కవిత్వం ఒక నిధి..తవ్వే కొద్దీ పెన్నిధి లా లభిస్తుంది..లాభిస్తుంది..!

రాసిన వారు: పెరుగు రామకృష్ణ
************************

Poetry is just the evidence of life. If your life is burning well, poetry is just the ash. – Leonard Cohen

avishడాక్టర్.“రాధేయ” కలంపేరుతో 1978 నుండి తెలుగు సాహితీ ప్రపంచానికి సుపరిచితులైన ఉమ్మదిచెట్టి నారాయణ సుబ్బన్న కవిత్వాన్ని శ్వాసిస్తూ ,కవిత్వాన్ని ధ్యానిస్తూ, కవిత్వమే ఊపిరిగా జీవిస్తున్న అభ్యుదయ భావాల కవి. 1955లో జన్మించిన ఈ కవి స్వస్థలం కడప జిల్లా ముద్దనూర్ మండలం యామవరం గ్రామం.తెలుగు సాహిత్యం లో ఎం.ఎ.చేసి “ఆధునికాంధ్ర కవిత్వానికి సీమ కవుల దోహదం” – అంశంపై శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పి.ఎచ్.డి.చేసి సిద్దాంత గ్రంధం సమర్పించారు. ప్రస్తుతం అనంతపూర్ జిల్లా పామిడి గ్రామం లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా పని చేస్తున్నారు. 1988 లో ఇంటిపేరు “వుమ్మడిచెట్టి” సాహితీ అవార్డు ఏర్పాటు చేసి ఇరవై ఒక్క ఏండ్లుగా క్రమం తప్పకుండా ప్రదానం చేస్తూ ఆధునిక కవిత్వానికి ప్రతిష్టాత్మక పురస్కారంగా పేరు తెచ్చారు.

మరో ప్రపంచం కోసం మొదటి కవిత సంపుటి 1978లో వెలువరించి ఇక వెనుతిరిగి చూడకుండా ఇటీవల “అవిశ్రాంతం” అనే ఎనిమిదవ సంపుటి తో అవిశ్రాంత కవిగా తన్ను తాను ప్రకటించు కొన్నారు. కవిగా 2006 లో “మగ్గం బ్రతుకు” దీర్గ కావ్యం చేనేతకారులపై రాసి ప్రత్యేక గుర్తింపు పొందారు. రాధేయ కవిగా పరిపక్వ దశ కొచ్చాడు. అవిశ్రాంతం కవితా సంపుటి అందుకు ఒక దాఖలా.. అంటూ ప్రసిద్ద కవి శివారెడ్డి ముందు మాటలో కితాబిచ్చారు.. ఈ సంపుటి లో ముప్పై వచన కవితలున్నాయి.

కవిత్వం నాకు కన్ను మూత పడని జ్వరం / కవిత్వం నా కన్రెప్పల మీద వాలిన నమ్మకమైన కల../
కవిత్వం తోడు లేకుండా నేను లేను../అక్షరాలు వెంట రాకుంటే అడుగు ముందు కేయ్యలేను../
కడ దాకా రాస్తాను ..నా కన్నీటి తడి ఇంకి పొయ్యేదాకా రాస్తాను….
” (కవిత్వం నా ఫిలాసఫెర్ )

“కాలం చిటికెన వేలు పటుకోని../ నా కవితా కన్య అడుగులేస్తుంది
నిద్రకూ మెలకువకూ మద్య నిత్య జాగారనతతో ../అమలిన హృదయం కోసం అన్వేషణ ప్రారంభించింది.”
(కవిత్వానికి ప్రేమలేఖ)
అంటూ ఈ సంపుటి నిండా కవిత్వం పై కవిత్వాన్ని ప్రకటించి అలరించారు…

కవిత్వం ఒక నిధి .. తవ్వే కొద్దీ టన్నుల కొద్ది పెన్నిదిలా లభిస్తుంది..లాభిస్తుంది..జీవితాన్ని కవిత్వమూ, కవిత్వాన్ని జీవితమూ చేసుకొన్న వారికే ఆ పెన్నిధి విలువ తెలుస్తుంది. అందుకే రాధేయ పాతికేళ్ళుగా కవిత్వాన్ని రాస్తున్నా ఇంకిపోని కవిగా గాక నిరంతర ప్రవాహ కవిగా మిగిలారు. బ్రతుకు మూలాల్ని శోధించే కవి ఎప్పుడూ సరికొత్త
భావాలనే ప్రసరిస్తాడు. సమాజపు అట్టడుగు లోతుల్లోకి వాటిని చేర్చి రవి చేరని చోటుకి కవి చేరినట్లుగా, ప్రజల నాల్కలపై నర్తిస్తాడు.

“ప్రేమాభి మానాలను డాలర్ మైకం కమ్మేసింది…/దయా రహిత ప్రపంచం డాట్ కాం లో స్థిరపడింది..”
అంటూ వర్తమాన సమాజంపై చురక వేస్తాడు వ్యంగ్యంగా. కవిత్వం ఈ లోకాన్ని ,మనుషులను,సమాజాన్ని,అధ్యయనం చేసే ఒకానొక తాత్విక భూమిక. అనే ఈ కవి సామాజిక స్పృహను, కవిత్వానికి జోడించి ప్రపంచీకరణ నేపద్యంలో విచ్చిన్నమవుతున్న మానవ సంబంధాల పట్ల ఆవేదన చెందుతాడు.

