వంశీ నుంచి వంశీకి

రాసిన వారు: అఫ్సర్
(వంశీకృష్ణ పుస్తకం “విదేహ” కు అఫ్సర్ రాసిన పరిచయ వ్యాసం ఇది. ఈ పుస్తకం అక్టోబర్ లో విడుదలైంది. వ్యాసాన్ని పుస్తకం.నెట్ లో ప్రచురించేందుకు అనుమతినిచ్చిన అఫ్సర్, వంశీకృష్ణ గార్లకు ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
****************************
పుస్తక రచైత పరిచయం:
వంశీ కృష్ణ కవి, కథకుడు, విమర్శకుడు. 1991లో “యాత్ర” కవితా సంపుటితో వంశీ సాహిత్య యాత్ర మొదలయ్యింది. 1993లో అతని కథా సంపుటి “వంశీ కృష్ణ కథలు” శీర్షికతో వెలువడింది. దానికి ప్రతిష్టాత్మకమయిన జ్యేష్ట లిటరరి ట్రస్టు అవార్డు లభించింది. తరవాత “కొన్ని నేనులు” (2000)”మీనింగ్స్” (2004) కవితా సంపుటాలు, “ఉనికి” కథా సంపుటి(2007) వచ్చాయి. ఇప్పుడు మీరు చదవబోతున్న ముందు మాట వంశీ ఉత్తరాల సంపుటి “విదేహ” (2009)కి రాసింది. వంశీ 1988-89 మధ్య ఆంధ్ర జ్యోతి వార పత్రికలో పని చేసారు. పురాణం వంటి గొప్ప సంపాదకుడి దగ్గిర పని చేసిన అనేక మంది రచయితలలో ఆయన చివరి ఉప సంపాదకుడు. మంచి పత్రికా రచయితగా పురాణం, నండూరి వంటి వారు, మంచి రచయితగా మధురాంతకం, పెద్దిభొట్ల, చా.సో, ప్రయాగ వంటి వారు వంశీని ప్రశంసించారు. 2010లో వంశీ సాహిత్య విమర్శ వ్యాసాలు సంపుటంగా రాబోతున్నాయి. చాలా కాలంగా తెలుగు నాట నిర్లక్ష్యానికి గురయిన లేఖా సాహిత్య ప్రక్రియకి పునర్జన్మ ఇచ్చిన పుస్తకం “విదేహ.”

పుస్తకం గురించి
videhaఎప్పుడో ఒక కవితలో రాసినట్టు గుర్తు. “ఉత్తరాలు దూరాలని కలిపే దారాలు” అని. ఇవ్వాళ ఒకే ఒక్క సారిగా నీ ఉత్తరాలన్నీ చదివాక అనిపించింది. ఉత్తరాలు దూరాలని కలిపే దారాలే కాదు, తరాలని కలిపి అంతరాలని చెరిపే సఖ్య రాగాలు అని. అవును. సఖ్యత, సహనం ఇవి ఇవాళ మనకి అత్యవసరంగా కావలసిన నిత్యావసర వస్తువులు. నిజానికి ఇక్కడ నేను వస్తువులు కి బదులు భావనలు అనే పదం వాడాలి. కాని ఉద్దేశపూర్వకంగానే వస్తువు అనే పదం వాడాను. ఎందుకంటే, చూస్తూ చూస్తూ ఉండగానే మనం భావనలకి దూరమై వస్తువులకి దగ్గర అయ్యాము. ఏదైనా వస్తువుకు వున్న గౌరవము, విలువ, భావనకి లేదు. ఇంట్లో ఫ్రిడ్జ్ కి వున్న విలువ చల్లని మనసుకు లేదు. ప్లాస్మా టి.వి కి వున్న విలువ మన మధ్య కబుర్లకి లేదు. అందమైన ఫర్నిచరు కి వున్న విలువ ఆతిధ్యం లోని అత్మీయతకి లేదు.

