పోతీ.కాం, ఇతర బెంగలూరు బుక్ ఫెస్ట్ సంగతులు

బెంగళూరు పుస్తకాల పండుగ – 2009 లో నాకు అన్నింటికన్నా నచ్చిన విషయం ఒకే ఒకటి – ఆన్లైన్ స్టోర్లు కొన్నింటికి ఆఫ్లైన్ స్టాల్స్ చూడటం. దీనివల్ల అవి విజిబిలిటీని పెంచుకోవడం. అలా నాకు కనబడ్డ స్టాల్స్ గురించి, వీటిలో పోతీ.కామ్ వారితో కాసేపు మాట్లాడుకున్న మాటల గురించీ ఈటపా. (బెంగళూరు నుంచి, నా స్నేహితుడు సంతోష్ తో కలిసి – నేను) 🙂

ఇలా తిరుగుతూ ఉండగా మొదట నా దృష్టినాకర్షించింది – పోతి.కాం వారి స్టాల్. ఏప్రిల్ 2008 లో మొదటిసారి పోతి సైటు గురించి తెలిసింది. చావాకిరణ్ గారి పుస్తకాల ప్రచురణ గురించి విన్నప్పుడు మళ్ళీ విన్నప్పుడు కాస్త ఆసక్తి కలిగింది – వీరు చేస్తున్న పనిపై. బె.బుక్.ఫెస్ట్ లో స్టాల్ చూసేసరికి, ఆసక్తి పెరిగి, వెళ్ళి కాసేపు ముచ్చటించాము. అక్కడ స్టాల్ లో పోతీ స్థాపించిన జయా ఝా గారే ఉండటంతో, వివరాలు అడగడం సులువైంది.

మేము: అదిగో, ఆ పుస్తకం (చావాకిరణ్ ’తొలిరేయి’ ని చూపిస్తూ) రాసినాయన ద్వారా మాకు మీసైట్ గురించి కుతూహలం కలిగింది. కాసేపు మీతో మాట్లాడవచ్చా?
జయ: యా, ష్యూర్.
-అన్నాక మొదలైంది అసలు కథ. ఆ తర్వాత ఓ చిన్న ఈమెయిల్ సంభాషణ. వీటి సారాంశం – చదవండి.

పోతి – అంటే పుస్తకం అని అర్థమట. హిందీ, పంజాబీ వంటి భాషల్లో ఆ అర్థం ఉన్నా, ఇప్పుడు ఈ పదం వాడ్డం పాతబడిపోయిందని జయ చెప్పుకొచ్చారు. కొంతకాలం క్రితం – జయ తన స్వంత కవితలను పుస్తకంగా అచ్చువేయాలనుకున్నప్పుడు – పబ్లిషర్లను వెదకడం, ప్రింటింగ్ కి పంపడం, వాటిని అమ్మడం – ఇవన్నీ కాకుండా, సులభంగా పని కావాలి, మనకూ, మన స్నేహితుల మధ్య పంచుకోడానికన్నా కొంత సులభతరమైన మార్గం కావాలి అనుకున్నారట. అప్పటికి భారతదేశంలో ఇలాంటి వ్యవస్థ ఏదీ లేకపోవడంతో, పోతీని ప్రారంభించానని అన్నారు. ఆ స్టాల్ లో ఉన్న పుస్తకాల సంఖ్యను బట్టి, ఇది మొదలుపెట్టి ఓ నాలుగైదేళ్ళైందేమో, వెలుగులోకి రావడానికి ఇంత టైం పట్టిందేమో, అనుకున్నాను. పోతీ ఇంకా ఒకటిన్నర సంవత్సరాల పసిగుడ్డేనట! దాదాపు రెండొందల పైనే పుస్తకాలు వెలువడ్డాయట ఇప్పటికే! నా మటుకు నాకైతే, ఇది చాలా మంచి ప్రోగ్రెస్ అనిపించింది.

