Strand book stall వారితో

(మన దేశంలో జరిగే పుస్తకాల పండుగల్లో ముంబై స్ట్రాండ్ కు ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి స్ట్రాండ్ స్థాపకులు టి.ఎన్.షాన్బాగ్ గారి కుమార్తె విద్యా వీర్కర్ గారు బెంగళూరులో స్ట్రాండ్ యజమానురాలు. ఏటా బెంగళూరులో కూడా స్ట్రాండ్ పుస్తకాల పండుగ జరుగుతుంది. ఈ ఏడు కూడా నవంబర్ ఇరవై ఆరు నుండి డిసెంబర్ పదమూడు దాకా, బెంగళూరులోని బసవభవన్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా విజయవర్థన్ గారు విద్యా వీర్కర్ గారిని చేసిన వీడియో ఇంటర్వ్యూ ని ఇలా అక్షరబద్ధం చేసే ప్రయత్నం ఇది. మాటకు మాట అనువాదం కాదు కానీ, వీలైనంత వరకూ, స్ట్రాండ్ కథను ఆవిడ మాటల్లో చెప్పే ప్రయత్నం. వీడియో లంకెలు ఇక్కడ మరియు ఇక్కడ. పుస్తకం.నెట్ కోసం ఈ ఇంటర్య్వూ చేసిన విజయవర్థన్ గారికి ధన్యవాదాలు)

విద్యా వీర్కర్ గారి మాటల్లో:

DSC04451స్ట్రాండ్ బుక్ స్టాల్ ను మా నాన్న గారు అరవై ఒక్క సంవత్సరాల క్రితం పెట్టారు. ఆయన ఒక అనాథగా, నెలకి ఒక ’పెంగ్విన్’ మాత్రం కొనగలిగే పరిస్థితుల్లో ఉన్న కాలంలో, ఓ పెద్ద బుక్ స్టాల్లో ఆయన్ని లోపల పుస్తకాలు బ్రౌజ్ చేయనివ్వక, గెంటేసినంత పనిచేసారట. అప్పుడు ఆ అవమానంలో తిరిగివచ్చాక కలిగిన ఆలోచనల్లోంచి పుట్టింది స్ట్రాండ్ బుక్ స్టాల్. తన కొట్టులో కొనడానికి వచ్చేవారికి వీలైనంత తక్కువ ధరలకి పుస్తకాలు అందజేయాలని, అలాగే, తనకి జరిగినట్లు, అవమానం ఎవరికీ జరక్కూడదని – ఆయన నిర్ణయించుకున్నారట. ఈ విధంగా స్ట్రాండ్ కేవలం నాలుగొందలా యాభై రూపాయల పెట్టుబడితో మొదలైంది.

తరువాత అప్పట్లో స్ట్రాండ్ సినిమాహాలు యాజమాన్యాన్ని వారి హాలులోని కొంత స్థలంలో పుస్తకాలు పెట్టి అమ్ముకుంటానని అడిగారట. ఇంటర్వెల్ లో జనం వచ్చి చేరే ప్రాంతంలో. అదిగో, అక్కడ మొదలైంది స్ట్రాండ్ ప్రస్థానం. అప్పట్లోనే ఆయన కనీసం ఇరవై శాతం డిస్కౌంట్లతో అమ్మేవారు, తన స్థితికి మించిన పనైనా కూడా. క్రమంగా అక్కడికి వచ్చే బాగా చదువుకున్న వారు, టాటా, బిర్లా, గోద్రేజ్ వంటి పాత వ్యాపార కుటుంబాల వారు – మా నాన్న గారి పుస్తక పరిజ్ఞానానికి, ఆయనకి ఈ పని పట్ల ఉన్న ప్రేమకు ఆకర్షితులయ్యారు. దుకాణం ఇలాగే చాలా ఏళ్ళు కొనసాగింది. ఏళ్ళ తరువాత, ఫోర్ట్ వద్ద ఓ షాపు తక్కువ అద్దెకి దొరకడంతో, అక్కడికి మారారు. ఇప్పటి స్ట్రాండ్ బుక్ స్టాల్ ముంబై శాఖ అక్కడే ఉంది.

