Something like an autobiography – Akira Kurosawa ఆత్మకథ

akiraautobioఅకిరా కురొసవా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జపనీస్ చిత్ర దర్శకుడు. ప్రపంచ సినిమాతో పరిచయం ఉన్న ప్రతివారూ కనీసం ఒక కురొసవా సినిమా అయినా చూసే ఉంటారు. నా మటుకు నాకైతే, నేను అత్యంత ఇష్టపడే చిత్రాల్లో కురొసవా చిత్రాలు చాలానే ఉన్నాయి – కాదు కాదు – దాదాపుగా నేను చూసిన కురొసవా చిత్రాలన్నీ నాకు నచ్చాయి. అందువల్ల, ఆయన నా అభిమాన దర్శకుల్లో ఒకరనే చెప్పాలి. సరే, ఈయన గురించి సత్యజిత్ రాయ్ కూడా తన సినిమా వ్యాసాల్లో తరుచుగా ప్రస్తావించారు. రాయ్ నా అభిమాన రచయితల్లో ఒకరు కనుక – ఆ విధంగా కూడా కురొసవా అంటే నాకు చాలా అభిమానం, గౌరవం. వ్యక్తిగతంగా ఆయన గురించి పూర్తి పాజిటివ్ వ్యాఖ్యానాలు ఎక్కడా కనబడకపోయినా కూడా, ఈ అభిమానం తగ్గలేదు. ఇలాంటి నాకు, ఎట్టకేలకు “Something like an autobiography” అనబడు కురొసవా ఆత్మకథ దొరికితే ఇక చెప్పేదేముంది? ఇది జాపనీస్ మూలం నుండి Audie E.Bock పుణ్యమా అని ఆంగ్లానువాదం కాబడ్డ నవల. (అందుకే నాకు అనువాదాలంటే ఇష్టం – కురొసవా గురించి తెలిసిందీ, చదివిందీ, చదువుతున్నదీ – వాటి వల్లే కదా!)

కురొసవా పుట్టుక మొదలుకుని, ఆయనకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన Rashomon సినిమా దాకా ఆయన జీవితం గురించి ఆయన చెప్పుకున్న కథ ఇది. నిజానికి, కురొసవా సినిమాలు Rashomon కి ముందువి నేను ఇప్పటిదాకా చూడలేదు. అసలు, ఆ సినిమాలన్నీ దీని తర్వాత తీసారేమో అనుకుంటున్నా ఇంకా 🙂 ఇదే అంటూ ఉంటే, ఒక వ్యాఖ్య: “పశ్చిమ దేశాల వాళ్ళకి చాలామందికి ఏ.ఆర్.రెహమాన్ అంటే స్లం డాగ్ మిలియనీర్ మాత్రమే. ముందు కూడా అతనిక్కడ స్టారే అన్న సంగతి మనకి తెల్సు కానీ వాళ్ళందరికీ తెలీకపోవచ్చు. కురొసవా సంగతి కూడా అంతే. Rashomon ద్వారా అతను మనందరికీ తెలిసాడు కనుక, మనం అదే అతని తొలి సినిమా అనుకోడంలో ఆశ్చర్యమేమీ లేదు” నిజమే కాబోలు. అయితే, ఈ పుస్తకం ద్వారా ఆయన దర్శకత్వం గురించి కొంత తెలుసుకోవచ్చు కానీ, ఆయన గురించి, ది మేకింగ్ ఆఫ్ ది డైరెక్టర్ గురించి ఎక్కువ తెలుసుకోవచ్చు. “నా సినిమాల గురించి చెప్పుకోడంలో నాకు పెద్ద ఆసక్తి లేదు.” అని తరుచుగా అనే కురొసవా అన్నమాటకు తగ్గట్లే, Rashomon తరువాతి చిత్రాల పేరైనా ఎత్తలేదు ఎక్కడా. అంతకు ముందు సినిమాల గురించి చెప్పడం కూడా ఒక విధమైన శైలిలో సాగుతుంది – సినిమా మేకింగ్ గురించి, అప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు వివరిస్తూ ఉన్నట్లు ఉంటుంది కానీ, సినిమా గురించిన వ్యాఖ్యానాలు చాలా తక్కువ కనబడ్డాయి.