కొత్త రచయితలేనా? ఇదివరకే స్థిరపడ్డ వారు కూడా రాస్తారా? అని అడిగితే, కొత్త రచయితలే రాస్తున్నారు అన్నారు. అక్కడ స్టాల్ లో పుస్తకాలు కవర్ పేజీ డిజైన్లు అవీ చాలా బాగున్నాయి. అసలు మన పుస్తకాలు ప్రచురించుకోడానికి పద్ధతేమిటని అడిగితే, సైటు ద్వారా, వీళ్ళు అడిగిన ఫార్మాటులో పుస్తకాన్ని ఇస్తే, వీరు ప్రింటింగ్ సంగతి చూస్తారన్నారు. ఇక కవర్ పేజీల సంగతి : రచయితలే నిర్ణయించుకోవచ్చు, లేదా పోతీ సహాయం తీసుకోవచ్చు. ధర నిర్ణయం : ఇది కూడా రచయితలు-పోతీ కలిసి చేస్తారు తుది నిర్ణయాన్ని. ప్రస్తుత పుస్తక ప్రదర్శనలో పెట్టడానికి పుస్తకాలు ఎలా ఎంపిక చేశారని అడిగితే, రచయితలని సంప్రదించామని, ఎవరు ఒప్పుకున్నారో వాళ్ళ పుస్తకాలు పెట్టామని చెప్పారు.

సేల్స్ గురించి అడిగితే, పర్లేదు అన్నారు. ఇలా మాట్లాడుతూ ఉండగా, వీళ్ళ స్టాల్ లో – “scholars without borders” వారి పోస్టర్ కనిపించింది. వీరికీ, వారికీ సంబంధం ఏమిటా? అని అడిగితే, వారి అవుటాఫ్ ప్రింట్ ఉన్న పుస్తకాలకి వీరు స్థానం కల్పిస్తున్నారని అర్థమైంది. అంటే, వీరి స్టాల్ లో ఆ పుస్తకాలు కూడా పెడితే, ఎవరన్నా అది కొనాలనుకుంటే, పునర్ముద్రించి ఇచ్చేట్లన్నమాట.

ఈసారి ప్రయోగాత్మకంగా బెంగళూరు బుక్ ఫెస్ట్ లో స్టాల్ పెట్టామని, హైదరాబాద్ సంగతి చెప్పలేమనీ అన్నారు – హైదరాబాదు లో కూడా పెడతారా స్టాల్? అని అడిగితే.

pothi.com వెబ్సైటులో వీరి పనితీరు గురించి మరింత సమాచారం పొందవచ్చు. ఇదివరలో పోతి గురించి పుస్తకం లో వరూధిని గారు కూడా పరిచయం చేశారు. (లంకె ఇక్కడ)

ఆ తరువాత అలా తిరుగుతూ ఉంటే, లైబ్రరీవాలా వారి స్టాల్ కనబడ్డది. పూనా, ముంబై, బెంగళూర్లలో ఉన్న సర్కులేటింగ్ లైబ్రరీ చైన్ ఇది. వీరితో ఏమీ మాట్లాడలేదు కానీ, వాళ్ళు అందరికీ వాళ్ళ సైటు గురించి చెబుతున్నప్పుడు విన్నాను. బెంగళూరులో ఉన్న మరో ఆన్లైన్ సర్కులేటింగ్ లైబ్రరీ – ఈజీలిబ్.కాం తో పోలిస్తే, ఇది కాస్ట్ ఎపెక్టివ్ అనిపించింది, వీరి పద్ధతులు చూస్తే. నెలకి 139రూ అద్దెకి, మూడు పుస్తకాలు తీసుకోవచ్చట. సుమారు తొమ్మిదివేల టైటిల్స్ ఉన్నాయి – వాళ్ళ దగ్గర లేని పుస్తకాలు కావాలంటే తెప్పిస్తామని కూడా అన్నారు.

తరువాత ఫ్లిప్‍కార్ట్ వారిది. ఇక్కడ ఓ ప్రోమోకోడ్ ఇస్తున్నారు – దాన్ని ఉపయోగిస్తే, మనం పుస్తకాలు బుక్ చేస్కున్నప్పుడు (booking books ;)) ఇరవై శాతం డిస్కౌంట్ అట. ఈ ఆఫర్ డిసెంబర్ దాకా మాత్రమే!