స్ట్రాండ్ తో నా అనుబంధం దాదాపు పదహారు సంవత్సరాల క్రితం స్ట్రాండ్ బెంగళూరు శాఖను ప్రారంభించడంతో మొదలైంది. నాకు నాన్నగారి వారసత్వాన్ని కొనసాగించాలని, ఆయనకి సహకరించాలనీ ఉండేది. నేను బెంగళూరులో ఉండేదాన్ని కనుక, ఇక్కడే స్ట్రాండ్ శాఖ మొదలుపెట్టడం ద్వారా ఈ పనిచేయడం సులువు అనిపించింది. అలా స్ట్రాండ్ బెంగళూరు మొదలైంది. ఇప్పుడు మాకు ఇన్ఫోసిస్, విప్రో క్యాంపస్ లలో కూడా ఆయా యాజమాన్యాల ఆహ్వానం వల్ల ప్రారంభింపబడ్డ శాఖలు ఉన్నాయి.

అందరూ అడుగుతూ ఉంటారు. ఇంత తగ్గింపులు ఇవ్వడం ఎలా సాధ్యం అని. నిజానికి – దీన్ని వివరించడం చాలా తేలిక, అలాగే చాలా కష్టం. టూకీగా చెప్పాలంటే, విక్రేతలుగా మాకు వచ్చే లాభంలో కొంతభాగాన్నే మేము కొనుగోలుదారులకి పంచుతున్నాం అనొచ్చు. మొదట వినడానికి నవ్వులాటగా అనిపిస్తుందేమో. కానీ, పుస్తకాలను కొనగలిగే ధరలకు అమ్మడం, అలాగే, పుస్తక ప్రియుల ప్రేమను అర్థం చేస్కుంటూ అమ్మడం స్ట్రాండ్ మూలసూత్రాలు అన్న విషయం గుర్తిస్తే, ఇదంత నవ్వులాట అనిపించదేమో. అవిరామంగా అరవై సంవత్సరాలుగా స్ట్రాండ్ ద్వారా చేసిన కృషికి ఫలితమే ఇప్పుడు ఇంత మంది అభిమానులు, మమ్మల్ని నమ్మే కొనుగోలుదారులూ. అంటే దాదాపు నాలుగు తరాల మేధావులు స్ట్రాండ్ ద్వారా ప్రయోజనం పొందారన్నమాట.

DSC04441ఇంకో విషయం ఏమిటీ అంటే, తక్కువ రేట్లో పుస్తకాలు అనగానే, తక్కువ రకం పుస్తకాలు అన్న అనుమానం రావొచ్చు. కానీ, ఇవన్నీ మంచి ప్రమాణాలున్న, అత్యుత్తమమైన పుస్తకాలు. అలాగే, కొత్త పుస్తకాలు అందరికంటే ముందుగా మా ద్వారా అందించాలని ప్రయత్నిస్తాము. అలాగే, ఇప్పుడు మేము మా వెబ్సైటు (లింక్) ద్వారా ఆన్లైన్లో పుస్తకాల కొనుగోలు సౌకర్యం, భారతదేశంలో ఏ ప్రాంతానికైనా పుస్తకాలు పంపగల సౌకర్యం చేకూరుస్తున్నాము. వెబ్సైటు నిర్మాణం కొద్దిరోజుల్లో పూర్తవుతుంది. వివరాలన్నీ త్వరలోనే తెలుపగలము.

