116 సంవత్సరాల వయసున్న సంస్కృత పుస్తకాల పబ్లిషర్లతో

[ఎపుడో బెంగళూరు బుక్ ఫెస్ట్ జరిగినప్పటి కథ ఇది. ఇన్నాళ్టికి మోక్షం లభించింది! అనుకున్నదే తడువుగా షాపులోకి దూరిపోయి, ప్రశ్నల వర్షం కురిపించినా, ఓపిగ్గా మాట్లాడినందుకు ఛౌఖంబా వారికీ, ప్రశ్నలడగడంలో తోడ్పడ్డ నా మిత్రుడు సంతోష్ రాజుకీ – ధన్యవాదాలు]

అఫీసు దగ్గరే అని, అలా వెళ్ళిపోయాం బెంగళూరు బుక్ ఫెస్ట్ కి ఓ వీక్ డే, నేనూ, నా కొలీగ్. అంతా ఖాళీగా ఉంది. అటూ ఇటూ తిరుగుతూ ఉంటే కనబడ్డది – చౌఖంబా సంస్కృత సిరీస్ వాళ్ళ స్టాల్. పేరేంటి ఇలా ఉంది అని లోపలికెళ్తే తెలిసింది… దీనికి 116 సంవత్సరాల పబ్లిషింగ్ చరిత్ర ఉందని. వారణాసికి చెందిన ఈ సంస్థ మూడేళ్ళుగా బెంగళూరు బుక్ ఫెస్ట్ లో స్టాల్ పెడుతోందనీ. కాసేపు ఓ చిన్న బాతాఖానీ వేశాము – స్టాల్ లో అందరికంటే చిన్నగా కనిపించిన యువకుడితో (మాకా సంస్కృతం రాదు. ఈ పెద్దవాళ్ళని కదిలిస్తే, వాళ్ళు భాష రాని వాళ్ళకీ మాటలెందుకు? అని తిడతారేమో అని భయమేసి…)

[చౌఖంబా వారి గురించి, వారి వెబ్సైటు లో చదివిన సమాచారం: స్వర్గీయ హరిదాస్ జీ గుప్తా ఈ సంస్థను 1892లో అరుదైన సంస్కృత పుస్తకాలని భద్రపరిచి, అలాగే వాటికి ప్రచారం కల్పించి, జనం మధ్యకు తీసుకువెళ్లాలనే సంకల్పంతో స్థాపించారట. ఈ సంస్థకింద కృష్ణదాస్ సంస్కృత సిరీస్, కృష్ణదాస్ ఆయుర్వేద సిరీస్. ..ఇలా ఎన్నో ఉప సంస్థలు కూడా ఉన్నాయి]

ప్ర: మీ స్టాల్ గురించీ, పబ్లికేషన్స్ గురించీ కొంత చెబుతారా?
జ: చౌఖంబా సంస్కృత పుస్తకాలను ముద్రించే పాత ప్రచురణ సంస్థల్లో ఒకటి. 116 సంవత్సరాలుగా ఈ ప్రచురణ వ్యాపారంలో ఉన్నాము (నూటపదహార్లా! అని నోరెళ్ళబెట్టాం లెండి – నేనూ, నా స్నేహితుడు సంతోషూ). ఆయుర్వేదానికి సంబంధించిన పుస్తకాలు మా ప్రత్యేకత. అలాగే, Indology కి సంబంధించిన పుస్తకాలు కూడా మేము చాలా ప్రచురించాము. పురాణాలు, ఇతర ప్రాచీన గ్రంథాల మూలాలు, ఆంగ్ల వ్యాఖ్యానాలు – ప్రచురిస్తూ ఉంటాము.

ప్ర: మేకు వారాణాసితొ పాటు వేరే చోట్ల ఎక్కడన్న బ్రాంచ్‌లు వున్నాయా?
జ: మా మెయిన్ ఆఫీస్ వారణాసిలొ వుంది. అది కాకుండా డిల్లీలో ఒక బ్రాంచ్ వుంది.

