ప్రజాశక్తి బుక్ హౌస్ శ్రీనివాస్ రావు గారితో మాటా-మంతీ

హైదరబాద్ బుక్ ఫేర్ ప్రెసిడెంట్, ప్రజాశక్తి బుక్ హౌస్ సాదినేని శ్రీనివాస్ రావు గారిని ఇటీవల కలవడం జరిగింది. మా మాటల మధ్యలో తెల్సిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ.

ప్ర: ప్రజాశక్తి ఎప్పుడు ఎక్కడ మొదలయ్యింది?

జ: ప్రజాశక్తి ప్రచురణాలయం 1943వ సంవత్సరం మొదలయ్యింది. అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం దీనిపై నిషేధించింది. స్వాతంత్ర్యానంతరం 1948వ సంవత్సరంలో మళ్ళీ మొదలయ్యింది. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వామపక్ష భావజాలాలున్న ఈ సంస్థని నిషేధించింది. ప్రజాశక్తికి వారసత్వంగా 195౩లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ మొదలయ్యింది. ఆ పై 1977వ సంవత్సరంలో ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రారంభమయ్యింది.

(“ఈ విశేషాలన్నీ మా రజతోత్సవ పత్రికలో వెలువరిచాము. అందులో కేవలం ప్రజాశక్తి గురించే కాక తెలుగులో పుస్తక ప్రచురణ రంగం, విక్రేతల గూర్చి చాలా సమాచారం ఉంటుంది.” అంటూ ఒక సావనీర్ ఇచ్చారు. అందులోని వ్యాసాలను పుస్తకం.నెట్ లో వేయడానికి అనుమతినిచ్చారు. వాటిని యూనీకోడికరించి సమయానుకూలంగా ప్రజాశక్తి పేరిట పుస్తకం.నెట్ లో ప్రచురించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.)

ప్ర: ఇప్పటి వరకూ ఎన్ని పుస్తకాలు ప్రచురించి ఉంటారు?

జ: రెండు వేలకు పైగా ప్రచురించాము.

ప్ర: మీరు ఎలాంటి పుస్తకాలను ప్రచురిస్తారు?

జ: మేము “లెఫ్ట్” కి సంబంధించిన పుస్తకాలను ప్రచురిస్తూ ఉంటాము. కాల్పనిక సాహిత్యమనగానే విశాలాంధ్ర ఎలా గుర్తు వస్తుందో, వామపక్ష సాహిత్యమంటే ప్రజాశక్తి బుక్ హౌస్ అన్నమాట.

మా ప్రత్యేకత ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థక, సామాజిక రంగాల్లో సమకాలీన సమస్యలపై మేము చిన్న చిన్న పుస్తకాలు (బుక్-లెట్స్) ను ప్రచురిస్తాము. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక మాంద్యం మీద రెండు చిన్న పుస్తకాలు, ఒక పుస్తకం ప్రచురించాం. అలానే బాబ్రీ మసీదు వివాద సమయంలో రెండు లక్షల వరకూ కాపీలు అమ్మాము. గుజరాత్ అల్లర్ల మీద ఇంగ్లీషు, తెలుగు భాషల్లో పుస్తకాలు ప్రచురించాం. ప్రభాత్ పట్నాయక్ గారి పుస్తకాల అనువాదాలు ప్రచురించాం. 2004 ఎన్నికల సమయంలో ఇరవై నాలుగు సమస్యలను గుర్తించి వాటికోసం బుక్‍లెట్స్ ప్రచురించాం.

మా మరో ప్రత్యేకత విద్యారంగానికి సంబంధించి విశ్లేషణాలతో కూడిన పుస్తకాలను ప్రచురించాం. గిజుభాయి బధేక అనే గుజరాతీ, భారత విద్యారంగానికి ఎనలేని కృషి చేసినవారు. వీరి సంపూర్ణ సాహిత్యాన్ని అనేక సంపుటాలుగా ప్రచురిస్తున్నాము. అలానే ప్రపంచ విద్యారంగానికి సంబంధించిన జాన్ హోల్ట్ “పిల్లలు నేర్చుకోవడంలో ఎలా వెనుకబడతారు?”, “పిల్లలు ఎలా నేర్చుకుంటారు?” అన్న పుస్తకాలు ప్రచురించాము. వీటిలో భాగంగానే “బార్బియారా బడిపిల్లల నుంచి టీచర్లకు ఉత్తరం” అనే పుస్తకం కూడా ఉంది. చిన్నపిల్లలు తాము బడి మానివేయడానికి గల కారణాలు ఉత్తరాల ద్వారా తెలియజేస్తారు. వీటి వల్ల పిల్లల ప్రకారం ఒక పాఠశాలలో టీచర్లు, వాతావారణం ఎలా ఉండకూడదు, తల్లిదండ్రులు ఎలా ఉండకూడదు అన్న విషయాలపై ఆసక్తికరమైన అంశాలు తెలుస్తాయి.

