పుస్తకం
All about booksపుస్తకలోకం

December 13, 2009

తెలుగు పుస్తక ప్రచురణక్రమం

వ్యాసకర్తలు: నవోదయ రామమోహనరావు, నవభారత్ ప్రకాశరావు.

సృష్టిలో ప్రతి ప్రాణికి తనకంటూ ఒక భాష ఉంటుంది. మానవులకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ఆయా ప్రాంతాలనుబట్టి రకరకాల భాషలు ఉంటాయి. ఎవరికివారే ఘనులు కాబట్టి అందరూ తమ జాతి, తమ భాష గొప్పతనాన్ని ఘనంగా చాటుకుంటూ ఉంటారు.

జాతుల సంగతి ఎలా ఉన్నా భాష విషయానికి వస్తే ఏ భాష అభివృద్ధికైనా సాహిత్యమే పట్టుగొమ్మ. సాహిత్యానికేమో రచయిత, ప్రచురణకర్త, పుస్తక విక్రేత, పాఠకుడు మూలస్తంభాలు. ఇందులో ఏ ఒక్క స్తంభం దెబ్బతిన్నా సాహిత్యం పునాదులు కదిలినట్లే.

సుమారు మూడొందల సంవత్సరాలకు పూర్వం చైనా నుంచి బయలుదేరి యూరప్ మీదుగా మన దేశం చేరిన అచ్చు యంత్రం 1811 సెరంపూర్ లో తమ పని ప్రారంభించింది. అంతకు ముందు తాళపత్రాలపైనా, శుభ్రం చేసిన జంతు చర్మాలపైనా, రాగి రేకుల పైనా రచనలు జరిగేవి. సెరంపూర్ లోని క్రిస్టియన్ మిషనరీలు మతప్రచార సాహిత్య ప్రచురణకు గాను, ఆ తర్వాత వరుసగా మద్రాసు, బళ్ళారి, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్‍లలో ప్రచురణ సంస్థలను ప్రారంభించాయి. ఆంగ్లేయులు తమ పాలనా సౌలభ్యం కోసం, మిషనరీలు తమ మతప్రచారానికి తప్పని సరిగా స్థానిక భాషలు నేర్చుకోవల్సి వచ్చింది. అందుకోసంగాను 19వ శతాబ్దం ప్రారంభంలో నిఘంటువులు, వ్యాకరణాలపైనా అధ్యయనం చేసి పుస్తకాలు ప్రచురించారు. మత ప్రచరానికి గాను విరివిగా కరపత్రాలు ప్రచురించారు.

సి.పి.బ్రౌన్ ఇంగ్లీషు- తెలుగు నిఘంటువు(1812) తో ప్రారంభమైన తెలుగు ప్రచురణ కాంప్‍బెల్, రావిపాటి గురుమూర్తుల తెలుగు వ్యాకరణాల(1816)తో ముందుకు సాగింది. అప్పటి మద్రాసు గవర్నర్ థామస్ మన్రో ప్రోత్సాహంతో స్థాపితమైన మద్రాసు స్కూల్ బుక్ సొసైటీ (1820) తెలుగులో వాచకములు, విక్రమాదిత్య కథలూ, వేమన పద్యాలు, సుమతీ శతకము, అమరము మొదలైన పుస్తకాలు ప్రచురించింది. అప్పట్లో ప్రచురితమైన ఆంధ్ర శబ్ద చింతామణి (1840), సి.పి.బ్రౌన్ ఇంగ్లీషులోకి అనువదించిన వేమన శతకమూ(1829), బెండగిరి నాగయ్య సటీకాంధ్ర శేషము(1840), అక్షర క్రమ నిఘంటువు (1842), మామిడి వెంకయ్య ఆంధ్ర దీపిక (1848) మొదలైన గ్రంధాలు ప్రచురితమై ఆంగ్లేయులకు బాగా ఉపయోగపడ్డాయి.