కురొసవా బాల్యం, ఇంటి వాతావరణం, ఆనాటి జపాన్ సామాజిక చిత్రం, ప్రభుత్వ పాలన, యుద్ధం, మూకీలు, తరువాత టాకీలు – ఇలా కురొసవా తన కథ చెబుతూ ఉంటే, అప్పటి ప్రపంచం మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. చిన్నప్పటి నుండి తన జీవితంలోని వివిధ వ్యక్తుల్ని గురించి పేరు పేరునా వివరించి, అలాగే, ఎక్కడికక్కడ తనకి మేలు చేసిన వారికి పుస్తక ముఖంగా ధన్యవాదాలు చెబుతూ ఉంటే – ఇతన్ని గురించా – కోపమెక్కువ, చిరాగ్గా అరుస్తాడు, వంటి కథలు వినింది? అనిపించింది. అయితే, తనలో ఉన్న బలహీనతలను – అదే, కోపం, అసహనం – వీటిని ఆయన చాలా చోట్ల బహిరంగంగానే చెప్పుకున్నారు. యువకుడిగా, సెన్సార్ బోర్డు వారితో సమస్యలను ఎదుర్కున్నప్పుడు ఆయనకి కలిగిన విసుగూ, కోపం, వీటిని తోటి సహచరులో, లేక గురువులో హ్యాండిల్ చేసి తనని ఏదో అఘాయిత్యం చేయకుండా కాపాడిన సందర్భాలను గుర్తు చేస్కున్నప్పుడు – కురొసవా చాలా ముక్కుసూటి మనిషి అనిపిస్తుంది. కురొసవా ఎన్నిసార్లు తన గురువు Kajiro Yamamoto గురించి గొప్పగా చెప్పుకున్నారో! నాకిప్పుడు ఆయనెవరో తెలీకుండానే గౌరవం పెరిగిపోవడమే కాక, ఆయన సినిమాలేవన్నా దొరికితే చూడాలనుంది 🙂

తాను తొలిసారి సినిమాల్లోకి ఎలా అడుగుపెట్టాడు, సినిమాలు తీస్తున్నప్పుడు తన అనుభవాలు, వివిధ నటీనటులు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులతో అనుబంధాలు – ఇవన్నీ చాలా ఆసక్తి కరంగా వివరించారు. అలాగే, ఇది చదువుతూ ఉంటే, ఒక రెండు మూడు దశాబ్దాల జపాన్ ఫిల్మ్ మేకింగ్ చరిత్రా, స్టూడియో రాజకీయాలూ వంటి విషయాలెన్నింటి గురించో పరిచయం ఏర్పడుతుంది. అలాగే, చాలా చోట్ల దర్శకత్వానికి సంబంధించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. పుస్తకం చివర్లో, సినిమా తీయడంలోని వివిధ అంశాలపై ఆయన అభిప్రాయాలను పొందుపరచడం చాలా బాగుంది. Akira తన సినిమాల గురించి రాసిన వ్యాసాలు చదువుతున్నప్పుడు నాకు సత్యజిత్ రాయ్ తన సినిమాల గురించి వివరిస్తూ రాసిన వ్యాసాలు చాలా గుర్తొచ్చాయి. అంటే, ఒక్కో షూటింగ్లో కలిగిన అనుభవాలను, నేర్పుకున్న పాఠాలను విశదపరచే పద్ధతిలో వీరిద్దరి శైలుల్లో కాస్త దగ్గరితనం కనిపించింది. ఎటొచ్చీ, రాయ్ కి కురొసవా తో పోలిస్తే సహనం ఎక్కువై ఉండొచ్చు అనిపించింది 🙂

