భాష-గద్యం..

రాసిన వారు: తమ్మినేని యదుకులభూషణ్
***********************
భద్రిరాజు కృష్ణమూర్తి వ్యాస సంకలనం “భాష, సమాజం,సంస్కృతి” అద్భుతంగా ఉంది..ఆర్యుల ద్రావిడుల గురించి రాసిన విషయాలు ఇదివరకు ఏర్పడిన విశ్వాసాలనే సమర్థిస్తాయి.అది అలా ఉండనిస్తే..ఇతర భాషలను ఏ దశలో బోధించాలి..హిందీ భాష ఇతర భాషల నుండి పదాలను స్వీకరించాలంటే ఏంచేయాలి..తదితర విషయాల మీద సూక్ష్మ పరిశీలన ఉంది.

శాస్త్ర సంపన్నుడికి భాష లొంగివస్తుంది.పిండి కొద్దీ రొట్టె..తన భావాలను వెల్లడించడానికి చక్కని శైలిని ఏర్పరచుకుంటాడు.తెలుగు శాస్త్రవేత్తల్లో అగ్ర గణ్యులైన భద్రిరాజు గారి శైలి సూటిగా శాస్త్రవిషయాలను చెప్పడానికి అనువుగా ఉంది.శాస్త్ర చింతన మనసులో గూడు కట్టుకున్న అయోమయాన్ని తొలగించి ,మాటలో వాక్కులో స్పష్టతకు పెద్ద పీట వేస్తుంది.అది పలుచ బడితే జర్నలిజాన్ని పోలిన అలవోక శైలి పట్టుబడి పుస్తకాల రాశిని పెంచుతుంది (ఉదా:చేరా).మరీ పలుచబడితే మనసులోని అయోమయం రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది(ఉదా:వేల్చేరు).

కవులు రాసే గద్యశైలి ఆహ్లాదంగా ఉన్నప్పటికీ..వారిలో అయోమయం జాస్తి గావడం వల్ల మాటిమాటికి వారి రచనల్లో ప్రముఖంగా వారే ప్రవేశిస్తుంటారు. ‘నేను ‘,’ నేను ‘అన్న పదం ఇబ్బడిముబ్బడిగా దర్శనమిస్తుంది.దృశ్యాన్ని ప్రదర్శించి పక్కకు తప్పుకోరు కవులు.ఖుద్దున జొరబడతారు ‘ఖుసిమీర ‘ (ఉదా:జయప్రభ శిశిరంలో మాస్కో).

శాస్త్రకారునికి ideas ఆలోచనలు ముఖ్యం..కొత్త విషయాన్ని కనుగొనడం లోకానికి చాటడంలో ఆనందం.తన వివరాలు మరుగున పడినా పెద్దగా పట్టించుకోడు.అది గౌణ విషయం.(ఉదా:యార్లగడ్డ బాలగంగాధరరావు/ నామ విజ్ఞాన శాస్త్రం ).ఊర్లపేర్లు ,స్థలాల పేర్లను బంధించే సూత్రం వ్యవసాయపు అలవాట్లలో పట్టుకున్నారు.బుద్ధికుశలత ఉన్నవారి రాతల్లో నిక్కచ్చితనం అధికం..శాస్త్రజ్ఞునికి తెలియని విషయాలు తెలియవు అని చెప్పడంలో నామోషీ లేదు.సరికదా అది అయోమయాన్ని పారద్రోలే సాధనం..

చక్కని వచనం రాయాలంటే విషయపుష్టి..పరిశ్రమకు వెనుదీయని పట్టుదల అవసరం.ఇవన్నీ సమకూరినవి కాబట్టే భద్రిరాజు ,యార్లగడ్డ లాంటి వారి రచనలకు అంత గౌరవం..

బూదరాజు రాధాకృష్ణ గారు రాశిలోను వాసిలోను తగ్గకుండా రచనలు చేసిన వారిలో ప్రథమగణ్యులు.గత ఇరవై ఏళ్ళుగా(నాకు తెలిసి) ఒంటిచేత్తో ఎంత పరిశ్రమ..మాటలు జాతీయాలు తవ్విపోశారు..నిఘంటువులు,భాషా శాస్త్రం సరేసరి.జర్నలిజంలో ఆయన పెట్టిన ఒరవడి మేలైనది. ఎన్ని విలువైన విషయాలు ప్రస్తావించినా ఆయన ఆత్మకథ నాకంతగా నచ్చలేదు.రసదూరం (aesthetic distance) తగ్గినట్లనిపించింది.కథనంలో కొంత దూరం పాటిస్తే గాని పాఠకుడి మనసుకెక్కదు.అదే విధంగా ఆత్మ కథలో దూరం పాటించడం మరీ ముఖ్యం.ఆయన ఇతర రచనల స్థాయిలో లేదు ‘విన్నంత కన్నంత’.ఏది ఏమైనా 20 వ శతాబ్ది గద్యశైలీ నిర్మాతల్లో ఈయన ఒక్కరన్నది నిర్వివాదాంశం..