చిన్నయ్య సూరి బాలవ్యాకరణం, నీతిచంద్రికల ప్రచురణ, తెలుగు ప్రచురణ రంగంలో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. 19వ శతాబ్ధ ద్వితీయార్థంలో తెలుగు రచనలు, ప్రచురణలకు ప్రోత్సహించిన వారిలో శ్రీయుతులు కందుకూరి వీరేశలింగం, వేదం వెంకట రాయ శాస్త్రి, వెంకట పార్వతీశ్వర కవులు, చిలుకూరి వీరభద్రరావు, కొమ్మరాజు వేంకట లక్ష్మణరావు, గురజాడ అప్పారావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, గురజాడ శ్రీరామమూర్తి గార్లను ప్రముఖంగా చెప్పుకోవాలి. ప్రచురణ రంగంలో మద్రాసులో 1854లో స్థాపించిన వావిళ్ళ రామస్వామిశాస్త్రులు ఆండ్ సన్స్, సి.పి.బ్రౌన్ల పాత్ర తెలుగుజాతి మరువరానివి. అప్పటివరకూ తెలుగులో ఆసక్తి ఉన్న రచయితలు తమ రచనలను తామే ఏవో తిప్పలు పడి ప్రచురించుకొని తామే అమ్ముకొని, అమ్ముకోలేనప్పుడు ఉచితంగా పంచి పెట్టేస్తుండేవారు. ఈ పరిస్థితి ఇప్పటికీ అక్కడక్కడా కనిపిస్తున్నా, వావిళ్ళ స్థాపనతో ప్రచురణ సంస్థలు లాభనష్టాల భారాన్ని చాలా వరకూ తమ నెత్తికి ఎత్తుకునే సంప్రదాయం ప్రారంభమయ్యింది.

తెలుగు ప్రచురణకు 19వ శతాబ్దంలో చాలా వరకూ మద్రాసే కేంద్రంగా ఉండేది. సరస్వతీ తిరువేంకటాచార్యులు, పాలపర్తి నాగేశ్వరరావు, బి.వి. రంగయ్య శ్రేష్ఠి, వంకాయల కృష్ణస్వామి శెట్టి, పిడుగు వెంకట కృష్ణారావు, వేదం వెంకటరాయ శాస్త్రి మద్రాసులో ప్రచురణ రంగానికి ఆద్యులు అని చెప్పుకోవచ్చు. ప్రాచీన గ్రంధాలు ప్రచురించిన జ్యోతిష్మతి ముద్రణాలయం, వనప్పాకం అనంతాచార్యులు స్థాపించిన వైజయంతీ ముద్రాక్షరశాల, రెంటాల వెంకట సుబ్బారావుగారి విక్టోరియా డిపోలే కాకుండా న్యాయశాస్త్ర పుస్తకాలు, వివిధ సంస్కృత గ్రంధాలు ప్రచురించిన మానవల్లి రామకృష్ణ కవి, వైష్ణవ సంప్రదాయ గ్రంధాలు ప్రచురించిన కందాల శేషాచార్యులు మద్రాసులో తెలుగు ప్రచురణ రంగానికి తమ వంతు కృషి చేసిన వారిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ వారనవచ్చు.