Toshiro Mifune, Takashi Shimura లు కురొసవా సినిమాల్లో తరుచుగా కనిపించే నటులు, అద్భుతమైన నటనా సామర్థ్యం ఉన్నవారు. వీరి గురించి కురొసవా మాటల్లో వినడం ఓ మంచి అనుభవం. ముఖ్యంగా కురొసవా, మిఫునే ల మధ్య స్నేహం-ద్వేషం గురించిన కథ ఇదివరలో చదివి ఉన్నాను. దానితో, వీరి తొలి నాళ్ళలో వీరి మధ్య సంబంధం ఎలా ఉండేది? అన్న కుతూహలం కలిగింది. ఈ పుస్తకం ద్వారా మనకి మిఫునే దృక్కోణం తెలీదు అనుకోండి, అది వేరే విషయం.

ఒక విధంగా, Rashomon తరువాతి సినిమాల గురించి రాయకపోవడం నాకు కాస్త నిరాశ కలిగించింది – కారణం, నేను చూసిన సినిమాలన్నీ ఆ తరువాతవే. ఏమైనా కూడా ఈ పుస్తకం చదవడం ఓ మంచి అనుభవం. మొదలుపెట్టిన తరువాత ఆపకుండా చదివించింది. ఇందుకు కురొసవా ఎంటర్టైనింగ్ శైలి చాలా వరకు కారణం. అనువాదం కూడా చాలా బాగా వచ్చింది. కురొసవా – స్క్రీన్ రైటర్ గా, ఎడిటర్ గా, కథా రచయితగా – ఇలా రకరకాల కోణాల్లో, సాంకేతికంగా పరిచయం ఔతాడు ఈ పుస్తకంలో, అతని దర్శకత్వం గురించి కుతూహలంతో మొదలుపెట్టినవారికి. అంతే కాక, ఓ వ్యక్తిగా, స్నేహితుడిగా, మంచి శిష్యుడిగా, భర్తగా (కొంతవరకూ) – కూడా మనకి పరిచయం చేస్తుందీ పుస్తకం. కురొసవా అభిమానులకి, కాబోయే దర్శకులకి తప్పనిసరిగా చదువవలసిన పుస్తకం. సినిమా ప్రేమికులకి – బోలెడు కబుర్లతో నిండిన పుస్తకం. చరిత్ర ప్రియులకి కూడా ఆసక్తికరమైన పుస్తకం. కాలక్షేపానికి చదవాలన్నా కూడా, కురొసవా మంచి కామెడీ మనిషండీ – పుస్తకం మంచి టైంపాస్.

అన్నట్లు పుస్తకం కొనే పనైతే, స్ట్రాండ్ బుక్ స్టాల్ లాంటి చోట్ల మాత్రమే కొనండి. ఆన్లైన్ స్టోర్స్ లో ఎక్కడా కనబడనంత డిస్కౌంట్ (50%) ఈ పుస్తకంపై ఇక్కడ కనిపించింది. 🙂

You Might Also Like

4 Comments

  1. ramanarsimha

    @SOUMYA

    I agree with Mr.Ravireddy..

    Some reviews are little bit complicated..

    in your blog..

  2. ravireddy

    nenu enadulo mee website gurinchi chadivi chaalaa happy feel ayyanu….malathichandur book revews laa untayanukunnanu…kaani okka book revew kudaa sarigaledu…..pl malathichandur nu fallow avvandi….books gurinchina information kaakundaa book lo unna information nu cheppandi pl

  3. ravireddy

    dear friend…

    meeru baagaa raasaaru….kaani revew raasetappudu….book chaalaa goppagaa undi ani pogidetappudu,goppaga unna vishayaalanu prastaviste baaguntundi…..meeru friday andhra bhoomilo vache cinema revews chadavandi…..katha mottham cheppakunda anduloni hilights cheppadam…..its imp to write a revew dear…thank u

  4. ramnarsimha

    Review is very nice..

    Thanq..

Leave a Reply