్సన్ వ్యాఖ్యానం. ఇలాటి సాంఘికనేపథ్యం కేవలం కథ చదివితే తెలిసేది కాదు. అందుకే రెబెకా హార్డింగ్ డేవిస్ కథ ఎంతగా నామనసుకి హత్తుకుందో టిల్లీ ఓల్సన్ విశ్లేషణ కూడా అంతగానూ నామనసున నాటుకుంది. నిజానికి ఈ విశ్లేషణ నాకయితే కథని ఎలా విశ్లేషించాలి అన్న ప్రశ్నకి సమాధానంలా వుంది.

ఈ ప్రచురణ తరవాతే, రెబెకా హార్డింగ్ డేవిస్ రచనలు అమెరికాలో యూనివర్సిటీల్లోనూ, కాలేజీల్లోనూ పాఠ్యగ్రంథాలు అయేయి. టిల్లీ ఓల్సన్ రచించిన రెబెకా హార్డింగ్ డేవిస్ జీవితవిశ్లేషణతో కూడిన ఈపుస్తకం ఎమెజాన్.కాంలో దొరుకుతుంది.

You Might Also Like

5 Comments

  1. సౌమ్య

    Nice article!
    Hope to see more such articles from you 🙂

  2. కొత్తపాళీ

    చాలా బావుంది మాలతిగారూ. ఒక అద్భుతమైన కథనీ రచయిత్రినీ పరిచయం చేశారు. మిగతా కళల్లో అమెరికన్ రినజాన్స్ 1890లలో మొదలీందని పండిత వాక్యం కానీ సాహిత్యంలో కొన్ని మౌలిక భావాలకి ఆద్యమైన రచనలో 19 వ శతాబ్దిలోనే విరివిగా వచ్చాయని నా అనుమానం.
    ఇప్పటికీ అట్లాంటిక్ మంత్లీ మంచి కథల్ని అందిస్తున్నది

  3. మాలతి

    కల్పనా, ఓపిగ్గా చదివి వ్యాఖ్య పెట్టినందుకు చాలా సంతోషం.
    ఇప్పటి కంటే రచయతలకు ఆ కాలంలోనే గౌరవ మర్యాదలు ఎక్కువగా వున్నట్లు అనిపిస్తోంది. – అవును, నాపాయింటు కూడా అదే. రెండు భిన్నసంస్కృతులలో సామ్యాలూ, వ్యత్యాసాలూ తెలుస్తాయనే ఇది రాసేను.
    రచయిత్రి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం విషయంలో మరొకసంగతి రాయడం మరిచాను. 1893లో న్యూయార్క్ ట్రిబ్యూన్ సంపాదకులు ఆమె వ్యాసంలో మార్పులు సూచిస్తే, అవి తనకి సమ్మతం కాదని, మొత్తం వుద్యోగానికే రాజీనామా ఇచ్చేసింది అని కూడా ఓల్సన్ రాసింది.
    ప్రపంచ ‘ మేధావులంతా’ ఒకేలా ఆలోచించి, ఒకేలా రాస్తారు కాబోలు. — ఇది కూడా అవును, ఎందుకంటే ఒకేమూసలోంచి వచ్చిన విమర్శనాధోరణులవల్ల. :))

    మాలతి

  4. kalpana

    మాలతి గారు,

    మీ వ్యాసం చదవటం మొదలుపెట్టి సగం పూర్తి చేసి ఈ కామెంట్ పెడుతున్నాను. నాకు చదవటానికే ఇంత సమయం పడుతుంటే మీకు రాయటానికి ఎంత సమయం పట్టిందో. రెబెకా హోర్డింగ్ రాసిన మంచి కథ “ లైఫ్ ఇన్ ది ఐరన్ మిల్స్” గురించి మాత్రమే కాకుండా రచయిత్రి జీవితం , అందులోని ముఖ్య సంఘటనలు గురించి కూడా చెప్పటం వల్ల వ్యాసానికి మంచి పట్టు వచ్చింది. అట్లాంటిక్ మంత్ లీ లాంటి ప్రసిధ్ధ పత్రిక తో కూడా రెబెకా తన మొదటి కథ కి పేరు పెట్టే విషయంలో తన నిర్ణయానికి కట్టుబడి వుండటం ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని కలిగించింది. తన కథ మీద తనకున్న ఆత్మవిశ్వాసం అలా చేయించివుండాలి. ఇప్పటి కంటే రచయతలకు ఆ కాలంలోనే గౌరవ మర్యాదలు ఎక్కువగా వున్నట్లు అనిపిస్తోంది. ఇక హాతోర్న్ వ్యాఖ్యలు తెలుగు రచయిత్రుల గురించి విమర్శకులు రాసిన వ్యాఖ్యలతో సమానం గా వున్నాయి. ప్రపంచ ‘ మేధావులంతా’ ఒకేలా ఆలోచించి, ఒకేలా రాస్తారు కాబోలు.

    కల్పనారెంటాల

  5. రచయితా, కథకుడూ « తెలుగు తూలిక

    […] ప్రముఖ రచయిత్రి. (ఈకథమీద నేను రాసిన పూర్తి వ్యాసం పుస్తకం.నెట్‌లో […]

Leave a Reply