ఆవాహన

రాసినవారు : మాలాకుమార్
******************************
aavaahana

ప్రొఫెసర్ . ముదిగొండ శివప్రసాద్ గారు చారిత్రిక నవలా రచయతలలో సుప్రసిద్ధులు . కొన్ని వందల కథలు , వ్యాసాలు , 30 నవలలు వ్రాసారు . ” చారిత్రక నవలా చక్రవర్తి ” , “చారిత్రక నవలాసామ్రాట్ ” , ” అభినవ పాల్కుర్కి ” అనే బిరుదులు సంపాదించారు . వీరి నవల “ఆవాహన ” కోసం 8 సంవత్సరాలు వెతికి , చివరికి వారి దగ్గరనుంచే తీసుకున్నాను . ప్రస్తుతము   ఈ నవల చలనచిత్రము గా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయట . ” ఆవాహన ” నవల 1977 వ సంవత్సరము ,  ఆగస్ట్ , సెప్టంబర్ నెలలో , విజయబాపినీడుగారి , ” విజయ ” మాసపత్రికలో  అనుబంధ నవలగా ప్రచురించబడినది .

మాధవరావు బాంక్ ఉద్యోగి . బదిలీ అయ్యి భార్య లక్ష్మి, కూతురు ఇందిరలతో వరంగల్ కి వస్తాడు . అతని స్నేహితుడు రామచంద్ర రావు లెక్చరర్ గా వరంగల్ లో పని చేస్తుంటాడు . రామచంద్ర రావు భార్య కాత్యాయిని. ఇరు కుటుంబాల వారు చాలా స్నేహితముగా వుంటారు .ఓ సాయంకాలము మాధవరావు వేయిస్థంభాలగుడి కి వెళతాడు. గుడి లోని శిల్పాలను పరవశంగా చూస్తూ, నంది ఎదురుగా వున్న ఒక అసంపూర్ణ మంటపంలోకి వెళతాడు . అప్పటికే సూర్యాస్తమయం అవుతుంది. ఆలయమంతా తెల్లని వెలుగులతో నిండి వుంది. టూరిస్ట్ లంతా ఒకరొకరే వెళ్ళి పోతున్నారు. శిధిల మంటపములో ఎవ్వరూ లేరు , మాధవరావు తప్ప. అక్కడ ఒక నర్తకి బొమ్మ కనిపిస్తుంది.ఆ బొమ్మను చూస్తూ మాధవరావు అలాగే నిలబడి పోయాడు .

ఎందుకో ఆ బొమ్మను చూడగానే మాధవరావు శరీరం గగుర్పొడిచింది .
కళ్ళవెంట నీళ్ళు కారాయి .
ఏమి శిల్పమది ?
ఎంతటి రమణీయ సజీవ చిత్రణం ?

మాధవరావు ఆ బొమ్మ ముందు తానూ ఓ బొమ్మలా చలనం లేకుండా నిలబడిపోయాడు .అలా ఎంత సేపు నిలబడ్డాడో తెలీదు. ఇంతలో చంద్రోదయమైంది .వైశాఖపూర్ణిమ !! పుచ్చపువ్వులా చంద్రుడు వెలిగి పోతున్నాడు ఆకాశంలో . “ఏమిటి చూస్తున్నావు ?” ఎవరో మాధవరావును పలకరించారు .శిధిల మంటపం లో ఒకామె కూర్చొని వుంది .

ఆమె పైటచెంగు గాలికి రెపరెపలాడుతోంది .
చేతుల గాజులు మెరుస్తున్నాయి .
మెడలో బంగారు నగలు ..
ముఖం కోలగా వుంది .
సున్నితమైన పెదవులు , మృదువైన బుగ్గలు . చిన్ని నోరు , గాలికి రేగే ముంగురులు .

