నవ్వుల చిచ్చుబుడ్డి

నవ్వుల చిచ్చుబుడ్డి : జి.ఆర్.మహర్షి “ఆంధ్రా నెపోలియన్” బుక్ రివ్యూ
రాసిన వారు: ఎమ్బీయస్ ప్రసాద్

*****************************************
వయసు వస్తున్నకొద్దీ నవ్వడం తగ్గిపోతుంది. ఏ జోక్ చూసినా ఇది ఇంతకుముందు చదివేవుంటామన్న మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నవ్వాలంటే మనసు చివుక్కుమంటుంది. కానీ, ఈ పుస్తకం చదువుతున్నంత సేపు నవ్వు ఉబుకుతూనే ఉంది. పేరు చూసి, ప్రతి పేజీలో వేసిన లోగో చూసి, ఎవడో తెలుగువాడు నెపోలియన్ అని పేరు పెట్టుకుని దండయాత్రకు బయలుదేరతాడనీ, ’భూలోకానికి వచ్చిన యముడి’ లాటి జోకులు చుట్టుముడతాయనీ అపోహ కలిగినా, దీనిలో అలాటి ఉపద్రవం ఏదీ సంభవించలేదు.

napoleon-mbsఒక వూళ్ళో పనీపాటా లేని జంతువులనీ, మందిమాగధులనీ మేపే రంగారావు రాజాగారు తనకీ, నెపోలియన్ కీ చుట్టరికం ఉందని నమ్ముతారు. ఓ తాగుబోతు తను పూర్వజన్మలో నెపోలియన్ అని నమ్ముతాడు. అంతే! వీరిద్దరి చుట్టూ పరిభ్రమించే కథను అడ్డం పెట్టుకుని, మంత్రగాళ్ళకు వాతలు వేసి, విశ్వవిద్యాలయ పరిశోధకులకు కలంపోట్లు పొడిచారు మహర్షి. రాజాగారి వద్ద “డోలు కట్టేవాడి డొక్క ఎన్నటికీ ఎండదని నమ్మే” వీర్రాజు, సినీవిలన్ పక్కనుండే హితైషి టైపులో ’ఉన్న విషయాలు ఉన్నట్టు’ మాట్లాడే పోలయ్యా, ’పరిగెట్టి పాలు తాగడం ఇష్టంలేక నిలబడి గుగ్గిళ్ళు తినే’ గుర్రమూ, ’ఎముకని ప్రేమించే కుక్క ఎన్నటికీ చెడిపోదని’ నమ్మే కుక్కా, టీవీ సీరియల్స్ చూసి చూసి చివరికి తీసిపారేద్దామని ఉబలాటపడే భార్యామణీ ఉన్నారు.

తాతల కాలం నుంచి దొరకని నిధి కోసం ఆయన వెదుకుతున్నాడు. తవ్వకాల్లో ఓ పెట్టె దొరికింది కానీ భూతవైద్యుడిచే శాంతి చేయనిదే నిధి ముట్టుకోరాదంటూ వీర్రాజు సాంబడిని తీసుకొచ్చాడు. పదహారువందలు తగలేసి పూజచేసి పెట్టె తెరిస్తే కనబడినది ఓ తాళగ్రంథం. ’నిధి బిల్డప్ అంతా తాటాకు చప్పూడేనా’ అని రాజాగారు ఉసూరుమంటూంటే సాంబడు ఆ తాళగ్రంథం చదివినట్లు నటించాడు. అందులో ’నెపోలియన్’ అన్న మాట చూసి కథ అల్లాడు. దాని ప్రకారం నెపోలియన్ వీళ్ళ వంశస్థుడే. వాళ్ళ నాన్న ఇక్కణ్ణుంచి తరలివెళ్ళాడు. ఇక అక్కణ్ణుంచి ఫొటోగ్రాఫర్, పాత్రికేయులు, ప్రేమికులైన రిసెర్చి స్టూడెంట్లు, వారి గైడు, గైడును గైడ్ చేసే వారి భార్య, ఈ టీముని వెంటేసుకుని ప్రయాణం కట్టిన సాంస్కృతిక శాఖా మంత్రీ, వారి ఇద్దరు పియ్యేలు బిలబిలా కథలోకి వచ్చిపడ్డారు.