ప్ర: అక్కడక్కడా ఆంగ్ల పుస్తకాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి సంస్కృత పుస్తకాల అనువాదాలా? మీరే ప్రచురిస్తున్నారా?
జ: కొన్ని ప్రాచీన సంస్కృత పుస్తకాల అనువాదాలు ఉన్నాయి. కొన్ని పుస్తకాలేమో, వ్యాఖ్యానాల్లాంటివి. అవి ఆంగ్లంలో నేరుగా కూడా ఉన్నాయి. సాధారణంగా మా పుస్తకాలు ఎక్కువగా సంస్కృతం లోనే ఉంటాయి. కొన్ని ఆంగ్లంలో ఉన్నాయి. అప్పుడప్పుడూ హిందీలో కూడా ముద్రిస్తాము.

ప్ర: అయితే, ఆయుర్వేదానికి సంబంధించిన పుస్తకాలు, ప్రాచీన సంస్కృత కావ్యాల అనువాదాలు, వ్యాఖ్యానాలు వంటివి కాక ఏముంటాయి మీ వద్ద?
జ: మా వద్ద – సంస్కృతం నేర్చుకోడానికి పుస్తకాలు ఉంటాయి. అలాగే, వేదిక్ మేథ్స్ తరహా పుస్తకాలు కూడా ప్రచురిస్తున్నాము. ఇక నిఘంటువుల వంటి పుస్తకాలున్నాయి. ఇవి కాక, ఇండాలజీకి సంబంధించిన పుస్తకాలు విరివిగా ప్రచురిస్తాము.

ప్ర: మీ వద్దకు ఎలాంటి వారు వస్తూ ఉంటారు పుస్తకాలు కొనేందుకు?
జ: సింహభాగం ఆయుర్వేదం చదివే విద్యార్థులు, అధ్యాపకులు వస్తారు, టెక్స్ట్ బుక్స్ కోసం. వీరు కాక, సంస్కృతం నేర్చుకోవాలనుకునే వారు, అలాగే, సంస్కృత కావ్యాల వ్యాఖ్యానాల కోసం – ఇలా రకరకాల జనం వస్తూ ఉంటారు.

ప్ర: ఇప్పుడు సంస్కృతం ఎక్కువగా ప్రచారంలో లేదు కదా, పిల్లల్లో సంస్కృతం గురించిన ఆసక్తి పెంచడానికి మీరేమీ చేయడం లేదా?
జ: పిల్లలకి సంస్కృతం నేర్పడానికి రీడర్లు ఉన్నాయి. (ఇంకేదన్నా చెబుతారేమో అని చూస్తూ ఉంటే, జవాబు రాలేదు. దాంతో మేమే..)

ప్ర: అలా కాదు. కథలు అలా ఏదన్నా ఫిక్షన్ ఉందా? కథల ద్వారా చెబితే పిల్లలకి భాష బాగా వస్తుంది కదా…
జ: పంచతంత్రం వంటి పుస్తకాలు ఉన్నాయి. వీటిని కూడా జనం బానే కొంటూ ఉంటారు మా షాపులో.

ప్ర: సంస్కృతంలో ఇప్పుడు ఫిక్షన్ రాస్తున్నారా? మీరు ముద్రిస్తున్నారా?
జ: పంచతంత్రం ఇతర పాత పుస్తకాలు కాక, వాటిపై, ఇతర కావ్యాలపై ఉండే వ్యాఖ్యానాలు తప్ప ఫిక్షన్ కి సంబంధించి వేరే ఏమీ లేవు.

ప్ర: అయితే, ఫిక్షన్ మీ వద్ద ఉన్నదంతా అనువాదాలే అంటారు?
జ: అనువాదాలని కూడా అనలేము. అవి వ్యాఖ్యానాలు. సంస్కృతంలో చదివిన ఒక్కో విద్వాంసుడూ తనదైన పద్ధతిలో వ్యాఖ్యానిస్తాడు. కనుక, అవి commentaries కానీ, translations కాదు.

ప్ర: మీలా కేవలం సంస్కృత రచనలు ప్రచురించే పబ్లిషర్స్ వేరే ఎవరన్నా వారణాసిలో వున్నారా?
జ: చౌఖంబా కాకుండా సంస్కృత పుస్తకాలను ప్రచురించే సంస్థలు రెండు మూడు వారణాసిలో వున్నాయ్.