ఇవే కాక స్కూల్ విద్యార్థులకి అర్థమయ్యే విధంగా విశ్వం, శాస్త్రసాంకేతిక విషయాలు తెలిపే పుస్తకాలూ మా వద్ద దొరుకుతాయి. మహనీయుల జీవిత విశేషాలూ, పిట్ట కథలూ లాంటివి కూడా ఉంటాయి. ఈ మధ్యకాలంలో నెల్లూరి మాండలికంలో నెలూరి జానపద కథలను ప్రచురించాం. ఇందులో నెల్లూరికి సంబంధించి పురాతన కథలూ, స్థానిక కథలూ లాంటివుంటాయి. ఈ పుస్తకానికి విశేష ఆదరం లభించింది. ఇప్పుడు వేరే ప్రాంతాల్లో ఇదే విధమైన పుస్తకాలు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం.

ప్ర: మీరిన్ని విభాగాల్లో పుస్తకాలను ప్రచురిస్తారు, సరే! కానీ అవి ప్రజల్లోకి ఎలా వెళ్తాయి?

జ: ప్రజల్లోకి పుస్తకాలను తీసుకెళ్ళడానికి మా యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తుంది. అందులో భాగంగా ప్రతీ జిల్లాలోనూ మా ఏజెంట్లూ, ఆడ్ స్టాఫ్ లు ఉంటారు. వారు కొత్త పుస్తకాల గురించి అనేకమంది తెల్సుకునేట్టు చేస్తారు.

ప్ర: ఇన్నేసి పుస్తకాలు రచించాలన్నా, అనువదించాలన్నా చాలా మంది రచయితలు కావాల్సివస్తారు కదా! వారినెలా ఎన్నుకుంటారు?

జ: దాని కోసం మాకు ఎడిటోరియల్ బోర్డు ఉంది. ఏ ఏ భాషల్లో ఏ ఏ అంశాలపై పుస్తకాలను ప్రచురించాలనేది వారు నిర్ణయిస్తారు. మా ఎడిటోరియల్ తెలకపల్లి రవి వంటి ప్రముఖులు ఉన్నారు.

ప్ర: దశబ్దాల బట్టీ మీకు పనిచేస్తున్న వారు కాక, రచనా విషయంలో ఈ తరం వారు ఎవరైనా ఉన్నారా?

జ: ఎందుకులేరు! ఈ తరం పి.జీలు చేసినవారు కూడా మా దగ్గర పనిచేస్తుంటారు. అదే కాక, మేము జిల్లాలవారిగా యువ రచయితలను ఆహ్వానించి, వారికి రచన విషయంలో సెమినార్లు, వర్క్ షాపులు నిర్వహిస్తుంటాము.

ప్ర: ప్రచురణ, విక్రయ రంగాల్లో ఉన్న మీ ముఖ్యోద్దేశ్యం ఏమిటి?

జ: జనాల్లో scientific temper ను పెంపొందించడమే మా లక్ష్యం. మీరీ పుస్తక షాపుకి వస్తూ పడిపోయారనుకుందాం. “నా ఖర్మ ఇలా ఏడ్చింది” అనుకోవడం సరి కాదు. ఎందుకు పడ్డాను, పడ్డానికి గల కారణాలేంటి, పడకుండా ఉండడానికి ఏమి చెయ్యాల్సి ఉంది -లాంటి వన్నీ ప్రశ్నించుకుంటే మనకి కారణాలు తెలుస్తాయి. పునర్జన్మలు ఉన్నాయనీ – ఇంకా ఎన్నో మూఢవిశ్వాసాలు ఇంకా ప్రబలంగా ఉన్నాయి మన సమాజంలో. వాటిని వ్యతిరేకించి, ప్రశ్నించి, అభివృద్ధిని సాధించాలంటే మనమందరం కల్సి ఇంకా ఎన్నో ప్రయత్నాలు చెయ్యాలి.

వారితో మాటలు ముగిశాక, ప్రజాశక్తి గోడౌన్‍లో కాసేపు ఉండనిచ్చారు. అక్కడ పుస్తకాలను చూస్తూ ఉంటే పై మాటల్లో అంతరార్థం తెల్సింది. పుస్తకం.నెట్ కోసం తమ సావనీర్ పునర్ముద్రించడానికి అనుమతినే కాక, ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం అనుబంధం “స్నేహ”లో వెలువడే “మీకు స్పూర్తిచ్చిన పుస్తకం” వ్యాసాలను కూడా పుస్తకం.నెట్ పాఠకులకు వీలుగా ప్రచురించమన్నారు. వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇన్ని విశేషాలను పంచుకున్నందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు!

You Might Also Like

One Comment

  1. Praveen

    నేను కూడా ప్రజాశక్తి బుక్ హౌస్ కస్టమర్ నే. నేను ఉండే శ్రీకాకుళం పట్టణంలో విశాలాంధ్ర బ్రాంచ్ ఉంది కానీ వైజాగ్ లోని ప్రజాశక్తి బ్రాంచ్ కి కూడా వెళ్ళి కొంటుంటాను. ప్రజాశక్తి బుక్ హౌస్ లో తెలకపల్లి రవి గారి పుస్తకాలూ, స్త్రీవాద పుస్తకాలూ ఎక్కువగా కొన్నాను.

Leave a Reply