బెంగళూర్లో మాలతిగారి పుస్తకం రిలీజ్ ఐన ప్రదేశం – బుక్స్ ఫర్ చేంజ్. వారి స్టాల్ కూడా ఉండింది. వీరిలాగే, ప్రథం బుక్స్ వారిది – ఇవి రెండూ అంతర్జాలంలో చక్కని వెబ్సైట్లతో ఉంటాయి. వీటి రెండింటి స్టాల్స్ ఇక్కడ చూడగానే, “హే! నాకు తెల్సు నాకు తెల్సు” టైప్ ఫీలింగ్ కలిగింది 🙂

ఇవి కాక – కన్నడ స్టాల్స్ చాలా ఉన్నాయి. ఒక స్టాల్ కి వెళ్ళాము – భావనా ప్రకాశన దాని పేరు. దాని ముందు నుంచి వెళ్తూ ఉంటే చలం బొమ్మ కనిపించింది – అదొక్కటే కారణం అటు పోడానికి. సరే, వెళ్ళి టైటిల్స్ చూస్తూ ఉన్నాము (ఎలాగో తెలుగు-కన్నడ రాత కాస్త ఒకేలా ఉంటుంది కదా అని). ఆ స్టాల్లో ఉన్న సగం పుస్తకాలకి రచయిత ఒకరే!! Ravi Belagere. ఈయనెవరో? అనుకుని, అసలు ఈ పబ్లికేషన్స్ ఈయనదే ఏమో అని అనుమానమొచ్చి, స్టాల్ వాళ్ళతో మాట్లాడదామని ఫిక్సై పలకరిస్తే ఏముందీ! అతనికి ఇంగ్లీషు రాదట! ఓ నిట్టూర్పు విడిచి పక్కకొచ్చేసి, తర్వాత వికీ పేజి చూసాక మేము ఊహించినట్లే, ఈ ప్రచురణ సంస్థ ఆయనదే అని తేలింది. 🙂 ఇక్కడ రవి బెళగెరె ప్రముఖ రచయిత, జర్నలిస్టు అట.

కన్నడ స్టాల్స్ అన్ని ఉన్నా కూడా వాటి గురించి ఏమీ తెల్సుకోలేకపోయాము అనిపించింది. మళ్ళీ వెళ్ళగలిగితే చూస్తాను.

వారణాసికి చెందిన 116 సంవత్సరాల వయసున్న ఓ ప్రచురణ సంస్థ తో చిన్న బాత్చీత్ గురించి నెక్స్ట్ పోస్ట్ లో.

You Might Also Like

6 Comments

  1. విజయవర్ధన్

    సౌమ్య గారు, మర్చిపోయాను. Strand Book Festival జరిగేది బెంగుళూరులో.

  2. విజయవర్ధన్

    Flipkart Promo Code: BBF09 (Valid till 30 Dec 09). ఈ code ఎవరైనా వాడుకోవచ్చు. Flipkart వారు code లేకుండానే కొంత రాయితీ ఇస్తున్నారు. ఒకవేళ ఆ రాయితీ 20% మించి వుంటే ఈ code వల్ల అదనంగా ఏ రాయితీ వుండదు. ఒకవేళ ఆ రాయితీ 11% (ఉదాహరణకు) వుంటే, ఈ code వల్ల 9% రాయితీ అదనంగా లభిస్తుంది.

  3. విజయవర్ధన్

    26 నవంబర్ (గురు) నుంచి 13 డిసెంబర్ (ఆది) 2009 వరకు Strand Book Festival జరుగుతుంది. బసవ భవన్ (చాళుక్య హోటల్ & సోఫియా స్కూల్ ఎదురుగా) లో ప్రతిరోజు 10am నుంచి 8.30pm వరకు. పుస్తకలపైన 80% వరకు రాయితీ! ఇది తప్పక హాజరు కావలసిన పుస్తక ప్రదర్శన.

    1. సౌమ్య

      విజయవర్ధన్ గారికి : మంచి సమాచారం అందించారు. ధన్యవాదాలు.

  4. విజయవర్ధన్

    >> “తరువాత ఫ్లిప్‍కార్ట్ వారిది. ఇక్కడ ఓ ప్రోమోకోడ్ ఇస్తున్నారు – దాన్ని ఉపయోగిస్తే, మనం పుస్తకాలు బుక్ చేస్కున్నప్పుడు (booking books 😉 ) ఇరవై శాతం డిస్కౌంట్ అట”
    ఆ code ఏమిటండి? 🙂 “booking books” try చేసాను. పని చేయలేదు.

    1. సౌమ్య

      విజయవర్ధన్ గారికి:
      ఫ్లిప్కర్ట్ వాళ్ళ బుక్మార్క్స్ తీస్కుంటే..దానిపై ఈ ప్రోమోకోడ్ ఉంటుంది. ఈ కోడ్ ఉపయోగించి ఇరవై శాతం డిస్కౌంట్ తో ఓ పుస్తకం ఇవాలే తెచ్చుకున్నాను నేను.

Leave a Reply