అప్పట్లో కందుకూరి వీరేశలింగం, వావిల కొలను సుబ్బారావుగార్లు మద్రాసులోనే ఉద్యోగాలు చేస్తుండేవారు. పిఠాపురం రాజా, జయంతి రామయ్య  పంతులు మద్రాసు కేంద్రంగా ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపించి విశేష కృషి చేశారు. వెస్ట్ వర్డ్ కంపనీ, అమెరికన్ డైమెండ్ ప్రెస్, పెద్ద బాల శిక్ష ప్రచురించిన ఎన్.వి.గోపాల్ ఆండ్ కో., వాచకాలు, వ్యాకరణాలు, ప్రబంధాలు, భారత భాగవత రామాయణాలు ప్రచురించిన వెంకటేశ్వర ఆండ్ కో, ఆనంద్ ప్రెస్, మొదలైన కంపెనీలే కాక, కవిత్రయ భారతాన్ని ప్రచురించిన నాతానమ్మయ్య శెట్టి, ఆయుర్వేద గ్రంధాలు ప్రచురించిన డి.గోపాలాచార్యులు, ఆర్య భారతీ గ్రంధమాల – ఆది నారాయణ శాస్త్రి గార్ల కృషి గత శతాబ్ధంలో చెప్పుకో తగ్గది. ఇదే కాలంలో బిటీషు ప్రచురణ సంస్థలు మాక్మిలాన్, ఓరియంట్ లాంగ్మన్, ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్సులు వ్యాపారదృష్టితో మద్రాస్ కేంద్రంగా మనదేశంలో ప్రచురణలు ప్రారంభించాయి. పెరుగుతున్న విద్యాకాంక్షను దృష్టిలో ఉంచుకొని వారు బొమ్మలతో పాఠ్య పుస్తకాలను ప్రచురించారు. ఈ పుస్తకాలను మార్పడన్ అను ఆంగ్లేయుడు వీరేశలింగంగారి సహకారంతో తయారుచేశాడు. అదే సమయంలో ఆనంద్ ప్రెస్, క్రిస్టియన్ లిటరేచర్ సొసైటీలు కూడా రంగంలోకి దిగాయి. చిలకమర్తి లక్ష్మీనరసింహం రాసిన రామచంద్ర విజయం, అహల్యా భాయి; కందుకూరి వీరేశలింగం – అభిజ్ఞాన శాకుంతలం, హాస్య సంజీవిని, ఆంగ్ల కవుల చరిత్ర; బహుజనపల్లి సీతారామాచార్యులు – శబ్దరత్నాకరము; గురజాడ శ్రీరామ మూర్తి – కవి జీవితములు; మదిర సుబ్బన్న దీక్షితులు గారి కాశీ మజిలీ కథలు; వడ్డాది సుబ్బారాయుడు భక్తి చింతామణి; గురజాడ అప్పారావు కన్యాశుల్కం, యనమండ్ర వెంకట రామయ్య పురాణ నామ చంద్రికలు – గత శతాబ్దంలో వెలువడిన కొన్ని ఉత్తమ ప్రచురణలు. ఆ శతాబ్ధంలో సాహిత్యపోషణ పేరిట పుస్తక ప్రచురణ ఎక్కువ రాజుల ప్రాపకంలో జరిగేది. పిఠాపురం, బొబ్బిలి, ముక్త్యాల, పానుగల్లు, పాలవంచ, కార్పేటి నగరం, సాలూరు, చల్లపల్లి, న్యూజివీడు రాజులు ముఖ్యులు అనవచ్చు.

ఈ శతాబ్ద ప్రారంభం నుంచీ ప్రచురణ రంగానికి సంబంధించిన సమాచారం పూర్తిగా కాకున్నా విరివిగానే లభిస్తోంది. సమాజంలో చోటు చేసుకున్న మార్పులు, సంఘం, భాష, సార్వస్వత సంస్కరణ ఉద్యమాలు ప్రత్యేక సంస్థలు, ప్రత్యేక సాహిత్యం ఉన్నాయి. 1905లో కొమ్మరాజు లక్ష్మణరావు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, రావిచెట్టు రంగారావు, అయ్యదేవర కాళేశ్వరరావు, రాజా నాయని వెంకట రంగారావు స్థాపించిన విజ్ఞాన చంద్రిక గ్రంధ మండలి ఈ రంగంలో ఒక నూతన శకానికి నాంది పలికింది. ఉన్నత ఆశయాలతో వారు ప్రచురించిన గ్రంధాలు నేటికీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. అబ్రహం లింకన్, బెజమెన్ ఫ్రాంక్లిన్ల జీవిత చరిత్రలు, ఆంధ్రుల చరిత్ర, శివాజీ చరిత్ర, రసాయన శాస్త్ర పదార్థ విజ్ఞాన శాస్త్ర, అర్థశాస్త్రం, ఆరోగ్య సంబంధ పుస్తకాలనెంటినో ఈ సంస్థ ప్రచురించింది. దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ భాషలో మొదటి విజ్ఞాన సర్వస్వాన్ని ప్రచురించిన ఘనత ఈ సంస్థదే! వీరు నిర్వహించిన చారిత్రక నవలల పోటీలో దుగ్గిరాల రాఘవచంద్రయ్య సచ్చాస్త్రి రాసిన విజయనగర సామ్రాజ్యము పుస్తకానికి ప్రధమ బహుమతి ఇచ్చారు. వీరు 1916 వరకూ సుమారు ముప్ఫై పుస్తకాలు ప్రచురించి మొదటి ప్రపంచ యుద్ధకాలంలో సంస్థను తాత్కాలికంగా ఆపివేశారు. తిరిగి 1924లో పునరుద్ధరణ ప్రయత్నాలు జరిగాయి కానీ సఫలం కాలేదు.