మనసులు ఇరుకు ఐనా పరవాలేదు కాని ఇల్లు రాజసౌధం లా వుండాలి. మరేమీ ముఖ్యం కాదు, ఇంట్లో వస్తువులు తప్ప . అలాంటి వస్తువులని ఉత్పత్తి చేసే శక్తి మాత్రమే గొప్ప శక్తి. ఇతర శక్తులు అసమర్థుల భావనలు. డబ్బు సంపాదించలేని వాళ్ళ సాకులు.చుట్టూ ఏం జరుగుతున్నా సరే, మన ఇల్లు విలాస వస్తువులతో నింపుకుంటే చాలు. వీథులు రక్తసిక్తం అవుతుంటై ,ఈ పూటకి కడుపు ఎలా నింపుకోవాలి అని సగానికి సగం జనం పొట్ట పట్టుకుని చౌరస్తా లో శరీరాలే పని ముట్లు గా అద్దాలలో నిలబడి వుంటారు. ఐననూ మన గది భద్రంగా వుంటే చాలు. మన లాభాలు ఎడతెగక పారితే చాలు. మన పాచికలు విజయ విహారాలు చేస్తే చాలు.

ఇలాంటి వస్తు భావనలు మస్తుగా వున్న ఈకాలంలో – వంశీ, నీ ఆలోచనలు, నీ అనుభూతులు, ఒకింత విచిత్రంగా ఉండక మానవు. ఈ ఉత్తరాలు చదువుతున్నప్పుడు చాలా మందికి ఇవి ఏదో చిత్రమైన లిపిలో కనిపించి, కాసేపు ఉక్కిరి బిక్కిరి అవ్వక మానరు. చాలా కాలం క్రితం నా లోపల కవిత్వం అనే ఒక పురుగు మసిలి సతమతం చేస్తున్న తొలి రోజులలో బెజవాడలో మోహన రాం ప్రసాద్ అనే మిత్రుడు – వాక్యం అంటే డిస్టర్బ్ చెయ్యాలి. వాక్యం అంటే పునాది మట్టం గా రిస్త్రక్ట్ చెయ్యాలి అని రాసి చూపించాడు, ఒక చిత్తు కాగితమ్మీద . ఇది తన కవిత్వ మోటో అని ప్రకటించుకున్నాడు. నిజానికి అది గొప్ప కవిత్వ వాక్యం అని నేనేమి చెప్పను కాని … ఆ సమయంలో అది ఒక మానిఫెస్తోలాంటి వాక్యం లాగ అనిపించింది . ఇవ్వాళ వంశీ ఉత్తరాలు చదువుతున్నప్పుడు అలాంటి ఆవేశమే పట్టి కుదిపింది. ఈ ఉత్తరాలలోని చాలా వాక్యాలకు ఒక కవిత్వ వాక్యానికి ఉండవలసినంత పొగరు, విగరు,వగరు వున్నాయి.

వంశీ మంచి కవి/కథకుడు/విమర్శకుడు. అతని మనహ కార్మికశాల అనేక భావనల కొలిమి. నిజమైన ఊపిరితో , స్వచ్చమైన మనసుతో, ఊది ,ఊది నిప్పుకణికలని మన కాళ్ళ ముందు మెరిపించే వచన శిల్పి వంశీ. మనకు మంచి వచనం రాసే వాళ్ళు లేరు అన్నది వాస్తవం. చాల మంది వచనం పేరుతో మన కళ్ళ ముందు పేర్చేది తడి కట్టెలు. అవి చితి పెర్చుకోవడానికి కూడా పనికి రావు. వచనం పేరు తో వట్టి దగా ,పోనీ అది కవిత్వమూ కాదు . కవిత్వం పేరు తో ఆత్మ/పర వంచన. ఎక్కడో ఇంగ్లీష్ లో చదివిన వాక్యాలని తెలుగులో కక్కి మన మనసులను మురికి చేసే ప్రక్రియ. అలాంటి వచన వంచనలకు, కవిత్వ నేరాలకు, వంశీ మొదటినించీ దూరం. గత రెండు పదులుగా వంశీ రాస్తూ వస్తున్న కవిత్వ , కథా, విమర్శా రచనలలో ఇది కనిపిస్తున్న సత్యమే.ఇవ్వాళ నేను ప్రత్యేకించి చెప్పక్కరలేదు.