You Might Also Like

5 Comments

  1. గరికపాటి పవన్ కుమార్

    కిరణ్, పై వాక్యంలో “అది” అంటే “శాస్త్ర చింతన”, అది పలుచబడితే జర్నలిజం వంటి అలవోక శైలి పట్టుబడుతుందనేది అద్భుతమైన పరిశీలన, చేరాతలు మనకందరికి సుపరిచితమే. అయితే ఇక్కడ భూషణ్ పరిశీలన “శాస్త్ర చింతన” , “గద్య స్వరూపం” మధ్య ఉన్న సహసంబంధాన్ని(Correlation)గుర్తించడం. ఇది “hypothesis” దీనిని క్షుణ్ణంగా పరిశోధించాల్సిన అవసరం ఉంది. కానీ చేరాతలలో జర్నలిజం శైలిని, వేల్ఛేరు వారి రాతల్లో “అయోమయ స్థితి” ని గానీ నిరూపించాల్సిన అవసరంకన్నా ఈ కొత్త హైపోథీసిస్ మీద పని చెయ్యల్సి ఉందని నా అభిప్రాయం. “చేరాతలు – జర్నలిజం శైలి” అనే విషయం మీద ఉద్గ్రంధాలనే సృష్టించవచ్చు, కానీ పరిశీలనతోనే ఆపినట్టున్నాడు భూషణ్. ఇక వేల్చేరు వారి అనువాదాల మీద ఆయన “అయోమయ స్థితి” మీద వివరమైన వ్యాసాలు భూషణ్ రాసిన “నేటి కాలపు కవిత్వం తీరుతెన్నులు” లో ఉన్నాయి.

    ఇక్కడ నే లేవనెత్తింది ఏమిటంటే స్వభాషా, పరభాషా గురించిగానీ, పైన చేసిన వ్యాఖ్య గురించి గాదు. “శాస్త్ర చింతన” అనేది ఒక తత్వాన్ని ఆవిష్కరిస్తోంది. అది బట్టీ పడితేనో, ప్రశ్నలు జవాబుల శైలిలో పరీక్షలకు చదివినట్టుగా చదివేస్తోనో కొరుకుడు పడుతుందని నే భావించను.

    గరికపాటి పవన్ కుమార్

  2. chavakiran

    వ్రాసే వాడికి అడిగే వాడు లోకువ.

    >>
    అది పలుచ బడితే జర్నలిజాన్ని పోలిన అలవోక శైలి పట్టుబడి పుస్తకాల రాశిని పెంచుతుంది (ఉదా:చేరా).మరీ పలుచబడితే మనసులోని అయోమయం రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది(ఉదా:వేల్చేరు).
    <<

    ఈ వాక్యాలను వారి వారి పుస్తకాలు కనీసం ఒకటి అయినా తీసుకోని విస్తరించండి. (30 మార్కుల ప్రశ్న :P)

  3. గరికపాటి పవన్ కుమార్

    భూషణ్ వ్యాసం చాలా బాగుంది. ఎన్నో కీలకాంశాలను లెవనెత్త్తుతోంది. ఈటువంటి ఆలోచనలు చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఒక సందేహం, శాస్త్ర పరిశోధన మన భాషలో జరగకపోవడం మనమెరిగినదే. ఇక్కడ సమస్య ఏమిటంటే వేరొక భాషలో జరిగిన పరిశోధనను తర్వాత తెనిగించాలని ప్రయత్నించడం, అప్పుడు శాస్త్ర సంపన్నుడికి లొంగి వచ్చే భాష పర భాషే కానీ స్వభాష కాదు కద. మనం తెలుగు మాధ్యమంలో అన్ని డిగ్రీ పట్టాలను పొందలేకపోతున్నాం. సాంకేతిక విజ్ఞానం అంతా పర భాషలోనే సంపాదిస్తున్నాము కదా ఇక మన భాష ఎలా లొంగివస్తుంది?

    గరికపాటి పవన్ కుమార్

  4. తమ్మినేని యదుకుల భూషణ్.