ఈ దశాబ్ధంలో వెలువడిన గ్రంధాలలో పానుగంటి లక్ష్మీనరసింహరావు-రాధాకృష్ణ, తిరుపతి వెంకట కవుల పాండవ జననమూ, పాండవ విజయమూ వగైరా, దాసు నారాయణ రావు పాదుకా పట్టాభిషేకమూ, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి బొబ్బిలి యుద్ధం, ఉన్నవ లక్ష్మీనారయణ అక్బరు చరిత్ర, బండారు అచ్చమాంబ -అబలా సచ్చరిత్ర రత్నమాల, చిలకమర్తి – సౌందర్య తిలకం; ముడుంబై అలివేలు మంగతాయారు – శ్రీ జనకల్పవల్లి; చాగంటి శేషయ్య, చిలంగి శ్రీనివాసరావు వగైరాలు అనువదించి ప్రచురించిన బెంగాలీ నవలలు (రాధారాణీ, కృష్ణకాంతుని మరణశాసనము); గురజాడ అప్పారావు – నీలగిరి పాటలు, ముత్యాల సరాలు, దిద్దుబాటు; రాయప్రోలు సుబ్బారావు– తృణకంకణము, వేటూరి ప్రభాకర శాస్త్రి కనకాభిషేకము మొన్నగునవి.

1908లో స్థాపించిన ఆంధ్రపత్రిక కూడా రచనలు ప్రోత్సహించి తన వంతు కృషి ఛేసింది. అదే సంవత్సరంలో బందరులో ఆంధ్ర భాషాభివర్ధని గ్రంధమాలను స్థాపించారు. వెంకట పార్వతీశ్వర కవుల రచనలు, వివిధ అనువాదాలను ప్రచురించిన ఆంధ్ర ప్రచారిణి గ్రంధమాలను అయ్యగారి నారాయణ మూర్తి, నిడదవోలు రామచంద్రా రెడ్డి మొదలైన వారు స్థాపించారు. 1911లో పిఠాపురం మహారాజు, జయంతి రామయ్య పంతులు, వేదం వేంకట రాయశాస్త్రి – ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించి గ్రాంధిక భాషా ప్రచారానికి తీవ్రంగా కృషి చేశారు. వారికి పోటీగా గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి పంతుల గార్లు వ్యావహారిక భాష ప్రచారం చేశారు.

1914లో కృష్ణాజిల్లాలో పటమట కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ స్థాపన జరిగింది. ముసలమ్మ మరణం లాంటి పుస్తకాలెన్నింటినో ప్రచురించిన ఈ సంస్థ నడిపిన గ్రంథాలయోద్యమం దేశవ్యాప్త ఖ్యాతిని సంపాదించుకుంది. చెన్నపూరి ఆంధ్రమహాసభ 1916నుంచి ప్రచురణలో ప్రారంభించింది. తెనాలిలో తల్లావఝ్జల శివశంకర శాస్త్రి ఆద్వర్యంలో 1918లో ఏర్పడిన సాహితీ సమితి ఎన్నో ఖండకావ్యాలను ప్రచురించింది. 1918లో స్థాపించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా కొన్ని రచనలు ప్రోత్సహించి ప్రచురణలకు అవకాశం ఇచ్చింది. ఈ దశాబ్దంలో రాయప్రోలు సుబ్బారావు – స్నేహలత, అబ్బూరి రామకృష్ణారావు – జలాంజలి, వేటూరి ప్రభాకర శాస్త్రి – చాటుపద్యమణిమంజరి, ధర్మవరం రామకృష్ణాచార్యులు – విషాద సారంగధరం, గురజాడ శ్రీరామ మూర్తి -తిమ్మరుసు చరిత్ర, కాళ్ళకూరి నారాయణరావు -పద్మవ్యూహము, చిలకమర్తి – రాజరత్నము, పానుగంటి లక్ష్మీనరసింహరావు – ఆధునిక కవి జీవితములు, దువ్వూరి రామిరెడ్డి – కృషీవలుడు, దీపాల పిచ్చయ్య శాస్త్రి – చాటు పద్య రత్నాకరము చెప్పుకో తగ్గవి.