నీవు కోల్పోయిన బాల్యం ../ ఈ దేశం చెల్లించలేని మూల్యం..
కంటి తుడుపు చర్యలతో..నీ బాల్యం తిరిగిరాదు../ ఎన్నెన్ని పథకాల /
ఎంగిలి మెతుకులు విదిలించినా ./ నీ అర చేతుల్లోకి అన్నం ముద్ద చేరదు..
“(కోల్పోతున్న మూల్యం)

వాడి భవిష్యతు కోసం ../నీ బతుకునే బల్లకట్టు చేసుకున్నావ్ ..
వాడిప్పుడు ఎంతగా ఎదిగి పోయాడో..?./మనీ మార్కెట్ లో హోదాను పెంచుకున్నాడు..
మ్యారేజ్ బ్యూరోలో పెళ్ళాన్ని ఎంచుకున్నాడు.. /తల్లి ప్రేమకు తూట్లు పొడిచి..
“(క్షమయా ధరిత్రీ.)

ప్రవాహ వేగమైన జీవితంలో మనిషి తనం కంటే మార్కెట్ విలువే గొప్పది..అనుకూల మిత్రుడే శత్రువుగా మారుతున్న విష సంస్కృతి,వికృత దోపిడీ జీవితాల్ని కొల్లగోట్ట్కుపోతుంది..వస్తు వ్యామోహంలో మనిషి నమ్మకాల రెక్కలు కతిరిస్తున్నాడు. అంటూ కవి కుమిలిపోతున్నాడు….

“మన దారులు చీలి పోతున్నాయి ../ మనం విడిపోయే సమయం ఆసన్నమయింది..
ఎందుకైనా మంచిది../ ఇక్కడే చివరి సంతకంగా విడిపోదాం../
జీవితానికి వేగం ముఖ్యమో /గమ్యం ముఖ్యమో తెలియని సందిగ్ధంలో..”
(చివరి సంతకం)

రక్తమూ ,కన్నీళ్లు,అగ్ని కలసి ప్రవహించే కవిత్వం “అవిశ్రాంతం” అన్న శివారెడ్డి మాట అక్షర సత్యం. రాధేయ రాబోయే రోజుల్లో మరింత సాహితీ సృజన చేస్తూ తన జైత్ర యాత్ర కొనసాగిస్తారని ఆకాంక్షిస్తూ ,అభినందిద్దాం..!

పుస్తకం వివరాలు:
అవిశ్రాంతం -వచన కవిత సంపుటి
ప్రచురణ: స్పందన -అనంత కవుల వేదిక
పేజీలు : 82
వెల :60 రూపాయలు
ప్రతులకు :ప్లాట్ నెంబర్ 312 , రాజహంస పాలస్ అపార్ట్మెంట్, ఆర్.టి.సి.బస్సు స్టాండ్ దగ్గర
అనంతపురం-515001 ., సెల్ :9985171411.

You Might Also Like

6 Comments

  1. శ్రీనిక

    సమీక్ష చాలా బాగుంది.
    తప్పక చదవాల్సిన పుస్తకం.
    సమీక్షకులకు ధన్యవాదములు.

  2. perugu

    మిత్రులకు..
    ధన్యవాదాలు..సమీక్ష లో మరింత ఈ లైన్లు అద్భుతం అనే
    కొన్ని లైన్లు మాత్రమే కాకుండా పుస్తకం చదివి మరెంతో
    ఆనందిస్తారని ..సంక్షిప్త పరిచయం చేసాను..
    రాధేయ ఇటీవలి వ్యాసాలూ చాల విలువైనవి..అలాగే
    కథలు మంచివి ..

  3. john

    అభినందనలు -కవికి

    అభినందనలు
    పెరుగు రామకృష్ణకు

    అభినందనలు
    పుస్తకం.నెట్ కు

  4. బొల్లోజు బాబా

    murali mohan gariki

    thank you for the info sir.

    what i meant is he writes good poetry ani sir.

    i could know more of him now.

  5. కోడీహళ్లి మురళీమోహన్

    ఈ పుస్తకంపై ఇక్కడ సమీక్ష చేయాలనుకున్నాను. అంతలోనే పెరుగు రామకృష్ణగారు సమీక్ష వ్రాశారు. వారికి నా అభినందనలు.

    బొల్లోజు బాబాగారూ!

    రాధేయగారిని కేవలం కవిత్వం మాత్రమే వ్రాసే కవిగా గుర్తించడం పొరపాటు. వారు పాతికకు పైగా కథలు వ్రాశారు. రాశిలో తక్కువే అయినా వాసిలో చెప్పుకోదగ్గ స్థాయిలో వున్న కథలు అవి. వారి కథల్లో ఒక కథ కథజగత్ వెబ్‌సైట్లో లభ్యమౌతుంది. వీలైతే చదవండి. రాధేయగారు ప్రస్తుతం ఆధునిక వచన కవిత్వంపై సాహిత్య వ్యాసాల పరంపర కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా ఉమ్మిడిశెట్టి సాహితీ అవార్డు ప్రదాతగా వీరి పాత్ర శ్లాఘనీయమైనది.

  6. బొల్లోజు బాబా

    wonderful intro

    కవిత్వం మాత్రమే వ్రాసే మనకున్న కొద్దిమంది కవుల్లో రాధేయ గారు ముందు వరుసలో ఉంటారు. వారికి అభినందనలు
    bollojubaba

Leave a Reply