ఇక్కడన్నీ వంటల పుస్తకాలే

జనవరి 4, ఆదివారం నాటి ‘హిందూ’ పత్రికలో booksforcooks.com గురించిన వ్యాసం వచ్చింది. అది చూసాక నాకెంతో ఆశ్చర్యం కలిగింది – వంటల పుస్తకాల కోసమే ప్రత్యేకంగా నెలకొల్పిన పుస్తకాల కొట్టా! అని. ఈ వ్యాసం చదివాక వెంటనే ఆ సైటు ను చూడడం మొదలుపెట్టాను. ఈ సైటు గురించి పుస్తకం.నెట్ పాఠకులకి చెప్పడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం. ఈ షాపుకి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడి పుస్తకాల్లోని వంటల గురించిన ప్రయోగాలు చేసేందుకు అనువైన వసతులున్న ఓ చిన్న వంటగది, అందులో కొందరు ఎల్లప్పుడు పనిలో మునిగి ఉండే ప్రొఫెషనల్ వంటవారు! అందుకే దీన్ని “The best smelling shop in the world” అంటారు.

బుక్స్ అండ్ కుక్స్ షాపుని 1983 లో Heidi Lascelles మొదలుపెట్టారు. మరి ఇంగ్లాండా వంటకాలకి పేరు పడ్డ దేశమేమీ కాదు. ఈవిడేదో వృత్తి రిత్యా కుక్ అనుకునేరు – అంతకంటే కాదు. ఆవిడ అప్పటికి నర్సుగా పనిచేసేవారు. పైగా, మామూలు పుస్తకాల షాపుల్లో వంట పుస్తకాలు ఓ చిన్న సెక్షన్ గా కనిపిస్తాయేమో కానీ, వాటికోసమే ఓ దుకాణం అన్నది ఎవరూ ఊహించని విషయం. ఈ నేపథ్యంలో వంటపుస్తకాల మీద ఓ షాపు పెట్టడం అనేది కాస్త విచిత్రమైన పనిగానే అనిపించింది. ప్రపంచంలో ఎక్కడ దొరికే వంట పుస్తకాన్నైనా తమ వద్ద ఉంచుకోవాలన్న ఆరాటమూ, ఎక్కడికైనా పుస్తకాన్ని సరఫరా చేయగల నేర్పూ – రెండూ కలిసి ఈ షాపుకు అంతర్జాతీయంగా ఓ గుర్తింపుని తెచ్చిపెట్టాయి. aలా అలా ఈ వ్యాపారం ఎదిగిందన్నమాట. ప్రస్తుత ప్రొప్రైటర్లు – Rosie Kindersley మరియు Eric Treuille. రోజీ ఒక కస్టమర్గా వచ్చిందిక్కడికి తొలిసారి. 1992 లో ఈ షాపులో ఉద్యోగంలో చేరింది. సంవత్సరం తరువాత వచ్చిన ఎరిక్ తరువాత రోజీ జీవితంలోకి కూడా ప్రవేశించాడు. 2001 లో హైదీ రిటైరయ్యాక వీరిద్దరే ఈ దుకాణం నిర్వహణా బాధ్యతలు చేపట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా కథే ఉంది ఈ షాపుకి. వివరాలన్నీ వారి గురించి వారు చెప్పుకున్న పేజీలో కనిపిస్తాయి.

దాదాపుగా ఎనిమిదివేలకు పైగా పుస్తకాలు వీరివద్ద దొరుకుతాయట. ఎనిమిది వేలు అంటే మామూలుగా వినడానికి పెద్ద సంఖ్య అనిపించదేమో కానీ, కేవలం వంటల పుస్తకాలే ఎనిమిది వేల టైటిళ్ళు ఉన్నాయంటే ఇక ఊహించుకోండి. “our stock far exceeds the realm of simple recipe books to include foodie fiction, history, biography, nutrition, art, sociology and chemistry as well as a considerable collection of gourmet cards and posters.” అని వారు వెబ్సైటులో రాసిన వాక్యం చూస్తే అర్థమౌతుందనుకుంటాను వీరి షాపు ప్రత్యేకత. ఇదే కాక 1995 నుండి కుకరీ వర్క్షాపులను కూడా నిర్వహిస్తున్నారట.

మనకి వంటలంటే ఆసక్తి ఉందా లేదా అన్న విషయం పక్కన పెడితే, ఇలాంటి ఒక ఆలోచనా, అది 25 సంవత్సరాలుగా విజయవంతంగా సాగుతున్న విధానమూ చూస్తూ ఉంటే స్పూర్తిదాయకంగా లేదూ?

You Might Also Like

Leave a Reply