    మీ ప్రశ్నలు సర్వ సమగ్రంగా ఉన్నాయి.సమాధానం చెప్పడం అంత సులభం అనుకోను.
    ౧. శాస్త్రజ్ఞుడికి,శాస్త్రబోధకుడికి మధ్య అంతరం ఉంది. శాస్త్రజ్ఞుడు సృష్టిలో ఒక ఊహను తొలిసారి దర్శించినవాడు.అతని ద్వారానే ఆ ఊహ ప్రపంచానికి తెలిసి వచ్చింది. కాబట్టి ఆ ఊహ
    గూర్చి సమగ్రంగా ,శక్తిమంతంగా అతనే చెప్పగలడు.శాస్త్ర బోధకులు అతని ఊహను ఆధారంగా చేసుకొని నలుగురికి విశదీకరించగలరు. ఒక ఊహకోసం /ఒక సత్యం కోసం
    బ్రతికిన వారు ఆ ఊహను వ్యక్తం చేయడానికి కావలసిన పరిభాష తయారు చేసుకొంటారు.
    డార్విన్ ,లీకి, ఫ్రాయిడ్ ,హార్డీ ,జంగ్ ( నాకు తోచిన శాస్త్రవేత్తలను ఉదహరించాను)వారి వారి ఫాయాలో చక్కని రచయితలు.అలాగని చెప్పి వారి ప్రధాన వ్యావృత్తి సాహిత్యం కాదు. మీరు మాట్లాడేది శాస్త్ర బోధకుల గురించి.కాబట్టే ‘తెలిసిన విషయాలు తెలియని విషయాలు’ అంటున్నారు. నేను మాట్లాడుతున్నది శాస్త్రజ్ఞుల గూర్చి అనగా ఒక సత్యాన్ని లేదా ఒక ఊహని తొలిసారి దర్శించిన వారిగురించి.అందుకనే భద్రిరాజు గారి గురించి ప్రస్తావించింది. (తెలుగులో థామస్ ఆల్వా ఎడిసన్ స్థాయి ఉన్న శాస్త్రవేత్త యల్లాప్రగ్గడ సుబ్బారావు).
    వ్యాసాన్ని ఒక తాత్విక స్థాయిలో అనుశీలిస్తే విషయం మీకు బోధ పడుతుంది.
    ౨. సరైన రచనా పద్ధతులను పాటించడం వల్ల మీరంటున్న క్లేశాన్ని అధిగమించ వచ్చు. తెలియనిది తెలియదని ఒప్పుకోగలిగితే పాద పీఠికలు ఇవ్వడానికి ఇబ్బంది లేదు.ఆ
    రకంగా చర్చకు మరింత ఆస్కారం ఉంది. శాస్త్ర చింతన ,తాత్విక ధోరణి మంచి వచనశైలికి దోహదం చేస్తాయి. అవిలేకనే మన కవులు విమర్శకులు చెడుతున్నారని నా నిష్కర్ష.

  5. హెచ్చార్కె

    డియర్ భూషణ్, మీ అభిప్రాయాలు మరింత స్పష్టంగా తెలుసుకోడానికి అడుగుతున్నాను.
    1. ‘శాస్త్ర సంపన్నుడికి భాష లొంగివస్తుంది’ అని మీరన్నారు. భాషా శాస్త్రం లేదా మరొక శాస్త్రం బాగా తెలిసినప్పటికీ, ఒకరి భాష (ఆయన తనకు తెలిసింది చెప్పే విధం) అంత బాగా వుండకపోవడం మనం తరచు గమనిస్తుంటాం. మరొకరు శాస్త్ర విషయాలలో తనకు తెలిసిన కొన్ని విషయాలనే… ఒక్కో సారి తనకు బాగా తెలియని విషయాలను కూడా… మంచి భాషలో చెప్పడం కూడా గమనిస్తాం. భాష లొంగి రావడం, శాస్త్ర సంపన్నుడై వుండడం రెండూ అవసరమే గాని, అవి వేర్వేరు విషయాలు అనిపిస్తుంది. భాష అనేది (మాట్లాడడంలో రాయడంలో) అభ్యాసానికి సంబంధించినది. (విషయ లేమితో, వట్టి పదాల గారడి చేయబోయి చతికిల పడే వారి సంగతి సరే. ఆ సంగతి తెలిసిపోతూనే వుంటుంది.)
    2. రచనలో (గద్యంలో) ‘నేను’లు దొర్లడం తప్పు కాదనుకుంటాను. కొన్ని సార్లు అది అవసరం కూడా. ‘నేను ఇలా అనుకుంటున్నాన’ని అనడం ద్వారా ‘ఇది నేను అనుకుంటున్నది, దీనికి నా అభిరుచి/అధ్యయన పరిమితులు వున్నాయి’ అని సూచించడం అవుతోంది. చాల సార్లు మన ‘సార్లు’ తాము అనుకుంటున్నదాన్నే ‘థర్ఢ్ పర్సన్’లో వుంచి అది ఒక సార్వజనీన విషయం అయినట్లు ‘అథారిటీ’ కల్పిస్తుంటారు. దానికి బదులు ఇది నేను అనుకుంటున్నది అనడమే మంచిదని, ఆ విధంగా ‍ చర్చకు ఎక్కువ ఆస్కారం వుంటుందని అనుకుంటున్నాను. కొందరు తీసుకున్న విషయాన్ని కాసేపు వదిలేసి, సందట్లో సమారాధనగా సొంత బాగోతం విప్పడం నిజమే. ఆ సంగతి కూడా తెలిసిపోతూనే వుంటుంది.)

Leave a Reply