ఈ ఉత్తరాలలో వంశీ ఇంకాస్త బాగా అర్థమవుతాడు. ఇన్నాళ్లుగా అతని రచనల అంతరంగంలోని మాటని ఈ ఉత్తరాలు ఎలాంటి దాపరికము లేకుండా విప్పి చెపుతాయి. రెండు కారణాల వల్ల- ఒకటి, వంశీ తనలోకి తాను తొంగి చూసుకునే అంతరంగిక వేళ ఇది రాసాడు. తనలోకి తాను తొంగి చూసుకున్నపుడు తనని తానుగా అన్ని బలహీనతలతో , అసక్తులతో , సంశయాలతో, అందుకునే వ్యక్తి కోసం రాసాడు. చాల సందర్భాలలో ఈ ఉత్తరాలు చదువుతున్నప్పుడు నాకు బుచ్చి బాబు “అంతరంగ కధనం ” గుర్తుకువచ్చింది. వంశీ చాల సార్లు ఈ ఉత్తరాల మధ్య చలాన్ని ప్రస్తావిస్తాడు కాని, నిజానికి బుచ్చిబాబు లోని ఆ ప్రచండమైన అంతరంగ తీవ్రత వంశీ లో వుంది. చలం ఉప్పెన లాంటి వాడు. ఒక్క క్షణం ఆలోచించే వ్యవధి ఇవ్వడు. బుచ్చిబాబు సెలయేరు. వేగంలో, తీవ్రతలో ఆలోచించుకునే నిబ్బరం కాస్త వుంది. వంశీ లోనూ ఈ గుణం వుంది. వ్యక్తిగా, రచయితగా.

వంశీ, నేను ఇరుగు పొరుగు వూళ్ళలో పెరిగాము. ఇరుగు పొరుగు వీథులలో చదువుకున్నాము. ఒకే చోట కలిసి పని చేసాము. అన్నిటికి మించి చాల పుస్తకాలు కలిసి చదువుకున్నాము. చాలా ఆలోచనలు కలిసి చేసాము. అలా కలిసి పెరగడంలో కొన్ని సంతోషాలు, కొన్ని దుఖాలూ వున్నాయి. ఎవరి నించి ఏమి తీసుకున్నామో తెలీదు. అలా తీసుకుంటూ తీసుకుంటూ ఒక దశలో అహాలు పెరిగి ఒకళ్ళనొకళ్ళం క్షమించుకోవడము మానేస్తాము. చుట్టూ వున్న వ్యాపార సూత్రాలు అవతలి వ్యక్తి లోని గొప్పతనాన్ని ఒప్పుకోనివ్వవు. ఇంతా చేస్తే మనము వున్నది వస్తుగతమైన వ్యాపార లోకమే. మిత్రులు శత్రువులు అవుతారు. లేదా మిత్రత్వపు ముఖం కింద శత్రు పార్శ్వాన్ని దాచుకుని నటించడము మొదలు పెడతారు. అలాంటి వ్యాపార వస్తు వంచనత్వము వంశీకి పట్టు పడలేదు. అంతటా వ్యాపార వ్యామోహమే జీవన శాసనం అయినప్పుడు …. అప్పుడు ఏం చెయ్యాలి? ఎవరికైనా మనసు విప్పి ఒక వుత్తరం రాయాలి,. ఈ మెయిల్స్ సెల్ ఫోన్స్ పక్కన పడేసి, పోస్టాఫీసు కు వెళ్లి ఓకే నీలి కవరు కొనుకొచ్చి, ఎగ శ్వాస దిగ శ్వాస వినపడేట్టు కొన్ని అక్షరాలు సిరా లోంచి కాగితం మీదకి ఎలాంటి పూచికట్టు లేకుండా రాలాలి.