స్ట్రాండ్ ద్వారా అప్పుడప్పుడూ పుస్తకాలు ప్రచురించాము కానీ, ప్రధానంగా మా ధ్యేయం అత్యుత్తమ పుస్తకాలను, సరసమైన ధరలకి అందజేయడం. ఈ ప్రధాన మార్గం నుండి పక్కకు వెళ్ళి ఎక్కువ పనుల్లో వేలు పెట్టేకొద్దీ అసలు విషయం పలుచనయ్యే ప్రమాదం లేకపోలేదు. అప్పుడప్పుడూ కొన్ని ఎంపిక చేసిన పుస్తకాలను మాత్రం ప్రచురిస్తాము. ఒక్కోసారి – “మీరేం చేస్తారో మాకు తెలీదు, ఈ పుస్తకాలు ప్రచురించాల్సిందే” అన్న పరిస్థితుల్లో కొన్ని పుస్తకాలు ప్రచురించారు నాన్నగారు. ఈమధ్య విల్ డ్యూరంట్ రాసిన “A case for India” ప్రచురించాము. దీని వెనుక ఓ కథ ఉంది. ఇన్ఫోసిస్ కి చెందిన మోహన్దాస్ పాయ్ గారి ద్వారా నా వద్దకు ఈ పుస్తకం వచ్చింది. ఆయనకి మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లోని ఓ షేక్ ఓ వ్రాతప్రతిని ఇచ్చాడట. నిజానికి “కేస్ ఫర్ ఇండియా” లో విల్ డ్యూరంట్ వాస్తవాలను రాసాడు. అందుకే, ఈ పుస్తకం 1931లో ప్రచురితమైనా కూడా కాపీలు దొరకలేదు. దీని ప్రచురణ బ్రిటీష్, అమెరికన్ దేశాల ద్వారా అణిచివేయబడ్డది. ఈ పుస్తకాన్ని వెలుగులోకి తేవాలంటే మేమే ప్రచురించక తప్పదని అర్థమైంది. అలా దీన్ని ప్రచురించాము.

DSC04446ఈ పుస్తకం రాసిన డ్యూరంట్ ప్రపంచంలో కొన్ని శతాబ్దాల కాలంలో పుట్టిన అత్యుత్తమ చరిత్రకారుల్లో ఒకరు. భారతదేశాన్ని విదేశీయులు ఎంత దారుణంగా వాడుకుంటున్నారో ఈ పుస్తకం ద్వారా ఆయన ప్రపంచానికి చెప్పారు. ఈ పుస్తకం చదవడం అందరికీ చాలా ముఖ్యమని నా అభిప్రాయం. ఈ వ్రాతపత్రి మా వద్ద ఐదేళ్ళుగా ఉన్నా కూడా, ఈ పుస్తకం రెండేళ్ళ క్రితమే ప్రచురించాము. భారతదేశానికి భిన్న రంగాల్లో గుర్తింపూ, గౌరవమూ లభిస్తోంది. ఇలా మున్ముందుకు నడుస్తున్న సమయంలో ఓసారి వెనక్కి చూడ్డంలో తప్పేమీ లేదని, దీన్ని ముద్రించాము. అలాగే, ఈ పుస్తకం కన్నడ అనువాదం – ’ముత్తజన భవ్య కణసు’ ఇటీవలే విడుదలైంది. వచ్చే నెల పూణేలో ఈ పుస్తకం మరాఠీ అనువాదం విడుదల చేస్తున్నాము. కొన్నాళ్ళ క్రితమే గుజరాతీ అనువాదం కూడా వచ్చింది. ఈ పుస్తకం మన యువతరం తప్పక చదవాల్సిన పుస్తకం. పాతతరం వారు ఎలాగో చదువుతారు అనుకోండి.

ఇలా అప్పుడప్పుడూ పుస్తక ప్రచురణలు కూడా చేస్తూ ఉంటాము. ఇలా ఇప్పటికి ఓ ఏడెనిమిది పుస్తకాలు ప్రచురించి ఉంటాము.

ఆడియో బుక్స్ పై విద్య వీర్కర్ అభిప్రాయం: నా ఉద్దేశ్యంలో ఆడియో బుక్స్ కి మన దేశంలో ఉన్న మార్కెట్ తక్కువే. ఇప్పటి బిజీ జీవితంలో ఆడియో బుక్స్ ద్వారా ఏ కార్లో ప్రయాణం చేస్తూనో వినడం సౌకర్యంగానే ఉంటుంది కానీ, పుస్తకం చదివే అనుభవం వేరు కదా.