ఆమె ఎందుకో ఒక్కసారి ఆవేశంతో ఏడ్చింది . అలా ఏడుస్తూనే శిల్పాల చాటుకు వెళ్ళిపోయినట్లనిపించింది మాధవరావుకు. “ఏమండీ – ఏమండీ ” మాధవరావు కేకేసాడు. ఎవరూ బదులు పలకలేదు. గబ గబా మంటపమంతా వెతికాడు. ఎవరూ కనిపించలేదు. ఆ తర్వాత ఆమె మాధవరావుకు ఎన్నోసార్లు కనిపించి మాయమైంది. ఆమె ఎవరు? ప్రతి పౌర్ణమికి మాత్రమే ఎందుకు కనిపిస్తుంది?  అదీ మాధవరావుకు మాత్రమే !  అదికూడా  పదీహేను నిమిషాలు మాత్రమే వుంటుంది. ఎందుకు ? ఈ ప్రశ్నలకి సమాధానం నవలలో మాత్రమే తెలుస్తుంది .

” కళలను , రాజకీయాలతో ముడి పెట్టటము నాకిష్టము లేదు కామసాని ” . ఆంటాడు శిల్పచార్యుడు , భళ్ళాల సొమేశ్వరుడు .” ఇక్ష్వాకులు పోయారు ,విష్ణుకుండినులు పోయారు . . . . . నేడు కాకతీయులు , రేపు మరొకరు .ఇలా ఒక్కో సామ్రాజ్యానికి ఒక్కో రాజు , ఒక్కో రాణి , వారికి ఒక్కో కూతురు , ఆ కూతురు పెళ్ళికి మనం మంటపాలు చెక్కటం . ఆ రాణీ , ఆ పెళ్ళీ ఏమీ మిగలవు – మనము చెక్కిన మంటపాలు మాత్రం మిగులుతాయి చరిత్రలో . ” అంటాడు శిల్పి . ఎంత నిజమో కదా ! కళలకు , రాజకీయాలకు ముడిపెట్టకూడదన్న భళ్ళాల సోమేశ్వరుడు  దేశం కోసం  నాది భారతీయ దృష్టి , విశ్వజననీయ దృష్టి అని గూఢాచారిగా మారుతాడు . శిల్పసృష్టి యుగ యుగాలవరకు నిలచి ఉండాలి అన్న  రాకుమారి రుయ్యమ్మ ఉదాత్త  ఆశయము శిరసావహించి , ప్రేమను త్యాగము చేసి , చరిత్ర లో నిల్చి పోయిన ప్రేమ మూర్తి బళ్ళాల సోమేశ్వరుడు .ప్రేమకై తపించి , ప్రేముకునికై శతాబ్ధాల కాలం వేచి చూసిన అమర ప్రేమికురాలు కామసాని.  కామసాని కథ చదువుతుంటే కన్నుల్లో నీరు రాక మానదు.

ఇక కథా కాలానికి వస్తే రామచంద్రరావు చరిత్రలో అంతుచిక్కని ప్రశ్నలకు  మాధవరావు ద్వారా , కామసాని నుంచి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తు  మిత్రుని బాధ చూడలేక అనుభవించే సంఘర్షణ , కామసానిని విముక్తురాలిని చేసే ప్రయత్నము లో స్నేహధర్మం కనిపిస్తుంది .ఇలా ప్రతి ఒక్క పాత్రను తగినరీతి లో మలిచారు రచయత .కాకతీయుల కాలమునాటి , సామాజిక రాజకీయ పరిస్తితులను కళ్ళకు కట్టినట్లుగా వివరించారు .ఈ నవల లో రచయత కాకతీయ సామ్రాజ్యపు , వీరశైవ వైభవం , ఆనాటి సామాజిక స్తితిగతులు కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు . రాణిరుద్రమదేవి కాలమునాటి వైభవము చదువుతుంటే , ఆ కాలము లో పుట్టి వుంటే బాగుండేది అనిపిస్తుంది !

ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం నవలనే రాసేస్తానేమో ! చదవటము మొదలు పెట్టాక సమయమే తెలీలేదు . పూర్తి చేసాక కాని తెలీలేదు , నేను కాకతీయ సామ్రాజ్యములో లేను , హైదరాబాద్లో మా ఇంట్లో వున్నాను అని . అంతగా లీనమైపోయాను !

ప్రతులకు రచయితని సంప్రదించండి .ఫోన్ నంబర్ : 27425668 .

You Might Also Like

7 Comments

  1. ఎన్ వి యస్ భగీరథి

    శ్రీయుతులు డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారు రచించిన ఆవాహన నవలను నేను సంవత్సరానికి ఒకసారైనా చదువుతాను. 1977 నుండి చదువుతూనే ఉన్నాను. 1977 ఆగస్టు లో ప్రచురితమైన విజయ అనుబందం ప్రతి ఇప్పటికి నా దగ్గర ఉంది. నేను ఏ రచయిత నైనా మర్చిపోతానేమో కానీ ప్రసాద్ గారు రచించిన ఆవాహన, రోషనార, షాజహాన్ నవల ద్వారా వారిని ఎన్నటికీ మరువలేను. రోషనార, షాజహాన్ నవల లను కూడా చాలా సార్లే చదివా… నేనెంతటి వాడిని ప్రసాద్ గారి రచనలని సర్టిఫై చేయడానికి.. సాధారణ పాఠకుడిని మాత్రమే…

  2. bhanuprakash

    Actual gaa nenu ee book ni chaalaa jeerna dasalo undi pusthakam maa oori laer gaari daggar teesukunnaanu, chaalaa chaalaa baagundi full excitement untundi navala moththam, aarojulloney idi vachhinaa ippudu cenemaa gaa vsthey Andaroo deenini chandramukhi tho polusthaaru, kaani “chnadramukhi” cenemaki leni Adbhuthamyna charitra ee AAvahana book ki udi, naakenduko chnadramukhi writer gaani ee book chadivaadaa anipisthundi, but very very nice book manam okkasari kaakateeyula kaalaaniki vellipothaam

  3. venkatesh

    i read this novel in 1983-84.Where can i get a copy of this novel .2 books i think.how to get the novels. Pl suggest.

  4. phani

    eppudo vijaya monthlylo chadivaanu kaani antagaa gurtu ledu naakaite kaani ippudu meeru raasindi chadivaaka aayanagaari books chadavaalani pistondi tappaka chaduvutaanu.

  5. Srilalita

    ఇదివరకు విజయ మాసపత్రికలో ముదిగొండ శివప్రసాద్ గారి చారిత్రక నవలలు చదివే అలవాటు ఉండేది. ఈ ఆవాహన నవల మీరు చెప్పాక మరోసారి చదవాలనిపిస్తోంది. బాగా వివరించారు.

  6. jaya

    ఈ నవల చాలా బాగుంది. మామూలుగా చదివి అర్ధం చేసుకోటానికే చాలా కాలం పట్టింది. చాలా కొత్త కొత్త పేర్లు కూడా ఇందులో రచయిత తెలియచేసారు. ముఖ్యంగా అనేక రకాల పూల పేర్లు చెప్పినప్పుడు మనకు ఒక్కటి కూడా తెలియదే అనిపిస్తుంది. కథా గమనం వివరణ చాలా బాగుంది.ఈ వివరణ చదివి నవల చదివితే కథ సులభంగా అర్ధమయ్యేటట్లు ఉంది.

  7. సౌమ్య

    Interesting. శివప్రసాద్ గారు అన్నమాచార్యుల గురించి రాసిన – శ్రీపదార్చన, సింబాలజీ మీద రాసిన వ్యాసాలు తప్ప వేరింకేమీ తెలీని నాకు – ఆయన ఫిక్షన్ కూడా రాస్తారని ఇప్పుడే తెలిసింది. ధన్యవాదాలు 🙂
    ఈ పుస్తకం ఇప్పుడు ముద్రణలో ఉందా?

Leave a Reply