ఇప్పటివరకూ ఆదర్శం ప్రధానంగా ప్రచురణలు సాగాయి. 1920 తర్వాత మాత్రం వ్యాపార దృష్టి సోకిన దాఖలాలు కనిపిస్తున్నాయి. సమిష్టిగా తప్ప ఈ రంగంలోకి అడుగిడేందుకు సాహసించని కాలం పోయి, చాలా మంది ప్రచురణకర్తలు, పుస్తక విక్రేతలూ బయలుదేరారు. 1920లో మారుతీ రామా ఆండ్ కో, విజయవాడ, 1921లో ఆంధ్రగ్రంథమాల, మద్రాస్ (ఆంధ్ర పత్రిక వారిది), 1923లో ఎం. శేషాచలం ఆండ్ కో, బందరు, 1923లోనే సరస్వతీ గ్రంథ మండలి, అద్దేపల్లి లక్ష్మణ స్వామీ ఆండ్ కో., రాజమండ్రి, 1925లో ది ఓరియెంట్ పబ్లికేషన్స్ కంపెనీ, తెనాలి, 1928లో బాల సరస్వతీ బుక్ డిపో, కర్నూలు, 1930లో రాయలూ ఆండ్ కంపెనీ, కడప, 1930లోనే జయానికేతన్, తాడేపల్లి గూడెంలు స్థాపితాలై ప్రచురణ రంగంలో ఉప్పెన సృష్టించాయి. ఆ దశాబ్దంలోనే పుస్తక విక్రేతలు ఈ రంగంలోకి అడుగిడి ప్రచురణకు మంచి ఊతం ఇచ్చారని చెప్పుకోవచ్చు. కె.ఎన్. కేసరి 1928లో గృహలక్ష్మీ మాస పత్రికను  మద్రాసులో స్థాపించారు. ఈ దశాబ్దాంతంలోనే రాజమండ్రిలో శృంగార గ్రంథమాల, అభినవాంధ్ర గ్రంథమాలలు, నల్గొండ జిల్లా సూర్యపేటలో కృషి ప్రచారిణి గ్రంథమాలలు విశేష కృషి సలిపాయి. ఆంధ్రపత్రిక తరఫున కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు స్థాపించిన ఆంధ్ర గ్రంథమాల సంస్థ భగవద్గీత, బసవపురాణం, పండితారాథ్య చరిత్రలు ప్రచురించారు. పద్దిరాజు సీతారామచంద్రరావు, రాఘవరావు సోదరులు మొదట యునిగుర్తిలో స్థాపించి తరువాత కరీంనగర్ నెమలి కొండకు తరలించిన విజ్ఞాన ప్రచారిణి గ్రంథమాల 1932 వరకూ 21 గ్రంథాలను ప్రచురించింది.

1930  తర్వాత ప్రజలలో స్వాతంత్రేచ్ఛ పెరిగి స్వాతంత్ర పోరాటం ఉదృతం కావడమే కాక, విజ్ఞాన పిపాస కూడా బాగా పెరిగి, ప్రచురణ రంగానికి మంచి ఊతమిచ్చింది. దాంతో ప్రచురణ సంస్థలు, పుస్తక విక్రేత సంస్థ గణనీయంగా పెరిగింది. పాలకొల్లు కేంద్రంగా ఆండ్ర శేషగిరి రావు, విజాపూరి గ్రంథమాల స్థాపించారు. పురిపండా అప్పలస్వామి, శ్రీశ్రీ, తదితరులు విశాఖపట్నంలో కవితా సమితి స్థాపించి రచయితలను తద్వారా ప్రచురణాలయాలను ప్రోత్సహించారు. ఈ దశాబ్దంలో ప్రముఖ రచనలెన్నో ప్రచురితాలయ్యాయి. 1931లో బళ్ళారిలో శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, 1931లోనే దోమా వెంకటస్వామిగుప్తగారి వాఙ్మయ వినోదినీ గ్రంథమాల, 1935లో ముంగండలో విశ్వసాహిత్యమాల, 1936లో కవితిలక గ్రంథమాల, మద్రాస్, 1938లో హైదరాబాద్‍లో అణా గ్రంథమాల, 1938లోనే  వట్టికోట అళ్వారుస్వామి దేశోద్ధారక గ్రంథమాల, 1939లో గుండువరపు హనుమంతరావు హైదరాబాద్ ఆంధ్రకేసరి గ్రంథమాల మొదలైన సంస్థలు సలిపిన సాహిత్యసేవ గణనీయమైనది. వీటిలో శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల స్థాపకుల ఉద్యోగరీత్యా గ్రామాంతరాలు వెళుతూ ఉండటంతో ఆ సంస్థ అనంతపురం, హిందూపురాలకు మారుతుండేది. ఇఫ్పటికీ హిందూపురం కేంద్రంగా పని చేస్తూనే ఉంది.