దీనితోబాటు ఉపకథగా నడచినది మందబలం ఉన్న జగ్గూదాదాను మందుబలంమీద బుర్ర బద్దలు కొట్టిన మామాజీది. నెపోలియన్ బ్రాందీ తాగి, తాగి, తనే పూర్వజన్మలో నెపోలియన్ ను అని నమ్మిన మామాజీని చూపించి డబ్బు చేసుకుందామని సారాకొట్టు యజమాని కిడ్నాప్ చేయించి ప్రెస్ వాళ్ళతో బేరాలు కుదుర్చుకున్నాడు. నెపోలియన్ గతజన్మనే కాదు, పునర్జన్మ గురించి కూడా బిజినెస్ చేసి పెడతామని హామీ ఇచ్చారు ప్రెస్ వాళ్ళు. దేన్నయినా ’అర్థ’వంతం చేసుకోగల చేపమీదనే లోకం నడిచిపోతోందని నిరూపిస్తూ ’అర్థాంతరంగా’ వదిలిపెట్టారు రచయిత.

కాన్వాస్ చూసినా, ప్రవేశపెట్టిన పాత్రలను చూసినా ఎంతో విస్తృతి గల కథాంశాన్ని చిన్న చిచ్చుబుడ్డిలో కూరేశారు మహర్షి. వరస జోకులు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటే దట్టింపు సరిగా లేని చిచ్చుబుడ్డి ఫెళఫెళార్భాటాలతో ఎప్పుడు పేలిపోతుందోనని బెంగ పెట్టుకున్నట్టయింది. కథను విస్తరించి, మామాజీ కథను ప్రధానకథ తో మెలికవేసి, జోకుల మధ్య కాస్త ఎడం ఇచ్చి నడిపివుంటే ఎంతో బాగుండేది. ఆయన ఇవ్వలేదు కాబట్టి మీరే మధ్యమధ్యలో పుస్తకాన్ని కిందపెట్టి మనసారా నవ్వుకుని, మళ్ళీ పుస్తకం చేతబడితే హాయి. మహర్షి సంభాషణా చాతుర్యానికి, చమత్కారానికి, సున్నితమైన హాస్యానికి కొన్ని ఉదాహరణలు –

సంభాషణా చాతుర్యం –

’నిధంటే మాటలు కాదు’ – ’తెలుసు, మూటలు’

’అమ్మమ్మ పోయింది సెలవంటూ ఇప్పటికే రెండుసార్లు అడిగావ్. ఆవిడకెన్ని ప్రాణాలు?’ – ’ఆవిడకి నామీద పంచప్రాణాలండి’

’మీరాజావారు డబ్బు మంచినీళ్ళలా ఖర్చు పెడతారన్నావు. చూస్తే ఇంత పీనాసా’ – ’మా ఏరియాలో నీళ్ళ కరువు కదా’

సున్నితమైన హాస్యం –

ప్రొఫెసర్ తన భార్యను స్టూడెంట్లకు పరిచయం చేస్తూ – ’మీకూ, నాకూ ఈమే ప్రొఫెసర్, గైడ్, ఫిలాసఫర్ (ప్రెండ్ అనడు), మార్గదర్శి…’

’మీరు ఏకపత్నీవ్రతులా?’ – ’ఒక్కరే వందమందితో సమానం’

’ఈ ఇంటికి కోడలిగా వచ్చినరోజే గదుల్లో సాలెగూళ్ళు చూశాను. ఈ దివాణానికేదో బూజుపట్టిన చరిత్ర ఉందని గ్రహించాను.’

’పులిలా గర్జించిన జగ్గూదాదాను చూసి ’ఇది వెటర్నరీ కేసు’ అనుకున్నారు నర్సులు’

’బర్డ్ ఫ్లూ వల్ల కోళ్ళకు భూమ్మీద నూకలు మిగిలాయి’

’రాజాగారు మితభాషి. దీనికి కొంతవరకూ రాణీగారు కూడా కారణం.’

’తాగుడూ వాగుడూ కవలపిల్లలు’

’ఇతనెంత గొప్ప మాంత్రికుడంటే వాడి పళ్ళు పీకడానికి శత్రువులు పటకారలతో తిరుగుతున్నారు’ – ’అనవసరంగా ఐడియాలు చెప్పకు. ఒక్క ఐడియా నా పలువరుసనే మార్చేస్తుంది.’