ప్ర: సాధారణంగా మీకు పుస్తకాల సేల్స్ అవీ ఎలా ఉంటాయి?

జ: బానే ఉంటాయి. సంస్కృత విద్యార్థులు, ఆయుర్వేదం విద్యార్థులు, వారి అధ్యాపకులు – వీళ్ళు కొంటూనే ఉంటారు కదా.

ప్ర: బెంగళూరు బుక్ ఫెస్ట్ లో మీ స్టాల్ కు జనం బానే వస్తున్నారా?
జ: పర్వాలేదు. కానీ, వచ్చి “ఇది కావాలి” అని ప్రత్యేకంగా అడిగి తీసుకెళ్ళేవారు ఉన్నారు.

ప్ర: ఇక్కడ మీరు ఇంతకు ముందు స్టాల్ పెట్టరా, లేక ఇదే మొదటిసారా?
జ: గత రెండు సంవత్సరాల్లోనూ మేము ఇక్కడ స్టాల్ పెట్టాం. ఇది వరుసగా మూడో సారి అన్నమాట.

ప్ర: మీకు వెబ్సైటు ఉందా? ఆర్డర్లు స్వీకరిస్తారా?

జ: వెబ్సైటు తయారౌతోంది. ఆర్డర్లు మా అడ్రసుకు ఉత్తరం రాస్తే పంపిస్తాము.

ప్ర: మీ అడ్రస్ కార్డు ఏదన్నా ఉందా?

జ: కేటలాగ్ ఉంది.. (అని ఇచ్చారు. అది తొంభై శాతం సంస్కృతం. పైగా, అన్నీ ఆయుర్వేదం పేర్లు…దాంతో భయమేసింది.)

(ఆ సరికే మేము అనుకోకుండా లోనకి వెళ్లడంతో ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఉండింది. దానితో, వారికి ధన్యవాదాలు చెప్పి బైటకి వచ్చేశాము. అలా మా చిన్ని బాత్చీత్ ముగిసింది)

వీరి వివరాలు:
Chowkhamba sanskrit series office
Oriental Publishers & Distributors,
K. 37/99 Gopal Mandir Lane
Near Golghar (Maidagin)
Post Box: 1008, Varanasi 221001 (UP), India
email: cssoffice@satyam.net.in
Phone: 0542-2333458

You Might Also Like

4 Comments

  1. నాగమురళి

    సంస్కృతంలో ఫిక్షన్ నేను ’సంభాషణ సందేశః’ అన్న మాసపత్రికలో చదివేవాణ్ణి – తొంభై అయిదు,ఆరు ప్రాంతాల్లో. అందులో దెయ్యాల కథలూ, డిటెక్టివ్ కథలతో సహా సంస్కృతంలోనే వచ్చేవి. ఇప్పటికీ ఆ మాసపత్రిక వస్తోందనుకుంటాను.

    బెంగళూరు బుక్ ఫెస్ట్ లో చౌఖాంబా, ఇంకా మిగతా సంస్కృత పుస్తకాల స్టాల్స్ దగ్గర రవిగారూ, నేనూ చాలాసేపే గడిపాం. ఆ పుస్తకాలన్నీ చూస్తూ ఉంటే కాలమే తెలీదు.

  2. కామేశ్వర రావు

    >>సంస్కృతంలో ఇప్పుడు ఫిక్షన్ రాస్తున్నారా? మీరు ముద్రిస్తున్నారా?

    ఈ ప్రశ్న చూసాక గుర్తుకువచ్చిన విషయం. IISc విద్యార్థులలో సంస్కృత భాష మీద ఆసక్తి ఉన్నవాళ్ళందరూ కలిసి “సంస్కృత సంఘం” అని ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు “సంస్కృతి” (అనే అనుకుంటా) అన్న పేరు మీద పత్రిక ప్రచురిస్తూ ఉంటారు. అందులో సంస్కృతంలో కవితలు, కథలు విద్యార్థులు రాసేవే ఉంటాయి. ఎప్పుడో ఒకసారి ఒక కొత్త సంస్కృత నాటకం కూడా రాసి ప్రదర్శించినట్టు గుర్తు.

Leave a Reply