హైదరాబాద్ వంటి ఇతర నగరాల్లోకి విస్తరించే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకి విద్య గారి సమాధానం: నగరంలో లేదు కానీ, ఇన్ఫోసిస్ ప్రాంగణంలో ఓ స్టోర్ ఉంది.

పుస్తకాలను వీలైనంత అందుబాటులో ఉన్న ధరలకి అందించడమే మా లక్ష్యం. ఇక్కడ దొరకని పుస్తకాలను అడిగినా కూడా, ఎలాంటి పుస్తకాన్ని అయినా, ఎక్కడ నుంచైనా, కనీసం ఇరవై శాతం తగ్గింపుతో తెచ్చి ఇవ్వగలగాలన్నది మా ఆశయం. ఇలాంటి పుస్తకాల పండుగల్లో ఎనభై శాతందాకా డిస్కౌంట్లు ఉంటాయి కొన్ని పుస్తకాల మీద. ఈ పుస్తకాల పండుగలో పెట్టేందుకు, అన్ని వయసుల పాఠకులకూ నచ్చేవిధంగా తీర్చిదిద్దేందుకు దాదాపు ఆర్నెల్ల కృషి ఉంటుంది మా వైపు నుండి.

ఈ మధ్యే ముంబై, బెంగళూరు దాటుకుని, పూణే లో కూడా పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశాము. చాలాకాలంగా పూణే నుండి ముంబై వచ్చి పుస్తకాలు కొనుగోలు చేస్కుని వెళ్ళే కస్టమర్లు ఉన్నారు మాకు. ఇక మిగితా నగరాల్లోకి కూడా వస్తామేమో త్వరలో – చూద్దాం.

(Photos and Video courtesy: Vijayavardhan)

You Might Also Like

5 Comments

  1. పుస్తకం » Blog Archive » బెంగళూరులో పుస్తకాల కొనుగోలు అనుభవాలు

    […] Strand Book Stall డికెన్సన్ రోడ్డులో మణిపాల్ సెంటర్ లో ఉందీ షాపు. కలెక్షన్ బానే ఉంది కానీ, స్ట్రాండ్ వారు ప్రతి ఏడూ రెండు సార్లు నిర్వహించే పుస్తక ప్రదర్శన లో పెట్టే పుస్తకాల సంఖ్యతో పోలిస్తే, ఈ షాపు అసలు లెక్కలోకి రాదని నా అభిప్రాయం. వీరితో కొన్నాళ్ళ క్రితం జరిపిన ఇంటర్వ్యూ ఇక్కడ చూడవచ్చు. […]

  2. leo

    @Purnima: Thanks for the clarification. Was curious after reading in the article about a hand written copy, suppression etc. I got the 1930 copy itself and I didn’t even try hard! Are there any documents on the web to prove the assertions in the article. Thanks.

  3. Purnima

    @leo: A friend of mine says that both are same books. I guess, you can go ahead and buy Strand’s copy very soon! 🙂

  4. leo

    Simon and Schuster 1930లో ప్రచురించినది ఇప్పుడు ప్రచురించినది ఒకటేనా? ఏమన్నా తేడాలు వున్నాయా?

  5. HalleY

    An year ago i had bookmarked two links about this

    A Bookstall stands tall – V. Gangadhar on T.N. Shanbag, the owner of the Strand Book Stall in Mumbai who was recently awarded Padmasri, and the Strand Fair that attracts huge crowds year after year
    http://blonnet.com/life/2003/02/17/stories/2003021700020100.htm

    Felicitation of Padmashri T.N.Shanbag,
    “On his contribution to the society for supplying knowledge
    through selling unique books through his Strand bookstall ”
    http://www.maharashtra.gov.in/english/chiefminister/Padmashree_T_N_Shanbag.pdf

    Read and Enjoy

Leave a Reply to Purnima Cancel