గద్దె లింగయ్య 1931లో స్థాపించిన ఆదర్శ గ్రంథమండలి 1950లో విజయవాడకు తరలింది. ఈయన రాసిన విప్లవ వీరులు, విప్లవ యుగము నిషేధానికి గురయ్యాయి. లింగయ్య పడవలపై అచ్చుయంత్రాలను అమర్చి రహస్యంగా పుస్తకాలు, కరపత్రాలు ప్రచురించి స్వాతంత్రోద్యమానికి ఎంతగానో పాటుపడ్డారు.
బెంగాలీ నవలల అనువాదాలు మొదలైన పుస్తకాలు సుమారు ఓ 150 వరకు ప్రచురించిన ఆంధ్ర ప్రచారిణి గ్రంథమాల 1936లో రజతోత్సవం జరుపుకుంది. కృష్ణాజిల్లా పెడసనగల్లులోని నవయుగ ప్రచురణాలయం వారు నార్ల వెంకటేశ్వరరావు రచనలు, రష్యన్ గాథల అనువాదాలను, స్వదేశీ సంస్థానాలు, గోపీచంద్ అసమర్థుని జీవయాత్రలను ఈ దశాబ్దంలోనే ప్రచురించారు. తెనాలి యువబుక్స్ వారు కొడవటిగంటి కుటుంబరావు రచనలు, చక్రపాణి శరత్ రచనల అనువాదాలు కూడా ఇప్పటివే. ఈ దశాబ్దంలో గ్రంథాలయోద్యమం, స్వాతంత్రోద్యమాలు ముమ్మరంగా సాగి తమతోబాటు ప్రచురణ రంగానికి కూడా తీరిక లేకుండా చేశాయి.

ఇక 40వ దశకానికివస్తే, 1940లో కల్చరల్ బుక్స్ లిమిటెడ్, మద్రాస్, 1942లో ప్రజాశక్తి ప్రచురణాలయం – మొగల్రాజపురం, విజయవాడ, 1943లో ఆంధ్ర సారస్వత పరిషత్తు – హైదరాబాద్, 1943లోనే దేశీకవితా మండలి – విజయవాడ, 1945లో త్రివేణీ పబ్లిషర్స్ – మచిలీపట్నం స్థాపితాలై విశేషకృషి చేశాయి. స్వాతంత్ర్యం వచ్చిన ఈ దశాబ్దంలో స్వాతంత్ర్య, గ్రంథాలయోద్యమాల ప్రభావం ప్రచురణాలయాలపై బాగా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ప్రభుత్వం సైనికుల కాలక్షేపం కోసం పుస్తకాలను విరివిగా కొనేది. నవలలు చదవడం తప్పుగా భావించే ఆ కాలంలో జంపన, కొవ్వలిల నవలలు దొంగతనంగానైనా చదివేవారు చాలామంది ఉండటంతో నవలలు ప్రచురణకు గుర్తింపు వచ్చింది. స్వాతంత్ర్యానంతర కాలంలో, 1947లో తెలుగు భాషా సమితి-మద్రాస్ 1948లో ఈదర వెంకటరావు, వెంకట్రామయ్య – వెంకట్రామా ఆండ్ కో– ఏలూరు, కొండవల్లి వీరవెంకయ్య ఆండ్ సన్స్– రాజమండ్రి, ప్రగతి ప్రచురణాలయం – నిడమర్రు, బి.వి. ఆండ్ సన్స్ – కాకినాడ, నాస్తిక కేంద్రం- విజయవాడ, జనతా ప్రచురాణలయం – విజయవాడ 1950లో పశ్చిమ గోదావరి జిల్లా నత్తరామేశ్వరంలో కాలచక్రం ప్రచురణలు పుట్టి విశేష కృషి చేశాయి. 1953లో స్థాపితమైన విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రత్యేక సిద్ధాంతంతో ప్రచురణలు ప్రారంభించి కాలగమనంలో ఎన్నో ఆటుపోటులు తట్టుకొంటూ ఏవో కొన్ని మార్పులతో విజయవంతంగా కొనసాగుతోంది.