అలాంటి అనుభూతి కలగలేదు అనుకోండి- అప్పుడు- వంశీ ఉత్తరాలు చదవండి. వాటిల్లో మనసుని తేలిక చేసే ఇరానీ చాయి గమ్మత్తు వుంది. చదివాక ఎంత కాదన్నా కాస్త మనసు తడుస్తుంది. అప్పటికి మనసు రాలేదనుకోండి అప్పుడు ఈ నానా వస్తు వ్యాపార పట్టణ మహమ్మారిని వదిలించుకుని ఒక ఆకు పచ్చని దారి గుండా ఒక చిన్న వూరికి కాలి నడకన వెళ్ళండి. ఖమ్మం నుంచి మధిర కు పాసింజేర్ బండి లో ఎక్ల్కి పదిల్లపల్లి అనే చిన్న వూరి దగ్గర దిగండి. ఆ వూళ్ళో చెట్లకి, అ ఊర మధ్య నాటకాల ఆరుబయటకి ముప్పై ఏళ్ళ కింద సత్యం అనే పిల్ల గాడు తెలుసు. అతని తండ్రికి బడి పిల్లలు అన్నా, నాటకాలు అన్నా, ప్రాణం కాబట్టి ఆ పంతులుగారి అబ్బాయి అని చెప్పండి వివరం కోసం.

ఆ వూరికి నాటకాల కోసం నేను చింతకాని నుంచి నడుచుకుంటూ వెళ్ళిన చిన్న తనం లో ఆ పంతులుగారి అబ్బాయి ని మిస్ అయ్యాను. చాల కాలం తరువాత కలిసినప్పుడు మనం ఇద్దరం ఒక వూరి గాలి కలిసి పీల్చాము. ఒక వూరి నీళ్ళు కలిసి తాగాము. ఒక వూరి ఆరు బయలు లో కలిసే ఆ నాటకాలు చూసి ఉంటాము అన్నాను. అది అంటున్నప్పుడు కూడా వంశీ ఎవరో నాకు పెద్ద గా తెలీదు. ఈ ఉత్తరాలు చదివాక తెలిసినంతైనా . కాని , అది వూహ తెలీని లోకము. బహుశా మనకి ఇంకా వూహ తెలీదనే అనుకుంటాను. అప్పుడప్పుడు ఇలాంటి ఉత్తరాలు చదువుతున్నప్పుడు కొన్ని ఊహలు తెలుస్తాయి. ఆ పల్లెటూరి ఆకు పచ్చదారిలో అవి తెరుచుకుంటాయి. కాసేపు పసితనము లోకి వెళ్లి , ఊహల స్కేలు మీద వాటి తీవ్రతలని ఆనవాలు పడతాము.

అలనాటి ఉత్తరాలు ఊహల ఆనవాళ్ళని కానుక చేస్తున్న వంశీ కి
సరిహద్దుల అవలనుండి
ప్రేమ తో
అఫ్సర్.
**********************
పుస్తకం వివరాలు:
పుస్తకం పేరు : విదేహ -వంశీ కృష్ణ ప్రేమ లేఖలు (videha – vamsi krishna prema lekhalu)
ప్రచురణ : అక్టోబర్ 2009
వెల : రూ 60/-
ప్రతులకు : జూలూరు గౌరీ శంకర్, 1-8-702-33-20 A-పద్మ కాలని, నల్లకుంట, హైదరాబాద్. మరియు అన్ని పెద్ద పుస్తకాల షాపులలో.

You Might Also Like

3 Comments

  1. రాజిరెడ్డి

    @వీణ:
    ఈపాటికి మీరు ఇంకో సోర్సు ద్వారా సంపాదించే ఉంటారు. అయినా వంశీగారి నం. ఇస్తున్నాను.
    9491959062

  2. veena

    videha premalekhalu vraasina vamshi gaari adress mobile number ivvagalaraa..ee vyaasam baaga nacchindi.nenu lekha sahithyam meeda research chestunna scholar ni.please help me..

  3. బొల్లోజు బాబా

    ఈ పుస్తకం చదివాను.
    చలం ప్రేమలేఖలు ఒక లాండ్ మార్కై కూర్చోవటంతో వస్తుంది చిక్కు.
    అదే విషయాన్ని వినయంతో రచయిత ప్రకటించుకోవటం, అభినందించాల్సిన విషయం.

    అయినప్పటికీ, అప్పటికీ ఇప్పటికీ మారిన అనేక సామాజిక విషయాలను ఈ పుస్తకంలో అదే పాత ఫ్లేవర్ లో (చలం) ఆస్వాదించవచ్చు.

    భవదీయుడు
    బొల్లోజు బాబా

Leave a Reply