చమత్కారం

’మంత్రిగారూ, మీకు జీర్ణశక్తి ఎక్కువ, ప్రజలకి జ్ఞాపకశక్తి తక్కువ’
’జీవితం, సినిమా వొకటే. రెండూ డ్రైగానే ఉన్నాయ్’
’నెపోలియన్ బ్యాటిల్ లో పోరాడాడు, నేను బాటిల్ తో…’
’నిధులు కాపలాకాసేవి నాలుగైదు తలల సర్పాలు. ఒక తలతొ పగబట్టి ఇంకో తలతో కాటేస్తాయి.’
’దాదాకు బుర్ర తిరుగుడు. దానికి కర్రే విరుగుడు.’
’గాలిని బట్టి బాకా, మనిషిని బట్టి కాకా.’
’వాడు అక్వేరియంలో చేపలు పట్టే రకమైతే, వీడు నడిచే గాలం.’
’పిశాచాలకు తలుండదు కాబట్టి, వాటి భాషలో అక్షరాలకు తలకట్టుండదు.’
’కుండబద్దలు కొట్టేలా మాట్లాడి బుర్ర బద్దలు కొట్టడంతో వాదాన్ని ముగించే సంప్రదాయం నాది.’

విసుర్లు

’అజ్ఞానానికి మించిన రక్షరేకు లేదు’
’రాజకీయమన్నాక వెన్నుపోటు, పెన్నుపోటు భరించాల్సిందే’
’ప్రజల్లో కల్చర్ పోయాక కల్చరల్ శాఖమంత్రి చేస్తే లాభమేముందయ్యా? అందరికీ కోట్లు దక్కితే నాకు కోలాటం మిగిలింది’
’తెలుగువాడు తెలుగువాళ్ళ మధ్య ఎదిగితే ఆశ్చర్యం కానీ, ఫ్రాన్సులో పైకొస్తే ఆశ్చర్యమెందుకు?’
’అందరికీ తెలిసిన విషయం మీద రిసర్చి చేస్తేనే రీడబిలిటీ’
’రాష్ట్రంలో ఏమి జరిగినా ఆఖరున తెలిసేది ప్రభుత్వానికే కదా’
’మా పరిశోధకులం ఏ చరిత్రనీ కాలగర్భంలో కలిసిపోనివ్వం. రిసెర్చ్ చేసి అటకెక్కించేస్తాం.’
’తెనాలిని ఆంధ్రా పారిస్ అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది మనకీ నెపోలియన్ కీ ఏదో లింకుందని.’
’బోనాల పండుగకి పార్టీలు ఇవ్వడం చేతనే నెపోలియన్ కుటుంబానికి బోనపార్టీ అని ఇంటిపేరు వచ్చింది.’
’నీళ్ళు లేని ఆంధ్రా నుండి వెళ్ళడం చేతనే నీటిభయం కలిగి నెపోలియన్ వాటర్లూ లో ఓడిపోయాడు.’

***************************************
పుస్తకం వివరాలు:
పుటలు – 140
ప్రచురణ – 2006

You Might Also Like

4 Comments

  1. kvrn

    ఈ పుస్తకం పరిచయం చాల బాగుంది. మహర్షి గారి రచన అదుర్స్

  2. సురేష్

    ఇలాంటి పుస్తకాలు కూడా వస్తున్నాయి అని తెలియదు. పరిచయము చేసినందుకు ధన్యవాదములు.

  3. b.ajay prasad

    సౌమ్యగారూ..

    మీరు ఏమాత్రం అనుమానం లేకుండా ఈపుస్తకాన్ని చదవొచ్చు. ఇలా రాసేవాళ్ళు ఇప్పుడు తెలుగులో ఎవరూ లేరు.

  4. సౌమ్య

    ’పిశాచాలకు తలుండదు కాబట్టి, వాటి భాషలో అక్షరాలకు తలకట్టుండదు.’
    ’కుండబద్దలు కొట్టేలా మాట్లాడి బుర్ర బద్దలు కొట్టడంతో వాదాన్ని ముగించే సంప్రదాయం నాది.’
    – :)) డైలాగులు బాగున్నాయి… కానీ, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే, పుస్తకం చదివితే ఎలా ఉంటుందో అని అనుమానంగా ఉంది 😉

Leave a Reply