తరువాతి దశాబ్దంలో స్థాపించిన ప్రచురణ సంస్థలలో మరియు విజయవాడలో సాహిణీ పబ్లికేషన్స్, గుంటూరులో నవయుగ పబ్లిషింగ్ హౌస్, నగారా పబ్లికేషన్స్, సికింద్రబాద్‍లో దాచేపల్లి కిష్టయ్య ఆండ్ సన్స్, శ్రీరామా బుక్‍డిపో, యువభారతి, ఆంధ్రప్రదేశ్ బుక్ డిస్ట్రిబ్యూటర్స్, విజయవాడలో నవోదయ పబ్లిషర్స్, జయంతీ పబ్లికేషన్స్, ప్రేమ్‍చంద్ పబ్లికేషన్స్, గుంటూరులో కరుణశ్రీ కావ్యమాల, రాజమండ్రిలో కళాభివర్థినీ పరిషత్తు, కాళహస్తి తమ్మారావు ఆండ్ సన్స్ చెప్పుకోతగ్గవి. ఇవే కాక 1957లో స్థాపితమైన ఆంధ్రపదేశ్ సాహిత్య అకాడమీ కృషి కూడా చెప్పుకోతగ్గది.

1960 తరువాతి కాలానికి వస్తే ప్రతిమా బుక్స్, మద్రాస్, ఏలూరులోని గుండిమెడాస్, విజయవాడలోని వీ.ఎస్.ఎస్ ఆండ్ సన్స్, హితకారిణీ సమాజం, రాజమండ్రి, రవికోకిల పబ్లికేషన్స్, నెల్లూరు, విజయవాడలో నవభారత్ బుక్ హౌస్, నవ్యజ్యోతి పబ్లికేషన్స్, న్యూ స్టూడెంట్ బుక్ సెంటర్, అరుణ పబ్లిషింగ్ హౌస్, మహాలక్ష్మి బుక్ ఎంటర్‍ప్రైజెస్, విజయవాడ, క్వాలిటీ పబ్లిషర్స్, శ్రీరామా బుక్ డిపో, విశాఖ సాహితీ సంస్థలు చెప్పుకోదగ్గవి.

1960 దశకంలో ఆంధ్రప్రభ వార పత్రిక రంగనాయకమ్మ రచించిన కృష్ణవేణి, కోడూరి కౌసల్యాదేవి రచించిన చక్రభ్రమణాలను ప్రచురించడంతో ఒక కొత్త శకం ప్రారంభమయ్యినట్లుగా చెప్పుకోవచ్చు. అప్పటి నుండీ సుమారు ఓ రెండు దశబ్దాల పాటు రచయిత్రుల నవలల వెల్లువతో ప్రచురణ రంగం లాభాల జడివానలో తడిసింది. ఆ పరిస్థితి ఎందరినో ప్రచురణా రంగం దిశకు ఆకర్షించింది. 1965 నుండి 1980  వరకూ ప్రముఖ రచయిత్రుల నవలలు సెట్లు సెట్లుగా ప్రచురించి చాలా సంస్థలు భారీ వ్యాపారం చేశాయి.

అసలు 1965 నుండి 1980 వరకూ పరిశీలిస్తే మూడు అంశాలను ప్రముఖంగా చెప్పుకోవాల్సి ఉంది. హింద్ పాకెట్ బుక్స్, న్యూ ఢిల్లీ వారి ప్రేరణతో ఎం. శేషాచలం కంపెనీ ప్రవేశపెట్టిన ఇంటింటా గ్రంథాలయం స్కీము, సాహిత్య సంస్థగా గుర్తింపు పొంది, వంద పుస్తకాల వరకూ ప్రచురించిన యువ భారతీ సంస్థ మెంబర్ షిప్ స్కీము, నేషనల్ బుక్ ట్రస్ట్ వారి ప్రేరణతో ఏర్పాటు చేస్తున్న బుక్ ఫేర్లు ప్రజల చేత పుస్తకాలు విపరీతంగా కొనిపించగలిగాయి, గలుగుతున్నాయి.

ప్రస్తుతం గ్రంథాలయోద్యమం స్పూర్తి సన్నగిల్లి, మంచి సాహిత్యం, నవలలు వెలువడక, టీవీ ప్రభావం వల్లా తెలుగు ప్రచురణ రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ నేటి పాఠకులు అవసరాల మేరకు కాల్పనికేతర సాహిత్యం ప్రచురిస్తున్న సంస్థల పరిస్థితి మాత్రం చాలా బాగుంది. టివీ ప్రభావం తగ్గితే గనుక తమకు మంచి రోజులు వస్తాయని కాస్త వెనుకబడ్డ ప్రచురణ సంస్థలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.

(తెలుగు ప్రచురణరంగ ప్రచురణ క్రమంలో స్వాతంత్ర్యానికి పూర్వం అంశాల గురించి ప్రధానంగా రాసిన ఈ వ్యాసాన్ని 1996లో విజయవాడలో జరిగిన అఖిల భారత గ్రంథాలయ మహాసభల సందర్భంగా ప్రచురించిన సావనీర్ నుండి పునర్ముద్రిస్తున్నాం. – పుస్తకం.నెట్)About the Author(s)

ప్రజాశక్తి4 Comments


 1. “1914లో కృష్ణాజిల్లాలో పటమట కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ స్థాపన జరిగింది. మునులమ్మ మరణం లాంటి పుస్తకాలెన్నింటినో ప్రచురించిన ఈ సంస్థ నడిపిన గ్రంథాలయోద్యమం దేశవ్యాప్త ఖ్యాతిని సంపాదించుకుంది.”
  మునులమ్మ కాదు
  ముసలమ్మ మరణం – కట్టమంచి రామలింగా రెడ్డి గారిది.


  • పుస్తకం.నెట్

   అ గారికి: సవరించాము. ధన్యవాదాలు.


 2. wow. Great to see you on internet. pustakam vaariki abhinandanalu.


 3. సౌమ్య

  Wonderful article!
  Thanks to ‘navodaya’ rammohan rao garu and ‘navabharat’ prakasarao garu.
  ఇక్కడ చెప్పిన పేర్ల చరిత్ర – ఆన్లైన్ లో దొరికే అవకాశాలు తక్కువ కదా… తెలిసినవారు – వికీల్లో (తెలుగు/ఇంగ్లీషు) రాసి పెడుదురూ…ప్లీజ్, ప్లీజ్. అప్పుడు ఈ తరం మొదలుకుని తరతరాలూ – మీ పేరు చెప్పుకుంటారు….  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

నా 2017 పుస్తక పఠనం

మరో ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదిలో చదివిన పుస్తకాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవడాన...
by సౌమ్య
1

 
 

విశ్వనాథునకు వివిధ కవి నాథుల పద్య నివాళి

వ్యాసకర్తలు: రవి భూషణ్ శర్మ కొండూరు, ఇందు కిరణ్ కొండూరు ****************** ముందు మాట ఈ నెల (అక్టోబ...
by అతిథి
0

 
 

ఆడెనమ్మా! శివుఁడు!!! పాడెనమ్మా! భవుఁడు!!!

వ్యాసకర్తలు: రవి భూషణ్ శర్మ కొండూరు, ఇందు కిరణ్ కొండూరు ****************** షుమారు 103 సంవత్సరాల క్ర...
by అతిథి
1

 

 

ఆచార్య ఆత్రేయ

వ్యాసకర్తలు: రవి భూషణ్ శర్మ కొండూరు మరియు ఇందు కిరణ్ కొండూరు (మే ఏడవ తేదీ ఆత్రేయ జయంత...
by అతిథి
0

 
 

పుట్టపర్తి నారాయణాచార్యులు

అది 1989 అనుకుంటాను సరిగ్గా గుర్తు లేదు. నా కాలేజీ మొదటి రోజులు. మా అప్పకు పుట్లూరి శ్రీ...
by రవి
2

 
 

(శవ) సాహిత్యం మీదకి నా దండయాత్ర

అను MY EXPLORATIONS TO THE WONDROUS WORLD OF BOOKS వ్యాసకర్త: సాయి పి.వి.యస్. ********************* ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యం సౌమ్య ...
by అతిథి
0